శ్రాద్ధకల్పము

బృహస్పతి అనెను:

మోదుగుచెట్టు బ్రహ్మ వర్చస్సు ఇచ్చునది. అశ్వత్థము (రావిచెట్టు) నందు రాజ్య భావన (రాజసంబంధి భావనను) చేయవలెను. జువ్విచెట్టునందు సర్వ భూతాధిపత్యము నిత్యముగా ఉండును. బలమును, బుద్ధిని, ప్రజ్ఞను, ధైర్యమును స్మృతిని కోరి మఱ్ఱిచెట్టును భావింపవలెను. గుమ్ముడుచెట్టుపాత్ర రక్షస్సుల చంపునదిగను, కీర్తిని ఇచ్చునదిగను చెప్పబడినది. లోకమున మధుకము (తిప్పతీగయందు లేదా విప్పచెట్టు) నందు ఉత్తమ సౌభాగ్యము చెప్పబడినది. ఫల్గు పాత్రయందు (కుక్కమేడిచెట్టు పాత్ర యందు) శ్రాద్ధము చేయువాడు అన్ని కోరికలను పొందును. రథమున (నెమ్మిమాని) - ప్రబ్బలి పాత్రయందు పరాద్యుతిని ప్రాకాశ్యమును ఇచ్చును. అట్లే బిల్వ వృక్షమున లక్ష్మి, మేధ, ఆయుష్యమును లభించును. వేణు (వెదురు) పాత్రలలో శ్రాద్ధము చేయువానికివాని పొలములందు, తోటలందు, చెరువులందు అన్ని పంటలయందును పర్జన్యుడు వర్షమును కురియును. ఈ మంచి పాత్రలయందే ఒక్కమారైనను అగ్రయణమును (వర్షాకాలము చివరన అగ్ని హోత్రమున సోమరసమను హోమము చేయుట) ఇచ్చినవారు ఈ లోకమున అన్ని యజ్ఞముల ఫలములను అందుదురు - అని చెప్పబడినది. పితరులకు సుగంధ మాలలను ఇచ్చువాడు సిరితో గూడినవాడై సూర్యుడై అంతట ప్రకాశించును. తేనెతోను నేతితోను కూడిన గుగ్గులు మొదలగు ధూపములను పితరులకు ఇచ్చినవాడు అశ్వమేధ ఫలము నందును, గంధగుణముతో కూడి మనోహరమయిన ధూపమును పితరుల యందు తత్పరతతో ఏమరుపాటుతో ఇచ్చువాడు ఇహపరములలో స్త్రీలయందు సంతానములను పొందును. నియతుడై పితరులకు దీపము ఇచ్చువాడు లోకమున ఎల్లప్పుడును శుభమైన సాటిలేని నేత్రమును పొందును. తేజముతోను, కీర్తితోను, కాంతితోను, బలముతోను, భూమిలో ప్రకాశించును. స్వర్గమునగూడ తేజరిల్లును. అప్సరసలతో చుట్టబడి విమానాగ్రమున సంతసించును. నియమముగలవాడై శుచియై గంధపుష్పములను, ధూపములను, అజ్యాహుతులను ఇచ్చి, ఫలమూలము ఇచ్చియు మొదట నమస్కరించి అన్నసంపదతో శ్రాద్ధకాలమున పితరులను పూజించిన వారికి, పితరులు వాయుభూతులై ఎల్లప్పుడు ఆవేశింతురు. అందువలన నీకుచెప్పుచున్నాను. వస్త్రములతోను, అన్నములతోను, ప్రదానములతోను, భక్ష్యములతోను, పానీయములతోను, గోవులతోను, గుఱ్ఱములతోను, గ్రామములతోను ఆ బ్రాహ్మణోత్తములను పూజింపవలెను. కావున అన్నముతో బ్రాహ్మణ సత్తములను విధిగా పూజింప వలెను. బ్రాహ్మణుడు ఏమరుపాటులేక సవ్య - ఉత్తర హస్తములతో (కుడి, ఎడమ చేతులతో) (శ్రాద్ధకర్మలో ఉల్లేఖనము చేయవలెను. అట్లే ప్రోక్షణము చేయవలెను. దర్భలను, పిండములను, భక్ష్యములను, వివిధ పుష్పములను, గంధదానమును, అలంకారమును క్రమముగా ఒక్కొక్కటినే ఈయవలెను (పితరులకై పిలిచిన బ్రాహ్మణులకు ఈయవలెను). జనమును బాగుగపోషించి ప్రతి బ్రాహ్మణుడును శ్రేష్ఠుడు అగును. అభ్యంగ, దర్భ, పంజాలముల మూటిచేతను యథావిధిగ శ్రాద్ధమును జేయవలెను. పితరులకై అపసవ్యము (జందెమును