వాయు మహా పురాణము
సృష్టి ప్రకరణము
మరల సూతుడు ఈ విధముగా పలికెను:
జలములు అగ్నినుండి పుట్టినవి. ప్రళయములో అగ్ని నష్టము అయ్యెను. భూమండలము జలములలో మునిగిపోయెను. చరాచరులగు ప్రాణులు నశించెను. అపుడు సర్వము ఒకే జలరాశిగా ఉండి, ఏమియూ తెలియకుండెను. అపుడు అనంతములు అగు నేత్రములు కలిగినట్టియు, అనంతములగు పాదములు కలిగినట్టియు, అనంతములగు శిరస్సులు కలిగినట్టియు, బ్రహ్మ రూపుడైనట్టి భగవంతుడు నారాయణుడు ఆ జలమునందు నిద్రించెను. ఆయన సత్త్వగుణము యొక్క ఉద్రేకము కలిగి, నిద్రలేచి, సర్వము శూన్యముగ ఉండుటను చూచెను. నారములు అనగా జలములు. జలముల యందు నిద్రించును కనుక, భగవానునకు నారాయణుడు అని పేరు కలిగెను. నరుని (పురుషోత్తముని) నుండి పుట్టుటచే జలములకు నారములని పేరు కలిగెను.
భగవానుడు వేయియుగముల రాత్రి కాలమునందు నిద్రించి, రాత్రి పూర్తి కాగానే సృష్టిని ప్రారంభించుట కొరకై బ్రహ్మను నిర్మించెను. అపుడా బ్రహ్మ ఆ జలమునందు వాయురూపముతో, వర్షాకాలములో రాత్రియందు ఇటునటు తిరుగాడు మిణుగురు పురుగు వలె సంచరించెను. అపుడాయన ఆజలములో భూమి మునిగి ఉన్నదని తెలుసుకొనెను. కాని, ఆ భూమిని పైకి ఎత్తుటకై ఏమి చేయవలెనో ఆయనకు తెలియలేదు. అపుడు పరమేశ్వరుడు తన మనస్సుచే పూర్వకల్పములయందు తాను మరియొక దివ్య దేహమును ధరించిన విధమును స్మరించెను.
సర్వము జలముచే నిండి ఉండుటను, భూమిదాని యందు మునిగి ఉండుటను భగవానుడు చూచి, “నేను ఏ పెద్ద రూపమును ధరించి, ఈ భూమిని పైకి ఎత్తవలెను?” అని ఆలోచించి, నీటిలో ఆడుటయందు అభిరుచిగల వరాహము యొక్క రూపమును స్మరించెను. అపుడు పరమేశ్వరుడు దాల్చిన వరాహమూర్తిని ప్రాణులేవియూ జయించలేవు. అది జ్ఞానరూపమైన, ధర్మము అను పేరుగల వరాహము. అది పదియోజనముల వైశాల్యమును, వందయోజనముల ఎత్తును కలిగి, నల్లని మేఘమువలె భాసించు చుండెను. దాని, శబ్దము మేఘగర్జనను పోలియుండెను. దాని తెల్లని దేహము పెద్ద పర్వతమును పోలియుండెను. దాని పదునైన దంతములు భయము కొల్పుచుండెను. దాని నేత్రములు మెరుపువలె, అగ్నివలె ప్రకాశించెను. అది సూర్యునితో సమానమైన తేజస్సును కలిగి ఉండెను. దాని భుజస్కంధములు బలిసి, విశాలముగా, గుండ్రముగా ఉండెను. అది సింహమువలె విక్రమముతో నడచెను. దాని కటిభాగము బలిసి ఎత్తుగా ఉండెను. మృదువైన నున్నని దేహముగల ఆ వరాహము శుభ లక్షణములను కలిగి ఉండెను. శ్రీహరి అట్టి విశాలమగు వరాహరూపమును ధరించి, భూమిని పైకి ఎత్తుట కొరకై రసాతలమున ప్రవేశించెను.
