వాయు మహా పురాణము
సృష్టి ప్రకరణము
నైమిశారణ్యములో నివసించే ఆ మహర్షులందరు సూతుని మాటలను విని, ఉత్కంఠతో నిండిన కన్నులు గలవారై, సూతునితో “నీవు పురాణములో సమర్థుడవు. వ్యాసుని నుండి సాక్షాత్తుగా ఆ జ్ఞానమును పొందినవాడవు. కావున నీవు ఈ లోకముయొక్క పూర్వస్థితిని వర్ణింపుము. ఏయే వంశములకు చెందిన మహాత్ములు ఎవరెవరు? అను విషయమును, పూర్వ ఋషుల సృష్టిని, ప్రజాపతి యొక్క విచిత్రమగు సృష్టిని తెలియగోరుచున్నాము అని ప్రార్థించగా మహాత్ముడైన లోమహర్షణుడు అనేక పర్యాయములు వారిచే కోరబడినవాడై పురాణమును విస్తరముగా, సరియగు క్రమములో చెప్పెను.
లోమహర్షణుడు ఇట్లు పలికెను:
మీరు దివ్యము, మధురము, పాపనాశనము అగు కథను కోరితిరి. నేను చిత్రము, అనేకార్థములు కలది, వేదసమ్మతము అగు పురాణమును చెప్పెదను. దీనిని నిత్యము ఎవరు తమ బుద్ధిలో ధారణ చేయుదురో, ఎవరు దీనిని మరల మరల విందురో, ఎవరు మనోనిగ్రహముతో శుచిగా ఉండి దీనిని పర్వదినములలో, పుణ్యక్షేత్రములయందు, దేవాలయములయందు విప్రులకు, విశేషించి యతులకు వినిపించెదరో; అట్టివారు దీర్ఘాయుర్దాయమును పొందుదరు. మరియు, ఈ పురాణమును పఠించువారు ఈ లోకములో తమ వంశమును నిలిపి, స్వర్గలోకములో మహిమను పొందెదరు. ఈ పురాణము చాల విశాలమైనది. దీనిని నేను ఉన్నది ఉన్నట్లుగా, విన్నది విన్నట్లుగా వివరించెదను. శ్రద్ధతో విని తెలుసుకొనుడు. ఇది అందరికీ కీర్తిని పెంచి, ధన్యులను చేయును. శత్రువులను నశింపజేసి, ఆయుర్దాయమును పెంపొందించును. స్వర్గఫలమును ఇచ్చును.
శాశ్వతమగు కీర్తిగల పుణ్యాత్ములందరి చరితము దీనియందు వర్ణింపబడును. సృష్టి, అవాంతర సృష్టి లేదా ప్రళయము, దేవాదుల వంశములు, మన్వంతరములు, రాజ వంశములు అను అయిదు విషయములు పురాణములో వర్ణింపబడును. పావనములగు వాటిలోకెల్లా పావనమైనది. వేదమునకు అనురూపమైనది అగు వాయుపురాణమును నియమము, శుచిగలవాడనై నేను ప్రవచించెదను. సృష్టి స్థితి ప్రళయములు, పరమాత్మ నిద్రలేచుట అను అంశములు, మొదటిదగు ప్రక్రియా పాదములో వివరింపబడును. ఇదిగాక, ఉపోద్ఘాత, అనుషంగ, ఉపసంహార పాదములు కూడా కలవు. ధర్మ బోధకము, కీర్తిదాయకము, ఆయుర్వర్ధనము, సర్వపాపహరమునగు ఈ పురాణములోని నాల్గు పాదములను నేను సంగ్రహముగా చెప్పితిని.
