వాయు మహా పురాణము
శార్వస్తవం
వాయువు పలికెను:
భారత వర్షమున మునులు నాలుగు యుగములని తెలిపిరి. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము తిష్య యుగము-అని నాలుగు యుగములు. వీని వేయి వరకు బ్రహ్మకు పగలు అగును. యామాదులైన గణములు ఏడు, రోమవంతములు పదునాలుగు. తోడుగా వచ్చునవై సశరీరములై జనోలోకమును ఆశ్రయించుచున్నవి. ఈ విధముగ దేవతలు మహర్లోకమునుండి జనోలోకమును తపోలోకమును దాటగా మన్వంతరములు గడచిపోయినవి. మహౌజస్కులైన దేవతలందరు ఊర్ధ్వలోకమును జేరిరి. ఆ కల్పమునందు ఉన్న వారితో సహయోగమును బొందిరి. అపుడా దేవతలు సంకలన మును (కలయికను) బొందగా ఆ పదునాలుగు గణములు మహర్లోకములను వదలిరి. అపుడు భూతాదులు మిగిలిన స్ధావరాన్తములు, భువర్లోకము మొదలుకొని మహర్లోకము వరకున్న లోకములు శూన్యములైనవి. కల్పవాసులైన దేవతలు ఊర్థ్వలోకమున జనమును జేరిరి. దాహముతో గూడిన వర్షముచేత యుగము క్షయము కాగా పైవారి సమూహముతో బ్రహ్మను బ్రహ్మర్షిగణములను, దానవుల నందరిని సంస్థాపించును.
నేను ఇదివరకు గడచిపోయినట్లుగా చెప్పిన యేడవ కల్పము ఏడు సముద్రములు గాఢముగాకలిసి యొక్కటైన మహా సముద్రముచే భయంకరమై చీకటి నిండి విభజింప రాని యేకార్ణవము అయ్యెను. (అంతయు ఒకే సముద్రమయ్యెను) మాయతో ఆ విధముగా ఏక సముద్రము దానియందు శంఖము చక్రము గదను ధరించినవాడు, మేఘమువలె నల్లనైనవాడు, కమల నేత్రుండును, కిరీటము, శ్రీపతియు అయిన హరి, నారాయణ ముఖము నుండి వెలువడిన ఎనిమిదవ పురుషోత్తముడై యుండెను. అతడు ఎనిమిది బాహువులు గలవాడు. విశాల వక్షస్థలము గలవాడు. అతడు లోకములకు అంతటికిని కారణభూతుడని చెప్పబడుచున్నాడు. అతడు యోగముతో గూడిన యాత్మ గలవాడు చింతింప అలవిగాని యనిర్వచనీయమైన యోగమునందున్నవాడు. యోగమును తెలిసినవాడు. అతడు అది శేషుని విశాలమైన వేయి పడగల నానుకొని బంగారు పాన్పుపై పడుకొనుచున్నాడు. ఆ ఆదిశేషుడు సమస్త మహాఫణములు గల సర్పములకు అధిపతి. సాటిలేని తేజస్సు గలవాడు.
ఈ విధముగా నచట పడుకొనుచున్న సర్వసమర్థుడైన ప్రభువై అత్మారాముడైన (తనలో తానే యానందించువాడైన విష్ణువుచేత విలాసమునకై నాభి యందు కమలము సృష్టింపబడినది. ఆ కమలము నూరు యోజనముల వెడల్పయినది. ఉదయించిన సూర్యుని కాంతి గలది. వజ్రము దండము (నాళముగా) గలది. మహోన్నత మయినది. ఇట్టి కమలము ప్రభువైన విష్ణువుచే లీలగా సృష్టింపబడినది.
ఈ విధముగా నాడుచున్న యాదేవ మీఢుషుని యొక్క సమీపమునకు బంగారు బ్రహ్మాండము వలన పుట్టిన బ్రహ్మ స్వేచ్ఛగా వచ్చెను. ఆ బ్రహ్మ బంగారువర్ణము కలవాడు. ఇంద్రియములకు మించిన (ప్రత్యక్షముకాని) వాడు. నాలుగు ముఖములు కలవాడు. అట్టి బ్రహ్మ మంచిగంధము కాంతిగల క్రొత్త శోభతో గూడిన పద్మముతో నాడుకొను చున్న యా విష్ణువును జూచి ఆశ్చర్యమును బొందెను.
తరువాత నాబ్రహ్మ తన సంపూర్ణవాక్కుతో మీరెవరు? సముద్రము జలమధ్యము నాశ్రయించి పడుకొనుచున్నారు. అని తరువాత బ్రహ్మయొక్క యా శుభవాక్కును విని అచ్యుతుడు అశ్చర్యముతో విప్పారిన కన్నులు గలవాడై పాన్పునుండి లేచి కూర్చుండెను. ప్రత్యుత్తరముగా దీవి, అంతరిక్షము, భూతము పరమపదము కూడ ప్రభువైన నేనే అని ఈ విధముగా భగవంతుడు పలికి మరల నిట్లనెను. ఓ భగవాన్! నీవెవడవు? నా సమీపమునకు ఎందులకు వచ్చితివి? ఇటునుండి యెక్కడికి బోవలసి ఉన్నది? నీ నివాసము ఎక్కడ? విశ్వమూర్తిగా ఉన్న నీవు ఎవ్వడవు? నాతో నీకు పనియేమి? అని ఈ విధముగ బలుకుచున్న వైకుంఠుడైన విష్ణువుతో బ్రహ్మ ప్రతివచనము ఈ విధముగ బలికెను. వారు ఆదికర్త యైనట్లే నేను గూడ యాదికర్తయైన ప్రజాపతిని (బ్రహ్మ) సర్వము నాయందున్నవి. అని నారాయణునితో చెప్పెను.
