వాయు మహా పురాణము
ప్రజాపతి వంశానుకీర్తనము
ఋషులు పలికిరి:
భారద్వాజుడు, యాజ్ఞవల్క్యుడు, గాలకి, సాలకి, ధీశాలియైన శతబలాకుడు, బ్రాహ్మణోత్తముడైన నైగముడును ఉండిరి. వారిలో బాష్కలియైన భరద్వాజుడు మూడు సంహితలను చెప్పెను. రధీతరుడు నిరుక్తుడును నాలుగవ సంహితను చేసిరి. అచట మహాత్ములై గుణాన్వితులైన ముగ్గురు శిష్యులు ఉండిరి. బుద్ధిశాలియైన, నందాయ నీయుడు, మతిమందుడైన పన్నగారియు, మూడవవాడు ఆర్యవస్తేయనుడు అనువారు వీరు తపస్సు చేత సంపూర్ణము చెందిన వ్రతములు కలవారు. రాగము లేనివారు, మహా తేజస్వులు, సంహితా జ్ఞానముయొక్క సారమును గ్రహించిన వారును అగు వీరు సంహితలను ప్రర్తింపజేసిన బహ్వృచులని చెప్పబడినారు. వైశంపాయనగోత్రుడైన ఈతడు యజుర్వేదమును విశేషముగ వికల్పించెను. ఈతనిచే శుభకరములైన ఎనుబది ఆఱు (86) యజుస్సుల సంహితలు చెప్పబడినవి. వానిని విధివిధానముతో శిష్యులకు ఇచ్చెను. వారుగూడ విధివిధానముతో స్వీకరించిరి. అక్కడ మహాతపస్వియైన యాజ్ఞ వల్క్యుడు వదిలివేయబడెను. అతని యొక్క ఎనుబది ఆఱు సంహితలు గూడ వికల్పములు. వాటికి అన్నింటికిని మూడు విధములుగా భేదములు చెప్పబడినవి. ఈ శుభకరమైన తొమ్మిదవ భేదమున గూడ ఆ మూడు విధములైన భేదములు చెప్పబడినవి. ఉత్తర సంబద్ధములైన దేశములును మధ్య దేశములును, తూర్పు దేశములును వేరు విధములైనవి. ఉదీచ్యులకు శ్యామాయని ప్రధానుడు అయ్యెను. మధ్య దేశమున ప్రతిష్ఠితులైనవారిలో ఆరుణి ప్రథముడుగా స్తుతింపబడెను. ప్రాచ్యులకు అలంబియనువాడు మూలము. వారు త్రయోదశాద్యులు. ఈ వీరందరు చరకులుగా చెప్పబడిరి. వీరు సంహితులను జెప్పిన బ్రాహ్మణులు. ఋషులు ఆ మాటలనువిని తెలిసికొను కోరికతో సూతునితో అనిరి. ఏకారణమున చరకులు అధ్వర్యులు (యజ్ఞములో యజుర్వేద మంత్రములు చదువువారు) అయిరి చెప్పుము. ఏమి జరిగినది? వారు ఏ కారణమున అధ్వర్య వాచకత్వమును పొందిరి” అని అడుగబడిన వాడై సూతుడు వారికి చరకత్వము వచ్చిన విధమును చెప్పెను.
సూతుడు అనెను:
ఓ బ్రాహ్మణ పండితోత్తములారా! మునుల యొక్క ఒక పని ఉండినది. మేరువు వీపు భాగమునచేరి వారు ఒకటిఅని మంత్రించిరి. ఓ బ్రాహ్మణోత్తములారా! ఎవడు ఏడు రాత్రులలో ఇచటికి రాడో!వాడు బ్రహ్మ హత్యచేసినవాడగును. ఇది మా పందెము” అని చెప్పిరి. తఱువాత, వారు వైశంపాయనుడు తక్క తక్కిన గణముతో కూడినవారై పందెము గట్టిన చోటికి ఏడు రాత్రులలో వెళ్ళిరి. బ్రాహ్మణ వచనమును అనుసరించి వైశంపాయనుడు బ్రహ్మహత్య చేసినవాడయ్యెను. తరువాత వైశంపాయనుడు తన శిష్యులను తనకడకు రప్పించి, ఓ బ్రాహ్మణోత్తములారా! నా కొరకుగాను మీరు బ్రహ్మ హత్యను చేయుడు. మీరు అందరు నాకడకు కూడి వచ్చి దానికి తగిన మాటను చెప్పుడు” అని పలుకగా.
యాజ్ఞవల్క్యుడు:
“నేనే ఆ బ్రహ్మహత్యను చరింతును. ఈ మునులు ఊరకుదురు గాక! నా తపముతో భావింపబడినవాడనై బలమును పైకి రప్పించెదను” అని ఈ విధముగ పలుకగనే వైశంపాయనుడు కోపించి యాజ్ఞవల్క్యునితో “నీవు చదివినదంతయు మరల నాకిచ్చి వేయుము అని అనెను. ఇట్లు అనగనే బ్రహ్మవిత్తముడైన యాజ్ఞవల్క్యుడు రక్తసిక్తములైన రూపముదాల్చిన యజుస్సులను వమనముజేసి గురువునకు ఇచ్చెను. తరువాత ఓ ద్విజులారా! యాజ్ఞవల్క్యుడు ధ్యానయోగమున నిలచి సూర్యుని ఆరాధించెను. యాజ్ఞవల్క్యుని నుండి వెలువడిన యజుర్వేదమంతయు ఆకాశమునకు పోయి వేదాత్మకుడగు సూర్యునిచేరి నిలిచినది. తరువాత సూర్యమండలమును చేరిన యజుస్సులను అన్నింటిని సంతుష్టుడైన సూర్యుడు, వేదమునకు విధానరూపుడైనట్టియు, ధీశాలియైనట్టియు, తన అశ్వరూపుడైనట్టి యాజ్ఞవల్క్యునకు ఇచ్చెను. బ్రహ్మచేతగాని, మరెవ్వరిచేతగాని, అశ్వరూపుడగు యాజ్ఞవల్క్యునిచే ఇవ్వబడిన యజుస్సుచే అధ్యయనము చేయబడును. అందువలన అవి వాజులు (గుఱ్ఱములు) అనబడినవి. బ్రహ్మహత్య ఎవ్వరిచే చరింపబడినదో అనగా చేయబడినదో వారు చరించుట వలన చరకులు అనబడినారు. అనగా వైశంపాయన శిష్యులైనట్టి వారు చరకులని చెప్పబడిరి.