ఈ పాదములను నేను మరల క్రమములో విస్తారముగా నుడివెదను. పూర్ణ స్వరూపుడగు ఈశ్వరుని, జగత్ప్రథముడుగు హిరణ్యగర్భుని, జగత్తును సంహరించు శివుని, ప్రాణి రూపముగా ప్రకటితమయ్యే పరమాత్మను, జగత్సృష్టికి మూలము, స్వయంభువు అగు బ్రహ్మకు నమస్కరించెదను. మహత్తు (సమష్టిబుద్ధి) ఆదియందు, పరమాణు విశేషములు అంతమునందు కల్గినట్టియు, వివిధ రూపములు, లక్షణములు కలిగినట్టియు, పరమాత్మచే అధిష్ఠింపబడియున్న సాటిలేని ప్రాణి సృష్టిని సంశయ నివారణము అగునట్లు ప్రవచించెదను. జగత్కారణము అవ్యక్తము. అది నిత్యము కారణము. అదియే. కార్యము అదియే. తత్త్వవేత్తలు దానిని ప్రధానమని, ప్రకృతి అనియు వ్యవహరించెదరు. మరియు దానియందు రుచి, వాసన, రంగు శబ్దము, స్పర్శలు లేవు. దానికి పుట్టుక, నాశములేవు. అది నిత్యము, స్థిరము, సనాతనము (త్రికాలా బాధితము) అగు ఈ ప్రధానము తనకు తాను ఆశ్రయముగా కలిగియుండును. ఇదియే జగత్కారణము ఈ ప్రధానము కూటస్థ (నిర్వికార) పరబ్రహ్మ యొక్క స్వరూపమే.
ఆద్యంతములు లేనిది, పుట్టుక లేనిది, ఇంద్రియ గోచరము కానిది (సూక్ష్మము), త్రిగుణాత్మకము అగు అవ్యక్తమే సర్వప్రాణుల దేహములుగా పరిణమించినది. అవ్యక్తము బ్రహ్మకంటే ముందు ఉండెను. అప్పుడది ఇప్పటివలె ఇంద్రియ గోచరము కాని సూక్ష్మావస్థలో నుండెడిది. అప్పుడు ఈ జగత్తు అంతా తమోగుణ రూపముగా అవ్యక్తముచే వ్యాప్తమై ఉండినది. సృష్టికాలమునందు ఆ ప్రధానము (అవ్యక్తము) క్షేత్రజ్ఞుని (పురుషుని)చే అధిష్ఠితమై, త్రిగుణముల సామ్య అవస్థారూపములో నుండెను. తమోగుణము ప్రముఖముగా ఉండెడిదికాదు. ప్రధానము గుణముల సామ్యావస్థనుండి వైదొలగుటచే, మహత్తు పుట్టెను. అవ్యక్త పరిణామమగు ఆ మహత్తు సూక్ష్మ రూపములో ఉండెను. మహత్తునందు సత్త్వగుణము అధికముగా ఉండుటచే, అది ప్రకాశరూపమై ఉండెను. సమష్టి బుద్ధియగు మహత్తు నుండి వ్యష్టిబుద్ధి జనించెను.
క్షేత్రజ్ఞుని (పురుషుని)చే అధిష్ఠింపబడిన ఆ సమష్టి లింగదేహము (మహత్తు) పుట్టెను. జగత్తులోని పదార్థముల సృష్టికి మూలమైన ధర్మము మొదలగు వాటి రూపములు దానియందు నిహితమై ఉండెను. సృష్టించాలనే కోరికచే ప్రేరితమైన మహత్తు సృష్టిని చేయును. ‘మనస్సు’, ‘మహాన్’, ‘మతి’, ‘బ్రహ్మ, ‘పురము’, ‘బుద్ధి’, ‘ఖ్యాతి’, ‘ఈశ్వరుడు’ ‘ప్రజ్ఞ’, ‘చితి’, ‘స్మృతి’, ‘సంవిత్’, ‘విపురము’ అను పేర్లతో విద్వాంసులు దానిని వ్యవహరింతురు. సర్వ వ్యాపకమగు మహత్తు సర్వప్రాణుల విస్తారమగు కర్మ ఫలమును తెలుసు కొనగలిగే సూక్ష్మమగు బుద్ధిగలది. కనుక, దానికి మనస్సు అని పేరు వచ్చినది. మహత్తుతత్త్వములు (సాంఖ్య పరిగణిత పదార్థములు) అన్నింటిలో ముందుగా పుట్టెను. మరియు అది మిగిలిన తత్త్వములన్నింటి కంటే పరిమాణములో పెద్దది. అందువలన దానికి ‘మహాన్’ అని పేరు వచ్చెను.
