వాయు మహా పురాణము
చంద్రవంశ కీర్తనము
సూతుడు ఇట్లు అనెను:
సోమునకు బుధుడు పుత్రుడు. బుధునకు పుత్రుడు పురూరవుడు. అతడు తేజస్వి, దానశీలుడు, విపులకు దక్షిణలను ఇచ్చిన యజ్వ బ్రహ్మవాది, పరా(శక్తి)చే క్రాంతుడు, యుద్ధమున శత్రువులకు దుర్జయుడు. అగ్నిహోత్రయాగమును ఆహరించివాడు, యజ్వలకు భూమిని ఇచ్చెను. సత్య వచనుడు, కర్మబుద్ధిగలవాడు, మనోహరుడు, గొప్ప పుత్రుడు కలవాడు, లోకములలో రూపమున సాటిలేనివాడుగా ఉండెను. యశస్వి అయిన ఊర్వశి సిగ్గువదలి, ఆ బ్రహ్మవాదియు, ఇంద్రియ నిగ్రహము కలవాడును ధర్మజ్ఞుడును సత్య వాదియు అయిన పురూరవుని వరించెను. వీర్యవంతుడు అయిన ఆ రాజు ఆమెతో అఱువది నాలుగు ఏండ్లు రమ్యమైన చైత్రరథోద్యానవనమునను, మందాకినీ తీరమునను, విశాలమైన అలకానగరమునను, వనోత్తమమైన నందనవనమునను, గంధమాదన పర్వత ప్రాంతము లందును, నగోత్తమమైన మేరుశృంగమునందును, ఉత్తరకురు దేశములను చేరి, కలాప గ్రామమునను, దేవతలచే పూర్తిగా చరింపబడిన ఈ వనముఖ్యములందు ఊర్వశితో పరమసంతోషముతో క్రీడించెను”.
ఋషులు ఇట్లు అనిరి:
“దేవియైన ఉర్వశి గంధర్వజాతికి చెందినది. ఆమె దేవతలను వదలి మనుష్యుడైన రాజును ఎట్లు చేరికూడినది? ఓ బహుశ్రుతుడా! అది మాకు తెలియ చేయుము”.
సూతుడు ఇట్లు అనెను:
బ్రహ్మ శాపముచే తిరస్కరింపబడినదై ఆ ఊర్వశి ఒక ఒప్పందము చేసికొనినదై మానుషుడై ఇలాపుత్రుడైన ఆ పురూరవుని చేరెను. ఆమె తన శాపము నుండి విముక్తి కొఱకే ఆ ఒప్పందము చేసెను. వస్త్రహీనముగ చూడరాదు, కోరికలేనపుడు బలాత్కార మైధునమునకు పూనరాదు. రెండు గొఱ్ఱెలు శయన సమీపమున ఉండగా వానికి కాపలాగా ఉండవలెను. ఓ రాజా! ఒక్కమారు నేయి మాత్రమే నాకు ఆహారము. ఎంతకాలము ఈ ఒప్పందము నీవు దృఢముగా పాటింతువో అంత కాలమునీతో ఉందును - ఇది మన ఒప్పందముగా చేయబడినది. ఆ రాజు ఆమె ఒప్పందమును అంతయు సంపూర్ణముగ పాలించెను. ఆ ఊర్వశీ, భామినియు అంతకాలము పురూరవునితో ఉండెను. తరువాత శాపమోహితయై ఊర్వశి అఱువది నాలుగేండ్లు పురూరవునియందు అనురక్తితో మానుషుడైనను అతనితో చేరెను. గంధర్వులు అందుకు చింతాక్రాంతులైరి.