వాజులైన వారినిగూర్చి వినుడు. వారు యాజ్ఞవల్క్యుని యొక్క శిష్యులు. వారు కణ్వ వైధేయలు, శాలులు, మధ్యందినుడు, శాపేయి, విదిగ్ధుడు, ఆప్యుడు, ఉద్దలుడు, తామ్రాయణుడు, వాత్స్యుడు, గాలవుడు, శైశిరి, ఆటవి, పర్ణి, వీరణీపరాయణుడు అను వీరు పదియైదుగురు వాజులని చెప్పబడిరి. యజుస్సుల యొక్క వికల్పములు మొత్తము నూట ఒక్కటి.
తఱువాత జైమిని తన పుత్రుని సుమంతుని చదివించెను. ప్రభువైన సుమంతుడు కూడ పుత్రుడైన సుత్వానుని చదివించెను. సుకర్ముడు సైతము సహస్రుని వేగముగా చదివించి, సుకర్మ సూర్యవర్చస్వియైన సహస్రునకు సంహితలను చెప్పెను. ఇంద్రుడు అనధ్యాయ దినములలో చదువుచున్నవారిని చంపెను. తరువాత సుకర్ముడు శిష్యుల కారణముగా ప్రాయోపవేశము (నిరాహారదీక్ష) చేసెను. తరువాత ఇంద్రుడు కోపించిన సుకర్ముని చూచి అతనితో “నీకు మహావీర్యవంతులు, అగ్నితేజస్కులు అయిన శిష్యులు కలుగనున్నారు. వీరు మహా ప్రజ్ఞాశాలురు అయి ఈ ఇద్దరును చక్కగా చదువువారు. వీరిరువురు దేవతలు, మహాభాగులు. “ఓ బ్రాహ్మణోత్తమా! కోపింపకుము” అని అనిరి. ఈ విధముగా ఇంద్రుడు సుకర్మునకు చెప్పి ఆ సుకర్మను శాంతక్రోధునిగా చూచి అచటనే అంతర్థానమునుందెను. ద్విజులారా! ఆ సుకర్ముని శిష్యుడు బుద్ధిశాలియైన పౌష్యంజియ కుశిక వంశజుడైన హిరణ్యనాభుడు అను రాజు రెండవ శిష్యుడు అయ్యెను. పౌష్యంజి వేయిన్నర (ఏబది) సంహితలను (శిష్యులకు) చదివించెను. దానిచేత పౌష్యంజి శిష్యులు అన్యోదీచ్య (ఇతరులైన ఉత్తరదిక్కువారు) సామాన్యులై శుభులైరి. వీర్యవంతుడైన కౌశిక్య హిరణ్యనాభుడు ఐదువందల సంహితలను చదివించెను. హిరణ్యనాభుని శిష్యులు ప్రాచ్య సామగులుగా చెప్పబడినారు. లోకాక్షి, కుథుమి, కుశలి, లాంగలి అను నలుగురు పౌష్యంజి శిష్యులు, వారి భేదములను వినుడు. రాణాయనీయుడు అతడు తండ్రి పుత్రుడు, వానికంటె వేరైనవాడు మూలచారి. మంచివిద్వాంసుడు. సతిపుత్రుడు, సహసాత్యని పుత్రుడు వీరి లోకాక్షి యొక్క భేదములుగా తెలిసికొనుడు. కుథుమి యొక్క పుత్రులు ముగ్గురు, ఔరసుడైన రసపాసరుడు, భాగవిత్త, తేజస్వీ శౌంద్యుర్యుడు, శృంగిపుత్రుడు (శౌర్జుడు) వీరిద్దరును చక్కగా వ్రతమాచరించిన వారు. రాణాయనీయుడు, సౌమిత్రియు సామవేద పండితులు. మహాతపస్వియైన శృంగి పుత్రుడు మూడు సంహితలను చెప్పెను. చైలుడు, ప్రాచీన యోగుడు, సురాలుడును సంహితలను చెప్పిరి. పారాశర్యుడైన కౌథుముడు ఆఱు సంహితలను చెప్పెను. ఆ సురాయణుడు, వైశ్యాఖ్యుడును వేదవృద్ధులందు ఆసక్తిగలవారు ప్రాచీన యోగపుత్రుడును బుద్ధిమంతుడు అయినవాడు పతంజలి. కౌధుముని ఆ భేదములు పారాశర్యుని యొక్క ఆఱు (భేదములు) గా చెప్పబడినవి. లాంగలియు శాలిహోత్రుడును చెరియొక యాఱు సంహితలను చెప్పిరి. బాలుకి, కామహాని, జైమిని, లోమగాయి, కుండుడు, కోహలుడు, ఈ ఆఱుగురును లాంగలు. ఈ లాంగలులైన శిష్యులు సంహితలను ప్రసాదించిరి. ఆ తరువాత హిరణ్యనాభునకు శిష్యుడై, మానవ శ్రేష్ఠుడై రాజకుమారుడు ఇరువది నాలుగు సంహితలను చేసెను. ఆ సంహితలు శిష్యులకు చెప్పెను. ఆ శిష్యులను వినుడు. వారు రాడుడు, మహావీర్యుడు, రోదవహడు, వాహనుడును, తాలకుడు, పాండవకుడు, కాలికుడు, రాజికుడు, గౌతముడు, అజబస్తుడు, తఱువాత సోమరాజు వచ్చెను. పృష్ఠఘ్నుడు, పరికృష్ఠుడు, ఉలూఖలకుడు, యవీయసుడు, వైశాలుడు, అంగుళీయుడు, కౌశికుడు, సాలిమంజరి, సత్యుడు, కాపీయుడు, కానికుడు