భువన విన్యాసము - 14

సూతుడు అనెను:

ఓ బ్రాహ్మణోత్తములారా! ప్లక్ష ద్వీపమును గూర్చి ఉన్నదివున్నట్లు సంగ్రహముగా చెప్పెదను వినుడు. జంబుద్వీప విస్తారమునకన్న దీని విస్తారము రెండింతలు. ఆ విస్తారమున కన్న మూడింతలు దీని అంతటి వైశాల్యము. అచటి గ్రామములు పుణ్యములు. ప్రజలు చిరకాలమునకు చచ్చుదురు. అట కరువు లేదు. ముదిమి యొక్కయు, రోగముల యొక్కయు భయము లేదు. అచటగల సముద్రములు, నదులు వాని పేర్లను చెప్పెదను వినుడు. ప్లక్ష ద్వీపాదులైన వానిలో ప్రతి ఏడింటి యందును పర్వతములు చక్కగా పొడవైనవై ప్రతి దిశలోను ప్రవేశించినవి.

ప్లక్ష ద్వీపమునందలి సప్త ద్వీపములను సప్త మహాచలములను గురించి కూడ వివరించి చెప్పెదను. ఇచట మొదటి పర్వతము గోమేదకము. అది రంగులో మేఘముతో సమానమైనది. ఆ వర్షము (దేశము) గూడ గోమేదకమను పేరనే పిలువబడుచున్నది. రెండవ పర్వతము చంద్ర పర్వతము. అది సమస్త ఔషధులతో కూడిఉన్నది. అశ్వినీ దేవతలచేత అమృతము కొరకై అచట ఓషధులు ఉంచబడినవి. మూడవది నారదము అనుపర్వతము. అది మహోన్నతమై పోవుటకు అనువుకానిది. ఆ పర్వతముననే పూర్వము నారద, పర్వతులు ఇద్దరును పుట్టిరి. అచట నాల్గవ పర్వతము దుందుభి అను పేరుగలది. ఇచట శబ్దమృత్యువైన దుందుభి రాక్షసుడు పూర్వము దేవతలచే చావగొట్టబడెను. ఐదవది సోమకమను పర్వతము. ఇచట పూర్వము దేవతలచే అమృతము సంపాదింపబడినది. అది మాతృదాస్య విముక్తికై గరుడునిచే అపహరింపబడినది. అరవది సుమనా అనుపర్వతము. అదియే ఋషభము అని చెప్పబడినది. దీనియందు పూర్వము వరాహావ తారము ఎత్తిన విష్ణువుచే హిరణ్యాక్షుడు అను రాక్షసుడు చంపబడెను. ఏడవ పర్వతము వైభ్రాజము అనునది. అది బాగుగా ప్రకాశించునట్టి స్ఫటికమణిమయమైన మహాపర్వతము. జ్వాలలచే అది ప్రకాశించినది కావున వైభ్రాజము అనబడినది.

