వాయు మహా పురాణము
రజియుద్ధము
సూతుడు ఇట్లు అనెను:
ప్రభయందు పుట్టిన రాహువు యొక్క పుత్రులు ఐదుగురు మహాత్ములును బలవంతు లును అయిన రాజులుండిరి. వారిలో మొదటివాడు నహుషుడు, అతని నుండి పుత్రధర్ముడు పుత్రుడు అనిపిలువబడెను. ధర్మవృద్ధుని పుత్రుడు మహాయశస్వియైన సుత హోత్రుడు. సుతహోత్రుని పుత్రులు పరమధార్మికులైన మువ్వురు. అ మువ్వురు కాశుడు, శలుడు, గృత్సమదుడను ప్రభువు. గృత్సమదుని పుత్రుడు శునకుడు. అతనికి శౌనకుడు పుత్రుడు. ఈతని వంశములో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులును పుట్టిరి. వారు విచిత్రకర్మలతో ద్విజులు. శలుని పుత్రుడు ఆర్ణ్నిషేణుడు, అతని పుత్రుడు చరంతుడు శౌన కులు, ఆర్ష్ణిషేణుడు క్షాత్రముతో కూడిన ద్విజాతులు. కాశునకు కాశుయుడు రాష్ట్రుడు అతనికి పుత్రుడు దీర్ఘతపుడు, దీర్ఘతపునకు ధర్మడు, విద్వాంసుడైన ధన్వంతరియు, వృద్ధుడైన ధీమంతునకు తపస్సుతో సుమహాతేజస్వీ జనించెను” అని చెప్పెను. ఆ తరువాత ఋషులు మరల ఇట్లని అడిగిరి.
“దేవుడైన ధన్వంతరి భూమిలో మనుష్యుడై యెట్లు జనించెను? దీనిని మేము వినదలచితిమి. కావున మాకీ ప్రియమైన విషయమును చెప్పుడు”.
సూతుడు ఇట్లు అనెను:
ఓ బ్రాహ్మణులారా! ధన్వంతరి పుట్టుక చెప్పుచున్నాను వినుడు. పూర్వము అమృత మధన సమయమున సముద్రాంతమున అతడు జనించెను. అతడు సకలము కన్న పూర్వము పుట్టెను. అంతటను ఆవృతుడయ్యెను. సర్వసంసిద్ధకాయుడైన అతనిని విష్ణువు స్తంభించి నిలిచెను. నీవజుడవని అనెను. దాన నాతడు అజుడు అనబడెను. ఆ అజుడు విష్ణువుతో “నేను నీ పుత్రుడను మహాప్రభో-కావున ఓ దేవోత్తమా! లోకమున నాకు భాగమును స్థానమును కల్పింపుము” అనెను. ఈ విధముగ అడుగబడి ఆ విష్ణు ప్రభువు అతనినిచూచి ఇట్లనెను. యజ్ఞమునకు సంబంధించిన దేవతలచే యజ్ఞ విభాగము చేయబడినది. అట్లే మహర్షులచే విధియుక్తమైన విధి హోత్రముగూడ చేయబడినది. ఇక ఇచట ఎప్పుడైనను హోమము సమానముగా చేయుటకు సాధ్యము కాదు. ఓ దేవ! నీవు తరువాత (క్రిందుగా, ముందుగాగాక) పుట్టినవాడవు. పేరుకు మాత్రము దేవుడవు. రెండవ జన్మయందు లోకమున ఖ్యాతిని పొందెదవు, గర్భమునందు ఉన్నపుడే నీకు అణిమాదులతో కూడిన సిద్ధి కలుగగలదు. ఓ ప్రభూ! ఆ శరీరము తోడనే దేవత్వమును పొందగలవు. బ్రాహ్మణులు చక్కని మంత్రములతో, నేతులతో, గంధములతోను నిన్ను యజ్ఞమున పూజింతురు. ఇక నీవు మరల ఆయుర్వేదమును రచింపకలవు. ఈ విషయము తప్పనిసరిగా జరుగబోవునది. ఇది పూర్వము పద్మజన్ముడైన బ్రహ్మచే ఆదేశింపబడినది. రెండవ ద్వాపర యుగమును పొంది నీవు పై చెప్పిన విధముగ కాగలవు, సంశయములేదు. అని అతనికి వరమిచ్చి తరువాత విష్ణువు అంతర్థానమయ్యెను.
