పాశుపతయోగము

వాయువు ఇట్లు పలికెను:

ఈ విధముగా జ్ఞానమునుండి వచ్చినవాడు రాగము వలన కర్మను ఆచరింపరాదు. రాజసమైనదిగాని, తామసమైనదిగాని అయిన కర్మను చేసి అనుభవించిన మానవుడు దానిలోనే తగుల్కొనును. అట్లే పుణ్యకర్మను చేసినవాడు స్వర్గములో దాని ఫలమును పొందును. ఆ స్వర్గ స్థానమునుండి (పుణ్యము క్షీణింపగా) మరల భ్రష్టుడై, మానవ లోకమును పొందును. కావున బ్రహ్మపరము, సూక్ష్మము. బ్రహ్మశాశ్వతము అని చెప్పబడును. అందుచే బ్రహ్మనే సేవింపవలెను. బ్రహ్మయే పరమమైన సుఖము. యజ్ఞములలో పరిశ్రమ గొప్ప (స్వర్ణ) ప్రయోజనముతో జరుగును. కానివాడు క్షణయజ్ఞఫలుడై మరల మర్త్యలోకమునకు వచ్చి మృత్యువశుడగును. కావున మోక్షము పరమసుఖము.

అట్లుగానిచో ధ్యాన సంయుక్తుడు, బ్రహ్మయజ్ఞపరాయణుడు, (జ్ఞానయజ్ఞ పరాయణుడు అగు)వాడు మన్వంతర శతములచేత గూడ వ్యాపించుటకు సాధ్యపడడు. విశ్వరూపుడు విశ్వమే పాదములు శిరము, కంఠములైనవాడు, విశ్వేశుడు, సమస్త భావనలు కలవాడు, సమస్త గంధములు కలవాడు సమస్తమాలలచే అలంకరింపబడినవాడు. విశ్వమను వస్త్రమును (సమస్త వస్త్రములను) ధరించువాడు ప్రభువు అయిన విశ్వుడను దివ్య పురుషుని చూచి భూమి తన గోవుల (కిరణముల చేత, రెక్కలుగలవానిని, మహాత్ముని, పరమమతిని, వరింపదగినవానిని, కవిని (బ్రహ్మరూపిని) పురాణుని (ప్రాచీనుని), అనుశాసించువానిని, సూక్ష్మమునకున్న సూక్ష్మరూపిని, మహత్తుకున్న మహత్తైనవానిని, బంధించి వేయును. అతడు నిరింద్రియుడు, బంగారు వన్నెగల తేజోమయ పురుషుడు, నిర్గుణుడు, చేతనుడు. ఈతనిని యోగులు యోగముతోనే చూతురు కానీ నేత్రములతో చూడలేరు. ఎల్లప్పుడు సర్వగతుడై శుచియైనవాడు అచలుడై ప్రకాశస్వరూపుడైన అతనిని యోగము చేతనే నిత్యము చూతురు. అతడు సత్తుగా పరమాత్మగా భావింపబడిన వాడు, తేజస్సుతో వెలుగుచున్నవాడు, చేతులు, కాళ్ళు, కడుపు, ప్రక్కలు, నాలుకలేని వాడు, ఇంద్రియములకు అతీతుడు. ఇప్పటికి గూడ సుసూక్ష్ముడైన ఒక్కడు. అతడే నేత్రములు లేకయే జూచువాడు, చెవులు లేకయే వినువాడు. ఈతనికి బుద్ధిలేదు. కాని అతనికి తెలియనిది లేదు. అతడు వేదములకుగూడ తెలియనివాడు. కాని తాను సర్వము తెలిసినవాడు. అతని మొట్టమొదటి వానిగా పురుషునిగా మహత్స్వరూపునిగా సచేతనునిగా, సర్వగతునిగా, సుసూక్ష్మునిగా చెప్పుదురు.

