వాయు మహా పురాణము
శ్రాద్ధ ప్రక్రియ ఆరంభము
శాంశపాయునుడు ఇట్లు అనెను:
“పూర్వము యోగభావిని అయిన సతీదేవి రెండవ జన్మ ఎట్లు ఎత్తినది? పూర్వము దక్షుని పుత్రిసతిగా ఉండెను. ఆమె ‘ఉమ’గా ఎట్లు జన్మించెను. శైలరాజైన హిమవంతుడు పితృకన్యయైన ‘మేన’ యందు ఉమను ఎట్లు జన్మింపజేసెను? ‘మేన’ మానసపుత్రిగా జన్మించిన ఆ పితరులు ఎవరు? పితరులకు మైనాకుడు దౌహిత్రుడు (కూతురు కొడుకు). అట్లే ఉమ దౌహిత్రి (కూతురు కూతురు). అట్లే ఆమె ఏకపర్ణ (ఒకే ఆకును తిని తపమాచరించినది), ఏకపాటల (తెలుపు మించిన ఎరుపు) వన్నెగలది, నదులలో శ్రేష్ఠమైన గంగ హిమవంతునకు వీరందరికంటె ముందుగా పుట్టినది. నాచేత అంతటను పూర్వమే ఇది చెప్పబడినది. పితరులు అనేకులు, వారు ఎక్కడ ఉందురు? శ్రాద్ధము యొక్క పరమ విధి ఎట్టిది? వినగోరుచున్నాను. నీకు భద్రము అగుగాక. ఆ పితరులు ఎవరి పుత్రులు? వారు పితరులు ఎట్లు అయిరి? పితరులు ఎట్లు జనించిరి? ఏ స్వరూపము గలవారు? స్వర్గములో దేవతలకును దేవతలై ఉండు పితరులు వేరు - పితరుల యొక్క ఉత్తమ సృష్టిని వినగోరుచున్నాను. శాస్త్రమును అనుసరించి మాచే చేయబడిన శ్రాద్ధము పితరులను సంతోషపెట్టగలదా? దేనికొఱకు వారు కనబడరు? దానికి కారణము ఏమనబడినది? స్వర్గమున ఏ పితరులు ఉందురు? నరకమున ఏ పితరులు ఉందురు? తండ్రిని, తండ్రి తండ్రిని, అట్లే తండ్రి తాతను మూడు పిండములందు పేరు పేరున కలిపి, ఏ శ్రాద్ధములను చేయవలెను? అవి పితరుల ఎట్లు పొందగలవు? నరకమునందు ఉన్న ఆ పితరులు మనకు (ప్రతి)ఫలము ఇచ్చుటకు ఎట్లు సమర్థులగు దురు? ఇచట మనము పూజించు పితరులు ఎవరు? స్వర్గమున దేవతలు కూడ పితరులను పూజింతురని మేము వింటిమి. ఓ బహు పాండిత్యము కలవాడా! సూతా! ఈ విషయమును విస్తరముగా వినగోరుచున్నాను. దానిని స్పష్టముగా చెప్పుడు” అని అడుగా, అని అడుగగా, వినితత్త్వార్థమును దర్శించిన సూతుడు ఋషులయొక్క ప్రశ్నలకు మనస్సు నకును సరియైన సమాధానము ఇట్లు చెప్పెను.
