వాయు మహా పురాణము
భువన విన్యాసము - 13
సూతుడు అనెను:
భారత దేశమునకు దక్షిణము వైపున గూడ పదివేల యోజనముల వైశాల్యముగల సముద్రమును దాటిన తరువాత ఉన్న భూమి విశేషమును వినుడు. అచట మూడువేల యోజనముల పొడవు గలిగి ఒక వేయి యోజనముల వెడల్పు గల్గి నానా పుష్ప - ఫలముల వృద్ధిగలిగి, మెఱుపులు గలిగి మహాశైలమైన ఒక కుల పర్వతము గలదు. ఆ పర్వతము యొక్క అనేక శిఖరములచేత ఆ ద్వీపము చక్కగా అలంకరింపబడినది. అచట నిర్మలములై తీయనైన జలములుగల వేల నదులు కలవు. ఆ ద్వీపముయొక్క బావులు గూడ నిర్మల జలములుగలవి. ఆ పర్వతము యొక్క పొడవు, వెడల్పుతో విశాలములై అనేక ఛిద్రములు (నిర్మితములైన గుహా రంధ్రములు) కలవు. వానియందు అంతటను నరనారులచే సంతుష్టములై ఒప్పి సమృద్ధములైన అనేక ఆకారములు (చెక్కిన మూర్తులు చిత్రించిన చిత్రములు) గలవు. ఆ ఆకారములున్న వాని పై భాగములకు బ్రవేశించు మార్గములే ద్వారములు వేలు నూర్లు గలవు. పర్వతాం తర్గతముగా పురములు చక్కగా కూర్చబడినవి. ఒకే ద్వారములు గలవైనను, పరస్పరము సుసంబద్ధములుగా చేయబడినవి. అచటి ప్రజలు పొడవైన మీసములు, గడ్డములునుగల వారు. జన్మించిన వారందరును ఎనుబదియేండ్ల పరమ ఆయుష్యము గలవారు. నల్లనై మేఘములతో సమానమైన కాంతి గలవారు. కోతులతో సమానమైన ధర్మము (ఆచరణము) గల వారు, ఫలములు, మూలములను తినువారు. ఎడ్లవంటి వారై శౌచాచారములను వదిలినవారు. చెప్పుచేతలు లేనివారు. ఆ ద్వీపము క్షుద్ర మానుషులైన మనుజులచే నిండినది. ఈ విధముగా అంతర ద్వీపములు ఆనుపూర్వకముగా వివరింపబడినవి.
ఇరువది, ముప్పది, ఏబది, అఱువది, ఎనుబది, నూరు, వేయి యోజనములలో అంతటను వెడల్పై పొడవైనవియునై అనేక ప్రాణులతో నిండినవై నెమళ్ళ ద్వీప భాగములు గల క్షుద్ర ద్వీపములు వేలకొలది కలవు.
జంబుద్వీప ప్రదేశమున కంటె వేరుగా వివిధాశ్రయములై నానారత్నములకు గనులై, భూమిపై మరి ఆరు ద్వీపములు గలవు. అవి అంగద్వీపము, యమద్వీపము, మలయ ద్వీపము, శంఖద్వీపము, కుశద్వీపము, వరాహద్వీపము అనునవి. అంగ ద్వీపమును గూర్చి వినుడు. అది అనేక సంఘములతో నిండినది. అనేక మ్లేచ్ఛ గణములతో వ్యాపించినది. అది మహావిశాలమైనది. భూమిలో బంగారము పగడములును నిండిన రత్నములకును నెలవు అయినట్టిది. నదీ శైలవనములతో చిత్రమైనది. ఉప్పు సముద్రముతో సమానమైనది. అందు చటచక్రగిరి అను పర్వతము కలదు. అది అనేకములైన సెలయేరులను, గుహలునుకలది. దాని గుహ పెక్కు మృగ జీవనములకు ఆశ్రయమైనది. అది నాగదేశ మధ్యమున ఉన్న అనేక ప్రదేశములుగల మహాపర్వతము. దాని శిఖరములు నాగములకు నిలయములు. అది నదనదీపతియగు సముద్రము వరకు వ్యాపించినది.
యమ ద్వీపము అను ద్వీపము పెక్కు రత్నముల గనులతో వ్యాపించినది. అచట గూడ ధాతువులతో అలంకరింపబడిన ‘ద్యుతిమాన్’ అను పర్వతము గలదు. అది నదులకు ఉత్పత్తి స్థానము. బంగారమునకుకూడ పుట్టు స్థానము.
