గయా మాహాత్మ్యము - 2

నారద మహర్షి:

“గయాసురుని ఆక్రమించిన శిల ఎట్లు పుట్టినది. దాని రూపమేమి? మాహాత్మ్యమేమి? దాని పేరేమి?” అని అడిగెను. ఆ ప్రశ్నను వినిన సనత్కుమారుడు వారితో ఇట్లు అనెను: సర్వవిజ్ఞాన పారగుడు, మహాతేజస్వియు అయిన ధర్ముడు అనువాడు ఉండెను. అతని భార్య విశ్వరూప ఆమె భర్తృవ్రత పరాయణురాలు. ఆమె యందు ధర్మునకు ధర్మవ్రతఅను సతి (పతివ్రత) కన్య జనించెను. ఆమె సర్వలక్షణ సంపన్న. లక్ష్మివలె గుణాధికురాలు. మూడు జగములలో ఉండు సద్గుణములన్నియు ఆమె యందు ఉండెను. ధర్ముడు ధర్మవ్రతకు తగిన వరునకై ముల్లోకములలో వెదకినను అనురూపుడైన వరుడు లభింపలేదు. అంత, ధర్ముడు వరసిద్ధికై నీవు తపము చేయుమని పుత్రికకు చెప్పెను. ఆమె ఉన్నది ఉన్నట్లే తపమునకై వనమునకు ఏగెను. లక్షయుగములకు పూర్వము శ్వేతకల్పమున ఆమె వాయుభక్షణము మాత్రముచేసి అందరికి సాధ్యముగాని తపము చేసెను. బ్రహ్మకు మానస పుత్రుడు మరీచిఅని ప్రసిద్ధి చెందినవాడు కలడు. ఆతడు భూమి అంతయు తిరుగుచు ఈ కన్యారత్నమును చూచెను. రూప, యౌవన సంపన్నయై పరమ తపమున ఉన్న ఆమెను మరీచి - నీవు ఎవ్వతెవు? ఎవ్వరిదానవు? నీ వృత్తాంతము చెప్పుమని అడిగెను. ఓ సువ్రతురాలా! భయశీలురాలా! ఈ రూపముతో నన్ను మోహింప చేయుచున్నావు. నేను బ్రహ్మయొక్క తేజోరూపుడను (పుత్రుడను), వేదముల అంతమును తెలిసినవాడను మరీచి అని ప్రసిద్ధి చెందినవాడను అని మరీచి అనగా విని, ఆ కన్య మునితో - నేను ధర్మవ్రత అను ధర్మపుత్రిని, తపోన్వితను. బ్రాహ్మణ శ్రేష్ఠా! పతివ్రత అగుటకు పరమ తపస్సును చేయుచున్నాను. అనగా మరీచి ఆ ధర్మవ్రతతో ప్రేమ పూర్వకముగా ఇట్లనెను. ఓ శుభవ్రతురాలా! నాకు నీకు పతివ్రతగా కనబడుటచే నీవు నాదానవు అనిపించుచున్నది. నేను పతివ్రతను పొందు కోరికతోనే, రాత్రింబవళ్లు భూమిలో తిరుగుచున్నాను. నీవు పతివ్రతవు అయినచో నిన్ను నేను పొందెదను. నన్ను నీవు వరునిగా పొందుము. లోకమున నీవంటి కన్యలేదు. నాతో సమానము అయిన వరుడు నీకును లేడు. కావున ఓ ధర్మవ్రతా! ఇప్పుడే నీవు నాకు ధర్మపత్నివి కమ్ము అనగనే ఆ కన్య ధర్మవ్రతమునిని తన తండ్రియైన ధర్ముని అడుగుము అనెను. మరీచిముని ధర్ముని కడకు పోయెను. ధర్ముడు అతనినిచూచెను. తేజస్సుల గుంపువలె ఉన్న ఆ వరునకు నమస్కరించి ఆసన - అర్ఘ్యాదులతో పూజించెను. ఎందులకు వచ్చితివని అడుగగా మరీచి ధర్మునితో కన్యకకై