మధుకైటభోత్పత్తి వినాశనము

సూతుడు పలికెను:

తేనేవలె పింగళ (గోరోచన) వర్ణముతో విశాలమైన నేత్రములుగల ఉమాపతి తన కన్నులతో త్రాగుచున్నాడా అన్నట్లు ఆ బ్రహ్మ విష్ణువులను చూచి, తనను స్తుతించినందున మిక్కిలి సంతసించిన ముఖముకలవాడు అయ్యెను. ఆ ఉమాపతి, విరూపాక్షుడు (మూడు కన్నులు గలవాడు), దక్షయజ్ఞ ధ్వంస మొనర్చినవాడు, పినాకమను ధనువును ధరించిన వాడు, ఖండించెడు గండ్రగొడ్డలి కలవాడు, భూతమును వధించువాడు, మూడు కన్నులు గలవాడు, భగవంతుడు అయిన ఆ శివుడు ఆ బ్రహ్మ విష్ణువుల ఇరువురి అమృతము వంటి వాక్యములనువిని, తాను ఎరిగిఉన్నను, ప్రీతిపూర్వకముగా పరస్పర హితమునుగోరు మహాత్ములైన మీరు ఎవరు? ఈ భయంకర ప్రళయ జలమయమైన తెప్పపై కమలాక్షుడు కూడియున్న మీరు ఇరువురు ఎవరు? అని అడిగెను. అంతట ఆ మహాత్ములు ఇరువురును ఒకరి నొకరు చూచుకొని భగవాన్! విభో! నీచే నిజము తెలిసి ఏమి ప్రయోజనము? నీవు లేక స్వేచ్ఛాచార రూపమై అంతములేని నిత్య సుఖము ఎక్కడిది” అని పల్కిరి.

అంతట భగవంతుడైన మహాదేవుడు మాధుర్యమునిండిన మాటలలో ఇట్లనెను. ఓ బ్రహ్మా! ఓ విష్ణూ! మీరిరువురకు నేను చెప్పుచున్నాను. నేను ఈ మీ శాశ్వతాక్షరయుక్తమైన (శాశ్వతమై, నాశనములేని వర్ణమాలలు గల స్తుతితో కూడిన) భక్తిచేత సంతుష్టుడనైతిని. మిక్కిలి పూజనీయులైన మీరు ఇరువురును నాకు గౌరవింపతగిన వారు. ఇప్పుడు మీ ఇరువురికి వరములలో ఉత్తమమైన వరము ఏమి ఈయవలెను?

మహాదేవుడు ఇట్లు అనగానే విష్ణువు బ్రహ్మతో ఓ మహాభాగా! బ్రహ్మా! నీవు అడగ దలచిన వరమేమియో చెప్పుము అని అనెను. అంత బ్రహ్మ భగవంతుడగు ఓ విష్ణూ “నేను సంతానమును కోరుదును” అని పుత్రప్రాప్తికై వరమును పొందకోరి భారము వహించగల పుత్రునికోరి బ్రహ్మతో ఇట్లనెను. వీరుడు సాటిలేనివాడు భారమును మోయువాడు అయిన పుత్రుని కోరినచో దేవదేవుడైన మహేశ్వరునే పుత్రుని నీవు కోరుము అనెను. బ్రహ్మ ఆ కేశవుని మాటను గౌరవించి “ఈశ్వరుడైన రుద్రునికి చేతులు జోడించి మ్రొక్కి పుత్రకాముడై, విష్ణువుతో సహ” ఇట్లు పలికెను. “భగవంతుడనైన నీవు పుత్ర కాముడనైన నా విషయమున సంతుష్టుడవైనచో ఓ విశ్వాత్ముడా నాకు పుత్రుడవు గమ్ము.వాడు భారము వహించగలిగి నీతో సమానునిగా ఉండవలెను. ఓ మహేశ్వర! నా యందు సంతుష్టుడవైన నిన్ను, న్యాయమైన ఈ వరమును కోరుచున్నాను అని ప్రార్థించెను.

