విష్ణు మాహాత్మ్య కథనము

సూతుడు ఇట్లు అనెను:

ఈ విధముగ దేవేశుడును ఆరాధింపతగినవాడును ఈశానుడును అయిన బ్రహ్మ యొక్క ఫాలభాగము నుండి జారిన చెమట బిందువు అగ్నిలో బడి నల్లనై, ఎఱ్ఱన అయినది. అందుండి పుట్టి నీలలోహితుడు అయిన శివుని పరబ్రహ్మ అని శుక్రుడు చేతులు జోడించి ప్రణమిల్లెను. అంత, శివుడు శుక్రుని శరీరమును తన హస్తముతో నిమిరి మిక్కిలి సంతసించినవాడై, సంపూర్ణ దర్శనమొసగి అచటనే అంతర్ధాన మయ్యెను. దేవేంద్రుడే సేవకు దుగాకల శివుడు అంతర్ధానమునందగా, శుక్రుడు చేతులు జోడించి నిలిచి ఉన్న జయంతితో ఇట్లనెను. ఓ సుందరీ! నీవెవ్వరిదానవు? ఎవ్వతెవు? నా దుఃఖమున దుఃఖితవై మహాతపముతో కూడిన నన్ను ఎందులకు రక్షించితివి. ఈ నీ యొక్క నిరంతర భక్తిచేతను, వినయముచేతను, దమముచేతను, స్నేహము చేతను ఓ ఉత్తమురాలా! సంతుష్టుడను అయితిని. శ్రేష్ఠమైన గుణములు కలిగిన ఓ ఉత్తమురాలా! ఏమి కోరుచున్నావు? నీ కోరిక ఏమి? అది నెరవేరుగాక. అది ఒకవేళ సుదుర్లభమైనను ఈ నీకోరికను ఈనాడు పూర్తిగా తీర్చెదను. అనగా, ఆమె (జయంతి), నీ తపముతో దానిని తెలియుమనెను. ఓ బ్రహ్మిష్టుడా! నాచేయదలచిన దానిని ఉన్నది ఉన్నట్లుగా నీవే తెలుసుకొనుము అనగానే, శుక్రుడు తన దివ్య దృష్టితో జూచి, నీవు మహేంద్ర పుత్రివి, నా హితార్థము ఇటకు వచ్చితివి. ఓ భామిని! పదేండ్లు నాతోగూడ సర్వభూతములు చూడకుండ అదృశ్యముగా ఇల సంభోగమును కోరుచున్నావు. దేవేంద్రాగ్ని వంటి కాంతిగలదానా! చక్కని కన్నులు గలదానా! సుందరముగా మాటాడుదానా! ఈ నీ కామమును నా నుండి వరముగా తీసికొనుము.

అట్లే అగుగాక. ఓ మధుపానము లేకయే మత్తెక్కినట్లున్న దానా! మన ఇంటికి వెళ్లెదము అని, జయంతితో గూడి ప్రభువైన శుక్రుడు స్వగృహమునకు వచ్చెను. అపుడు ఆ శుక్రుడు మాయతో ఆవరింపబడి సర్వ భూతములకు అదృశ్యుడై ఆ జయంతితో ఒక్కొక్కటిగా పదేండ్లు కూడి ఉండెను. తపములో సాఫల్యమునంది శుక్రుడు వచ్చెననివిని, దితిసుతులైన అసురులు అందరును సంతుష్టులై శుక్రుని చూడగోరి శుక్రుని ఇంటికి వెడలిరి. కాని అట జయంతితో కలసిఉన్న గురువును చూడరైరి. శుక్రుని దాక్షిణ్యమును (తాము వచ్చినను కనబడకుండ ఉండవలెనను తిరస్కార భావమును) తెలిసికొని, అసురులు వచ్చినదారిని మరలి వెళ్లిరి. బృహస్పతి, తండ్రికొఱకై హితమునుకోరిన ఇంద్రుని పుత్రిక అగు జయంతితో పదేండ్లు అదృశ్యభోగమున మునిగిఉన్న వానిగా శుక్రుడు ఉన్నట్లు తెలిసికొనెను. దానిని