రెండవ ద్వాపరము రాగనే కాశిరాజైన సౌనహోత్రుడు పుత్రకాముడై దీర్ఘ తపస్వియై తపము చేసెను. ఆ రాజు పుత్రుని పొందు కొరకై అజదేవుని ఆరాధింపదలచెను. సంత సించిన ధన్వంతరి వరముతో రాజును అనుగ్రహించెను.
రాజు ఇట్లు అనెను:
“ఓ భగవంతుడా! నీవు నా యెడ సంతసించినచో, నా పుత్రుడవై ధృతిమంతుడవు కమ్ము అని ప్రార్ధించెను. ధన్వంతరియు అట్లే అని అనుమతించి అచటనే అంతర్ధానమందెను. అప్పుడు ఆ దేవుడైన ధన్వంతరి ఆ రాజు ఇంట జనించెను. మహారాజైన కాశీ రాజుగా జన్మించిన సర్వరోగ ప్రణాశనుడు భరద్వాజుడు ఆయుర్వేదమును రచించెను. వైద్య ప్రక్రియారూపమైన ఆ వేదము ఎనిమిది విధములుగా వేరుపరచి శిష్యులకు ఇచ్చెను. ధన్వంతరి సుతుడు గూడ కేతుమంతుడని ప్రసిద్ధి చెందినవాడు. ఓ ప్రభో! తరువాత కేతుమంతుని పుత్రుడు భీమరథుడు అను రాజు. ఈ కాలముననే పూర్వము శూన్యమైన వారాణసిని క్షేమకుడు అను రాక్షసుడు ప్రవేశించెను. ఆ వారాణసీ (కాశీ) పురి పూర్వము నికుంభుడను మహాత్మునిచే వేయి సంవత్సరములు శూన్యవగుదువు అని మాటి మాటికి శపింపబడినది. అట్లు శపింపబడినంత మాత్రముననే రాజైన దివోదాసు ఆదేశము చివర గోమతియందు రమ్యమైన పట్టణమున ప్రవేశింపజేసెను.
ఋషులు ఇట్లు అనిరి:
“పూర్వము నికుంభుడు ఆ వారాణసీ పురిని ఎందులకు శపించెను? నికుంభుడుని కూడ ధర్మాత్ముడు సిద్ధ క్షేత్రమును అట్లేల శపించెను?” అని అడిగిరి.
సూతుడు ఇట్లు అనెను:
రాజర్షియైన దివోదాసు ఆ నగరిని పొంది విశాలమైన ఆ నగరి యందు మహా తేజస్వియై నివసించుచుండెను. ఈ కాలముననే భార్యను పరిగ్రహించిన మహేశ్వరుడు తన దేవికి ప్రియము చేయగోరి దేవతల దగ్గర ఉండుచుండెను. దేవాజ్ఞతో శివపారిషదులు (ప్రమథ గణములోని చండికేశ్వరాదులు) తపోధనులై విశ్వరూపులు పూర్వము చెప్పబడిన రూప విశేషములచే మహేశ్వరిని సంతోషపెట్టుచుండిరి. వారిచేత మహాదేవుడు గూడ సంతసించుచున్నాడు. కాని మేనాదేవి సంతసించుట లేదు. ఆమె నిత్యము శివుని, పార్వతిని అసహ్యించు కొనుచుండెను. ఓ పాపరహితురాలా పార్వతీ! నీ ప్రక్కన అనాచారుడైన నీ భర్త మహేశ్వరుడు దరిద్రుడు ఉన్నాడు. ఇచట ప్రతివాడును సులభముగా పల్టీలు కొట్టు చున్నాడు. తల్లి అట్లనుటను పుత్రియైన పార్వతి స్త్రీ స్వభావము వల్ల సహించలేదు. చిరు నవ్వు నవ్వి తరువాత హరుని ప్రక్కకు చేరెను. విషాదము