ఇప్పుడు యథాక్రమముగా పేరులతో వానియొక్క వర్షములను (దేశములను) చెప్పెదను. అందులో గోమేదము అన్నది మొదటిదేశము. అది భయము శమించిన దేశము. చంద్రమునకు శిఖరము అనునది దేశము. నారద ద్వీపమునకు సుభోదయము దేశము. ఆనందమన్నది దుందుభియొక్క దేశము. సోమకమునకు శివము అనునది దేశము. ఋషభమునకు క్షేమకము అన్నది దేశము. వైభ్రాజమునకు ధ్రువము అన్నది దేశము. ఈ దేశములందు దేవ గంధర్వులు, చారణులతోడి సిద్ధులును విహరింతురు. వారితోగూడి సిద్ధులు కూడ కనబడుచున్నవారై క్రీడింతురు. వానియొక్క నదులు కూడ ప్రతి దేశమునకును ఏడే! అవి సముద్రమును చేరునవి. వాటిని సప్త గంగయైన మహానది అని చెప్పబడు ఆ నదులు ప్రవహించును. వాటి నుండి వేల కొలది ఇతర నదులు ప్రవహించును. అవి బహూదకములు, సమూహములుగలవి. ఇంద్రుడు వర్షించు వైపునకు ప్రవహించునవి. ఆ గ్రామములందలి ప్రజలు మాత్రము సంతుష్టములై ఎల్లప్పుడు ఆ నదీజలములనే త్రావుదురు. అవి (జనపదములు) శుభములు, శాంతవహములు, ప్రమోదములు, అవియే శివములు. ఆనందములు ధ్రువములు శివములతో గలపి క్షేమకములు (ఇందలి జనులు ఆ నదీ జలముల త్రాగుదురు) వీని అందలి ప్రజలంతటను వర్ణాశ్రమాచార ధర్మములు కలిగినవారు. ఈ అన్నింటి యందును ప్రజలు అరోగులు, సుబలులు. ఏ అనారోగ్యములు లేనివారు. వారిలో అధోగతి లేదు అట్లే ఉద్గతియును లేదు. అచట ఎక్కడగూడ కృతత్రేతాది చతుర్యుగ కృతమైన యుగదశలేదు. ఎల్లప్పుడు త్రేతాయుగముతో సమానమైన కాలమే ఉండును. ప్లక్ష ద్వీపము మొదలు ఈ ఐదు ద్వీపములలో అంతటను త్రేతాయుగ సమమగు కాలమే ఉండును. దేశముయొక్క అనువిధానమునుబట్టి కాలము యొక్క అనువిధులు కూడ ఉండునని చెప్పుదురు. ఆ దేశములలో మానవులు సురూపులై, సువేషములుగలవారై, అరోగులై, బలవంతులై, ఐదువేల ఏండ్లు జీవింతురు. సుఖము, ఆయువు, బలము, రూపము, ఆరోగ్యము, ధర్మమును ప్లక్ష ద్వీపము మొదలు శాకద్వీపము వరకు చక్కగా వర్తిల్లును. ప్లక్ష ద్వీపము విశాలమైనది, శ్రీమంతము, అంతట ధనధాన్యములు గలది, దివ్య ఓషధి ఫలములతో గూడినది. సర్వ ఓషధి వనస్పతులు గలది. వేలకొలది పశువుల చేతను, గ్రామములచేతను, అరణ్యముల చేతను చుట్టబడినది. ఓ బ్రాహ్మణోత్తములారా! ఆ ద్వీపమధ్యమున జంబూ వృక్షముచే పిలువబడిన ప్లక్షమను (జువ్విచెట్టు) మహావృక్షము గలదు. కావున అ వృక్షము పేరనే ప్లక్షద్వీపమని పిలువబడినది. ఆ జనపదము యొక్క మధ్యన రుద్రుడు పూజింపబడును. అదియును చెఱకురసముగల ప్రదేశము. అది ప్లక్ష ద్వీపముచే చుట్టబడినది. ప్లక్ష ద్వీపము యొక్క వైపుల్యము విస్తరముగా ఇచ్చట చెప్పబడినది. అని, అనుపూర్వితోను, సంగ్రహముగను ఈ ప్లక్ష ద్వీపము యొక్క సన్నివేశము చెప్పబడినది. తఱువాత శాల్మల ద్వీపమునకు సంబంధించిన ఆ సన్నివేశము వినుడు. తరువాతగల ద్వీపములలో మూడవదైన శాల్మల ద్వీపము ఉత్తమమైనది. శాల్మల ద్వీపముతో సముద్రము చెఱకు రసము జలముగా కలది అయినది. ప్లక్ష ద్వీపమునకన్న రెండింతలైన విస్తారముతో చుట్టబడినది. అవి కూడ రత్నములు పుట్టుస్థానములై పర్వతములు గూడను ఏడేయని తెలియవలెను. మొదటిది సూర్యునితో సమానమైన కుముదము అను పర్వతము అన్ని ధాతువులతో నిండి శిలాజలముల నుండి పైకి లేచిన శిఖరములతో అలంకరింపబడినది. దానియొక్క రెండవ పర్వతము ఉన్నతమని ప్రసిద్ధి జెందినది. హరిదళము నిండిన శిఖరములతో ఆకాశమును ఆవరించి ఉన్నది. దానియొక్క మూడవ పర్వతము బలహకమని ప్రసిద్ధమైనది. గాఢనీలమైన ఆ శిఖరములతో ఆకాశము ఆవరించి నిలచి ఉన్నది. దాని నాలుగవ పర్వతము ద్రోణ పర్వతము. దానియందు మహాబలములైన ఓషధులు గలవు. విశల్యకరణి (తీసివేయ దగిన) ఎముకను దీసివేయు ఓషధియు, అట్లే మృతసంజీవని (చచ్చినవానిని బ్రతికించునది) అగు ఓషధియు దానియందుగలవు. అచట కంకమన్నది ఐదవ పర్వతము. గొప్ప ఎత్తైనది. దివ్యపుష్ప - ఫలములతో కూడినది. చెట్లతో తీగలతో చుట్టబడినది. అచట ఆరవ పర్వతము పేరు మహిషము. అది మేఘమువలె నల్లనైనది. అచట నీట పుట్టిన మహిషమను అగ్ని కలదు. ఆట కకుద్మాక అను పర్వతము ఏడవదిగా చెప్పబడును. ఇచట ఇంద్రుడు స్వయముగా అనేక రత్నములను వర్షించును. ప్రజాపతిని (బ్రహ్మను) తీసికొని వచ్చి ప్రాజాపత్య యాగమును చేయించును. ఈ ఏడు పర్వతములు శాల్మల ద్వీపమున మణులచే అలంకరింపబడినవి. ఆ పర్వతములకున్న ఏడు శుభములైన వర్షములను (దేశములను) చెప్పెదను. కుముద పర్వతము నుండి మొదటిది శ్వేతదేశము. ‘ఉన్నతము’నకు లోహిత దేశము, బలాహకమునకు జీమూతదేశము. ద్రోణమునకు హరితదేశము. కంకమునకు వైద్యుత దేశము, మహిషమునకు మానసదేశము, కకుద్మంతమునకు సుప్రభ అను దేశము అను ఈ పర్వతములు ఏడింటికి ఏడు దేశములు గలవు. వానిలో నదులను వినుడు. అచటి నదులు పాని, తోయా, వితృష్ణ, చంద్ర, శక్ర, విమోచనీ, ఏడవది నివృత్తి అని ప్రతి దేశమునకు ఒకటిగా నదులు చెప్పబడినవి. అ నదులకు సమీపముగా పోవు ఇతర నదులు నూర్లు వేలును కలవు. వాని లెక్కించుటకు అలవికాదు. అచట ఉండతలచినవాని చేత శ్రద్ధగా తెలిసికొనదగినవి అని శాల్మల ద్వీపము యొక్క సన్నివేశము కూడ చెప్పబడినది. ప్లక్ష వృక్షముతో సంఖ్యలో సమానముగా శాల్మలద్వీప మధ్యమున మహాశాల్మలి (బూరుగు) వృక్షము కలదు. అది విశాలమైన స్కంధములుకలది. ఆ శాల్మలి వృక్షరాజము సురాజలముతోగల సముద్రమునంతట చుట్టబడి ఆ సురాసముద్రము శాల్మల వృక్ష విస్తారమునకు అంతట సమముగా ఉన్నది.