విష్ణువు ఆశ్చర్యకరమైన బ్రహ్మమాట విని లోకవర్తనమయిన బ్రహ్మచే అనుమతింపబడినవాడై విశ్వకారణుడైన వైకుంఠుడైన విష్ణువు కుతూహలముతో మహాయోగియై యోగశక్తి గలవాడై బ్రహ్మయొక్క ముఖము నందు ప్రవేశించెను. ఆ విధముగా బ్రవేశించిన మహాతేజస్వియైన విష్ణువు సముద్రముతోను పర్వతములతోను గూడిన ఈ ఎనిమిది ద్వీపములను నాలుగు వర్ణములతో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములతో సమాకుల మైన బ్రహ్మ మొదలుకొని వారి గంట (యొక్క మధ్య భాగము) వరకు గల సనాతనములైన యేడు లోకములను, వీనినన్నింటిని బ్రహ్మ యొక్క కడుపులో జూచెను. తరువాత మహా యశస్కుడైన విష్ణువు. ‘ఆశ్చర్యమీతని తపస్సు యొక్క ప్రభావము’ అని తనలో మాటిమాటికి బలికెను. ఆ విధముగా విష్ణువు వివిధములైన లోకములను అనేక విధములైన యాశ్రమము లను తిరుగుచుండెను. వేయి యేండ్లనను విష్ణువు అప్పుడు దానికి అంతమును జూడలేదు.
అపుడు గరుడధ్వజుడైన విష్ణువు బ్రహ్మదేవుని ముఖమునుండి వెలువడెను. తరువాత శత్రువులే పుట్టని భగవంతుడైన విష్ణువు, భగవాన్, పుణ్యాత్ముడవైన నీ యొక్క కడుపు యొక్క మద్యమును, చివరను, కాల దిక్కుల యొక్క అన్తములను నేను చూడలేదు. అని ఇట్లు పలికి బ్రహ్మతో “ఓ బ్రహ్మా! ఇపుడు నీవు గూడ శాశ్వతమైన నా ఉదరము (కడుపు)ను బ్రవేశించి సాటిలేని ఈ లోకములను చూడుము” అని అనెను. తరువాత బ్రహ్మ ఆ విష్ణువు యొక్క మనోహరమైన వాక్కును విని యభినందించి లక్ష్మీపతియైన విష్ణువుయొక్క యుదర మును బ్రవేశించెను. గర్భములో బ్రవేశించి ఉండిన యా చింతింప నలవిగాని పరా క్రమముగల బ్రహ్మయాలోకములనే చూచెను. అచట తిరిగి తిరిగి ఆదిదేవుడైన విష్ణువు యొక్క గర్భములో అంతమును చూడలేదు.
సర్వాన్తర్యామియైన విష్ణువు ఆ బ్రహ్మ వెలుపలికి రానున్నాడని తెలిసి అన్ని ద్వారములు మూసి వెంటనే మహాజలసమూహమున సుఖముగా నిద్రింపదలచెను. అంత సమస్త ద్వారములు మూయబడినట్లు కనబడినవి. అంత బ్రహ్మ తన రూపమును సూక్ష్మముగాజేసి (విష్ణువు యొక్క) నాభియందు ద్వారమును తెలిసికొనెను. పద్మ సూత్రమును (తామరతూటి దారమును) అనుసరించిన మార్గములను అనుసరించి వెళ్ళి ఆ బ్రహ్మ నాలుగు ముఖముల అతామర దుంపనుండి తన రూపమును పైకిలాగి ప్రకాశింపజేసెను. అపుడు పద్మ గర్భముతో సమానమైన కాంతి గలవాడై, కమలమున ఉన్న బ్రహ్మ ప్రకాశించెను. ఇంతలో (ఈ మధ్యలో) ఆ సముద్ర మధ్యమున వారు ఇరువురికి మొత్తముమీద పరస్పరము చాలా సంతోషము కలుగుచుండెను.
సూతుడు అనెను:
తరువాత ఆదిశేషుని పడగలపైన ప్రభువై (పరుండి)న విష్ణువు ఉన్న ఆచోటికి ఇంతింతయని చెప్పనలవిగాని స్వరూపము గలవాడు, భూతములకు ప్రభువు, ఈశ్వరుడు, శూలము చేత ధరించినవాడు, బంగారు వస్త్రములు ధరించి కప్పుకొన్నవాడును ఐన మహాదేవుడు (శివుడు) వచ్చెను. వేగముగా నడచుచున్న యా శివుని పాదములచే మిక్కిలి పీడింపబడి వెంటనే యాకాశమును ఎత్తుగా లేవగొట్టబడిన లావైన (సముద్ర) జల బిందువులు (కాలివేగపు తాకిడిచే) అత్యుష్టములై (గాలిచే) అతి శీతలములును ఐనవి. అచట వాయువు మిక్కిలి ఎక్కువగా వీచెను.
ఆ మహాశ్చర్యమును చూచి బ్రహ్మ విష్ణువుతో నీటి బిందువులులావై వేడియైనవి. (వానివలన) కమలము మిక్కిలి కంపించుచున్నది. ఈ నా సంశయమును గూర్చి చేయదలచితివి చెప్పుము అని అడిగెను.