చెందిన ముఖముకలదై శివునితో ‘దేవ! నేనిచట ఉండను. నన్ను మీ ఇంటికి తీసికొని పొండు’అని అనెను. పార్వతి అట్ల నగనే, ఓ బ్రాహ్మణోత్తములారా! మహాతేజస్వియైన శివుడు అన్ని లోకములను చూచి భూమి యందలి సిద్ధక్షేత్రమైన వారాణసియందు నివసించుటకై ఇష్టపడెను. భవుడు వారాణసిని దివోదాసుడు నివసించియున్న దానినిగా ఎరిగి తన ప్రక్కనున్న గణేశుడైన క్షేమకుని పిలిచి, ఓ గణేశ్వరా! ఈ పట్టణమునకు వెళ్లి వారాణసిని శూన్యముగా చేయుము. ఆ రాజు దివోదాసు అతి బలవంతుడుగాన మెత్తగను ఉపాయముతోను వారాణసిని శూన్యముగా చేయుము-అనెను. తరువాత పూర్వము నికుంభుడు వారాణసిపురికి వెళ్లి స్వప్నమున అంకసుడను మంగలివానికి చూపెను. ఓ పాప రహితుడా! నీకు శ్రేయమును కలుగ చేసెదను, నాకు స్థానమును కల్పింపుము. నా రూపముతో ఒక ప్రతిమను విగ్రహమును) చేసి ఈ కాశీ నగరము చివర ప్రతిష్ఠించి ఉంచుము. ఓ బ్రాహ్మణులారా! స్వప్నమున చూచిన విధమును యథావిధిగా రాజునకు తెలిపి, అనుమతిని పొంది, ఆ విధముగనే నగరీ ద్వారమున (నికుంభుని) గణేశుని రూపమున విగ్రహము జేయించి నగరి చివరన నిలిపెను. నిత్యము గంధములతో, ధూపములతో, సుందర మాలలతోను ఆ గణేశునకు మహాపూజ జరుగుచుండెను. అన్న ప్రదానముతో గూడిన పై పూజలు జరుగుచుండ అత్యద్భుతముగా ఉండెను. ఈ విధముగ అచట నిత్యము గణేశ్వరుడు పూజింపబడు చుండెను. తరువాత నగరవాసులకు వేల వరములను ఇచ్చుచుండెను. పుత్రులను, బంగా రమును, ఆయువులను అట్లే అన్ని కోరికలను ఇచ్చుచుండెను. రాజునకు శ్రేష్ఠయై సుయశ అను పేరొందిన పట్టపురాణి ఉండెను. రాజుచే ప్రేరేపింపబడినదై పతివ్రతయైన దేవి పుత్రప్రాప్తికై ఆ గణేశుని కడకు వచ్చెను. విశాలమైన పూజను చేసి ఆ దేవి పుత్రులను ఇమ్మని అడిగెను. తరువాత గూడ పుత్రకారణమున మాటి మాటికి అనేక పర్యాయములు వచ్చి పూజించి పుత్రులను అడిగెను. నికుంభ గణేశుడు మాత్రము రాజు కోపించినచో కొంత ప్రవర్తింప గలిగి ఉండుట వలన పుత్రులను ఈయలేదు. కాని, చాల కాలమునకు రాజును క్రోధము ఆవేశించెను. ఈ భూతము మహాద్వారమున నగరవాసులకు ప్రేమతో నూర్లకొలది వరములు ఇచ్చుచున్నది. నా వారితో నిత్యము ఆ నగరిలో పూజింప బడుచున్నాడు. ఏ మాత్రము అనుగ్రహమున ప్రవర్తించుట లేదు. నా దేవిచేత అచట పుత్ర కారణమున అనేక విధముల పూజింపబడియు నాకు