ఉత్తర ద్వీపములలో ప్రజలు ధర్మజ్ఞులు. నేను విన్నట్లుగా న్యాయమును గుణముగా చెప్పెద వినుడు. నాలుగవదైన ఆకుశ ద్వీపమును గురించి సంగ్రహముగా చెప్పెదను వినుడు. కుశ ద్వీపముచేత సురాజుల మంతట చుట్టబడినది. అచట ఏడే పర్వతములు. కుశ ద్వీపమందు శాల్మల ద్వీప విస్తారముకంటె అంతటను రెండింతలు గలదు. కుశద్వీపమున పగడముల యెత్తైనరాశిగా ఉన్న పర్వతము, కుశ ద్వీపము యొక్క మొదటి పర్వతము. రెండవది హేమ పర్వతము. మూడవది ద్యుతిమాన్ అను పర్వతము. అది మేఘమువంటి పర్వతము. నాలుగవది పుష్పవాన్ అను పర్వతము. ఐదవది కుశేశయమను పర్వతము. ఆరవది హరిగిరి అన్నది ఏడవది మందరము. మందా అనగా నీరు. ఆ నీటిని చీల్చుటచే మందరమైనది. వానియొక్క లోపలి విరివి రెండింతలుగా చుట్టబడినది. మొదటి వర్షము (దేశము) ఉద్భదమన్నది. రెండవది వేణుమండలము, మూడవది స్వైరథాకారము. నాలుగవది లవణము అనబడినది. ఐదవ దేశము ధృతిమాన్. ఆఱవది ప్రభాకరము అను దేశము. ఏడవది కపిలము అనునది. ఈ ఏడు వర్ష పర్వతములు, వీనిలో దేవ గంధర్వులు జగదీశ్వరులై, కాంతిమయములై చూడబడుచు ప్రతి దేశక్రమమున విహరింతురు, క్రీడింతురు. ఆ దేశములందు దొంగలులేరు. అట్లే మ్లేచ్ఛ జాతీయులు లేరు. జనమంతయు తెల్లని వర్ణములో ఉందురు. అట్లే ఒక క్రమమున చత్తురు. ఆచట నదులు కూడ ఏడే! అవి స్వేతర పాపముల కడిగివేసినవి. మంగళకరము లైనవి. అచటి సంతతి పవిత్రమైనది. అట్లే భూమి కాంతి గర్భిత. ఆ నదుల నుండి బయలు దేరినవి నూర్లు, వేలు, అవి అన్నియు ఇంద్రుడు వర్షించు చోట్లకు జేరును. కుశద్వీపము వెలుపల నేతినీటితో చుట్టబడినది. ఆ ఘృతోదము విస్తారమున కుశద్వీపముతో సమానము. ఇది కుశ ద్వీపము యొక్క సన్నివేశము. ఆ తరువాత నేను క్రౌంచ ద్వీపముయొక్క విస్తారమును చెప్పెదను.

ఆ క్రౌంచ ద్వీపము కుశద్వీప విస్తారమునకన్న రెండింతలుగా ఉండును. నేతి జల సముద్రము క్రౌంచ ద్వీపముతో చుట్టబడినది. ఆ ద్వీపమున శ్రేష్ఠపర్వతమైన మొదటి పర్వతము క్రౌంచస్థము. క్రౌంచమునకు పరమైనది వామనకము. వామనముకన్న పరమైనది అంధకారము. అంధకారమున కన్న పరమైనది దివావృత్ అనునది. దివావృత్తుకన్న పరమైనది గోవిందగిరి. గోవిందమునకన్న పరమైనది పుండరీకమను మహాగిరి. పుండరీకమునకు కన్న పరమైనది దుందుభి స్వనము. ఈ రత్నమయములైన క్రౌంచ ద్వీపము యొక్క ఏడు పర్వతములు బహువృక్షములతో కూడినవి. అనేక వృక్ష - ఫలములతో చుట్టబడినవి. వర్ష పర్వతము విష్కంభము నుండి ఒండొరులకు రెండింతలైనవి. అచటి దేశములను పేర్లతో చెప్పెదను క్రౌంచమునకు కుశలిఅను దేశము, వామనమునకు మనోగమఅను దేశము, మనోనుగమునకంటె పరమైన దేశము ఉష్ణదేశము. ఇది మూడవ దేశము. ఉష్ణమునకన్న పరమైనది ప్రావరకము, ప్రావరముకన్న పరము అంధకారకము. అంధకారక దేశమునకన్న పరమైనది మునిదేశము, మునిదేశమునకన్న పరమైనది దుందుభి స్వనము. సిద్ధచారణులతో సంకీర్ణమైన అచటి జనము సామాన్యమగు వర్ణము కలది. అచట కూడ త్రిదేశమున నదులు శుభములై ఏడే ఉండును. అనబడినవి. గౌరీ, కుముద్వతి, సంధ్య రాత్రి, మనోజవా, ఖ్యాతి, పుండరీక అను గంగ ఏడు విధములు. వానిలో సమీపముగా పోవునవై సముద్రమున చేరు నదులు వేరుగా ఉన్నవి. అవి అన్నియు విశాలములై, బహుజలములు గలవై తోడుగా పోవును. క్రౌంచ ద్వీపము పెరుగు, మీగడవంటి జలము గలిగి, క్రౌంచ ద్వీప సమముగా ఉన్న సముద్రముచేత శ్రీమంతమగు క్రౌంచ పర్వతము చుట్టబడినది. ప్లక్షద్వీపము మొదలగు ఈ ద్వీపములు సంగ్రహముగా చెప్పబడినవి. అ ద్వీపముల యొక్క స్వభావముగూడ మొదటి నుండియు వరుసగా మొత్తముగా చెప్పబడినది. ఇచటి ప్రజల సృష్టి సంహారములు వివరముగా నూరేండ్లలో గూడ చెప్పుటకు అలవిగానివి.