సూతుడు ఇట్లు అనెను:
ఇచట నేను నా ప్రజ్ఞను అనుసరించి విన్నది విన్నట్లుగా వర్ణింతును. దేవపుత్రులు పితరులు మన్వంతరములలో పుట్టుదురు. అతీత - అనాగతములందు (భూత - భవిష్యత్కాలములందు) క్రమముగా వారు జ్యేష్టులు - కనిష్ఠులును అగుదురు. దేవతలతోబాటు పూర్వము కడచిన పితరులను గూర్చియు నిశ్చయముగా చెప్పుదును. వీరి శ్రాద్ధమును గూడ చెప్పెదను. శ్రాద్ధము మనుష్యులకే ప్రవర్తిల్లును. బ్రహ్మ దేవతలను సృష్టించెను. కాని వారు పూజింపలేదని, బ్రహ్మను వదిలి ఫలము ఆశించినవారై స్వాత్మను సృజించిరి. వారు (దేవతలు) బ్రహ్మచేత, “మూఢులై సంజ్ఞలేనివారు మీరు అగుదురు” - అని శపింపబడిరి. అంత, వారు ఏమియు తెలియకుండిరి. దాని వలన లోకము మోహపర వశమే అయ్యెను. ఆ దేవతలు అందరు నమస్కరించినవారై బ్రహ్మను యాచించిరి. ప్రభువైన బ్రహ్మ లోకాను గ్రహమునకై మరల దేవతలతో ఇట్లనెను. ఆచారమునుతప్పి నడిచినందున ప్రాయశ్చిత్తమును ఆచరింపుడు. మీ పుత్రులను అడుగుడు. దాని వలన జ్ఞానమును పొందుదురు. తరువాత వారు ప్రాయశ్చిత్తమును ఆచరింపదలచినవారై, సంయతాత్ములై, తమ పుత్రులనే ఒకరిని ఒకరు అడిగిరి. ఆ పుత్రులు నియతాత్ములై ధర్మజ్ఞులై వాక్, మనస్, కర్మలవల్ల కలిగిన ప్రాయశ్చిత్తములను వారికి అనేక విధములుగా చెప్పిరి. అంత ఆ దేవతలు జ్ఞానస్మృతులు పొందినవారై సంతసించినవారై తమ పుత్రులతో ఇట్లనిరి. “మమ్ములను అపస్మృతి నుండి మేలుకొల్పినందున మీరు మాకు పితరులు. ధర్మజ్ఞానము, కామము, ఈ రెంటిలో ఏ వరమును మీకు ఈయవలెనో కోరుకొనుడు” అనగా తరువాత బ్రహ్మ వారితో ఇట్లనెను. “మీరు సత్యవాదులు. కావున మీరు చెప్పినది చెప్పినట్లు అగును. వేరు తీరుగాదు. మా స్వంత పుత్రులు, మా తండ్రులు అని అంటిరి. “వారు (పుత్రులు) పితరులు అగుదురు”. వారికి ఈవరము ఈయబడుగాక” అనగా బ్రహ్మయొక్క ఆ వాక్కుతోనే పుత్రులు పితృత్వమును పొందిరి. ఈ విధముగా పితరులు (దేవీపుత్రులు) పుత్రత్వమును పుత్రులు పితృత్వమును పొందిరి. కావున వారు పితరులు, పుత్రులు అగురుదు. వారిలో పితృత్వమును, పుత్రత్వమును ఉన్నవి. ఈ విధముగ పితరులను పుత్రులుగను, పుత్రులను, పితరులుగను స్మరించి బ్రహ్మ పితరులతో అత్మ వివృద్ధి చేయుడని పలికెను. శ్రాద్ధమున పితరులకు హోమము చేయక ఏదైన పనిచేసినచో వాని క్రియాఫలమును రాక్షసులును, దానవులును పొందుదురు. మీచేత శ్రాద్ధములచే పితరులు సంతృప్తి చెందినవారై నాశములేని శాశ్వతమైన సోమమును ప్రతినిత్యము వర్ధిల్ల చేయుదురు. శ్రాద్ధములచే తృప్తి చెందిన సోముడు లోకములను సంతోష పెట్టగలడు. పర్వత వనములతోగూడి స్థావర జంగమములతో చుట్టబడిన ఈ సమస్తమును సంతోషపెట్టగలడు. పుష్టికాములై శ్రాద్ధములనుచేయు మానవులకు పితరులు ఎల్లప్పుడును పుష్టిని సంతానములను ఇత్తురు. శ్రాద్ధమున గోత్ర నామములతో మూడు పిండములను ఎవ్వరికి ఇత్తురో ఆ పితరులు అంతట ఉండుచున్న వారై, వారి ప్రపితామహుని (తాత, తండ్రిని) సంతోష పెట్టుదురు). ఈ విధముగా పూర్వము పరమేష్ఠి అయిన బ్రహ్మచే ఆజ్ఞాపింపబడినది. దాని వలన అన్ని విధములుగ దానము, అధ్యయనము, తపమును సిద్ధించినవి. ఆ పితరులు మీకు జ్ఞానము ఇచ్చువారు. సంశయము లేదు అని ఈ విధముగ పితరులు దేవతలు, దేవతలు పితరులును. ఈ దేవతలును పితరులును ఒకరి కొకరు పితరులు. విహితాత్ముడైన సూతుని యొక్క ఈ బ్రహ్మ వాక్కునువిని మునులు సూతుని మరల అడిగిరి.