పుత్రుని ఈయడు. ఈతడు బహుభోజనుడైన కృతఘ్నుడు. కావున నా నుండి పూజకీతడు అనర్హుడు. కావున ఎటులనైనను ఆ దురాత్ముని యొక్క స్థానమును నశింపజేయుదును అని ఈ విధముగ నిశ్చయించి పాపియైన రాజు దురాత్ముడై దుర్మతియై ఆ నికుంభగణేశుని స్థానమును నశింపజేసెను. ఆ విధముగ భగ్నమైన నివాసమును జూచి ప్రభువైన గణేశుడు రాజు కడకు బోయెను. ఓ రాజా! నీవు నా అపరాధము లేకుండగ నీచే నా స్థానము ధ్వంసము చేయబడినది. కావున నీ పురి అకస్మాత్తుగా శూన్యమగును. అందువలన నికుంభ గణేశుని శాపముచే వారాణసి శూన్యమైనది. తరువాత శపించిన వారాణసీ పురికి శివుని తీసికొని వచ్చెను. శూన్యయైన అపురిని మహాత్ముడైన శివుడు పరమాత్మతో నిర్మించెను. దేవతల ఐశ్వర్యమునకు సమానముగను, దేవి (పార్వతి) యొక్క యైశ్వర్యమునకు సమానముగను వారాణసిని నిర్మించెను. అచట ఈశ్వరుడు రమించుచుండ దేవియు రమించుచుండెను. కాని, గృహ విస్మయము వలన దేవి రతిని పొందలేదు. దేవియొక్క క్రీడకై ఈశానదేవుడు నేను ఈ ఇంటిని వదలను, అవిముక్తమే (వదలబడనిదే) అనగా కాశియే నా గృహము అని అనెను. దేవీ! నేనిటనుండి వెళ్లను, నీవు వెళ్లుము. ఇచట నేను ఆనందముగ క్రీడిం తును. అందువలన అది దేవునిచే స్వయముగ వదలబడని యవిముక్త (క్షేత్ర) మని చెప్పబడినది. ఈ విధముగ వారాణసి శపింపబడినది. అవిముక్తమని కీర్తింపబడినది. అచట సర్వదేవ నమస్కృతుడైన మహాదేవుడు నివసించును. మూడు యుగములలో ధర్మాత్ముడైన మహాదేవుడు తన దేవితో బాటు ఇటనుండును. కలియుగమున మహాత్ముని ఆ పురము అంతర్ధానమును పొందును. పురము అంతర్జాన మందినను మరల ఆ పురి ఉండును. ఈ విధముగ వారాణసిని శపించి తన స్థానమునకు మరల వచ్చినది. ఉత్తమ ధనుర్ధారులైన నూర్వురు భద్రశ్రేణ్యుని పుత్రులను చంపి దివోదాసుడను రాజు ప్రవేశించెను. మహాబలవంతుడైన ఆతనిచే భద్రశ్రేణ్యుని రాజ్యము అపహరింపబడినది.
భద్రశ్రేణ్యుని పుత్రుడు పేరుతో దుర్దముడు. దివోదాసుని చేత బాలుడని దయతో వదిలిపెట్టబడెను. దివోదాసునకు దృషద్వతియందు వీరుడైన ప్రతర్దనుడు పుట్టెను. అ పుత్రుడైన బాలునిచే (దుర్దమునిచే) దివోదాసుపై ప్రహారము చేయబడినది. ఈ వైరమునకు అంతము చేయదలచిన దివోదాస రాజుచే మరల దుర్దమునిపై ప్రహారము చేయబడినది. ప్రతర్దుని పుత్రులు ఇద్దరు. వత్సుడు, గర్ణుడు అని ప్రసిద్ధి