ఆ తరువాత శాక ద్వీపము ఉన్న విధానమును, దాని యథార్థతత్త్వమును నిశ్చయముగా చెప్పెదను. ఆ వృత్తాంతమును నా నుండి వినుడు. దాని విస్తారము క్రౌంచ ద్వీపము విస్తారమునకన్న రెండింతలు అది పెరుగు, మీగడ వంటి నీరుగల సముద్రమును చుట్టి ఉన్నది. అచటి జనపదములు, గ్రామములు పుణ్యములు. జనులు చాల కాలము జీవించి మరణింతురు. అచట కరువు ఎక్కడిది? రోగ భయములు లేవు? అచట గూడ పర్వతములు ఏడే! అవి శుభ్రములు మణులచే అలంకరింపబడినవి. అట్లే సముద్రములును, నదులును కలవు. అందులో మొదటిది దేవర్షులతోను, గంధర్వులతోను కూడినదై మేరువని చెప్పబడును. తూర్పునకు పొడవై బంగారు వర్ణముగల అది ఉదయము అను పర్వతము. అచట మేఘములు వర్షము కొరకైపుట్టును. పోవును. దానికి పైగా గొప్పదైన జలధార అను మహాగిరి కలదు. దానినుండి ఇంద్రుడు ఉత్తమమైన జలమును స్వీకరించును. తరువాత వర్షాకాలమున ప్రజలకు ఇచట వర్షము కలుగును. దానికి పైగా రైవతకమను పర్వతము కలదు. అచట రేవతీదేవి అను నక్షత్రము నిత్యము ప్రతిష్ఠితమై ఉన్నది. ఆగిరి బ్రహ్మచేచేయబడినది. దానికిపైగా గొప్పనైన శ్యామము అను మహాపర్వతము కలదు. పూర్వము ఈ ప్రజలు దానివల్లనే నలుపుదనమును పొందిరట. దానికిపైగా అంబికేయమను పర్వతము కలదు. అది మంచుచే కప్పబడి పోవుటకు అలవికాని శైలము. ఆంబికేయ పర్వతమునకు పైగా రమ్యమై, సర్వ ఔషధులతో గూడిన కేశరియను పర్వతము గలదు. దానినుండి వాయువు వీచును. ఇక యథాపూర్వకముగా వాని దేశనామములను వినుడు. ఉదయపర్వతమునకు ఉదయదేశము జలదము అని ప్రసిద్ధిగాంచినది. రెండవ జలధారపర్వతమునకు సుకుమము అను రెండవదేశము చెప్పబడినది. రైవతకమునకు కౌమార దేశము, శ్యామపర్వతమునకు మణీచకము అను దేశము, అస్తపర్వతమునకు శుభము అను దేశము కలవు. అది పూవులతో ఉండి మిక్కిలి యెత్తైనదిగా ఉండును. అంబికేయ పర్వతమునకు మోదాకము అనుదేశము. కేశరములలో మహాద్రుమము అను దేశముకలదు. ఈ ద్వీపముము యొక్క పరిమాణము శాక ద్వీపముతో సమానముగా పొట్ట పొడుగుగా ఉండును. దానియొక్క మధ్యన శాకమను మహావృక్షము కలదు. అచట జనులు దానికి పూజలు చేయుదురు. దీనితోనే దేవగంధర్వులు చారణులతో సిద్ధులును విహరింతురు. వారితో సహాచూడబడుచున్న వారై క్రీడింతురు. అచట పుణ్యములైన జనపదములు (గ్రామ నగరములు) చతుర్వర్ణములతో కూడి ఉందురు. వానిలో గూడ నదులు ఏడే! ప్రతి వర్షము (ఏడు) సముద్రమును చేరునవి. వాని నామములను తెలిసి కొనుము అవి అన్నియు గంగలే. అవి ఏడు. మొదటిది సుకుమారి అనునది. ఇది గంగ, శివజల, అనుతప్త, అను పేర్లతో ఉన్న నది. కుమారియను పేరుగల గంగ రెండవది. అది మరల సతి అనబడినది నంద అనియు పార్వతి అనియు పేరు గలది మూడవది. శివేతిక అనునది నాల్గవది. అది త్రి అని కూడ అనబడినది. ‘ఇక్షు’ అనునది అయిదవది. అది మరల క్రతువు అనబడినది. ధేనుక అని, మృతఅని అరవ ఏడవ గంగ చెప్పబడినవి. ఇవి యేడు మహాగంగలు, శివములైన (మంగళములైన) జలములు గలవి. ఇవి శాక ద్వీప నివాసులైన జనమును అందరిని సేవించును. ఆ నదులను వేలకొలది ఇతర నదులు అనుసరించును. ఇంద్రుడు వర్షించిన వైపున ఎక్కువ జలముతో స్రవించును. వానిపేర్లను పరిమాణములను పరిగణించి చెప్పుటకు సాధ్యము గాదు. అవి నదీ శ్రేష్ఠములు ఆ జనపదములు (తద్వాసులు) సంతుష్ఠులై, ఆ నదుల జలములనే త్రాగుదురు. ఓ శంశపాయన! ఈ ద్వీపము విస్తీర్ణము చక్రమునందు ఉన్నది. నదీ జలములచే కప్పబడినది. మేఘములవంటివియు, సమస్త ధాతువులచే చిత్రములైనవియు, మణులచేతను, పగడములచేతను అలంకరింపబడినవియు అయిన పర్వతములచే కప్పబడినది. అనేక ఆకారములు కలవియు, విశాలములైనవియు అయిన జనపదములచేతను అంతట ఫలములతో గూడిన వృక్షములచేతను ఆ పర్వతము ధనధాన్య వంతమైనది. పాలవంటి జలములుగల సముద్రముచేత అంతటను చుట్టబడినది. శాక ద్వీపము విస్తారమువలన, పైవానిచే అంతటను సమానముగా చుట్టబడినది. పర్వతాంత రాళమైన ఆ ద్వీపమున జనపదములు పుణ్యములు, శుభములు, వర్ణాశ్రమములతో నిండిన ఆ దేశములు ఏడుగానే చెప్పుదురు. జనులలో వర్ణాశ్రమములవల్ల వచ్చిన సాంకర్య మెక్కడను కూడ లేదు. అచ్చట ధర్మమునకు విరోధ ప్రవృత్తి లేనందున ప్రజలు దుఃఖములేశములేని సుఖములను అనుభవించిరి. వారిలో లోభముగాని, మాయగాని లేదు. ఈర్షా, అసూయ, అధైర్యము ఇవి అసలే లేవు. వారిలో విపర్యయము ధర్మాది వ్యతిరేకముగా పోవుట లేదు. అది వారిలో స్వాభావికముగా తలపబడినది. వారికి పన్నులవేత లేదు. శిక్షగాని శిక్షించువాడు గాని లేరు. ధర్మజ్ఞులైన ఆ జనులు తమ ధర్మముచేతనే ఒండొరులను రక్షించుచుండిరి. ఆ ద్వీపమున ఉండు వారికి సంబంధించినది ఇంత మాత్రమే చెప్పసాధ్యము. ఏడవదైన పుష్కరమును గూర్చి చెప్పెదను వినుడు.