అవకాశముగా చేసికొని వెంటనే దైత్యుల మేలుకొరకై ఉన్న వానివలె, శుక్రుని రూపమును ధరించి, తరువాత వచ్చిన రాక్షసులను చూచి బృహస్పతి, నాతో యజ్ఞము చేయించువారికి స్వాగతము. మీ హితము కొఱకే వచ్చితిని. నేను మిమ్ములను చదివించెదను. తపమునకు ముందు మనము అనుకొన్న విద్య నాచేత పొందబడినది. అనగానే సంతసించిన మనస్సులు కలవారై అసురులు విద్యకొరకై శుక్రరూపమున ఉన్న బృహస్పతిని చేరిరి. శుక్రుడు పదేండ్ల సమయమున పూర్ణకాముడు అయ్యెను. అప్పుడు ఆ కాలమున శుక్ర రూపమున ఉన్న బృహస్పతి వెంటనే తెలివి గలవాడై స్వర్గమును వదలి వెడలిపోయెను. ఆ పదేండ్ల సమయము చివర జయంతికి దేవయాని అను పుత్రిక సద్యోజాత (అప్పటికప్పుడు పుట్టినది) జన్మించెను. తరువాత శుక్రుడు తనచేత యజ్ఞము చేయించు రాక్షస శిష్యులను చూడదలచెను.

శుక్రుడు ఇట్లు అనెను:

స్వచ్ఛమైన చిరునగవు కలదానా! పతివ్రతయైనదానా! ఓ దేవీ! నీ యొక్క యాజ్యుల (యాగము చేయింపదగు భక్తుల) కడకు పోవుదము. అనగానే, శుక్ర భార్యదేవి, ఓ మహావ్రతా! భక్తులను సేవింపుము. ఓ బ్రహ్మాత్ముడా! ఇది సత్పురుషుల ధర్మము. నేను ధర్మమును లోపింపజేయను - అనెను.

సూతుడు ఇట్లు అనెను:

తరువాత శుక్రుడు వెళ్లి, బుద్ధిశాలియైన దేవాచార్యుడు అగు బృహస్పతిచే శుక్ర రూపమున మోసగింపబడినవారును, విధివంచితులు అయిన వారగు అసురులను చూచి ఇట్లనెను. నాయనలారా! నన్ను శుక్రునిగా తెలుసుకొనుడు. ఈ శుక్రుడుగ కనబడువాడు భూమిపైకి వచ్చిన అంగిరసుడు(బృహస్పతి). ఓ దానవులారా! బృహస్పతిచే మీరు నేనే అనుకొని మోసగింపబడితిరి అని ఈ విధముగా చెప్పుచున్న శుక్రుని మాటలను విని దైత్యులు సంభ్రాంతులై శుద్ధమైన చిరునవ్వుకల శుక్ర - బృహస్పతులను ఇరువురిని చూచుచుండిరి. అందరు ముగ్ధులై ఏమియు పొందలేక నిశ్చేష్టులై ఉండిరి. వారు ఆవిధమున ప్రమూఢులై ఉండగా శుక్రుడు వారితో మరల మీ ఆచార్యుడను శుక్రుడను నేను. ఈతడు దేవాచార్యుడైన అంగిరసుడు (బృహస్పతి). మీరందరు నన్ను అనుసరించుడు. ఈ బృహస్పతిని విడువుడు అనెను. ఇట్లు అనగానే దైత్యులు అందరు వారు ఇరువురిని తేరిపార జూచిరి. అప్పుడు వారు ఇరువురిలో భేదమును తెలుసుకొనలేక పోయిరి. అపుడు బృహస్పతి ఏ భయములేక (తొందరపాటులేక) ఆ దైత్యులతో - ఈతడు అంగిరుడు (బృహస్పతి) మీ గురువైన శుక్రుడను నేను. ఓ దైత్యులారా! నా రూపమున ఉన్న బృహస్పతి వీడు. నా రూపముతో మిమ్ములను వంచించుచున్నాడు. అనగానే దైత్యులు ప్రయోజనమును