బ్రహ్మ ముఖము నుండి వెలువడిన ఈ విధమయిన మాటలను విని సాటిలేని క్రియాకారియైన రాక్షససంహారకారియై భగవంతుడైన విష్ణువు ‘ఇది ఏమిటి? ఇచట నా నాభియందు వేరొక భూతము (ప్రాణి) నివాసము ఏర్పరచికొనినది? నీకు నాచే అనిష్టము చేయబడినప్పటికిని, అది అత్యంతప్రియము (ఇష్టమైనది)గా చెప్పుచున్నారు అని మనస్సులో అనుకొని ఉత్తమముగా ఈ మాటను పలికెను. ఓ భగవన్ నీవిచట ఆ కమలమునందు ఎందులకు ఆశ్చర్యము జెందితివి. నేను నీకు ఏమి చేసితినని నీవు నాతో మిక్కిలి ప్రేమతో మాటలాడుచున్నావు? ఓ పురుషశ్రేష్ఠ! ఇట్లు ఏల జరిగినది? నిజము జెప్పుము. ఈ విధముగా జెప్పుచున్న దేవేశుడైన విష్ణువును గూర్చి కమలకాంతిగలవాడు వేదనిధి, ప్రభువు అయిన బ్రహ్మ నిజముగా జరుగు లోకయాత్రను (లోకము నడకను) బదులుగా బలికెను. నీ కోరికతో నేను పూర్వము నీ కడుపులో బ్రవేశించితిని. నీచేత నా కడుపులో సర్వ లోకములు చూడబడినట్లే నాచేతగూడ నీ కడుపులో సమస్త లోకములు జూడబడినవి. వేయి యేండ్ల తరువాత మరలిన నాకు ఓ పుణ్యుడా! నన్ను వశముజేసికొనగోరి నీవు మాత్సర్యముతో వెలుపలికి వచ్చు ద్వారములన్నియు మూసివేసితివి. తరువాత ఓ మహా భాగా! నేను నా మనస్సుతో చింతించగా (యోగధారణ చేయగా నాభిలో నాకు ప్రవేశము లభించినది. కమలనాళపు దారము నుండి వెలువలికి వచ్చుట జరిగినది. (అది విష్ణువు) ఓ భగవన్ బ్రహ్మా! నీ మనస్సునకిట్టి వ్యాఘాతము (దెబ్బ) ఏ విధముగ అయినను కొద్ది మాత్రముగూడ కలుగకుండుగాక తన పనులు వికటించినపుడు వానిని అనుకూలము చేయుటకు అనుసరించు రీతి నేను ఏపనిని చేయవలసి ఉన్నదో! ఏపనిని నీయందు నిశ్చితమయి ఉన్నదో! నిన్ను బాధింపకుండుటనుకోరి, ఆ పనిని నా ఇష్టముతోనే, ఒక మాటగా (విలాసముగా) వేగముగా నీవు వెలుపలికి వచ్చుటకు తగియున్న ద్వారములను మూసివేసితిని. కావున నీవు వేరుగా అవమానింపబడినవానిగా దలంపలదు. నీవు నాకు గౌరవింపదగినవాడవు. పూజింప దగినవాడవు. ఓ కల్యాణుడా! నేను నీకు జేసిన అప కారమును అంతయు క్షమింపుము. కావున ఓ ప్రభో! నేనే జెప్పినట్లు పద్మమునుండి క్రిందికి దిగుము. తేజోమయుడవై గురువైన (బరువైన) నిన్ను సహింపలేను. (అని విష్ణువనెను). ఆ బ్రహ్మగూడ వరమును జెప్పుము (ఇమ్ము) నేను పద్మము నుండి దిగెదను అని పలికెను.
విష్ణువు పలికెను:
ఓ శత్రునాశకుడా! నాకు పుత్రుడవు కమ్ము. శోభనమైన ముదమును (సంతస మును) బొందగలవు. నీవు సత్యధనుడవు, మహాయోగివి. (అందరిచే స్తుతింపదగిన వాడవు. ప్రణవ స్వరూపుడవు. ఇవ్వేళటి నుండి ఓ సర్వేశ! తెల్లని తలపాగా అలంకారముగా కలవాడవు. పేరుతో పద్మయోనిపై ప్రసిద్ధుడవుగా గలవు. ఓ బ్రహ్మాన్! సర్వలోకాధిపుడవైన ఓ ప్రభో! నాకు పుత్రుడవు కమ్ము అని అటు తరువాత ఆ భగవంతుడైన బ్రహ్మ కిరీటి (విష్ణువు) నుండి వరమును దీసికొని, సంతసించిన యాత్మగలవాడై, యసూయలేని వాడై అట్లే అగుగాక ఈని ఈనెను. ఇంతలో సమీపమునకు వచ్చినదియు బాలసూర్యుని కాంతి గలదియు, అత్యద్భుతమైనదియు నైన భూతమును జూచి బ్రహ్మ నారాయణునితో అనెను.
పరిమితిలేనివాడు పెద్ద ముఖము గలవాడు, కోరలు గలవాడు, విరిసిన తల వెంట్రు కలు కలవాడు, పది బాహువులు కలవాడు, త్రిశూలము (గుర్తుగా) ధరించినవాడు, మూడుకన్నులతో అన్నివైపుల ముఖములుగలవాడు. లోకమునకు ప్రభువు. సాక్షాత్తుగా వికారమయిన యాకారము గలవాడు, ముంజగడ్డితో జేసిన మొలనూలు గలవాడు, పైకి లేచిన పెద్ద పురుషాంగముచేత భయంకరముగ ధ్వని చేయుచున్నవాడు. అయిన ఈపురుషుడు ఎవడు? ఓ విష్ణో! ఈతడు తేజోరాశియై మహాకాంతి గలిగి, అన్ని దిక్కులను ఆకాశమును వ్యాపించి ఇటువైపే వచ్చుచున్నాడు. అని బ్రహ్మ విష్ణువుతో అనెను.
బ్రహ్మతో ఇట్లు చెప్పబడిన భగవంతుడైన విష్ణువు బ్రహ్మతో ఇట్లనెను. అతడు అనాదియై ప్రళయమును కల్గించు భగవంతుడైన ఈశ్వరుడు సముద్రమున నడచుచున్న యాతని కాలి అడుగుల తాకిడికి జలాశయములు వేగముతో ఎగిరి పీడింపబడినవి. ఆ నీటి గుంపులచే విష్ణువుకంటే పద్మసంభవుడైన బ్రహ్మ ఎక్కువగా తడిసిపోవుచున్నాడు. ముక్కునుండి వచ్చిన గాలిచే నీతో (బ్రహ్మతో) సహా స్వేచ్ఛగా నా నాభియందు బుట్టిన కమలము కదులుచు ఊగుచున్నది. కావున భగవంతుడైన వృషభధ్వజుని (శివుని) నీవును నేనును స్తోత్రముచే ఉపాసించెదము.