భూమియందు తిరుగుచు శ్రేష్ఠురాలైన ఈ కన్యను చూచితిని. ఆ కన్యను నాకిమ్ము. నీకు శ్రేయము కలుగగలదు అని అనెను. ఆ మాటలను వినిన ధర్ముడు అతనిని అర్ఘ్యాదులచే పూజించి - అట్లే అనెను. ధర్మవ్రతను తీసికొని వచ్చి ఆమెను మరీచికిచ్చెను. ఆతనికి వరమునుకూడ ఇచ్చెను. ధర్ముని మాట ఈ విధముగా ఆచరింపబడినది. అగ్నిహోత్రముతోపాటు ఆ ధర్మవ్రతను మరీచి తన ఆశ్రమమునకు తీసికొని పోయెను. ఆచట ముని ఆమెతో విష్ణువు లక్ష్మితోవలె, శివుడు పార్వతితోవలె, బ్రహ్మ సరస్వతితోవలె క్రీడించెను. ఆమెయందు మరీచికి విష్ణువుతో సమానులైన నూరుగురు పుత్రులు కలిగిరి. ఒకనాడు మరీచి ఫలపుష్పములకై వనమునకు వెళ్లి వచ్చెను. అలసిన ఆతడు భుజించి ఆ పతివ్రతయైన తన భార్యను పడకపైనున్న తనకు కాళ్లనొత్తు మనెను. ధర్మవ్రత అట్లేయని, పడకపైనున్న మునిపాదములకు శ్రద్ధతో నేయి రాచి సంవాహనము చేసెను (రుద్దెను). అపుడు ముని నిద్రబోవుచుండగా ఆ ప్రదేశమునకు బ్రహ్మ వచ్చెను. ధర్మవ్రత బ్రహ్మనుచూచి ఆ ప్రభువును అర్చింపవలెనని మనమున తలచెను. ఈతడు జగద్గురువు పూజ్యుడు. భర్తకు పాదసంవాహనము చేయుదునా? లేక బ్రహ్మను పూజింతునా? అని వ్యాకులురాలై లేచెను. బ్రహ్మను తన గురువైన (భర్తయైన) మరీచికి గురువని (తండ్రియని) తలంచి అర్ఘపాద్యాదులనిచ్చి బ్రహ్మను పూజించెను. శయ్యను గూడ ఏర్పరు చగా బ్రహ్మ విశ్రమించెను. ఇంతలో భర్త శయ్యనుండి లేచెను. ధర్మవ్రతను తనశయ్యపై చూడక మరీచి కోపించి ఆమెను శపించెను. నా పాద సంవాహనమును వదిలి, ఈ విధముగా నా అజ్ఞను ఉల్లంఘించి వేరొక చోటికి పోయితివి. ఆ పాపము వలన నా శాపముచే దగ్ధురాలవై శిలవు కమ్ము! అని శపించెను. భర్తచే శపింపబడిన ధర్మప్రత కోపముతో - నీవు పడుకొనుచుండగా నీ గురువైన తండ్రి వచ్చెను. అపుడు నీవు లేచి నీ నీ తండ్రికి పూజనము చేయవలెను. నీ సహధర్మచారిణియైన, నేను నీవు చేయ వలసి నీతండ్రి పూజనమునుచేసితిని. ఈ విధముగ దోషములేని నన్ను శపించితివి. కావున నేను నీకు శాపమిత్తును. ఓ భర్తా! నీవు మహాదేవుని వల్ల నిశ్చయముగా శాపమును పొందెదవు అని శాపమును ఇచ్చెను. అంత వ్యాకులుడైన పతినిచూచి తాను వ్యాకులయై బ్రహ్మదగ్గరికు వెళ్లి నమస్కరించి, నిద్రించుచున్న బ్రహ్మను కట్టెలతో అగ్నిని ప్రజ్వలింపజేసి గార్హపత్యాగ్నిలో ఉన్నదై మిక్కిలి దుష్కరమైన తపమును చేసెను. పతివ్రత యొక్క తపముచేతను, మరీచియొక్క తపము