వాయు మహా పురాణము
వైవస్వత మన్వంతర వంశ గాంధర్వ మూర్ఛనా లక్షణ కథనము
సూతుడు ఇట్లు అనెను:
మను పుత్రుల యొక్క సృష్టిని విస్తరముగ వినుడు. పృషధ్రుడు గురువు యొక్క గోవును చంపి తినెను. మహాత్ముడైన చ్యవనుని యొక్క శాపము వలన శూద్రత్వమును పొందెను. కరూషునకు కారూషుడను క్షత్రియుడు యుద్ధ ధర్మదుడై వేయి క్షత్రియ గణముల విక్రమము కలవాడై పుట్టెను. నాభాగారిష్టుని పుత్రుడు భలందనుడు. భలందనుని పుత్రుడు ప్రాంశువను మహాబిలుడు. ప్రాంశువునకు ఒక పుత్రుడు. ప్రజాని అని ప్రసిద్ధి చెందినవాడు. ప్రజానికి ఖనిపుత్రుడు అను వీర్యవంతుడైన పుత్రుడు పుట్టెను. ఆతని పుత్రుడు శ్రీమంతుడైన క్షపుడు అనువాడు మహాయశస్వి. క్షపునకు వింశుడనువాడు పుత్రుడు. ఆతనికి సాటిలేదు. వింశుని పుత్రుడు కళ్యాణుడైన వివింశుడు అను ధార్మికుడు. వివింశుని పుత్రుడు ధర్మాత్ముడైన ఖనినేత్రుడు అనువాడు. అతడు ప్రతాపవంతుడు. ఆతని పుత్రుడు కరంధముడు త్రేతాయుగ ప్రారంభమున పుట్టెను. కరంధముని పుత్రుడు ఆవిక్షితుడు అను బిలవంతుడు, ఆవిక్షితునికి మరుత్తు అను చక్రవర్తితో సమానుడైన రాజు పుట్టెను. అతడు గుణములలో తండ్రినిమించెను. ఆతడు సంవర్తుని (పుత్రుని) చేత మిత్ర బాంధవులతో బాటు స్వర్గమును చేరెను. ఇచట సంవర్తునకును బృహస్పతికిని గొప్ప వివాదము జరిగెను. అతడికి చెందిన యజ్ఞము యొక్క సంపదను చూచి బృహస్పతి ఆతనిని కోపించెను.
సంవర్తునిచే యజ్ఞము హరింపబడగా అతడు మిక్కిలి కోపించెను. కాని లోకముల నాశనమునకై ఆతడు దేవతలచే శాంతింపచేయబడెను. చక్రవర్తియైన మరుత్తుడు నరిష్యంతుని (పుత్రునిగా) పొందెను. నరిష్యంతుని దాయాదుడు (పుత్రుడు) రాజైన దండ ధరుడైన దముడు. ఆతని పుత్రుడు రాజైన విక్రాంతుడు. రాష్ట్రమును వృద్ధిజేయువాడు. ఆతని పుత్రుడు సుధృతి అనువాడు. సుధృతి పుత్రుడు నరుడు. ఆతని పుత్రుడు కేవలుడు. కేవలుని పుత్రుడు బంధుమంతుడు. బంధుమంతుని పుత్రుడు ధర్మాత్ముడై రాజైన వేగవంతుడు. వేగవంతుని పుత్రుడు బుధుడు. బుధుని పుత్రుడు తృణ బిందువు. ఆతడు మూడవ త్రేతాయుగ ప్రారంభమున రాజైపుట్టెను. ఆతని కన్య ద్రవిడ అనునది. ఆమె విశ్రవసుని తల్లి. విశ్రవసుని పుత్రుడు రాజై పరమధార్మికుడైన విశాలుడు. విశాలునకు పుట్టినది నయ నిర్మితమైన విశాలుడు. విశాలుని పుత్రుడు రాజై మహాబలుడైన హేమ చంద్రుడు. హేమచంద్రుని తరువాత సుచంద్రుడు అని ప్రఖ్యాతి చెందినవాడు రాజు. సుచంద్రుని పుత్రుడు ధూమ్రాశ్వుడు అని ప్రసిద్ధి చెందిన రాజు. ధూమ్రాశ్వుని పుత్రుడు విద్వాంసుడైన సృంజయుడు. సృంజయుని పుత్రుడు శ్రీమంతుడై ప్రతాపవంతుడైన సహదేవుడు. సహ దేవుని పుత్రుడు పరమ ధార్మికుడైన కృశాశ్వుడు. కృశాశ్వుని పుత్రుడు మహాతేజస్వియై ప్రతాప వంతుడైన సోమదత్తుడు. రాజర్షియైన సోమదత్తుని పుత్రుడు జనమేజయుడు. జనమే జయుని పుత్రుడు ప్రమతిఅని ప్రసిద్ధిచెందినవాడు. తృణబిందువు యొక్క అనుగ్రహమున వారందరు వైశాలకులైన రాజులు. వారు దీర్ఘాయుష్మంతులు, మహాత్ములు, మంచి ధార్మికులు.
