పాశుపతయోజన

వాయువు పలికెను:

ఒక పూర్తి పగలుగాని, రాత్రి పగలు కలిసిన దినముగాని, సగము నెలగాని, నెలగాని, ఆరు మాసములతో గూడిన అయనముగాని, సంవత్సరము గాని, యుగములు గాని, మహాయుగ సహస్రములు గాని, ఋషులు తపస్సునందు ఉండి మహాత్ములై దివ్య చక్షువుచే ప్రాణమును ఉపాసింతురు. ఆ పైన భగవంతుడైన ప్రభువు చెప్పిన విధముగా ప్రాణాయామ ప్రయోజనమును ఫలమును చెప్పగలను. ప్రాణాయామముయొక్క ప్రయోజనములు నాలుగు అవి శాంతి, ప్రశాంతి, దీప్తి, ప్రసాదము అనునవి.

దేహమును ధరించిన ప్రాణులు ఈ లోకమునను పరలోకమునను స్వయముగా కాలమును అనుసరించి కొన్ని పనులు చేయుదురు. అవి వాని ఫలమును అనుసరించి ఘోరములు అనియు, శాంతములు అనియు రెండు విధములు. బంధు సంబంధమైన సంకరములచే తల్లి దండ్రులు దోషవంతులు అగుదురు. దానిచే వారికి జనించిన సంతా నము దుష్టమగును. కషాయ వర్ణముగా అంటిన ఆ పాపములను తపముచే శమింప చేయుట శాంతి అను తపమనబడును. ఇహపరలోక హితమునకై లోభముతోను, అభిమానముతోను చేసిన పాపములను గూడ తపమనబడును. జ్ఞానము, విజ్ఞానము సంపదగా గల ఋషులు ప్రసిద్ధులు. వారికి సూర్యుడు చంద్రుడు తారలును సమానముగా కనబడుదురు. గడిచిన వానిని రాబోవువానిని ప్రస్తుతము వర్తమానమగుచున్న వానిని జ్ఞాని సమానముగా చూడగలుగును అనగా వానియందు జ్ఞానియొక్క జ్ఞానప్రకాశము సమానము కాబడి ప్రత్యక్షము చేయును. అది దీప్తి అనుతపమనబడును. కన్ను మొదలగు ఇంద్రియములు, రూపము మొదలగు ఇంద్రియార్థములు మనస్సును ప్రాణాపానవ్యాన ఉదాన సమానము లను ఐదు వాయువులు. వీనిని ఉద్రేకము నందకుండా ప్రసన్నముగా ఉంచు తపము ప్రసాద మనబడును. ఈ విధముగా ప్రాణాయామము నాలుగు విధములుగా ఉండు మొదటి ధర్మము. దీనికి ఫలము అతి సమీపములో ఉండును. ఇది ప్రసన్నమైన కాలమున అప్పటికప్పుడు కలుగును.