అటు తరువాత కమలకాంతిగల బ్రహ్మ కోపించినవాడై విష్ణువుతో నిట్లనెను. నీవు (నాకన్న) తక్కువైన నిన్ను లోకములకు ఉత్తమమైన యోనిగా కారణముగా తెలియవు. అట్లే నన్ను లోకకర్తయై సనాతనుడైన బ్రహ్మనుగా గూడ దెలియవు. ఓయి! ఈ శంకరుడును వాడెవడు? మన ఇరువురునకు వ్యతిరేకముగ ఉన్నాడు (అనియెను). విష్ణువా బ్రహ్మయొక్క కోపమువల్ల గలిగిన మాటను విని ఓ కల్యాణుడా! మహాత్ముడైన శంకరుని యొక్కయు ఏ వాదమును ఇట్లనకుము. కారణమేమనగా ఈతడు మాయాయోగేశ్వరుడు. ధర్ముడు తిరస్కరింప అలవిగానివాడు, వరములను ఇచ్చువాడు ఈ జగమునకు కారణుడు. పురాణ మైన పురుషుడు నాశములేనివాడు. జీవులకీతుడు జీవుడు ఒకే జ్యోతి రూపుడై ప్రకా శించును. దేవుడైన శఙ్కరుడు బాలురను ఆట బొమ్మలచేత స్వయముగా ఆడుకొను చుండును. ఈతడు నాశనములేని ప్రధానము. వ్యక్తముగాని జ్యోతి. తమోరూపమైన ప్రకృతి నిత్యము సృజించుటయే ధర్మముగల ఈతని నామములవి. దుఃఖపీడితులైన యతులచేత శివుడు యః (ఎవడు?) కః (ఎవడు) సః (వాడు) అని పిలువబడును. ఈ శివుడు బీజవంతుడు. బ్రహ్మవైన నీవు బీజము (బీజమవు) నేను సనాతనమైన యోనిని. (బీజము నిక్షేపించు స్థానమును) అని ఈ విధముగా జెప్పబడిన విశ్వాత్ముడైన బ్రహ్మ విష్ణువుతో నీ విధముగ మాటాడెను.
నీవు (విష్ణువు) యోనివి. నేను (బ్రహ్మను) బీజమును మహేశ్వరుడు బీజి (బీజము గలవాడు) ఎట్లు? ఈ సూక్ష్మమై యవ్యక్తమైన సంశయమును దీర్పగోరుచున్నాను (అని బ్రహ్మ విష్ణువును అడిగెను). లోకతంత్రము గలవాడైన బ్రహ్మచే జరుగు ఉత్పత్తిని తెలిసి విష్ణువు బ్రహ్మయొక్క సాటిలేని పై ప్రశ్నకు సమాధానముగా జెప్పెను. ఓ బ్రహ్మన్! ఈ శివుని కంటె మించిన మరొక భూతములేదు. అది మహత్తునకు పరమమైన ధామము (స్థానము) శివము, ఆధ్యాత్మకులకు అవ్యక్తుడు, సకలుడు (సమస్త స్వరూపుడు) అయిన మహేశ్వరుడు. మాయావిధిని దెలిసి ఇతరులకు చేరనలవిగాని గంభీరుడైన ఈ మహే శ్వరుని యొక్క లింగము పూర్వము నీవు (బ్రహ్మవు)బీజముగాగలది అదిసృష్టిగలది. ఆది యోనియైన నాయందు (విష్ణువునందు) చక్కగా సంపూర్ణముగా కలిసినది. (బీజ నిక్షేప చేయబడినది) కాలక్రమమున ఆ బీజము అంతులేని బంగారు (తేజో) మయమై ఆ విష్ణుయోనిలో అండముగా ప్రకాశించెను. వేయియేండ్లు ఆ అండము నీటియందు నిలుపబడినది. వేయేండ్లు చివర వాయువుచే ఆ అండము రెండుగా జేయబడినది. దాని ఒక్క కపాలము (చిప్ప) అకాశమయ్యెను. మరొక కపాలము (చిప్ప) భూమి యయ్యెను. దాని యొక్క ఎత్తైన ఉల్బముయొక్క భాగము ఈ బంగారు (మేరు) పర్వతము. తరువాత దాని నుండి మేలుకొన్న ఆత్మగల దేవుడు, దేవవరుడు, ప్రభువు, భగవంతుడైన హిరణ్యగర్భుడు (బ్రహ్మవైన నీవు) నాలుగు భుజములు గల నేను (విష్ణువును) అయితిమి.
తరువాత వేయి యేండ్ల చివర వాయువుచేత ఆ అండము రెండుగా చేయబడినది. అపుడు తారలు చంద్రుడు నక్షత్రములులేని లోకమును జూచి ఇక్కడ వీడెవడు ఉండవలెనని (శివుడు) ధ్యానింపగా ప్రియదర్శనులు (సుందరులు)మంచి శరీరము గలవారు. నీకంటె (బ్రహ్మకంటె) పూర్వమున బుట్టినవారు అయి గడచినవారునైన (యా) కుమారులు బుట్టిరి. మరల వేయేండ్ల చివర ఆ అండము నుండియే నీ యాత్మజులు (పుత్రులు), నీటి వలెను అగ్నివలెను శుద్ధులు, కమలపు రేకులవంటి కన్నులు గలవారును అయిన ఊర్థ్వరేతస్కులైన శ్రీమంతుడు సనత్కుమారుడు, ఋభువును, సనాతనుడు, సనకుడును సనందనుడు బుట్టిరి. వారు సమకాలముననే బుద్ధిచేత ఇంద్రియములచే ప్రత్యక్షముగాని వానిని (పరమాత్మను) జూచువారైరి. అట్లు పుట్టినవారు ప్రతిఘాత్ములై యప్పుడే మాట్లాడిరి. ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మికములు అను తాపత్రయములను వదిలినవారై కర్మలను ప్రారంభింపరైరి.
ఈతని (శంకరుని) శాంతమైన జీవన మరణ పునర్జన్మలు బహుకష్టములు గలవై జరా (ముసలితనము) దుఃఖములతో గూడినవి. పునఃసృష్టిలోనివి స్వప్న (ప్రాయ)ము లైనవి. అట్లే దుఃఖములును నరకములును (స్వప్న ప్రాయములైనవి) ఇది అంతయు రాబోవునది. తప్పనిసరిగా జరుగబోవునది అని సనకాదులు తెలిసికొనిరి. వారు ఋభువు సనత్కుమారుడును నీ (బ్రహ్మ)వశమున నుండినట్లు చూచిరి. ఆనీ కుమారులైన సనకాదులు మువ్వురు త్రిగుణములను (సత్వరజస్తమో గుణములను) వదిలి వైవర్త జ్ఞానముతో (ఆత్మవైపు తిరిగి జ్ఞానముతో మహాతేజోవంతులై నివృత్తులైరి (తొలగిరి). తరువాత ఆ మువ్వురు సనకాదులు తొలగిపోగా శంకరుని మాయచే నీవు (బ్రహ్మవు) విమూఢుడవు (ఏమి తెలియని వాడువు) అగదువు.
