వాయు మహా పురాణము
మన్వంతరాది వర్ణనము
సూతుడు పలికెను:
లోకకర్తయైన బ్రహ్మచే లోకములట్లు సృజింపబడగా ఏ కారణము చేతనో ప్రజలు (ధర్మ మార్గమున) ప్రవర్తింపకుండిరి. అప్పటి నుండి బ్రహ్మ తమోగుణముచే చుట్టబడెను. తరువాత తన బుద్ధిని విషయములను నిశ్చయించునట్లుగా చేసెను. వెంటనే తనయందు నియమించునదైన తమోగుణ మాత్రముచే నిండిన బుద్ధిని సృష్టించెను. ధార్మికముగా మండుచున్న రాజసగుణమును ఓడించెను. ఆ దుఃఖముచే తపింపబడి, జగత్పతి శోకించెను. దాని వలన తమోగుణము తొలిగెను. రజోగుణము తమోగుణమును ఆవరించెను. తొలగించబడిన ఆ తమోగుణము యుద్ధమును కలిగించెను. రణము నుండి అధర్మము జన్మించెను. శోకము నుండి హింస జనించెను. అంత రజోరూపమైన మిధునము జనింపగా భగవంతుడు సంతసించెను. అట్లు సంతసించినవాడై కాంతిలేని తన శరీరమును ఆశ్రయించెను. ఆ శరీరమును ఒక క్రొత్త విధముగా భావించెను. ఆ దేహమును రెండు విధములుగా చేసెను. అది సగము పురుషుడు సగము స్త్రీ అయ్యెను. ఆ స్త్రీ శతరూప అయ్యెను. ప్రాకృతయై భూతదాత్రి యైన మాయను అనుసరించి ఆ ప్రభువు కామములను సృజించెను. ఆమె తన మహిమచే ఆ స్వర్ణమును భూమిని గూడ వ్యాపించి నిలిచెను. బ్రహ్మ యొక్క మొదటి శరీరమును స్వర్ణ మావరించియున్నది.
తన అర్ధ శరీరము నుండి సృజింపబడిన స్త్రీయగు, శతరూప అతి కష్టమైన లక్ష తపము జేసెను. దీపయశస్కుడైన పురుషుని భర్తగా పొందెను. అతడే ఇట స్వాయంభువ మన్వంతరము వాడైన, మొదటి పురుషుడైన మనువు అనబడుచున్నాడు. ఇచట డెబ్బది యొక్క యుగములు అతని మన్వంతరము అనబడును. ఆ పురుషుడు అయోనిజయైన శతరూపను పత్నిగా పొందెను. అతడు ఆమెతో రమించుచుండెను. ఆ కారణమున ఆమె (ఆ రమణ క్రియ) రతి అనబడినది. కల్పాదిలో అదియే మొదటి సంప్రయోగము పురుషు సంపర్కము) గా జరిగెను.
బ్రహ్మ విరాజుని సృజించెను. ఆతడు విరాట్టయ్యెను. ఆదిదేవుడు బ్రహ్మ మానస రూపుడై వైరాజుడైన విరాట్టు నుండి పుట్టినవాడు, చక్రవర్తియైన మనువు అనబడెను. అది వైరాజమైన ప్రజాసృష్టి. ఆ సృష్టిలో పురుషుడు మనువు. వీరుడైన విరాట్పురుషుని నుండి శతరూప పుట్టెను.
పుత్రవతులలో శ్రేష్ఠులైన ప్రియపుత్రుడు ఉత్తానపాదుడు అను పుత్రులును, ఇద్దరు గొప్ప సౌభాగ్యవతులైన కన్యలును కలిగిరి. ఆ కన్యలనుండి ఈ ప్రజలు పుట్టిరి. దేవీ ఆకూతి, ప్రసూతి అని వారి పేరుతో ప్రభువైన బ్రహ్మ స్వాయంభువుని సంతానమును దక్షునకు ఇచ్చెను. ప్రాణము దక్షుడని సంకల్పము మనువు అని అనబడిరి. ప్రజాపతియైన రుచికి ఆకూతినిచ్చెను. మానసపుత్రుడైన రుచికి ఆకూతియందు శుభమైన మిధునము పుట్టెను. యజ్ఞుడు, దక్షిణ అను (యమకులు) జంట పుట్టినది. ఆ యజ్ఞ-దక్షిణలకు పండ్రెం డుగురు పుత్రులు జనించిరి. వారు స్వాయంభువ మన్వంతరమున యాములు అని అన బడిరి. యజ్ఞ రూపుడైన యమునకు పుత్రులుగాన వారు యాములనబడిరి. అజితులు, శూకులు అను రెండు బ్రహ్మయొక్క గణములనబడినవి.