వేదవేద్యుడగు పరమాత్మ యజ్ఞ వరాహము యొక్క మూర్తిని తాల్చెను. యజ్ఞము దాని వక్షస్థలము. చితి (యజ్ఞములోని ఇష్టకాచితము) దాని నోరు. అగ్నియే జిహ్వ. దర్భలే రోమములు. బ్రహ్మయే శిరస్సు కాగా, ఆ వరాహము దుర్నిరీక్ష్యముగా ప్రకాశించెను. రాత్రింబగళ్లు కనులు, వేదాంగములు (శిక్షా, వ్యాకరణ, ఛందః, నిరుక్త, కల్ప, జ్యోతిషములు) చెవులకు ఆభరణములు, హోమ ద్రవ్యమగు ఆజ్యము ముక్కు, స్రువము, (హోమము చేయు గరిటె) తుండము కాగా, సామవేద ఘోషయే ఆ వరాహము చేయు పెద్ద శబ్దము అయ్యెను. సత్యము, ధర్మము స్వరూపముగాగల ఆ వరాహము ధర్మము యొక్క పరాక్రమముతో శోభిల్లెను. ప్రాయశ్చిత్త కర్మలు ప్రియముగాగల ఆ యజ్ఞ వరాహము పెద్దఆకారముతో భయమును గొల్పెను. యజ్ఞ పశువు దాని మోకాలు ఆయెను. ఎత్తైన దేహముగల ఆ పరాహమునకు హోమము లింగము కాగా, గొప్ప ఓషధులు బీజము అయెను. వేదవేద్యుడగు పరమాత్మ దాని అంతరాత్మ, మంత్రము దాని పిరుదులు. హోమ ద్రవ్యములగు నేయి, సోమరసము రక్తము అయ్యెను. వేదములు ఆ వరాహము యొక్క స్కంధములాయెను. హోమద్రవ్యముల గంధము కలిగిన ఆ వరాహము హవ్య (దేవతల కర్పింపబడునది), కవ్య (పితృదేవతలకు ఈయబడునది)ముల వేగము కలిగి ఉండెను. యజ్ఞశాలయే దేహము కాగా ఆ వరాహము యజ్ఞీయ దీక్షలతో కూడి విరాజిల్లుచుండెను. యోగశక్తి గల ఆ వరాహము దక్షిణలే హృదయముగా, మహాసత్రయాగము స్వరూపముగా ప్రకాశించెను. ఉపాకర్మేష్టి యొక్క ప్రకాశము గల అయజ్ఞ వరాహము ప్రవర్గ్యము (యజ్ఞము లోని ఒక కర్మ) అలంకారముగా కలిగి ఉండెను.
ఆ వరాహము, వైదిక ఛందస్సులు నడిచే మార్గము కాగా, ఛాయయే పత్నికాగా, రహస్యములగు ఉపనిషత్తులు ఆసనముకాగా, మణులు పొదిగిన పర్వత శిఖరమువలె ఉన్నతమై భాసించెను. జగత్ప్రభువు, ప్రజాపోషకుడు అగు శ్రీహరి ఇట్టి యజ్ఞ వరాహ రూపమును ధరించి, నీటిలో ప్రవేశించి, మునిగి ఉన్న భూమి వద్దకు చేరెను. ఆయన భూమిని సమీపించి, వెంటనే పైకి లేవనెత్తి, దానియందలి సముద్ర జలములను సముద్ర పాతాళములో మునిగియున్న భూమిని లోకహితమునుగోరి శ్రీహరి దంష్ట్రతో పైకి లేవనెత్తెను.
భూమిని సృజించి వహించు భగవానుడు అపుడా భూమిని దాని స్థానమునకు తెచ్చి, మనస్సుతో సంకల్పించి విడిచిపెట్టెను. భూమి ఆ విశాలమగు జలరాశిపై పెద్ద నౌకవలె కన్పట్టెను. భగవానుడు అచట ఉంచుట వలన, భూమి మునిగిపోకుండా ఉండగల్గెను. అపుడు పద్మము వంటి నేత్రములు గల శ్రీహరి జగత్తు స్థితిని కల్పించు ఇచ్ఛగలవాడై, భూమిని విభాగము చేయుటకు నిశ్చయించెను. ఆయన భూమిని సమముగా చేసి, ఆపైన అక్కడక్కడ పర్వతములను సమకూర్చెను. పర్వతములు పూర్వము ప్రళయ కాలాగ్నిచే దహింపబడి, భూమియందు అంతటా చెల్లాచెదురుగా విసిరివేయబడి, క్రుంగిపోయెను. అపుడు ఆచల్లని జలరాశియందు వాయువుచే జలములద్వారా ఒకచోటకు చేర్చబడి రాశులుగా చేయబడి పర్వతములాయెను. ఇట్లు ఒక రాశిగా చేయబడిన తరువాత ఘనీభవించి, కదలిక లేని పెద్ద రాశులుగా అగుట వలన వాటికి అచలములని పేరు వచ్చెను. వాటి నిర్మాణములో వివిధ స్థాయిలలో సంధులు (పర్వలు) ఏర్పడుట వలన పర్వతములని పేరు వచ్చెను.
