మనువంశ వర్ణనము

సూతుడు ఇట్లు అనెను:

కకుద్మియొక్క ఆ లోకమును పొందిన రైవతునికి సంబంధించిన వారందరు పుణ్యజనులైన రాక్షసులచే హతులైరి. అది కుశస్థలి. ధార్మికుడును, మహాత్ముడునైన అతని యొక్క ఆ నూరుగురు సోదరులు రాక్షసులచే నిర్బంధింపబడిరి. అందుచే వారు భయము వలన నలుదిక్కులకు పారిపోయిరి. ఓ బ్రాహ్మణోత్తములారా! వారి భయముచే అక్రాంతులైన ఆ క్షత్రియులు అచ్చటచ్చట నెలకొనిరి. వారి వంశములు అచ్చటచ్చట మిక్కిలి గొప్పవైనవి. అన్ని దిక్కులకు పోయిన వారు ధార్మికులుగా ప్రఖ్యాతి గాంచిరి. ధృష్ణుని ధర్షించునట్టి క్షాత్రము రణమున ప్రౌఢము అయ్యెను. (అపరాధులు దండించునట్టి క్షత్రజాతి యుద్ధరూపమైన అపరాధము చేయునది అయ్యెను). ఇట్టి మహాత్ములైన క్షత్రియుల యొక్క గణములు మూడు వేలుగా ఉండినవి. అందులో నా భగుని దాయాదుడు (పుత్రుడు) నాభాగుడను వీర్యవంతుడు. నాభాగ పుత్రుడు అంబరీషుడు. అతని పుత్రుడు విరూపుడు. విరూపుని పుత్రుడు పృషదశ్వుడు. అతని పుత్రుడు రథీతరుడు. ఈ క్షత్ర ప్రసూతులుకూడ మరల అంగిరసులు అనబడురు. రథీతరులలో శ్రేష్ఠులు క్షాత్రముతో కూడిన ద్విజాతులు (క్షత్రియులు).

క్షువతుడు అను మనువున కంటె పూర్వము ఇక్ష్వాకువనువాడు ఉద్భవించెను. ఆ ఇక్ష్వాకునకు నూరుగురు పుత్రులు ఉండిరి. వారు భూరిదక్షిణలతో యజ్ఞములు చేసిరి. వారిలో జ్యేష్ఠుడు వికుక్షుడు. తరువాతివాడు నేమి, ఆ తరువాతివాడు దండుడు. ఈ విధముగ మువ్వురు. వికుక్షికి శకుని మొదలగు వారు ఏఐదుగురు పుత్రులు. ఉత్తరాపథదేశమును రక్షించు రాజులు నలుబది. అట్లే దక్షిణ దిక్కున రక్షించువారు ఎనమండుగురు. ‘వంశతి’ మొదలగు వారు దక్షిణాపథమును రక్షించువారు. తరువాత ఇక్ష్వాకువు వికుక్షిని ‘అష్టక’ యందు ఆదేశించెను.

రాజు ఇట్లనెను:

“ఓ మహాబలుడా! మృగములను చంపి శ్రాద్ధమున భోక్తలు భుజింపదగిన దానిని నాకు తెచ్చి పెట్టుము. ఇవ్వేళ అష్టకయందు నిఃసంశయముగా శ్రాద్ధము చేయవలసి ఉన్నది” అని ఆజ్ఞ ఇచ్చెను. ధీమంతుడైన ఇక్ష్వాకుని మాట ప్రకారము ఆ వికుక్షి వేటకు పోయి వేలకొలది మృగములను చంపెను. వేటవల్ల పరిశాంతుడైన వికుక్షి అచ్చట కుందేలును భక్షించెను. ఆ వికుక్షి సైనికులతోను, మాంసముతోను రాగా ఇక్ష్వాకువు వశిష్ఠుని ఆ మాంసమును ప్రోక్షించుమని ప్రేరేపించెను. ఆ విధముగ రాజుచే ప్రేరితుడైన వశిష్ఠుడు శాస్త్రీయముగా సమీపించి ఆ మాంసమును చూచి కోపించినవాడై రాజుతో ఆ మాంసమును ఉపహతమైన దానినిగా (కొంత గ్రహించి తినబడినదానినిగా) చెప్పెను. ఓ రాజా! నీ పుత్రుడైన శూద్రునిచే మాంసము అపహరింపబడినది. ఓ మహాద్యుతీ! కుందేటిని భక్షించినందున ఈ మాంసము తినదగినదికాదు. ఓ పాపరహితుడా! ఆ దురాత్ముడు (వికుక్షి) ముందే అరణ్యమున కుందేటిని తినెను. దానిచేత ఈ మాంసము ఓ రాజోత్తమా! పితరులకు దుష్టమైనది అని పలికెను. అంత ఇక్ష్వాకువు కోపించి వికుక్షినితో ఇట్లనెను - “పితృకార్యమున నాచే ఆజ్ఞాపింపబడి వేటకు వెడలితివి. దయలేనివాడవై అట అరణ్యమున (శ్రాద్ధమునకు) ముందే కుందేటిని నీవు ఏల తింటివి. కావున నిన్ను వదిలిపెట్టు చున్నాను. ఇక నీవు నీ ఇచ్చ వచ్చిన విధముగా వెడలుము. ఈ విధముగ వశిష్ఠుని మాటవలన ఇక్ష్వాకువుచే తన పుత్రుడు వదలిపెట్టబడెను. ఆ ఇక్ష్వాకువు అట్లుండగా ఆ శశి (శశమును భక్షించిన వికుక్షి) ఈ భూమిని చేరి పరమ ధర్మాత్ముడై అయోధ్యాధిపుడు అయ్యెను. అపుడు అతడు వశిష్ఠప్రేరితుడై రాజ్యము చేసెను. తరువాత ఆ రాజు యొక్క రాజ్యావస్థ ఆ పాపముతో నిండెను. కాలక్రమముగ అతడు అట మిక్కిలి తక్కువైన గతిని పొందెను. ఈ విధముగ ఈ అఖ్యానమును తెలిసి, అవిధి భక్షింపలేదు. ఎవరి మాంసము ఈ లోకమున నేను తింటున్నానోవాడు జన్మాంతరమున ఆ మాంసమును తినగలడు. (మాంసభక్షయితా అముత్రేతి  - మాంసః) అని మాంసత్వమును విద్వాంసులు నిర్వచింతురు.