స్వర్గ నివాసులైన దేవతలకు పేరుగావున పూర్వము యాములు విహరించిరి. స్వాయంభువ మనువు కూతురైన ప్రసూతియందు లోకమాతయు జనించిరి. దక్షునకు ఆ కన్యయందు ఇరువది నలువురు కన్యలను బ్రహ్మ జనియింప చేసెను. వారందరు మహాభాగ్యవంతులు కమలలోచనలు. వారు యోగపత్నులు యోగమాతలు శ్రద్ధా, లక్ష్మీ, ధృతి, తుష్టి, పుష్టి, మేధా, క్రియా అట్లే బుద్ధి, లజ్జా, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి, త్రయోదశి అని పేర్లు గలవారు. దాక్షాయణులైన దక్షుని కన్యలను ధర్ముడు భార్యార్థముగా స్వీకరించెను. బ్రహ్మ ఈ కన్యలను ధర్మునకు (సృష్టికి) ద్వారములుగా చేసెను. వారికన్న మిగిలిన సులోచనలు, పిన్నవారును ఐనవారు పదకొండుగురు కన్యలును కలరు. వారు ఖ్యాతి, సతీ, తరువాత సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమా అట్లే సన్నతి అనువారు అనుసూయా, ఊర్జా, స్వాహా, స్వధా-అనువారు. వారినైతే మహర్షులు (భార్యలుగా) పొందిరి.
రుద్రుడు, భృగువు, మరీచి, అంగిరసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, అత్రి, వసిష్ఠుడు, పితరులు, అగ్ని అను వీరు ఆ ఋషులు. సతిని భవునకిచ్చెను. ఖ్యాతిని భృగు వునకు, అట్లే, మరీచికి సంభూతిని, ఆంగిరసునకు స్మృతిని ఇచ్చెను. పులస్త్యునకు ప్రీతిని, పులహునకు క్షమను, క్రతువునకు సన్నతిని, అట్లే అత్రికి అనసూయను, వసిష్ఠునకు ఊర్జను, అగ్నికి స్వాహాను, పితురులకు స్వధను, ఇచ్చెను. వారియందు ఆ ఋషులకు కలిగిన సంతానము ముందు చెప్పబడుచున్నది.
అన్ని మన్వంతరములలోను సర్వభూత ప్రళయమగునంత వరకు, ఈ అందరు మహానుభావులును ఉందురు. లౌకికాలౌకిక సూక్ష్మ బుద్ధులు వారి ప్రజ్ఞలను అయిన చక్కగా అనుష్ఠించుచుందురు.
వారిలో శ్రద్ధ కాముని కనెను. దర్పుడు (దర్పము) లక్ష్మీసుతుడు అనబడెను. ధృతికి నియముడు (నియమము) పుత్రుడు తుష్టికి సంతోషుడు పుత్రులు. పుష్టికి లాభుడు సుతుడు. మేధా పుత్రుడు శ్రుతుడు (శ్రుతము) అట్లే, క్రియకు నయుడు (నయము) దణుండు (దండము) సమయుడు (సమయము)ను పుత్రులు. బుద్ధికి బోధుడు అప్రమాదుడు అను ఇద్దరు పుత్రులు, లజ్జకు వినయుడు (వినమయ) పుత్రుడు. వ్యవసాయుడు (వ్యవసాయము) వపువుయొక్క పుత్రుడు. క్షేముడు (క్షేమము) శాంతికి పుత్రుడు. సిద్ధికి సుఖుడు (సుఖము) కలిగెను. కీర్తికి యశుడు (యశము) సుతుడు. ఈ విధముగ వీరందరు ధర్ముని పుత్రులు (ధర్మము యొక్క పుత్రులు) కామునకు, దేవియైన రతి వలన హర్షుడను పుత్రుడు కలిగెను. ఈ విధముగ సుఖమునే ఫలముగా ఇచ్చు ధర్ముని యొక్క సృష్టి చెప్పబడినది.
