వాయు మహా పురాణము
కల్పసంఖ్యా నిరూపణము
ఋషి పలికెను:
ఓ మహామునీ ఇది అంతయు అత్యద్భుతమైనది. ఈ కల్పముల యొక్క రహస్యము మంత్రముల యొక్క ప్రకల్పమును మీకు చక్కగా చెప్పితివి. ముల్లోకములో నీకు తెలియనిది ఏమియు లేదు. కావున విస్తారముగా మాకు సమస్త కల్ప సంఖ్యలను చెప్పుము.
వాయువు పలికెను:
ఇప్పుడున్నది ఉన్నట్లు కల్పసంఖ్యను చెప్పబోవుచున్నాను. అట్లే పరమేష్ఠియైన బ్రహ్మ యొక్క యుగాగ్రమును వర్షాగ్రమును చెప్పెదను. వేయి కల్పములు బ్రహ్మయొక్క అబ్దము (సంవత్సరము) అనబడును. ఎనిమిదివేల లబ్దములు బ్రహ్మయొక్క యుగము. వేయి యుగములు బ్రహ్మకు ఒక్క సవనము, వేయి సవనములు ద్విగుణము (రెట్టింపు) అట్లే త్రివృతము (మూడింతలు). ఇది అంతయు బ్రహ్మయొక్క స్థితి కాలమునకు సంబంధించి నది. ముందు వరుసగా దాని సంఖ్యను చెప్పుదును.
పేర్లతో చెప్పబడిన ఇరువది యెనిమిది కల్పములలో ముందుగా వరుసగా ఉన్న సంజ్ఞను (కల్పమను పేరును) చెప్పెదను. రథంతరసామము పైన కల్పాంతమున నామధేయములు వాని నుండి పుట్టిన మంత్రోత్పతియు వినుడు. పందొమ్మిదవ కల్పము శ్వేత లోహితము. దానిలో పరమధ్యానమును చేయుచున్న బ్రహ్మను, ప్రార్థించి తెల్లని శిరోవేష్టము (తలపాగా) గలవాడు, తెల్లని పూలమాలలు కలవాడు, తెల్లని వస్త్రములు ధరించిన సిగకలవాడు, అగ్నితో పోలి మహాతేజోవంతుడైన కుమారుడు పుట్టెను. భయంకరమైన ముఖముగలవాడు. మహారౌద్రుడు, చక్కని ఘోర (భయంకర) రూపుడు, తెలుపు, ఎఱుపు రంగుగలవాడు, ఉజ్జ్వలమైన శరీరముతో మహోజ్జ్వలుడును, విశాలమైన నోరు గలవాడును, తెల్లని కాంతిగలవాడు అయిన ఆతనిని శ్రీమంతుడును, విశ్వమంతటను ముఖములు గలవాడు పురుషుడును అయిన బ్రహ్మ చూచెను ఆతడు లోకస్రష్ట. విశ్వరూపుడు మహేశ్వరుడు, పురాణ పురుషుడు దేవుడు. అట్టి దేవదేవేశుని యోగులకు విశ్వాత్ముడైన వాడు. పితామహుడు అయిన బ్రహ్మ చాలకాలము అనుసరించెను. ఆ తరువాత బ్రహ్మ మహాదేవుడు పరమాత్మ ఈశ్వరుడు సద్యోజాతుడైన పరబ్రహ్మను హృదయమున నిలిపి ధ్యానించెను. దేవేశుడైన జగత్పతి ఈశ్వరుని తెలిసికొని సంతసించి నవ్వెను.
ఆ తరువాత బ్రహ్మయొక్క ప్రక్కభాగమునుండి బ్రహ్మవర్చస్సుగల శ్వేతులు అను ఋషులు పుట్టిరి. ఆ ఋషులు మహాత్ములు, తెల్లని పుష్పమాలలను ధరించినవారు. తెల్లని మైపూత (గంధము) ను పూసుకొన్నవారు, సుందరుడు, నందకుడు, విశ్వనన్దుడు, నందనుడు అనువారు మహాత్ములైన శిష్యులు. వారిచేత బ్రహ్మ జ్ఞానము వరింపబడినది. ఆ బ్రహ్మ ముందర తెల్లని కాంతి గల శ్వేతుడను పేరుగల మహాముని పుట్టెను. అతడు మహాతేజస్కుడు. అతని నుండి ఈ నరుడు పుట్టెను. అచట ఆ ఋషులు అందరు సద్యోజాతుడైన మహేశ్వరునిచూచిరి. కావున దేవుడైన విశ్వేశ్వరుని చూచిన బ్రాహ్మణులు అందరు ప్రాణాయామపరులై యోగధారణ చేసినవారై, పరబ్రహ్మయందు ప్రయత్నశీలురై, పాపనిర్ముక్తులై, మలములేనివారై, బ్రహ్మతేజోవంతులై బ్రహ్మ లోకమును దాటి పరబ్రహ్మ లోకమును చేరుదురు.