భగనేత్ర హారియైన మహాదేవుడు బ్రహ్మయొక్క ఆ ప్రార్థనమును విని నిష్కల్మషముగా ఆ మాయలేకుండా అట్లే అగుగాక అని అనెను. ఓ సువ్రతుడా! బ్రహ్మా! నీవు ఏదేని పనిప్రారం భించగా ఆపని జరుగునపుడు నీకు కోపము కలుగగలదు. ప్రాణహేతువులైన నా పదకొండు రుద్రులతో, ఈ నేను పదకొండవవానిగా శూలము హస్తమునందు గలవానినై వెంట ఉండి ఋషిని మిత్రుడను మహాత్ముడను అయిన నేను నీకు కోపము వచ్చినపుడు నీ లలాటము నుండి జనింపగలను. అని బ్రహ్మకు ఆ విధముగా సాటిలేని వరమునిచ్చి, నీకు గూడ వరమును ఇచ్చెదను అడుగుమని విష్ణువుతో అనెను.

అంత ఆ మహాభాగుడైన విష్ణువు శివునితో ఇట్లనెను. ఓ దేవా! ఈ నీచే చేయబడిన వాగ్దానము మాకు చాలును. నా విషయమున నీవు సంతుష్టుడవైనచో ఓ అంబుదవాహన! మహాదేవా! నీ యందు నా భక్తి సుప్రతిష్ఠిత మగునట్లు చేయుదువు గాక అని అడుగగా ఆ మహాదేవుడు కేశవునితో ఇట్లనెను: ఓ శాశ్వతుడవైన దేవా! విష్ణు! నేను నీ విషయమున ఎంతయు సంతసించితిని. వినుము ఈ కనబడునది కనబడనిదియు అయిన, స్థావర జంగమాత్మకమైన విశ్వరూపమంతయు రుద్రనారాయణాత్మకము. నేను అగ్నిని, నీవు సోముడవు. నీవు రాత్రిని. నేనే పగటిని. నీవు ఋతువు. నేను సత్యమును. నీవు క్రతు స్వరూపుడవు. నేను దాని ఫలమును. నీవు జ్ఞానము. నేను జ్ఞేయమును (జ్ఞానముచే తెలియ దగినవాడను). నిన్ను జపించి జనులు ఎల్లప్పుడు నన్ను ప్రవేశింతురు. నీవు సంతుష్టుడు వైనచో జనులు సుకృతమును చేయువారు అగుదురు. యుగాంత కాలమున మన ఇరు వురితో కూడినదే మార్గము. వేరొక మార్గములేదు. నన్ను ప్రకృతినిగా తెలుసుకొనుము. నన్ను పురుషుడైన శివునిగా తెలియుము. నేను నీకు సగము శరీరమైనట్లే, నీవు నాయొక్క సగము శరీరమవు. ఎడమ ప్రక్క నేను. నాకది నీనల్లనైన శ్రీవత్సలాంఛనముగలది. నీవు కుడి ప్రక్కవు. కాని అది నీలలోహితుడనైన నేను. ఓ విష్ణో నీవు నా హృదయమవు. నీ హృదయమందే నేనున్నాను. నీవు సమస్త కార్యమునకు కర్తవు. నేను దానికి దైవతమును, కావున ఓ వత్సా! రమ్ము (నాలో కలియుము) నీకు స్వస్తియగు గాక. ఓ మేఘశ్యాముడా! వెళ్లుదును. అని ఇట్లు పలికి సన్నిధినుండి దేవుడైన ఈశ్వరుడు అంతర్థానమయ్యెను.

ఓ రాజా! ఆ తరువాత మహాదేవుడు అంతర్థానము కాగానే విష్ణువు అంతర్జాలమున ప్రవేశించి తన శయనమున పరుండెను. అపుడు పద్మముల వంటి కన్నులు గలవాడును పద్మమునందు పట్టిన వాడును అగు బ్రహ్మ సంతసించిన మనస్సు గలవాడై, విష్ణువుతో కలిసి, సూర్యునితో సమమైన కాంతికలదియు, బ్రహ్మమును (జ్ఞానమయ బ్రహ్మకు సంబంధించినది) అయిన ఆ పద్మమును చేరెను. తరువాత చాలా కాలమునకు, అక్కడ అనగా పద్మమునందు సాటిలేని ఇరువురు మహాబలులు, అన్నదమ్ములు మధు కైటభులు అనువారు బ్రహ్మతో “నీవు మాకు ఆహారము కమ్ము” అనిచెప్పి అచ్చటనే అంతర్థానమైరి. కమలమున పుట్టిన బ్రహ్మ భయంకరమైన వారి ఉద్దేశ్యమును గ్రహించి తన మాహాత్మ్యమును కూడ తెలుసుకొన కర్తవ్యమును తెలిసికొనుటకు ప్రారంభించెను. తాను మరల కమలనాభి కూర్పును దాని నుండి పైమార్గమును తెలియక ఆ పద్మనాళము గుండా పాతాళమునకు లేదా భూమికి అంతర్జాలమున దిగి కృష్ణమృగ చర్మమును ఉత్తరీ యముగా ధరించిన విష్ణువును చూచెను. బ్రహ్మ ఆ హరిని మేలు కొల్పెను. మేలుకొన్న ఆ హరితో ఓ దేవా! భూతములవల్ల నాకు భయము ఏర్పడినది, లెమ్ము రక్షించుము శుభమును కూర్చుము” అని అనెను. అంత శత్రుదమనుడు భగవంతుడు ముని అయిన విష్ణువు స్వయముగా నవ్వుచూ “భయపడవలదు భయపడవలదు”.