అధర్మము నుండి హింస జనించెను. నికృతి-అనృతులు ఇద్దరును పుట్టిరి. ఆ నికృతి అనృతులు ఇద్దరికీ, భయము, నరకము జనించినవి. వీరిద్దరికి మాయ-వేదన అను మిధునద్వయము గలిగెను. భయమునుండి, మాయ భూతాపహారిణియగు మృత్యువును కనెను. తరువాత వేదన నుండి దుఃఖము గలిగెను. తరువాత భయంకరమైన మృత్యువు నుండి వ్యాధి, జ్వర, శోకములు, క్రోధము, అసూయయును కలిగెను. ఇవి అన్నియు దుఃఖముతో నిండినవి. అధర్మలక్షణములు. వారికి, వారికి భార్యగాని పుత్రుడుగాని, వారందరు నిధనులే (మరణములే) అనబడిరి. ఈ విధముగా ధర్మ నియామకమైన తామస సృష్టి కలిగినది.
ప్రజలను సృజింపుమని బ్రహ్మచే నీలలోహితుడైన శివుడు అజ్ఞాపింపబడెను. అతడు ధ్యానించి ఆత్మసంభవమైన సతిని భార్యగా నిర్మించుకొనెను. తనకు మించకయు తగ్గకయు సమముగా ఉన్న వేయివేల (10 లక్షల) మానవ సుతులను సృజించెను. వారందరు కృమివాసస్సుతో (పట్టు వస్త్రముతో) రూప-తేజో-బల-శ్రుతములతోను తనకు సమానులు.
ఎఱ్ఱని (గోరోచనపు వర్ణముగల వారిని, సన్నికర్షులను, జటాజూటము కలవారిని, విలోహితులను (ఎర్రని వారిని) వస్త్రములేని వారిని, కోతిరంగు వెంట్రుకలు గలవారిని, దృష్టులను పోగొట్టువారిని, కపాలములు ధరించువారిని, బహు రూపములు గలవారిని విరూపులను, విశ్వరూపులను, రూపవంతులను, రథములు గలవారిని, కవచములు గల వారిని, ధర్ములను, సేనలను, లక్షబాహువులుగల వారిని, దివ్యులను భౌములను (భూమియందు ఉండువారు) అంతరిక్షగులను (ఆకాశమునందు ఉండు వారు) లావుతల గలవారిని, ఎనిమిది కోరలు గల వారిని, రెండు నాలుకలు కలవారిని, మూడు కన్నులు కల వారిని, అన్నము తినువారిని, మాంసము తినువారిని, నేయి త్రాగువారిని, సోమ రసమును త్రాగు వారిని, మేధస్సును త్రాగువారిని అతికాయులను (లావు శరీరము గలవారు) నల్లని కంఠము, తీవ్రకోపమునుగల వారిని, అమ్ముల పొదులుగల వారిని, తలత్రము (రక్షణ కవచము) పై గలవారిని, ధనుర్ధారులను, ఉపకవచము గలవారిని, కూర్చున్నవారిని, పరిగెత్తుచున్నవారిని, అవులింతలు తీయువారిని, ధిష్ఠితులను (నివసించిన వారిని), అధ్యాపకులను, జపము చేయుచున్న వారిని, కలియుచున్న వారిని, ధ్యానము చేయుచున్న వారిని, మండుచున్నవారిని, వర్షించుచున్నవారిని, ప్రకాశించుచున్న వారిని మిక్కిలి పొగ వేయబడినవారిని, బుద్ధులను, బుద్ధతములను, బ్రహ్మలో నిలచిన వారిని, శుభదర్శనులను, నీలకంఠులను, సహస్రాక్షులను, సమస్త రాత్రిచరులైన రాక్షసులను, సర్వభూతములకు కనబడని వారిని, హాహాయోగులను, మహాతేజస్సు గలవారిని, రోదనము చేయుచున్నవారిని, పరుగిడుచున్నవారిని, ఈ విధముగా కలిసి ఉన్న వారిని వేలకు వేలు అపాత యాములను రుద్ర రూపులయిన సురోత్తములను సృజించెను.