ఋషులు ఇట్లు అనిరి:
“ఋషి గణములు ఎన్ని ఉన్నవి? అవి యే కాలమునందలి గణములు? దేవతలలో సోమవర్ధనులైన దేవప్రవరులు ఉన్నారా?”
సూతుడు ఇట్లు అనెను:
“ఈ అత్యంత ఉత్తమమైన పితృ సృష్టిని మీకు చెప్పెదను. ఈ విషయమునే ‘శంయు’ వు అను ముని పూర్వము బృహస్పతిని అడిగెను. సర్వజ్ఞానార్థ కోవిదుడును, సమీపమున కూర్చుని ఉన్నవాడు అయిన బృహస్పతిని వినయాన్వితుడై పుత్రుడైన ‘శంయువు’ ఈ ప్రశ్నను అడిగెను. “ఈ పితరులు అనువారు ఎవరు? వారు ఎందరు? వారి పేరులు ఏమి? వారు ఎట్లు పుట్టిరి? ఎట్లు పితృత్వమును పొందిరి? పూర్వము ఎందులకు పితరుని నిత్యము యజ్ఞమున జోడించుచుండిరి? మహాత్ముల క్రియలన్నియు శ్రాద్ధ పూర్వములుగా ఎందులకు ఉండెడివి? ఎవరికి శ్రాద్ధములను ఈయవలెను? ఏది ఇచ్చిన మహాఫలము కలుగును? ఎవరియందు శ్రాద్ధము అక్షయము అగును? తీర్థములయందా? నదుల యందా? బ్రాహ్మణోత్తముడు వేనియందు శ్రాద్ధముచేసి సమస్తమును పొందును? శ్రాద్ధమునకు కాలమేది? ఏ విధి అనుసరింపబడును? ఓ భగవంతుడా! (బృహస్పతీ! నేను అడిగిన చోటులను ఈ విషయమును ఉన్నది ఉన్నట్లుగా పూర్వానుక్రమమున విస్తరముగ విశేషించి చెప్పుము - అని కోరుచున్నాను.
ప్రశ్నవేత్తలలో శ్రేష్ఠుడును, మహామతియు అయిన బృహస్పతి ఈ విధముగా చక్కగా అడుగబడినవాడై పూర్వానుక్రమముగ ఇట్లు చెప్పెను.