ధర్మాత్ముడైన పారాశరుడు అని క్రాంతులైనవారు సామగులు. సామగులందరిలో శ్రేష్ఠులు ఇద్దరని చెప్పబడిరి. వారు పౌష్యంజియు కృతియును వీరు సంహితల వికల్పకులు. ఓ బ్రాహ్మణులారా! సుమంతుడు అధర్వములను రెండు విధములుగా చేసి కబంధునకు ఇచ్చెను. అతడు గూడ యథా క్రమముగా మొత్తము తెలిసికొనెను. కబంధుడు రెండుగాచేసి ఒకదానిని పథ్యునకు ఇచ్చెను. రెండవదానిని వేదస్పర్శనకు ఇచ్చెను. ఆతడు దానిని నాలుగు విధములుగ చేసెను. వేదస్పర్శనకు దృఢవ్రతలైన నలుగురు శిష్యులు బ్రహ్మబలుడైన మోదుడు, పిప్పలాదుడు, ధర్మజ్ఞుడైన శాక్వాయనియు నాలుగవవాడు తపనుడు అనబడెను. పథ్యులయొక్క ఉత్తమ భేదమును మరల మూడు విధములని తెలిసికొనుము. జాబాలి, కుముదాది, మూడవవాడు శౌనకుడు అనబడెను. శౌనకుడు సంహితను రెండుగాచేసి ఒకదానిని ప్రభువునకు ఇచ్చెను. ధీమంతుడైన శౌనకుడు రెండవదానిని సైంధవాయనుడను పేరుగల వానికి ఇచ్చెను. సైంధవుడు మంజకేశునకు ఇచ్చెను. ఆ సంహిత మరల రెండుగా భిన్నము అయ్యెను. నక్షత్ర కల్పము, వైతానము, మూడవది సంహితావిధి, నాలుగవది అంగిర సంకల్పము, ఐదవది శాంతి కల్పము. ఆధర్వణము శ్రేష్ఠము. ఇవి సంహితలయొక్క వికల్పనములు. ఓ ఋషి సత్తములారా! ఆఱుగాచేసి నాచేత గూడ పురాణము చెప్పబడినది. ఆత్రేయుడు, సుమతి, ధీమంతుడు, కాశ్యపుడు, ఆకృతవ్రణుడు, భారద్వాజుడు, అగ్నివర్ణుడు, వసిష్ఠుడు, మిత్రయుడు, సావర్ణి, సోమదత్తి, సుశర్మ శాంశపాయనుడు అను వీరు నా శిష్యులు, పురాణములలో దృఢవ్రతులు. మూడు సంహితలు మువ్వురిచే మరల మూడుగా చేయబడినవి. కాశ్యపుడు సంహితాకర్త. సావర్ణి శాంశ పాయనుడును (సంహితాకర్తలు). సామికా అనునది నాలుగవ సంహిత. ఆ ఇది పూర్వ సంహిత. ఆ సంహితలన్నియు నాలుగు పాదములుగలవి. అన్నియు ఒకే అర్థమును చెప్పునవి. పాఠాంతరమున వేదశాఖలవలె వేరుగా అయినవి. అన్ని సంహితలును శాంశపాయనిక సంహితను విడిచి నాలుగువేలు. లోమహర్షణికులు మూలములైనవారు. అటు తరువాత వారు కాశ్యపికులు, మూడవవారు సావర్ణికులు యజుర్వాక్యార్థి పండితులు ఇతరులు ప్రేరణార్థముతో అలంకరింపబడిన శాంశ పాయ నులు. వీరి ఋక్కులు ఎనిమిది వేల యాఱువందలు. ఇవియు, మఱిపదియైదును మరి వందయును వాలఖిల్యులు సమాన ప్రైషలు గలవారై ససావర్ణులుగా జెప్పబడిరి. సామవేద గాయకులు ఎనిమిదివేల పదునాలుగు సామములను ఆరణ్యకముగా హోమముతోబాటు గానము చేయుదురు. వ్యాసుడు వికల్పించిన ప్రకారము యజుస్సుల యొక్కయు, బ్రాహ్మణుల యొక్కయు పండ్రెండువేలే కలవు. ఛందము ఆధ్వర్యము అనబడినది. అది సంగ్రామ్యారణ్యక మగును. అట్లే సమంత్ర కరణముగూడ అగును. దీనికి తరువాతి కథలకు పూర్వములు అను విశేషణము ఉండును. సమంత్రమైన గ్రామ్యారణ్యము ఋగ్రాహ్మణము అనబడినది. అట్లే హరిద్రవీయుల యొక్కయు, తైత్తిరీయుల యొక్కయు ఖిలములైనవియు ఉపఖిలములైనవియును పరక్షుద్రములు అనబడినవి.
వాజసనేయ వేదమున ఒక వేయి తొమ్మిది వందలు ఋగ్గణము (ఋక్, గణములు) లెక్కింపబడినది. బ్రాహ్మణము మాత్రము నాలుగింతలు. ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనుబది వాని సంఖ్యకు ఋకు అధికమైనది పాదము. ఇది ఋక్కుల యొక్కయు, యజుస్సుల యొక్కయు ప్రమాణము. అది శుక్ల యజుస్సుతోను అఖిల యాజ్ఞవల్యముతోను కూడినది.