బ్రహ్మ వీరిని చూచి ఇటువంటి ప్రజలను సృష్టించవలదనెను. నీకు సమాను లైనట్టి వారిని గాని, నీకంటె అధికులైనట్టివారిని గాని ప్రజలను సృష్టింపరాదు. నీవు ఇతరులను సృజింపుము, నీకు భద్రమగును. నేనున్నాను. ప్రజలను సృజింపుము అనెను. “నేను సృష్టించిన వారు విరూపులు, నీలలోహితులు వేయివేలు నాతో సమానులుగా నిశ్చయింపబడినవారు. రుద్రులు అను మహాబలురు దేవతలుగా కలరు. భూమిలోను ఆకాశమునను రుద్ర నామముతో ప్రసిద్ధులు. శతరుద్రులని పిలువబడినవారు కాగలరు. యజ్ఞమునకర్షులు దేవ యుగములతోబాటు యజ్ఞఫలమును పొందువారుగూడ కాగలరు. ఛందజులై స్వేచ్ఛతో పుట్టినవారై మన్వంతరములలో పుట్టబోవువారితో బాటు యాగము చేయచున్నవారై, యుగక్షయమువరకు ఇచట ఉండగలరు” అని మహాదేవుడు పలుకగా ధీమంతుడైన మహాదేవునిచే ఇట్లు చెప్పబడినవాడై బ్రహ్మ, సంతసించుచున్న ప్రజాపతియై, అపుడు భీముడైన శివునకు ఓ ప్రభూ! ఇట్లు నీవు చెప్పినట్లే అట్లే అగుగాక. నీకు శుభమగు గాక అని మారుపలికెను. అంత బ్రహ్మ సమ్మతించగనే ఎల్లప్పుడు ఎల్ల విషయములు జరిగినవి.
అప్పటినుండి దేవేశుడైన ఈశ్వరుడు ప్రజలను సృష్టించలేదు. ఊర్థ్వరేతస్కుడై మహా భూతప్రళయము వరకు స్థాణువై, కదలని మొద్దై ఉండెను. అతడు నేను కదలక ఉన్నాను. అన్నందువలన స్థాణువు అని పిలువబడును. జ్ఞానము వైరాగ్యము, ఐశ్వర్యము, తపము, సత్యము, క్షమ, ధీతి, సృష్టృత్వము (సృష్టిచేయు తనము), ఆత్మజ్ఞానము, అధిష్టాతృత్వము (అందరకి పైన ఉండువాడు) ఈ ఐదు నిత్యము శంకరునియందుండును. సమస్త దేవతలను ఋషులను అసురులను గూడ తేజస్సుతో అతిశయించును కాన అతడు మహాదేవుడన బడినాడు. అందువలన శంకరుడు ఐశ్వర్యము వలన దేవతలను బలముచే రాక్షసులను, జ్ఞానము చేత మునులను అందరిని, యోగమువలన భూతములను అన్ని విధముల మించినవాడు.
ఋషులు:
ఓ మహామునీ! యోగమును, తపమును, సత్యమును, ధర్మమును, మహేశ్వర జ్ఞానమును సాధనమును మాకు చెప్పుడు. బ్రాహ్మణులు ఏ యే ధర్మమును ఆచరించుటచే సద్గతిని (జ్ఞానమును) పొందగలరు? ఓ ప్రభో మహేశ్వరయోగమైన దానినంతయు వినగోరు చున్నాము అని పలికిరి.
వాయువు పలికెను:
రుద్రునిచే పురాణములందు ఐదు ధర్మములు చెప్పబడినవి. క్లిష్టకర్ములు గాని రుద్రులచే అది మాహేశ్వర్యముగా చెప్పబడినది. ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, భృగువులు, దేవాలయములు గలవారు. యముడు, శుక్రుడు ముందుగా గల పితరులు కాలాంతకులు. వీరు మరికొందరైన అనేకులచేత ఆ ధర్మములు ఉపాసింపబడినవి. వారు అత్యంతము క్షీణించిన కర్మలను కలిగి, శరత్కాల మేఘమువలె నిర్మలములైన మునిగణములు తమ ఆత్మయందు ఆత్మను సంధానముజేసి (కలిపి) ఉపాసింతురు. గురువులకు ప్రియమును హితమును చేయుటకు పూనుకొన్నవారు. గురువుల ప్రియమును కోరువారు మానుషజన్మను వదిలి దేవతలవలె విహరింతురు.