ఆపైన ప్రాణాయామ లక్షణమును చెప్పుదును. శరీరతత్త్వమును అనుసరించి తగిన ఆసనములో ఉండవలెను. చిత్తవృత్తులను (మనోవ్యాపారములను) నిరోధింపవలెను. ఓంకారమును ఉచ్చరించి, చంద్ర సూర్యులకు ప్రణమిల్లి, స్వస్తిక ఆసనమును గాని పద్మాసనమునుగాని, అర్థాసనముగాని వేసి ఉండవలెను. సమముగా మోకాళ్లు ఉండు నట్లుగాగాని, ఒకే మోకాలుండునట్లుగగాని, వెల్లికిలనుండిగాని, చక్కగా కూర్చున్నవాడై గూనితో ఒడుదుడుకులుగాకాక సమముగా కూర్చొన్నవాడై, రెండు పాదములు ముడిచి దృఢమైన ఆసనమున ఉండవలెను. తరువాత నోరు మూసుకొని క్రిందుగా అర్థ నిమీలిత నేత్రుడై ఱొమ్మను ముందుకు నిక్కబొడిచి, కాలిమడమలతో వృషణములను, లింగమును కప్పి కూర్చొనవలెను. తరువాత తలను మెడను కొద్దిగా ఎత్తవలెను, తన ముక్కు చివరకు చూడవలెను. దిక్కులు చూడరాదు. తమోగుణమును, రజోగుణముతో కప్పి, సత్వ గుణముతో రజోగుణమును కప్పివేయవలెను. తరువాత సత్వగుణములో ఉన్నవాడై చిత్త వృత్తుల నిరోధించుచు సమాధిలో ఉండవలెను. ఇంద్రియములను వాని విషయములైన రూపాదులను, మనస్సును, ప్రాణాదులైన ఐదు వాయువులను అంతర్ముఖముగా లాగి, వానిని వెనుదిరుగునట్లు చేయుటకు ఆరంభింపవలెను. వానిని కరిగి యేకాగ్రముగా చిత్తమున లయమగునట్లు చేయవలెను. తాబేలు తన అంగములనులోనికి ముడుచుకొను నట్లు కోరికలను అన్నింటిని ఉపసంహరించుకొన్నవాడు అత్మయందే రతుడై ఆత్మలో పరమాత్మను చూడగలడు. శరీరమును (వాయువుచే నింపి బాహ్యాంతరముల పరిశుద్ధుడై కంఠమునుండి బొడ్డువరకు కలుపు యోగముచేత ప్రత్యాహారము అను వాయువును పీల్చు కొనుటను ప్రారంభింపవలెను.

కనురెప్పపాటువేసి తెరచునంత కాలము కలామాత్రయని తెలియవలెను. అట్లే ప్రాణాయామము పండ్రెండు మాత్రల కాలము చేయవలెను. పండ్రెండు (మాత్రల) పొడ వైనది ధారణ (చిత్తమునొకచోట నిలుపుట). రెండు ధారణలు యోగము. అట్టి యోగముతో కూడినవాడు ఐశ్వర్యమును (ఈశ్వరత్వమును) పొందును. తన తేజముతో దీప్యమానుడైన పరమాత్మను చూచును. నియతాత్ముడై ప్రాణాయామయుక్తుడైన బ్రాహ్మణునకు సర్వ దోషములు నశించును.వాడు సత్త్వగుణమునందు ఉన్న వాడగును.

ఈ విధముగా నియతమైన ఆహారము గలవాడై, ప్రాణాయామపరాయణుడై భూమిని ఎప్పుడు జయించి, మునియై, అధిరోహింపవలెను. మహా భూమిని జయింపనిచో అది బహుదోషములను పుట్టించును. సమ్మోహమును కలుగజేయును. కావున జయింపని భూమిని అధిష్టింపరాదు. అస్త్రరూపమైన నాళముచే బలముతో కూడినవాడై ప్రయత్నముతో నీరును సంపూర్ణముగా త్రావిన విధమున, శ్రమను జయించినవాడై వాయువును జయింపవలెను. నాభియందు, హృదయమున, కంఠమున, వక్షః స్థలమున, ముఖమున, నాసాగ్రమున అట్లే నేత్రమున, కనుబొమ్మల మధ్యన, ఆ తరువాత శిరమున దానికి కొంచెము పైనున్న పరమునందు ప్రాణమును మనస్సును నిలిపి ఉంచుట ధారణ అనబడును. ప్రాణపానములను చక్కగా అరికట్టి నిలుపుటచేత అది ప్రాణాయామము అనబడును. మనస్సును నిలుపుట ధారణ అనబడును. విషయములనుండి మనస్సును మరల్చుట ప్రత్యాహారమని చెప్పబడును. అన్నింటియొక్క సమూహమునందైతే అది యోగలక్షణ (రూప)మైన సిద్ధియగును. ఆ సిద్ధిచే కలిగిన యోగము యొక్క ధ్యానము సిద్ధి లక్షణ (రూప) ము ధ్యానయుక్తుడై సూర్యచంద్రులవలె ఎల్లప్పుడు ఆత్మను జూడవలెను.

