వాయు మహా పురాణము
గయా మాహాత్మ్యము - 6
సనత్కుమారుడు ఇట్లు పలికెను:
మొదట పంచతీర్థమైన ఉత్తర మానసమున (సరస్సున) శ్రాద్ధవిధిని ఆచరింపవలెను. అచట ఆచమనముచేసి దర్భలుకల చేతితో జలముతో శిరమున చల్లుకొని ఆ విధిని చేయవలెను. ఉత్తర మానసమునకు పోవలెను. అట మంత్రముతో స్నానము ఆచరింపవలెను.
మంత్రము:
ఆత్మవిశుద్ధికొఱకు ఉత్తర మానసమున స్నానము చేయుచున్నాను. సూర్యలోకాది సంసిద్ధులు సిద్ధించుటకై పితరుల విముక్తికొఱకును దేవాదులకు తర్పణము చేసి సపిండక శ్రాద్ధమును చేయవలెను. ఇచట మానససరస్సు కలదు. కావున అది ఉత్తర మానసమైనది. ఇచట సూర్యునకు నమస్కరించి పితరులను సూర్యలోకము చేర్చును. భగవంతుడైన భర్తకు (భరించువానికి) నమస్కారము. ఆతడు చంద్ర, కుజ, బుధరూపుడు, గురు, శుక్ర, శని, రాహు, కేతు స్వరూపుడు ఆతనికి నమస్కారము. ఉత్తరమానస సరస్సునుండి మౌనము ధరించినవాడై దక్షిణ మానససరస్సునకు పోవలెను. అది ఉదీచీ తీర్థమనబడును. అట ఉత్తర దిక్సంబంధముగా చేయునది విముక్తి నిచ్చునది. ఇచట స్నానము చేసిన మానవుడు తన శరీరముతో స్వర్గమునకు పోవును. మధ్యన కనఖలమను తీర్థము కలదు. అది ముల్లోకముల ప్రసిద్ధము. ఇచట స్నానము చేసిన నరుడు బంగారమువలె ప్రకాశించును. పవిత్రుడగును. దానికి దక్షిణ భాగమున దక్షిణ మానస సరస్సను తీర్థము కలదు. అందువలన లోకమున కనకలమను తీర్థము ప్రసిద్ధమై అంతకన్న ఉత్తమమైన తీర్థములేనిది. దక్షిణ మానసమున కూడ మూడు తీర్థములు చెప్పబడినవి. వానిలో విధి విధానముతో స్నానముచేసి వేరువేరుగా శ్రాద్ధము పెట్టవలె. ఆత్మ విశుద్ధి కొఱకును, సూర్యలోకాదులలో సిద్ధించు సిద్ధికొఱకును, పితరుల విముక్తి కొఱకును, దక్షిణ మానస సరస్సున స్నానము చేయుచున్నాను. పితరుల తృప్తికై, వారు తరించుటకై, పుత్ర, పౌత్ర, ధన, ఐశ్వర్య, ఆయురారోగ్యముల వృద్ధికొఱకును సూర్యునికి నమస్కరించుచున్నాను. ఈ మంత్రముతో స్నానపూజాదులు చేసి, సపిండక శ్రాద్ధమును చేసియు, మౌన్యర్క సంబంధమైన ఈ మంత్రమును పఠింపవలెను. అక్కడి నుండి ఫల్గు తీర్థమునకు బోవలెను. అది సర్వతీర్థములలో ఉత్తమోత్తమమైనది. అచటి శ్రాద్ధము వలన కర్తలకును, పితరులకును ముక్తి కలుగును. పూర్వము ఇచట బ్రహ్మ కోరగా విష్ణువు ఫల్గుకుడు అయ్యెను. అచట దక్షిణాగ్నియందు హోమము చేయబడినది. దాని రజము ఫల్గు తీర్థకము. ఆ ఫల్గువుచే భూమియు, కామధేనువును, జలమును ఫలించును. ఈ ఫల్గు తీర్థము దృష్టికి లోపల ఉండును. కావున ఫల్గు తీర్థము నిష్పలముగాదు. భువనములలో ఉన్న సమస్త తీర్థములు దేవతలతోసహా స్నానము చేయుటకు ఇచటకి చేరును. విష్ణు పాదోదకమైన గంగ, ఫల్గువు (నది) ఆది గదాధర విష్ణువు - వీరు స్వయముగా ద్రవరూపమున ఇట ఉందురు. కావున