వాయు మహా పురాణము
నక్షత్రవిశేష శ్రాద్ధ ఫలము
బృహస్పతి ఇట్లు అనెను:
శశి బిందువునకు యముడు చెప్పిన శ్రాద్ధములను వేర్వేరు నక్షత్రములలో మొత్తముగా నా నుండి వినుము. కృత్తికా నక్షత్ర యోగమున ఎప్పుడు శ్రాద్ధము చేయువాడు అగ్న్యా ధానముచేసి సంతానముతోబాటు జ్వరములేనివాడు అగును. సంతానకాముడు రోహిణి యందు శ్రాద్ధము చేయవలెను. మృగశీర్షా నక్షత్రమున చేసిన ఓజస్వి అగును. ‘ఆర్ర్దా’ నక్షత్ర శ్రాద్ధమున సామాన్యముగ క్రూరకర్ముడు అగును. పునర్వసు నక్షత్ర శ్రాద్ధమున క్షేత్రములను పుత్రులను పొందును. పుష్యమీ నక్షత్ర శ్రాద్ధమున ధనధాన్యములు నిండి పుత్ర పౌత్రులతో సమాకులుడు అగును. తుష్టిని పొందును. ఆశ్లేషా నక్షత్ర శ్రాద్ధమున వీరులగు పుత్రులనందును. మఘా నక్షత్ర శ్రాద్ధమున బంధువులలో శ్రేష్ఠుడగును. పూర్వ ఫల్గునీ నక్షత్ర శ్రాద్ధమున సౌభాగ్యమునందును. ఉత్తరఫల్గునీ నక్షత్ర శ్రాద్ధమున సంతానముతో కూడి ప్రధానశీలుడు అగును. పూర్వఫల్గునీ నక్షత్ర శ్రాద్ధమున హస్తా సత్పండితులలో ముఖ్యుడగును. చిత్రానక్షత్ర శ్రాద్ధమున రూపవంతులైన సుతులను పొందును. స్వాతీ నక్షత్ర శ్రాద్ధమున చేసిన విద్వాంసుడు లాభమును పొందును. విశాఖా నక్షత్ర శ్రాద్ధమున పుత్రుడు కల్గును. అనూరాధా నక్షత్ర శ్రాద్ధమున చక్రవర్తి అగును. జ్యేష్ఠా నక్షత్ర శ్రాద్ధమున శ్రేష్ఠమైన ఆధిపత్యమునందును. మూలా నక్షత్ర శ్రాద్ధమున ఆరోగ్యమునందును. పూర్వా షాఢా నక్షత్ర శ్రాద్ధమున మహాకీర్తి నందును.
ఉత్తరాషాఢా నక్షత్ర శ్రాద్ధమున దుఃఖము లేనివాడు అగును. శ్రవణా నక్షత్ర శ్రాద్ధమున మంచి లోకములలో పరమగతిని పొందును. ధనిష్ఠా నక్షత్ర శ్రాద్ధమున రాజ్యమును విపుల ధనమును పొందును. అభిజి న్నక్షత్ర శ్రాద్ధమున అజావికమును (కంబళ్ళను) పొందును. శతభిష నక్షత్ర శ్రాద్ధమున వైద్యసిద్ధిని పొందును. పూర్వాభాద్రా నక్షత్ర శ్రాద్ధమున మేకలను, గొఱ్ఱెలను లేదా కంబళ్ళను పొందును. శతభిష నక్షత్ర శ్రాద్ధమున వైద్యసిద్ధిని పొందును. పూర్వాభాద్ర నక్షత్ర శ్రాద్ధమున అజావికమును (కంబళ్లను) పొందును. ఉత్తరాభాద్రా నక్షత్ర శ్రాద్ధమునవేల గోవులను పొందును. రేవతీ నక్షత్ర శ్రాద్ధమున బహురూపముల చేయబడిన ద్రవ్యమును పొందును. అశ్వినీ నక్షత్ర శ్రాద్ధమున అశ్వములను పొందును. భరణీ నక్షత్ర శ్రాద్ధమున ఉత్తమమైన ఆయువునందును. ఈ శ్రాద్ధ విధిని చేయుచు శశబిందువు ఈ భూమి అంతటిని పొందెను. ఆవిధముగ సమస్త భూ మండలమును పొందిన ఆతనిని బృహస్పతి ప్రశంసించెను.