నీవు పూర్వము భూతములవల్ల నాకు మిక్కిలి భయముగలదని అంటివి. కావున నీవు భూతాది వాక్యములచేత ఆ ఇరువురుని నశింపజేయవలెను అనెను. అంత, అచటకు వచ్చి కూర్చునియున్న అయోనిజుడైన విష్ణునిలో భూర్లోక, భువర్లోక, స్వర్గలోకములు ప్రవేశించినవి. అట్లు జరుగగా అనంతుడు తన ముఖము నుండి విష్ణువు, జిష్ణువు (విష్ణువు, ఇంద్రుడు) అను సోదరులను వెడలగ్రక్కెను. అంత మరల మధుకైటభుల రాకను తెలిసికొని విష్ణు జిష్ణువులతో “బ్రహ్మను రక్షించుకొనుడు” అని అనెను. గొప్పశక్తిగల మధుకైటభులు విష్ణు-జిష్ణువులతో సమానమై రూపములను ధరించిరి. ఆ విధముగా సమాన రూపములు గలవారికి సమాన రూపములు గలవారే అభిముఖులుగా ఉండిరి. తరువాత (విష్ణు, జిష్ణు రూపమును ధరించిన) మధు కైటభులు అను రాక్షసులు బ్రహ్మతో భయంకరమగు మాటలతో “యుద్ధము చేయుచున్న మమ్ములను గురించి ప్రశ్నించు చున్నావు. ఎవరెవరితో యుద్ధము చేయుచున్నారో తెలియనివానిగా ఉన్నావు” అని పలికిన తరువాత వారు జలమున ప్రవేశించి తమ మాయచే జలమును స్తంభింపజేసి అప్పుడు ఎవరికేది ఇష్టమో అట్టి తుముల (దొమ్మి) యుద్ధమును చేసిరి.

ఆ విధముగా యుద్ధము చేయుచున్నవారికి దేవమానముతో నూరు సంవత్స రములు గడచినవి. కాని పరస్పరముచేయు యుద్ధముయొక్క మదము వారికి తరగలేదు. రెండు గుర్తులతో ఉన్నందున (విష్ణు, జిష్ణు) రూపముల ధరించినవారూ నిగూఢ భావ బోధకములైన చేష్టలు (ఇంగితములు) గలవారైరి. వారికి రూపంలో సాదృశం ఉన్నందున బ్రహ్మ వారిని గుర్తింపలేక వ్యాకులచిత్తుడై ధ్యానమును ఆశ్రయించెను. తరువాత దివ్య దృష్టితో వారిలో భేదమును గుర్తించి, పద్మకేసరము (కింజల్కము)ల నుండి పుట్టిన సూక్ష్మమైన వారి కవచమును భేదించెను. నడుము వరకు ఉన్న వారి శరీరమును కూడ బంధించెను. ఈ తరువాత మంత్రమును ఉచ్చరించెను.