గంగకన్న అధికము ఫల్గువని చెప్పుదురు. ఫల్గుణా తీర్థమున పొందిన ఫలము లక్ష అశ్వమేధములు చేసిన లభింపదు. పితరులకు విష్ణు లోకము సిద్ధించుటకై భుక్తి ముక్తులు లభించుటకును ఫల్గుతీర్థమున విష్ణు జలమున ఆదరముతో స్నానము చేయుదును. అని స్నానము చేయవలె నరుడు ఫల్గు తీర్థమున స్నానము చేసి స్వ సూత్రోక్తముగా తర్పణమును సపిండక శ్రాద్ధమును చేయవను తరువాత తండ్రి తండ్రికి నమస్కరింపవలెను. దేవుడై, ఈశుడై, పురుషుడై, అఘోరుడై, వామదేవుడై, సద్యోజాతుడై, శంభువై ఈ విధముగ పంచ బ్రహ్మ మంత్ర స్వరూపుడై పంచాక్షర స్వరూపుడైన శివునకు నమస్కారము. ఫల్గు తీర్థమున స్నానము చేసి, గదాధర దేవుడైన విష్ణువును చూచి, మానవుడు తనకు పది తరముల పూర్వులను, పదితరముల తరువాతి వారిని, తనను వెంటనే తరింపచేయును. గదాధర విష్ణుదేవునికి నమస్కరించి ఈమంత్రముతో పూజింపవలెను. ఓం వాసుదేవునకు నమస్కారము. సంకర్షణునకు నమస్కారము. ప్రద్యుమ్నుననకు నమస్కారము, అనిరుద్ధునకు నమస్కారము, శ్రీధరునకు నమస్కారము, విష్ణువునకు నమస్కారము- అని పంచ తీర్థములలో స్నానము చేసిన నరుడు పితరులను బ్రహ్మలోకము చేర్చును. అచట గదాపాణియైన విష్ణువునకు పంచామృతస్నానమును, పుష్పవస్త్రాది అలంకారమును చేయక శ్రాద్ధము చేసినచో అది నిష్పలమగును. నాగకూటము నుండియు, గృధ్ర కూటము నుండియు, ఉపకూటము నుండియు, ఉత్తర మానసము నుండియు పైనున్నది గయా శిరము అనబడును. అది ఫల్గుతీర్థము అనబడును. ముండపృష్ఠ పర్వతము క్రింద ఉత్తమోత్తమమైన ఫల్గు తీర్థము కలదు. ఇచట శ్రాద్ధాదులతో పితరులందరు మోక్షమును పొందుదురు. మొదటి దినమున (శ్రాద్ధాది) విధి చెప్పబడినది. రెండవ దినమున ధర్మా రణ్యమునకు పోవలెను. అచట ధర్ముడు యజ్ఞము చేయించెను. మతంగవాపి (బావి) యందు స్నానముజేసి, తర్పణమును, శ్రాద్ధమును ఆచరింపవలెను వెళ్లి, మంతంగేశునకు నమస్కరించి ఈ మంత్రమును పఠింపవలెను. “దేవతలు నేను ఇచట పెట్టిన శ్రాద్ధమునకు ప్రమాణముగా ఉందురు గాక! లోకపాలురు సాక్షులుగా ఉందురుగాత! నేను మతంగ తీర్థమునకు వచ్చి పితరుల ఋణ విముక్తుని చేసితిని (దీనికి సాక్షులుగా ఉండుడు)” పూర్వము బ్రహ్మ తీర్థము ఉండును. ఆ కూపమున (బావిలో) శ్రాద్ధాదులను చేయవలెను. ఆ కూపమునకును యూపమునకు (యజ్ఞ యూపస్తంభమునకు)ను మధ్యన శ్రాద్ధాదులు ఆచరించుటచే నరుడు సమస్త పితరులను తరింపజేయును. ధర్ముని, ధర్మేశ్వరునికి నమస్కరించి అట మహాబోధి వృక్షమునకు నమస్కరింపవలెను. బ్రహ్మ-విష్ణు-శివ స్వరూపమైనదియు బుద్ధునకు జ్ఞానోదయము కలిగించిన బోధి వృక్షమైనదియు, శ్రాద్ధ కర్తలను పితరులను తరింపచేయు నదియు అయిన అశ్వత్థ వృక్ష రాజమునకు అనగా శ్రేష్ఠమైన రావిచెట్టుకు నమస్కారము.
