వాయు మహా పురాణము
సృష్టి వర్ణనము
ఋషులు ఇట్లు అనిరి:
ఓ సూత! మనువులతోడి ప్రజలయొక్కయు, ఋషులతోడి దేవతలయొక్కయు మిక్కిలి గొప్పనైన అఖ్యానమును నీవు చెప్పితివి. పితృ - గంధర్వ - భూతముల యొక్కయు, పిశాచ - ఉరగ రక్షసుల యొక్కయు, దైత్యుల యొక్కయు, దానవుల యొక్కయు, యక్షుల యొక్కయు, పక్షుల యొక్కయు కర్మలను, విధితో కూడిన ధర్మ నిశ్చయమును, విచిత్రములైన కథాయోగములను, శ్రేష్ఠమై ఉత్తమోత్తమమైన జన్మమును భూతములు పుట్టునంతవరకు మీరు చక్కని వాక్కులతో చెప్పగా చెవులద్వారా మా మనస్సు విని సంతసించినది. ఈ విధముగా ఆ మహర్షులు అందరును సూతుని ఆరాధించి సత్కరించి నమస్కరించినవారై పునః సృష్టి ప్రవర్తిల్లిన విధమును అడిగిరి. ఓ మహాప్రాజ్ఞుడవైన సూతా! బంధములు పూర్తి లయము చెందగా, సత్త్వ రజస్తమో గుణముల సామ్యావస్థ కేవల తమోమయముకాగా, వికారములు సృష్టింపబడకుండగా, అవ్యక్తము (ప్రకృతి) ఆత్మయందు ఉండగా, బ్రహ్మసృష్టికై ప్రవర్తిల్లకుండగా, అపుడు మహాసాయుజ్యమును (బ్రహ్మతో సహా యోగమును) పొందిన వారిచే సృష్టి ఎట్లు జరిగినది? దానిని అడుగుచున్న మాకు చెప్పుము. ఇట్లనగనే లోమ హర్షణ పుత్రుడు సూతుడు అపుడు పునః సృష్టి ప్రవర్తిల్లిన విధమును వ్యాఖ్యానించుటకు ప్రారంభించెను.
సూతుడు ఇట్లు అనెను:
సృష్టి ఎట్లు జరుగునో నేను మీకు చెప్పెదను. అది పూర్వము వలెనే జరుగునని తెలియవలెను. దానిని సంగ్రహముగా వినుడు. దృష్టమైన దానినిగాని, అనుమానమైన దానినిగాని (అనుమాన ప్రమాణముచే తెలియదగిన దానినిగాని) యుక్తితో అర్థనిర్ణయము చేసి చెప్పెదను. కావుననే వాక్కులు ఆ బ్రహ్మను పొందలేక మనస్సుతో సహా మరలివచ్చును. (బ్రహ్మతత్త్వము శాబ్దప్రత్యక్షమున కతీతము). అది అవ్యక్తమువలె (వ్యక్తముగాని ప్రకృతి వలె) ఇంద్రియ ప్రత్యక్షమునకు అతీతముగాగల అది తెలియరానిది. గుణసామ్యము (సత్త్వ, రజస్, తమో గుణముల సామ్యావస్థ) వికారములతో చెదరిపోగా, ప్రధానము (ప్రకృతి) పురుషుల సాధర్మ్యముతోనే ఉండును. ఎల్లప్పుడును, ప్రాణుల యొక్క ధర్మా ధర్మములు అవ్యక్తమైన ప్రకృతి యందు లీనములగును. సత్త్వమాత్రాత్మకమైన ధర్మము ప్రకృతి గుణమైన సత్త్వమునందు నిలిచి ఉండును. తమోమాత్రాత్మకమైన ధర్మము ప్రకృతి గుణమైన తమమునందు నిలచి ఉండును. గుణసామ్య స్థితిలో ఈ రెండును విభాగము లేకయే ఉండును. ప్రధానముయొక్క (ప్రకృతియొక్క) సమస్త కార్యమునందును బుద్ధి పూర్వకముగనే ప్రవర్తిల్లును, క్షేత్రజ్ఞుడైన పురుషుడు అబుద్ధి పూర్వకముగనే అ గుణములను అధిష్ఠించును. ఈ విధముగా అపుడు ఆ గుణములను అభిమానముతో ఎదుట పొందును. క్షేత్రక్షేత్రజ్ఞులు ఇరువురు ప్రవర్తిల్లవలసినపుడు, వారు ఇరువురును కలసియే భోజ్య భోక్తృత్వ సంబంధమును పొందుదురు. కావున గుణసామ్యమున ఉండి అవ్యక్తము (ప్రకృతి) గుణాత్మకములకు శరణమగును. అదే అవ్యక్తము క్షేత్రజ్ఞాధిష్ఠితమై గుణవైషమ్యమును పొందును. (వికృతియగును). తరువాత క్షేత్రక్షేత్రజ్ఞులు ఇరువురిని వ్యక్త రూపమును (వికృతి రూపమును) పొందును. క్షేత్రజ్ఞాధిష్ఠితమైన ప్రకృతిలో సత్త్వము వికారమును కలుగ చేయును. ఇరువదినాలుగు గుణములతో ఉన్న మహదాద్యమై విశేషాంతమైనది. క్షేత్రజ్ఞుడైన పురుషునకును ప్రధానమునకును సంబంధించినది అగును. అతడు బ్రహ్మాండమున ప్రథముడు మరల ఈశ్వరుడును కాగలడు. తరువాత జ్ఞేయమైన సమస్తమునకును సర్వభూతపతి శివుడు అగును. సర్వముక్తులకు ఈశ్వరుడును బ్రహ్మమయుడైన మహా బ్రహ్మయు అయిన ఆదిదేవుడు ప్రధానము యొక్క అనుగ్రహమునకై వచ్చుదురు. వారిద్దరును అనాద్యులు, స్వయంభువులు, సూక్ష్ములును, అనాది సంయోగముతో కూడిన వారును, సర్వక్షేత్రజ్ఞునినే అబుద్ధిపూర్వకముగా కలిసినవారును, శ్రేష్ఠులైన మశకులును, అప్రత్యయమును అనాద్యమును అయిన ఉదకమున ఉన్నవారును అగుదురు. ముందుగా పూర్వము పునఃసృష్టి ప్రవర్తిల్లగనే ఇది అంతయు జరుగును. అజ్ఞులు గుణములచే రజఃసత్త్వ గుణాత్మకమున ప్రవర్తింతురు. రజోగుణముల యొక్క ప్రవృత్తి కాలమున మనుష్యులు తమ పతులతో (రాజులతో) అభిన్న మహత్వ భూతాది విశేష్యతను పొందుదురు. గుణావ సానమున విశేషతను ఇంద్రియతను పొందుదురు. అతని యొక్క సత్యమును అభిధ్యానించు వారు సన్నిమిత్తకముగా ధ్యానించువారు. రజస్, సత్త్వ, తమోగుణములు వ్యక్తములు. పరస్పరముగా అవి విధర్మములు కలవి. క్షేత్ర తజ్ జ్ఞులు ఆద్యంత్యములలో అన్ని విధములుగా వచ్చి చేరుదురు. అభిమానులు సంసిద్ధమైన కార్యమును చేయువారై జన్మింతురు. అన్ని సత్త్వములును అవ్యక్తమునకున్న పూర్వమే తెలియబడును. ప్రకృతి వానిని ప్రసవించును. అవి సాధికములు అసాధికములును. స్థాన ప్రకరణములతో సంసారములో దొరలుచున్నవై కార్యములను పొందును. మరల మరల పుట్టును. గుణ మాత్రాత్మకులు ఈ లోకమున అన్యోన్యము వరముతోను అనుగ్రహముతోను పరస్పరముగా ధర్మా ధర్మములను ఆరంభింతురు. అందరును సమానులు సృష్టి కొరకై ఆ సృష్టి మొదట వికారమును చెందుదురు. గుణములు వారివెంట పరుగిడును. కావున అది అతనికి రుచించును. అవి గుణములు, అవి అన్నియు దృష్టికి పూర్వమే పొందబడినవి. అవియే మరల మరల సృష్టింపబడుచున్నవై పొందబడును. హింసా, హింసలును, మృదు - క్రూరములును, ధర్మా ధర్మములును, ఋత - అనృతములును తద్భావనతో భావింపబడినవై ప్రాప్తించును. కావున అది దానికి (అతనికి) రుచించును. మహాభూతములలోను, ఇంద్రియార్థములు అయిన మూర్తులలో నానాత్వము; భూతముల యొక్క విప్రయోగములు (వేరుపాటులును) గుణముల వల్లనే ప్రవర్తిల్లును అని ఈ పునః సృష్టి సంగ్రహముగా చెప్పబడినది. ఇక బ్రహ్మయొక్క పుట్టుకను సంగ్రహముగనే చెప్పెదను.