ఎడమ చేతి క్రిందికి) వేసికొని శ్రేష్ఠమైన అన్నము నీయవలెను. దానిని ఉచ్చరించి తరువాత అందరికిని వస్త్రార్థముగా సూత్రమునే ఈయవలెను. ఖండనము, పోషణము, ఉల్లేఖనము - ఇవి దేవతలకు ఒక్కమారే చేయవలెను. పితరులకు మాత్రము మూడు మారులు చేయవలెను. చేతితో ఒక దర్భను (భూమిపై) ఉంచవలెను. దానిపై పితరులను అందరిని (పితృ - పితామహ - ప్రపితా మహులను) ఒక్కొక్కరినే ఉంచవలెను. చైల మంత్రముతో పిండములకు శాస్త్రమున చెప్పబడిన వస్త్రాదికమును ఈయవలెను. ఎల్లప్పుడు నెయ్యి, నువ్వులతో కూడిన మూడు పిండములను కుడి మోకాలును భూమియందు ఉంచి పితృపరాయణుడై భూమియందు ఉంచవలెను. శ్రద్ధగా అపసవ్యము జేసికొని, ప్రాచీనులైన పితరులను, పితామహులను, ప్రపితామహులను, పేరు పేరున పిలిచి, పితృతీర్థముతో పిండములను ఉంచవలెను. అన్నము చేతను, జలములచేతను, పుష్పములచేతను, వేరు వేరు భక్ష్యముల చేతను మాతామహులకు వేరుగా నైవేద్యము చేయవలెనని కొందరు మానవులు తలంతురు. జాన్వంతర స్థితులతో అంగుష్ఠములతో గూడి పుష్టివర్ధనములైన మూడు పిండములను పూర్వానుక్రమమున వరుసగా ఈయవలెను. కుడి, ఎడమ చేతులతో ధర్మమున మంత్రమున ఆవ్యతిక్రమముండును. “సూక్ష్ములైన పితరులగు మీకు నమస్కారము” అని శ్రద్ధతో చేతులతో దక్షిణ దిక్కున పిండమును వదలవలెను. “సౌమ్యులగు పితరులైన మీకు నమస్కారము” అని చదువుచు పిండమును వదలవలెను. క్రొత్తదైన క్షేమసూత్రమును ఈయవలెను. ప్రత్తితో చేయబడిన ఎఱ్ఱని దారముచే నేయబడిన వస్త్రమును ఈయవలెను. పత్రోర్ణమైన నారవస్త్రము దారము పితృసూత్రముగా ఈయవలెను. పట్టువస్త్రపు దారమును ఈయరాదు. అహత వస్త్రజమైనను అనగా క్రొత్త వస్త్రపుదైనను యజ్ఞమున దాని కొంగును వాడరాదు. అట్లే ఇవి పితరులను సంతోషపెట్టవు. అది దాతయొక్క సంతోషమునే కలుగజేయును. కాని పితరులను సంతసింప జేయదు. త్రికూట పర్వతము నందలి అంజనము (కాటుక) శ్రేష్ఠమందురు. అది నిత్యమని అందురు. నల్లనూవులనుండి భద్రముగా తీయబడిన తైలము శ్రేష్ఠము, చందన - అగురువులు రెండును, తమాల (చీకటి చెట్టు), ఉశీర (వట్టివేరు), పద్మకము (మెట్టతామర)లతోడి ధూపము, గుగ్గుల ధూపము, తురుష్క (చిల్లమడ్డి) ధూపమును శ్రాద్ధమునకు శ్రేష్టములు. అట్లే తెల్లని పూవులు పద్మ - ఉత్పలములు, గంధవంతములై తగిన తక్కిన పూవులన్నియును శ్రేష్టములు. భండీ (మంజిష్ఠ), రూపకామ (రూపముతో మనోహరములైన) - కురండకములు (పచ్చగోరంట) అయిన సుమనసములు (పూవులు) జవములు (వేగముగా వాసనలవెదజల్లునవి) - ఈ పూవులు శ్రాద్ధకర్మలలో నిత్యము వదిలి వేయదగినవి. ఐశ్వర్యమును కోరువాడు గంధములేని పూవులను కొద్ది గంధముగల పూవులను శ్రాద్ధమున వదిలివేయవలెను. వెదకి తీసికొని వచ్చిన శ్రాద్ధ బ్రాహ్మణులు నియతులై ఉత్తరముఖులుగా ఉండవలెను. వారిని శాస్త్రోక్తముగ దక్షిణాభిముఖుడై యజమాని పూజింపవలెను. బ్రాహ్మణుల కభిముఖుడై దర్భలను పిండములను ఈయవలెను. ఈ విధితో తన పితరులను