“నా కులమునను, మాతృ వంశమునను దుర్గతినిపొందిన బాంధవులు నీ దర్శనము వల్లను, స్పర్శనము వల్లను శాశ్వతమైన స్వర్గగతిని పొందుదురుగాక! ఓ వృక్షరాజమా! నేను గయకు వచ్చి మూడు ఋణములను తీర్చివేసితిని” నీ అనుగ్రహము వలన నేను మహాపాపము నుండియు, సంసార సముద్రము నుండియు విముక్తుడనైతిని” అని ప్రార్థించి మూడవదైన బ్రహ్మ సరస్సున స్నానముచేసియు, సపిండకముగా సర్వప్రమాణమైన మంత్రముతో శాస్త్రీయముగా పుత్రుడు శ్రాద్ధము చేయవలెను. ఈ తీర్థమున మూడు ఋణముల ముక్తి కొఱకు స్నానము చేతునని స్నానము చేయవలెను. ఆ తీర్థ-కూపముల మధ్యన శ్రాద్ధముచేసి పితరులను బ్రహ్మలోకమును చేర్చవలెను. బ్రహ్మయాగము చేయగా బయలుదేరిన ఈ ఊపము అనబడినది. అచట బ్రహ్మ సరస్సులో శ్రాద్ధముచేసి నరుడు సమస్త పితరులను తరింపచేయును. ఆ ఊపమునకు ప్రదక్షిణముచేసి వాజపేయ యజ్ఞ ఫలము పొందును. బ్రహ్మకు నమస్కరించి పితరులను బ్రహ్మలోకమును చేర్చును. జన్మలేనివాడును, జగజ్జన్మాది రూపుడు, భక్తులను పితరులను తరింపచేయువాడును అయిన బ్రహ్మకు నమస్కారము. అచట గోవులు తిరుగుచోటికి సమీపమున ఉన్నవిగా మామిడిచెట్లు బ్రహ్మచే ప్రకల్పింపబడినవి. వానికి నీళ్లు పోసినంత మాత్రమున పితరులు మోక్షమునకు పోవుదురు. సేచన మంత్రము-బ్రహ్మ సరస్సున పుట్టినదియు బ్రహ్మ దేవమయమై విష్ణు రూపమైన మామిడి చెట్టును పితరుల విముక్తికి గాను తడుపుదును (నీళ్లు పోయుదును). కుండను దర్భలనుచేత ధరించిన ఒకే మునినై మామిడిచెట్టు మొదలులో నీరు పోయుదును. మామిడిచెట్టు తడుపబడును. అందుచే పితరులు తృప్తి పొందుదురు. ఒకే పని రెండు ప్రయోజనముల పూర్తిచేయుననుట ప్రసిద్ధమగును. తరువాత ఈ మంత్రముతో నియతుడై యమబలి ఈయవలెను. యమరాజ ధర్మరాజులు గయాసుర నిశ్చలతకై శిలయందు ఇచట ఉన్నారు. పితరులు విముక్తికై వారు ఇరువురికి బలి ఇచ్చు చున్నాను-అను మంత్రముతో బలి ఈయవలెను. తరువాత ఓ నారదా! ఈ మంత్రముచేత కుక్కలకు బలి ఈయవలెను. రెండు కుక్కలు ఒకటి నల్లనిది మరొకటి చిత్రవర్ణము కలది. ఇవి వైవస్వత (సౌర) కులమున పుట్టినవి. ఆ రెంటికిని బలి ఇచ్చుచున్నాను. అవి మార్గమున ఎప్పుడును రక్షించుగాక (అనునది మంత్రము ఓ నారదా! తరువాత నీ మంత్రముతో కాక బలిని ఈయవలె. ఐంద్రములు తూరుపు దిక్కు నందలి వియు, వరుణ వాయవ్య యామ్యములు (పశ్చిమదిక్కునందలివియు, వాయవ్య దిక్కునందలివియు, దక్షిణదిక్కు నందలివియు, నిర్ఋతి దిక్కునందలివియు) అయిన కాకులు భూమియందు సమర్పించిన పిండమును గ్రహించుగాక. (ఇది మంత్రము). నాలుగవ దినమున ఫల్గు తీర్థమున స్నానాదికమును చేయవలెను. తరువాత, గయా శిరమున పాదమున సపిండకముగా శ్రాద్ధమును చేయవలెను. అచట సాక్షాత్తుగా గయా శిరస్సు ఫల్గు తీర్థ శ్రితముగా చేయబడినది. నాగము నుండియు, జనార్దను నుండియు, బ్రహ్మ ఊపము నుండియు, ఉత్తర మానస సరస్సు నుండియు, ఈ గయా