గంధర్వులు ఇట్లు అనిరి:
ఓ మహాభాగులారా! స్వర్గమున కలంకారమై శ్రేష్ఠ స్త్రీయైన ఆ ఊర్వశి మరల స్వర్గమునకు వచ్చు ఉపాయమును ఆలోచించుడు అనిరి. తరువాత వక్తలలో శ్రేష్ఠుడైన విశ్వావసువనువాడు ఇట్లు అనెను. “ఉర్వశి అచట ఒక ఇష్టమైన గొప్ప ఒప్పందము చేసి కొన్నది. కావున అ ఒప్పందమును అతిక్రమింపజేసి రాజు ఊర్వశిని వదిలిపెట్టునట్టి ఉపాయమును మీకు చెప్పెదను. వెంటనే మీ కార్యసిద్ధికై యోగమును పొందెదను అని చెప్పి మహాయశస్వియైన విశ్వావసువు ప్రతిష్టానమునకు (ఉర్వశీ పురూరవులున్న చోటికి) వెళ్లెను. తరువాత ఒక రాత్రియందు వారున్న చోటికి వచ్చి ఒక గొఱ్ఱెను దొంగిలించు కొనిపోయెను. ఆ సుందరమైన నగవుగల ఊర్వశి ఆ గొఱ్ఱెలయెడ తల్లివలె ఉండుచుండెను.
గంధర్వుని రాకను తెలిసి పడకపైనున్న ఆయశస్విని ఊర్వశి “నా పుత్రుని దొంగిలించుకొని పోవుచున్నాడు” అని రాజైన పురూరవునితో చెప్పెను. ఈ విధముగా చెప్పబడినను, రాజు తాను నగ్నుడై (వస్త్రహీనుడై) ఉన్నాడు - నగ్నుడనైన నన్ను దేవి ఊర్వశి చూచినచో ఒప్పందము ఉల్లంఘింపబడినదగును అని నిశ్చయించి రాజు నగ్నుడై అట్లే ఉండెను. అంత మరల గంధర్వులు రెండవ గొఱ్ఱెను దొంగిలించు కొని వెడలిరి. అట్లు రెండవ గొఱ్ఱె అపహరింపబడగా దేవి ఊర్వశి ఇలా పుత్రుడైన పురూరవునితో “ఓ రాజా! ఓ ప్రభూ! భర్తలేని దాని పుత్రులవలె నా పుత్రులు దొంగిలింప బడిరి” అని అనెను. ఈ విధముగ జెప్పబడిన రాజు అపుడు నగ్నుడై గంధర్వులు వెడలిన మార్గమున గొఱ్ఱెలకై పరువిడెను. తరువాత ఆ మహాభవనమున గొప్ప మాయ పుట్టింపబడెను. అంత వెలుపల నగ్నుడైన పురూరవుని చూచి కామరూపిణి అయిన ఊర్వశి అంతర్ధానము అయ్యెను. అట్లు అంతర్థానమైన ఊర్వశిని తెలిసి గంధర్వులందరు ఆ గొఱ్ఱెలు రెండింటిని అచ్చటనే వదలి అంతర్థానమైరి. ప్రభువై, రాజైన పురూరవుడు ఆ వదలి పెట్టబడిన గొట్టెలను తీసికొని (ఇంటికి)వచ్చెను. అపుడు ఆ రాజు అచట ఊర్వశీ కనిపించనందున మిక్కిలి దుఃఖితుడై ఏడ్చెను. అచటచట ఆమెను వెదకుచు భూమినంతయు తిరిగెను. అంత మహాబలుడైన రాజు కురుక్షేత్రమున ప్లక్ష తీర్థమున పుష్కరిణిలో మునిగి నీటితో తడిసినట్టిదియు, ఐదుగురు అప్సరసలతో క్రీడించుచున్నదియు, శోభనయు అయిన ఊర్వశిని చూచెను. అంత ఊర్వశియు సమీపముగనే రాజును (పురూరవుని) చూచెను. అపుడు ఉర్వశి తన సఖులతో ‘ఈతడు నేనీవరకు బద్ధానురాగయై ఉన్న ఆ పురుషోత్తముడు’ అని ఆ రాజునుచూపెను. అంత ఆ ఊర్వశి సఖులు ప్రకాశముగ కనబడిరి. వారు