సమస్తమునులు ఆమెను లోకమున ప్రసవ ధర్మిణిగా (లోకమును పుట్టించు దానినిగా) చెప్పుదురు. యోగయుక్తులు తమ చిత్తముతో ఆమెను సర్వభూతములకు ప్రకృతిగా చూతురు. అంతట కాలుసేతులు చాచి అందుకొనునది. అంతట జూడగల కన్నులు శిరస్సు ముఖములు గలది. అంతట వినగల చెవులు గలదియునై ఆ ప్రకృతి సర్వమును ఆవరించి ఉండును. యోగముచే యుక్తులై యోగులు, ఈశానుడు అన్ని విధముల సనాతనుడు, సర్వభూతములలో పురుషుడైన వానిని చూతురు. కావున ధ్యాన యోగి మోహమును చెందడు. భూతాత్ముడు, మహాత్ముడు పరమాత్ముడు, అవ్యయుడు, సర్వాత్ముడు అయిన ఆ పరబ్రహ్మను ధ్యానముజేసి మోహము చెందడు.

వాయువు సర్వమూర్తులయందు చరించుచు గ్రహింపదగినదైనట్లే పురమును అట్లే ఆకాశమునను శయనించును కావున పురుషుడు అనబడుచున్నాడు. ఒకవేళ సవిశేషములైన కర్మలచే లోపించిన ధర్మము గలవాడైనందున పురుషుడనబడినట్లైతే, అప్పుడు స్త్రీ పురుషుల ప్రయోగముచేత శుక్రశోణిత సంయుతమైన బ్రహ్మ స్త్రీ యోనియందు మరల మరల పుట్టును. సూక్ష్మ రూపమున జన్మ నొందును. అపుడు గర్భకాలమున (గర్భముగా ఏర్పడు కాలమున) కలన మనునది (శుక్ర శోణితములు కలియుట అన్నది) జనించును. కాలక్రమమున ఆ కలనము బుద్బుదము (బుడగ) అగును. కుమ్మరి సారె (చక్రము) మీద నున్న మట్టి ముద్ద తిరుగుచున్న చక్రవాయువు (సుడిగాలి)చే పీడింపబడినదై (కుమ్మరి) హస్తములచే చేయబడుచున్నదై, విశ్వరూపమును (కుండ మొదలగు రూపమును) తాల్చును. ఈ విధముగనే ఆత్మ ఎముకతోగూడినదై వాయువుతో పైకి ప్రేరేపింపబడినదై మానుషాకారము గలవాడగును. అచట రూపము కలిగినట్లే మనస్సు కలుగును. వానిలో వాయువు పుట్టును. వాయువునుండి జలము, జలమునుండి ప్రాణము పుట్టును. ప్రాణము నుండి శుక్రము వృద్ధిజెందును. రక్తభాగములు (శోణితముల యొక్క భాగములు) ముప్పది మూడు. శుక్ర భాగములు పదునాలుగు (మొత్తము 46 భాగములు) ప్రతి భాగము నుండి సగము ఫలము అనగా రెండు కర్షములు లేదా ముప్పదిరెండు మాసముల పరిమాణము గల భాగమును తీసికొని గర్భమున ప్రవేశించును. (గర్భముగా అగును). తరువాత గర్భముతో గూడిన ఆకారము ఐదు ప్రాణ అపాన, సమాన, వ్యాన, ఉదాన వాయువులతో చుట్టబడును. ఈ గర్భమునకు తండ్రి శరీరము నుండి ప్రతి అవయవ రూపము కలుగును. తరువాత తల్లియొక్క తల్లి ఆహారమునుండి త్రాగుట ద్వారా నాకుట ద్వారా ప్రవేశించినది బొడ్డు త్రాడులో ప్రవహించి గర్భములో ప్రవేశించుటచే అది దేహులకు (గర్భ ప్రాణులకు) ప్రాణాధారమగును.