శిరము చెప్పబడినది. ఇదియే ఫల్గు తీర్థము అనబడినది. ఉత్తర మానసము వరకు బ్రహ్మను చేరినది. ఫల్గు తీర్థమని తెలియవలె. అది దేవతలకును పొందరానిది. క్రౌంచ పాదము ఉండి సాక్షాత్తుగా గయా విరము వరకు ఫల్గు తీర్థము. ఇది గయాసురుని ముఖము. కావున ఇట శ్రాద్ధము అక్షయము. ముండపృష్ఠ పర్వతము క్రిందుగా నున్నది సాక్షాత్తు ఫల్గు తీర్థము. ఇట ఆద్యుడైన గదాధర విష్ణువు వ్యక్తావ్యక్త రూపమున ఉన్నవాడు. విష్ణ్వాది పదరూపమున ఇది పితరులకు ముక్తి హేతువు. ఇది దివ్యమైన విష్ణు పదము. దర్శనమున పాపనాశము చేయునది. ఇచట స్పర్శనము వల్లగాని, పూజించుట వల్లగాని, పితరులకు ఇచ్చినది అక్షయమగును. ఇచట సపిండక శ్రాద్ధముచేసి తనతో పాటు వేయి కులములను దివ్యమై, అనంతమై, శివమై అవ్యయమైన విష్ణు పదమును చేర్చును. నరుడు రుద్ర పదమున శ్రాద్ధము చేసి నూరు కులములను తనతోబాటు శివ పురమును చేర్చును. అట్లే బ్రహ్మ పదమున శ్రాద్ధముచేసిన నరుడు వంశ శతమును ఉద్ధరించి పితరులను బ్రహ్మ లోకమును చేర్చును. కశ్యపుని పదమున శ్రాద్ధము చేయువాడు దక్షిణాగ్ని పదమున శ్రాద్ధము చేయువాడు పితరులను బ్రహ్మ పురమును చేర్చును. గార్హపత్యాగ్ని పదమున శ్రాద్ధము చేయువాడు వాజపేయ యజ్ఞ ఫలమును పొందును. ఆహవనీయాగ్ని పదమున శ్రాద్ధము చేయువాడు అశ్వమేధ యాగ ఫలము నందును. సభ్యాగ్ని పదమున శ్రాద్ధము చేసినవాడు జ్యోతిష్టోమ యాగఫలమును పొందును. ఆవసథ్యాగ్ని పదమున శ్రాద్ధము చేసినవాడు శక్ర (ఇంద్ర) పదమున శ్రాద్ధము చేసినవాడు పితరులను బ్రహ్మ పురము చేర్చును. క్రౌంచ -మాతంగములు మధ్యన శ్రాద్ధము చేసినవాడు పితరులను బ్రహ్మలోకము చేర్చును. సూర్య పదమున శ్రాద్ధము చేసినవాడు పంచపాపులను కూడ సూర్య పురమును చేర్చును. కార్తికేయ పదమున శ్రాద్ధము చేసినవాడు పితరులను శివలోకము చేర్చును. గణేశ పదమున శ్రాద్ధము చేసినవాడు పితరులను రుద్రలోకము చేర్చును. గజకర్ణ (ప్రదేశ) తర్పణమున పితరులను నిర్మల స్వర్గమునుచేర్చును. ఇతరులయొక్క పదమున కూడ శ్రాద్ధము చేసినవాడు పితరులను బ్రహ్మ పురము చేర్చును. అన్ని తీర్థములలో కాశ్యప తీర్థము శ్రేష్ఠమైనది. అచట విష్ణు పదము, రుద్ర పదము శ్రేష్ఠమైన బ్రహ్మ పదము కూడ చెప్పబడినవి. ప్రారంభమునను సమాప్తిలోను వానిలో ఒక్కటి స్వీకరింపవలె. ఓ నారదా! అచట శ్రాద్ధకర్తకు అది శ్రేయ స్కరము. పూర్వము కశ్యపుని దివ్యపదమున భారద్వాజముని శ్రాద్ధముచేసి పిత్రాదులకు పిండము ఇడుటకు పూనుకొనెను. అంత తెలుపు-నలుపు హస్తములు రెండు పదమును చీల్చుకొని బయలువెడలినవి. ఆ రెండు హస్తములను చూచి భారద్వాజముని సంశయించెను. వెంటనే ఆ మహాముని తన తల్లియైన శాంతను అడిగెను. “ఓ తల్లీ! కశ్యపుని దివ్యపదమున తెల్లని నల్లని రెండుచేతులు వచ్చినవి. నా తండ్రిని నీవు ఎరుగుదువు. పిండము ఏ చేతిలో ఉంచవలెనో చెప్పుము” అని అడిగెను.