పంచచూడాప్సరసలు (ఐదు జడలుకల అప్సరసలు) ఇక, రాజు ఆమెను చూచి సంతసించి బహు ప్రలాపములు చేయసాగెను. ఓ ప్రియురాలా! రమ్ము మనస్సుతో నాయందు ఉండుము, ఘోరమైన వాక్కున ఉండిన ఉండుము. ఇవి మొదలుగాగల సూక్ష్మములైన మాటలను పరస్పరముగ మాట్లాడెను. ఉర్వశియు ఓ ప్రభూ! నీచేత నేను గర్భవతిని అని పురూరవునితో అనెను. ఒక సంవత్సరమునకు నీకు కుమారుడు కలుగ గలడు. సంశయములేదు అని ఆతనితో చెప్పెను. ఆమెతోసహ రాజు ఒకరాత్రి ఉండెను. తరువాత సంతసించినవాడై ఆ మహాయశస్వి తన నగరమునకు వచ్చెను. సంవత్సరము గడవగనే ఊర్వశి కడకు మరలవచ్చెను. ఆమెతో ఒకరాత్రి ఉండి ఆ మనస్వియైన రాజు కామార్తుడై దీనుడై “నీవు నిత్యమును నాదానిగనే ఉండుమ”ని అడిగెను. ఉర్వశి “ఓ మహారాజా! గంధర్వులు నీకు వరము ఒసగిరి. వారిని నీవే వరము అడిగికొనుము” అనెను. అట్లేఅని పురూరవుడు తాను “నిత్యము మహాత్ములైన గంధర్వుల యొక్క లోకమున ఉండునట్లు వరమును అడిగి కొనుచున్నాను” అనెను. గంధర్వులును “తథాస్తు” (అట్లే అగుగాక) అనిరి. అంత గంధర్వులు అగ్నికుండమును నింపి దానితో యాగముచేసి ఓ రాజా! నీవా గంధర్వ లోకమును పొందగలవు అనిరి. రాజు అగ్నికుండ(ము)ను కుమారుని తీసికొని తన నగరమునకు బయలుదేరెను. అరణియందు ఆ అగ్ని కుండ(ము) నుంచి ఆరాజు సపుత్రముగా ఇంటికి వెడలెను. అగ్నికుండమును మరలదెచ్చి, అచట కనబడు చున్న అగ్నిగల రావిచెట్టును చూచెను. ఆ రావిచెట్టును సమీపమునుండియేచూచి ఆశ్చర్య పడెను. అట్లు జరిగినదానిని గంధర్వులకు చెప్పుటకై అగ్నితోపాటు ఆరాజు భూమికి వెళ్లెను. ఆ విషయము అంత యువిని, ఆరణిని ఆజ్ఞాపించెను. అశ్వత్థము నుండి అరణిని చేసి యథావిధిగా అగ్నిని మథించి, దానితో యాగము చేసి ఓ రాజా! నీవు మాకు సమానమైన లోకమును పొందగలవు. రాజు అట్లు అగ్నిని మధించి దానిని మూడు విధములుగా గార్హపత్య, దక్షిణాగ్ని, ఆహవనీయ రూపమున అర్చనచేసి యాగము చేసెను. బహువిధములైన యజ్ఞములతో యాగము చేసి, గంధర్వ సమాన లోకవాసత్వమును పొందెను. నివాసము కొఱకు అతడు గంధర్వుడు. త్రేతాయుగమున అతడు మహారథుడు అయ్యెను. పూర్వము యాగములందు ఒకే అగ్ని ఉండెను. పురూరవుడు మూడు అగ్నులను కల్పించెను. ఓ బ్రాహ్మణసత్తములారా! మహర్షులచే అలంకరింపబడి మిక్కిలి పుణ్యవంతమైన దేశమున పురూరవ మహారాజు ఇట్టి ప్రభావముకలవాడుగా ఉండెను. మహాయశస్వియైన ఆ పురూరవ మహరాజు ఉత్తరమైన యమునా తీరమున ప్రతిష్ఠానమునను, ప్రయాగలోను రాజ్యమును చేయించుచుండెను.
