భువన విన్యాసము - 7

సూతుడు అనెను:

సరోవరముల నుండి పుణ్య జలములుగల నదులు బయలువెడలినవి. అవి పెల్లుబికిన మహాజలములు కలవి. వరసగా ఆ నదులనుగూర్చి వినుడు. ఆకాశమను (వంటి) సముద్రమునుండి వెలువడి సోముడు అని పిలువబడు ఈ చంద్రుడు సర్వభూతములకు ఆధారమై దేవతల అమృతమునకు నిధివంటివాడు. అతనినుండి బయలువెడలి నదియు, పుణ్యజలములు కలదియు, అయిన ఆనది ఆకాశగామిని అయినది. అది ఏడవ వాయు మార్గమున విమలజలయై బయలుదేరినది. ఆ నది జ్యోతిస్సునందు మరలుచున్నదై జ్యోతిర్గణములచే సేవింపబడినది. కోటివేల తారలుగల ఆకాశము నుండి మిక్కిలి పొడవైనదై ఆకాశ మార్గమున వెడలు, మహేంద్రుని గజమైన ఐరావతము ఆకాశ మధ్యముననే ఆనది యందు జలక్రీడలు సలుపును. విక్షోభితమైన జలములుగల ఆ నదియందు ఆకాశతలమున అనేక విమాన సమూహములలో ఎరిగిపోవుచున్న సిద్ధులు దాని జలములందు ఆచమింతురు. అది మహాపుణ్య జలములు గలదై మంగళ స్వరూప మైనది. వాయువుచే ప్రేరేపింపబడుచుండును. అనేక విస్తారములలో పయనించుచు - సూర్యునివలె ప్రతిదినము భ్రమణము చేయును. అది వేగముగా మేరువుకు ప్రదక్షిణముగా చుట్టివైచి అంతటను ఎనుబది నాలుగు యోజనములు విస్తరించి ఉండును.

తరువాత నీటిచేతను, తైజసమైన వాయువుచేతను బ్రద్దలగుచు మేరువుయొక్క ఉత్తర కూటముల నాల్గింటిపై పడినది. అంత ఎత్తైన మేరు శిఖరముల ఒడ్డుల చివరల నుండి మరలినదై, నీటిని వెదజల్లుచు, నాలుగు విధములుగా స్రవించు జలములు కల్గి, అఱువదివేల యోజనములు నిరాధారమైన ఆకాశమున మేరువు యొక్క నలుదెసల పడును. ఆ మంగళకరమైన, పుణ్యమైన, మహానది ఆ పర్వత మహాపాదములు నాల్గింటి యందు అంతట మందర పర్వతమునకు పూర్వదిశలో పడును. దేవతలయొక్క పూర్వంశగా సర్వసిద్ధ గణములకు నిలయమైన, చక్కని చిత్రములైన మధ్యప్రదేశములు కలదియు, అనేకములైన సెలయేరులు, గుహలుకలదియు, పర్వత శ్రేష్ఠమైన సుందర గుహలుకల మందర పర్వతమును చుట్టి, కొండనెత్తముల ప్రతాపమును చల్లార్చు స్ఫటికమువలె తెల్లని నిర్మల జలములచే ఆ అకాశమహానది ప్రవహించుచుండును.

అట్లే రమ్యమైన కుబేరునికి చెందినచైత్రరథము అను తోటను ప్రదక్షిణముగా చుట్టి ప్రవహించుచు, ఆ ఆకాశ మహానది అరుణోద (ఎఱ్ఱని జలములుగల) సరోవరమును ప్రవేశించినది. ఆ తరువాత అరుణోదసరోవరము నుండి మరలి, చలికాలము చివర, మనోహరములైన ప్రవాహములు కలిగి సిద్ధగణములకు ఆలవాలమైన శైలమునందు చక్కని నడకతో పడుచుండును.

సీతలను నది మహాపుణ్యయుతమై, నదులలో శ్రేష్ఠమైనది. అది అనేకములైన పొదలతో అడ్డుకొనబడినదై, అనేకములైన విశాల స్థలముల మీదుగా పోవునదై, శీతమంత్రముగా కలదై, శిఖరమునుండి జారినదై, సుకుంజమను శ్రేష్ఠపర్వతమునందు పడును. మహాభాగ్య వంతమైన ఆనది యాసుకుంజ పర్వతము నుండి, సమంజ పర్వతము నుండి మాల్యవంత పర్వతమును తగులుచున్నదై, వైకంకము అను పర్వతమును చేరి దాని నుండి మణిపర్వతమును, దాని నుండి అనేక గుహలుగల ఋషభ పర్వతమును చేరుచున్నది.