శశాదుని పుత్రుడు కకుత్ స్థుడను వీర్యవంతుడు. పూర్వము ఒక యుద్ధమున వృష భూతుడైన ఇంద్రునకు కకుత్ స్థుడు పుట్టెను. దాని వలన కకుత్ స్థుడు అనబడెను. కకుత్ స్థునకు అనేనసుడు అను కుమారుడు పుట్టెను. అతడు పృథురోముడు అనబడెను. పృథువు యొక్క పుత్రుడు వృషదశ్వుడు. అతని వల్ల వీర్యవంతుడైన ఆంధ్రుడు పుట్టెను. ఆంధ్రు(డు)నకు యవనాశ్వుడు, అతనికి శ్రావస్తుడు పుత్రుడు, శ్రావస్తునకు మహాయశస్వియైన బృహదశ్వుడు పుత్రుడు. ఈతనిచేతనే శ్రావస్తినగరి నిర్మింపబడెను. బృహదశ్వుని పుత్రుడు కుబలాశ్వుడని శ్రుతి. అతడు దుంధువను వానిని చంపినందున ధుంధుమారుడని పేరుగాంచెను.

ఋషులు ఇట్లు అనిరి:

“ఓ ప్రాజ్ఞుడా! దేనికై కుబలాశ్యుడు దుంధుమారుడు అనబడెనో ఆ దుందువధను సవిస్తరముగా వినదలచితిమి”. సూతుడు ఇట్లు అనెను. బృహదశ్వునకు ఇరువది యొక్క వేల పుత్రులు. వారందరు విద్యలలో నిష్ణాతులు, బలవంతులు, చంపుటకు అలవికాని వారు, వారందరును ధార్మికులు, భూరి దక్షిణలు ఇచ్చిన యజ్జ్వలు అయిరి. నరాధిపుడు బృహదశ్వుడు ఆ రాష్ట్రమున మహావీర్యవంతుడును, శూరుడును, ధార్మికుడు అయిన కుబలాశ్వుని అభిషేకించెను. ఆ విధముగ పుత్రునకు సంక్రమింపచేసిన రాజ్యము కలవాడై బృహదశ్వుడు అనురాజు వనవాసము చేసెను. కాని, ఆవిధముగ వనవాసమునకు వెడలిన శూరుడు ఉత్తమ ధార్మికుడు మహారాజైన బృహదశ్వుని బ్రహ్మర్షియైన ఉత్తంకుడు నివారించెను.

ఉత్తంకుడు ఇట్లు అనెను:

నీచే ఒక రక్షణము చేయవలసి ఉన్నది. నీవు దానిని ఇప్పుడు చేయుటకు అర్హుడవుగా ఉన్నావు. ఓ రాజా! నేను ఉద్వేగము లేనివాడనై తపము చేయలేకున్నాను. నా యొక్క ఆశ్రమ సమీపమున సమముగా ఉన్న మరుధన్వములలో (మరుభూమియందుండు పర్వతములలో) ఇసుకతో నిండిన సముద్రము ఉండును. అచట ఇసుకలో దాగి భూమి అంతర్భాగమున దేవతలకు అవధ్యుడును, మహాకాయుడు, మహాబలుడు అయిన గొప్పవాడు ఉన్నాడు. అతడు మనుపుత్రుడు, క్రూరుడు, మిక్కిలి భయంకరుడునైన ధుంధువు, లోకవినాశమునకై భయంకరమైన నూరు వర్షముల తపమును అవలంబించి ఉన్నాడు. అతడు సంవత్సరము చివర నిఃశ్వాసమును వదలును. అపుడు అచటి భూమి తన అడవులతో కూడ కంపించునట. ఆతని నిఃశ్వాస వాయువుతో పెద్ద దుమ్ము బయలుదేరును. అది సూర్యమార్గమును అవరించును. ఏడు దినములు భూమి కంపించును. అది నిప్పులతోను, మంటలతోను, అతిభయంకరమైన ఉష్ణముతోను నిండిఉండును. ఓ రాజా! ఆకారణము చేత నేను నా ఆశ్రమమున నిలువజాలకున్నాను. ఓ మహాబాహూ! లోకముల హితమును కోరి వానిని నివారింపుము. మహావిష్ణువు నీ తేజస్సును తన తేజస్సుచే ఆప్యాయనము చేయకలడు. ఈనాడు ఆ రాక్షసుడు చంపబడినచో లోకములు స్వస్థములు అగును. ఓ రాజా! ఈనాడు నీవు అతని చంపుటకు శక్తి గలవాడవు కదా! నాకు పూర్వము ఓ పాపరహితా! విష్ణువుచే వరము ఈయబడినది. కావున మహావీర్యుడైన ధుంధువు అల్పవీర్యముతో అణచుటకు శక్తిగలవాడు కాడు” అని మహాత్ముడైన ఉత్తంకునిచే ఈవిధముగ చెప్పబడినవాడై రాజర్షియైన బృహదశ్వుడు, తన కుమారుడైన కుబలాశ్వునిని ఆ ధుంధునివారణమునకై ఉత్తంకునకు ఇచ్చెను. ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! నేను శస్త్రములను విసర్జించినవాడను. ఈనాసుతుడు రాజై, నిఃసంశయముగా ధుంధుమారుడు (ధుంధువును చంపువాడు) కాగలడు. అని ఆ బృహదశ్వుడు, తన కుమారుని ధుంధుమారణ సముద్యతునిగా ఆదేశించి శంసితవ్రతుడై తపమునకై పర్వతమునకు జనెను. ధర్మాతుడైన కుబలాశ్వుడు తండ్రిమాటయందు నిలబడి ఆ ధుంధువును నివారించుటకై ఉత్తంకునితో సహావెడలెను. అంత, ఉత్తంకుని నియోగమున లోకముల హితము కోరి భగవంతుడైన విష్ణువు అతనిని ఆదేశించెను. ధర్షింప అలవికాని అతడు వెళ్లిపోగా, ఆకాశమున ఒక మహాశబ్దము కలిగెను. ఇప్పటి నుండి ఈ రాజు ధుంధు మారుడుగా పేరు పొందెను. దేవతలు దివ్య పుష్పములచేత అతనిని అద్భుతముగ సంభావించిరి. పురుషశ్రేష్ఠుడైన ఆ వీర్యవంతుడు కుమారులతో కూడ వెడలి, సముద్రమును త్రవ్వెను. అది అవ్యయమైన ఇసుక సముద్రము. ఆ రాజర్షి నారాయణునితో ఆప్యాయితుడు (ఆదేశింపబడినవాడు) గదా. ఉత్తంకుని వశమందు ఉండి అతడు అతిబలుడు అయ్యెను. ఇసుక సముద్రమును త్రవ్వుచున్న అతని పుత్రులు అప్పుడు అట పశ్చిమదిక్కున ఇసుకలో దాగియున్న ధుంధువును చూచిరి. అతడు ముఖాగ్నిచే లోకములను నశింపచేయుచున్నాడా అన్నట్లు కోపించి ఉండెను. ఆ సముద్రము సోముని యొక్క ఉదయమున ధారోర్మికలిలమై గొప్పనైన మహోదధివలె యోగముతో నీటి అలల శబ్దమును వినెను. రాక్షసులైన అతని (ధుంధువుయొక్క) పుత్రులు ముగ్గురు తప్ప తక్కిన వారందరు దహింపబడిరి. తరువాత ఆ రాజు అతిబలుడై ధుంధు బంధువులను చంపెను. ఆ రాజు అతని (ధుంధువు యొక్క) జలమయమైన వేగమును త్రాగి వైచెను. యోగియైన రాజు యోగ(ముతో) జలముతో అగ్నిని శమింపజేసెను. మహాకాయుడైన ఆ జలరాక్షసుని బలముతో కూల్చెను. తరువాత ఆ రాజు కార్యము ముగించినవాడై ఉత్తంకుని చూపెట్టెను. ఉత్తంకుడును ఆ మహాత్ముడైన రాజునకు వరమును ఒసగెను. ఆతనికి అక్షయమైన విత్తమును, శత్రువులకుకూడ అపరాజితుడు అగుటను, ధర్మమునందు ఎల్లప్పుడు ఆసక్తి కలిగి ఉండుటను, స్వర్గమున అక్షయమైన నివాసమును, హతులైన రాక్షసులకుకూడ అక్షయ లోకములను వరముగా ఒసగెను. ఆ ధుంధువు యొక్క ముగ్గురు పుత్రులు మాత్రము మిగిలిరి. అందుజ్యేష్ఠుడు దృఢాశ్వుడు. భద్రాశ్వ - కపిలాశ్వులు తరువాతి సోదరులు. ధుంధుమార పుత్రుడైన దృఢాశ్వునకు పుత్రుడు హర్యశ్వుడు. ఎల్లప్పుడును క్షత్రధర్మరతుడైన నికుంభుడు హర్యశ్వుని పుత్రుడు. నికుంభుని పుత్రుడు సంహతాశ్వుడు. ఈతడు రణపండితుడు. సంహతాశ్వుని పుత్రులు కృశాశ్వుడు, అక్షయాశ్వుడు - అను ఇరువురు. అతని భార్య హైమవతి. సత్పురుషులలో మతిదృషద్వతి అని ముల్లోకములలో ప్రసిద్ధిచెందినది. ఆమె పుత్రుడు ప్రసేనజిత్తు. అతని పుత్రుడు యవనాశ్వుడు. ఆతడు ముల్లోకములలో అతి తేజస్వియు, అత్యంత ధార్మికుడు, అతని భార్య పతివ్రతయగు గౌరి. ఆమె భర్తచే దూషింపబడినదై (శపింపబడినదై) బాహుదా నదిగా చేయబడినది. ఆమె పుత్రుడు గౌరికుడు చక్రవర్తి అయ్యెను. యవనాశ్వ పుత్రుడైన మాంధాత త్రైలోక్య విజయమందిన రాజు. ఇట పౌరాణిక బ్రాహ్మణులు సూర్యుడు ఉదయించి ఎంతవరకు ఉండునో! ఎంతవరకు ఆకాశమున ప్రకాశించుచు నడచుచుండునో అంతవరకు మొత్తము భూమి యవనాశ్వ పుత్రుడైన మాంధాతయొక్క రాజ్యము. (సూర్యుడు అస్తమించని రాజ్యము అని భావము) (దీనివల్ల భూమి గుండ్రముగ ఉన్నదనియే అప్పటి భావన అని తేలును). మహాత్ముడు, యజ్వయు, అమిత పరాక్రమియునైన మాంధాత విష్ణువు యొక్క శరీరమే అని వంశవేత్తలైన జనులు చెప్పుదురు. అతనికి శశబిందుని యొక్క పుత్రియైన చైత్రరథి భార్య అయ్యెను. ఆమె సాధ్వి, బిందుమతిఅను పేరుగలది, రూపములో భూమిపై సాటిలేనిది. ఆమె పదివేల అన్నలకు జ్యేష్ఠురాలు, పతివ్రత. ఆమె యందు ప్రభువైన మాంధాత ముగ్గురు పుత్రులను కనెను. వారు పురుకుత్సుడు, అంబరీషుడు, ప్రసిద్ధుడైన ముచుకుందుడును. అంబరీషుని పుత్రుడు రెండవ యవనాశ్వుడు అనబడెను. యవనాశ్వునకు హరితుడు పుత్రుడు. హరీతులు (హరిత పుత్రులు) శూరులు. వీరు అంగిరసుని పుత్రులు. క్షాత్రముతో కూడిన ద్విజాతులు. పురుకుత్సుని పుత్రుడు మహాయశస్వి అయిన త్రసదస్యువు. నర్మద యందు పుట్టిన సంభూతుడు (త్రసదస్యునకు పుత్రుడు). సంభూతునకు పుత్రుడు ప్రతాపవంతుడైన అనరణ్యుడు. ఈతడు పూర్వము త్రిలోకవిజయమున రావణునిచే చంపబడెను. అనరణ్యుని పుత్రుడు త్రసదశ్వుడు. అతని పుత్రుడు హర్యశ్వుడు. హర్యశ్వునకు దృషద్వతి యందు వసుమతుడు అను రాజు పుట్టెను. ఆతని పుత్రుడు ధార్మికుడును, రాజు అయిన త్రిధన్వుడు. త్రిధన్వునకు త్రయియందు రణప్రభువైన విద్వాంసుడు పుట్టెను. అతనికి సత్యవ్రతుడు అను మహాబలుడైన కుమారుడు పుట్టెను.వాడు స్వర్గవాసులను చంపి విదర్భుని భార్యను అపహరించెను. పాణిగ్రహణ మంత్రములలో నిష్ఠను పొందింపగా, ఇట అతనికి విష్ణువృద్ధుడు అను పుత్రుడు కలిగెను. వీరు క్షాత్ర తేజముతో కూడినవారు. సమాశ్రయించినవారును అగు అంగిరసుని పుత్రులు.

