వాయు మహా పురాణము
అరిష్టములు
వాయువు పలికెను:
ఆపైన అరిష్టములను వినుడు. వాని జ్ఞానమున మానవుడు తన మరణమును (రాబోవు దానిని) చూడగలడు. అరుంధతీ నక్షత్రమును ధ్రువ నక్షత్రమును, చంద్రకాంతిని, రాజ మార్గమును చూడలేని నరుడు సంవత్సరము దాటి జీవింపడు. సూర్యుని కిరణములు లేని వానిగను, అగ్నిని కిరణములు గల దానిగను చూచువాడు, పదునొకండు మాసములు దాటి జీవింపడు. ప్రత్యక్షముగా గాని, స్వప్నమునగాని, మూత్రమును గాని, పిడకను గాని, వెండినిగాని, బంగారమునుగాని వాంతి జేసికొన్నవాడు పదిమాసములు జీవించును. ధూళియందుగాని, బురదయందుగాని, ముందుగాని, వెనుక భాగమునగాని తన అడుగు తెగిపోయినట్లు కనబడినచోవాడు ఏడు నెలలు మాత్రము జీవించును. కాకిగాని, పావురముగాని, గ్రద్దగాని, మాంసము తినుపక్షిగాని, తనతలయందు లీనమయినట్లు చూచినవాడు ఆరు మాసములు దాటి జీవింపడు. కాకుల పంక్తులతో కట్టివేయబడిన వాడుగాని, ధూళి వర్షముతో చుట్టబడినవాడుగాని, తన నీడను వికారముగా చూచిన వాడుగాని, నాలుగైదునెలలు జీవించును. దక్షిణ దిక్కున మేఘములు లేకయే తెలుపును గాని, జలమున ఇంద్రధనువును గాని చూచినవాడు రెండు మూడు నెలలు జీవించును. నీటిలోగాని, అద్దములోగాని తనను చూడలేనివాడును, చూచినచో తలలేని తనను చూచు వాడును నెలదాటి జీవింపడు. తన శరీరమున శవ గంధముగాని, వసాగంధముగాని వచ్చుచున్నవాడు మరణము సమీపించినవాడు అగును. సగము నెల కూడ జీవింపడు.
ఒక్కసారి భేదించుకొని వచ్చిన వాయువు మర్మస్థానములను కత్తిరించగా నీరు చల్లినను హర్షించనివాడు మృత్యువు సమీపించినవాడు. ఎలుగుగొడ్లతోను, కోతులతోను, లాగబడుచున్న రథములో గానము చేయుచు దక్షిణ దిక్కునకు పోవుచున్నట్లు తనను స్వప్నమున జూచువాడు మృత్యువు సమీపించినవాడని తెలియవలెను. స్వప్నమున నల్లని వస్త్రము ధరించి, నల్లని స్త్రీ గానము చేయుచు దక్షిణ దిక్కునకు పోయినచోవాడు జీవింపడు. స్వప్నమున రంధ్రములుగల నల్లని వస్త్రమును ధరించినవానికిని, చెవి భగ్నమైనట్లు చూచినవానికిని మరణము సమీపించినదని తెలిసికొనవలెను. తలనిండా బురద సముద్రమున తాను మునిగినట్లు స్వప్నమున చూచినవాడు వెంటనే మరణించును. బూడిదను, నిప్పుకణికలను, వెంట్రుకలను, ఎండినగడ్డిని, పాములను, స్వప్నమున చూచినవాడు పదిరాత్రులుగూడ జీవింపడు. వికటాకారులై ఆయుధములెత్తిన నల్లని పురుషులచే స్వప్నమున రాళ్లచే కొట్టబడినవాడు వెంటనే మరణించును. సర్వోదయమున ప్రభాతకాలమున ప్రత్యక్షముగా నక్కకూత పెట్టుచూ ఎదురుగా వచ్చినచో మనుష్యుడు మరణించును. స్నానము చేసినంతమాత్రమున గుండె మిక్కిలి పిండబడి, పండ్లు ఇకిలించిన వానిని మరణించినవానిగా చెప్పవలెను. రాత్రియందుగాని పగటియందుగాని మాటిమాటికి శ్వాసను తీయువాడుగాని దీప (నిర్వాణ) గంధమును వాసన చూడలేని వాడుగాని మరణము సమీపించిన వాడగునని తెలియవలెను.
రాత్రిలో ఇంద్రధనుస్సును (సింగిడిని), పగలు నక్షత్ర మండలమునుగాని ఇతరుల నేత్రములలో తనను చూచినవాడు బ్రతుకడు. ఒక కంటిలో నీరుకారినను, చెవులు తమ స్థానమునుండి జారినను, ముక్కు వంకరయైననువాడు చచ్చినవాడని తెలియవలెను. నాలుక నల్లనై ఎండిపోయినను, ముఖము బురద రంగు తేలినను, చెక్కిళ్లును, చప్పిడి ముక్కులును ఎఱ్ఱనైనను, వానికి మృత్యువు సమీపించినదని తెలియవలెను. వెండ్రుకలు విరబోసికొని, నవ్వుచు, గానము చేయుచు, నాట్యము చేయుచు, దక్షిణ దిక్కుగా (స్వప్నమున) బోవువాడువాని జీవితమును చాలించును. మాటిమాటికి తెల్లఆవాలవంటి చెమట బిందువులు వంటినిండ ఏర్పడినవాడు మరణము సమీపించినవాడని తెలియవలెను.
స్వప్నమున తన రథమునకు ఒంటెలుగాని, గాడిదలుగాని కట్టబడియుండిన వాడై, దక్షిణాభి ముఖముగ పోయినవాడు బ్రతుకడు. ఇచట రెండు గొప్ప అరిష్టములు కలవు. వీని రూపము గొప్పదగును. చెవిలో ధ్వని వినలేదు. కంటిలో జ్యోతిని జూడలేడు. స్వప్నమున ద్వారము(దారి) లేని గోతిలోబడి లేవలేకున్నవాడు వెంటనే మరణించును. ఒక వ్యక్తి దృష్టిపైకి పోయినను నిలకడగా లేకున్నను మరియు ఎఱ్ఱనై తిరుగుచుండినను ముఖరంధ్రము నాభి వేడిగా ఉన్నను మూత్రము మిక్కిలివేడియైననువాడు విషమస్థుడే చచ్చువాడే. (స్వప్నమున) పగలుగాని రాత్రిగాని ప్రత్యక్షముగా చంపబడువాడు తనను చంపువానిని చూచినచో ఆ చంపబడినవాడు బ్రతుకడు. స్వప్నము చివర అగ్నిప్రవేశము చేసి స్మృతిని పొందని మానవుడు అంతటితోనే మరణించును. స్వప్నమున తాను కప్పుకొన్న తెల్లని వస్త్రమును ఎఱ్ఱనిదిగను, నల్లనిదిగను చూచినవానికి మరణము సమీపించును. అరిష్టము సూచింపబడిన దేహమున ఆ కాలము రాగానే భయమును దుఃఖమును వదిలి బుద్ధిమంతుడైన మానవుడు నిద్రనుండి లేవవలెను. తూర్పునకు గాని, ఉత్తరమునకు గాని బయలుదేరి, శుచియై ఎగుడు దిగుడులు లేక సమతలమై ఏకాంతమై నిర్జనమైన, కదలికలేని స్థిరమైన ప్రదేశమున ఉత్తరము వైపుగాని, తూర్పువైపుగాని ముఖముజేసి స్వస్థుడై చక్కగా ఆచమనము చేసిన వాడై, స్వస్తికాసనమున కూర్చొని మహేశ్వరునికి నమస్కరించవలెను. శరీరము కంఠము శిరము సమముగా నిట్టనిలువుగా ఉంచి కన్నులు మూసి చిత్తమును ఆ మహేశ్వరునియందు నిలుపవలెను. ఆతడు నివాతనిష్కంపమైన ప్రదీపంవలె ధారణాసమాధిలో ఉండవలెను. కావున యోగమును తెలిసినవాడు తూర్పు - ఉత్తర దిక్కుల ప్రదేశమున యోగ ధారణము చేయవలెను. ప్రాణమున (ప్రాణస్థానమైన హృదయమున) నిత్యము యోగముతో రమింపవలెను. అట్లే నేత్రములందు, స్పర్శనమునందు, చెవులయందు, మనస్సునందు, బుద్ధి యందు, అట్లే వక్షస్థలమందును, యోగధారణము (చిత్తబంధము) చేయవలెను. కాల ధర్మమునుతెలిసి అన్ని విధముల సమూహము, పండ్రెండు విధములైన ఆధ్యాత్మము అనునది యోగధారణము అనబడును. నూరు పర్యాయములుగాని, ఎనిమిదినూరుల పర్యాయములు గాని శిరమున యోగధారణము చేయవలెను. ధారణాయోగమువలన వాని వాయువు సర్వము ప్రవర్తింపదు. తరువాత సమాధిలో ఉన్నవాడై దేహమును ఓంకారముతో నింపవలెను. ఆ తరువాత యోగి ఓంకారమయుడగును. నశింపడు అక్షరుడగును. (నశింపనివాడు అగును). (19)