మరల వాయువు ఇట్లు పలికెను:
ఆ తరువాత ముప్పదవ కల్పము రక్తమని చెప్పబడినది. అచట రక్తుడు మహాతేజస్కుడై రక్తవర్ణమును ధరించెను. ఆ తరువాత పుత్రునికోరి, పరమేష్ఠియైన బ్రహ్మధానము చేసెను. ధ్యానించుచున్న అతనినుండి రక్త (ఎర్రని) అకారముగల మహా తేజస్వియైన కుమారుడు పుట్టెను. అతడు ఎఱ్ఱని మాలలను ఎఱ్ఱని వస్త్రములను ధరించి మిక్కిలి ప్రతాపవంతునిగా ఉండెను.
బ్రహ్మ తన కుమారుడైన, ఎఱ్ఱని వస్త్రములు ధరించిన ఆ రక్తుని చూచెను. వెంటనే పరమ ధ్యానయోగమును పొంది విశ్వమునీశ్వరునిగా తెలిసికొనెను (విశ్వేశ్వరుని తెలిసికొనెను). భగవంతుడైన బ్రహ్మ పరమమునందే మనస్సును నిలిపినవాడై ఆ మహాదేవునకు నమస్కరించెను. తరువాత బ్రహ్మ వామదేవుని (శివుని) బ్రహ్మాత్మకునిగా విశేషించి ధ్యానించెను. ఈ విధముగా పరమేష్ఠియైన బ్రహ్మచేత ధ్యానింపబడిన మహాదేవుడు సంతోషముతో కూడిన మనస్సుతో, ఓ సత్తమా! నీకు పితామహుడను (తండ్రియైన తాతను) అయినందున పుత్రినిగోరి పరమభక్తితో ధ్యానయోగముతో చూడబడితిని. కావున పరమధ్యానమును పొంది ప్రతికల్పమున, మహాతపస్వి లోక స్రష్టను, మహాసత్త్వుడను, ఈశ్వరుడను అగునన్ను తెలిసికొనగలవు అని పలికెను. ఈ విధముగా చెప్పిన తరువాత శర్వుడు (శివుడు) పెద్ద నవ్వునవ్వెను. తరువాత ఆశర్వునకు నలుగురు మహాత్ములు కుమారులు పుట్టిరి. ఆ మహాత్ములు శుద్ధబుద్ధులై ప్రకాశించిరి. వారందరు ఎఱ్ఱని వస్త్రములు ధరించినవారు. ఎఱ్ఱని మాలలు మైపూతలు గలవారు. ఎఱ్ఱని భస్మమును పూసుకొన్న అంగములు గలవారు. ఎఱ్ఱని ముఖము, ఎఱ్ఱని కండ్లు గలవారు.
ఆ తరువాత వేయి సంవత్సరముల చివర బ్రహ్మహితులై ప్రయత్నశీలురైన ఆ మహాత్ములు ఆ వామదేవ (శివ) సంబంధమైన బ్రహ్మను శబ్దములతో చెప్పుచుండిరి. లోకాను గ్రహమునకై శిష్యహితమును గోరి ఆ బ్రాహ్మణులు స్వయముగా సమస్త ధర్మోప దేశములను చేసిరి. తరువాత వెంటనే నాశములేని ఆ రుద్రునిలో ప్రవేశించిరి. తక్కిన బ్రాహ్మణ శ్రేష్ఠులు కూడ వామదేవుడైన ఈశ్వరుని యోగధారణము చేయుచున్న వారై, తద్భక్తులై, తత్పరాయణులై, మహాదేవుని (శివుని) పొందుచున్నారు. వారందరు పాపములు వీడినవారై విమలురై, బ్రహ్మ తేజముగలవారై, పునరావృత్తిలేని రుద్రలోకమును పొందగలరు.