ఆ పురూరవుని పుత్రులు ఇంద్రసమాన తేజోవంతులై ఆరుగురు ఉండిరి. వారు గంధర్వలోకము తెలిసినవారు. ఆయువు, ధీమంతుడు, అమావసువు, విశ్వాయువు, శతాయువు, గతాయువు అనువారు. అమావసుని పుత్రుడు విశ్వజిత్తైన భీమరాజు, భీముని పుత్రుడు శ్రీమంతుడు. ఈతడు బంగారు వన్నెగల రాజు, కాంచనుని పుత్రుడు విద్వాంసుడై మహాబలుడైన సుహోత్రుడు. సుహోత్రునకు కేశికా గర్భమున పుట్టినవాడు జహ్నువు. గంగ ఈతని యజ్ఞ కర్మలో ప్రవేశించి రాబోవు అనర్ధము జూపుటకై ఆ దేశమునంతయు పారెను. యజ్ఞవాటి అంతయు గంగముంచుటను చూచి, సుహోత్రుని పుత్రుడు వరదుడు గంగను కోపించి ఎఱ్ఱని కన్నులు గలవాడై ఓ గంగా! ఈ మదమునకు వెంటనే ఫలితము నందుము. ఈ నీ ప్రయోజనము అంతయు వ్యర్థమగును. నేను నీ జలమంతయు త్రాగివైచెదనని శపథముచేసెను - అంతపీతజలయైన గంగను చూచి దేవర్షులు మహాభాగులై గంగను జహ్నువునకు కూతురుగా గొంపోయి జాహ్నవిగా జేసిరి. యౌవనాశ్వుని యొక్క మనుమరాలైన కావేరిని జహ్నువు ఆవహించెను. యువనాశ్వుని శాపమున అతనిచే (జహ్నువుచే) గంగ నిర్మింపబడెను. నదీ శ్రేష్ఠమైన కావేరిని అనిందితయైన జహ్ను భార్యగా (దేవర్షులు) చేసిరి. జహ్నువు సుహోత్రుడను ధార్మికుని తన ప్రియపుత్రునిగా కావేరియందు జనింపచేసెను. సుహోత్రుని పుత్రుడు అజకుడు. అజకుని పుత్రుడు మహాయశస్వియైన బలాకాశ్వుడు. అతని పుత్రులు గయుడు, శీలుడు, కుశుడు అనువారు. కుశపుత్రులు నలుగురు దేవవర్చస్సు గలవారు. వారు కుశాశ్వుడు, కుశనాభుడు, అమూర్తారి యశుడు వసువు. రాజసత్తముడైన కుశస్తంబుడు పుత్రార్థియై తపముచేసెను. వేయి ఏండ్లు నిండుగా ఇంద్రుని చూచెను. సహస్రాక్షుడైన ఇంద్రుడు ఉగ్రతపస్వియైన అ కుశస్తంబునిచూచి శాశ్వతుడై స్వయముగనే ఈతనికి పుత్రునిగా జనించుటలో సమర్థుడయ్యెను. ఇంద్రుడు తానే అతనికి పుత్రత్వమును పొందెను. అట్లు పాకశాసనుడు (ఇంద్రుడు) కౌశికుడు అయిన ఇంద్రుడు (ఆతనికి) గాధిఅను పుత్రుడు అయ్యెను. కుశస్తంబునకు పురుకుత్సుని పుత్రి పౌరుకుత్స అను ఆమె భార్య అయ్యెను. ఆమె యందు గాధి జనించెను. పూర్వము కుశస్తంబుని పుత్రుడు గాధి తన కన్యను మహాభాగ్యవతియు శుభ లక్షణము అయిన సత్యవతి అను దానిని కావ్యుడైన ఋచీకునకు ఇచ్చెను. ఆమె భర్తయై (సత్యవతి) భార్గవుడై, భృగునందనుడైన ఋచీకుడు తన భార్యయైన సత్యవతికిని, తన అత్తయైన గాధిభార్యకును పుత్రులు కలుగుటకై చదువును (యజ్ఞ కుండమున పక్వమైన మంత్రౌషధి పూతమైన అన్నమును) సిద్ధము జేసెను. అపుడు మంచి ధారణాశక్తిగల ఆ భృగువంశీకుడైన ఋచీకుడు భార్యను (సత్యవతిని) పిలిచి - ఓ శుభే! ఈ చరువు నీ చేతను ఈ చరువు నీ తల్లిచేతను భుజింపదగును. దీనిచేత నీ తల్లియందు క్షత్రియ శ్రేష్ఠులను గూడ జంపువాడై క్షత్రియులకు