ఇట్లు జపము చేయుచున్న బ్రహ్మకు కన్య కలిగెను. ఆమె విశ్వరూపము నుండి బయలు వెడలినదియై, పద్మము చంద్రుల వంటి ముఖముకలదిగా ఉండెను. పద్మముల వంటి చేతులు గలది. శుభకరమైనది అయిన ఆమెను చూచి ఆ ఇరువురు రాక్షసులు భయము వలన బాధింపబడి వివర్ణులైరి. ఆ తరువాత మధురములైన మాటలతో బ్రహ్మ అకన్యతో ఓ శ్రేష్ఠురాలా! నీవు ఎవరివని నేను తెలుసుకొనవలెను? “నిజముగా చెప్పుము” అని అడిగెను. అప్పుడు ఆ కన్య సామముతో (శాంతముగా, సామవేదముతోను) బ్రహ్మను పూజించి చేతులు జోడించి ‘నన్ను విష్ణువు యొక్క ఆజ్ఞను నెరవేర్చుటకు వచ్చిన మోహినీ మాయగా తెలియుము’. ఓ బ్రహ్మా! నీవు ధ్యానించుటచేత నేను వేగముతో వచ్చితిని” అని అనెను. బ్రహ్మ సంతసించిన మనస్సు కలవాడై ఆమెకు గౌణమైన (గుణము ఆధార ముగా చేయబడిన) పేరును పెట్టెను. నాచే విశేష ధ్యానమున పిలువబడిన దానవై వచ్చితివి, కావున మహావ్యాహృతి అనియే నీ పేరు ప్రచారమగును. శిరస్సును భేదించి పైకి వచ్చితివి కావున సావిత్రి అని పిలువ బడెదవు. ప్రస్తుతము అంశములులేక ఒక్కతెవె అయినందున అనేకాంశవు అగుదువు. ఇవి నీగుణ ప్రధానములైన నామములు. ఓ శుభాననా! నా అను గ్రహమున నీ క్రియల వలన కలుగు నామములు వేరుగాగలవు అని తెలియచేసెను.

తరువాత మధు, కైటభులు ఆమెచే పీడింపబడినవారై బ్రహ్మను “అవరణములేని మరణము మాకు కావలెను. మేము నీకు పుత్రులము గూడ కావలెను” అని వరము అడిగిరి. బ్రహ్మ మీరడిగినట్లే అగుగాక అని వారిని వెంటనే యమలోకమునకు పంపెను. ముందు విష్ణువు కైటభుని, తరువాత జిష్ణువు మధువును యమలోకమునకు పంపిరి.

ఈ విధముగా జిష్ణువు, విష్ణువులతో ఆ ఇరువురు రాక్షసులు చచ్చిరి. ఆ తరువాత సంతసించిన భగవంతుడు బ్రహ్మలోకముల హితమును కోరి, ఏ విధముగా పుత్రత్వ రూపమున, తన రూపము ఈయబడినదో వినుడు. ఇట్లు విష్ణు, జిష్ణులతో మధు కైటభులకు యుద్ధము జరుగగా బ్రహ్మ విష్ణువుతో ఇట్లు పలికెను.

ఈ రోజుతో నూరేండ్లు నిండినవి. సమయము ముందుగా వచ్చినది. ఇది సంక్షేపమై భయంకరమైన ప్రళయము నేను నా స్వస్థానమునకు వెళ్ళుచున్నాను అని అనెను. బ్రహ్మమాట విని మహాదేవుడు అపుడు సర్వప్రాణుల సంహారమును చేసెను. భూమిని అంతయు స్థావరములు (చరింపని పర్వత వృక్షాదులు) లేనిదానినిగా చేసెను. జంగమములను అనగా చరించువానిని వాని మూలమైన ప్రకృతిలో ఉండునట్లు చేసెను. గోవిందు డైన విష్ణువు యొక్క భద్రత కొరకు సముద్రము ఉంచబడినది. ఓ! లక్ష్మీ వర్థనుడవైన విష్ణో! నీకు నేను చేయవలసినది ఏమైన ఉన్నచో చెప్పుము అని అనెను. ఆ మాటలకు విష్ణువు ఇట్లు అనెను. ఓ బ్రహ్మ! బంగారు వన్నెగలవాడా! అది అంతయు సరే! నా మాట వినుము. పుత్రకాంక్షచే పూర్వము ఈశ్వరునినుండి నీకు లభించిన అనుగ్రహమును సఫలముచేసి నా నుండి ఋణ విముక్తుడవైనావు. నాలుగు విధములైన ప్రాణులను నీవు సృష్టించుము అనెను.