సత్త్వము కలుగనప్పుడు దర్శనముకలుగదు. తగని దేశమునను తగని కాలమునను జరిపిన యోగమునకు దర్శనముండదు. అగ్ని దగ్గర, వనమున, ఎండిన ఆకుల కుప్ప యందు, అట్లే జంతువులు తిరుగాడు చోట, శ్మశానమున, పాడుబడిన గోశాలయందు, నాలుగు దారులు కలిసిన చోట (చౌరాస్తాలో) శబ్దముల అలజడి ఉన్నచోట, భయమున్న చోట రచ్చమ్రానులు పుట్టలు వీని సమూహము ఉన్నచోట, నీరుత్రావు బావిదగ్గర, అట్లే నదిలో బాధగలుగుచోటను ఎప్పుడును యోగమును పూనరాదు. ఆకలి బాధతో ఉన్నవాడు, సంతోషము లేనివాడు, వ్యాకులములైన కన్నులు గలవాడు, యోగమున పరమధ్యానమును చేయరాదు. కావున ఎల్లప్పుడును యోగి ధ్యానపరుడై ఈ దోషములను నిశ్చయించి తెలిసికొనవలెను. అవి ఉన్నను ప్రమాదమున యోగమును ఆచరించువానికి శరీరములో దోషములు ప్రకోపించి యోగవిఘ్న కారకములు అగును. జడత్వము (చచ్చుపడిపోవుట పక్షవాతము వంటివి) చెవిటితనము, మూగతనమును పొందును. గ్రుడ్డితనమును, స్మృతిలోపమును (మతిచెడుట), జరారోగమును, పొందును. అజ్ఞానమున పై దోషములు ఉండగా యోగమునకు పూనిన వానికి శరీరమున బహుదోషములు ప్రకోపించును. కావున శుద్ధమైన జ్ఞానముతో సమాహితుడై (ఏకాగ్ర చిత్తుడై) యోగి తన యోగమునకు పూనుకొనవలెను. ఎప్పుడును అప్రమత్తుడై (జాగరూకుడై) ఎక్కడగూడ యోగిపై దోషములను ఎంచరాదు. ఇక ఆ ప్రాణాయామము వలన కలిగిన దోషములను పోగొట్టు చికిత్సను యధాక్రమముగా చెప్పుదును.

మిక్కిలి వేడిగా ఉన్న యవల జావను నేయి కలిపి తిని తన యోగమును నిలుప వలెను. ఈ క్రమ యోగముతో వాతమువలన కలిగిన గుల్మవ్యాధి శమించును. గుదావర్త వ్యాధికి తిరుగుడుగా ఈ చికిత్స చేయవలెను. పెరుగుతో కూడిన యవల జావను తినవలెను. దాని వలన వాయువు పైకి పోవును. తరువాత వాయు గ్రంథి (ముడి)ని భేదించి వాయు దేశమున (వాయువును ప్రయోగింపవలెను. అట్లైనను విశేషములేని (కనబడని)చో యోగ ధారణమును శిరస్సున చేయవలెను. ఈ విధముగ శరీరమును యోగముతో పూన్చి స్వస్థుడైన వానికి గుదావర్త ప్రతిఘాతము కలుగగా ఈ చికిత్సను చేయవలెను. యోగమును ప్రారంభించిన యోగికి సమస్త శరీరము ప్రకంపనము చెందినప్పుడు ఈ చికిత్సను చేయవలెను. దానిచేతవాడు సుఖియగును.

వ్రతమేదైన ఉన్న మనస్సుతో దానిని చక్కగా నిలిపి, ధారణ చేయవలెను. ఉరోద్ఘాతము గలిగినచో ఉరః స్థానమును కంఠస్థానమున యోగధారణ చేయవలెను. చర్మమునకు అవఘాతము గలిగినపుడు ఆ చర్మమును వాకాస్థానమున యోగధారణ చేయవలెను. చెవుడు కలిగినప్పుడు చెవులయందును, దప్పిక కలిగినపుడు నాలుకయందును యోగధారణ చేయవలెను. తంతువులచేత మొదట స్నేహములను ఫలమును యోగి చింతింపవలెను. దానివలన యోగి సుఖియగును. క్షయ, కుష్టు, కిలాసము, (సిబ్బెము) ఈ వ్యాధులు సంభవించినపుడు సర్వసాత్వికిని ధారణ చేయవలెను. ఏయే రజో దేశమున (బాధకలు గునో) ఆయా ప్రదేశమున యోగధారణాయుక్తుడై నిర్దేశింపవలెను. యోగోత్పన్నుడైన విప్రునకు ఈ చికిత్సను చేయవలెను. యోగధారణము చేయుచున్నవానియొక్క శిరస్సును వెదురుకీలము (మేకు) తో గొట్టవలెను. శిరమున (మేకు) కీలమునుంచి కట్టెను కట్టెతో గొట్టవలెను. దాని వల్ల భయభీతునకు పూర్వస్మృతి మరల రాగలదు. లేదా స్మృతిని కోలు పోయిన వానిని చేతులతో పట్టి నిలుపవలెను. అ తరువాత స్మృతిని పొంది, శిరమున యోగ ధారణమును చేయవలెను. నేయి కలిపిన దానిని కొద్దిగా భుజింపవలెను. దాని వలన సుఖియగును.