అజేయుడైన పుత్రుడు జనించును. ఓ కల్యాణీ! ఈ చరువు నీకుకూడ ధైర్యవంతుడు, తపోధనుడు, శమగుణము నిండిన ఆత్మకలవాడు అయిన బ్రాహ్మణశ్రేష్ఠుని పుత్రునిగా జనింపచేయును” అని ఈ విధముగ భార్యతో జెప్పి భృగుపుత్రుడైన ఋచీకుడు నిత్యము తపమునందు అభిరతుడై అరణ్యమున ప్రవేశించెను. అప్పుడు గాధిరాజు భార్యతో బాటు తీర్థయాత్రా సందర్భమున సత్యవతిని చూచుటకై ఋచీక ఆశ్రమమునకు వచ్చెను. ఎప్పుడును సమాహిత చిత్తముతో నుండు సత్యవతి సంతోషముతో చరువులు రెంటిని దీసికొనివెళ్లి తల్లికి తనభర్త చెప్పిన మాటను నివేదించెను. తల్లి మాత్రము దైవవశమున తన చదువును తన కూతురికి ఇచ్చెను. అజ్ఞానము వలన ఆమె (కూతురి) చరువును తనదిగా స్వీకరించెను. తరువాత సత్యవతి మంటవలె వెలిగిన శరీరముతో భయంకరముగా కనబడుచున్నదై క్షత్రియనాశకమగు శుభమైన గర్భమును ధరించెను. అంత బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ఋచీకుడు అది చూచి, యోగశక్తితో జరిగినదంతయు చక్కగా తెలిసికొని ఉత్తమురాలైన భార్యతో ఇట్లనెను. “ఓ మంగళకరమైన దానా! చరువులు మారిన కారణమున నీ తల్లికి నీవు కోరుకొనిన పుత్రుడు సిద్ధించు చున్నాడు. నీకు క్రూరకర్ముడు అతి భయంకరుడు అయిన పుత్రుడు జనింపబోవుచున్నాడు. నీవు తలచినట్టి తపోధనుని నీ తల్లి జనింపబోవుచున్నది. సమస్తమైన బ్రహ్మసత్త్వమును నేను ఆ చరువునందు ఉండ జేసితిని” అని భర్త ఈ విధముగా చెప్పగానే, అపుడు సత్యవతి “నా పుత్రుడు అట్లు కారాదు” అని అనుగ్రహింపవేడెను. బ్రాహ్మణాపసదుడు (బ్రాహ్మణ నీచుడు) వేరొకడు కావలెను గాని, నా వాడుకారాదు అని వేడగా ముని ఇట్లనెను. “ఓ మంగళకరమైనదానా! తల్లి దండ్రుల కారణమున పుత్రుడు ఉగ్రకర్ముడగును ఇది నీవు గాని నేను గాని సంకల్పించినది కాదు. దైవికమున జరిగినది. అనగనే సత్యవతి వెంటనే మరల ఇట్లనెను. ఓ మునీ! నీవు కోరినచో లోకములనే సృజింపగలవు. ఈ చిన్ని సుతుని మాట చెప్పవలెనా? ఓ పతిదేవా! శాంతస్వరూపుడును అకుటిలుడునైన పుత్రుని మీరు నాకు ప్రసాదించగలరు. ఈ విధమైన పుత్రుడే నాకు కలుగునని ఓ ప్రభూ! చెప్పుడు. ఓ బ్రాహ్మణోత్తమా! నా విషయమున వేరొక విధముగా చేయకుడు. అది మీకు తప్పక సాధ్యమని వేడికొనెను. అంత తన తపోబలమున ఋచీకుడు ఆమెపై అనుగ్రహించెను. ఓ శ్రేష్ఠురాలా! పుత్రుని యందు గాని, పౌత్రుని యందుగాని నాకు పెద్ద భేదము లేదు. నీవు చెప్పినట్లుగనే నీ పుత్రుడట్టివాడు కాడు కాని అన్యుడు అనగా వేరొక తరమువాడు పౌత్రుడు అట్లు కాగలడని అనుగ్రహించెను. కావున సత్యవతి భృగువంశీయుడు, నిత్యము తపమునందు ఆసక్తుడు, ఇంద్రియములు అన్నింటిని అణచినవాడు, శాంతస్వరూపుడు అయిన జమదగ్నిని కనెను. ఈ విధముగ పూర్వ రౌద్ర - వైష్ణవములైన చరువులు తారుమారు