నిత్యమై సదసదాత్మకమైన అవ్యక్త కారణము వలన (ప్రకృతి లేక ప్రధాన కారణము వలన) ప్రధాన - పురుషుల వలన మహేశ్వరుడు పుట్టును. అతడు మరల సంభావింప చేయువాడై బ్రహ్మఅను పేరుగల వాడగును. అభిమాన గుణాత్మకములైన లోకములను మరల సృజించును. మహత్తునుండి అహంకారము పుట్టును. అహంకారాత్మ నుండి భూతములు పుట్టును. భూతములును ఇంద్రియములును ఒకే మారు పుట్టును. భూతముల నుండి భూత భేదములు పుట్టును. ఈ విధముగ సర్గము (సృష్టి) ప్రవర్తిల్లును. వానియొక్క విస్తార అవయవరూపము నా ప్రజ్ఞను అనుసరించియు, నేను విన్నట్లును, పూర్వము ఉన్నట్లును చెప్పబడినది. దానిని అట్లే విని ధరించుడు” అని చెప్పగా
నైమిశారణ్యవాసులైన ఋషులు ఈ లోకోత్పత్తిని, లోకస్థితిని, లోకనాశమును విని అపుడు ఆ సత్ర యాగమున అవబృథస్నానము ఆచరించి, శుద్ధులై పుణ్యలోకమును పొందిరి. మీరు వేద విధిని అనుసరించి దేవతాదులను యజ్ఞముజేసి పూజించి, అవబృథ స్నానముచేసి శుద్ధులైనట్లే ఆయుష్యాంతమున దేహములను వదలి, మీ కృతమునకు ప్రయోజనములైన (ఫలములైన) పుణ్యలోకములను స్వేచ్ఛగా పొందుడు. నైమిశారణ్య వాసులైన వారు యజ్ఞము చేసి ప్రజాసృష్టి చేసి సత్రయాగమునందు ఉన్నవారై అందరును అవబృథ స్నానము చేసినవారై స్వర్గమును పొందిరి. ఓ బ్రాహ్మణోత్తములారా! మీరు గూడ బహు విధములైన యజ్ఞములను చేసి, ఆయుష్యము యొక్క అంతమున స్వర్గమునకు పోవువారగుడు. ప్రథమ పాదమున ప్రక్రియా పాదము అందు కథావస్తు పరిగ్రహము జరిగినది. అనుషంగ పాదము, ఉపోద్ఘాత పాదము, ఉపసంహార పాదము అని నాలుగు పాదములు. ఈ విధముగ ఈ పురాణము నాలుగు పాదములు గలదై లోక సమ్మతమైనది. లోకహితమునందు ఆసక్తిగల సాక్షాత్ భగవంతుడైన వాయుదేవుడు దీనిని చెప్పెను. ఓ మునిసత్తములారా! ఆ వాయుదేవుడు నైమిశారణ్యమున సత్రయాగమునకు వచ్చి మునులకు ఈ పురాణమును చెప్పెను. అతని అనుగ్రహమున నిస్సందేహముగా, భూతముల ఉత్పత్తి (స్థితి) లయములను ఈశ్వరునిచే చేయింపబడిన ప్రాధావిక సృష్టిని బాగుగా తెలిసిన మేధావి అజ్ఞానమును పొందడు. ఈ బ్రహ్మయొక్క పురాతనమైన ఇతిహాసమును విన్న వాడును వినిపించినవాడును చదివించినవాడును అయిన విద్యాంసుడు, మహేంద్రుని స్థానములలో శాశ్వతములైన, సంవత్సరముల వరకు సంతోషించును. బ్రహ్మ సాయుజ్యమును పొందినవాడై బ్రహ్మతోపాటు ముక్తినందును. ప్రజలకు ఈశులై మహాత్ములై కీర్తిమంతులైన ఆ పృథివీపతుల కీర్తిని వ్యాపింపచేయుచు బ్రహ్మత్వము నందును. బ్రహ్మవాదియైన కృష్ణద్వైపాయనునిచే నీ ధన్యమును, యశస్యమును (కీర్తినిచ్చున దైన) ఆయుష్యమును ఇచ్చునదియు, పుణ్యమును, వేదములచే సమ్మతమైన ఈ పురాణము చెప్పబడినది. విశాలమైన ధనము తేజస్సును గలిగిన దేవతల యొక్క ఋషుల యొక్కయు మన్వంతరేశ్వరుల యొక్కయు కీర్తిని వ్యాపింపచేయువాడు సర్వపాపముల నుండి విముక్తుడై మహాపుణ్యమును పొందును. దీనిని ఎల్లప్పుడు ప్రతిపర్వమున వినిపించువాడు పాపప్రక్షాళనము జరిగి, స్వర్గమును జయించి బ్రహ్మత్వము నందుటకు సమర్థుడగును. దీనిని శ్రాద్ధమున భోక్తలగు బ్రాహ్మణులకు ఒక పాదము చివరివరకు వినిపించినవాడు పితరులకు సర్వ కామీయమైన అక్షయ స్థానమును సంపాదించిపెట్టగలడు. పూర్వము దీనిని చెప్పిరి దీని ఆధారముగా జీవించిరి కావున (పురా అనంతీతి పురాణమ్) పురాణము అనబడినది. ఈ పురాణ నిరుక్తమును తెలిసినవాడు సర్వపాపములనుండి విముక్తుడగును. అట్లే మూడు వర్ణముల వారు. (ఈ ఇతిహాసమును విని ముఖ్యముగా దర్మబద్ధులైన మానవులు) వారి శరీరములో ఉన్న రోమ కూపములన్ని కోట్ల వేల యేండ్లు స్వర్గమున నుండి సంతసించును. బ్రహ్మ సాయుజ్యమును పొంది దేవతలతో పాటు ఆనందించును. సర్వ పాపహరమును, పుణ్యమును, పవిత్రమును, కీర్తిమంతమును, శాస్త్రమునునైన ఈ పురాణమును పూర్వము బ్రహ్మ వాయుదేవునకు ఇచ్చెను. ఆతని నుండి దీనిని శుక్రుడు పొందెను. అతని నుండి దీనిని బృహస్పతి పొందెను. బృహస్పతి సవితకు (సూర్యునకు) చెప్పెను. తరువాత సూర్యుడు యమునకు ఇచ్చెను. యముడు ఇంద్రునకు ఇచ్చెను. ఇంద్రుడు వశిష్ఠునకు ఇచ్చెను. ఆ వశిష్ఠుడు సారస్వతునకు ఇచ్చెను. సారస్వతుడు త్రిధామునకు, త్రిధాముడు శరద్వంతునకు, శరద్వంతుడు త్రివిష్ణునకు, అతడు అంతరిక్షునకు ఇచ్చెను. అంతరిక్షుడు వర్షికి, ఆతడు త్రయ్యారుణునకు, త్రయ్యారుణుడు ధనంజయునకు, ఆతడు కృతంజయునకు, కృతంజయుడు తృణంజయునకు, తృణంజయుడు భరద్వాజునకు, అతడు గౌతమునకు, అతడు నిర్యంతరునకు ఇచ్చెను. నిర్యంతరుడు వాజశ్రవునకు, అతడు సోమశుష్మునకు, ఆతడు తృణబిందువునకు, తృణబిందువు దక్షునకు, దక్షుడు శక్తికి, శక్తి గర్భస్థుడైన పరాశరునకు, పరాశరుడు జాతుకర్ణునకు, అతడు ప్రభువైన ద్వైపాయనునకు ఇచ్చెను. ఓ బ్రాహ్మణోత్తములారా! ద్వైపాయనుని వల్ల నేను ఈ పురాణమును పొందితిని.
శాంశపాయనుడు ఇట్లు అనెను:
నేను దానిని అమితబుద్ధియైన నా పుత్రునికి ఇచ్చితిని - అని బ్రహ్మాదిగురువుచే వాక్కుచే చెప్పబడినది. విద్వాంసులకు కూడ గురువులు నమస్కరింప తగినవారు, ధనము ఇచ్చునది, కీర్తిని ఇచ్చునదియు, ఆయుష్యము ఇచ్చునదియు, పుణ్యము అయినదియు, సర్వార్థములు సాధించునదియు, పాపనాశకమైనదియు అయిన ఈ పురాణము బ్రాహ్మణులచే నియమముతో ఎల్లప్పుడు వినదగినది. అపవిత్రునకు, పాప్తికి, అసంవత్స రోషితునకు శ్రద్ధలేని వానికి, పుత్రులు లేనివానికి, అహితునకును ఈ పవిత్రమై ఉత్తమమైన పురాణము ఈయరాదు. అదిబ్రహ్మకు అవ్యక్తమైన ప్రకృతి యోనిగా చెప్పుదురు. కాలమును వ్యక్తమై అంతర్గతమైన దేహముగా చెప్పుదురు. వహ్నిని ముఖముగా, చంద్ర సూర్యులను నేత్రములుగా, దిక్కులను శ్రోత్రములుగా, వాయువును ముక్కుగాను చెప్పుదురు. వేదములు వాక్కులు, అంతరిక్షము శరీరము, భూమి పాదములు, తారకలు రోమ కూపములు, తక్కిన విశ్వాంగములు తక్కిన అంగములు, తక్కినవన్నియు అతనితోక అని చెప్పుదురు. జనులకు జనకుడు, సర్వలోకములలో ప్రతిష్టితుడు, వరులలో వరుడు, వరదుడు, మహేశ్వరుడునైన ఆది బ్రహ్మకు ప్రణతుడనై నమస్కరింతును.(41)