అట్లే చరణ విద్యలయొక్క ప్రమాణము (అయిన) సంహితను వినుము. అందు అఱువేల ఋక్కులు కలవు. మఱియు పదినాల్గుగూడ అధికముగా చెప్పబడినవి. ఈ ఋక్కులకు ఇంతయే అధికము. యజుస్సును ఇష్టము వచ్చినట్లు చెప్పవచ్చును. పదు నొకండు వేలు మఱి పదియైదు పదివేల ఋక్కులు, మూడు వందల ఎనుబదియు, ఒక వేయి మంత్రములు ప్రమాణముగా గలవి. భృగుల విస్తారమంతయు ఇతరమైన ఆధర్విక వేదము చాల ఉన్నది. ఐదువేల ఋక్కులు, ఐదువేలు అధర్వములు అని వాని సంఖ్య. ఇరువదిని విడిచివేయి మరొక్కటిఅని ఋషులు తెలిపిరి. ఇది అంగిరసునిచే చెప్పబడినది. ఇది వారి ఆరణ్యకముఅని ఈ విధముగ (ఋక్కులు) లెక్కింపబడును. అట్లే శాఖా భేదములు కూడగలవు. శాఖల యొక్క కర్తలును, వారిభేదములలో కారణములును సమస్త మన్వంతరము లలో గూడ ఇట్లే ఉండును. శాఖా భేదములు గూడ సమానము.
ప్రాజాపత్యమైన శ్రుతి నిత్యమైనది. ఇవి దాని వికల్పము (భేదము)లు అనబడినవి. దేవతలయొక్క నిత్య భావము వలన మరల మరల మంత్రోత్పత్తి జరిగినది. మన్వంతరముల యొక్కయు, సురలయొక్కయు నామ నిశ్చయము చేయబడినది. ద్వాపరయుగములందు వినబడిన వేదములకు మరల భేదములు కలవు.
ఈ విధముగ భగవద్రూపుడైన ఋషి శ్రేష్ఠుడు వేదమును ఇతర శిష్యులకు ఇచ్చి మరల తపము చేయుటకు వెళ్ళెను. ఆతని శిష్యుల ప్రశిష్యులచేత ఈ శాఖా భేదములు ప్రవర్తింప జేయబడినవి. శిక్షాదులైన ఆయా అంగములు (వేదాంగములు) నాలుగు. వేదములు, మీమాంస, న్యాయము, ధర్మశాస్త్రము, పురాణము ఇవి చతుర్దశ (14) విద్యలు, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము అను ఈ మూడితోపాటు, నాలుగవది అర్థ శాస్త్రము ఇవి అష్టాదశ (18) విద్యలు. మొదటివారు బ్రహ్మర్షులు. వారి నుండి దేవర్షులు వారి నుండి రాజర్షులు, వారి నుండి మూడు ఋషి ప్రకృతులును వచ్చిరి. అని తీక్షవ్రతులైన మునులు తెలియచెప్పిరి. కశ్యప గోత్రము లందును, వసిష్ఠ గోత్రము లందును, భృగు, అంగీరస గోత్రములందును ఈ అయిదు గోత్రములందు బ్రహ్మ వాదులు జన్మింతురు. బ్రహ్మను పొందుదురు కావున బ్రహ్మర్షులు అనబడినారు. ధర్మునకును, పులస్త్యునకును, క్రతువునకును, పలహునకును, ప్రత్యూషు నకును, ప్రభాసునకును, కశ్యపునకును, సుతులు. దేవర్షుల పేర్లతో వారిని గురించి వినుడు. ధర్మపుత్రులైన దేవర్షులు నరనారాయణులు ఇరువురు. క్రతువు యొక్క పుత్రులు వాలఖిల్యులు, పులహునకుపుత్రుడు కర్దముడు, పులస్త్యునకుపుత్రుడు కుబేరుడు, ప్రత్యూషునకు పుత్రుడు అచలుడు. కశ్యపునిపుత్రులు పర్వతుడును నారదుడును అను ఇరువురు. వీరు దేవతలను పొందుదురు కావున దేవర్షులు అనబడినారు. మానవ వంశమునను, వైషయ వంశమునను, ఐల వంశమునను పుట్టిన రాజులు ఐలులనియు, ఐక్ష్వాకులు అనియు నాభాగులనియు చెప్పబడిరి. వారు రాజర్షులు. రంజింప చేయుట వలన ప్రజలు రాజులను పొందుదురు కావున రాజర్షులు అనబడినారు. బ్రహ్మలోకమున సుప్రతిష్ఠితులైన వారందరిని బ్రహ్మర్షులుగా చెప్పుదురు. ఇంద్రలోకమున సుప్రతిష్టితులైన వారిని అందరిని రాజర్షులుగా చెప్పుదురు. వంశముతోను, తపస్సుతోను, మంత్రో చ్చారణములతోను బ్రహ్మర్షులుగా చెప్పబడదు. దివ్యులైన రాజర్షులు దేవర్షులు.
దేవర్షుల యొక్క లక్షణమును చెప్పెదను. భూత, భవిష్యత్, వర్తమాన కాలముల జ్ఞానము, సత్యము పలుకుట అట్లే స్వయముగా జ్ఞానులైనవారును, తపస్సుచే జ్ఞానులైన ప్రసిద్ధులైన వారును, గర్భమునందు ఉండగనే జ్ఞాన ప్రేరణ కలవారును, మంత్రములను పలుకువారును, ఈశ్వర భావమువలన సర్వము తెలిసికొన్నవారును, అను వీరు దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు అగుదురు.