సాక్షాత్తుగా అర్చింపవలెను. హరితులు, బంగారు వన్నెకలవారు. పూవులవలె నునుపైనవారు, ఏకాగ్రమనస్కులు, పిడిమూరెడు (హోమమునందు) దానము చేయుటచే పితృతీర్థముతో ఉన్నవారు. ఉపమూలము నీలులు, ప్రస్తరాద్యి కులము నుండి వచ్చినవారు, శ్యామాకనీవారధాన్య రూపులు అయిన పితరులు వారింప అలవికాని వారు. పూర్వము చెప్పబడిన ప్రజాపతి శ్రేష్ఠుడుగా ఉండెను. అతని వాలములు (తల వెంట్రుకలు) ఆకాశ మార్గము నుండి భూమిపై పడినవి. కావున ఆకాశముతో సమానమైనవై పవిత్రములైన వానినే శ్రాద్ధకర్మలో పూజింపవలెను. ఐశ్వర్యముకోరువాడు వానియందు పిండ నిర్వాపణము చేయవలెను. సంతానము, పుష్టి, కాంతి, కీర్తియు కల్గును. సంతానము కాంతితో కూడినది అగును. ప్రజలు పాపములేనివారై నిత్యము ప్రకాశవంతులగుదురు. పిండములకై ఒక్కమారే దర్భలను దక్షిణాభిముఖుడై పరువవలెను. ప్రాక్ - దక్షిణ అగ్రములలో నియతుడై విధిని గూడ వెంటనే చెప్పవలెను. దీనుడైకాని కోపియై కాని, అన్యమనస్కుడై కాని శ్రాద్ధము ఆచరింపరాదు. తెలిసినవాడు (జ్ఞాని) మనస్సును ఏకాగ్రముగచేసి శ్రాద్ధమును చేయవలెను. అపవిత్రమైన దానినంతయు చంపెదను. నాచేత అసుర దానవులు అందరును చంపబడిరి. రక్షస్సులు, యక్షులు, పిశాచ సంఘములు, యాతుధానులందరును నాచే చంపబడిరి. ఇట్లు ఎవని అన్నము పితరుల కొఱకు చూడబడినదో, ఆతనిని అసురులందరు వదలుదురు. ఏ దేశమున ఈ మంత్రము పఠింపబడునో ఆ దేశమును గూడ రాక్షసులు వదులుదురు అని మంత్రముతో బ్రాహ్మణుడు ఈ విధానముతో శ్రాద్ధమును చేసినచో పితరులు సంతుష్ఠ మనస్కులు అగుదురు. రక్షస్సులు విమనస్కులు అగుదురు. శ్రాద్ధమున క్షీరజాశుబల్వజములైన తరువులు వారణములు, లవములు, లవ వర్షము లును - ఇవి మొదలగునవియు, తక్కినవియు అయిన తృణములను గడ్డిజాతులను వదలవలెను. మరలమరల పుట్టు కాశగడ్డిచే అంజనముతోడి (కాటుకతో) అభ్యంజనము (తలంటుపోత) చేసిన గంధమును, దానిని అనుసరించిన లయమును చేయవలెను. దాని వలన సమస్తఫలము కలుగును. మరల మరల పుట్టు కాశగడ్డి విశేషములు బర్హణములు ఉపబర్హణములును వృద్ధిపొందును. మరింత వృద్ధిపొందును. ఇక, ఆ పితరులు దేవతలు. ఆ దేవతలు మరల పితరులు. పుష్ప గంధాది ధూపములకు ఈ మంత్రము చెప్పబడినది. బ్రాహ్మణ ప్రయత్నముతో దక్షిణ దిక్కునకు తీసికొని వచ్చి, “పితృమంతుడైనసోమునకు స్వధ, అంగిరసునకు నమస్కారము” - అని స్వర్గఫలము గాక లౌకికమైనను కర్మసిద్ధికై హోమము చేయవలెను. సమిధను అంతస్సులో నుంచి, అట్లే ప్రయతాగ్నియే ప్రయత్నముతో ఏకాగ్రమనస్సుతో హోమము చేయవలెనని చెప్పబడినది. ‘కవ్యమును వహించు అగ్నికి అంగీరసునకు స్వధానమస్కారము, యమునకును అంగిరసునకు స్వధా నమస్కారము’ - అని చెప్పుచు హోమము చేయవలెను. ఇవి మంత్రముల యొక్క పూర్వక్రమమును బట్టి హోమమంత్రములు దక్షిణదిక్కునుండి అగ్నికి నిత్యమును, లోపల సోమునకును, వీరిరువురి మధ్యన నిత్యము సూర్యునకును ఉపచారమును స్వధాకారమును, అట్లే ఉల్లేఖనమును