కామము వలనను, బలము వలనను, మోహము వలనను, సంకర్షణ బలము చేతను (శత్రువులను సంహరించు బలముచేతను), కానున్న భవితవ్య బలము వలనను, ఆ బుద్ధిమంతుడు అయిన సత్యవ్రతునిచే పరుని భార్యను అపహరించు దుష్కార్యము చేయబడినది. ఆ విధముగ అధర్మముతో కూడిన అతనిని త్రయీగుణుడైన (వేదములే గుణముగాకల) తండ్రి వదలివేసెను. కోపముతో కూడినవాడై ‘నశింపుము’ అని పలు మారులు అనెను. ఆ సత్యవ్రతుడు ‘ఒంటరినై ఎటకు పోవుదును!” అని మాటి మాటికి అడిగెను. అంత తండ్రి అతని శ్వపాకులతో (కుక్కలను వండువారితో, మాలవారితో) ఉండుము అనెను. “ఓ కులదూషకుడా! పుత్రుడు అయిన, నీచే నేను పుత్రార్థిని (పుత్రుని కోరినవానిని) కాను” - అని చెప్పి “ఓ విభో! తన మాటతో అతనిని నగరము నుండి వెడలగొట్టెను” భగవంతుడును ఋషియునైన వశిష్ఠుడును అతనిని అడ్డుకొనలేదు. ధీమంతుడైన సత్యవ్రతుడు తండ్రితో వదిలిపెట్టబడినవాడై, మాలవారి ఇండ్ల సమీపమునకు వెళ్లెను. అతని తండ్రియు వనమునకు వెళ్లాను. అప్పుడు ఆ అధర్మముచే ఆ దేశమున పండ్రెండేండ్లు ఇంద్రుడు వర్షింపలేదు. ఆ దేశమున మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు భార్యను ఆ ప్రదేశమున నుంచి సముద్ర ప్రాంతమున జల ప్రదేశమున విపులమైన తపము చేసెను. అతని భార్య తన ఔరసుడైన (తనకు తన భర్తకును పుట్టిన) మధ్యమ పుత్రుని జుట్టుతో మెడను కట్టి తన పోషణమునకై నూరు గోవులకు అమ్మెను. మెడను కట్టబడి అమ్మబడిన ఆ విశ్వామిత్ర మహర్షి పుత్రుని చూచి, ధర్మాత్ముడు, నరోత్తముడు, సువ్రతుడు అగు సత్యపుత్రుడు అతనిని క్రయము నుండి వదిలించెను. మహామతియైన ఆ సత్యవ్రతుడు విశ్వామిత్రుని సంతోషము అనుగ్రహములకై అతని పోషణ భారము వహించెను. గళమునందు (అమ్ముటకు పశువులకు పలుపుత్రాడు కట్టిన విధముగా కట్టబడిఉన్న) బద్ధుడైన ఆ మహాతపస్వి తరువాత కాలవుడు అయ్యెను. దీనివలన తండ్రియై మహర్షియైన కౌశికుడు అతని పరాక్రమముచే ముక్తుడు కావింపబడినట్లు అయ్యెను. అతని వ్రతముచేతను, భక్తిచేతను, దయచేతను, ప్రతిజ్ఞచేతను, వినయవంతుడై సత్యవ్రతుడు విశ్వామిత్రుని భార్యను భరించెను. తరువాత తేళ్లను, అడవి పందులను, అడవి దున్నలను ఇంకను వనచరములను చంపి విశ్వామిత్రుని ఆశ్రమ సమీపమున వాని మాంసమును వండెను. రాజు వనవాసికాగా, తండ్రి ఆజ్ఞవలన సత్య వ్రతుడు ఉపాంశు వ్రతమున నుండి పండ్రెండు వర్షముల దీక్షను వహించెను. అయోధ్యను, రాజ్యమును అట్లే అంతఃపురమును అతడు పొందెను. మునియైన వశిష్టుడు యాజ్యో పాధ్యాయ సంయోగము వలన రక్షింపబడెను. సత్యవ్రతుడు భవితవ్యము యొక్క బలీయత వల్ల బాల్యము నుండియు కోపముతో వశిష్టునిపై కోపమును వహించి ఉండెను. ఇంకను పూర్వము తండ్రిచేత రాష్ట్రమునుండి వెడలగొట్టబడిన తన కుమారుని వశిష్ఠుడు వారించ లేదు. ఆ కారణమున సత్యవ్రతునకు బాల్యము నుండియు వశిష్ఠునిపై కోపముండెను. పాణిగ్రహణ మంత్రములకు ఏడవ పదమున నిష్ఠ (సమాప్తి) అగును. ఈ విధముగనే సత్యవ్రతుడు ఆ మంత్రములను ఏడవ పదమున పూర్తి చేసెను. ధర్మములను తెలియుచునే వశిష్ఠుడు ఇచట మంత్రములను ఇష్టపడలేదు - అని సత్యవ్రతుని విషయమున వశిష్ఠుడు మనస్సున కోపము వహించెను. గురువై భగవంతుడైన వశిష్ఠుడు బుద్ధిచే అపుడు ఆ విధముగా చేసెను. దీనికి సత్యవ్రతుడు ఉపాంశువ్రతమును కావలయుననే చేయలేదు. అతడూ రకుండగా తండ్రి విషయమున వశిష్ఠుడు మహామనస్వియై ఉండెను. దానివల్ల పండ్రెండు ఏడులు ఇంద్రుడు వర్షము కురియలేదు. దానివలన ఇపుడు భూమిలో ఆ దీక్షను అనేక విధములుగా దుర్బలము చేయును. ఇది తన కులమునకు చేసిన నిష్కృతి అగును అనిపించును. అంతట భగవంతుడైన వశిష్ఠుడు తండ్రిచే వదిలిపెట్టబడిన సత్య వ్రతుని వారించెను. “తరువాత ఈతనిని రాజ్యమునందు ప్రభువుగా అభిషేకింతును” అనెను. రాజపుత్రుడైన సత్యవ్రతుడు బలియై పండ్రెండేడులు దీక్షను వహించుచు, మాంసము లేకపోగా, మహాత్ముడైన వశిష్ఠునియొక్క సర్వకామములను విదుకు ధేనువును జూచెను. కోపమువల్లను, మోహమువల్లను, శ్రమవల్లను, ఆకలిగొన్నవాడై దస్యుధర్మమును పొంది మహాబలియై దానిని చంపెను. దాని మాంసమును అతడు తాను తినెను. విశ్వామిత్ర పుత్రులకు తినిపించెను. అది విని అప్పుడు వశిష్ఠుడు అతనిని వదిలిపెట్టెను. భగవంతుడైన వశిష్ఠుడు రాజపుత్రుడగు సత్య వ్రతునితో ఓ క్రూరుడా! పురుషాధముడా! నీకు మూడు శంకువులు లేని పక్షమున లోహమయమైన నీ శంకువును (మాలాపరాధ కీలమును) పడగొట్టుచున్నాను. తండ్రియొక్క అసంతోషమునను, గురువు యొక్క ధేనువును చంపుట చేతను, అప్రోషితమును ఉపయోగించుటచేతను, నీవు మూడు విధములు క్రమమును తప్పితివి” అని ఈ విధముగ మహాతపస్వి వశిష్ఠుడు మూడు శంకువులను చూచి అతనిని త్రిశంకువు అనెను. కావున అతడు త్రిశంకువనబడెను. తపము నుండి వచ్చిన విశ్వామిత్రుడు తన భార్యను భరించినందున సంతుష్టుడై త్రిశంకువునకు వరమును ఇచ్చెను. వరముచే సంతసింపజేసిన రాజపుత్రుడగు సత్యవ్రతుడు (త్రిశంకువు) విశ్వామిత్రుని గురువుగా వరించెను. ఆ పండ్రెండేళ్ల అనావృష్టి భయముపోగా, తండ్రియొక్క రాజ్యమున అభిషేకించి విశ్వామిత్రుడు సత్యవ్రత త్రిశంకువుతో యజ్ఞము చేయించెను. ప్రభువైన విశ్వామిత్రుడు దేవతలును వశిష్ఠుడును చూచుచుండగనే ఆ సత్యవ్రత త్రిశంకువును అపుడు సశరీరముగ స్వర్గమున అధిరోహింపచేసెను. చూచుచున్న వశిష్ఠునకు అది అద్భుతముగ తోచెను. విశ్వామిత్ర అనుగ్రహమున త్రిశంకువు స్వర్గమున విరాజిల్లుచున్నాడు. దేవతలతో పాటు మహాతేజము అనుగ్రహించుటచే ఆ బుద్ధిమంతుడు అగు త్రిశంకువు యొక్క అబల స్త్రీ హేమంతమున చంద్రమండితయై రమ్యయై మెల్లిగా చేరినది. ఆమె మూడు భావములచే అలంకృతయైనది. త్రిశంకు గ్రహణముచే అలంకరింపబడినది అని జనులు ప్రశంసించిరి. త్రిశంకువునకు కేకయ వంశమున బుట్టిన ‘సత్యరత’ భార్య అయ్యెను. ఆమె పాపరహితుడైన హరిశ్చంద్రుని కుమారునిగా కనెను.

