పృథివీ దోహనం

కోపించిన మహర్షులు అరణిని మధించినట్లుగా మరల సంరంభముతో ఆ వేనుని కుడిచేతినిని మధించిరి. దాని నుండి పృథువు పుట్టెను. తేజస్సుగల పృథువు యొక్క అర చేతి నుండి, చేయిచఱపున పుట్టినందున అతడు పృథువయ్యెను. తరువాత అతడు తన శరీరముతో ప్రకాశించుచున్నవాడై, సాక్షాత్తు అగ్నివలె మండుచుండెను. మహాధ్వనిగలిగి మొట్టమొదటిదై అజగవమను పేరుగల శివధనువును, బాణములను, రక్షణ కొరకు మహాకాంతివంతమైన కవచమును ధరించి ఉండెను. అతడు పుట్టగనే అంతటను సమస్త భూతములు చక్కగా సంతసించెను. ఆ మహారాజు పుట్టగనే, వేనుడు గూడ స్వర్గమునకు పోయెను. ఆ విధముగ పుట్టిన ధీరుడైన సత్పుత్రునిచే రాజర్షియై పురుష శ్రేష్ఠుడైన ఆ వేనుడు పున్నామక నరకము నుండి రక్షింపబడెను. తరువాత నదులును సముద్రములును గలిసి మహాద్యుతిమంతుడును, మహారాజును అయిన వేనపుత్రుని (పృథువును) మహారాజ రాజ్యముతో అభిషేకించినవి. అంగిరసుని కుమారులైన దేవతలచే ఆ మహారాజు అభిషిక్తు డయ్యెను. ప్రతాపవంతుడును వేనపుత్రుడు అయిన పృథువు మొట్టమొదటి రాజైన మహా రాజు. అతని తండ్రిచే అపరంజితులైన (దుఃఖింప చేయబడిన) ప్రజలు ఆ పృథువుచే ఆనందింపజేయబడిరి. కావున ప్రజానురాగమును బట్టి అతనికి ‘రాజు’ అను పేరు కలిగెను. సముద్రమునకు ఎదురుగా విజయ యాత్రకు బయలుదేరిన, ఆ పృథువునకు దారి ఇచ్చుటకై జలములు అలలు లేక స్తంభించిపోయెను. పర్వతములు బ్రద్దలు అగుట మొదలు అయ్యెను. అతనికి విజయధ్వజ భంగము కలుగదాయెను. అతని సంకల్ప మాత్రముననే దున్నకయే, భూమి పంటలు పండించి ఇచ్చెను. అన్నములు స్వయం సిద్ధమగుచుండెను. గోవులుపాలతో సర్వకామములను పిదుకునవి అయ్యెను. దొప్పల కొలది తేనెలను (వృక్ష పుష్పములు) ఇచ్చుచుండెను. ఈ కాలముననే పవిత్రమైన బ్రహ్మయొక్క ప్రాజాపత్య యజ్ఞమున సౌత్యదినమున సుత్యయందు (సోమలతను దంచి పిండుట యందు) సూతుడు పుట్టెను. అతడు మహామేధావి. ఆ మహాయజ్ఞముననే ప్రాజ్ఞుడైన మాగధుడు బుట్టెను. ఇంద్రహవిస్సుతో బృహస్పతి హవిస్సు కలిసెను. అది ఇంద్రునకై హోమము చేయబడెను. దానిచే సూతుడు జన్మించెను. అచట ప్రమాదము కలిగెను. కర్మలలో ప్రాయశ్చిత్తముకూడ జరిగెను. శిష్యహవ్యముతో కలిసిన గురువుయొక్క హవిస్సు తిరస్కరింపబడెను. ఈ తలక్రిందులు ఆచరణమున అది వర్ణవికారమును చెందినది. క్షత్రము వలన బ్రాహ్మణ స్త్రీ యందు హీన యోని నుండి పుట్టిన సూతుడు (క్షత్రియునితో) సమానధర్మము గలవాడుగా అయ్యెను. క్షత్రోపజీవనమైన, అది మధ్యమమైన సూతధర్మము, రథనాగులు ఈ చరితమును నీచముగా చికిత్సితముగా చేయదలచినట్లుగా చేయబడినది. దేవర్షులు అచట పృథుని స్తుతించుటకై ఆ సూత మాగధులను పిలిచి మీరు పృథురాజును స్తుతింపుడు అనిరి. ఈ స్తుతించుట మీకు తగినపని. ఈ పృథువు కూడ మీ స్తుతికి తగినవాడు కూడ అగును అని పలుకగా, అపుడు ఆ సూతమాగధులు ఆ ఋషులు అందరితో ‘మేము దేవతలను ఋషులను వారి పనులతో స్తుతించి సంతోషపెట్ట గల వారము. మేమీతడు చేసిన పని ఎఱుగము. ఈతని లక్షణమును కీర్తిని ఎఱుగము. ఓ బ్రాహ్మణులారా! ఈతడు చేసిన ఏపనిని ఆధారముగా ఈ తేజస్వియైన రాజును స్తుతింపవలెనో సెలవిండు” అనిరి. ఓయి! అతడు భవిష్యత్కాలమున చేయబోవు సత్కర్మలతో స్తుతింపుడని ఋషులు ఆ సూతమాగధులను నియోగింపగా “పృథువు నిత్యము దాన ధర్మములందు నిరతుడు, సత్యవంతుడు, ఇంద్రియములను జయించిన వాడు, జ్ఞానశీలుడు, యుద్ధములలో అపజయమును పొందనివాడు. అని ఈ విధముగ మహాబలుడైన పృథువు చేసిన పనులను అన్నింటిని అతని శీలముతో జోడించి సూతమాగధులు పృథువును స్తుతించిరి. తరువాత స్తోత్రము ముగియగానే ప్రజా నాథుడైన పృథువు మిక్కిలి సంతసించినవాడై సూతునకు అనూపదేశమును (జలప్రాయమైన దేశము), మాగధునకు మగధ దేశమును ఇచ్చెను. అప్పటినుండి రాజులు సూతమాగధులచే స్తుతింపబడుచుండిరి. సూతమాగధ-వందులచే ఆశీర్వాదములతో మేలుకొల్పబడుచుండిరి. ఆ పృథువును జూచి మహర్షులు సంతసించినవారై ప్రజలనుగూర్చి “ఈ రాజైన వేనపుత్రుడగు పృథువు మీకు వృత్తినిచ్చువాడు (జీవనమిచ్చువాడు) అగుగాక’ అని అనిరి. అంత ప్రజలు మహాభాగుడైన వేనపుత్రుని వెంటబడి, “ఓ రాజా! మహర్షి వచనమువలన మాకు నీవు వృత్తిని కల్పింపుము” అని అడిగిరి. ఆ విధముగ ప్రజలతో వెంబడింపబడిన పృథువు ప్రజాహితము జేయగోరి, ధనుర్బాణములను తీసికొని బలవంతుడై భూమిని పీడించెను. ఈతని పీడన భయమున భయపడినదై భూమి ‘గో’ రూపమును ధరించి పరుగెత్తెను. పరుగెత్తుచున్న ఆ గోవును ధనువుతో వెంబడించెను. ఆ గోవు పృథువు భయమున బ్రహ్మలోకము మొదలగు లోకములకు వెళ్లి, ధనువెక్కు పెట్టి ఎదుట నిలిచిన పృథువును చూచెను. అతడు మండుచున్న జ్వాలలుగల బాణములతో దీప్తమైన తేజస్సు గలిగినవాడై అచ్యుతుడుగా ఉన్నాడు, మహా యోగము గలవాడు దేవతలకు కూడ జయింప అలవికానివాడు మహాత్ముడు. ఎల్లప్పుడు త్రిలోక పూజ్యమైన గోరూప ధారిణియగు భూదేవి ఎక్కడను రక్షణము లభించనిదై చేతులు జోడించినదై, పృథువునే చేరినది. తరువాత అతనితో ఇట్లనినది, “ఓ రాజా! స్త్రీ వధలో అధర్మమును చూడవా? నేను లేక ప్రజలను ఎట్లు ధరింపగలవు? ఓ రాజా! నా యందు లోకములున్నవి. నాచేతనే ఈ జగము ధరింపబడు చున్నది. ఓ రాజోత్తమా! నేను లేకున్న ప్రజలు వినాశము చెందుదురు. నీవు ప్రజల శ్రేయస్సును చేయగోరినచో నన్ను చంపకూడదు. నా ఈ మాటనువినుము. ఉపాయముతో ప్రారంభించిన అన్ని కార్య ప్రారంభములు సిద్దించును. నన్ను చంపికూడ ప్రజాపాలనము చేయజాలవు. నేను అన్నమై ఉండగలను. ఓ మహాద్యుతీ! కోపమును త్యజింపుము. అనేక జంతు జాతులలో గూడ స్త్రీలు వధింపదగిన వారు