మహత్తు పురుషునికి లభించే భోగము యొక్క పరిమాణమును, వివిధ పురుషుల భోగములలోని విభాగమును నిరూపించును. కావున అది ‘మతి’ అనబడును. ఈ మహత్తు గొప్ప పరిమాణముగలది. మరియు సృష్టికాలములో దానినుండి మహాశబ్దము వెలువడును. అంతేగాక, మహత్తు, సర్వప్రాణుల రూపములో విస్తారము చెందును. కాబట్టి, అది ‘బ్రహ్మ’ అనబడును. మహత్తు తన అనుగ్రహమును ప్రాణుల దేహములపై ప్రసరింపజేసి, ఆ పాంచభౌతిక శరీరములను వ్యాపించియుండును. కనుక, దానికి పురము (పూరించునది) అని పేరు వచ్చినది. పురుషుడు ఈ ‘మహత్తు’ నందు తనకు ఇష్టా నిష్టములగు పదార్థములను అన్నిటినీ దర్శించును. పురుషునకు అట్టి బోధను కలిగించును కనుక, మహత్తునకు ‘బుద్ధి’ అను పేరుగలదు. పురుషుని భోగము జ్ఞానరూపమున ఉండును. పురుషునికి వివేకము, భోగము కూడా మహత్తు నుండి సంప్రాప్తమగును. కావున, మహత్తునకు ‘ఖ్యాతి’ అను పేరు గలదు. మరియు, మహత్తు అనేక నామములచే, గుణములచే కీర్తింపబడును. ఆ కారణముచేత కూడా, దానికి ఖ్యాతి అను పేరు వచ్చినది.
మహత్తువలననే పరమాత్మ సర్వజ్ఞుడైనాడు. మహత్తునుండి యే గ్రహములు పుట్టినవి. కావున, దానికి ‘ప్రజ్ఞ’ అని పేరు. పురుషుడు ఆచరించే యజ్ఞాది కర్మలకు ఫలములైన భోగములను, మహత్తు పురుషునకు సంక్రమింపజేయును. మరియు పురుషునకు జ్ఞాన ప్రకాశము నిచ్చును. కావున, మహత్తునకు ‘చితి’ అని పేరు వచ్చినది. పురుషుడు భూత, వర్తమాన, భవిష్యత్కార్యములను అన్నిటిని స్మరించగల్గుటలో మహత్తు హేతు భూతమైనది. కాన, ఇది ‘స్మృతి’ అనబడును. పురుషుడు పొందే సర్వ జ్ఞానమునకు మూలము మహత్తు. కాన, దానికి ‘మహాత్మ్యము’ అని పేరు. పురుషుడు జ్ఞానమును అంతనూ మహత్తునందు పొందుటచే, దానికి ‘సంవిత్’ అని పేరు వచ్చినది. సర్వము దాని యందు ఉన్నది. అది సర్వమునందు ఉన్నది. ఈ కారణముచేత గూడా పండితులు మహత్తును ‘సంవిత్’అని పిలుతురు. ‘మహత్తు’ జ్ఞాన రూపము. భగవానుడు జ్ఞానమునకు సన్నిధిలో ఉండును. మహత్తు స్త్రీ పురుష ద్వంద్వ రూపములో విపులమగు జగద్రూపముగా విస్తరించుటచే, పండితులు దానిని ‘విపుర(ల)ము’ అని వర్ణింతురు.