శర్యాతియొక్క జంటకు ఆనర్తుడను ప్రసిద్ధుడైన పుత్రుడు సుకన్య అను కన్యయు ఉండిరి. ఆ సుకన్య చ్యవనుని భార్యయైనది. ఆనర్తుని పుత్రుడు రేవుడు అనువాడు వీర్య వంతుడు. ఆతని దేశము ఆనర్త దేశము. పట్టణము కుశస్థలి. రేవునకు రైవతుడు పుత్రుడు. ఆతడు కకుద్మిఅను ధార్మికుడు. ఆతడు తన నూరుగురు తమ్ములకు జ్యేష్ఠుడు, కుశస్థలి నగరమును పొంది రాజయ్యెను. బ్రహ్మ దగ్గర కన్యతో పాటు గంధర్వుని విని దేవదేవుడైన ఆ ప్రభువు, ఒక్క ముహూర్తకాలము మర్త్యలోకములో బహుయుగములుగా వినియు, యువకుడుగానే యాదవులతో చుట్టబడిన తన నగరమునకు వచ్చెను. అది బహు ద్వారములుగ చేయబడి మనోహరమై ద్వారావతి అని పిలువబడెను. అది వసుదేవుడు మొదలు గాగల భోజ, వృష్టి, అంధకులచే రక్షింపబడి ఉండెను. శత్రుదమనుడైన రైవతుడు ఆ కథను ఉన్నది ఉన్నట్లుగా విని సువ్రతయై తన కన్యయైన రేవతిని బలదేవునకు ఇచ్చి, మేరు శిఖరమునకు వెళ్లి తపస్సులో ఉండెను. ధర్మాత్ముడైన బలరాముడును ఆ రేవతితో క్రీడావిహారము చేసెను అని తెలుపగా, ఋషులు ఆ కథను విని తరువాత ఇట్లడిగిరి.
ఋషులు:
ఓ సూతపుత్రా! అనేక యుగముల కాలము గడచినను రేవతి వృద్ధాప్యమును గాని తల నెరయుటను గాని ఏలపొందలేదు? మేరుపర్వతమునకు పోయిన ఆ శర్యాతి సంతతి ఈ భూమిలో ఇప్పటికిని ఎట్లు నిలిచి ఉన్నది? నిజముగా తెలియగోరుచున్నాము. అచట ఎన్ని దేవగణములు గంధర్వులుగా చెప్పబడినవి? అని ప్రశ్నించిరి.
సూతుడు ఇట్లు అనెను:
బ్రహ్మలోకమును పొందినవానికి ముసలితనము, ఆకలిదప్పులు, మరణ భయమును లేవు. రోగము కూడ వానికి కలుగదు. ఓ సువ్రతులారా! సత్పురుషోత్తములారా! గాంధర్వమును గురించి మీరు అడిగితిరి. కావున దానిని ఉన్నది ఉన్నట్లు చెప్పెదను. ఏడు స్వరములు, మూడు గ్రామములు, ఇరువది యొక్క మూర్ఛనలు, తాళములు నలుబది తొమ్మిది - అను ఇది స్వర మండలము. షడ్జ ఋషభములు, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదవంతము అనునవి ఏడు విధములైన స్వరములు (సరిగమపధని). సౌబీరి, మధ్యమగ్రామము, హరిణాస్య, ఉపబలోపేతయైన కల చతుర్థి శుద్ధమధ్యమ, శార్ఙ్గి పావని, దృష్టాక ఇవి వరుసగా మధ్యమ గ్రామికములుగా ప్రసిద్ధములు. షడ్జగ్రామమును వినుడు.