చేతను ఇంద్రాదులు సంతప్తులై విష్ణువును శరణము పొందిరి. తపస్సంతపులు అయిన దేవతలు పాలసముద్రమున పరుండియున్న విష్ణువుతో - ఓ హరీ! కేశవా! పతివ్రతనుండియు, మునినుండియు ముల్లోకములను రక్షింపుమని వేడుకొనిరి. ఇంద్రాదుల మాటలు విని విష్ణువు ధర్మవ్రత కడకు పోయెను. ఈ కాలములోనే భగవంతుడైన బ్రహ్మ మేలుకొనెను. విష్ణువుతో కూడిన దేవతలు అగ్ని యందున్న ధర్మవ్రతతో ఓ పతివ్రతా! అగ్నిమధ్యన తపము చేయుటకు ఎవరికిని శక్తి చాలదు? సర్వలోక భయంకరమైన ఆ అగ్నిమధ్య తపమును నీవు చేసితివి. ఓ ధర్మజ్ఞురాలా! మానుండి నీ అభీష్టమైన వరమును కోరుకొమ్ము అని పలికిరి. విష్ణ్వాదుల ఈ మాటలు విని ధర్మవ్రత దేవతలతో ఇట్లనెను. నా తేజముతో భర్త ఇచ్చిన శాపమును నివర్తింప చేయుటకు అశక్తురాలను అయితిని. అసహ్యమైన మరీచి ఇచ్చిన శాపము మరలిపోవుకాక! అను ధర్మవ్రత మాటలువిని దేవతలు మరల అమెతో ఇట్లనిరి. ధర్ముని పుత్రివైన ధర్మవ్రతా! ఈ శాపము పరమర్షిచే ఈయబడినది. దేవ బ్రాహ్మణులతో అది నివారింప శక్యముగాదు. ఓ శుభవ్రతురాలా! ముల్లోకములో వేదోక్త ధర్మ సంస్థాపనము జరుగు మరొక వరమును కోరుకొనుము. అని దేవతలు అనగనే ధర్మవ్రత దేవతలతో భర్త శాపమునుండి నన్ను మీరు విముక్తురాలిని చేయలేనపుడు, మీరు నాకు ఈ విధమైన ఉత్తమ వరము ఈయుడు. నేను శిలనగుదును. అది బ్రహ్మాండమునే పవిత్రము చేయునది శుభమైనది కావలెను. అది నదీ - నద, సరస్ - తీర్థ - దేవాదులకన్నను అతి పవిత్రకారి కావలెను. అది ఋష్యాదుల కన్నను, మునులకన్నను, ముఖ్య దేవతలకున్నను, పవిత్రకారి కావలెను. ముల్లోకమున ఉన్న వ్యక్తావ్యక్త లింగములన్నియు నా దేహమున తీర్థరూపమున ఎల్లప్పుడు ఉండవలెను. సమస్త తీర్థములు, నక్షత్రములు మొదలగునవియు, సమస్త స్త్రీ, పుందేవతలు, మునులును నా దేహమున ఉండవలెను. బ్రహ్మ - విష్ణు - రుద్రులు వారి పాదముల గుర్తులను నాపైన నుంచవలెను. పంచాగ్నులు, కుమారాదులును బహురూపములతో నాయందు ఉండవలెను. దేవతలు మూర్తామూర్త స్వరూపములతోను, పదరూపమునను, క్రోశ మాత్రముతో శిలయందు అమూర్త రూపమునను భూమిలో మూర్తరూపమునను ఉండవలెను. మహాపాతక నాశినియగు ఆ శిలనుచూచి సర్వలోకము పవిత్రము కావలెను. అచట శ్రాద్ధము చేయువాడు ధర్మాధికారియై బ్రహ్మలోకమును చేరువాడు కావలెను. శిలయందున్న తీర్థములలో స్నానముచేసి, తర్పణముచేసి, ఎవరికి సపిండక శ్రాద్ధమును చేయుదురో, వారు