బృహస్పతి ఇట్లు అనెను:
నాయనా! పుత్రా! న్యాయముగను, గంభీరముగను, ఉత్తమముగను నీవు వినయముతో అడిగిన ప్రశ్నకు ఉత్తరమును చెప్పెదను. ప్రకాశించు ద్యులోకము (ఆకాశము) నక్షత్రములు గల ఆకాశమును, పృధివి, నక్షత్రములు, దిక్కులు, సూర్య చంద్రులు, రాత్రి పగళ్లు, ఇవి మొదట లేకుండెడివి. ఓ తండ్రీ! జగము అంతయు చీకటియై ఉండెను. అచట ఒక బ్రహ్మచరింప అలవికాని, అతికఠినమైన తపము ఆచరించెను. ఇంతలో శంయువు ఎల్లప్పుడు వ్రతస్నాతుడును, సర్వజ్ఞానవేత్తలలో, బ్రహ్మవేత్తలలోను శ్రేష్ఠుడు అయిన తన తండ్రియైన బ్రహ్మను మరల ఇట్లు అడిగెను. సర్వభూతేశ్వరుడైన ప్రజాపతి (బ్రహ్మ) ఎటువంటి తపము చేసెను? అని అడిగెను. ఇట్లు అడుగబడిన మహాతేజస్వియైన బృహస్పతి పుత్రుడైన శంయువుతో ఇట్లు అనెను. అన్నితపముల యొక్క కలయిక తపోయోగము. అట్టి అతిశ్రేష్ఠమైన తపోయోగమున ధ్యానమున ధ్యానించుచు, ఆ యోగధ్యానముతో లోకములను (క్రిందుగా) సృజించెను. ఆ యోగమును ఆవేశించి యోగదృష్టితో భూత, భవిష్యత్, జ్ఞానములను, లోకములను, వేదములను చూచి ప్రాంతానికములనెడి లోకములను సృష్టించెను. అచట ద్యులోకమున ప్రకాశించుచు వారు ఉందురు. వారు దేవతలలో వైరాజులని చెప్పబడు దేవతలు. అపుడు ముందే బ్రహ్మ తపస్సుతో యుక్తుడయ్యెను. ఆ బ్రహ్మ సనాతనమైన యోగమును అవలంబించి దేవతలను సృజించెను. వారు ఆదిదేవులని చెప్పబడిన మహాబలవంతులు మహాతేజోవంతులును, సర్వకామములను ఇచ్చువారు, దేవ, దానవ, మానవులచే పూజింపదగినవారు. వారు ఏడు గణములు. ఆ గణములు ముల్లోకముల పూజింపబడినవి. వానిలో మూడు గణములు అమూర్తులు (ఆకారము లేనివి). నాలుగు సుమూర్తులు (చక్కని ఆకారములు గలవి). పై చెప్పిన మూడు గణములు భావమూర్తులు (భావ రూపములు)గా ఉందురు. వీరు పైన ఉందురు. తక్కిన నాలుగు గణములు సూక్ష్మమూర్తులుగలవి. వారు భావ రూపులకు క్రింద ఉందురు. తరువాత దేవతలు, తరువాత భూమి, ఇది లోక పరంపర. ఈ లోకమున వారుందురు. వారివల్ల పర్జన్యుడు పుట్టును. వాని వలన వృష్టి కలుగును. ఆ వర్షముచే మరల లోకములు పుట్టును. ఆ దేవతలు యోగము వలన సోముని అన్నముచే సంతోషపెట్టుదురు. అందువలన వారిని పితరులు అని చెప్పిరి. కావున వారు లోకములకు లోకసత్తములు. వారు (పితరులు) మనోవేగము కలవారు, స్వధను భక్షించువారు, అన్ని కోరికలు కప్పుగా కలవారు, లోభ, మోహ, భయము తొలగి, నిశ్చింతులు, శోకమును వీడినవారు. వీరు యోగమును వదిలి సుదర్శనములగు లోకములను పొందినవారై దివ్యులు, పుణ్యులు, మహాత్ములు, పాపములు లేనివారును అగుదురు. తరువాత వేయియుగముల చివర బ్రహ్మవాదులు