ఈ సర్వజగత్తును శాసించు పరమాత్మ సర్వవ్యాపకుడు. కనుక, బ్రహ్మ అని నిర్దేశింపబడును. ఉనికి ఆయన స్వరూపము గనుక, ఆయన భవుడనబడును. క్షేత్రము (దేహము), క్షేత్రజ్ఞుడు (పురుషుడు) అను వాటి సత్యమును ఎరిగినచో, బ్రహ్మ మొక్కటియే సర్వముగా భాసించుచున్నదని స్పష్టమగును. కావున, ఆ పరమాత్మకు ‘కః’ (ఒక్కటే) అనిపేరు. దేహము అను నగరమునందు నివసించును గాన, పరమాత్మకు పురుషుడని పేరు. పరమాత్మకు పుట్టుక లేదు; పరమాత్మ సనాతనుడు; కావున, ఆయనకు స్వయంభువు అనిపేరు. ఈ తీరున, సర్వోత్కృష్టము, సర్వాది అగు ఈశ్వరతత్త్వము, తత్త్వజ్ఞులగు ఋషులచే అనేక పదములతో పిలువబడును. (అట్టి ఈశ్వరునిచే అధిష్ఠింపబడిన) మహత్తు సృష్టించవలెనను కోరికతో ప్రేరితమై, వివిధ రకములుగా సృష్టిని చేసెను.
మహత్తునందు సంకల్పము, అధ్యవసాయము (నిశ్చయము) అను రెండు వృత్తులు కలవు. జగత్తులో పదార్థతత్త్వములకు కారణమైన పదార్థ ధర్మములు, రూపములు మహత్తునందు గలవు. అది సత్త్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములను కలిగి ఉండును. ఆ త్రిగుణాత్మకమగు మహత్తునందు రజోగుణము అతిశయించి, అహంకారము పుట్టెను. ఈ సృష్టి మహత్తుచే వ్యాప్తమై ఉన్నది. భూతములకు ఆదియగు మహత్తు యొక్క వికారమే అహంకారము. దాని యందు తమోగుణము అతిశయించి భూతతన్మాత్రలు (భూత సూక్ష్మములు) పుట్టినవి. ఈ భూతతన్మాత్రలు భూతాది అగు అహంకారము యొక్క తామస వికారములు. తరువాత శబ్దము గుణముగా కలిగిన, అవకాశాత్మకమగు ఆకాశము అహంకారము నుండి జన్మించెను.
భూతాది అగు అహంకారము శబ్ద గుణకమగు ఆకాశము నందు వ్యాపించెను. అపుడు శబ్దతన్మాత్ర స్పర్శతన్మాత్రను సృజించెను. భూతాది ఇట్లు వికృతిని పొంది శబ్దతన్మాత్ర అయ్యెను. ఆకాశము నుండి స్పర్శ గుణము కలిగిన, క్రియాశక్తి ప్రధానుడగు వాయువు జన్మించెను. శబ్దతన్మాత్ర స్పర్శతన్మాత్ర యందు వ్యాపించెను. రసము గుణముగా కలవి జలములు, వాటియందు రూపతన్మాత్రలు వ్యాపించెను. రసాత్మకమగు జలములు వికారమును పొంది గంధ తన్మాత్రను సృష్టించినవి. జలముల నుండి పుట్టిన ఘన రూపమగు పృథివికి గుణము గంధమని చెప్పబడినది. జలగుణమగు రసతన్మాత్ర గంధతన్మాత్రయందు వ్యాపించెను. ఇట్లు ఆయా తన్మాత్రలు వికారమును పొంది, ఆయా గుణములుగల పంచభూతములు పుట్టెను. ఆయా గుణములు ఆయా భూతములకు అసాధారణములు అగుటచే తన్మాత్రలనబడును.
ఈ తన్మాత్రలయందు శాంత (సుఖానుభవము), ఘోర (దుఃఖానుభవము), మూఢ (అజ్ఞానానుభవము) అను విశేష లక్షణములు లేకపోవుటచే, వాటికి అవిశేషములని పేరు వచ్చెను. ఈవిధముగా భూతములు, భూతతన్మాత్రలు తామస అహంకారము నుండి ఉద్భవించినవి. సత్త్వగుణము అతిశయించిన సాత్త్విక అహంకారము నుండి, ఏకకాలము నందు అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు పుట్టినవి. పురుషునకు ఇంద్రియములు కార్యసాధకములు అగుచుండును. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు పదకొండవది అగు మనస్సు (ప్రకాశరూపములు అగుటచే) ‘దేవ’ అనబడును. ఈ విధముగా వికార రూపమగు ఈ జగత్తు ఆవిర్భవించినది. ఇంద్రియములు రాజస అహంకారము నుండియు, తదధిష్ఠాన దేవతలు సాత్త్విక అహంకారము నుండియు పుట్టినవి అని కూడా చెప్పవచ్చును.
