వాయు మహా పురాణము
పరమాశ్రమ కథనం
వాయువు పలికెను:
మూడు ఆశ్రమములను (బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థములను) వదిలి, పరమాశ్రమమైన ‘భిక్షా’ ఆశ్రమమును పొంది, తరువాత సంవత్సరాంతమున ఉత్తమోత్తమమైన (దీనికన్న మరొక ఉత్తమములేనిది) జ్ఞానమును పొందవలెను. తరువాత గురువుకు తెలిపి ఈ భూమినంతయు తిరుగవలెను. అసలు జ్ఞేయమైన పరమాత్మను తెలిసి కొనుటకు సాధనమైన సారభూతమైన జ్ఞానమును పాటింపవలెను. ఇది జ్ఞానము. ఇది జ్ఞేయము అని సంతుష్టి చెంది తిరుగువాడు కల్ప సహస్రమైన ఆయువు గలవాడైనను జ్ఞేయమును పొందలేడు. సంగమును త్యజించి, క్రోధమును జయించి, అల్పాహారియై ఇంద్రియములను జయించి, బుద్ధిచే ద్వారములన్నియు మూసివైచి, మనస్సును ధ్యానమున నిలువవలెను. శూన్యములై నిర్జన ప్రదేశములందు, గుహలయందు వనమునందును, నదులయొక్క ఇసుక తిన్నెలందును నిత్యము యోగయుక్తుడు కావలెను. వాక్కు అను దండము, కర్మ అను దండము, మనస్సు అనుదండము - అనునవి మూడు దండములు. ఈమూడు దండములు నియతముగాగలవాడు త్రిదండిగా పరిగణింపబడును. నిశ్చలముగా ఉన్నవాడు, ధ్యానమునందు ఆసక్తుడైనవాడు, ఇంద్రియములను జయించినవాడు, శుభములును అశుభములునైన రెండు కర్మలను త్యజించి, ఈ శరీరమును ధరించినవాడు శాస్త్ర ప్రకారముగా ఎప్పుడును పుట్టడు చావడు.