కాగా, భృగువు యొక్క (ఋచీకుని యొక్క) సత్యవతీ గర్భముననున్న వైష్ణవాగ్నియొక్క దమనము వలన జమదగ్ని జనించెను. (జమదగ్ని అనగా వైష్ణవాగ్ని క్షత్రతేజము, దానిని దమింపజేసినందున జమదగ్ని యయ్యెను ) కుశిక నందనుడు అయిన గాధి విశ్వామిత్రుని పుత్రునిగా పొంది బ్రహ్మర్షులతో కూడిన మార్గమున బ్రహ్మ తేజముతో ఆవరింపబడినవాడై పయనించెను. ఆ పవిత్రురాలైన సత్యవతి సత్యవ్రత పరాయణురాలై ‘కౌశికి’ అని పిలువబడు ఈ మహానదియై ప్రవహించినది. ఇట్లు ప్రవహించిన ఈ మహాభాగ్యవంతు రాలైన కౌశికి నదులలో శ్రేష్ఠమైన నది అయినది. ఇక్ష్వాకు వంశమున సువేణువు అను రాజు ఉండెను. అతని కన్య మహా భాగ్యవతియైన ‘కామలీ’ అను రేణుక. ఆ రేణుకయైన కామలియందు ఋచీక పుత్రుడైన జమదగ్ని భయంకరుడును, సర్వ విద్యాపారంగతుడును, శ్రేష్ఠుడును, ధనుర్వేద పారగుడును, గొప్పగా మండుచున్న అగ్నివలె ఉన్నవాడును క్షత్రియ నాశకుడు అయిన పరశురాముని జనింపజేసెను. ఈ విధముగా ఔర్వుడైన అనగా ఉర్వపుత్రుడైన ఋచీకునకు సత్యవతి యందు మహామనస్వియైన జమదగ్ని జనించెను. అతని నుండి వీర్యము వలన బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠుడై ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనించెను. పేరుతో నీతడు విశ్వరథుడు అనబడువాడు భృగు ప్రసాదమున కౌశికాన్వయ వర్ధనుడై జనించెను. మధ్యముడు శునఃశేపుడు, కనిష్ఠుడు శునఃపుచ్ఛుడు. విశ్వామిత్రుని పుత్రుడు శునఃశేపుడు అనుముని అయ్యెను. అతడు హరిశ్చంద్రుని యజ్ఞమున పశువుగా నియమింపబడెను. దేవతలచే నీయబడినందున అతడు తరువాత దేవరాతు అయ్యెను. విశ్వామిత్రుని పుత్రులలో శునః శేపుడు ముందు జనించినవాడు అనబడెను. మధుచ్ఛందుడు, నయుడు, కృతుడు, దేవుడు, ధ్రువుడు, అష్టకుడు, కచ్ఛపుడు, పూరణుడు - వీరు విశ్వామిత్రుని పుత్రులు. కౌశికులై మహాత్ములైన వారియొక్క గోత్రములు అనేక విధములు. పార్థివులు, దేవరాతులు, యాజ్ఞవల్క్యులు, మర్షణులు, ఉదుంబరులు, ఉదుమ్లానులు, తారకులు, యమముచంతులు, లోహిణులు, రేనువులు, కారీసవులు అనువారు అయిరి. బభ్రవులు పాణినులు ధ్యానజప్యులును, శాలావత్యులు, హిరణ్యాక్షులు, సంకృతులు, గాలవులు అని కూడా అనబడిరి. దేవలులు, యామదూతులు, శాలంకాయనులు, బాష్కలులు, దదాతులు, బాదరులు, తక్కిన వారును ధీమంతుడైన విశ్వామిత్రునివారును, వేరొక ఋషులచే వివాహము చేసికొన దగినవారు పెక్కురు కౌశికులు అనబడిరి. కౌశికాసులు, అశ్రుములు, అట్లే తక్కిన సైధవాయనులు పుణ్యుడై పౌరోరవునకు సంబంధించినవారు, బ్రహ్మర్షియైన కౌశికునకు సంబంధించినవారును, దృషద్వతీపుత్రుడైన అష్టకుడును విశ్వామిత్రుని వల్ల కలిగినవాడు. అష్టకుని పుత్రుడు. వీరు అందరూ నాచే చెప్పబడిన జహ్నుగణము.