శాంత ఇట్లు పలికెను:
ఓ మహాప్రాజ్ఞుడవైన భారద్వాజా! నల్లని చేతిలో పిండము నిడుము. తరువాత భారద్వాజుడు నల్లని చేతిలో పిండము నిడుటకు పూనెను. అచట తెల్లని చేయి అదృశ్యమై నీవు నా ఔరస పుత్రుడవు (నాకు నా వీర్యమున పుట్టినవాడవు) గదా! అని అనెను. అంత నల్లనిచేయి క్షేత్రము నాది. కావున పిండమును నాకే ఇడుము. అనెను. తరువాత స్వైరిణి (స్వేచ్ఛాచారిణియైన తల్లి) క్షేత్రియైన (పెండ్లియైన) మొగునికిని బీజియై వీర్యము నిచ్చిన విటునికిని పిండము నిడుమని చెప్పెను. తరువాత భారద్వాజుడు కశ్యపుని పదమున ఇద్దరికిని పిండమునిడెను. హంసలతో గూడిన విమానముతో ఇరువురును బ్రహ్మ లోకమునకు పోయిరి. రాముడు రుద్రపదమున శ్రాద్ధమునందు పిండము ఇడుటకు పూనెను. తండ్రియైన దశరథుడు స్వర్గమునుండి చేయిచాచి వచ్చెను. తరువాత రాముడు ఆ చేతిలో పిండమిడక రుద్ర పదముననే ఇడెను. శాస్త్రార్థాతి క్రమమున భయముచెందిన రామునితో దశరథుడు ఇట్లనెను. “ఓ పుత్ర! నీచేత నేను తరింపబడితిని. రుద్రలోకమును పొందుదును. చేతిలో పిండమిడుటచే నాకు స్వర్గగమనము ఉండెడిది కాదు. నీవును, కలకాలము రాజ్యముచేసి, బ్రాహ్మణులను ప్రజలను పాలించి, దక్షిణలతో యజ్ఞములను చేసి, విష్ణు లోకమునకు పోగలవు. అయోధ్యాపురి కూడ జనులతోను కృమి కీటాదులతోను విష్ణు లోకమునకు పోగలదు”- అని చెప్పి దశరథుడు పరమ రుద్ర లోకమునకు పోయెను. భీష్ముడు శ్రేష్ఠమైన విష్ణుపదమున తన తండ్రిని పిలిచి, శ్రాద్ధముచేసి పిత్రాదులకు పిండము ఇడుటకు పూనెను. అంత గయాశిరమున తండ్రియైన శంతనుని చేతులు వెలువడినవి. భీష్ముడు పిండమును చేతిలో నిడక విష్ణు పదముననిడెను. శంతనుడు సంతుష్టుడై “నీవు శాస్త్రములు చెప్పిన యర్థమున (విషయమున) చలనములేక స్థిరుడవు. నీకు త్రికాల (భూత భవిష్య వర్తమాన కాల) దృష్టి కలుగును. చివర విష్ణువును పొందుదువు. స్వేచ్ఛా మరణము (ఇచ్ఛవచ్చినపుడు చచ్చుట) జరుగును”- అని పలికి ముక్తిని పొందెను. కనకేశుని, కేదారుని, నారసింహుని, వామనుని, ఉత్తరమార్గమున పూజించి సమస్త పితరులను తరింపచేయవలెను. గయాశిరమున ఎవరిపేర పిండములను ఇడుదురో వారు నరకము నందున్నను స్వర్గమునందున్నవారై మోక్షమునందుదురు. గయాశిరమున జమ్మి ఆకు అంతటి పిండమును కందమూలఫలాదులతో నిడవలెను. పితరులను