ఈ విధముగా కల్పము వికల్పముకాగా ఓ పాపరహితుడా! నీ పేరు నశించును. సూక్ష్మములు పార్థివము (భూ సంబంధమైన)లైన కల్పశేషములు గతించినవి. జగమునకు సంబంధించినట్టి ఐశ్వరీ (ఈశ్వరసంబంధమైన) మాయ తెలుపబడినది. ఈ కనబడు అ పర్వతమే దేవలోకమున మేరువని పిలువబడును. నీ ఈ మహాత్మ్యమును జూచి, తనతో తనను తెలిసికొని ఈశ్వరుని యునికిని దెలిసికొని, కమల నేత్రుడినైన (విష్ణువు) నన్ను తెలిసికొని, మహాయోగి, భూతములకు (ప్రాణులకు) వరము నిచ్చువాడు. ప్రభువు, ప్రణవ (ఓంకార స్వరూపుడు అయిన మహాదేవునిజేరి, జగద్గురువైన యాతనికి నమస్కరించి కోపించి నచో నీతడు(మహాదేవుడు) ఒక్క నిట్టూర్పుతోనే నిన్ను (బ్రహ్మను), నన్ను (విష్ణువు) దహించును అని తెలిసికొని మహాయోగమున యెత్తుగా నిలుచును. మహాబలుడవై నేను (విష్ణువును) నిన్ను (బ్రహ్మను) ముందిడుకొని అగ్ని తేజస్కుడైన శంకరుని స్తుతింతును. సూతుడు ఇట్లు పలికెను:
తరువాత ఆ గరుడుడు ధ్వజముగాగల విష్ణువు బ్రహ్మను ముందు ఇడుకొని, గడచినవి, రానున్నవి ప్రస్తుతము ఉన్నవియు నైన ఛాందసములగు వైదికములు ఛందోబంధములు నామములతో స్తోత్రమున స్తుతించెను.
భగవంతుడవైన నీకు నమస్కారము సువ్రతుడవైన నీకు నమస్కారము. అనన్త తేజస్కుడవైన నీకు నమస్కారము. క్షేత్రాధిపతి (ధీరాధిపతి)వైన నీకు నమస్కారము. బీజ వంతునకు శూలికి నీకు నమస్కారము. సాటిలేని మేడ్రము (పురుషాంగము) గలవానికి, మహోన్నతమైన పురుషాంగముగలవానికి, వైకుంఠము రేతస్సుగా గలవానికి నీకు నమ స్కారము. జ్యేష్ఠునకు శ్రేష్ఠునకు మొదలులేని మొదటిదానికి నమస్కారము. హవ్య (హోమము చేయదగిన) రూపమమైన వానికి, పూజ్యునకు సద్యోజాతునకు నీకు నమస్కారము. గుహా రూపునకు కుబేర రూపునకు బంగారు వస్త్రములను ధరించిన వానికి నీకు నమస్కారము. మాబోటి ప్రాణులను బుట్టించువానికి, వేదములు చెప్పిన పరిశుద్ధ కర్మలకును ద్రవ్యములకును పుట్టు స్థానమైన వానికి నీకు నమస్కారము. యోగప్రభువునకు సాంఖ్యప్రభువునకు నీకు నమస్కారము. ధ్రువ నీశీధులకు ఋషులకు పతియైన వానికి నీకు నమస్కారము. మెరుపులు పిడుగులు మేఘములు గర్జములు వీనికి ప్రభువైన వానికి నీకు నమస్కారము. సముద్ర ప్రభువునకు ద్వీపముల ప్రభువునకు నీకు నమస్కారము. పర్వత ప్రభువు అయిన నీకు వర్ష ప్రభువునకు నీకునమస్కారము. ధర్మాధ్యక్షునకు ధర్మ స్వరూపునకు నీకు స్థితుల ప్రభువునకు నీకో నమస్కారము. రసముల ప్రభువుకు రత్నముల ప్రభువునకు నీకు నమస్కారము క్షణముల ప్రభువునకు క్షణము (కనురెప్పపాటు కాలము) నీకు నమస్కారము. కనురెప్పలపాటు కాలమైన నిమేషమునకు ప్రభువైన వానికి కాష్ఠలకు ప్రభువైన వానికి (కాష్ఠ=18 కనురెప్పపాటు) నీకు నమస్కారము. రాత్రింబగళ్ళకు సగము నెలలకు నెలల కును ప్రభువైన నీకు నమస్కారము. ఋతువుల ప్రభువునకు సంఖ్యయొక్క ప్రభువునకు నమస్కారము. బ్రహ్మ ఆయువులో సగము పరార్థము. అట్టి పరార్థ కాలమునకు ప్రభువైన నీకు నమస్కారము. బ్రహ్మ యాయువుపరము. అట్టి పరమునకు ప్రభువైన నీకు నమ స్కారము. ప్రాచీనముల ప్రభువునకు, యుగముల ప్రభువునకు నీకు నమస్కారము నాలుగు విధములై సృష్టికి ప్రభువైన నీకు నమస్కారము. అనన్తములైన నేత్రములుగల నీకు నమస్కారము. కల్ప ప్రారంభమున నేర్పరచిన వృత్తులకు ప్రభువైన నీకు నమస్కారము. విశ్వ ప్రభువునకు నీకు నమస్కారము. కల్ప ప్రారంభమున నేర్పరచిన వృత్తులకు ప్రభువైన నీకు నమస్కారము. విశ్వ ప్రభువునకు నీకు నమస్కారము. విద్య ప్రభువునకు నీకు నమస్కారము. పితృదేవతల పతికి, పశుపతికి నీకు నమస్కారము. వాక్ శ్రేష్ఠ రూపునకు నీకు నమస్కారము. పురాతనమైన బీజములు వర్ణించువానికి నీకు నమస్కారము (సర్వ బీజములను వర్షించు పురాణ వృషభ స్వరూపుడని భావము) మిక్కిలి సుందరమైన వెంట్రుకలు గలవానికి ఊర్ధ్వముగా నేత్రములు శిరమును గలవానికి నీకు నమస్కారము. పశువులపతికి గోవు వృషభ శ్రేష్ఠము ధ్వజముగా గలవానికి నీకు నమస్కారము. ప్రజాపతుల బ్రహ్మలకు పతికి, సిద్ధుల పతికి నీకు నమస్కారము. గరుడులకు ఉరగములకు సర్పములకు పక్షులకును పతియైన నీకు నమస్కారము. గోకర్ణ స్వరూపునకు, గోవునందు ఉండు వానికి శంకుకర్ణునకు నీకు నమస్కారము. వరాహావతార రూపునకు జ్ఞానాతీతునకు రక్ష స్సుల అధిపతికి నీకు నమస్కారము. అప్సరసల పతికి గణముల పతికి జలములకు తేజస్సులకు పతికి నీకు నమస్కారము. లక్ష్మీపతికి శ్రీమంతునకు హ్రీమంతునకు నీకు నమస్కారము. బలాబల స్వరూపునకు అక్షోభ్యుల క్షోభింప జేయువానికి నీకు నమస్కారము. పొడవైన ఒకే కొమ్ముగలిగి మంచి ఎత్తైన మూపురముగల వృషభ స్వరూపుడవైన నీకు నమస్కారము. స్థైర్యముగలిగి తేజోవంతమైన మంచికాంతిగల శరీరముగల నీకు నమ స్కారము. భూతభవిష్య ద్వర్తమాన స్వరూపునకు నీకు నమస్కారము. మంచి వర్చస్సు కలిగి అందరను అతిక్రమించి వీరశూరతలు గలవానికి నీకు నమస్కారము. వరము ఇచ్చువానికి, వరింపదగిన వానికి సర్వమునందున్న వానికి నీకు నమస్కారము. భూత భవిష్యత్కాల స్వరూపునకు మహాదేవుడై భవుడవైన నీకు నమస్కారము. జన స్వరూపునకు తప స్స్వరూపునకు వరదునకు నీకు నమస్కారము. నమస్కరింపదగిన వానికి మోక్ష స్వరూపునకు జనరూపునకు నరక రూపునకు నీకు నమస్కారము. భవునకు అందరిచే సేవింపబడువానికి యజ్ఞ స్వరూపునకు యజ్ఞము చేయించు పురోహిత స్వరూపునకు మహోదార స్వరూపునకు, మిక్కిలి ప్రకాశించిన ప్రకాశ స్వరూపునకు (పరమాత్మ స్వరూ పునకు) నిర్గుణ స్వరూపునకు, పాశహస్తునకు తనకు తానే ఆభరణ (అలంకారమైన వానికి హోమము చేయబడిన ద్రవ్యరూపునకు అపహుతునకు హోమము చేయబడని ద్రవ్య స్వరూపునకు ప్రహుత ప్రశి(సి)తునకు అధికముగా హోమము చేయబడిన హోమ ద్రవ్యమునందు అత్యంతాసక్తిగల నీకు నమస్కారము. ఇష్ట స్వరూపునకు (యజ్ఞ స్వరూపు నకు ప్రియ స్వరూపునకు) హోమదానాది క్రియ అంతర్వేదిలో దానము ఈయబడినది ఇష్టము తత్స్వరూపునకు), మూర్తిమత్స్వరూపునకు (చెరువుల దేవాల యములు మొదలగు వాని నిర్మాణముల స్వరూపునకు ఋత స్వరూపునకు సత్య స్వరూపు నకు భూతాధిపతియైన నీకు నమస్కారము. సదస్య (యజ్ఞ సభలోని సభ్యుల) స్వరూపునకు దక్షిణావబృథ స్వరూపు నకు లోకుల అహింసా స్వరూపునకు పశుమస్త్ర ఔషధి స్వరూపునకు నీకు నమస్కారము. తుష్టిని ఇచ్చువానికి త్ర్యంబకునకు (మూడు కన్నుల వానికి) మంచి గంధముగలవానికి ఇంద్రియముల అధిపతికిని అన్ని దోషములకు పరిహారమైన వానికి (పూల మాలలు ధరించిన వానికిని నీకు నమస్కారము. విశ్వుడును, విశ్వరూపుడును. అంతటను నేత్రములు ముఖములు గలవాడును అంతటను చేతులు కాళ్ళు గలవాడును రుద్రుడును ప్రమితుడును (నిజముగా నెరుగబడినవాడు) అగు నీకు నమస్కారము. హవ్య (దేవ యోగ్యమయిన అన్నము) స్వరూపునకు, కవ్య (పితరులకు యోగ్యమయిన అన్నము) స్వరూపునకు హవ్య కవ్య స్వరూపునకు నీకు నమస్కారము. సిద్ధస్వరూపునకు పవిత్రాత్మునకు, చేష్టాస్వరూపునకు నాశములేనివానికి నీకునమస్కారము. చక్కని వీరునకు, చక్కని భయంకరునకు క్షోభింప నలవిగాని వారిని గూడ క్షోభింపచేయు వానికి చక్కని మేధావంతునకు చక్కని సంతానము గలవానికి, ఉజ్జ్వల ప్రకాశవంతునకు, సూర్య స్వరూపునకు నీకు నమస్కారము. చక్కని రెక్కలుగల గరుడస్వరూపునకు, బంగారు కాంతిగల వానికి నీకు మరల మరల నమస్కారము. విరూపమయిన కన్నులు గలవానికి మూడు కన్నులు గలవానికి, పింగళ స్వరూపునకు (సూర్య స్వరూపునకు) మహాతేజస్వికి నీకు నమస్కారము. దృష్టిని (కుదృష్టిని) పోగొట్టువానికి, శాంతమైన చూపులు గలవానికి, పొగవర్ణము గలవానికి, తెల్లనైన వానికి, నల్లనైన వానికి ఎఱ్ఱనైన వానికి నీకు నమస్కారము. మాంస స్వరూపునకు, కోతి వర్ణము గలవానికి, పచ్చనైనవానికి, అమ్ములపొది గలవానికి, విశేష స్వరూపములు గలవానికి, ఏ విశేషములు లేనివానికినీకు నమస్కారము. పద్మమువంటి వర్ణముగలవానికి, మృత్యువును (యముని)జంపినవానికి మృత్యు స్వరూపునకు, శ్యామునకు (నల్లనివానికి) గౌరునకు (తెల్లనివానికి) కద్రు (గోరోచన) వర్ణము గలవానికి, ఎఱుపువానికి నీకు నమస్కారము. కాస్తునకు (మనోహరునకు) సంధ్యాకాల