మావితో చుట్టబడిన శిరమును ధరించినవాడై, సర్వావయవములచే చుట్టబడిన వాడై, తొమ్మిది మాసములు చుట్టగా కష్టములను అనుభవించినవాడై తొమ్మిది మాసములు గర్భమందు ఉండి యోనిరంధ్రము నుండి అధోముఖుడై పర్యాయక్రమమును తప్పి ఆవలకు వచ్చును. ఆ తరువాత పాపకర్మలచేత నరకమును పొందును. అసిపత్ర వనమను నరకము, బూరుగు చెట్టుల గొట్టుట పగలగొట్టుట యొక్క భయము. రక్త భోజనము, ఈ భయంకరమైన తీవ్రబాధలను కుంభీపాకముచే సహింప అలవిగానివై ఉండును. నీరు వేరు చేయబడిన రూపమును పొందినట్లు యాతనాస్థానమునకు వచ్చినవాడు ఛిన్నుడు, భిన్నుడు నగును. ఈ విధముగా జీవుడు తానుచేసిన పాపములచేత పరితపింపబడినవాడగును. జీవుడు తన కర్మలచేతనే దుఃఖమునుగాని సుఖమునుగాని పొందును. అన్ని విధముల మృత్యు ప్రవేశము తానొక్కడే చేయును. తోడెవ్వడునూ రారు. చేసిన కర్మఫలమును ఒక్కడే అనుభవింపవలెను. తోడెవ్వడురాడు. కావున పుణ్యమునే ఆచరించవలెను. ప్రాణావసానమున శరీరమును వదలి బయలుదేరిపోవుచున్నవాని వెంట ఎవ్వరును రారు.వాడు చేసిన కర్మయే వెంబడివచ్చును.

వారు నిత్యము యమలోకములో వేర్వేరు దేహములు గలవారై యేడ్చుచుందురు. వారికి అనిష్టమైన ప్రయోగములచేత నిండిపోవుచుందురు. అధర్మమువల్ల కలిగిన అనేక యాతనలచే తీవ్ర బాధలచే చుట్టుకొన్న వేదనా శరీరములు గలవారగుదురు. దేహికి పూర్వకృత పాపకర్మల సరిపోవు తామస సంసారము కలుగును. అది ఆరు విధములు. మానుషము. పశుభావమును, పశుభావమువల్ల మృగమగును. మృగభావము వల్ల పక్షి భావము దాని నుండి సర్పమగును. సర్పభావము నుండి నిస్సంశయముగ స్థావరత్వము నందును ఆ స్థావరత్వము నుండి మేలుకొనునంత వరకువాడు కుమ్మరిసారె చక్రమువలె అక్కడనే తిరుగుచుండునని చెప్పెదరు.

ఈ విధముగా మనుష్యుడు మొదలు స్థావరము వరకు పరివర్తించునది తామస సంసారమని తెలియవలెను. అచటనే, బ్రహ్మ మొదలుకొని పరివర్తనమానమగునది సాత్త్విక సంసారము అని అందురు. స్వర్గ స్థానములతో బ్రహ్మాది పిశాచముల వరకు పరివర్తమానమగు సంసారము సాత్త్వికమని తెలియవలెను. బ్రాహ్మమునందు కేవలము సత్త్వము ఉండును. స్థావరమున కేవలము తమముండును. ఈ పదునాలుగు స్థానముల మధ్యన విఘ్నముగా నిలచినది రజము. తన మర్మస్థానములు కోయబడుచుండగా వేదనచే పీడితుడైన దేహియైన బ్రాహ్మణుడు పరవశుడైన బ్రహ్మనెట్లు స్మరించగలడు. పూర్వ ధర్మము యొక్క సంస్కారమువలన భావనవల్లను ప్రవేశింపబడినవాడై నిత్యము మానుష్య భావమును పొందును. కావున నిత్యము సమాహితచిత్తుడు బ్రహ్మయందు మాత్రమే లగ్నమైన చిత్తము గలవాడు కావలెను.