బ్రహ్మలోకమునకు పోవుదురు గాక. సర్వతీర్థోత్త మోత్తమమైన గదాధర దృశ్య తీర్థమున ఉన్నవారును, చచ్చినవారును అయిన నరులు బ్రహ్మపురిని చేరవలెను. వారాణసి, ప్రయాగ, పురుషోత్తమసంజ్ఞ కలది. గంగాసాగరసంగము కూడ నా నిస్సారమైన రాతి దేహమున నిత్యముండుగాక. ఆ సర్వతీర్థోత్తమమైన శిలాతీర్థము గదాధరుడైన విష్ణువుచే అధిష్ఠింపబడినదై అచటి శ్రాద్ధమున మృతులకును పితరులకును ఎల్లప్పుడు ముక్తి కలుగవలెను. మావివల్ల పుట్టినవారుగాని, అండమువల్ల పుట్టినవారుగాని, చెమటవల్ల పుట్టినవారుగాని, భూమిని భేదించుకొని పుట్టినవారుగాని నా శీలయందు తమ దేహమును వదిలి వారు విష్ణు స్వరూపమును పొందవలెను. హరిని అర్చించినందున సర్వ యజ్ఞములు పూర్ణములైనట్లే నా శిలయందలి శ్రాద్ధము తర్పణము స్నానము అక్షయమగుగాక. నా దేహశిలయందు చేసిన బ్రహ్మ - విష్ణు - రుద్ర - ఇంద్రాది దేవేశుల వ్రతాదులు వెంటనే ఫలసిద్ధిదాయకములగు గాక. వ్రతకర్తలు ఫలభాక్కులగుదురు గాక! ఇచట శ్రాద్ధాదులను చేసిన నరుడు తనతోబాటు వేయితరముల పితరుల వంశమును ఉద్ధరించి నిశ్చయముగా విష్ణు లోకమును చేరవలెను. నా దేహశిలపైన శ్రాద్ధము చేయువారి విముక్తికై నదీ శ్రేష్ఠములు అన్నియు, గంగాది నదీ నదులు, శుభములైన హ్రదములు (మడుగులు), సముద్రాదులు, మానసాది ముఖ్య సరస్సులును నాయందు నివసించుగాక! దేవతలందరు శరీరముతో నాయందు ఉందురుగాక! ఎక్కడికిని పోకుందురుగాక! పండితులు ఒకే విష్ణువును బ్రహ్మ విష్ణు రుద్ర మూర్తులచే మూడు విధములుగా చెప్పుదురు. దేవతలతో పాటు వీరందరును, సర్వతీర్థములును మునులును గంధర్వ గణములును నా శిలయందు ఉందురుగాక! ఈ శిల సర్వదేవ స్వరూపయై దేవ రూపిణియై బ్రహ్మాండము ఉన్నంత వరకుండుగాక! నా శిలా దేహమున వారందరు జపింతురు గాక! తపింతురుగాక! ఇచట అగ్నిలోహోమము చేయువారికి అక్షయము సిద్ధించుగాక! ఇచటి శ్రాద్ధము జప - హోమ తపములు, అక్షయములు అగుగాక. ఆ జపహోమతపములు శిలాపర్వత రూపమున నాయందు ఎల్లప్పుడు ఉండుగాక అని ప్రార్థించెను. పతివ్రత యొక్క ఆ మాటలను విని దేవతలు అ పతివ్రతతో - “నీవు కోరినదంతయు సిద్ధింపగలదు. సంశయము లేదు” అనిరి. నీ దేహశిల గయాసురుని శిరముపై స్థిరముగా ఉన్నప్పుడు మేమందరము దేవతలము. పాదాది రూపములతో నీపైన సుస్థిరులమై ఉందుము అని చెప్పిరి. అంతట దేవతలు శిలారూపిణియైన ధర్మవ్రతకు ఈ విధముగా వరమిచ్చి అంతర్థానము చెందిరి.