పరస్పరము ఆలోచించి ఈతడు పదేండ్లు ప్రభువై మమ్ముల శాసించుచున్నాడు అనిరి. ఈతడే మన గురువు. మధ్యన అవకాశమును పొందుకోరినవాడు ఈ బ్రాహ్మణుడు. అంత ఆ దానవులందరు చాల కాలము అలవడిన వారగుటచే వంచితులై ఆ కృత్రిమ బృహస్పతికే ప్రత్యేకముగ పేరులు చెప్పినమస్కరించి అతని మాటలనే స్వీకరించిరి. తరువాత అ అసురులు అందరును కోపించి ఎఱ్ఱని కన్నులు కలవారై, మా యొక్క హితమున ఈతడే గురువు, నీవు వెళ్లుము. నీవు మా ఆచార్యుడవు కావు! ఈతడు శుక్రుడు గాని, బృహస్పతిగాని కానిండు. ఈతడే మాకు గురువు అగుగాక! మేము ఈతని ఆజ్ఞలో ఉన్నాము. మంచిది. ఆలసింపక వెళ్లిపొమ్ము. అని ఇట్లు అసురులు అందరు బృహస్పతినే చేరిరి. ఈ విధముగా వారు శుక్రుడు చెప్పిన మహా హితము నమ్మనపుడు శుక్రుడు వారి మదమునకు కోపించి, నేను బోధించినను ఓ దానవులారా! మీరు నన్ను చేరుటలేదు. కావున మీరు తెలివి నశించి పరాభవము పొందుదురు గాక - అని శపించి, తాను ఎచట నుండి వచ్చెనో అటకు ఏగెను. ఇట్లు శుక్రునిచే శపింపబడిన అసురులను తెలిసి అపుడు బృహస్పతి కృతార్థుడై (తలచిన పనిని చేసిన వాడై) సంతసించి స్వస్వరూపమును (తన బృహస్పతి రూపమును) పొందెను. తరువాత అసురులను భ్రష్టులనుగా తెలిసి, కృతార్థుడై అంతర్థానము చెందెను.  ఆ మాయాశుక్రుడు బృహస్పతియై మాయముకాగా అప్పుడు దానవులు ఆశ్చర్యముచెంది, అహో! మాకు ధిక్కారము. మనము ఇట వంచితుల మైతిమని ఒకరికొకరు మాటాడుకొనిరి. విముఖులమైన మేము విధిచే వీపున తన్నబడితిమి. మా ప్రయోజనములలో ఉపయోగ పడుటకు దూరమై మా అంతట మేమే మాయచే దహింపబడితిమి అని భావించి అటు తరువాత, దేవతలవల్ల భయపడి అసురులు తొందరగా ప్రహ్లాదుని ముందు ఇడుకొని, మరల శుక్రుని అనుసరించుటకు వెళ్ళిరి. శుక్రుని చేరి తలలువంచి అతని మ్రోల నిలిచిరి. శుక్రుడు మరల తనకడకు వచ్చిన తన శిష్యులైన అసురులను చూచి సమయమున నాచే బోధింప (మేలుకొలుప)బడినవారైనను మీరు నన్ను అభినందించకుంటిరి. కావున ఆ గర్వముచేతనే ఈ పరాభవమును పొందితిరి. అనగనే, ప్రహ్లాదుడు, ఓ భార్గవ (శుక్రాచార్యా!) నీవు అభిమానమును విడువుము. నిన్ను సేవించు నీ శిష్యులను విశేషించి నీ భక్తులను అనుగ్రహింపుము. నీచే రమ్మని అడుగబడినను ఆ దేవాచార్యుడైన బృహస్పతిచే మోహితులము అయితిమి. కరుణించి భక్తులమైన మమ్ములను రక్షింపుము. ఓ భృగుపుత్రా! నీవు మమ్ములను అనుగ్రహింపకున్నచో నీచేత తిరస్కరింపబడి ఇవ్వేళ పాతాళమున ప్రవేశింతుము.