పుష్కర ద్వీపమును వెలుపల క్షీరోదక సముద్రము చుట్టబడినది. అది శాకద్వీప విస్తారమునకన్న అంతటను రెండింతలు. పుష్కర ద్వీపమున శ్రీమంతమైన పర్వతము ఒకటే. అది మహాశిలామయము. మణిమయములైన శిలలచేతను, ఉన్నతములైన శిఖరములచేతను, చిత్రమైన ఆ ద్వీపముయొక్క పూర్వార్థమున ఒక గొప్ప చిత్రమైన చరియకలదు. అది ఇరువది అయిదు పరిమండల (అంతట గుండ్రనితనము) సహస్రముల విస్తీర్ణము ఉన్నది. ముప్పది నాలుగు వేల (పరిమండలముల) ఎత్తుగలదై ఆ పర్వతము ఏర్పడినది. ద్వీప సగభాగమునకు ఆ పర్వతము ఏనుగుకు కప్పు బొంతవలె ఉన్నది. అది మానసోత్తమము. అది సముద్రవేలా సమీపమున ఉదయించిన నూతన చంద్రునివలె ఉన్నది. ఏబది అయిదు వేల యోజనముల పైకి ఎత్తుగా వ్యాపించినది. అంతట అంతే గుండ్రని తనముతో విశాలమైనది. ఇట్లు ద్వీపముయొక్క పడమటి సగ భాగమున మానసము అను పర్వతము గలదు. ఒకే మహాసానువు (చరియ) అచట నుండుటచే రెండుగా చేయబడినది. తీయని నీరుగల సముద్రముచే అంతట చుట్టబడినది. పుష్కర ద్వీప విస్తారమువలన ఇది (పర్వతము) అంతటను వ్యాపించినది. ఆ ద్వీపమున రెండు శుభములైన జనపదములు కలవు. అవి మానస పర్వతము చుట్టును అనుసరించిన మండలాకారములై ఉన్నవి. మానస పర్వతముయొక్క వెలుపల కనబడు వర్ణము మహావీతము. దానియొక్క లోపలిది ధాతకీ ఖండము అనబడును. (ధాతకీ కుసుమ ఖండము) (అరెమ్రాకు) అచట మానవులు పదివేల ఏండ్లు జీవింతురు. ఆరోగ్య సుఖములతో నిండినవారై మానసీ సిద్ధిని పొందియుందురు. ఆ రెండు దేశములలోను ఆయువు రూపము సమానములు. వారిలో అధమోత్తములు లేరు. రూపశీలములో వారు సమానులు. అచట మోసగాడు లేడు. ఈర్ష్య లేదు. దొంగలు లేరు. భయము లేదు. రాజనిర్బంధము లేదు. దండములేదు. లోభము లేదు. దానము తీసికొనుట లేదు. అచట సత్య, అనృతములు లేవు. అట్లే ధర్మాధర్మములు లేవు. వర్ణాశ్రమముల వార్త (ఉనికి) లేదు. పశుపాలన వృత్తియు, వైశ్యవృత్తియు లేవు. ధర్మాధర్మములు తెలియజేయు త్రయీ విద్య, నయానయములు తెలియజేయు దండనీతి విద్య, సేవనము, బాణవిద్య అనగా వైద్యములోని ఎముకలను గూర్చిన విద్య, ఇవి అన్నియు పుష్కరద్వీపము నందలి రెండు దేశములలో లేవు. అచట నదులు, వర్షము, శీతోష్ణములును లేవు. భూమిని భేదించుకొని పుట్టు వృక్ష లతాదులు, జలములు కొండసెలయేరులును లేవు. జనము ఎల్లప్పుడు ఉత్తరకురు దేశవాసులకు సమానమైన కాలము గలవారు. అచట అంతట మంచి సుఖము గలవారు. ముసలితనము అలసటయు (శ్రమయు) లేనివారు. అని ఇది మహావీతమున ధాతకీ ఖండము. మొత్తము పుష్కరము యొక్క విధానము అనుపూర్వితో చక్కగా జెప్పబడినది. పుష్కరద్వీపము తీయని జలముగల సముద్రముచే చుట్టబడినది.