నీటిలోపల దాగియుండుట వలన గిరులు అనియు, రాశులుగా ఘనీభవించుట వలన శిలోచ్ఛయములనియు పర్వతములకు పేర్లు వచ్చెను. ప్రళయమునందు లోకములు, సముద్రములు, పర్వతములు చెల్లాచెదరు కాగా, కల్పాదియందు మరల మరల విశ్వకర్మ వాటిని యథాభాగముగా విడదీయును. బ్రహ్మ మరల సముద్రములతో, ఏడు ద్వీపములతో పర్వతములతో కూడిన ఈ భూమిని, మరియు భూరాది (భూః, భువః, సువః, మహః) నాల్గు లోకములను సృష్టించెను. ఇట్లు లోకములను సృజించి, ప్రజలను కూడా సృష్టించెను.
స్వయంభువు, భగవంతుడు అగు బ్రహ్మ వివిధ ప్రాణులను సృష్టించగోరెను. ఆయన పూర్వకల్పముల యందలి సృష్టిని పోలిన సృష్టిని చేసెను. ఆయన తన బుద్ధిలో సృష్టిని గురించి ధ్యానము చేయుచుండగా, ప్రధానముతో బాటు అదే కాలములో తమో గుణాత్మకమగు సృష్టి బయల్వెడలెను. ఆ మహాత్ముని నుండి బయల్వెడలిన ఈ అవిద్యా రూపమగు సృష్టియందు తమస్సు, మోహము, మహామోహము, తామిస్రము, అంధము అను ఐదు రకముల శ్రేణులు ఉండెను. సృష్టిని గురించి ధ్యానించగా, ప్రథమ శరీరాభిమానియగు బ్రహ్మనుండి, కుండచే మూసివేయబడిన దీపమువలె, అన్ని వైపులా తమోగుణముచే (అయిదు విధములుగా) ఆవృతమైన సృష్టి బయలుదేరెను.
ఈశ్వర చైతన్యము లోపల, బయటకూడ వ్యాపించి ఉండును. ఆత్మరూపమగు ఈ చైతన్యము శుద్ధము, నామ రూపములులేనిది. కాని, ప్రథమ సృష్టియగు వృక్ష జాతిలో బుద్ధి, మరియు ముఖమునందు ఉండే ఇంద్రియములు (ముక్కు, నోరు, చెవి, కన్ను), అజ్ఞానముచే కప్పివేయబడినవి. ప్రథమ సృష్టి ఈ విధముగా విఫలమగుటను గాంచి బ్రహ్మ చీకాకుపడెను. అపుడాయన మరియొక సృష్టిని సంకల్పించి మరల ధ్యానము చేయగా, జంతుప్రపంచము సృష్టింపబడెను. జంతువులలో ఆహారగ్రహణము భూమికి సమాంతరముగా ఉండుటచే, జ్ఞానహీనములై అవి తప్పుదారిలో నడుచును (అనగా, ఆజన్మలో ఉన్నతినిపొందలేవు); మరియు విపరీత జ్ఞానమును కలిగి ఉండును.
తత్త్వములలో అహంకారము ఒకటి. ఇది ‘నేను’ అను రూపములో బుద్ధియందు భాసించును. ఇంద్రియముల అశక్తులు పదకొండు, బుద్ధిలోని దోషములు పదిహేడు. వెరసి ఇరవై ఎనిమిది. తుష్టి తొమ్మిది విధములుగ ఉన్నది. సిద్ధులు ఎనిమిది విధములుగ ఉన్నవి. ఈ తత్త్వములు అన్నియూ సాంఖ్యములో పరిగణింపబడినవి. ఇరువది ఎనిమిది విధముల అశక్తులు (వధలు) జంతు సృష్టియందు ఉండును. పశువులలో అంతరంగము నందు ప్రకాశమున్ననూ, బాహ్యములో అజ్ఞానము యొక్క ఆవరణ గలదు. ఈ విధముగా నిర్మాణమైన రెండవ సృష్టియగు పశుప్రపంచమును చూచి బ్రహ్మ తన అభిప్రాయము వ్యర్థమైనదని భావించెను.