సూతుడు ఇట్లు అనెను:

ఈ విధముగా అని, అనునయింపబడి, స్తుతింపబడిన ఆ శుక్రుడు ఉన్న సత్యమును తెలిసి, కారుణ్యముతోడను అనుకంపతోడను, తన కోపమును అణచివైచెను. వెంటనే, భయపడకుడు, భయపడకుడు, పాతాళమునకుకూడ పోవలదు. నేను మేలుకొని ఉండగనే తప్పనిసరిగా జరుగవలసిన ఈపని విధివశమున జరిగినది. దానిని మార్చుటకు అలవి కాదు. ఇపుడు జరిగిన విధి చేష్ఠితము మిక్కిలి బలీయమైనది. ఈవరకు మీ తెలివిని కోల్పోతిరి. దానిని ఇపుడు మరల పొందుడు. మీకు పర్యాయ కాలము (వరుస క్రమమున రాతగిన రాజ్యకాలము) వచ్చినదని బ్రహ్మ చెప్పెను. నా అనుగ్రహమున సంపాదింపబడిన త్రైలోక్య రాజ్యము మీచే అనుభవింపబడినది. యుగము అను పేరుగల పదియేడులు దేవతల శిరమును ఆక్రమించి రాజ్యము ఉండుట సంపూర్ణము అయినది. అంతకాలమే వారికి రాజ్యమని బ్రహ్మ చెప్పెను. సావర్ణిక మన్వంతరమున మీకు మరల రాజ్యము రాగలదు. నీ పౌత్రుడైనబలి మరల లోకములకు అధిపతి కాగలడు. ఈ విధముగనే బ్రహ్మ స్వయముగా, నీ పౌత్రుడు త్రిలోకాధిపతి కాగలడని నాతో చెప్పెను. అట్లే లోకములు అపహరింపబడగా ఈతనికి తపము జరుగలేదట. ఈతని ప్రవృత్తులు కామములతోకూడి లేవుగాన దానికి సంతసించిన బ్రహ్మసావర్ణికమన్వంతరములో రాజ్యప్రాప్తి ఒసగెను.  దేవరాజ్యము బలికి రానున్నదని నాకు ఈశ్వరుడు చెప్పెను. కావున భూతములకు అదృశ్యుడై కాలమునకు ఎదురు చూచుచు, ఉన్నాడు. సంతుష్టుడైన బ్రహ్మ నీకు అమరత్వము ఇచ్చెను. కావున నిరుత్సుకుడవై పర్యాయక్రమముతో వ్యాకులము పొందకుము. నాకుకూడ నాపర్యాయక్రమము ముందుగా, తొందరగా వచ్చునట్లు చేయ శక్యము కాదు. భవిష్య కాలమును తెలిసిన బ్రహ్మచే అట్లు చేయుటకు నిషేధింపబడితిని. బృహస్పతితో సమానులు అయిన ఈ నాశిష్యులు ఇద్దరు (షండామార్కులు)నా కొఱకుగాను దేవతలతో అన్నింటిని నిర్వహింతురు అని అక్లిష్టకర్ముడైన శుక్రుడు ఇట్లనగా ప్రహ్లాద ప్రముఖులైన దైత్యులు వారిద్దరితో (షండామార్కులతో) పాటువెళ్లిరి. తప్పనిసరిగా జరుగబోవు విషయమును శుక్రునివల్ల విన్న దానవులు, శుక్రుడు చెప్పిన జయమును పొందగోరుచుండిరి. తరువాత కవచము ధరించి సాయుధులై, అందరు దైత్యులు దేవతలను యుద్దమునకు ఆహ్వానించిరి. ఈతడు యుద్ధమునకు వచ్చిన దేవఅసురులను చూచెను. తరువాత పూర్తి చేసిన సన్నాహములు గలవారై దేవతలు దానవులతో యుద్ధము చేసిరి. తరువాత దేవ అసుర యుద్ధము నూరేండ్లు జరిగినది. అసురులు దేవతలను జయించిరి. భగ్నులైన దేవతలు మంతనములు చేసిరి.