ఉత్తరమంద్ర అయిన రజని, అట్లే ఉత్తరాయత అయినదియు, శుద్ధ షడ్జ అగును. అట్లే సప్తమ గ్రామికము అని కూడ తెలియవలెను. తక్కిన గాంధార గ్రామికములను చెప్పెదను వినుడు. మొదటిది అగ్నిష్టోమికము, రెండవది వాజపేయికము, మూడవది పౌండ్రకము. నాల్గవది అశ్వమేధికము. ఐదవది రాజసూయకము, ఆరవది చక్ర సువర్ణకము. ఏడవది గోసవము అనునది, ఎనిమిదవది మహావృష్టికము, తొమ్మిదవది బ్రహ్మదానము. తరువాతిది ప్రాజాపత్యము. నాగపక్షాశ్రయము, గోతరము, హయ క్రాంతము, మృగక్రాంతము, మనోహరమైన విష్ణుక్రాంతము, వరణీయమై మత్తకోకిలల పలికించు సూర్య క్రాంతము, సావిత్రము, అర్ధసావిత్రము, సర్వతోభద్రము, సువర్ణము, సుతంద్రము, విష్ణు-వైష్ణువరులు రెండును, సాగరమును, సర్వభూత మనోహరమైన విజయమును ఇవి గాంధార గ్రామికములు. హంసమునే జ్యేష్ఠమైన గాంధార గ్రామముగా తెలుపుదురు. అది తుంబురునకు ప్రియము, మనోహరము, ధాత్రికి సంబంధించనిది. గంధర్వులు వెంబడించునది. అలంబుషకు ఇష్టమైనది. నారద ప్రియమైనది, సాగర ప్రియమైనది కూడా అని భీమసేనుడు చెప్పెను. చేతులతో తీసికొనిరాబడిన వినయవత్ లక్ష్మికలదని చెప్పబడెను. భార్గవ ప్రియమైనది. మధ్యమగ్రామము ఇరువది విధములు. షడ్జగ్రామము పదునాలుగు విధములు. గాంధార గ్రామములో ఉన్నవి పదియైదుగా చెప్పుదురు. సౌవీరమైన గాంధారి బ్రహ్మచే గానము చేయబడును. ఉత్తరాది స్వరమునకు బ్రహ్మదేవత. ఇట హరిదేశమున పుట్టిన హరిణాస్య కలిగెను. మూర్ఛన హరిణాస్యయే! దీనికి ఇంద్రుడు అధిదైవతము. స్వరమండలమున వాయువులచేత తీసికొనిరాబడి వశమైనది ‘కల’చే సమీపమునకు తీసికొని రాబడును. కావున ఇచట మారుతుడు అధిదైవతము. మనుదేశ సముత్పన్నమైన మూర్ఛన శుద్ధ మధ్యమము. ఇచట మధ్యమ స్వరము శుద్ధము. ఇచట గంధర్వుడు దేవత. సిద్ధులకు మార్గదర్శనము చేయుటలో మృగములతో పాటు సంచరించును. కావున మార్గి అనబడెను. దీనికి మృగేంద్రుడు దేవత. అది ఆశ్రమ సమాయుక్తయై అనేకములైన పౌరవములైన రవములను కూర్చుకొనినది. ఇది ఆరవముల యోజనయే. కావున రజస్సుతో రజని యైనది. తాలము ఉత్తర మంద్రాంశము. దానిని షడ్జధైవతకముగ తెలియుదురు. కావున ఉత్తర తాలమును మొదట స్వాయతముగ భావింతురు. కావున ఇది ఉత్తరమంద్రము. దీనికి ధ్రువము దేవత. ఇది నిశ్చయము. అపానమునకు ఉత్తరమైనందున దైవతమునకు ఉత్తరాయణము- ఇది మూర్ఛన శ్రాద్ధ దేవతలు పితరులు.
మహర్షులు శుద్ధ షడ్జస్వరమునుచేసి అగ్నిని ఉపాసింతురు కావున అగ్నిని శుద్ధ షడ్జకముగా తెలియవలెను. ఈ శుద్ధపడ్జకము సజ్జనులకు మూర్ఛననుచేసి పంచమస్వరము అగును.
యక్షిణుల యొక్క మూర్ఛన యాక్షికము అనబడును. నాగదృష్టి విషము కలదని గానము చేయబడినది. కావున ఆ మూర్ఛనను సమీపింపరు. బ్రహ్మచే ఈ నాగదేవతలు హరింపబడినవా అన్నట్లుండును. ఇది సర్పముల మూర్ఛన. ఇచట వరుణుడు దేవత. పక్షులను పోల్చుకొని కిన్నరులు పయనింతురు. ఈ మూర్ఛన ఉత్తమమైనది. ఇట పక్షిరాజు దేవత. గాంధార రాగశబ్దము వాక్కును (గోవును భూమిని) ధరించునను అర్థము ఇచ్చును. కావున విశుద్ధ గాంధారి. దీనికి గంధర్వుడు అధి దైవతము. మూర్ఛన గాంధార దేశము. గాంధారము తరువాత వెళ్లి సృష్టింపబడినది. కావున ఉత్తర గాంధారి అనబడినది. ఇట వసువులు దేవతలు. ఇది మహాభూతరూపయై బ్రహ్మను సమీపించినది. కావున ఈ మూర్ఛన షడ్జ అనబడినది. అగ్ని దేవతాకముగ చెప్పబడినది. ఇది దివ్యయై పొడవైనదై మూర్ఛనమున మంద్ర షష్ఠయైనది (మంద్రషడ్జు). గుణ-నామములులేని ఐదవది ఇట దైవతము. ఈ విధముగ పూర్ణములైన సప్తస్వరములు మూర్ఛనలు అనబడినవి. అట్లే నానా సాధారణములైనవి ఆఱేయని తెలుసుకొనవలెను.