మలయ ద్వీపముకూడ ఇట్లే చక్కగా చుట్టబడి ఉన్నది. అది మణిరత్నములకు నెలవైనది. విశాలమైనది, బంగారమునకుకూడ నెలవు, చందన వృక్షములకు నిలయము. అట్లే సముద్రములకును నిధి. పెక్కు మ్లేచ్ఛ గణములతో వ్యాపించినది. నదులు, పర్వతములు వీనిచే అలంకరింపబడినది. అచట శ్రీమంతమైన సుమలయ పర్వతము కలదు. అది వెండికి నెలవు. మహామలయమని ప్రసిద్ధి జెందిన శ్రేష్ఠమైన పర్వతము. భూమిలో రెండవ మందర పర్వతమని పేరొందినది. అచట దేవ రాక్షసులచే నమస్కరింపబడిన అగస్త్యుని భవనముకలదు. అట్లే బంగారు పాదము (ప్రత్యంత పర్వతము) గల మరొక మలయపర్వతము, గడ్డిచే తెల్లనైన పొదలకు ఆశ్రయమై, పుణ్యాత్ములతో సేవింపబడి ఉండును. అనేక పుష్పఫలములతో కూడినదై స్వర్గమున కంటె మిన్నయైనది. అచట రవి సంక్రాంతులు మొదలగు ప్రతి పండుగలందును ఎల్లప్పుడు స్వర్గమే దిగివచ్చును. అట్లే మూడు శిఖరములకు నెలవై అనేక ధాతువులచే అలంకరింపబడి, అనేక యోజనముల ఎత్తు కలిగి, చిత్రములైన చరియలు, గుహాగృహములును కలిగి, రమ్యమైన సుమలయ పర్వతము యొక్క శిఖర భాగమున, బంగారు కోటగోడలును, బురుజులును కలిగిన భవనములు ఉండును. దాని నాగవాసములందును, గోడలయందును చిత్రములు గలవు, ధనిక భవనముల, రాజభవనముల వరుసలు గలదై నూరు యోజనముల విస్తీర్ణము, ముప్పది యోజనముల పొడవుతో ఉండి నిత్య సంతోషము కలిగించుచు, విశాలముగా ఉండు లంక అను పురి కలదు. అది కామరూపులై, మహాత్ములైన రాక్షసులకు స్థానము. బలముచే మదించిన వారికి నివాసస్థానము. అది దేవ శత్రువులు అగు రాక్షసులకు నివాసము. సంకుచితములుకాక విశాలముగా ఉండు ఆ మహాపురి మానుషులకు చేర అలవికానిది, సముద్రమునకు తూర్పున, ఆ ద్వీపము యొక్క తీరమున గోకర్ణుడు అను పేరుగల శంకరుని గొప్ప ఆలయముకలదు.
అట్లే ఒకే రాజ్యముగా ఉన్నది శంఖద్వీపము అని పిలువబడును. అది నూరు యోజనముల విస్తీర్ణము కలది. అనేక మ్లేచ్ఛ గణములకు నివాసము. అచట శంకర గిరియను పేరుగల పర్వతము కలదు. అది కడిగిన శంఖపు చిప్పవంటి కాంతిగలది. అనేక రత్నములకు నిధి. పుణ్యమైనది ఆ పర్వతము పుణ్యముచేసిన వారిచేత సేవింపబడినది. దానినుండి శంఖనాగ అనునది పుట్టి ప్రవహించినది. శంఖముఖుడు అను ఆ రాజు దానిని నివాసముగా చేసికొనెను.
అట్లే కుముద ద్వీపము అనేక పుణ్యములతో ప్రకాశించుచుండును. అనేక గ్రామములు వరకు అది వ్యాపించినది. అనేక రత్నములకు నెలవై, మంగళమైనది. అచట కుముదా అను మహాదేవీ దుష్ట చిత్తములను పోగొట్టుచు, మహాదేవుని సోదరిగను, ఆ (మహాదేవ) కాంతులతో పూజింపడును.
అట్లే వరాహద్వీపము అనేక మ్లేచ్ఛ గణములతో నిండినది. నానా జాతులతో వ్యాపించినది. అనేక ప్రభుత్వములు పట్టణములును కలది. ధనధాన్యములతో గూడి వృద్ధి చెందినది. ధర్మిష్టులైన జనులచే గజిబిజిగా ఉన్నది. దానియందు చిత్రములైన పెక్కు పుష్ప, ఫలములతో గూడిన, నదీపర్వత వనములచే ప్రకాశించు వరాహపర్వతము అను ఒక పర్వతముగలదు. అది రమ్యమైన పర్వతము. అనేకములైన కందకములు దరులు, గుహలు, సెలయేరులచేత ప్రకాశించినది. అవరాహ పర్వతమునుండి చక్కని రసవంతమైన జలములు కలిగి ‘వారాహి’ అను మహానది పుణ్యతీర్థ నదియై బయలు దేరినది. అది భక్తులకు వరములు ఇచ్చును. అచట బ్రాహ్మణ జన్ములు వరాహావతార రూపియై సర్వప్రభువుగా సమర్థుడైన విష్ణువునకు తదేక దేవతా భక్తులై నమస్కరింతురు. ఈ ఏడు ద్వీపముల గురించి సంపూర్ణముగా చెప్పబడినది. భారత ద్వీపదేశము దక్షిణ దిశగా బహు విస్తరము, ఒక్కటైన ఈ దేశము ఇచట ఈ విధమైన బహు ద్వీపములు కలది. ఈ విధముగా చతుర్మహాద్వీపము తనలోని ద్వీపములచే అలంకరింపబడినదైన జంబూ ద్వీపము యొక్క విస్తరము అను ద్వీపములతో పాటు ఈ విధముగ ఉండును.