వాయు మహా పురాణము
మహాదేవ తనువర్ణనం
అంతట ఋషులు:
“ఈ కల్పమున సాధకులైన మునులతో బాటు మహాత్ముడు మహాదేవుడు అయిన రుద్రుని యొక్క ప్రాదుర్భావము నీచే చెప్పబడినది”. అని పలుకగా!
సూతుడు:
మొదటి సృష్టియొక్క ఉత్పత్తి నాచేత సంగ్రహముగా చెప్పబడినది. దీని యొక్క నామములను వాని శరీరములతోబాటు విస్తరముగా చెప్పెదను వినుడు అని పల్కెను. ఎనిమిదవ కల్పము గడచిపోగా తొమ్మిదవ కల్పమున)మహాదేవుడు తన భార్యల యందు అనేకులగు పుత్రులను పుట్టించెను. కల్పాదిలో తనతో సమానమైన పుత్రుని ధ్యానించుచున్న ప్రభువు శంకరుని తొడనుండి నీలలోహితుడైన (నలుపు ఎఱుపుగల) కుమారుడు పుట్టెను. మంచి స్వరము గలిగి తేజస్సుతో మండుచున్నట్లున్న అతనిని ధరించెను. అకస్మాత్తుగా ఏడ్చు చున్న కుమారుడైన నీలలోహితుని చూచి “బ్రహ్మకుమార ఏడ్చుచుంటివి ఏమి”? అని అనెను. అందుకు ఆ నీలలోహితుడు “ఓ బ్రహ్మ! నాకు మొదటి పేరు పెట్టుము అనెను. బ్రహ్మ “నీవు పేరుతో రుద్రుడవు” అనెను. ఆ కుమారుడు మరల ఏడ్చెను. ఏడ్చు చున్న అతనిని బ్రహ్మ ఎందులకు ఏడ్చుచుంటివి అనెను. కుమారుడు తనకు రెండవ పేరు చెప్పుమని బ్రహ్మను అడిగెను. “ఓ దేవా! నీ పేరు భవుడు అగును” అనెను. కుమా రుడు మరల ఏడ్చెను. బ్రహ్మ ఏల మరల ఏడ్చుచుంటివి అనెను. శివుడు నాకు నాల్గవ పేరు చెప్పుమనెను. బ్రహ్మ నీవు పశుపతివి అనెను. కుమారుడు మరల ఏడ్చెను. బ్రహ్మ ఏల ఏడ్చుచుంటివి అనెను. శివుడు నాకు ఐదవ పేరును చెప్పుమనెను. బ్రహ్మ నీ పేరు ఈశుడు అగును అనెను. కుమారుడు మరల ఏడ్చెను. బ్రహ్మ మరల ఏడ్చుచుంటివి ఏల నెను. కుమారుడు నాకు ఆఱవ పేరు చెప్పుమని, ఆ ప్రభువైన బ్రహ్మను అడిగెను. బ్రహ్మ నీపేరు భీముడు అగును అనెను. కుమారుడు మరల ఏడ్చెను. బ్రహ్మ ఏల మరల ఏడ్చుచుంటివనెను. కుమారుడు నాకు ఏడవ పేరును చెప్పుమనెను. బ్రహ్మ నీ పేరు ఉగ్రుడు అనెను. కుమారుడు మరల ఏడ్చెను. బ్రహ్మ ఏల మరల ఏడ్చుచుంటివి అనెను. కుమారుడు నాకు ఎనిమిదవ పేరును చెప్పుమనెను. బ్రహ్మ నీవు పేరుతో మహాదేవుడవు అగుదువు అనెను.
బ్రహ్మ నుండి శివుడు ఈ నామములను పొంది, ఈ నామములకు సరియైన భౌతిక శరీరముల (భూతములను)ను చెప్పుమని బ్రహ్మను అడిగెను. దానివలన బ్రహ్మచే పై నామములకు శరీరములు సృష్టింపబడినవి. సూర్యుడు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, దీక్షితుడైన బ్రాహ్మణుడు, చంద్రుడు-ఇవి బ్రహ్మ ధాతువులు. వానిలో రుద్రుడు పూజ్యుడును, వంద్యుడును అగును. కావున రుద్రుడు వారిని బాధించడు అని చెప్పి.