ఈ భావములను అధ్యయనము చేయువారు ఋషులని చెప్పుదురు. వీరు ఏడుగురు. ఏడు గుణములచే సప్తర్షులు అనబడినారు. వీరు దీర్ఘాయుష్కులు, మంత్రకర్తలు, ఈశ్వరులు, దివ్యచక్షువులుగలవారు, జ్ఞానులు, ప్రత్యక్షమైన ధర్మము కలవారు. గోత్ర ప్రవర్తకులు. షట్కర్మలయందు ఆసక్తి గలవారు. (యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహములు-షట్కర్మలు.) నిత్యమును ప్రకాశించువారు, గృహస్థులు. సమానములై కనబడని కర్మహేతువులచే వీరు వ్యవహరించుచుందురు. స్వయంకృతములై మైథునాది గ్రామ్యములుకాని ఆనందములతో వర్తింతురు. వారు కుటుంబము గలవారు. బుద్ధి మంతులు. బాహ్యములోను, అంతరములోను నివసించువారు. వీరు కృతయుగాదు లన్నింటిలోను మరల మరల మొదట వర్ణాశ్రమ వ్యవస్థాపనమును చేయుదురు. త్రేతా యుగమురాగా మరల సప్తర్షులు ఇచట అంతటను ఈ బ్రాహ్మణాది వర్గములను బ్రహ్మ చర్యాది ఆశ్రమములను ప్రవర్తింపజేయుదురు. వారియొక్క వంశమునందే మరల మరల వీరలు పుట్టుదురు. పుత్రుడు కలుగుచుండగా తండ్రియు, తండ్రి ఉండగా తన పుత్రుడును ఈ విధముగా నొక్కచోచేరి (వంశపారంపర్యము) ఎడతెగకుండా, యుగాంతము వరకును ఈ సప్తర్షులు ప్రవర్తింపచేయుదురు. గృహమేధులగు వీరు ఎనుబది ఎనిమిది వేలు అని చెప్పబడిరి. సూర్యునకు దక్షిణమున ఉన్నవారు పితృయాణమును సమాశ్రయింతురు. భార్యతో సహా అగ్నిహోత్రము చేయువారై (పితృ దేవతలై) సంతాన హేతువులు అనబడి నారు. గృహమేధుల సంఖ్యలతో లెక్కింపబడినవారై శ్మశానములను ఆశ్రయించిన వారు ఎనుబది ఎనిమిది వేలు. ఉత్తరాయణమునందు ఉంచబడుదురు. స్వర్గమును పొందిన ఊర్ధ్వ రేతస్కులైన ఋషులు మంత్ర బ్రాహ్మణకర్తలై యుగాంతమున జన్మింతురు.
ఈ విధముగా ద్వాపర యుగమున కల్పముల, భాష్య విద్యల, శాస్త్రకారుల నాశనము జరుగగా ఆ ఋషులు మరల మరల పరిభ్రమించుచుందురు. రాబోవు ద్వాపరమున ద్రోణి ద్వైపాయను (వ్యాసుడు అయ్యెను. గడచిన ద్వాపరమున చక్కని గొప్ప తపస్సుగల వేదవ్యాసుడు వ్యాసుడు అగును. భవిష్యత్కాలములందు శాఖాప్రణయానము (శాఖలను చేర్చుట) జరుగగలదు. తపస్సుచే కర్మ పొందబడినది. కర్మచేత కీర్తి పొందబడినది. కీర్తిచేత సత్యమును పొందబడును. సత్యముచేత అవ్యయుడు (నాశము లేనివాడు) పొందబడును. అవ్యయమువలన అమృతమును, అమృతమువలన సమస్తమును పొందును. ఇది ధ్రువమైన (స్థిరము) ఏకాక్షరము స్వాత్మయందే నిలచి ఉన్నది. అది బృహత్తైనందునను (విశాలమైనందునను) బృంహణమైనందునను (విజృంభించినది, వ్యాపించునది అగుట చేతను) బ్రహ్మ అనబడుచున్నది.
మరల అది ప్రణవమునందు (ఓంకారమునందు) ఉండినదై భూర్భువస్వ అనువ్యా హృతుల రూపమున ఉండును. ఋగ్, యజు, స్సామ రూపియైన బ్రహ్మకు అనగా వేదమునకు నమస్కారము. జగత్తు యొక్క ప్రళయ ఉత్పత్తులందు కారణమని గుర్తింపబడినదియు మహత్తు కంటె పరమైనదియు, రహస్యమైనదియునైన ఆ సుబ్రహ్మకు నమ స్కారము. అగాధమై అపరమై అక్షయ్యుడును, జగత్తును సమ్మోహింప జేయుటకు నిలయమైనవాడును ప్రకాశ ప్రవృత్తులతో పురుషార్థముల ప్రయోజనము గలవాడునైన ఆ సుబ్రహ్మకు నమస్కారము. దేహ విలక్షణమైన ఆత్మజ్ఞానము గలవారికి ఒక ఉనికి రూపమైన ప్రాప్తిస్థానము, ఆత్మకు సంగమును ఇచ్చునదియు అవ్యక్తమైనదియు, అమృతమైనదియు, శాశ్వతమైనది ప్రకృతి బ్రహ్మ. అది ప్రధానము, ఆత్మయోని, గుహ్యము, సత్త్వమని పిలువబడును. అట్లే విభాగములేనిది, శుక్ర స్వరూపము, అక్షరము, బహు వాచకమును (అనేకమును చెప్పునది) నైన ఆపరబ్రహ్మకు నిత్యము నమస్కారములు చేయుదును. పని చేయబడగా క్రియ ఉండదు. చేయనప్పుడు కూడ క్రియ ఉండదు. (చేయని క్రియ ఉండదు). క్రియ భూతకాలమై నప్పుడు వర్తమానమున క్రియ ఉండదు. అట్లే క్రియ భవిష్యమైనప్పుడు కూడ వర్తమానమున ఉండదు. ఒక్కమారే అంతయు చేయబడినది. కావున అది భూతకాల దృష్టితో కృతము భవిష్యత్కాల దృష్టితో అకృతమును అగుచున్నది. వినదగినది (భవిష్యత్)గాని, వినబడినది (భూతము) గాని, అట్లే సాధువుగాని, తెలియదగినదిగాని, మననము చేయతగినదిగాని, తాకతగినదిగాని, భుజింపతగినదిగాని, చూడతగినదిగాని, వినతగినదిగాని, తెలియతగినదిగాని యేదైన ఉండినచో ఆ బ్రహ్మర్షుల జ్ఞానము మాత్రమే. చూపబడిన ఆజ్ఞానమును మరల ఎవ్వడు వెదకును? భగవంతుడైన వాడే పుం-స్త్రీ వస్తు రూపమైన (అన్నింటిని అందరిని) చెప్పెను. ఒకదానిచే ఒకపని చేయబడినపుడు దానినివాడు అభిమానించును. ఒకనిచే పూర్వము చేయబడినది మరొకనిచే భావింపబడును. ఒకానొకచోట ఒకనిచే ఒక వాఙ్మయము రచింపబడినపుడు పూర్వము అది ఆతనిచేత చేయబడి ఉండినదై, ఆ కర్తకు సంబంధించినదిగానే ప్రకాశించును. విరక్తమును, అవిరక్తమును, జ్ఞానాజ్ఞానములును, ప్రియాప్రియములును, ధర్మాధర్మములును, సుఖ దుఃఖములును, మృత్యువు అమృతమును, పైన అడ్డము, క్రిందయును అతనికో సంబంధించిన అదృష్టమే (కనబడనిది) కారణముగా కలది అగును.