చెవులు, చర్మము, కన్నులు, నాలుక మరియు ముక్కు అను అయిదు జ్ఞానేంద్రియములు మనస్సుతో కూడి శబ్దాది విషయములను గ్రహించును. పాదములు, పాయువు, ఉపస్థ, హస్తములు, వాక్కు అనునవి అయిదు కర్మేంద్రియములు కలిసి వెరసి పది అయినవి. అవి క్రమముగా గమనము, విసర్జనము, ఆనందము, చేతిపని మరియు మాటలాడుట అను క్రియలను నిర్వర్తించును. అకాశములోని శబ్దతన్మాత్ర స్పర్శ మాత్రలో ప్రవేశించుటచే, వాయువునకు శబ్దము, స్పర్శ అను రెండు గుణములు కలిగెను. అటులనే, శబ్దస్పర్శలు రెండు రూపమును ప్రవేశించుటచే, అగ్నికి శబ్ద, స్పర్శ, రూపములనే మూడు గుణములు కలిగెను.
శబ్ద స్పర్శ రూపములు రసతన్మాత్రను ఆవేశించుటచే, రసాత్మకములగు జలముల యందు నాల్గు గుణములు గలవు. ఈ నాల్గు గుణములు గంధమాత్ర యందు సమావేశమై పృథివియందు ఉన్నవి. అందువలన స్థూలభూతములలో పృథివియందు ఐదు గుణములు గలవు. ఈ పంచ భూతములలో శాంత, ఘోర, మూఢములను గుణములు ఉండుటచే వాటికి విశేషములు అనిపేరు. ఈ భూతములు ఒక దానితో మరియొకటి కలిసి, ఒకదానికి మరియొకటి ధారకములు అగుచున్నవి. లోకాలోక పర్వతముతోసహా ఈ సర్వము భూమి యందు అంతర్భాగములై ఉన్నవి.
పంచభూతములలో ప్రతి భూతమునకు ప్రత్యేకముగా తనదైన విశేషము (అసాధారణ గుణము) ఉండును. ఆయా విశేషములు ఇంద్రియములకు గోచరమగును. ఆకాశము నుండి పృథివివరకు క్రమముగా ముందు వాటి గుణములు తరువాతి వాటికి సంక్రమించును. కాని, ఒక విశిష్ట భూతము తన అసాధారణ గుణముచేతనే గుర్తింప బడును. కొందరు శుచియగు వాయువును పొంది, అవివేకముచే గంధము వాయు గుణమని పొరబడుదురు. వాస్తవములో, పృథివీ గుణమగు గంధము వాయువునకు పృథివీ సంపర్కమువలన కలిగినది. ఈ ఏడింటిలో ప్రతి ఒక్క తత్త్వము గొప్పదియే-కాని అవి విడివిడిగా ఇతరతత్త్వములతో కలియకుండా ప్రజలను, ఇతరప్రాణులను సృష్టింపలేక పోయినవి. ఈ గొప్ప తత్త్వములు ఒక దానితో మరియొకటి దగ్గరగా వచ్చినవి. మరియు, పురుషునిచే అధిష్ఠింపబడినవై, మహత్తు మొదలుకొని విశేషములు (పంచభూతముల అసాధారణ గుణములు) వరకుగల ఈ తత్త్వములు అవ్యక్తము (ప్రకృతి) యొక్క అను గ్రహముచే అండమును సృష్టించును.