తరువాత బ్రహ్మ రుద్రునితో మరల ఇట్లనెను. నీ రెండవ పేరు భవుడు అంటిని. దీనికి జలరూపమైన శరీరము కలుగగలదు అని అనగానే ఆ రుద్రుని యొక్క స్థిరమైన, రసాత్మకమైన శరీరము ఆ జలమున ప్రవేశించెను. కావున జలములు భవుడు అని పిలువబడెను. జలములవలన పుట్టి భూతములు (శరీరములు) జలములనే భవించు భవన భావనముల వలన (ఉండుట భావించుట వలన) భూతముల సంభవము చెప్పబడినది. శివుడు జలములలోనుండి జలములను భావించుటచే జలములు శివుడయ్యెను. కావున జలములలో మూత్ర మల విసర్జనములు విడువరాదు. నగ్నముగా స్నానము చేయరాదు. ఉమ్మివేయరాదు. స్త్రీ సంభోగము జేయరాదు. తలస్నానము జేయరాదు. సంతుష్ఠుడై కాని, మోయుచున్నవాడై కాని, సరిగా ఉండని వాడై కాని నీళ్లను వదలరాదు. పవిత్ర, అపవిత్ర శరీరములగుట వలన జలములు దుష్టములు కావు. రంగుమారినవి, వాసన కలవియు, అల్పములైనవియు అయిన జలములను వదలి వేయవలెను. నీటి పుట్టుకకు కారణము అగు సముద్రమును చేరి పవిత్రములును అమృతములును అగును. కావున జలములను అడ్డుకొనరాదు. అవి సముద్రమును చేరగోరును. ఈ విధముగా నీటి విషయమై ఎవడు ప్రవర్తించునో వానిని శివదేవుడు హింసించడు.
తరువాత బ్రహ్మ శివునితో అనెను. ఓ శివదేవ నీ మూడవ పేరుగా ఇడబడిన శర్వ అను పేరునకు మూడవ శరీరముగా ఈ భూమి అగును అని అనగానే శివుని యొక్క స్థిరమైన (శరీర) భాగమైన ఎముక భూమిలో ప్రవేశించెను. కావున భూమి శర్వుడు అనబడును. కావున విద్వాంసుడు (తెలిసినవాడు) నీడలోగాని, మెట్ట పైనగాని, తన నీడయందు గాని మలమూత్రములు వదలరాదు. తలపై వస్త్రము కప్పుకొని భూమిని గడ్డితో గప్పి మలమూత్రములు చేయవలెను. ఈ విధముగా నడుచుకొన్న వానిని శర్వుడు హింసించడు.
తరువాత బ్రహ్మ శివదేవునితో ఇట్లనెను. నేను నీ నాల్గవ పేరు ఈశానుడు అని అంటిని. ఆ నామమునకు నాల్గవ శరీరము వాయువగును అని అనగానే శివుని శరీరమున ఐదు విధములుగా ప్రాణమను పేరనున్న (ప్రాణ) వాయువు, ఆ వాయువులో చేరెను. అపుడు వాయువు ఈశానుడు అనబడెను. కావున విశాలముగా వ్యాపించిన మీ వాయువును ఈశ్వరునిగా జెప్పవలెను. ఈ విధముగా ఉన్న వానిని ఈశానుడు హింసింపడు.
తరువాత మరల బ్రహ్మ ధూమ్రలోహితుడగు శివునితో అనెను. నేను నీ ఐదవ పేరు పశుపతి అని అంటిని ఆ ఐదవ పేరునకు ఐదవ శరీరము అగ్ని అగును అని అన గనే శివుని శరీరమున నుండి అతని చిహ్నముగా ఉన్న తేజస్సు అగ్నిలో ప్రవేశించెను. కావున అగ్ని పశుపతియై పతియయ్యెను. చంద్రుడు సోముడు అనబడెను. ఆతని ఆత్మ ఓషధీ గుణము ఈ విధముగా తెలిసియే విద్వాంసుడు ప్రతిపర్వమున (పూర్ణిమ యందు) ఉండునో అతనిని మహాదేవుడు చంపడు. ఈ విధముగ ఆ ప్రభువునకు (శివుని) నమస్కరింపవలెను. ప్రజలను సూర్యుడు పగలు రక్షించును. రాత్రియందు చంద్రుడు రక్షించును. ఒక్క అమావాస్య రాత్రియందు చంద్రుడు ఎల్లప్పుడు సూర్యునితో కలిసి ఉండును. అక్కడ ఇదంతయు (శివ శరీరమంతయు) తన పేరులతో శరీరములతోను ప్రవేశించి ఆవరించి ఉండును. కావున ఈ ఒక్కడుగా (ఆకాశమున చరించుచున్న సూర్యుడే చంద్రుడు అనబడును. సూర్యుని కాంతితో ప్రజలు చూడ గలుగుచున్నారు. అది శుక్ల (తెల్లని) స్వరూపమున ఉన్న రుద్రుడు. అతడు కిరణములచే నీటిని త్రాగును. అన్నపానాత్మకములను తిని త్రాగుచున్నాడు. శివాత్మనుండి పుట్టిన శరీరములలోనే అభివృద్ధినొందును. స్థిరమైన చిత్తముతో సమస్త ప్రజలను ధరించుచున్నది శివుని యొక్క శార్వీ అను వర్ణితమైన శరీరము, ప్రజలను ధరించును.