యోగమును తెలిసినవాడు మానవాతీతమైన బలముతో (యోగమునుండి) మేలుకొనినపుడు, స్వర్ణమును, భూమిని, వాయువును అగ్ని యోగ ధారణలో నిలుపవలెను. ప్రాణాయామముచే అదియంతయు దహింపబడుచున్నదై వశమగును. అయినప్పటికిని దేహమున ప్రవేశింపవలెను, తరువాత దానిని (అవహ్య మానమును) నిషేధింపవలెను. తరువాత స్థంభించి యోగముతో శిరమున ధారణ చేయుచున్న అతనికి ప్రాణాయామాగ్నిచే దహింపబడిన దంతయు విలయమును పొందును. నల్లనాగు పాముయొక్క అపరాధమునైతే (విషమును) రొమ్మునను కడుపులోను యోగధారణము చేయవలెను. మహో లోకమును, జనలోకమును, తపోలోకమును, సత్య లోకమును, హృదయమునందు ఉంచి యోగధారణ చేయవలెను. విషము యొక్క ఫలమును (జలమును) త్రావి తరువాత విశల్యను (విషములేని దానిని) ధారణ చేయవలె అంతటను పర్వతములతో గూడిన భూమిని మనస్సున ధారణ చేయవలెను. యోగజ్ఞుడై యోగము నందు ఉన్నవాడు సముద్ర లను దేవతలను హృదయమున ధారణతో నిలిపి వేయి కుండలతో స్నానముజేయ వలెను. కంఠమువరకు నీటిలో ఉండి శిరమున యోగధారణ చేయవలెను. విషావిష్టుడైనవాడు ప్రవాహమునకు ఎదురుగా ఉండి సర్వగాత్ర ధారణను చేయవలను. సన్నగిల్లిన (బక్కచిక్కిన) యోగి జిల్లేడాకుల దొప్పలతో పుట్టమన్ను త్రాగవలెను. ఇది విషబాధితుడైన యోగికి చికిత్సా విధానము. ఇది యోగనిర్మితమై ప్రసిద్ధమైనది. యోగదృష్టమైన హేతువుచే సంగ్రహముగా వ్యాఖ్యానింపబడినది. దీనిని ఎక్కడనైనను ఎవడేని చెప్పవచ్చును. ఆ బ్రాహ్మణుని లక్షణమును తెలిసికొనుము (యోగముతో కనుగొన్న రహస్యం చెప్పరాదు). అయినప్పటికిని మోహమువలన చెప్పినచో ఆ విజ్ఞానము నాశనము చెందును కావున యోగ ప్రవృత్తిని ఏమైనను చెప్పరాదు. సత్యము శాంతిపూర్వకమైన బలము, ఆరోగ్యము, ఎక్కువగు కోరిక, రంగుయొక్క కాంతి, మంచిస్వరము, సౌమ్యత, సుగంధము, అల్పమైన మూత్ర పురీ షములు-ఇవి శరీరమున యోగమువల్ల మొదటకలుగు లక్షణములు. యోగి తనయోగ మున, తనను, భూమిని జ్వలించుచున్నట్లుగా చూచి, తన్ను వేరొకనిగా ప్రవేశించినచో, అతనికి సిద్ధి తనకడకు చేరినట్లుగా తెలిసికొనవలెను.