తరువాత తదేకముగా ధ్యానించి, బ్రహ్మ సత్త్వగుణ ప్రధానులగు దేవతలను సృష్టించెను. ఈ మూడవ సృష్టి ఊర్ధ్వ లోకములయందు చేయబడెను. దీనికి ఊర్థ్వస్రోతస్సు అని పేరు. మానవులు అగ్నిలో వ్రేల్చిన హవిస్సు సూక్ష్మ రూపములో ఊర్ధ్వ లోకమును చేరి, దేవతలకు ఆహారమగును. కావున, దేవ సృష్టికి ఊర్ధ్వ స్రోతస్సు అని పేరు. దేవతలు లోపల, బయట పూర్ణులై, సుఖ సంతోషములతో అలరారుదురు. ఊర్ధ్వ స్రోతస్సులోని దేవతలు లోపల, బయట ప్రకాశము కలిగి ఉందురు. ద్యులోకమునందు సంచరించు దేవతలు సంతుష్టాంతరంగులై ఉందురు. దేవతలతో కూడిన ఈ ఊర్ధ్వస్రోతస్సును సృష్టించి, జగత్ప్రభువగు బ్రహ్మ సంతోషించి, మరల ఇంకొక సృష్టికొరకు నిర్ణయించెను.
జగదీశ్వరుడగు బ్రహ్మ ఇంకనూ ధ్యానించెను. ఆయనది సార్థకమైన ధ్యానము. ఆయన మరియొక సఫలమగు సృష్టిని చేసెను. అవ్యక్తము నుండి శ్రేష్ఠమగు అర్వాక్ స్రోతస్సు ఆవిర్భవించెను. మానవులలో ఆహార గమనముపై నుండి క్రిందకు ఉండుటచే మానవ ప్రపంచమునకు అర్వాక్స్రోతస్సు అని పేరు. మానవులు బుద్ధి ప్రధానులు. వారిలో రజస్తమోగుణములు మూడింటి యొక్క ఆధిక్యము కన్పట్టును. కావున, వారు దుఃఖములను అధికముగా అనుభవిస్తూ, అనేక కర్మలను చేయుచుందురు. వారికి లోపల, బయట కూడా ప్రకాశము కలదు. మానవులు కర్మ ప్రధానులు. వారియందు ఊహ, శబ్దము మొదలగు ఎనిమిది రకముల సిద్ధులు ఉండును. మానవులు ఉన్నతిని పొందగల సమర్థులు. వారు గంధర్వులతో సమమగు లక్షణములను కలిగి ఉందురు. ఈ విధముగా ఈ అర్వాక్స్రోతస్సు తేజోమయమగు సృష్టి అని వర్ణింపబడినది.
అయిదవది అనుగ్రహ సర్గము. ఇది అవిద్య, అశక్తి (ఇంద్రియములకు శక్తి లేక పోవుట), తుష్టి (జ్ఞానము కొరకు శ్రమించాలనే ఆసక్తి లేకపోవుట) మరియు సిద్ధి (అధ్య యనము, దానము ఇత్యాది) అని నాల్గు విధములుగ ఉన్నది. అహంకారము మొదలు సర్వప్రాణుల వరకుగల తత్త్వములకు ఆధారముగా గల మౌలికార్థములు (ఇవి పదిగలవు) ఆరవ సర్గమగును. అవిద్యతోను, అశక్తితోను కూడియున్నది అహంకారము, అవిద్యతోను, అశక్తితోను కూడియున్నది అగు మహత్తు యొక్క సృష్టి మొదటిది, ఆ మహత్తు నుండి పంచతన్మాత్రల (సూక్ష్మ భూతముల) సృష్టి రెండవది. దీనికి భూత సర్గమని పేరు. ఇంద్రియముల సృష్టి మూడవది. ఈ మూడు కలిసి, సంకల్ప పూర్వకముగా ప్రకృతి నుండి బయల్వెడలిన సృష్టి అగును. నాల్గవది ముఖ్యసర్గము. వృక్ష లతాదులు ముఖ్యములు అనబడును.