ఆ రాజైన హరిశ్చంద్రుడు త్రైశంకవుడని వినికిడి. రాజసూయ యాగమును చేసినవాడు సమ్రాట్టని ప్రసిద్ధి చెందినవాడు. హరిశ్చంద్రుని కుమారుడు రోహితుడు అను పరాక్రమవంతుడు. తరువాత రోహితునకు హరితుడు, హరీతునకు చుంచువు, చుంచువునకు విజయుడు సుదేవుడు అను ఇరువురు పుత్రులు కలిగిరి. సర్వ క్షాత్రమును జయించినందున మొదటివాడు విజయుడు అనబడెను. అతనికి పుత్రుడు రురుడు. అతడు ధర్మార్ధ కోవిదుడైన రాజు. రురునకు ధృతకుడు పుత్రుడు. అతనికి బాహువనువాడు పుట్టెను. బాహువు హైహయములచేత (హేహయరాజ్యపువారు) తాలజంఘుల చేతను (తాటి వృక్షముల వంటి పిక్కలు గలవారిచే), నిరస్తుడైన వ్యసనవంతుడైన (చెడు అలవాట్లు గల) రాజు కలిగెను. అతడు శకులచేతను, కాంబోజులచేతను, పారదులచేతను, పహ్లవులచేతను తిరస్కరింపబడెను. అట్లే ధర్మమయమైన సత్యయుగమున అతడు ధార్మికుడు కాకుండెను. ఆ బాహువునకు కరముతో (విషముతో) జనించిన సగరుడు పుట్టెను. భృగువు యొక్క ఆశ్రమమును చేరి తుర్వసునిచే రక్షింపబడెను. సగరుడు అను ఆ రాజు భార్గవునినుండి ఆగ్నేయాస్త్రమును పొంది, భూమి పైకి వెళ్లి, హైహయములతో పాటు తాలజంఘులను కూడ సంహరించెను. అచ్యుతుడై (చ్యుతిలేనివాడై). ధర్మవేత్తయైన అతడు క్షత్రియుల యొక్కయు, అట్లే ఆ పారదుల యొక్కయు ధర్మములను నిరసించెను.

ఋషులు ఇట్లు అనిరి:

ఆ సగరరాజు విషముతో ఎట్లు పుట్టెను? అచ్యుతుడైన సగరుడు కోపించినవాడై మహౌజస్కులైన శకాది క్షత్రియుల యొక్క కులోచితములైన ధర్మములను ఏల నిరసించెను?

అని అడుగగా సూతుడు ఇట్లు అనెను:

పూర్వము వ్యసనవంతుడైన బాహువుయొక్క రాజ్యము శకులతో పాటు వచ్చిన హైహయుల చేతను, తాలజంఘులచేతను అపహరింపబడినది. యవనులు, పారదులు, కాంభోజులు, పహ్లవులు, హైహయులకై పరాక్రమించిన వీరు ఐదు గణములుగా అప్పుడు ఉండిరి. బలవంతులైన ఈ క్షత్రియ శ్రేష్ఠులచే బాహు రాజ్యము అపహరింపబడినది. అపహరింపబడిన రాజ్యముకల బాహురాజు అపుడు సన్యసించి వనమున భార్యతోసహ ప్రవేశించి ధర్మాత్ముడై తపమాచరించెను. కొంతకాలమునకు జలము కొరకై బయలుదేరిన ఆరాజు ముదుసలి అగుటచేతను బలము లేనివాడగుట చేతను మధ్యలోనే మరణించెను. అతని భార్యయైన యాదవి ఆతనిని (శ్మశానమునకు) వెంబడించెను. అంతకుపూర్వమే ఆమె సవతి, ఆమె గర్భమును జంపుటకై ఆమెకు విషమిచ్చి ఉండెను. ఆ యాదవియు తన భర్త చితిఏర్పరచి అగ్నిలోనికి భర్తను ఎక్కించెను. భృగువంశీయుడైన ఔర్వుడు ఆమెను చూచి కారుణ్యముతో సహగమనమును నివారించెను. ఔర్వుని ఆశ్రమమున ఆమె ఆ గర్భమున విషముతో బాటు మహా బాహువైన సగరుడను ధార్మికుని గనెను. ఔర్వుడు మహాత్మునకు జాతకర్మాదులను ఆచరించి, వేదశాస్త్రములు చదివించి తరువాత ఆగ్నేయ అస్త్రమును ప్రసాదించెను. రాక్షసులకు గూడ సహింపనలవిగాని ఆ ఆగ్నేయాస్త్రమును జామదగ్న్యునినుండి పొంది, దాని బలముచేతను తన బలముచేతను కూడిన వాడై పశుగణములను కోపించిన రుద్రునివలె, కోపించి హైహయులను చంపెను. తరువాత యవనులతో బాటు శకులను, కాంబోజులను, పారదులను, పహ్లవులను నిశ్శేషము చేయుటకు పూనెను. మహాత్ముడు వీరుడైన సగరునిచే చంపబడుచున్నవారై పైవారు అందరు శరణమును కోరిన వశిష్ఠుని యవనాదుల వధనుండి నివారించెను. సగరుడును తన ప్రతిజ్ఞను గురువచనమును విని వారియొక్క ధర్మమును నశింపచేసెను, వారికి భిన్న రూపమున కలుగునట్లుగను చేసెను. శకులను సగము తలలు గొరిగించి వదిలెను. యవనులను మొత్తము తలలను గొరిగించి వదలెను, కాంభోజులను కూడ అట్లే చేసెను. పారదులు ముక్తకేశులైరి. పహ్లవులు మీసములు ధరించిరి. ఆ మహాత్మునిచేవారు స్వాధ్యాయ వషట్కారములు లేనివారుగా చేయబడిరి. పారదులతో బాటు పహ్లవులు, శకయవన - కాంభోజులు, కేలిస్పర్శులు, మహిషికులు, దార్వులు, చోళులు, ఖసులు వీరందరు క్షత్రియ గణములు. పూర్వము వశిష్టుని వచనము వలన మహాత్ముడైన సగరునిచే ఈ క్షత్రియ గణములు తమ ధర్మమును వదలుటచేత వేరొక ధర్మము స్వీకరింపబడినది. అట్టి సర్వ ధర్మవిజేతయైన సగరరాజు ఈ వసుంధరను జయించి అశ్వమేధయాగ దీక్షితుడై యజ్ఞాశ్వమును చరింపజేసెను. ఆ విధముగ చరింపచేయబడిన ఆ అశ్వము అగ్నేయ సముద్రమున చెలియలికట్ట సమీపమున అపహరింపబడి భూమిలోనికి కొంపోబడినది. ఆ సగర రాజు తన కుమారులందరిచే ఆ దేశమును త్రవ్వించెను. వారు మహా సముద్రమున అంతర్భాగమున ఆదిపురుషుడును, దేవుడును, హరియును, కృష్ణుడును, ప్రజాపతియును, విష్ణువును, కపిల రూపముతో ఉన్న హంస స్వరూపియునైన నారాయణుని దర్శించిరి. ఆతని నేత్రమును చూడ అందు తేజము ఉద్భవిల్లెను. అపుడు ఆ పుత్రులు అందరును ఆ తేజముతో దహింపబడిరి. కాని నలుగురు మాత్రము మిగిలిరి. వారు బర్హికేతువు, సకేతువు, ధర్మరతుడు, శూరుడు - అనువారు. ఈ అయిదుగురు సగరునికి వంశకరులు. భగవంతుడు, హరియైన నారాయణుడు అతనికి తన వంశము యొక్క అక్షయత్వమును, నూరు అశ్వమేధయాగములను, విభువైన సముద్రుని పుత్రునిగను, అక్షయమైన స్వర్గ నివాసమును వరములుగా ఇచ్చెను. ఆ సముద్రుడు అశ్వమును తీసికొని నమస్కరించెను. సరిత్తులకు పతియైన ఆ సముద్రుడు సగరుని ఆ కర్మవల్ల సాగరత్వమును పొందెను. సముద్రుని నుండి అశ్వమేధిక అశ్వమును పొంది రాజైన సగరుడు మరల మరల నూరు అశ్వమేధములను చేసెను. అశ్వమును అనుసరించిన అరువది వేల సగర పుత్రులు దహింపబడిరి. నారాయణ తేజము ప్రవేశించి దహింపబడిన మహాత్ములైన ఆ (సగర) పుత్రుల సంఖ్య అఱువది వేలు.

ఋషులు ఇట్లు అనిరి:

రాజైన సగరునకు ఏ విధానముతో అరువది వేల పుత్రులు జనించిరి? తెలుపుడు.

సూతుడు ఇట్లు అనెను:

సగరునకు ఇరువురు భార్యలు ఉండిరి. వారు తమ పాపములను తమ తపముచే నశింపచేసికొనిరి. అందులో పెద్దది విదర్భరాజు కూతురు పేరు ‘కేశిని’. అతని చిన్నభార్య పరమ ధర్మాత్మురాలు, అరిష్టనేమి కూతురు, భూమిలో సాటిలేని సుందరి. వారిరువురు తపముచే ఆరాధింపగా ‘ఔర్వ’ముని వారికి మొదటి భార్య వంశకర్తయై యష్టుడైన పుత్రుని కనగలదు. రెండవభార్య అరువది వేల పుత్రులను కనగలదు - అని వరము ఒసగెను.