గోవిందుని వలన పద్మమున పుట్టిన బ్రహ్మ మేలుకొని ప్రజలను సృష్టించు తలంపు కలవాడై ఉగ్రమైన మహాతపస్సు జేసెను. ఈ విధముగా తపము చేయుచున్న ఆ బ్రహ్మకు ఏమియు జరుగలేదని భావించగా, తరువాత చాలా కాలమునకు దుఃఖము వలన క్రోధము పెరిగెను. ఆ క్రోధముచే నిండిన నేత్రముల నుండి కన్నీటి బిందువులు రాలసాగెను. తరువాత, ఆ కన్నీటి బిందువుల నుండి వాతపిత్త కఫాత్మకులు, మహాభాగులు, గొప్ప, యదృష్టము కలవి మహాబలము కలిగినవి, స్వస్తిక చిహ్నములచే అలంకరింపబడినవి, విరియబోసిన వెంట్రుకలు గలవి, మహావిషము కలవియును అగు సర్పములు పుట్టినవి. ఆ విధముగా ముందుగా పుట్టిన సర్పములను చూచి బ్రహ్మ తనను నిందించుకొనెను. అయ్యో! తపస్సుచేత నాకు ఇటువంటి ఫలితము లభించుట న్యాయము కాదు. నాకు మొదటి సంతానమే లోకములను నశింపజేయునదిగా పుట్టినదే అని అనుకొనెను. తరువాత బ్రహ్మకు క్రోధాసహనముల వలన పుట్టిన మూర్ఛ తీవ్రమయ్యెను.

సాటిలేని వీర్యము గల అతని (బ్రహ్మయొక్క) దేహము నుండి కారుణ్య పూర్వకముగా ఏడ్చుచున్న పదకొండుగురు రుద్రులు పుట్టిరి. రోదించుట వలన వారు రుద్రులు. ఆ కారణముననే వారిలో రుద్రత్వము ఉండినది. ఎవరు రుద్రులో వారు ప్రాణములు గదా! ఏవి ప్రాణములో అవి రుద్రాత్మకములు. అవి సర్వభూతములందున్న ప్రాణుల ప్రాణ ములుగా తెలియవలసినవి. త్రిశూలియైన నీలలోహితుడు ఏకాదశాత్మకుడైన ప్రభువైన శివుడు అత్యుగ్రుడు మహత్త్వముగలవాడు చక్కగా నడచినవాడునై ఆ బ్రహ్మకు లలాటము నుండి మరల ప్రాణములను ఇచ్చెను. అప్పుడు (బ్రహ్మకు) ఆత్మజుడై ప్రభువైన ఆ శివుడు బ్రహ్మనుచూచి సంతసించిన ముఖము గలవాడై ఆ రుద్రదేవుడు, ఉత్కృష్టమైన వాక్కులచే ఈ విధముగా పలికెను.

ఓ బ్రహ్మా, నన్ను అడుగుము. నిన్ను నీవు స్మరించుకొనుము. నన్ను నీ ఆత్మజుడనైన రుద్రునిగా తెలియుదువు. హే ప్రభో! నన్ను అనుగ్రహింపుము. అని పల్కిన రుద్రుని వాక్యమును బ్రహ్మ వినెను. ఆయనకు కోరిక ఎక్కువ అయ్యెను. వికసించిన కమలమువలె ప్రకాశించు కన్నులచే బ్రహ్మ ప్రసన్నాత్ముడు అయ్యెను. తరువాత, మరల ప్రాణమును పొందిన బ్రహ్మ, శుద్ధమైన బంగారువన్నె కలవాడై స్నేహముతో కూడిన గంభీరమైన వాక్కులతో ఇట్లనెను. ఓ మహాభాగుడా! నా మనసుకు ఆనందపరచుచున్నావు విశ్వమును భూతి (ఐశ్వర్యమవు)వి. ఏకాదశాత్మకుడవు అయిన నీవు ఎవడవు? చెప్పుము అని అనెను.

అనంత తేజస్కుడై భగవంతుడైన బ్రహ్మ ఇట్లనగానే తనతోపుట్టిన వారితోబాటు అభివాదము (నమస్కారము) చేసి రుద్రుడు బదులు పలికెను. ఓ బ్రహ్మన్! పూర్వము విష్ణువుతో గూడినన్ను పుత్రుడవు గమ్మని లేదా నీతో సమానముగా భారము వహించు పుత్రునిమ్మని వరమడిగితివి. లోకములలో ప్రసిద్ధులైన విశ్వాత్మునివల్ల బుట్టిన యందరి చేతను చేయదగినదిగలదు. ఓ దేవేశ! దుఐఖమును వదులుము. లోకములను నీవు సృజింపదగి వలసి ఉన్నావు అని అనెను.