వీటి నుండి బుడగ పుట్టిన విధముగా, విశేషముల నుండి పెద్ద అండము ఒకటి క్షణ కాలములో పుట్టి మహాజలరాశియందు ఉండెను. ఈ విధముగా సృష్ట్యాదిలో ప్రకృతి నుండి అండము ఉద్భవించగా, పరబ్రహ్మ అని పేరుగాంచిన క్షేత్రజ్ఞునకు జగత్కర్తృత్వము సిద్ధించెను. క్షేత్రజ్ఞునకు పురుషుడనియు పేరు గలదు. సృష్ట్యాదిలో సర్వజీవులను సృష్టించిన ప్రథమ జీవుడగు బ్రహ్మ మున్ముందుగా జన్మించెను. పరబ్రహ్మమని పిలువబడే క్షేత్రజ్ఞుడు ముందుగా నాల్గు ముఖములు గల హిరణ్య గర్భుని రూపములో ప్రకటమయ్యెను. ప్రాణులు సృష్ట్యాదియందు ఇంద్రియములతో కూడి సృజింపబడుదురు. వారు (ఆత్యంతిక, మరియు ప్రాకృతిక) ప్రళయములో దేహములను విడిచిపెట్టుదురు. నూతన సృష్టియందు, తన్మధ్యకాలమునందు కూడ వారు మరల దేహములను పొందెదరు.
గొప్ప ప్రమాణముగల ఆ అండమునకు బంగరు మేరు పర్వతము పిండముగా ఉండెను. సముద్రములే గర్భములోని నీరు ఆయెను. పర్వతములు ఎముకలాయెను. ఈ ఏడు లోకములు ఆ అండమునందు అంతర్భాగములై ఉండెను. ఏడు ద్వీపములతో, ఏడు సముద్రములతో, మహోన్నతమగు పర్వతములతో, మరియు వేలాది నదులతో కూడిన ఈభూమి, ఈలోకములు, ఈ బ్రహ్మాండము సర్వము ఆ అండములోపల ఉండెను. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు, గ్రహములు, వాయువు, లోకాలోక పర్వతము, ఇతరము సర్వము ఆ అండములోపల ఇమిడి యుండెను.
ఆ అండము చుట్టూ (దానికంటె) పదిరెట్లు నీరు, నీటి చుట్టు పదిరెట్లు అగ్ని ఆనరించి యుండెను. తేజస్సు చుట్టూ పదిరెట్లు వాయువు, వాయువు చుట్టూ పదిరెట్లు ఆకాశము ఆవరించి ఉండెను. ఆకాశము అహంకారముచేత, అహంకారము మహత్తు చేత, మహత్తు అవ్యక్తముచేత ఆవరింపబడి ఉండెను. ఇట్లు ఆ అండము ఏడు ప్రకృతి వికారములచే ఆవరించబడి ఉండెను. ఇట్లు ఆ ఎనిమిది (అండముతో సహా) ప్రకృతి వికారములు ఒక దానిని మరియొకటి ఆవరించి ఉండెను.
ఇవి స్థితి కాలమునందు ఈ తీరున ఉండి, ప్రళయములో ఒక దానిని మరి ఒకటిగా కబళించి వేయును. ఇట్లు ఇవి ఒక దాని నుండి మరి ఒకటి పుట్టి, ఒక దానిని మరి ఒకటి ధరించి ఉన్నవి. ప్రకృతి వికారములగు ఈ తత్త్వములు ఈ విధముగా ఒక దానిపై మరియొకటి క్రమముగా ఆధారపడి యున్నవి. అవ్యక్తము (ప్రకృతి)నకు క్షేత్రము అనియు, బ్రహ్మకు క్షేత్రజ్ఞుడు అనియు పేరు. ఈ విధముగా క్షేత్రజ్ఞునిచే అధిష్ఠింపబడిన జగత్సృష్టి పూర్వము సంకల్పము యొక్క సంబంధము లేకుండగనే మెరుపువలె సంభవించెను. ఈ హిరణ్యగర్భుని జన్మయొక్క తత్త్వమును ఎరిగిన మానవుడు ఆయుర్దాయమును, కీర్తిని, సంతానమును పొంది, ధన్యుడగును. మోక్షకాముడగు మానవుడు కూడా ఈ పురాణమును నిత్యము వినుట వలన, అంతఃకరణ శుద్ధిగలవాడై, సుఖమును, క్షేమమును, పరమగతిని కూడా పొందును.