చెందినవారు. వత్సుని పుత్రుడు అర్ముడు, అతని పుత్రుడు సన్నతి. అలర్కుని గూర్చి రాజర్షిచే గానము చేయబడిన ప్రాచీన శ్లోకములు రెండు. అరువది వేల అరువది వందల సంవత్సరములు యువక రూపములో ఉన్న అలర్కుడు కాశీ సత్తముడు. లోపాముద్రా ప్రసాదమున పరమాయువును పొందెను. శాపావసానమున మహాబాహువైన అలర్కులు క్షేమక రాక్షసుని చంపి రమ్యమైన వారణసీ పురిలో నివసించెను. సన్నతి పుత్రుడు ధార్మికుడైన సునీథుడు. సునీథుని పుత్రుడు సుకేతుడు. సుకేతుని పుత్రుడు ధర్మకేతువు. ధర్మకేతుపుత్రుడు మహారథి సత్యకేతువు. సత్యకేతు పుత్రుడు ప్రజేశ్వరుడైన విభువు, విభు పుత్రుడు సువిభువు. అతని పుత్రుడు సుకుమారుడు. సుకుమార పుత్రుడు ధార్మికుడైన ధృష్టకేతువు. ధృష్టకేతు పుత్రుడు రాజైన వేణుహోత్రుడు. వేణుహోత్ర సుతుడు ప్రసిద్ధుడైన గార్డ్యుడు, గార్డ్యునకు గర్గభూమి, వత్సునకు వాత్స్యుడును పుత్రులు. వారిరువురికి సుధార్మికులైన బ్రాహ్మణులును క్షత్రియులును పుత్రులు. వారు విక్రమము బలమును కలవారు, సింహముతో సమానమైన పరాక్రమము కలవారు. వీరిని కాశ్య పులుగా చెప్పుదురు. రజియొక్క పుత్రులను కూడ వినుడు. రజికి నూర్గురు పుత్రులు ఉండిరి. భూలోకమున అయిదుగురు వీర్యవంతులు. రాజేయమని ప్రసిద్ధి చెందిన క్షత్రమిది. ఇంద్రునకు గూడ భయము గొల్పునది. అపుడు మిక్కిలి భయంకరమైన దేవాసుర యుద్ధము జరుగగా దేవతలును రాక్షసులును బ్రహ్మదేవుని అడిగిరి. “ఓ భగవంతుడా! మా ఇరువురిలో విజేత యెవ్వడు అగును? ఓ సర్వలోకేశా! మాకు చెప్పుము వినదలచితిమి” అనిరి.
బ్రహ్మ ఇట్లు అనెను:
ఆయుధములను గ్రహించి ప్రభువైన ‘రజి’ యుద్ధము చేయుచో! వారు త్రిలోకములను జయింతురు. రాజు కోపించినచో కొంత ప్రవర్తింప కలిగి ఉండుట సంశయములేదు. రజి ఎట ఉండునో అట లక్ష్మి ఉండును. లక్ష్మి ఉన్నచోట ధృతి (ధైర్యము) ఉండును. ధృతి ఉన్న చోట ధర్మము, ధర్మము ఉన్నచోట జయమును ఉండును. అది విని దేవ దానవులు అందరు జయమును గోరి రజి రాజును పొగడుచు చేరిరి. ఆ దేవదానవులు అందరు సంతసించిన మనములు గలవారై ఆ రజి రాజుతో ‘మా జయమునకై నీవు ధనువును గ్రహింపుము’ అనిరి.
రజి ఇట్లు అనెను:
మన యుద్ధములో శుక్రుడు మొదలుగా గల దేవతలను జయింతును. ధర్మాత్ముడనై ఇంద్రుడను అగుదును. అందులకే రణమున యుద్ధము చేయుదును.