ఋషులు ఇట్లు అనిరి:
“విశ్వామిత్రాదులైన రాజులు ఏ విధమైన ధర్మముతో, తపముతో వైదిక పాండిత్యము తోను ఇట బ్రాహ్మణత్వము చక్కగా పొందిరి? ఏ ఏ పేరుతో క్షత్రియులు బ్రాహ్మణత్వమును పొందిరి? తపముతోనా? దానముతోనా? విశేషమును తెలియ గోరుచున్నాము” ఈ విధముగ అడుగబడిన సూతుడు అర్థవంతమగు మాటలలో ఈ విధముగ పలికెను. అన్యాయముగ సంపాదించిన ద్రవ్యములతో యజ్ఞముచేయు బుద్ధితో ధర్మమును కోరి యాగము చేయును. కాని యజ్ఞఫలమునందుడు. ఈ ధర్మమును చెప్పి పాపాత్ముడైన పురుషాధముడు కాపట్య కారణమున బ్రాహ్మణులకు దానము చేయును. తీవ్రముగా జపముచేసి ధన లోభమున నిరంకుశుడై మోహములతో కూడి అంత్య కాలమున పవిత్రత కొరకు దానము చేయును. వానిచే ఈయబడిన దానములు నిష్పలములగును. ఆ ధర్మము నందు కపటముతో బ్రర్తిల్లిన హింసకుడైన దురాత్మునకు తాను దానము చేసిన ఫలములు నిష్ఫలములగును. న్యాయముగా వచ్చిన ద్రవ్యములను తీర్థములలో దానము ఇచ్చువాడు, కోరికలకు సంబంధించక యాగము, చేయువాడు దానము చేయువాడునుదాన ఫలమును పొందును. ఆ దానము సుభోదయమును ఇచ్చును. దానముచే భోగములనును అందు కొనును. సత్యముతో స్వర్గమును పొందును. చక్కగా తపించిన తపముతో లోకములలో ఉప్పొంగి నిలుచును. అట్లా తేజస్వి లోకములను ఉప్పొంగజేసి లోకములలో అంతములేని తనమును పొందును. దానమున కన్న యజ్ఞము శ్రేయోదాయకము. యజ్ఞమునకన్న తపము శ్రేస్కరము. తపమున కన్న సన్యాసము శ్రేయస్కరము. సన్యాసమున కన్న జ్ఞానము అధికము. అది గురువు అనబడినది. క్షాత్రముతో కూడినవారు తపఃసిద్ధులై ద్విజాతులైన వారుగా చెప్పబడుచున్నారు. రాజైన విశ్వామిత్రుడు, మాంధాత, సంకృతి, కపి, కపి తరువాత పురుకుత్సుడు, సత్యుడు, అనృహవంతుడు, ఋధువు, ఆర్ష్ణిషేణుడు, అజమీఢుడు, భాగాన్యోన్యుడును, కాక్షీవుడు, శిజయుడు, ఇతర మహారథులును, రథీతరుడు, రుందుడు, విష్ణువృద్ధాదులగు రాజులును క్షాత్రముతో కూడిన తపముతో ఋషిత్వమును (బ్రాహ్మ ణత్వమును) పొందిరి. ఈ రాజర్షులందరు గొప్ప సిద్ధిని పొందిరి. ఆ తరువాత మహాత్ముడైన ఆయువు యొక్క వంశమును చెప్పెదను.