మేఘము వంటి వర్ణము గలవానికి, బహు రూపములుగలవానికి, పుట్టెచేతియందు గలవానికి దిక్కులే వస్త్రములుగాగల దిగంబరుడైన వానికి, జటాజూటము గలవానికి నీకు నమస్కారము. జ్ఞానాతీతునకు శర్వునకు, వధింపనలవిగాని వానికి, వరు(శ్రేష్ఠు)నకు, ముందును, వెనుకను స్వరూపములను ధరిం చినవానికి, అగ్ని స్వరూపునకు నీకు నమస్కారము. చేరనలవి గాని వానికి, మహత్స్వరూపునకు అద్దెనవానికి, కపిల వర్ణము గలవానికి, సూర్యకాంతి వంటి శరీరము గలవానికి బలవంతునకు, వేగవంతునకు నీకు నమస్కారము. పినాకమను ధనువు ధరించిన వానికి, ప్రసిద్ధునకు స్ఫీతు (విశాలు)నకు, ప్రసరించినవానికి, చక్కని మేధా స్వరూపునకు, దిక్కులే వస్త్రములు గలవానికి శిఖగల వానికి నీకు నమస్కారము. చిత్ర స్వరూపునకు చిత్రమైన వర్ణములు గలవానికి, విచిత్రునకు సర్వము ధరించువానికి, చేకితానునకు, తుష్ఠునకు, అనిహితునకు (ఎక్కడను ఉంచబడని వానికి) నీకు నమస్కారము. క్షాన్తునకు (క్షమ గలవానికి) శాన్తునకు (శరణుగలవానికి), వజ్రము వంటి శరీరము గలవానికి రాక్షసుల జంపువానికి, దక్ష యజ్ఞమును ధ్వంసము జేసినవానికి, నల్లని కంఠమును ఊర్ధ్వరేతస్సును గలవానికి నీకు నమస్కారము. శత్రువుల సంహరించువానికి యమ స్వరూపునకు తీక్షమైన ఆయుధములు ధరించినవానికి, మోదము (సంతోషము)తో గూడిన వానికి, అతిసంతోష స్వరూపునకు, శూన్య స్వరూపునకు నీకు నమస్కారము. ఓంకార స్వరూపునకు ఓంకారా ధీశ్వరుడవు భక్తులకు సుఖము నిచ్చువాడవు, మృగమును వేటాడువాడవు సమర్థుడవు. దక్షయజ్ఞ ధ్వంసము జేసినవాడవునైన నీకు నమస్కారము. సర్వమైనవాడవు. త్రిపురముల ఛేదించినవాడవు, శాన్తుడవు, సుగంధుడవు పరులకు గూడ ప్రభువైన వాడవునైన నీకు నమస్కారము. పుష్పవన్త స్వరూపుడవు (సూర్య చంద్ర స్వరూపుడవు), భగనేత్రాన్తకుడవు (ఇంద్రాంతకుడవు) కణాదస్వరూపుడవు, వరిష్ఠుడవు. కాముని శరీరము గాల్చినవాడవునైన నీకు నమస్కారము. సూర్యుని భయంకర చక్ర స్వరూపుడవు. నాగరాజు నణచినవాడవు దైత్యులకు అంతకుడవు, దివ్యులకు రోదనము గలుగజేయువాడవునైన నీకు నమస్కారము. శ్మశాన ప్రియుడవై నిత్యుడవైన నీకు నమస్కారము. మూడు నేత్రములు ధరించువాడవు, ప్రాణములను పాలించువాడవు, కదులుచున్న మాలలను ధరించువాడవునైన నీకు నమస్కారము. శోకము వీడిన యనేక ప్రాణులచే బాగుగా స్తుతింపబడిన వాడవు. నరనారీ శరీరము (అర్థనారీశ్వర శరీరము) గలవాడవు. పార్వతీదేవికి ప్రియమును జేయువాడవు నైన నీకు నమస్కారము. జటాధారివి ఇష్టమైన వాడవునైన నీకు నమస్కారము. మను (కోప) స్వరూపుడవు, చల్లని శీలము గలవాడవు. చక్కని గీతులను గానము చేయువాడవు. కంకణములు చేతులలో నలంకరించుకొన్న వాడవు. భయంకరుడవు, భయంకర రూపమును ధరించిన వాడవునైన నీకు నమస్కారము. విభీషణుడవు (మిక్కిలి భయంకరు డవు, భయంకరుడవు. సూర్యుని (దక్షయజ్ఞములో) మధించినవాడవు. సిద్ధ సమూహములచే గానము చేయబడినవాడవు మహాభాగుడవు మహాభాగ్యవంతుడవు నైన నీకు నమస్కారము. పెద్ద నవ్వుగలవానికి, సింహనాదము చఱచుట లేక చీల్చుటయు గలవానికి, ధ్వని చేయు చున్నవానికి, దుముకుచున్నవానికి మిక్కిలి సంతసించిన వానికిని నీకు నమస్కారము. అద్భుత రూపునకు, నిద్రించువానికి, పరిగెత్తువానికి, పీడించున్నవానికి పరిగెత్తుచున్న ద్రవీభావము జెందుచున్నవానికి, నీకు నమస్కారము. కదులుచున్నవానికి, ఆడుచున్న వానికి, లావైన కడుపు శరీరముగల వానికి నీకు నమస్కారము. కృతస్వరూపుడు వికార రూపములైన చేతులుగల వానికి, నీకు నమస్కారము. పిచ్చివేషముగలవానికి చిరుగజ్జెలు గలవానికి, వికృత వేషము గలవానికి క్రూరునకు నీకు నమస్కారము. జ్ఞానాతీతునకు ఉజ్జ్వల ప్రభావంతునకు, ప్రభావ స్వరూపునకు, నిర్గుణునకు, ప్రియునకు నాద స్వరూపునకు ముద్రలను మణులను ధరించిన వానికి నీకు నమస్కారము. అపత్య (సంతాన స్వరూపు నకు సూక్ష్మ శరీరికి, గుణములచే సాటిలేనివానికి, గుణ స్వరూపునకు, యక్ష రహస్య రూపునకు, తెలియనలవిగాని దానినిగూడ దెలిసికొనువానికి నీకు నమస్కారము.