మునివచనమును విని కేశిని శ్రేష్ఠయై రాజ సభలో వంశకర్తయైన పుత్రుని వరముగా ఔర్వుని నుండి గ్రహించెను. అట్లే సుపర్ణ భగినియైన రెండవ భార్య సుమతియు తనబుద్ధిని అనుసరించి ఆ మహాత్ముడైన ఔర్వునినుండి వరముగా అరువది వేల పుత్రులను గ్రహించెను. తరువాత కొంతకాలమునకు జ్యేష్ఠ భార్య కకుత్ స్థ వంశజుడు, సగరపుత్రుడు, అసమంజుడని పిలువబడిన జ్యేష్ఠ పుత్రుని కనెను. యశస్వినియైన రెండవ భార్య సుమతియు, గర్భరూపమైన సొరకాయను కనెను. ఆ సొరకాయ మధ్యనుండి అఱువది వేల పుత్రులు గర్భములుగా బయలువెడలిరి. రాజు నేయినింపిన కుండలలో ఆ గర్భములను ఉంచునట్లుగా చేసెను. తరువాత అరువది వేల దాదులను ఒక్కరొక్కరుగా వారి పోషణమునకై నియోగించెను. తొమ్మిది మాసముల తరువాత ఆ ఘృతకుంభముల నుండి సగర ప్రీతి వర్ధనులైన పుత్రులు బయలువెడలిరి. చాలకాలమునకు వారు యౌవనము నందిరి. యజ్ఞాశ్వమును వెంబడించు ఆ అరువది వేల పుత్రులలో జ్యేష్ఠుడైన సగర పుత్రుడు, నరశ్రేష్ఠుడు, అసమంజుడని పేరుకాంచినవాడు, నెమలి ధ్వజముగా కలవాడు, మహాబలుడును పౌరుల అహితమును పూనుకొన్న వాడగుటచే పూర్వము ఆతడు తండ్రిచే వెడలగొట్టబడెను. ఆ అసమంజుని పుత్రుడు బలపరాక్రమవంతుడైన అంశుమంతుడు, అతని పుత్రుడు ధర్మాత్ముడు దిలీపుడు అని ప్రసిద్ధిచెందినవాడు. దిలీపునకు మహాతేజస్వి, వీరుడుఅయిన భగీరథుడు పుట్టెను. యజ్ఞము చేయు ఆ భగీరథునకు విమానములతో అలంకరింపబడి నదీశ్రేష్ఠయైనగంగ సముద్రుని వలన కూతురుగా కల్పింపబడెను. ఈ సందర్భమున పౌరాణిక జనులు భగీరథుడు తన కర్మలచే ఆ గంగను తీసికొనివచ్చెను. కావున గంగను భాగీరథి (భగీరథపుత్రి) అందురు. భగీరథసుతుడు శ్రుతుడనువాడు. నాభాగుడు ఆతని పుత్రుడు. ఈతడు నిత్యము ధర్మ పరాయణుడు. ఆతని పుత్రుడు అంబరీషుడు. అతనికి సింధుద్వీపుడు కలిగెను.

నాభాగపుత్రుడైన అంబరీషుని భుజములచే పరిపాలింపబడిన భూమి ఆధి భౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మిక తాపములతో సంపూర్తిగా వదలబడినదై, సుఖముగా ఉండెను. సింధుద్వీపునకు వీర్యవంతుడైన అయుతాయువు పుత్రుడు. అయుతాయు పుత్రుడు మహాయశస్వియైన ఋతుపర్ణుడు. ఈతడు దివ్యాక్షముల హృదయము దెలిసిన రాజు, నలుని సఖుడు, బలవంతుడును కూడా. పురాణములలో దృఢవ్రతులైన నలులు ఇరువురు చెప్పబడిరి. వీరసేన పుత్రుడు. ఇక్ష్వాకు కులమును ఉద్ధరించినవాడు. ఋతుపర్ణుని పుత్రుడు సర్వకాముడై జనేశ్వరుడుగా ఉన్నవాడు ఒక నలుడు. అతని పుత్రుడు సుదాసుడు అతడు హంసముఖుడు అను రాజు. సుదాసుని పుత్రుడు సౌదాసుడు అను రాజుగా చెప్పబడెను.