దేవతలు ఇట్లు అనిరి:

మనకు అసురులతో షండామార్కుల ప్రభావమును తెలియదు. కావున ఆత్మహితమును ఉద్దేశించి యజ్ఞమును చేయవలెను. ఈ షండామార్కులను ఆ యజ్ఞ జ్ఞానాప హృతులనుగాచేసి అసురులను జయింతము అని ఆలోచించి, తరువాత ఆ షండామార్కులు ఇరువురితోను ఓ బ్రాహ్మణులారా! షండామార్కులారా! మిమ్ములను యజ్ఞమునకు ఆహ్వానింతుము. అసురులను విడువుడు. దానవులను ఓడించి, మరల జ్ఞానమును పొందెదము అని సమాలోచించిరి. ఈ విధముగ (దేవతల మాటలు విని) అపుడు ఆ షండామార్కులు అసురులను విడిచిరి. దానివలన దేవతలు జయించిరి. దానవులు పరాజయమును పొందిరి. దేవతలు అసురులను ఓడించి షండామార్కుల కడకు చేరిరి. ఆ దానవులు మాత్రము శుక్రశాపముచే దేవతలచే తిరస్కరింపబడివారై నిరాధారులై, అప్పుడు దేవతలచే వధింపబడుచున్నవారై మరల పాతాళమును ప్రవేశించిరి. ఈ విధముగ ఇంద్రునిచే దానవులు ఉద్యమము లేనివారుగా చేయబడిరి. అప్పటి నుండి భృగునిమిత్తమయిన శాపముచే. యజ్ఞము శిథిలమై ప్రభువైన విష్ణువు ధర్మవ్యవస్థాపనము చేయుటకును, అధర్మమును నశింపచేయుటకును, మరల మరల జన్మించెను.

ప్రహ్లాదుని ఆజ్ఞలో లేని అసురులు అందరును మనుష్య వధ్యులు అగుదురని ప్రభువైన బ్రహ్మ చెప్పెను. ఆ ధర్మము వలన నారాయణుడు చాక్షుష మన్వంతరమున పుట్టెను.

వైవస్వత మన్వంతరమున యజ్ఞశాలలో యజ్ఞమును జరుపుచుండెను. అతడు పుట్టినపుడు ఆ యజ్ఞమునకు బ్రహ్మ పురోహితుడు అయ్యెను. నాలుగవ యుగము అసురులు ఆపద చెందినవారుకాగా, హిరణ్యకశిపుని యొక్కవద్దకై సముద్ర మధ్యలో హరి పుట్టెను. రెండవవాడు నారసింహుడు అయ్యెను. ఆతడు రుద్రుడు దేవతలను ముందిడుకొన్నవాడు. బలి ఉన్న లోకములలో త్రేతయైన ఏడవ యుగమునందు, ముల్లోకములు దైత్యులచే ఆక్రమింపబడియుండగా, మూడవవాడు వామనుడుపుట్టెను. పూర్వము తనను అంగములలో చిన్నగా వామనునిగాజేసి, బృహస్పతి ముందు నడువగా, అదితికి కులనందనుడై బ్రాహ్మణుడైన వామనుడు, శుభకాలమున, హోమము చేయుచున్నవాడును, రాక్షసేంద్రుడును విరోచన పుత్రుడును అగు బలిచక్రవర్తి కడకు వచ్చెను. నీవు త్రైలోక్యమునకు రాజువు. నీయందే సర్వము నిలిచియున్నది. ఓ రాజా! నాకు మూడు అడుగుల నేలను దానముచేయుము - అని ప్రభువైన వామనుడు అడిగెను. రాజైన విరోచన పుత్రుడగు బలి ఆతనిని వామనునిగా తెలిసి, తాను స్వయముగా సంతసించి ఆ మూడు అడుగులను ఇత్తునని అనెను. ఓ ద్విజోత్తములారా! అపుడు ప్రభువైన ఆ వామనుడు స్వర్గమును, ఆకాశమును, భూమిని, మూడుపాద విక్షేపములచేత సమస్త జగమును ఆశ్రమించెను. మహాయశస్వియై భూతా త్ముడైన ఆ వామనుడు తన తేజముతో సర్వదిక్కులను ప్రకాశింపచేయుచు ప్రకాశించెను. రాక్షస శ్రీయైన ముల్లోకములను హరించి అసురులను పుత్రపౌత్ర సమేతముగ పాతాళమునకు తెచ్చెను. నముచి, శంబరుడు, ప్రహ్లాదుడును - ఈ క్రూరులు విష్ణువుచే హతులై ఎగురగొట్టబడి దిక్కులను పొందిరి. భూతాత్ముడైన మాధవుడు, సవిశేషముగా పృథివ్యాది మహాభూతములను, సమస్త కాలమును అచట బ్రాహ్మణులకు అద్భుతముగా తన విశ్వ రూపమున చూపెను. అతని శరీరమున జగము అంతయును తనను సైతము (బలి) చూచుచున్నాడు. ఆ దానవ, మానవులు అందరును విష్ణు తేజముతో విమోహితులై మోహము చెందిరి. మిత్రబంధు సమేతముగ బలి మహాపాశములతో బద్ధుడు అయ్యెను. మొత్తము విరోచనుని కులమంతయు పాతాళములో ప్రవేశింపజేయబడినది. తరువాత సమస్తమైన దేవ ఐశ్వర్యమును ఇంద్రునకు ఇచ్చి, మహాబాహువైన విష్ణువు మనుష్యులలో ప్రాదుర్భవించెను. ఈ మూడు విష్ణువు యొక్క శుభకరములై దివ్యములైన మూడు సంభూతులు (జన్మలు) ఇక శాపమువల్ల కలిగిన మానుష్యములు అయిన ఏడు విష్ణువు అవతారములను వినుడు. పదవ యుగము అయిన త్రేతాయుగమున విష్ణువు దత్తాత్రేయుడు అయ్యెను. ధర్మము నశింపగా మార్కండేయ పురస్సరమైన నాల్గవ సంభవము. పదియైదవదైన త్రేతాయుగమున ఐదవ సంభవము జరిగినది. అది మాంధాత చక్రవర్తిగా ఉన్నపుడు తథ్య పురస్సరమై ఉండెను. పదునొకండవ త్రేతాయుగమున విశ్వామిత్రుని ముందుగా ఇడుకొని పరశురాముడు సర్వ క్షత్రియనాశకుడు అయ్యెను. పదునాల్గవ యుగమున వశిష్ఠ పురోహితునిచే (యజ్ఞముచే), రావణ వినాశమునకై ఏడవ అవతార పురుషుడుగా దశరథ పుత్రుడై రాముడు ఉద్భవించెను. ఇరువది ఎనిమిదవ ద్వాపర యుగమున, జాతూకర్ణ పురస్సరుడై విష్ణువు ఎనిమిదవ అవతారముగా, పరాశరునివల్ల వేదవ్యాసుడై జన్మించెను. అట్లే, అదితికి కశ్యపునివల్ల పుట్టిన విష్ణువు తొమ్మిదవ అవతారముగా దేవకియందు వసుదేవునకు బ్రహ్మ గార్గ్యపురస్సరుడై జన్మించెను. అప్రమేయుడై (ప్రమాణములకు దొరకని వాడై) కామచరుడై (స్వేచ్ఛావరుడై, అడ్డులేని ఆచరణముకలవాడై) వశియై, (ఇంద్రియాదులను స్వపశమునందు ఉంచుకొన్నవాడైన), మహావిష్ణువు ఇచట భూమిలో, అజ్ఞాపింపబడువాడై బొమ్మలచే బాలుడువలె కృష్ణభగవానుడు క్రీడించును. ఈ మధురాక్షసహంత, మహాబాహువు ఇంతటి వాడని కొలుచుటకు అశక్యుడు. ఈతనికి పరమై ఉత్కృష్టమైనది. ఒక్క విశ్వరూపమే. మరొకటి లేదు. అట్లే ఇరువది ఎనిమిదవ ద్వాపర యుగము ఒక్క అంశముగడువగా, ధర్మము నష్టముకాగా, అపుడు మహావిష్ణువు వృష్టి కులమున జన్మించెను. ధర్మసంస్థాపనము నకును, అసురవినాశనమునకును, యోగాత్ముడై కృష్ణ భగవానుడు యోగమాయచే మానుషీ యోనిలో ప్రవేశించి సర్వప్రాణులను మోహింపచేయుచు, కనబడనివాడై సాందీపని పురస్సురుడై మనుష్యులలో విహారమునకై భూమిలో సంచరించుచుండెను. అచట, కంసుని, సాల్వుని, ద్వివిదుడను మహాసురుని, అరిష్ఠుని, వృషభుని, పూతనను, కేశిని, హయుని, కువలయా పీడమను ఏనుగును, మల్లరాజ గృహాదిపుని, మనుష్య దేహమున ఉన్న రాక్షసులను వీర్యవంతుడైన కృష్ణుడు వధించెను. అద్భుత కర్మలు చేసిన బాణుని వేయి బాహువులు, కృష్ణునిచే ఖండింపబడినవి. యుద్ధమున నరకాసురుడును, మహాబలుడైన యవనుడును వధింపబడిరి. పరాక్రమముచే రాజుల సమస్త రత్నములను అపహరింపబడినవి. పాతాళమున ఉన్న దురాచారులైన రాజులు హతులు అయిరి. ఇవి మహాత్ముడు అయిన మహావిష్ణువుయొక్క లోకహితము కొఱకైన జన్మలు. ఈ యుగమే క్షీణించి రాబోవు కలియుగము సంధిచే కలియగా. ప్రతాపవంతుడై పరాశరునివల్ల పుట్టిన విష్ణుయశుడు అను కల్కియాజ్ఞవల్క్యపురస్సరుడై రాబోవు పదియవ విష్ణువు అవతారముగా పుట్టెను. వేల కొలదిగా స్వీకరించిన ఆ యుధములుగల బ్రాహ్మణులచే పరివారితుడై హస్తి - అశ్వ - రథములతో సంకులమైన సేనను ఆకర్షించు మిక్కిలి ధార్మికులుగాని వారిని, కొండొకచో - ధర్మమును ద్వేషించువారిని, ఉత్తర దిక్కు వారిని, మధ్య దేశపు వారిని, అట్లే వింధ్యా పరాంతికులను, అట్లే దాక్షిణాత్యులను, సింహళులతోబాటు ద్రవిడులను, గాంధారులను, పారదులను, పహ్లవులను, యవనులను, శకులను, తుషారులను, బర్బరులను, పులిందులను, దురదులను, ఖసులను, లంపాలకులను, అంధకులను, రుద్రులను, కిరాతులను పాలించి ప్రభువై రాజ్యచక్రమును నడిపించి, బలవంతుడై మ్లేచ్ఛులను నాశముచేసి, మహాబలియై, సర్వప్రాణులకు కనబడకుండగనే భూమి అంతయు తిరుగును. అతడు ధీశాలియైన విష్ణు దేవాంశతోనే మానవుడై జన్మించెను. పూర్వజన్మలో అతడు ప్రమతిఅను వీర్యవంతుడైన విష్ణువు. అతడు మొత్తము కలియుగమున చంద్రునితో సమాన కాంతిగల శరీరము గలవాడయ్యెను - అనునివి విష్ణుదేవుని యొక్క పది జన్మలు.