అగుదురు. మరల యోగమును పొంది అమూర్తులై మోక్షమును పొందుదురు. ఆకాశమున క్షీణించిన విద్యుత్ప్రభవలె, ఉల్కవలెను, వ్యక్తావ్యక్తమును వదిలి, మహాయోగ బలముతో నశింతురు (లయమగుదురు). దేహజాతములను వదిలి మహాయోగ బలముతో నదులు, సముద్ర మునందువలె నిరాఖ్యోపాఖ్యతను (నామముగాని, ఉపనామముగాని, లేని తనమును) పొందుదురు. క్రియచేతను గురు (గొప్ప) పూజలచేతను తమను సంతోష పెట్టిన వారిని, ఆ పితరులు వంశవర్ధనులై ఆపూజాది క్రియలచేతనే సంతోషపెట్టుదురు. శ్రాద్ధమున సోమమును త్రాగి పితరులు యోగమునందు ఉన్నవారై ఆ యోగముతో ముల్లోకమును సంతోషపెట్టుదురు. కాని ఆ ముల్లోకములు జీవించును. కావున శ్రాద్ధములను ఎప్పుడు ప్రయత్నించి యోగులకు ఈయవలెను. పితరులకు బలము యోగము. యోగము వలన సోమము ప్రవర్తిల్లును. శ్రాద్ధమున వచ్చిన వేలకొలది బ్రాహ్మణులను భుజింపజేయ వచ్చును. ఒక్క సంతుష్టుడైన యోగి వారందరితో (వేల బ్రాహ్మణులతో) సమానుడు అగును. దానిని వినుము.
వేవురు గృహస్థులకును, నూర్గురు వానప్రస్థులకును, వేవురు బ్రహ్మచారులకును, ఒక్క యోగి విశిష్టుడు అగును. నాస్తికుడు, వికర్ముడు, సంకరుడు, తస్కరుడు, మరొకడుగాని శ్రాద్ధదానమునకు తగడు. బ్రహ్మయోగము కలవారే శ్రాద్ధ దాన యోగ్యులు అని చెప్పినాడు. పుత్రుడుగాని, పౌత్రుడుగాని, యోగిని శ్రాద్ధమున భుజింప జేసినచో ఆ పుత్ర - పౌత్రులతో సువృష్టితో కర్షకులవలె పితరులు మిక్కిలి సంత సింతురు. యోగులుగాని, భిక్షువులుగాని లభించనపుడు ఇరువురు బ్రహ్మచారులను శ్రాద్ధమున భుజింపచేయవలెను. ఎవడు ఒంటి కాలిపై నిలబడి వాయువే ఆహారముగా కలవాడై నూరేండ్లు ఉండునోవాడు, ఉత్కృష్టుడైన యోగి - అని బ్రహ్మానుశాసనము. సిద్ధులు బ్రాహ్మణ రూపమున ఈ భూమిపై చరింతురు. కావున ఇంటికి వచ్చుచున్న అతిథిని చేతులు జోడించి ఎదుర్కొనవలెను. అతనిని అర్ఘ్యపాత్రతో (చేతికి నీళ్లిచ్చుట), వసతిని ఇచ్చుటతోను, భోజనము చేయించుట తోను పూజింపవలె. దేవతలైన ఈ యోగేశ్వరులు ప్రజలను ధర్మముతో బాలించుచు అనేక రూపములతో సముద్ర పర్యంతమైన భూమిపై ఎల్లప్పుడు సంచరింతురు. కావున నరుడు బ్రాహ్మణుడైన అతిథికి దానమీయవలె. ఇక ఆ దానములను వాని ఫలములను చెప్పెద వినుడు.
వేయి అశ్వమేధములకును, నూరు రాజసూయ యాగములకును, వేయి పౌండరీక యాగములకును యోగుల నివాసము శ్రేష్ఠము. అమితౌజస్కులైన పితరుల యొక్క మొదటి గణమిది చెప్పబడినది. ఏడు కాలములను భావించుచు ఈ గణము అప్పుడు ఉండెను. ఆ పైన మరల పితృగణముల గురించి చెప్పెదను. వారి సంత తిని, సంస్థితిని, భావనను వరుసగా చెప్పెదను.