ఈ విధముగ ద్వీపములు ఏడేడు సముద్రములచే చుట్టబడినవి. ద్వీపమునకు ఎడములేని సముద్రము అంతట ఉండును. ఈ విధముగ బండారుల వలన ద్వీప సముద్రముల వృద్ధిని తెలియజేయవలెను. నీటియొక్క సముద్రేకము వలన సముద్రములని పిలువబడినవి. దీనియందు ఋషులు నివసింతురు. ఏ కారణమున ప్రజలు నాలుగు విధములో, ఆ కారణమున వర్షమని చెప్పబడినది. ఆ వర్షము ప్రజలకు సుఖము నిచ్చునది. ఋషమంటేనే ఋషులు, వృషధాతువు శక్తి ప్రబంధమను అర్థమున ప్రయోగించబడును. ఈ విధముగ (మానవాదులను) ప్రబంధించుట వలన దేశమునకు వర్షత్వము సిద్ధించినది. దానివలన ఆ దేశములందు వర్షత్వము సిద్ధించినది. శుక్ల పక్షమున చంద్రుడు వృద్ధి చెందునపుడు సముద్రము నింపబడును. (ఉప్పాత్తము) బహుళ పక్షమున చంద్రుడు క్షీణించునపుడును అస్తమించినపుడును (సూర్యునిలో గలిసి అగుపించనపుడు), సముద్రము క్షీణించును. సముద్రము నింపబడుచున్నపుడు తనంతట తానే నింపబడును. తరువాత క్షీణించునపుడు తనంతట తానే క్షీణించును. వంటకుండలోని జలము అగ్ని సంయోగమున ఉద్రేకమును అందినట్లు (మసలి ఉప్పొంగునట్లు) మహాసముద్రములోని జలము గూడ (చంద్ర కాంతికి) ఉద్రేకము చెందును (ఉప్పొంగును). శుక్ల కృష్ణ పక్షములలో (పూర్ణిమ అమావాస్యలలో చంద్రుని యొక్క ఉదయ అస్తమయములచేత సముద్రజలము తగ్గకుండను హెచ్చకుండను ఉప్పొంగును. చల్లారును. (సముద్రపు ఆటుపోటులలో సముద్ర జలముల హెచ్చు తగ్గులు లేకయే పొందిచల్లారును). ఈ విధముగ చంద్రుని వృద్ధి క్షయములవలన సముద్రముయొక్క వృద్ధి క్షయములు ఏర్పడును. పూర్ణిమ అవాస్య పర్వములందు సముద్ర జలముల యొక్క వృద్ధి క్షయములు ఐదువందలపది అంగుళములుగా కనుగొనబడినది. రెండు వైపుల జలములు ఉన్నవి కాన ద్వీపములైనవి. అంతట జలములచే చుట్టబడినవిగూడ ద్వీపములు అనబడును. ఉదకము యొక్క ఉనికి ఉన్నందున ఉదధిఅనబడినది. పర్వములు (కణుపులు) లేనివి గిరులు. పర్వములు ఉన్నవి పర్వతములు. ప్లక్ష ద్వీపమున గోమేదము పర్వములు కలదిగాన పర్వతము అనబడినది. శాల్మల ద్వీపమున శాల్మలి అను (బూరుగ) మహావృక్షము పూజింపబడును. కాన ఆ నామముచే ఆ ద్వీపము పిలువబడినది. క్రౌంచద్వీపమున జనపద మధ్యమున క్రౌంచగిరి ఉన్నందున క్రౌంచద్వీపము అయినది. శాక ద్వీపమున శాకము అను వృక్షముకలదు. కాన శాక ద్వీపము అనబడినది. పుష్కర ద్వీపమున మఱ్ఱిచెట్టు మహావృక్షముగ అచటివారిచే పూజింపబడినది. ఆ పుష్కర ద్వీపమున మహాదేవుడై ముల్లోకములకు ఈశ్వరుడైన బ్రహ్మ ఉండును. ప్రజాపతియైన బ్రహ్మ తన సాధ్యదేవతలతో కూడి ఉండును. అచట దేవతలు ముప్పది ముగ్గురైన మహర్షులతో కూడి బ్రహ్మను ఉపాసింతురు. దేవోత్తమోత్తముడైన ఆ బ్రహ్మ అచట దేవతలచేత పూజింపబడును.

జంబూ ద్వీపమునుండి అనేక విధములైన రత్నములు బయలుదేరును. ఆ ద్వీపములు అన్నింటిలోను ప్రజలయొక్క క్రమములు ఇట చెప్పబడుచున్నవి. అంతటను బ్రహ్మచర్యముతోను, సత్యముతోను, దమముతోను ప్రజలు ఉందురు. ఆరోగ్యము ఆయుః ప్రమాణములు అంతటను రెండింతలు. ఈ పుష్కర ద్వీపమున రెండు దేశములు ఉన్నవి. వానిని, అచటి సజ్జనాలంకృతులైన ప్రజలను ఈశ్వరుడు దండమును ఎత్తి రక్షించును. త్రిభువనములకు ఈశ్వరుడైన బ్రహ్మయు రక్షించును. విష్ణువుతో కూడియు, శివునితో కూడియు ఉన్న ఆ దేవుడైన బ్రహ్మ వారికి తండ్రి ప్రయత్నము లేకయే వచ్చినదియు, షడ్రసములు కలదై మహాబలమైన భోజనమును అచటి ప్రజలు ఎల్లప్పుడు భుజింతురు.