ప్రాణ వ్యాపారములచేత ప్రాణుల శరీరములలో ఎంతవరకు వాయురూపమే ఉండునో, అది ఐశానియై ప్రాణితోపాటు ప్రాణముల రూపమును పొవును. జఠరములందు (జీర్ణకోశములందు) త్రాగినవానిని, తిన్నవానిని పక్వము (జీర్ణము) చేయునది ఆ శివుని యొక్క పాశుపతి అను పాచిక శక్తి. దేహములలో వాయు సంచారము కొఱకై అంతర్గతములై ఉన్న రంధ్రములు శివుని భీమ అను శరీరము అనబడును. బ్రహ్మవాదులై, వైతాన ((వ్రత) దీక్షితులయొక్క స్థితి శివుని ఉగ్రరూపమైన శరీరము అనబడును. కావున దీక్షితుడు ఉగ్రుడు అనబడును. ఇది ప్రజలలో సమముగా నున్న శివుని సంకల్పము ఆ శివుని మానసీ తనువైన చంద్రుడు. అతడు ప్రాణులలో ఉండును. మరల మరల పుట్టుచున్నవాడై క్రొంగొత్త వాడగును. అతడు దేవతలతోను, పితృ దేవతలతోను కూడ కోరినట్లుగా స్వేచ్ఛగా తీసికొని పోబడును. మహాదేవుడు అమృతాత్ముడు. అట్టి ఈ శివుడు జలమయుడైన చంద్రుడు అనబడెను.
ఆ శివుని యొక్క మొదటి శరీరము రౌద్రియను పేర చెప్పబడినది. అట్టి రుద్రుని యొక్క భార్య సువర్చల ఆతనికి ఆమెకును పుట్టిన పుత్రుడు శనైశ్చరుడు. శివుని రెండవ శరీరము జలము అనబడినది. అట్టి శివ జలతనువునకు భార్య ‘ఉష’. వారి పుత్రుడు ఉశనుడు (శుక్రుడు). శివుని మూడవ తనువు భూమి. అట్టి శివ భూతనువునకు భార్య ‘వికేశి’. వారి పుత్రుడు ‘అంగారకుడు’. శివుని నాల్గవది స్వర్గతమైన ఈశాన తనువునకు శివ అను పత్ని ద్వారా పుత్రుడు అయినవాడు మనోజవుడు. పశుపతికి అయిదవ తనువు అగ్నియని ద్విజులచే చెప్పబడును. (శివ) అగ్నికి భార్య స్వాహాదేవి. వారి పుత్రుడు స్కందుడు. శివుని ఆరవదియైన భీమలను తనువు ఆకాశము. ఆ శివాకాశ తనువునకు దిక్కులు భార్యలు స్వర్గము పుత్రుడు. దీక్షిత బ్రాహ్మణులచే శివుని ఏడవ తనువు ఉగ్రయ. ఆ ఉగ్రతనువునకు భార్య దీక్ష ‘భార్య వారిరువురి పుత్రుడు ‘సంతాన’ము (కల్పవృక్షము). శివుని అష్టమతనువైన చంద్రునకు పత్ని రోహిణి. వారి పుత్రుడు బుధుడు అనబడెను.
అని శివుని యొక్క నామములతో తనువులు చెప్పబడినవి. ప్రతి నామ తనువులలో చక్కగా వందనము జేయతగినవి. నమస్కరింప తగినవి కూడ. శివునియొక్క తనువులతోను నామములతోబాటు శివ తనువులైన సూర్యునియందు, జలములందు, భూమియందు, వాయువునందు, అగ్నియందు, ఆకాశమునందు, దీక్షితునియందు, చంద్రుని యందును, భక్తివలన నరుడు ప్రజావంతుడై ఈశ్వరునితో సాయుజ్యమును పొందును. భీముడైన శివుని యొక్క ఈ రహస్యమైన యశము మీకు చెప్పబడినది. ద్విపదులైన నరులకు సుఖము గలుగుగాక. చతుష్పదులైన మృగములకును సుఖము కలుగుగాక. ఓ ప్రజలారా! దేవుడై మహాదేవుడైన శివునియొక్క (భృగువు యొక్క) నామములతోబాటు తనువులయొక్క మూలకారణము ఇది. మీకు జెప్పబడినది. వినుడు. (27)