ఈ విధముగా వేల పర్వతములను చీల్చుకొనుచు మహానది మహాశైలమున సిద్ధ సేవితమైన జఠర భాగమున పడినది. అటనుండి కూడ ఆ నది దేవకూటమైన మహా శైలమును చేరి, సముద్రము చివరగలదై క్రమముగా పృథివిని చేరినది. ఈ విధముగా ఆ నది వేయి స్థలములను నూర్ల పర్వత శ్రేష్ఠముల మీదుగా, విచిత్ర వనముల మీదుగా, వివిధములైన సరస్సుల మీదుగా, మహాభాగ్యవంతమైన విశాల ప్రదేశములలో ఒడుదుడుకులు లేక ప్రవహించునదై వేల నదులను కలుపుకొన్నదై మహానదియైనది. ఆ శ్రేష్ఠనది భద్రాశ్వమను మహాద్వీపమున ప్రవహించుచు తూర్పు సముద్రమున ప్రవహించి తూర్పు ద్వీపమును చేరును.

దక్షిణమును చేరిన ఆ నది గంధమాదన పర్వత శ్రేష్ఠమును చేరును. అచట జల పాతములలో అనేక విధముగ విప్పారి ప్రవహించు నీరు గలదై, దేవతలకు ఆనందము నిచ్చు గంధమాదన పర్వత వనమైన నందన వనమున ప్రవహించుచు, మహాభాగ్యవంతమై దక్షిణముగా ప్రవహించినది. దానిపేరు అలకనంద అని అన్ని లోకములలో ప్రసిద్ధము. అది అట నుండి దేవతల మనస్సువంటిదైన మానససరోవరమున ప్రవేశించును. మానస సరస్సు నుండి శైలశ్రేష్ఠమై, సుందరమైన మూడు శిఖరములు గల త్రికూట పర్వతమును చేరును. త్రికూటమునుండి కలింగ శిఖరమునుచేరును. కలింగ శిఖరము నుండి జారినదై, రుచక పర్వతమున పడును. రుచకమునుండి రాగి కాంతిగల నిషధ పర్వతమును చేరును. నిషధ పర్వతము నుండి కూడ జారినదై, శ్వేతోదరగిరిని చేరును. అటనుండి చక్కని మూలముగల వసుధార పర్వత శ్రేష్ఠమును చేరును. ఆట నుండి హేమ కూట పర్వతమును చేరినదై, అక్కడ నుండి దేవ శృంగమును చేరును. అక్కడనుండి పిశాచకము అను మహాశైలమును చేరును. ఆ పిశాచక పర్వతమునుండి పంచకూట పర్వతము జేరును. పంచ కూటము నుండి దేవనివాసమైన కైలాస పర్వతమును జేరును. దాని గర్భములో అనేకములైన గుహలలోను చరియలలోను తిరుగుచు పర్వతశ్రేష్ఠమైన హిమవత్పర్వతమున పడును.

ఆ నది ఈ విధముగా వేల పర్వతములను చీల్చుచు మహానదియై వేగముగా ప్రవహించునదై నూర్ల స్థలముల మీదుగా ప్రవహించుచు, వేల వనముల మీదుగా, నూర్ల కొలది గుహలలో నుండియు ప్రవహించుచు, మహాభాగ్యవంతురాలై దక్షిణ సమద్రమును చేరును. సుందరమైన, ఒక యోజనము వెడల్పుకలదై, పర్వత గర్భములలో తిరుగుచున్నదైన ఆ గంగామహానది, మహాత్ముడైన శంకరునిచేత ధరింపబడినది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ! శంకరునిచేత ధరింపబడిన ఆ నది భయంకరములైన పాపములను పవిత్రము చేయును. శంకర శరీర స్పర్శచే రెట్టింపుగా పవిత్రమైన జలములుకలదై, సర్వలోకములలో ప్రసిద్ధి చెందినది. పర్వతమును అనుసరించి అనేక ముఖములుగా అంతటను బయలు వెడలినదై, క్రింద ఇతర పర్వతములచే కొట్టబడుటచే వేల నదులు ప్రసిద్ధి చెందినవి. ఆ మహానదియైన గంగ హిమవత్పర్వతము నుండి ‘గంగా’ అనుపేరుతో మొదట ప్రకాశించినదై, సిద్ధులచే సేవింపబడినది. మహానదియైన గంగ ప్రవహించిన దేశములన్నియు ధన్యములు. అది రుద్రునిచేతను, సాధ్యులచేతను, అనిలులచేతను ఆదిత్యులచేతను సేవింపబడిన జలములుగలదై, తాను ప్రవహించిన దేశములను ధన్యములు చేయును.