స్వర్గమును చేర్చవలెను. విష్ణువు మొదలగు దేవతల పదములు కనబడినచోట, వాని ముందు, వారికి సపిండకముగా శ్రాద్ధమునుచేసి పితరులను వారివారి (ఎవరి పదమున పిండము ఇడుదురో వారి) లోకములకు చేర్చవలెను. అంతటను ముండపృష్ఠ పర్వతము ఈ పదములతో చక్కగా గుర్తింపబడినది. అచట శ్రాద్ధము చేసినందున పితరులందరు ఆరోగ్యవంతమైన బ్రహ్మ లోకమునకు పోవుదురు. గదచేత హేతిఅను అసురుని శిరము రెండుగా చేయబడిన చోటు ప్రక్షాళితమై పితరుల విముక్తికై తీర్థమైనది. అది అందరికిని గదాలోలమని ప్రసిద్ధి చెందినది. “హరియొక్క గదా ప్రక్షాళనమున మహాతీర్థమైన గదాలోలమున మోక్షసిద్ధి కొఱకు స్నానము చేయుచున్నాను. అక్షయ పదమును పొందుదును” అని అచటి స్నాన మంత్రము. ఐదవదినమున గదాలోలమున స్నానముచేసి సపిండకముగా శ్రాద్ధముచేసి పితరులను తనను బ్రహ్మలోకమును చేర్చవలెను. బ్రహ్మగా ప్రకల్పితులైన బ్రాహ్మణులను హవ్యకవ్యాదులతో పూజింపవలె. వారు సంతసించినచో పితరులతో సహా సమస్త దేవతలు సంతసింతురు. అక్షయవటమున ప్రయత్నపూర్వకముగా అన్న శ్రాద్ధముచేసి పితరులను అక్షయమై సనాతనమైన బ్రహ్మ లోకమును చేర్చవలెను. వటవృక్ష సమీపమున శాకముతోగాని, జలముతోగాని, ఒక్కడు భుజింపజేయబడినచో కోటిమంది భుజించిన ఫలము వచ్చును. పుత్రులు గయాతీర్థమున తీర్థ పురోహితునకు చక్కగా వస్త్ర గంధాదులతో పూజించి షోడశదానముచేయవలెను. గయాతీర్థవటమున పితరులకు ఇచ్చినదంతయు అక్షయమగును. అచట వటేశుని చూచి, నమస్కరించి, ఏకమనస్కుడై పూజించి, పితరులను సనాతనమై అక్షయమైన బ్రహ్మలోకము చేర్చును. గయ యందు, ధర్మపృష్ట(నగ)మున, బ్రహ్మ సరస్సున, గయా శిరమున, వటమునను పితరులకు ఇచ్చినది అక్షయమగును. మహాప్రళయమున సర్వము ఏక సముద్రము కాగా వటవృక్షము యొక్క అగ్రమున యోగ నిద్రలో బాలరూపధరుడై ఉండి యోగశాయియై సంసారమను వృక్షమును ఛేదించుటకు శస్త్రమై సమస్తపాపములను హరించు విష్ణువునకు నమస్కారము. అక్షయ బ్రహ్మమును ప్రసాదించునట్టియు, అక్షయవటస్వరూపుడైనట్టి విష్ణువునకు నమస్కారము. ఎవనిచేత కలిలో లోకులు మహేశ్వరులైరో ఆ గదాధర విష్ణువు లింగరూపుడయ్యెను. అట్టి లింగ రూపియై శ్రీప్రపితా మహుని (విష్ణువును- పితామహుడైన బ్రహ్మకు తండ్రియైన విష్ణువునకు) నేను నమస్కరించు చున్నాను. అని చెప్పెను.