స్వయంభువుడును, జ్యేష్ఠుడును, పరమేష్ఠియునైన బ్రహ్మ (స్వాయంభువ బ్రహ్మకు) ఇచట త్రేతాయుగమున మరల మరల ప్రత్యేక విద్యకలది కలుగును. ఆ ఏక విద్యగలది ద్వాపరయుగమున మరల మరల వేర్వేరు చేయబడును. ఈ విషయమును వైవస్వత మన్వంతరమున బ్రహ్మకూడ చెప్పెను. ఆయా పేర్లుగల యుగములలో మరల మరల తిరుగుచు పుట్టుచున్నవారై, వీరిచే పరస్పరముగా సంహితలను చేయుదురు. బ్రహ్మర్షుల సంహితలు ఎనుబది ఎనిమిది వేలు. వీరు (బ్రహ్మర్షులు) ఆ సంహితలనే మరల మరల త్రిప్పి ప్రవర్తింప జేయుదురు. దక్షిణ మార్గమును ఆశ్రయించి శ్మశానములను పొందినవారు యుగయుగమున మరల ఆ వేద శాఖలను వేరు వేరుచేసి ప్రవర్తింప చేయుదురు. ద్వాపర యుగమందువలె అన్ని యుగములందును బ్రహ్మర్షులచే సంహితలు ప్రవర్తింప చేయబడును. వారి గోత్రములలో ఈ శాఖలు మరలమరల ప్రవర్తిల్లును. ఆశాఖలును వాని కర్తలును యుగక్షయము వఱకు ఉందురు. భూత భవిష్యములగు మన్వంతరములలో గూడ ఈ విధముగనే శాఖా ప్రణయనములు (శాఖల ప్రవర్తనలు) జరుగును. భూత కాలములలో గడచినవి, వర్తమాన కాలములలో ప్రవర్తిల్లు చుండును. భవిష్యత్కాలములలో గూడ కలుగబోవునవి వర్ణింపబడును. పూర్వముతో (భూతకాలముతో) పశ్చిమమును (భవిష్యమును) వర్తమానముతో భూత భవిష్యములు రెంటిని తెలియవలెను. ఈ క్రమ యోగముతో మన్వంతరములు నిశ్చయము జరుగును. ఈ విధముగ దేవతలు, పితృ దేవతలు, ఋషులు మంత్రములతోబాటు పై లోకమునకు వెళ్ళుదురు. ఆ మంత్రములతో బాటే తిరిగివత్తురు. పశుకల్పమైన జనలోకము నుండి దేవతలందరును ఊర్ధ్వ లోకమునకు పోవుదురు. తిరిగి వత్తురు. కాని సమాప్తి కాలము వచ్చినప్పుడు వారెవ్వరికిని జన్మింపరు. అపుడు వారు తప్పనిసరిగా కలుగబోవు ఒక విషయముతో సంబంధింపబడి ఉందురు. అందువలన వారు దోషములతో కూడిన జన్మను రాగ పూర్వకముగ చూతురు. అపుడు వారి ప్రవృత్తి జన్మదోష దర్శనమగు నంతవరకు మరలును. ఈ విధముగ ఇచ్చట పదిదేవ యుగములను చేసి (వారివృత్తి) మరలును. వారు జనలోకము నందు ఉండి తపోలోకమును తిరుగులేక చేరుదురు. ఈ విధముగ ఇట వేలకొలది దేవయుగములు గడచిపోవును. యుగములు మునులతో పాటు బ్రహ్మలోకమున నిధనమును (మృత్యువును) పొందును. వాని విస్తరములను అనుపూర్వికముగా చెప్పశక్యము గాదు. కాలము అనాది అగుటయు, అంతటను లెక్కింప అలవి గాకుండుటయు దానికి కారణము. ఇట్లు పురాకల్పములతోబాటు మన్వంతరములు గడచి పోయినవి. పితృదేవతలతోను, మునులతోను, దేవతలతోను, సప్తర్షులతోనుగూడ కాలముతో ప్రతిసృష్టములైన యుగముల నివర్తనము జరుగును. ఈ క్రమయోగముతో ప్రజలతోగూడిన కల్ప మన్వంతరములు నూర్లకొలది, వేలకొలది గడచిపోయినవి. మన్వంతరముల చివర దేవతల యొక్కయు, ఋషుల యొక్కయు, మనువు యొక్కయు, పితృగణము యొక్కయు సంహారము జరుగును. ఆ సంహారము చివరవారి పుట్టుకయు జరుగును. సృష్టియొక్కగాని, సంహారముయొక్కగాని అన్ని విధముల విస్తరమును ఆను పూర్వితో నూరేండ్లలోగూడ చెప్పుట సాధ్యముగాదు. మానుష రీతిలో మన్వంతర సంఖ్యను చెప్పెద వినుడు.