తరువాత పుష్కర ద్వీపమునకు పైగా అవరించి ఉన్న మహాసముద్రము కలదు. అది తీయని నీరుగలది. అంతట చుట్టి ఉన్నది. దానికిపైన గొప్పలోక స్థితి కలదు. అచటి భూమి బంగారపుదై రెండింతలైనది. భూమి అంతయు ఏకశిలవలె ఉండును. దానికంటె పైన పర్వతము దాని పొలిమేర చివర ఒక మండలమును కలవు. ఆ పర్వత ప్రకాశమును (కాంతిమంతమై కనబడునదియు) ఆ ప్రకాశమును (కాంతిలేక కనబడనిదియు) పైలోకాలోక పర్వతము అను పేర చెప్పబడును. ఆ పర్వతము క్రిందివైపున వెలుగు, దానికి చీకటియు ఉండును. దానియెత్తు పదివేల యోజనములు. అంతే (పదివేల యోజనములె) దాని విస్తారము. అది భూమిపైన ఇష్టము వచ్చినట్లు పోవునది కూడ. ఆలోకమున కనబడునది అను అర్థముగల లోకశబ్దము ఉన్నది. నిరాలోకమున కనబడు వారితో కూడ ఇదియను అర్థమును ఇచ్చు అసలోకత ఉన్నది (ఆలోకమనగా కనబడునది నిరాలోకమనగా కనబడనిది) చూడబడు జనముగల మానవాదిలోకము కొరకై అంతఃకాంతిగల లోకము (పర్వతము) సమ్మతమైనది. నిరాలోకమన్నదో కనబడని (కాంతి లేని) విధముగా బహిర్భాగమున చీకటిగల అదే పర్వతము (అలోక పర్వతము)గా సమ్మతమైనది. (లోకాలోక పర్వతము అంతర్భాగమున సూర్యకిరణములచే ప్రకాశించుననియు, బహిర్భాగమున చీకటితో ఉండుననియు తెలుసుకొనవలెను. లోకపర్వతపు సమస్త విస్తారము (అంతర్భాగము) వెలుగు నిండినది. వెలుపల అంతటను పరిచ్ఛిన్నమై అది (పర్వతము) నీటితో ఆవరింపబడి ఉన్నది. అది నిరాలోకము (వెలుగులేనిది) ఆ వెలుగులేని అలోక పర్వతమునకు పై భాగమున ఒక అండము ఆవరించి ఉన్నది. ఆ అండము లోపల ఈ లోకములును, ఏడు ద్వీపములుకల భూమియుకలదు. లోకములు భూర్లోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము అనునవి సంగ్రహముగా ఏడు దానిపైన లోకాంతము గూడ ఇంతయని తెలియవలెను. శుక్లపక్షము మొదటి నుండి పడమటి దిశలో కుంభమున ఉన్న చంద్రునివలె ఆ గ్రుడ్డు శరీరము తెల్లగా ఉండెను. సృష్టికారణభూతుడైన అవ్యయాత్ముని నుండి (బ్రహ్మ నుండి) వచ్చిన ఇటువంటి అండములు అడ్డముగను, ఊర్ధ్వ భాగమునను అధోభాగమునను వేలకోట్లు కలవు. ఏడు ప్రాకృత కారణముల చేత అది ఆవరింపబడినది. పదికన్న మించియే అన్నియు, ఒకటి నుండి ఒకటి పుట్టినవై ఒక దానిని ఒకటి చుట్టినవై ఒండొరులను ధరించుచున్నవి. ఈ అండమంతటను గొప్ప సముద్రము ప్రవేశించినది. ఆ సముద్ర జలముచే ధరింపబడు చున్నదై నిలచి ఉన్నది.

ఘనజలముయొక్క వెలుపల, అడ్డముగను నిలువునను ఉన్న మండలములకు అనుగుణముగా అంతటను, ఘనతేజస్సుచే ధరింపబడుచు అది నిలిచియున్నది. ఇనుము, బెల్లములవలె ఉన్న అగ్ని మండలాకారమును దాల్చినదై అంతటను ఘన వాయువుచే ధరింపబడుచున్నదై అది (అండము) నిలచి ఉన్నది. పంచ భూతములలో ఆదియైనది ఆకాశము. పంచభూతములకు ఆదియైనది మహాన్. ఈ మహాన్ అనంతమైన అవ్యక్తముచే వ్యాపింపబడినదై, ధరింపబడుచున్నది. ఈ అనంతమైన అపరివ్యక్తము లేక అవ్యక్తము పది విధములై సూక్ష్మమైనది. అంతములేనిది, అత్మనిగ్రహము గలది, చావు పుట్టుకలు లేనిది, ఆపైన మించి, భయంకరమైనదియు, ఆధారములేనిదియు, అరోగ మైనదియు, అనేక సహస్ర యోజనముల ఎడము గలిగినదై, చీకటితో అవరింపబడి చీకటియే నిరాలోకము (వెలుగులేమితనము) అది పొలిమేరలు లేనిది, దేశ విభాగము లేనిది, దేవతలకు కూడ తెలియనిది, ఏ వ్యవహారములు లేనిది.

చీకటి చివరను ఆకాశము చివరను సమ్మాన్యమై ప్రసిద్ధమై ప్రకాశించు ఒక గొప్ప శివాలయము కలదు. ఆ దివ్యస్థానము దేవతలకుగూడ పోవుటకు అలవిగానిది అని వేదము. అది మహాదేవునియొక్క మర్యాదలో స్థాపింపబడినది. చంద్ర సూర్యులచే తపింపబడినవిగానే లోకములు ప్రసిద్ధిచెందినచో ఇవి జగత్తుయొక్క లోకములు. సంశయము లేదు. పాతాళ ప్రదేశము నుండియు అట్లే భూమిపై నుండియు వాయువునకు ఏడేడు స్కంధములు (అంతరములు) గలవు. ఓ ద్విజులారా! అవి బ్రహ్మనివాసములతో కూడినవి. పాతాళమునుండి స్వర్గమువరకు ఐదు విధముల మార్గముగలదు. ఇది జగత్తు యొక్క ప్రమాణము. ఇది సంసార సాగరము.