చేయవలెను. హోమ - జపములను, నమస్కారమును, విశేషించి ప్రోక్షణమును, అంజనాభ్యంజనములను, పిండ సంవపనమును చేయవలెను. అది అశ్వమేధ ఫలముతో సమమని స్మరింపబడినది. చెప్పబడిన క్రియలు అన్నింటిని మంత్ర పూర్వకముగా ప్రయత్నముతో ఆచరింపవలెను. అగ్నియందు బహు హవ్యత్వము (హవ్యముల వహించుట) విశేషించి చక్కగ ప్రజ్వలించిన అగ్నియందు బహుహవ్యముల వహించుట సిద్దము. కావున పొగలేని జ్వాలాజిహ్వలతో ఉన్న అగ్నియందు కర్మసిద్ధి కొఱకు హోమము చేయవలెను. జ్వాలతో ప్రజ్వలింపక చక్కని ధూమము నిండిన అగ్ని యందు హోమము చేసినచో యజమానుడు అంధుడై అపుత్రకుడు అగును అని పూర్వులచే చెప్పబడినది. కొద్ది ఇంధనములు కలిగినను, కరకైనను (చిటపట లాడినను), ఆ అగ్ని ఫలసిద్ధికి పనికి రాదు. అగ్ని దుర్గంధముగా ఉన్నను విశేషించి నల్లగా ఉన్నను, నీలముగా ఉన్నను, భూమిలోకి చొచ్చుకొనిపోయినను, అచట పరాభవము కలుగును. జ్వాలలు కలిగి, పిండితములైన జ్వాలలు కలిగి, నేయి - బంగారముల నుండి పుట్టినవాడై, దట్టమైన వాడై, దక్షిణపు వైపు తిరుగు జ్వాలలు కలవాడైన అగ్ని హోమమున కార్యసిద్ధిని కలుగచేయును. ఆతడు నరనారీ గణముల నుండి శాశ్వతమైన పూజను పొందును. దానిచేత పూజింపబడిన పితరులు అక్షయములు, అవ్యయములును అగుదురు. స్థాలి, ఉదుంబర (మేడి) పాత్రలు, ఫలములు, సమిధలు శ్రాద్ధమున అతి పవిత్రములు, విశేషించి మేధ్యములును అగును. ఓ బ్రాహ్మణశ్రేష్ఠ! జన్మ కర్మలలో దర్భశుద్ధికి ఉపయోగించును. నాచేత శ్రాద్ధకర్మలలో ఆ ఫలము ఉద్దేశింపబడినది. సమిధలలో గూడ వరుసగా అది అంతయు కర్తవ్యముగా తెలియవలెను. నేను చిత్తము ఏకాగ్రముచేసి అగ్నికి హోమపూజలను చేయుదును. బ్రాహ్మణులచే “చేయుము” అని అనుజ్ఞను పొందినవాడై భార్యను, పుత్రులను తీసికొని వచ్చి అగ్నికి హోమము చేయవలెను. సమానములైన ప్లక్ష (జువ్వి), న్యగ్రోధ (మఱ్ఱి), ప్లక్ష (కలుజువ్వి), అశ్వత్థ (రావి), వికంకత (పుల్ల వెలగ) వృక్షములు, ఉదుంబరములు (మేడిచెట్లు), బిల్వ (మారేడు), చందన వృక్షములును యజ్ఞియములు (యజ్ఞమునకు ఉపయోగించునవి). సరల (తెల్లతెగడ), దేవదారు, శాల (మద్ది), ఖదిర (చండ) వృక్షములు. ఈ వృక్షములు యజ్ఞ సమిధలకై విశేషించి ప్రశస్తములు. అట్లే గ్రామ్యములు, ముళ్లుకలవియు ఎవరిచేతనో ఒకరిచేత యజ్ఞియములుగా సమిధలకై పూజింపబడినవని పితరుల వచనము - అనగా పనికిరావు. కల్కలేయములైన సమిధలచే అగ్నినిహోమము చేయువాని ఆ యజ్ఞ కర్మ ఫలమును నానుండి వినుము. సర్వకామములకు సంబంధించిన ఆ యాసము ((శ్రమ) అది అశ్వమేధ ఫలము. శ్లేష్మాతక (విరుగుడు చెట్టు), నర్తమాల (కానుగు చెట్టు), విభీతక (తాండ్రచెట్టు) తీగలతోబాటు పక్షులకునివాస మైనదియు - ఇట్టి వృక్షములను వదిలి వేయవలెను. అయజ్ఞీయములు అనబడిన వృక్షములను వదిలివేయవలెను. యజ్ఞకర్మలలో మంత్రాంతమున స్వధను చెప్పవలెనని పితరుల వచనము. దేవతలకు యజ్ఞకర్మలో మంత్రాంతమున స్వాహాఅని చెప్పబడినది.