కారు అని చెప్పుదురు. దీనిని దలంచి ఓ రాజా! నీవు ధర్మమును విడనాడరాదు” అని పలికెను. మహామనస్సు గల ఆ రాజు (పృథువు) ఈ అనేక విధములైన గోరూప ధారిణియగు భూవాక్యమును విని కోపమును అణచికొని ధర్మాత్ముడై, ఆ భూమితో ఇట్లనెను. “ఒక్కని కొఱకు తనకు సంబంధించిన వారినికాని, పరులకు సంబంధించిన వారినికాని, ఒక్కరినికాని, అనేకులను గాని చంపిన వానికి పాపము కలిగిన కలుగునుగాక! కాని ఓ భద్రురాలా! ఏ ఒక్కనిని చంపినచో అనేకులు సుఖమును పొందుదురో ఒక్కనిని చంపినచో, చంపినవానికి పాతకముగాని, ఉపపాతకముగాని కలుగదు. ఓ వసుంధరా! జగత్తునకు హితమైన నామాటను ఆచరింపనిచో ప్రజానిమిత్తముగా నిన్ను వధించగలను. నా మాటను తిరస్కరించిన నిన్ను ఇపుడు నా బాణముతో చంపి విస్తరించి నేను ప్రజలను రక్షింతును. ఓ ధర్మధారణ శ్రేష్ఠురాలా! నా మంచి శాంతమైన మాటను విని ప్రజలను ఎల్లప్పుడు బ్రతికింపుము. నీవు దానికి సమర్థురాలవు. సంశయము లేదు. నాకు దుహితవు (పుత్రివి) కమ్ము. ఈ విధముగ నాకు ఈ గొప్ప వరమును ప్రసాదింపుము. ఓ భయంకర దర్శనము గలదానా! ధర్మమునకై ఉపయుక్తమగు దానివి కావలయునని, నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. అని ఇట్లు పృథువుచే చెప్పబడినదై భూదేవి “నేను అట్లే చేయుదును ఓ రాజా! సంశయము లేదు. కాని, నేను వాత్సల్యము గలదానినై ద్రవింపజేయ దగినట్టి దూడను ఇమ్ము. ఓ ధర్మధారులలో శ్రేష్ఠుడా! నేను అంతటను క్షీరము కలుగునట్లు స్రవించుటకు నన్ను అంతట సమురాలనుగా చేయుము. ఇట్లు మారు పలికెను. అంతట పృథువు అంతటను శిలాసమూహములను ధనువు యొక్క అంచుతో (కొనతో) పైకి ప్రసరింపజేయసాగెను. దానివలన శైలములు వర్ధిల్లినవి. మన్వంతరములు గడవగా భూమి ఎత్తు పల్లములు కలది అయ్యెను. భూమికి సహజముగనే సమములు విషములును ఏర్పడెను. పూర్వ సృష్టిలో విషమమగు భూమి పైన పురముల, గ్రామముల విభాగములేదు. సస్యములు లేవు. ‘గో’ రక్షణములేదు. వ్యవసాయము లేదు. వైశ్యుల మార్గములేదు. ఇట్టి స్థితి చాక్షుష మన్వంతరమునకు పూర్వము ఉండెనట. కాని వైవస్వత మన్వంతరమున ఈ పురగ్రామ సస్య గోరక్షా కృషి వ్యాపారముల యొక్క ఏర్పాటు జరిగినది. భూమిపైన సమతలము ఉన్నచోటులను ఎల్ల ప్రజలు ఎల్లప్పుడు నివసించుచుండిరి. ప్రజలకు ఫలములు ఆహారము అయ్యెను. పృథువు నుండి మొదలు లోకములో ఇది అంతయు సంభవించినది. ఓషధులు అన్నియు నశించి పోగా, ప్రభువైన పృథువు అతికష్టముతో చాక్షుష మనువును వత్సము (దూడ) గా చేసి భూమిభాగమున భూమి నుండి సస్యములను (పంటలను పితికెను. పృథువుచేత చాక్షుష మనువును దూడనుగాచేసి భూమయమైన పాత్రయందు సస్యములు (క్షీరములు) పితుకబడినవి. ఆ అన్నముచేత అప్పుడు ప్రజలు ఎల్లప్పుడును జీవనము గడుపుచుండిరి. ఋషుల చేత మరల