ఇక మేరు పర్వతము యొక్క పశ్చిమమైన మహాపాదమును చెప్పెదను. అది అనేక రత్నములకు నెలవైనది. పుణ్యమైనది. పుణ్యము చేసినవారిచే సేవింపబడినది. విశాలమైన పర్వతరాజము. విశాలమైన గర్భము గుహలును కలది. మధ్య ప్రదేశములలో పొదలచేతను, స్వచ్ఛమైన కటకములచేతను (నడిమి భాగములచేతను) అలంకరింపబడిన గర్భముగలది. అది ముక్కంటి యొక్క నది. దేవతలచే సేవింపబడిన జలములుకలది. వాయు వేగము కలది. వైశాల్యము లేక సన్ననైనది. కావున తీగవలె మలుపులు తిరిగినది. మేరుకూట తటము నుండి జారిపడినది. జారిపడునప్పుడు కలుగుదెబ్బలచే వ్యాపించుచున్న తీయనైన జలములుగలది. నిర్మలమైన కొంగువలె తెల్లనైనది.

మేరు కూటమున ఆ ఆకాశగంగా నది సిద్ధచారణులచే సేవింపబడును. తరువాత ఆ నది ప్రదక్షిణముగా తిరిగి పడినదై ప్రవహించుచు, మహాకాంతిగలదై, దేవతలతో ప్రకాశించునదియు, దేవవనమును తన నీటిచే తడుపుచు మహాభాగ్యవంతురాలై అనేక పుష్పఫల ఉదకములు గలదై, ప్రదక్షిణముగానే తిరుగుచు నానా వనములచే అలంకరింపబడినదై, తెల్లని విమలజలముగల పశ్చిమ సరస్సును ప్రవేశించును. తరువాత నది సితోద సరస్సునుండి వెలువడి సుపక్షమను పర్వతమును చేరును. పుణ్యోదకముగల సుపక్షమునుండి దేవర్షులచే సేవింపబడినదై సుపక్షకూట తటమును జేరును. దానినుండి స్తుతింపబడిన జలముగలదై రమ్యమైన శిఖిపర్వతముపై పడును. శిఖి (నెమళ్ళ) పర్వతము నుండి కంక (కొంగ(రావులుగు)ల) పర్వతమును, కంకపర్వతమునుండి వైడూర్య పర్వతమును, వైడూర్య పర్వతమునుండి కంపిల పర్వతమును, దానినుండి గంధమాదన పర్వతమును దాని నుండి శ్రేష్ఠమైన పింజర పర్వతమును, పింజర పర్వతము నుండి సరస్సును చేరును. దానినుండి కుముదాచలమును, అటనుండి మధుమంతము, జన ముకుటము - అను పర్వతములను చేరును. ఆముకుట పర్వతమునుండి మహాపర్వతమైన కృష్ణ పర్వతమును చేరును.

ఆ కృష్ణ పర్వతమునుండి మహానగములచే సేవింపబడిన శ్వేత మహాపర్వతమును, ఆ శ్వేత పర్వతమునుండి వేయి శిఖరములు గల పర్వతరాజమునందు పడును. అనేక నదులచే నిండారిన జలములుగలిగి మంగళకరమై, ఈ విధముగా వేయి పర్వతముల మీదుగా వేగముగా ప్రవహించుచు ఆ మహానది పారిజాతము అను మహాపర్వతమున పడును. ఆ మహానది పారిజాత పర్వతముపైన అనేకములగు సెలయేళ్ళు, నదులుగల గుహలలోను, చరియలలోను ప్రకాశించును. ఆ పర్వతము యొక్క అనేక కుక్షులలో భ్రమించిన జలములుకలదై, వేగముకలదై, అనేక గండ శిలలచే అనేక పర్యాయములు భేదింప బడుచున్న జలములతో భూతలమునకు చేరును.

బంగారు వర్ణముచే చిత్రమై చక్కని ప్రక్కలు గలదియు గొప్ప కొండ తిప్పలు కలదియు, అనేక ప్రాణులచే సేవింపబడినదియు అయిన ఉత్తరగిరియందు మేరుకూట తటమునుండి జారిన ఆ మహానది వాయువుచే ప్రేరేపింపబడిన జలములు విరజిమ్ముటచే ఆకాశమున వంకరలుతిరిగి పడుచున్నదై, అఱువది వేలయోజనముల పొడవున నిరాధారమై, శుభమైన ఆకాశమున వెదజల్లబడుచున్నదై ఒక మాలవలె మహాజలపాతముగా పడెను.