ఈ విధముగా చెప్పగానే బ్రహ్మ సంతసించెను. తరువాత లోకాంతమునకు నీల లోహితుడైన రుద్రునితో బ్రహ్మ ఇట్లు మారుపలికెను. “ఓ మహాదేవా! నా పని కొరకై సహాయ పడుము. నాతోగూడి ప్రజలను సృష్టి చేయుము. నీవు సర్వ ప్రాణులకు బీజ వంతుడవు తత్ప్రసన్నుడవై (ఆ బీజములను పొందినవాడవై) బీజవంతుడవు కమ్ము” అని బ్రహ్మ అనెను. శంకరుడుగూడ సరియేఅని ఆ మాటను స్వీకరించెను.

తరువాత, భగవంతుడైన బ్రహ్మ కృష్ణమృగ చర్మముచే అలంకరింపబడినవాడై, మొదట ప్రాణులను ధరించినదైన మనస్సును సృజించెను. తరువాత జిహ్వారూపిణియై, విశ్వ రూపిణియైన ఆ సరస్వతిని సృజించెను. భృగువు, అగ్గిరసుడు, దక్షుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు అను ఏడుగురిని మనస్సున పుట్టిన వారిగా ఆమహాతేజస్వి యైన బ్రహ్మ సృజించెను. ఇంక అతడు తనతో సమానులై విశ్వమున పుట్టిన ఇతరులను కూడ సృజించెను. మరల ఆ మార్గమును అనుసరించి వారి ముఖము నుండి గోవులు పుట్టినవి. ‘ఓం’కారము మొదలుకొని వేదములను అభిమానింపదగిన దేవతలను సృజించెను. ఈ విధముగా పైన చెప్పబడినవారిని అందరిని లోకపితామహుడైన బ్రహ్మ సృజించెను. తరువాత ఆ భగవంతుడైన ప్రభువు, దక్షుడు మొదలగు మానస పుత్రులతో మహాధీశక్తిగల రుద్రునితో గూడి ప్రజలను సృజింపుడు, మీకు భద్రమగుగాక” అనెను.

అప్పుడు ప్రజాపతులు (దక్షుడు మొ!! వారు) మహాత్ముడైన శంకరుని వెంబడించి, ఓ దేవ! నీతోకూడి మేము ప్రజలను సృజింప కోరుచున్నాము. ఓ మహేశ్వర! ఇది బ్రహ్మ యొక్కయు నీ యొక్కయు అజ్ఞ. అని దక్షాదులు అనగానే ప్రభువైన రుద్రుడు వారితో ఇట్లనెను: బ్రహ్మయొక్క కుమారులైన దేవతలు నాకై నా నుండి ప్రాణములను గ్రహించిరి. ఈ నా కుమారులైన బ్రాహ్మణులను అగ్రజుల కంటె అగ్రజులుగా జేసి బ్రహ్మాది స్తంబ పర్యం తములైన అనగా బ్రహ్మమొదలు గడ్డిపరక వరకు నేను ఆత్మగా ఉన్న ఏడు లోకములను మీరు నా మాటవలన సృష్టింపవచ్చును. మీకు శుభము అగుగాక. అని ఈ విధముగా రుద్రుడు చెప్పగానే ఆర్యుడు, త్రిశూలియైన, రుద్రునితో ప్రజాపతులు మీరు ఆజ్ఞాపించినట్లే సృష్టి జరుగ కలదు అనిరి. అపుడు ప్రజాపతులు మహాదేవుని ఒప్పించి మహాత్ముడైన దక్షునితో “నీవు శ్రేష్ఠుడవైన ప్రజాపతివి. నిన్ను ముందు ఉంచుకొని నీకు మేము క్షేమముగా ప్రజలను సృష్టింపగలము అని అనిరి. దక్షుడు అట్లే అగుగాక అని వారి మాటను ఒప్పు కొనెను. ప్రజాకాముడై అ ప్రజాపతి వారితో గూడి ప్రజలను సృష్టించుటకు అరంభించెను. తరువాత స్థాణువు (శంకరుడు) సర్గమునందు (సృష్టియందు) ఉండగా బ్రహ్మ సర్గమును, సృష్టిజేసెను. ఆ తరువాత బ్రహ్మకు ఏడవ కల్పము గడచిపోగా బ్రహ్మకు ఋభువు, సనత్కుమారుడును పుట్టిరి. వీరు ఇరువురు తపోలోక నివాసులు, ఆ తరువాత ఇతర మహర్షులను మానస జన్ములుగా ఆ ప్రభువు సృష్టించెను. (25)