శ్రీ మహావిష్ణువు ఆయాకాలములను బట్టియు, ఆయా కార్యమును బట్టియు, ఆయా కార్యమున ఉద్దేశించిన కారణమును బట్టియు, ముల్లోకములలో ఆయా యోనులను పొందును. ఇరువది అయిదవ కల్పమున ఇరువది అయిదు సంవత్సరములు సర్వ ప్రాణులను చంపుచు, అంతటను మనుష్యులను కూడ చంపుచు, క్రూరకర్మతో సామాన్యముగా అధార్మికులను, పాపాత్ములను వధించి భూమిని కేవల బీజావశేషముగ చేయును. తరువాత తలంపు నెరవేరినవాడై, సేనతో కూడిన ఆ కల్కి చంపిన వారందరు మరల స్వయముగనే సిద్ధులు అగుదురు. అకస్మాత్తుగా పరస్పరము కోపించి మోహితులు అగుదురు. విధి బలీయతచే అట్లు ప్రేరేపింపబడిన వారందరిని నశింపజేసి, కల్కి తన వెంటవచ్చినవారితో పాటు గంగా - యమునల మధ్యన నిశ్చలమైన స్థితిని పొందగలడు. తరువాత సామాన్యులైన సైనికులతోబాటు కల్కి కడచిపోగా, రాజులు నశించిపోగా, ప్రజలు అపుడు పట్టపగ్గములు లేనివారై రక్షణము లేకపోగా యుద్ధమున పరస్పరము చంపుకొనిరి. ఆ విధముగా పరస్పరము ఊరటలేనివారై, రోదనములు కూడలేనివారై మిక్కిలి దుఃఖితులై పురములను గ్రామములను వదిలి, అలుబిడ్డలులేనివారై, నశించిన వేదధర్మములు కలవారై, నశించిన ధర్మ బద్ధమైన ఆశ్రమములు కలవారై, పొట్టివారై, అల్పాయుష్కులైన ఈ ప్రజలు వనవాసులు అగుదురు. వారు నదీపర్వతములు సేవించువారై, ఆకులు, కందమూలములు, ఫలములు తినువారై, నారచీరలను ఆకులను చర్మములను ధరించినవారై వావివరుసలులేని స్త్రీ సంపర్కములతో భయంకరమైన సాంకర్యమును పొందిరి. అల్పాయుష్కులు, నశించిన జీవన వ్యాపారములు కలవారు, అనేక బాధలు కలవారు, మిక్కిలి దుఃఖితులైరి. కలియుగ సంధ్యంశకమున ఈ విధముగ ప్రజలు కష్టమును పొందిరి. ప్రజలు కలియుగముతో పాటు నాశమును పొందుదురు. కలియుగము క్షీణింపగా, కృతయుగము మరలరాగా, ప్రజలు ఏ ఒత్తిడులు లేక స్వాభావికముగనే (వారంతటవారే) న్యాయానుగుణముగా మెదలుదురు - అనునిది మొత్తము దేవాసురులు విచేష్టితము అని చెప్పబడినది. యదువంశ ప్రసంగమున వైష్ణవమైన కీర్తి (విష్ణు మాహాత్మ్యము) గొప్పగా చెప్పబడినది. తరువాత తుర్వసువు యొక్కయు, పూరువు యొక్కయు, ద్రుహ్యువు యొక్కయు, అట్లే అనువు యొక్కయు వంశమును చెప్పెదను. (36)