దేవతలను, ఋషులను లెక్కించుటలో, నిష్ణాతులైన బ్రాహ్మణులు ఆ సంఖ్యలు నిండు ముప్పదికోట్లుగా లెక్కించిరి. అట్లే తక్కినవి లెక్కలో అఱువది ఏడు లక్షల ఇరువది వేలు. ఈ కాలము అధికములను విడిచి లెక్కింపబడినది. ఈ మన్వంతర సంఖ్య మానుష గణనలో చెప్పబడినది. దివ్యవత్సరముతో మనువు యొక్క అంతరమును చెప్పెదను. దివ్యసంఖ్యలో ఎనిమిది వందలు అని చెప్పబడినది. అట్లే తక్కినవి ఏబది రెండువేలు అధికములు. ఈ కాలము నాలుగింతలైనచో అది ఆ భూత సంప్లవము. (భూతముల ప్రళయము). అది నిండుగా వేయి యుగములు అగును. అది బ్రహ్మకు ఒక దినము. అధిభూత సంప్లవమున సూర్య కిరణములతో అన్ని భూతములు కాలిపోయినవై బ్రహ్మను ముందిడుకొని దేవ, ఋషి, దానవులతో పాటు, దేవశ్రేష్ఠుడు దేవదేవుడు అయిన మహేశ్వరునిలో ప్రవేశించును. అతడు (మహేశ్వరుడు) కల్పాదులలో, మరల మరల సర్వ భూతములను సృష్టించువాడు. అని ఇది దేవర్షులతో బాటు మనువు యొక్క స్థితి కాలము. సర్వ మన్వంతరముల త్రిసంధిని వినుడు. ఈ విషయమున నాచే యుగమను పేరుతో పూర్వమే చెప్పబడినది. కృత త్రేతాదులతో కూడినది చతుర్యుగము అనబడినది. అది ఇరువదియొక్క మారులు తిరుగుతు వచ్చినది. సాధికము ప్రభువైన భగవంతుడు (దీనిని) మనువుయొక్క అధికారముగా చెప్పెను. ఈ విధముగా భూత, భవిష్యత్తులైన మన్వంతరముల లక్షణము వర్తమానముతో చెప్పబడిన ఇది స్వాయంభువ మనువుయొక్క సృష్టి, దానియొక్కయు, వేరొకదాని త్రిసంధిని చెప్పెదను. మన్వంతరము యథాపూర్వము గనే ఋషులతోను, దేవతలతోను గూడ అవశ్యంభావి (తప్పని సరిగా జరుగు) విషయముతో సంబద్ధమై నివర్తించును. ఈ మన్వంతరమున పూర్వము త్రైలోక్యమునకు ఈశ్వరులైన సప్తర్షులు, దేవతలు, పితరులు, మనువులును మన్వంతర కాలము సంపూర్ణముగా గానే సాధకులును, క్షీణాధికారులై ఆత్మయొక్క ప్రతిరూపమును తెలిసినవారై; వారు అందరును మహర్లోకమునకు ఉన్ముఖులై గమనమునకు పూనుకొందురు. తఱువాత ఆమన్వంతరమున ప్రక్షీణులైన అదేవతలు స్థితికాలము సంపూర్ణముగా ఒక కృతయుగము (వరకు) ఉందురు. మన్వంతరేశ్వరులు ఉన్నంతవరకు దేవతలు, పితరులు, ఋషులు మనువును పుట్టుచుందురు. పుట్టబోవుచుందురు మన్వంతరము సంపూర్ణమైనప్పుడు మఱొక కలియుగము వచ్చినచో (చివర కలియుగము ఏర్పడినచో) అప్పుడు కలితో మిగిలియున్న (కలి శేషించియున్న) యుగములో (చివరి కలియుగములో) కృతయుగ (లక్షణ)ము సంపన్నమగును. బుధులు కృతయుగము యొక్క సంతానమును కలి పూర్వకముగా (కలియుగము తనకు పూర్వయుగమైనట్లుగా చెప్పుదురు. అట్లే మన్వంతరముల చివరలలో (కలి ఉన్నదై రానున్న మన్వంతరములకు ఆదియగును పూర్వ మన్వంతరము క్షీణించి మరొకమన్వంతరము రాగా పూర్వమన్వంతరపు చివరి కలియుగమున మిగిలియున్న సప్తర్షులు, మునులు మన్వంతర సమాప్తి కాలమును చూచుచున్నవారై మరొక మన్వంత రమునకై ప్రతీక్షించుచు తపస్సులో ఉండి క్షీణింతురు. మరొక మన్వంతర ప్రారంభమున మన్వంతర వ్యవస్థ కొఱకును అంతట సంతతికొఱకును పూర్వమువలెనే (పూర్వయుగములో వలెనే) సృష్టిలో ప్రవర్తింతురు. వృష్టి, సృష్టి ప్రవర్తింపగా, జంటలు సృష్టింపబడగా, ఓషధులు పుట్టగా, అచ్చటచట ప్రజలు వారి గృహములను నెలకొల్పుకొనగా, జీవనోపాయములు ఏర్పడగా, ఋషులు భావించిన సద్ధర్మములు ప్రవర్తిల్లినవి. అంతకు ముందు లోకము నిరానందమై పోయినది. స్థావర జంగమములు నష్టమైనవి. గ్రామ నగరములు లేవు. వర్ణాశ్రమములు వదిలివేయబడినవి. ఇట్టి పూర్వ మన్వంతరము శేషించినపుడు (చివర ఉన్నపుడు) ఉన్నటువంటి ధార్మికులు, సప్తర్షులు, మనువును సంతానార్థముగా నెలకొని ఉండిరి. సంతానమునకై మిక్కిలి సాధ్యమైన తపము నాచరించు వారందరికిని మరణములందు ఇట అంతటను దేవాసురులు, పితృగణములు, మునులు, మనువులు, అట్లే సర్పములు, భూతములు, పిశాచములు, గంధర్వులు, యక్షులు, రాక్షసులును పుట్టుదురు. తరువాత వారికి, మిగిలిన శిష్టులు శిష్టాచారములను చెప్పుదురు. మన్వంతరము యొక్క ప్రారంభమున సప్తర్షులు మనువును కర్మలను ఆరంభింతురు. మనుష్యులు దేవతలతోబాటు కర్మలు చేయుదురు. మన్వంతరాదిలో ముందే త్రేతాయుగ ప్రారంభమున మొదట దేవతలు, తరువాత మనుష్యులును అన్ని విధముల ధర్మములును ఉండినవి-బ్రహ్మచర్యము (వేదాధ్యయనము)చే ఋషుల ఋణమును తీర్చుచుండిరి. సంతానముతో పితరుల ఋణమును తీర్చుచూ ఉండిరి. యాగముతో దేవతల ఋణమును తీర్చుచుండిరి. పూర్వము స్వర్గము కొరకు ప్రముఖులైన దేవతలలోను, మనుష్యులలోను ముందు దేవతలును, తరువాత మనుష్యులును ధర్మముతోనే అంతటను ఉండిరి. మన్వంతరము తిరిగిపోగా వారు అంతటను స్థానములను వదిలి, మంత్రములతో గూడ ఆరోగ్యవంతమైన ఊర్థ్వలోకమైన మహర్లోకమునకు పోవుదురు. వికారములు పోయిన వారై వారు మానససిద్ధియందున్నవారై, ముందును ఎదిరి చూచుచున్నవారై, తమ ఇంద్రియములను తమను వశమునందు ఉంచుకొన్నవారై వారు భూత ప్రళయము వరకు ఉంటున్నారు.