లోకమును ధరించునది (నీకు) భూమి నీ పాదములు సజ్జనులచే సేవింపబడినవి. నీ యుదరము సమస్త సిద్ధ యోగములకు అధిష్టానము. నీ నడుము తారా గణములతో నలంకరింపబడినదై విశాలమైన యంతరిక్షము (ఆకాశము) నీ వక్షః స్థలమున తారాపథము (పాలవెల్ల చుక్కల మార్గము) వలె హారము ప్రకాశించుచున్నది. నీ పది భుజములు కేయూ రములతో (భుజకీర్తులతో) అంగదములతో (మరికొన్ని భూజాలంకారములతో నలంకరింపబడిన పదిదిక్కులు. నీ కంఠము వెడల్పై వైశాల్యము గలదై నల్లని మేఘ సమూహము వంటిదై శ్రీమంతమై (విషము గలదై) బంగారు సూత్రములతో నలంకరింపబడినదై ప్రకాశించుచున్నది. కోరలచే భయంకరమైన దుర్భురమై తిరస్కరింప అలవి కానిదై సాటి లేనిది నీ ముఖము. కమలమాలలతో తలపాగాగా చుట్టబడిన నీ శిరస్త్రాణము (లేదా నీ విరబోసిన తల వెంట్రుకలు) ఎంత చక్కగా ప్రకాశించుచున్నది. నీ యుజ్జ్వల కాంతి సూర్యుని యందున్నది. నీ శరీరము(కాంతి)చంద్రుని యందున్నది. నీ స్థైర్యమున భూమి యున్నది. నీ బలమున వాయువున్నది. నీ తీక్షత అగ్నిలో నున్నది. నీ కాంతి చంద్రుని యందు ఉన్నది. నీ శబ్దము ఆకాశమునందు ఉన్నది. నీ చల్లదనము నీటిలోనున్నది. పండితులు ఈ నీ గుణములను అక్షరములై (నాశ రహితము లై) ఉత్తమము లై (అత్యున్నతము లై) నిప్పుదములై ఏ మాత్రము కదలిక లేనివైనవిగా స్థిరమైనవిగా తెలియుదురు.
జపస్వరూపుడు, జపింప దగినవాడు, మహాయోగి, మహాదేవుడు, మహేశ్వరుడు పరమునందు శమించువాడు గుహలో (బుద్ధిలో) ఉండువాడు ఆకాశమున చరించువాడు. రాత్రియందు చరించువాడు తపోనిధి. కుమారస్వామి నందనుడు (ఆనందింప జేయువాడు) గుఱ్ఱపుతలు గలవాడు (ఐశ్వర్యమును వాహనముగా జేసికొన్నవాడు). తెలియదగినవాడు. తెలియజేయువాడు. నేత (పరమపదమును జేర్చువాడు) ధూళిని వహించువాడు. దుష్టులను కంపింపజేయువాడు.
బృహద్రథుడు (గొప్ప రథము, బృహత్సామము రథముగా గలవాడు) భయంకర మైన పనులుగలవాడు. విశాలమైన కీర్తి గలవాడు. ధనంజయుడు (అగ్ని స్వరూపుడు, సర్వవ్యాపి అయిన ధనంజయ వాయు స్వరూపుడు) ఘంటా ప్రియుడు, ధ్వజముగలవాడు ఛత్రము కలవాడు. జండాగల సేనకు అధిపతియైనవాడు. కవచము కలవాడు పట్టిసము అను ఆయుధ విశేషము కలవాడు. శంఖముకలవాడు. పాశము హస్తమందుకలవాడు. పరశ్వమను ఆయుధము కలవాడు. పొందనలవి కానివాడు. పాపరహితుడు, శూరుడు ఇంద్రశత్రువులైన రాక్షసులను చంపువాడు. అయిన నిన్ను ప్రసన్నుని చేసికొని పూర్వము మాచేత యుద్ధమున శత్రువులు చంపబడిరి. నీవు అగ్నివి, సముద్రుడవు, అన్నింటిని త్రాగుచుగూడ తృప్తిచెందవు. నీవు కోపమునకు నిలయమైన వాడవు. ప్రసన్నమైన ఆత్మగల వాడవు. కాముని చంపినవాడవు. కోరికలను తీర్చువాడవు, ఇష్టమైనవాడవు, బ్రహ్మణ్యుడవు. వైదికకర్మలకు మూలము అయినవాడవు. బ్రహ్మచారివి. గోఘ్నుడవు (ఇంద్రియములను చంపువాడవు)నీవు శిష్టులచే (వేదము చెప్పిన విధముగా నడచుకొను వారిచే పూజింపబడు వాడవు. వేదములకు తరగని నిధి అయినవాడవు. నీ చేతనే యజ్ఞము కల్పింపబడినది. నీవు వేదమును, వేదోక్తమయిన హవ్యమును, హవ్యవాహనుడును. అందుచే మేమందరము ప్రీతులము అగుదుము. నీవు భవానీశుడవు. పుట్టువులేని యశుడవు. లోకములకు నెలవైన రాశిపై కర్తవైన బ్రహ్మవు. నీవు అది సృష్టి స్వరూపుడవు. సాంఖ్యులు నిన్ను ప్రకృతులకంటే పరమునిగా తెలిసికొనుటచే క్షీణించిన ధ్యానము గలవారై, మృత్యువులో ప్రవేశింపరు. ధ్యానయోగులు తమ ధ్యానముచే నీతో నిత్యము కూడిన వారై నిన్ను తెలిసికొని ఆ భోగములను పూర్తిగా వదలివేయుదురు. ఇక తదితరులైన మానవులు నిన్ను శరణుపొంది పరిశుద్ధులై కర్మలచే దివ్యభోగములను అనుభవించుచుందురు. జ్ఞానాతీతమైన పరమాత్మవైన నీ తత్త్వము యొక్క అపారమైన మాహాత్మ్యమును మా శక్తి కొలది తెలిసికొన్నంతవరకు మేము కీర్తించితిమి. నీవు ఎవడవైనను అగుదువు గాక అట్టి నీకు నమస్కారము. మాకు మాత్రము అంతటను శివుడవు అగుమని వేడుచున్నాము.