ఈ విధముగా జగత్తుయొక్క ప్రవృత్తి ఆద్యంతములు లేనిదై అనేక జాతులు పుట్టునట్టిదై నడచును. అది విచిత్రమై, ఒకచోట నిలచునదిగా ఉండదు. ఈ భౌతిక మనునది సహజముగా బహు విస్తారమైనది. అతీంద్రియులై మహాభాగ్యవంతులైన సిద్దులచేత గూడ చూడబడదు. భూమిపైన అగ్ని వాయువులకును అట్లే మహాతమస్సు నకును అనంతుడైన ఈశ్వరునకు ఓ ద్విజోత్తములారా! క్షయముగాని, పరిమాణముగాని, అంతముగాని ఉండదు. ఈతడు అంతట అనంతుడు, అన్ని స్థానములయందును అనంతుడని పఠింపబడును. పూర్వము ఈ నామము అను కీర్తనమున నాచే అతనిని గూర్చి చెప్పబడినది. అట్టి ఇతడు శివనామముతో మీకు పూర్తిగా జెప్పబడినాడు. అట్టి ఇతడు (శివుడు) అంతట ఉండువాడుగా అన్ని చోట్లలోను పూజింపబడును. భూమి యందును, పాతాళము నందును, ఆకాశమునను, వాయువునందును, అగ్నియందును సమస్త సముద్రములు అందును, స్వర్గములందును, అట్లే తపస్సునందునను ఈశివుడే మహాద్యుతి గలవాడుగా ఉండును. అట్లే అనేక విధముల విభజింపబడిన అంగము గలవాడై మహాయోగియైన మహేశ్వరుడు సర్వలోకములలో లోకేశ్వరుడైన శివుడు అనేక విధములుగా పూజింపబడును.

ఈవిధముగా పరస్పరముగా పుట్టిన (వారు) పరస్పరముగా ధరింపబడుదురు. ఆధారాధేయ భావమున వారు వికారియొక్క వికారములు. వీరివి మొదలైనవి వికారములు. అవి పరస్పరముగా పరిచ్ఛిన్నములు (భాగములైనవి) పరస్పరము అధికములైనవి. పరస్పరములలో ప్రవేశించినవి. పరస్పరములో ప్రవేశించినందున అవి స్థైర్యమును పొందినవి. విశేషములుగా అన్యోన్య ప్రవేశమువలన పూర్వము అవి శేషములు ఉండెడివి. పృథివి మొదలు వాయువు వరకు మూడు పరిచ్ఛిన్నములు. గుణములు (5, 4, 3, 2 పృథివ్యాది భూతములలో) తగ్గుటచే పరిచ్ఛేదము (భేదము) విశేషించి కలదు. తక్కినవానిలో భేదము సూక్ష్మము అగుటచే ఇచట విశేషముగ భావింపబడుటలేదు. ఆ పృథివ్యాది భూతములకంటె పరముగా ఆలోకము అనబడినది. భూతములు ఆలోకమగు ఆకాశమున అంతట పరిచ్ఛిన్నములు, పెద్ద గిన్నెలో చిన్న గిన్నె అంతర్గతమై ఇముడు నట్లు (పెద్ద గిన్నెలో చిన్న గిన్నె ఇమిడినట్లు) పరస్పర సమాశ్రయము వలన పరస్పరముగా తగ్గినవి (లేనివి) అగును. (1టి 2లో కలిసినచో 1టి ఉండదు అట్లే 2డు 1లో కలిసినచో రెండు ఉండదు. ఈ విధము ఒండొరుల ఒండొరులు కలసినచో ఒండొరులు గూడ ఉండరు) అట్లే ఆ లోకమగు ఆకాశమున భేదములు అంతర్గతములై పోవును. కనబడవు అని (పెద్దలచే) అంగీకరింపబడినవి. పృథివి మొదలు వాయువు వరకుగల మొత్తము నాలుగు భూతములు పరస్పరముగా అధికములు. ఈ భూతములు ఉన్నంతవరకు ఉత్పత్తి జరుగుచుండును. జంతువులకు (ప్రాణులకు) ఇట సంస్కారము భూతములలో అంతర్గతమైనదిగా సమ్మతమైనది. భూతములను వదిలి కార్యోత్పత్తి ఉండదు. కావున కార్యాత్మక భేదములు కూడ అట్లే పరిమితములు అని సప్తద్వీప సముద్రయగు భూమియొక్క సన్నివేశము విభాగములతో బాటు నాచే ఓ ద్విజులారా! మీకు ఉన్నది ఉన్నట్లు చెప్పబడినది. ప్రధానము యొక్క (ప్రకృతి యొక్క) విశ్వరూపత్వము విస్తారము వల్లను, మండలము వల్లను, చక్కగా లెక్కింపబడుటచేతను, పరిమాణములో ఏకదేశికమే. (ఒక భాగమే). ఈ జగమంతయు ఆ భగవంతుని యొక్క అధిష్ఠానమైనది. ఈ విధముగా ఏడు భూతగణములు పరస్పరముగా చక్కగా ప్రవేశించినది. ఇంతటి సన్నివేశమైతే నాచే భావించుటకు శక్యమైనది. ఓ రాజా! సన్నివేశ విషయమున ఇంతయే వినదగినది. ఈ యేడు ప్రకృతులు పరస్పరము ధరించును. ఆ అల్ప ప్రకృతులలో అల్ప పరిమాణముతోనే లెక్కించుటకు ఇచట చెప్పబడుచున్నది. అడ్డముగను, నిలువుగను, క్రిందుగను ఉన్న ప్రకృతులు లెక్కింప అలవిగానివి. తారకల (చుక్కల) సన్నివేశమైతే దివ్యమైన (స్వర్గమైన) మండలము వరకు ఉన్నది. భూమియొక్క మర్యాదా సన్నివేశమైతే మండలము అనుసరించి ఉన్నది. ఓ ద్విజోత్తములారా! అ తరువాత భూమియందున్న పైవానిని గూర్చి చెప్పెదను.