మహేశ్వరునిచే చెప్పబడిన ఆ ప్రాచీన ధర్మములను అన్నింటిని క్రమయోగమున చెప్పెదను వినుడు. ప్రాణాయామము అట్లే ధ్యానము ప్రత్యాహారము (ఇంద్రియములను విషయములనుండి మరల్చుట) ధారణ, స్మరణము ఈ అయిదును ఈ యోగమున ఐదు ధర్మములనబడినవి. క్రమ విశేషముతో వాని లక్షణమును కారణమును నిజముగా రుద్రుడు చెప్పిన రీతిగనే చెప్పబోవుచున్నాను వినుడు. ప్రాణము (వాయువు) యొక్క పొడవైన నడక ప్రాణము యొక్క ఆయామ మనబడును. అదియును మందము, మధ్యమము, ఉత్తమము అని మూడు విధములు. ప్రాణముల నిరోధము అనునది ప్రాణ వాయువులను అరికట్టుట ప్రాణాయామము అనబడినది. ప్రాణాయామ ప్రమాణము పండ్రెండు మాత్ర లనబడినది. మంద ప్రాణాయామము పండ్రెండు మాత్రలు, పండ్రెండు ఉద్ఘాతములు ప్రారంభములు. మధ్యమ ప్రాణాయామము రెండు ఉద్ఘాతములు, ఇరువది నాలుగు మాత్రల పరిమాణముకలది ఉత్తమ ప్రాణాయామము మూడు ఉద్ఘాతములు ముప్పది ఆరు మాత్రలు కలది చెమట, కంపము (వణుకు) విషాదములను కలుగజేయునది ఉత్త మము అనబడును. ఈ విధముగ ప్రాణాయామ లక్షణము మూడు విధములు. ఇది ప్రాణాయామము యొక్క ప్రమాణము సంగ్రహ లక్షణము.
సింహముగాని, ఏనుగుగాని అట్లే వేరొక మృగముగాని అరణ్యమున పట్టుకొనబడినదై సేవింపబడుచు క్రూరస్వభావము వదిలి మృదు స్వభావము కలదిఅగును. సమస్త పాపాత్ములకు పట్టుబడని ప్రాణము యోగము వలన సేవింపబడుచున్నదై అభ్యాసము వలన ఆ ప్రాణమే పట్టుబడును. ఆ ప్రాణమే సింహమువలె ఏనుగువలె కాలాంతర వశమువలన, యోగమువలన, పరిమర్దనమువలనను దుర్బల మగును. వాయువు యోగము నందుండి వశ్యత్వమును పొందును. అట్లే మనోదేవుని కప్పివాయువు ప్రాణము జీవించును. వాయువు యోగము నందుండి వశ్యత్వమును పొందినపుడు స్వేచ్ఛగా ప్రాణమును కోరినచోటికి కొనిపోవును. సింహము గాని, ఏనుగుగాని మనుష్యుల వశమందుండి మనుష్యులను ఇతర మృగముల నుండి ప్రవర్తించును. అభయమునకై అట్లే విశ్వతో ముఖమైన (సర్వవ్యాపియైన) వాయువు పరిచితమై పరిధ్యాయమానమై ప్రాణాయామమున శరీరమందు సంరుద్ధమై పాపమును దహించి వేయును. పెంచిన కుక్క యజమానిని ఇతరుల భయమునుండి రక్షించినట్లే సర్వవ్యాపియైన వాయువు ప్రాణవాయువుగా శరీరమున బంధింపబడి శరీర ఘాతుకములైన దోషముల నన్నింటిని దహించివేయునని భావము. ప్రాణయామముతో యుక్తుడైన నియమబద్ధుడైన బ్రాహ్మణునకు సర్వదోషములు నశించును. అతడు సుస్వస్థుడు కూడ అగును. సర్వ తపములు సర్వయజ్ఞ ఫలములు ప్రాణాయామమునకు సమానము. నూరేండ్లు ప్రతిమాసమున దర్భాగ్రముతో నీటి బిందు వును ఆ దర్భాగ్రముతోపాటు తిని ఉపవాసము చేయుటతో ప్రాణాయామము సమానము.
ప్రాణాయామములతో దోషములను దహింపజేయవలెను. ధారణలచే పాపములను దహింపచేయవలెను. ప్రత్యాహారముచే (ఇంద్రియముల విషయ నివృత్తిచే) విషయ సుఖములను, ధ్యానముచే అనీశ్వరములైన అనగా ఈశ్వరత్వ ప్రాప్తికి విరుద్ధములైన గుణములను దహింపచేయవలెను. కావున సమర్థుడైన యోగి ప్రాణాయామపరుడు కావలెను.వాడు సర్వ పాపములు తొలగి విశుద్ధాత్ముడై పరబ్రహ్మను జేరును.