తరువాత ఆ యుగములు గడచిపోగా, వానిలోని వారందరును గడచిపోగా, త్రైలోక్యమున అంతటను ఆ దేవస్థానములు శూన్యములు కాగా, స్వర్గవాసులైన దేవతలు ఇతరులును ఇచటనే అనగా భూలోకమునను ఉన్నారు. తరువాత వారు తపస్సుతో కూడినవారై సత్యముతోను, బ్రహ్మచర్యముతోను, వేదముతోను కూడినవారై ఆ స్థానములను పూరింతురు. పూర్వులైన సప్తర్షులకును, మనువునకును, పితరులతో బాటు దేవతలకును భూతకాలముచేతను భవిష్యత్కాలముచేతను ఇచ్చట మరణములు గలుగును. మన్వంతర క్షయమువలన వారికి ఇచ్చట మరణము కలుగును. ఈ విధముగ పూర్వమును అనుసరించిన వానియొక్క స్థితి స్థిరమైనది కాదు. ఇది అన్ని మన్వంతరములలోను భూతప్రళయము వరకు ఉండును. ఈ విధముగా స్వాయంభువమనువుచేత భూత భవిష్యత్కాలములలోని మన్వంతరముల ప్రతిసంధాన (కలయిక) లక్షణము చెప్పబడినది. మన్వం తరములు గడచిపోవగనే భవిష్య మన్వంతరములకు సాధనము (రప్పించు సాధనము) భూత ప్రళయము వరకు పూర్తిగా విచ్చిన్నమయి ఉండును. మన్వంతరముల పరివర్తన ములు (మార్పులు), ఏకాంతముగా (రహస్యముగా), మహర్గతములు అగును అనగా మహాలోకమున నుండును. మహస్సు (మహాలోకమును), జననము (జనోలోకము), తపస్సును (తపోలోకమును) సత్యమున (సత్య లోకమున) ఏకాంతముగ చేరి ఉండును. ఏడు లోకములు పూర్వపూర్వములు ఉత్తరోత్తర లోకములలో ఏకాంతముగ ఉండును. వానిని అనగా లోకములను భావించువారు వానిని అచట చూచుట చేతను, నానాత్వము చేత చూడబడిన జ్ఞానము మన్వాది సృష్టి ప్రతిసర్గ కాలమున వికారము ప్రాప్తింపగా ఆలోకములు, అపుడు సత్యలోకమునందు ఉండును. పరాంత కాలమున మన్వంతర పరివర్తన ములు సత్య(లోక)మును వదిలివేయును. తరువాత అభియోగము వలన విషమ ప్రమాణుడైన నారాయణదేవునిలోనే ప్రవేశించును. విధిస్వభావము వలన మన్వంతర పరివర్తనములు చాలకాలమునకు ప్రవర్తిల్లగా జీవలోకము క్షయ అభివృద్ధులతో తిరుగుచు క్షణకాలము ఆనందముగా ఉండును. అనుఇవి ఋషులచేస్తుతింపబడిన ధర్మాత్ములై దివ్య దృష్టి గల మనువులయొక్క సమాధానములు. వాయుదేవునిచే విస్తార సంగ్రహములుగా రచింపబడిన ఈ సమాధానములు దివ్య తేజస్సుతో చూడదగినవి. అవి అన్నియు యుగములు రాజర్షులతోను, దేవర్షులతోను, బ్రహ్మర్షులతోను, దేవతలతోను, ఉరగులతోను ఇంద్రుని చేతను, సప్తర్షులచేతను, పితృదేవతల చేతను, రాజుల చేతను కూడినవి. చక్కని పరివర్తనములు గలవి. ఇది (వాయు పురాణము) గొప్ప వంశము, కులము, కాంతియు కలవారును, గొప్పనైన మేధాశక్తితో వృద్ధిచెందినవారును, కీర్తి, కాంతి, ఖ్యాతులతోగూడిన వారును ఈశ్వరుల (ప్రభువుల) యొక్కయు ప్రవచనము పుణ్యమైనది గదా! ఇది స్వర్గమును ఇచ్చును. పవిత్రమైనది, పుత్రులను ఇచ్చునది. మిక్కిలి పరబ్రహ్మమే రహస్యములుగా గలది. మహాపర్వము లలో జపించదగినది శ్రేష్ఠమైనది. దుఃస్వప్న శాంతి కమైనది. పరమాయుష్యము ఇచ్చునది. రాజులు, దేవర్షులు, మనువు ప్రధానముగా కలిగి ప్రసిద్ధమైన బ్రహ్మయొక్క పుణ్య ప్రసూతిని అనగా సృష్టిని ఈ వాయు పురాణము చెప్పినది. దీని ప్రవచన వ్రతమునకై నాయొక్క సిద్ధిరూప మైన చక్కని మహేశ్వరతత్త్వమును ఓ మునులారా! మీరు పొందుడు. అని ఈ విధముగ ఆనుపూర్వితో విస్తరముగ స్వాయం భువ మన్వంతరమును చెప్పితిని. ఇకముందు నేనేమి చెప్పవలెను?
ఇది శ్రీమద్వాయుపురాణమున పూర్వార్థము సమాప్తము
ఓం గణేశాయ నమ:
ఓం నమో భగవతే వాసుదేవాయ