స్తుతించి భూమిపితుకబడినది. వారికి దూడ సోముడు అయ్యెను. బృహస్పతి పితుకువాడు అయ్యెను. గాయత్రి మొదలగు ఛందములు పాత్ర (పాలు పితుకు ముంత) అయ్యెను. వారు పితికిన పాలు తపస్సు శాశ్వతమైన బ్రహ్మయు (వేదము) అయ్యెను. ఇంద్రుడు మొదలగు దేవతలు బ్రహ్మను స్తుతించి సువర్ణ పాత్రను తీసికొని వచ్చి అమృతమును పితికిరి దానిచేతనే ఇంద్రుడు మొదలగు దేవతలు అ అమృతముతోనే జీవించుచుండిరి. నాగులచే స్తుతింపబడిన భూమి అపుడు విషము క్షీరముగా పితికెను. వారిలో వాసుకి పితుకు వాడయ్యెను. దానివలన కాద్రవేయులు (కుద్రువ కుమారులు నాగులు) మహాతేజస్వులైరి. ఓ బ్రాహ్మణ శ్రేష్టా! నాగులకుగాని, సర్పములకుగాని ఆ విషముతోనే జీవనము, దానిచే పెద్ద శరీరములు గలవారై గొప్పగాను ఉప్పొంగినవారై, విషాహారులై, విషాచారులై, విషబలులై, విషాశ్రయులై ఉండిరి. అట్లే యక్షులచేతను, పుణ్యజనులచేతను (రాక్షసుల చేతను) వైశ్రవణుని దూడగా చేసి శ్రామపాత్రలో మరల పితుకబడినదై భూమి అంతర్ధానమందెను. పితుకువాడు జతు నాథుడు, అతడు మణివరుని తండ్రి, యక్షుని కుమారుడు, మహాతేజస్వి. ఇంద్రియములను తన వశమందు ఉంచు కొన్నవాడు. చక్కని మహాబలుడు, ఆ క్షీరముతో జీవనము గడుపు చున్నారని పరమర్షి చెప్పెనట. రాక్షసుల చేతను పిశాచుల చేతను మరల భూమి పితుకబడినది. వారికి బ్రహ్మతో గూడిన కుబేరుడు పితుకువాడుగా అయ్యెను. బలవంతుడైన సుమాలి అను రాక్షసుడు పితుకువాడై, క్షీరమును రక్తమును కపాల పాత్రలో పితుకగా అంతర్థానమైనది. క్షీరముతోనే భూలోకమున అంతట రాక్షసులు జీవనము గలవారు అగుచున్నారు. గంధర్వుల చేతను అప్సరోగణములచేతను చిత్రరథుని దూడగాజేసి ఆ భూమి నుండి పవిత్రములైన గంధములు పద్మపాత్రలో పితుకబడినవి. వారికి విశ్వావసువు పితుకువాడు అయ్యెను. ఆతడు మునికి పుత్రుడై పవిత్రమైనవాడు, గంధర్వరాజు, అతిబలుడు, మహాత్ముడు, సూర్యునితో సమానుడు. శైలములచే స్తుతింపబడినదై భూదేవి మరల పితుకబడెను. అపుడు పితుకబడినవి. ఆకారము దాల్చిన మహౌషధులు, వివిధములైన రత్నములును, వారికి దూడ హిమవంతుడు, పితుకువాడు మేరుమహా పర్వతము. పాత్రము శైలమే అయ్యెను. దానివలన శైలము ప్రతిష్ఠిత మయ్యెను. వృక్షముల చేతను తీగలచేతను స్తుతింపబడినదై భూమిమరల పితుకబడెను. మోదుగు ఆకును పాత్రముగా తీసికొని ఛేదించినను మరల మొలచు తత్త్వము పిండబడినది. కామములను పితుకువాడు పుష్పించిన శైలము, వటవృక్షము దూడ. కీర్తి మంతమైనది, సర్వ కామములను పితుకునది, త్రికాలములను ఉండునదియు అయిన ఆవు భూదేవి. అట్టి ఈ భూదేవి సృష్టికర్తయై, ధరించునదై, వసువుల (ధనముల) ధరించునదై లోకముల హితమునకై పృథువుచేత పితుకబడినది అని మాచే వినబడినది. అది చరాచరమైన ఈ లోకమునకు ప్రతిష్టా కారణము కూడా అయినది.