ఈ విధముగా, అనేక దేవర్షులచే సేవింపబడు శిఖర తటములనుండి జారినదై, వెదజల్లబడుచున్న జలములు గలదియు, అనేకములైన పూలతెప్పలనెడి యూర్థ్వ కేశములు కలదియై, అనేక రత్న, వన ప్రదేశములుగల అడవియై సూర్యుని మహావనమున ప్రదక్షిణ ముగా ప్రవహించును. గొప్పవారిచే సేవింపబడి మహాపుణ్యవంతమైన ఆ మహానది అటనుండి బయలుదేరి అనేకములైన సెలయేరులతో కొండనెత్తములతో ఒప్పి, వేగముగా బ్రవహించుచు శంఖకూటమను గిరితటమున పడెను. శంఖకూట తటము నుండి జారినదై వృషపర్వతమునను, వృషపర్వతము నుండి నాగశైల పర్వతమును అట నుండి వర్ష పర్వతమైన నీలపర్వతమును, నీలపర్వతము నుండి ఆనది కపింజల పర్వతమును తరువాత ఇంద్రనీల పర్వతమును చేరును. ఆ తరువాత, మహానీలమును హేమశృంగమును, చేరుకొనును. హేమశృంగము నుండి శ్వేతపర్వతమును, శ్వేతము నుండి సునగమను పర్వతమును చేరును. ఆ మహానది సునగము నుండి శతశృంగమును శతశృంగమునుండి పుష్పాలంకృతమైన పుష్కరమహాశైలమును చేరును. పుష్కరమునుండి బలిష్ఠమైన విరాజమను మహా పర్వతమును, వరాహపర్వతమును అటనుండి మయూర పర్వతమును, అటనుండి గుహా గర్భముతో అలంకృతమైన ఏక శిఖరమును, అటనుండి జారుధియను శైలశిఖరమున వేగముగాపడును.

ఈ విధముగా ఆ మహానది వేయి పర్వతములను చీల్చుచు మర్యాదాపర్వతమై మూడు శిఖరములతో ఒప్పిన త్రిశృంగ పర్వతమును చేరును. త్రిశృంగతటమునుండి జారినదై, గొప్పవారిచే సేవింపబడినదై, మేరు కూటతటము నుండి జారినదై స్వచ్ఛమైన జలములుకలదై విరుద్ధమను పర్వతశ్రేష్ఠమున పడును. అటనుండి భూములపై ప్రవహించుచు, ఆ మహానది పశ్చిమ సముద్రమును చేరును.

ప్రక్కన సువర్ణ భూములు కలిగి, చక్కని పార్శ్వ భాగములు కలిగి, మహాప్రాణులచే సేవింపబడి, చిత్రమైన ప్రత్యంత పర్వతములు గల మేరువుయొక్క ఉత్తర గిరియందు, గుహాగర్భము నుండి జాలువారి, బహు వైశాల్యముగలదై, చిత్రమైన పూలతెప్పలు అనెడి ఊర్థ్వ కేశములుగలదియై భూమిని ప్రవేశించును. అటనుండి ప్రవహించుచు, సంతోషముతో మంగళకరమై ఉత్తర కురుదేశములను ప్రవేశించినదై మహాద్వీపమున మధ్యముగా ఉత్తర సముద్రమును చేరును. ఈవిధముగా ఆ నాలుగు మహానదులు నిర్మల జలములు గలవై, మహాగిరి తటములనుండి జారిపడినవై, నలుదెసలను చేరినవి. కావున, బహువిశాలమైన పృథివి పైవిధముగా పూర్తిగా చెప్పబడినట్లే. ఆ భూమి మేరుపర్వతమును చుట్టి వెదజల్లి నట్లుగా, అన్ని దిక్కులకు వ్యాపించి ప్రవేశించినది. అది నాలుగు మహాద్వీపములు గలది. నాలుగు ఉద్యానవనముల వంటి వనములు గలది. నాలుగు ధ్వజములు వంటి మహా వృక్షములు గలది. నాలుగు శ్రేష్ఠములైన సరోవరములు గలది. నాలుగు మహాపర్వతములు గలది. నాలుగు మహాసర్పములకు ఆశ్రయమైనది. ఎనిమిది ఉత్తర మహాపర్వతములు గలది. ఎనిమిది శ్రేష్ఠ పర్వతములు గలది.