తిర్యక్స్రోతస్సు అనబడే పశుపక్ష్యాదుల సర్గము ఐదవది. ఊర్థ్వ స్రోతస్సులగు దేవతల సృష్టి ఆరవది. దానికే దేవసర్గమని పేరు. ఏడవదియగు అర్వాక్స్రోతస్సుల సృష్టికి మానుష సర్గమని పేరు. ఎనిమిదవది అనుగ్రహ సర్గము. అది సత్త్వ ప్రధానముగను, తమోగుణ ప్రధానముగను కూడ కలదు. ఈ అయిదు వైకృతి సర్గములు అనగా ప్రకృతి నుండి పుట్టిన వికృతుల నుండి పుట్టినవి. ప్రాకృత సర్గములు మూడు. ఈ ప్రాకృత, వైకృత సర్గములు అనగా ప్రకృతి నుండి పుట్టిన వికృతుల నుండి పుట్టినవి. ప్రాకృత సర్గములు మూడు. ఈ ప్రాకృత, వైకృత సర్గములే గాక తొమ్మిదినది అగు కౌమార సర్గముకూడ గలదు. ఇది ప్రాకృతము, వైకృతముకూడా. సంకల్పములేని మూడు ప్రాకృత సర్గములు బయలుదేరగా, బ్రహ్మయొక్క సంకల్పముచే మిగిలిన ఆరు సర్గములు బయలు దేరినవి.
నేను అనుగ్రహ సర్గమును విస్తరముగా వివరించెదను. తెలుసుకొనుడు. అది సర్వ ప్రాణులలో నాల్గు విధములుగా ఉన్నది. విపర్యయము, అశక్తి, తుష్టి మరియు సిద్ధి అను నాల్గు విధములు దానికి కలవు. వృక్షలతాదులలో విపర్యయము (అజ్ఞానము), పశు పక్ష్యాదులలో అశక్తి, మానవులయందు సిద్ధి, దేవతలయందు తుష్టి కలవు. ఈ తీరున, ప్రాకృత వైకృత సర్గములు తొమ్మిది వర్ణింపబడినవి. ఈ తత్త్వముల పరస్పర సృష్టులు అనేక ప్రకారములుగా ఉన్నవి. మున్ముందుగా బ్రహ్మ తనతో సమానులైన మానస పుత్రులను సృజించెను. సనందనుడు, సనకుడు, సనాతనుడు అనునవి వారి పేర్లు. వారు గొప్ప జ్ఞానులు, గొప్ప తేజశ్శాలులు, జ్ఞానులు అగు ఆ ముగ్గురు మహాను భావులు తండ్రిచే త్యజింపబడుటచే, సంతానమును కనకుండానే, ప్రళయములో ఈశ్వరుని యందు ఐక్యమును పొందిరి.
వారు అట్లు తొలగిపోగా, బ్రహ్మ వివిధ అధికారములయందు, అభిమానము (నేను, నాది అనుధారణ) గల మానస పుత్రులను మరల సృజించెను. వీరు ప్రళయ కాలములో సర్వ ప్రాణులు నశించువరకు ఉందురు. వీరి నామములను తెలుసుకొనుడు. జలములు, అగ్ని, పృథివి, వాయువు, అంతరిక్షము, దిక్కులు, స్వర్గము, ద్యులోకము, సముద్రములు, నదములు, శైలములు, వృక్షములు, ఓషధులు, లతలు, లవము (సెకను)లు, కాష్ఠ (రెండు సెకనులు)లు కల (నిముషము)లు, ముహూర్తము (48 నిముషములు)లు, సంధ్యలు, రాత్రులు, పగళ్లు, పక్షములు, నెలలు, అయనము (6 నెలలు)లు, సంవత్సరములు, యుగములు అనునవి వాటి పేర్లు. ఈ స్థానాభిమాని దేవతలు ఆయాస్థానముల నామములచే పిలువబడెదరు.
బ్రహ్మముఖము నుండి బ్రాహ్మణులు, వక్షస్స్థలము నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, మరియు పాదముల నుండి శూద్రులు జన్మించిరి. ఈ విధముగా వర్ణములు అన్నియూ ఆయన దేహము నుండి ఉద్భవించినవి. అవ్యక్తము (ప్రకృతి) కంటే నారాయణుడు ఉత్కృష్టమైనవాడు. అండము అవ్యక్తము నుండి పుట్టినది. అండమునుండి బ్రహ్మ జన్మించెను. ఈలోకములు ఆయనచేత స్వయముగా నిర్మింపబడినవి. ఇంతవరకు నేను మీకు ఈ పురాణములోని ప్రథమ పాదమును విస్తరము కాకుండా, సంగ్రహముగా చెప్పితిని. (6)
ఇంతటితో ప్రక్రియా పాదము సంపూర్ణము.