దానవులు ఇట్లు అనిరి:
మనకు ఇంద్రుడు ప్రహ్లాదుడు. అతని కొరకు విజయమును పొందెదము. ఈ సమయమున ఓ రాజా! దితికి సంబంధించిన మా కొఱకై నిలువుము. రజి అట్లే అను చుండగనే దేవతలు గూడ-’నీవు మా వైపు నుండి జయించి ఇంద్రుడవు కాగలవు’ అని ప్రేరేపింపించి ఆహ్వానించిరి. అపుడు రజి ఇంద్రుని యొక్క ఎదుటనే సమస్త దానవులను జంపివైచెను. అట్లు దానవులను జంపి దానవులు ఈ వరకు గ్రహించుటచే వినష్టమైన దేవతలయొక్క శ్రీని గ్రహించి పరమ శ్రీమంతుడై రజి వశియై ఉంటిని అనెను. ఇంద్రుడు ఆ విధముగ దేవతలతో ఉన్న ‘రజి’ని చూచెను. నేను రజిపుత్రుడను అని చెప్పి, మరల ఇట్లనెను. ఓ రజిరాజా! నీవు సర్వ దేవతలకు ఇంద్రుడవు. ఈ విషయమున సంశయము లేదు. ఓ శత్రుహంతా! దేవతలకు ఇంద్రుడవైన నీకు పుత్రునిగా ఖ్యాతిని పొందుదును. ఆ రజి ఇంద్రునిమాటను విని అతని మాయచే వంచింపబడినవాడై, ఆ మాటలకు సంతసించుచు రజిరాజు అట్లే అని ఇంద్రునితో అనెను. దేవ సమానుడు అయినన ఆ రజిరాజు స్వర్గమునకు చేరగా రజిపుత్రులు ఇంద్రుని నుండి దాయాద్యమును (ఇంద్రపుత్ర భాగమును) ఆచారమును హరించిరి. ఈ రజియొక్క ఆ నూర్వురు పుత్రులును ఆ శచీపతియైన ఇంద్రుని యొక్క స్థానమును, మూడవ లోకమైన స్వర్గమును ఆక్రమించిరి. తరువాత పెద్దకాలము జరిగిపోగా, మహాబలుడును, హరింపబడిన రాజ్యము కలవాడును హరింపబడిన (యజ్ఞ)భాగము కలవాడును అయిన ఇంద్రుడు బృహస్పతితో ఇట్లనెను. ఓ బ్రహ్మర్షీ! నాకు రేగుబండంత పురోడాశమును సిద్ధింప చేసి ఇమ్ము. దానివల్ల తృప్తిచెందిన వాడనై, తేజస్సుతో ఉండగలను. ఓ బ్రహ్మదేవా! రజిపుత్రులచే ఈ ఇంద్రుడు క్షీణించినవాడు, విమనస్కుడు, హరింపబడిన రాజ్యము గలవాడు, హరింపబడిన భోజనము కలవాడు, ధ్వంసము చేయబడిన ఓజస్సు కలవాడు, దుర్బలుడు, మూఢుడును అయినాడు. నన్ను అనుగ్రహింపుము.
బృహస్పతి ఇట్లు అనెను:
“ఓ ఇంద్ర! పూర్వమే నీవు ఇట్లు నన్ను ప్రేరేపించి ఉండినచో (నాకు జెప్పియుండి నచో) నీ ఇష్టసిద్ధికై నాకు చేయరానిది అనెది ఉండెడిది కాదు. ఓ మహాద్యుతి ఇంద్రా! నీ హితము కొఱకు ప్రయత్నించును. దానివలన నీ భాగమును రాజ్యమును తొందరలోనే పొందగలవు. దానికై పోవుదును. నీ మనము బాధ చెందకుండుగాక. తరువాత బృహ స్పతి అతని తేజమును వృద్ధిచేయు మహాకర్మ (యాగము)ను చేసెను. బుద్ధిమత్పండిత ఉత్తముడు అయిన బృహస్పతి ఆరజి మొదలగు వారి బుద్ధికి సమ్మోహమును కలిగించెను. దానివల్ల అపుడు ఆ రజిసుతులు మూఢులు, రోగోత్పన్నులు, విధర్ములు బ్రహ్మ ద్వేషులును నశించిన బలపరాక్రమములు కలవారును అయిరి. దాని వలన ఇంద్రుడు కామ క్రోధ పరాయణులైన రజిసుతుల అందరిని చంపి దేవైశ్వర్యమును, ఉత్తమమైన బంద్ర స్థానమును బొందెను. శతక్రతువైన ఇంద్రుని యొక్క ఈ పవిత్ర స్థానమును ప్రతిష్ఠానమును, రజియొక్క స్థాన ప్రతిష్ఠానములను గాని వినువాడు ధన్యాత్ముడు కాగలడు.