ఆతడు కల్మాషపాదుడు అను పేర ప్రసిద్ధుడు, మిత్రసహుడు, కల్మాషపాదుని క్షేత్రమున ఇక్ష్వాకుకుల వృద్ధికై వశిష్ఠుడు అశ్మకుని జనింపచేసెను. అశ్మకునకు ఉరకాముడు ఆతనికి మూలకుడు అను పుత్రులు. మూలకరాజును గూర్చి మూలకరాజు ఈశ్వరుడైనను పరశురాముని భయముచే వివస్త్రుడై నారీకవచముగా స్త్రీ పరివృతుడై తన రక్షణకొరకు నివసించెను అని ఈ విషయము చెప్పెదరు. మూలకునకు ధర్మాత్ముడై రాజైన శతరథుడు పుత్రుడు. ఆ శతరథునకు బలియైన ఇడవిడుడు అను రాజు పుత్రుడు. ఇడవిడుని పుత్రుడు. శ్రీమంతుడై ప్రతాపవంతుడైన కృతశర్మ పుత్రీకుడు. ఆతని పుత్రుడు విశ్వమహత్తు, అతని పుత్రుడు దిలీపుడు. అతడు ఖట్వాంగుడు అని పేరొందినవాడు. అతడు స్వర్గము నుండి ఇటకు (భూమికి) వచ్చి ముహూర్త కాలము ప్రాణమును పొంది సత్యముచేతను, వృద్ధిచేతను, ముల్లోకములను జోడింపచేసెను. అతని పుత్రుడు దీర్ఘబాహువు. అతనికి రఘువు పుట్టెను. రఘువునకు అజుడు పుట్టెను. అతనికి వీర్యవంతుడైన దశరథుడు పుట్టెను. ఆతనికి ఇక్ష్వాకుకులమును ఆనందింపచేయు రాముడు కలిగెను. రాముడు దశరథ పుత్రుడు వీరుడు, ధర్మజ్ఞుడు, లోకప్రసిద్ధుడు, భరతుడు, లక్ష్మణుడు, మహాబలుడైన శత్రుఘ్నుడును దశరథునికి పుట్టిన ఇతరపుత్రులు. శత్రుఘ్నుడు మధుపుత్రుడైన లవణుని చంపి మధువనమునుచేరి అతని పట్టణమైన మధురలో ప్రవేశించెను. సుబాహువు, శూరసేనుడు అను ఇరువురు విదేహరాజ పుత్రులు, శత్రుఘ్నునితో కూడినవారై మధురా పురిని పాలించుచుండిరి. అంగదుడు, చంద్రకేతువు ఇరువురు లక్ష్మణునిపుత్రులు. హిమవ త్పర్వత ప్రాంతమున వారి జనపదములు విశాలమైనవి. అంగదునకు ‘అంగదీయా’ అను పట్టణము కారపథ దేశమున కలదు. మల్లుడైన చంద్రకేతువునకు ‘చంద్రవక్త్ర’ అను పురి శుభమైనది కలదు. భరతుని పుత్రులు ఇరువురు వీరులు. తక్షుడు, పుష్కరుడు అనువారు. ఆ మహాత్ముల పట్టణములు గాంధార దేశమున ఉన్నవి. తక్షునకు దిక్కుల యందు ప్రసిద్ధిగాంచిన రమ్యమైన తక్షశిల అను పట్టణము కలదు. వీరుడగు పుష్కరునకు కూడ ప్రసిద్ధమైన పుష్కరావతి అను పట్టణముకలదు. పురాణవేత్తలైన జనులు రాముని ఈ గాథను గానము చేయుదురు. మహాబుద్ధిశాలియైన రాముని మాహాత్మ్యము వలన సత్త్వములును, అర్థములును రామునియందే నిబద్ధమై ఉన్నవి. అతడు శ్యాముడు (నల్లని సుందరుడు) యువకుడు, ఎఱ్ఱని కన్నులు గలవాడు, తేజముతో వెలిగిన ముఖము కలవాడు, మితముగ మాటాడు వాడు, ఆజానుబాహువు (మోకాళ్ల వరకు పొడవైన చేతులు కలవాడు, మంచి ముఖముతో అనుకూలుడు, సింహము వంటి స్కంధము (మూపురము) గలవాడు, మహాభుజములు కలవాడు. ఋగ్వేద, సామవేద, యజుర్వేదముల ఘోషము (ధ్వనియు) ధనువు యొక్క నారి యొక్క ఠంకార ధ్వనియు రెండే మహాధ్వనులు వెలుగు నట్లుగా రాముడు పదివేల ఏండ్లు రాజ్యము చేసెను. అతని రాష్ట్రమున ఎప్పుడు నెడతెగ కుండగా “ఈయబడుగాక, భుజింప బడుగాక (ఈయుడు, తినుడు)” అను మాటలు పలుకబడుచుండును. జనస్థానమున ఉండుటచే దేవతల కార్యములను నిర్వహించెను. ఆ మానవ శ్రేష్ఠుడు మహాయశస్వి. పూర్వము సీతయొక్క స్థానమును వెదకి వెంటాడుచు అపరాధముచేయు పులస్త్యకుల సంభూతుడైన రావణుని చంపెను. సత్త్వవంతుడై, గుణసంపన్నుడై, తనతేజముతో వెలుగు చున్నవాడై సూర్యాగ్నులనుమించి దశరథ పుత్రుడైన రాముడు ప్రకాశించెను. ఈ విధముగనే మహాబాహువై ఇక్ష్వాకు కులనందనుడై విభువైన రాముడు రావణుని తనగణములతో పాటు సంహరించి స్వర్గమును ఆక్రమించెను. శ్రీరామునకు పుత్రులు కలిగిరి. వారిలో ఒకడు కుశుడు, మరొక పుత్రుడులవుడు, మహాబలశాలి. వారి దేశములను వినుడు. కుశునిది కోశలా రాజ్యము. పట్టణము కుశస్థలి. అది వింధ్య పర్వతము చరియలందు రమ్యముగా నివేశించి ఉన్నది. ఉత్తరా కోశలలు మహాత్ముడైనలవుని రాజ్యము. లోక పసిద్ధమైన శ్రావస్తి పట్టణము. కుశ వంశమును వినుడు. కుశుని పుత్రుడు ధర్మాత్ముడైన ప్రియాతిథియైన ‘అతిథి’. అతిథి పుత్రుడు ప్రసిద్ధుడైన నిషధుడు అను రాజు. నిషుధునకు నలుడు, నలునకు నభసుడు, నభసునకు పుండరీకుడు, ఆతనికి క్షేమధన్వుడును పుత్రులు, క్షేమధన్వుని పుత్రుడు రాజై ప్రతాపవంతుడైన దేవానీకుడు. దేవానీక పుత్రుడు ప్రభువైన అహీనగుడు. అహీనగుని పుత్రుడు మహా యశస్వి అయిన పారియాత్రుడు. ఆతని పుత్రుడు దలుడు, అతని పుత్రుడు బలుడు అనురాజు. బలుని పుత్రుడు ధర్మాతుడైన ఔంకుడనువాడు. అతని పుత్రుడు వజ్రనాభుడు, అతని పుత్రుడు శంఖణుడు. శంఖనుని పుత్రుడు విద్వాంసుడైన ధ్యుషితాశ్వుడు. ధ్యుషితాశ్వుని పుత్రుడు రాజైన విశ్వసహుడు. కౌశల్యుడు, కోశల దేశాధిపతియైన విశ్వసహుని పుత్రుడు హిరణ్యనాభుడు. అతని పుత్రుడు వశిష్ఠుడు. సమస్త సుఖములలోను పౌత్రుడైన జైమినికి శిష్యుడు. ఆయననుండి నూట అయిదు సంహితలను అధ్యయనముచేసెను. అతని నుండి బుద్ధిశాలి అయిన యాజ్ఞవల్క్యునిచే యోగము నేర్చుకొనబడినది. అతని పుత్రుడు విద్వాంసుడైన పుష్యుడు. అతని పుత్రుడు ధ్రువసంధి. ఆతని పుత్రుడు సుదర్శనుడు. ఆతని పుత్రుడు అగ్నివర్ణుడు. అగ్నివర్ణునకు శీఘ్రుడు. శీఘ్రునకు మనువు పుత్రులు. మనువు యోగమును వహించి కలాప గ్రామమున నిలిచెను. అతడు పందొమ్మిదవ ప్రయోగమున క్షత్రప్రావర్తకుడైన ప్రభువు అయ్యెను. మనుపుత్రుడు ప్రసుశ్రుతుడు. ఆతని పుత్రుడు సుసంధి. సుసంధికి అమర్షుడు పేరుగల సహస్వంతుడు పుత్రుడు. సహస్వంతుని పుత్రుడు రాజైన విశ్రుతవంతుడు. ఆ విశ్రుతవంతునకు పుత్రుడు రాజైన బృహద్బలుడు. వీరు ఇక్ష్వాకు వంశపుత్రులు సామాన్యమున రాజు అనబడిరి. ఈ వంశమున ముఖ్యులు ఎవరో వారే ప్రాధాన్యముతో చెప్పబడిరి. ఆదిత్యుడైన వివస్వంతుని (సూర్యుని) యొక్క ఈ సృష్టిని చక్కగా పఠించువాడు సంతానవంతుడై వైవస్వతమనువు యొక్క సాయుజ్యమును పొందును. ప్రజలకు పుష్టిని ఇచ్చు యమదేవుని అనుగ్రహమును పొంది, పాపరహితుడై, వీరజుడై, ఆయుష్మంతుడై అచ్యుతుడు అగును.