భువన విన్యాసము - 3

సూతుడు పలికెను:

ఆ తఱువాత దక్షిణ దిక్కున ఉన్నవియు సిద్ధులు చరించినవియు అయిన ద్రోణులు అనగా కొండపల్లములు, పసులు మేయు కంచెలు ఉన్నవి. అనుపూర్వముగా వానిని వినుడు. శిశిరమను పర్వతశ్రేష్ఠమునకును పతంగపర్వతమునకును మధ్యన గొప్ప వస్తువులు కలిగియున్న భూమి సంపదచే కూడియున్నదియు, తీగలు అల్లుకొన్న వృక్షములు గలదియు, విశాలముగా దూసుకొని పోయినట్లున్న ఉన్నత శిఖరములు గల వృక్షములతో ప్రకాశించి నదియు, పక్షి సంఘములు నివసించినదియునై మనోహరమైన ఉదుంబర (మేడిచెట్ల) వనముగలదు. ఆ వనము పగడపు వన్నెతో పండి, తేనెలు నిండినట్లు తీయనై మనోహరములై, పెద్దకడవల వంటి పండ్లతో మండు చున్నట్లు ప్రకాశించును. సిద్ధులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, ఉరగులు, అట్లే విద్యాధరులును సంతసించినవారై ఆ వనమును ఆశ్రయించి జీవింతురు.

అచట నిర్మలమై, తీయనైన జలములుగల నదులు ఉన్నవి. బహు జలములు గలవై సరసస్వచ్ఛ జలములుగల ఆ సరస్సులు అచట అంతటనుగలవు. అచట కర్దమ ప్రజాపతి యొక్క ఆశ్రమము గలదు. అది రమ్యమైనది. దేవగణముచే నిండినది. దాని అంతట చిత్రమైన వనముకలదు. ఆ వనము ఆశ్రమము చుట్టుగా నూరు యోజనములు వ్యాపించినది. తామ్రవర్ణ పర్వతమునకును, పతంగ పర్వతమునకును మధ్యన నూరు యోజనముల విశాలమై రెండు యోజనముల పొడవైన మహాపుణ్య సరోవరము కలదు. అచట లేతనై, విశాలమై చక్కనికాంతిగల తెల్లకమలముల చేతను, వేయిదళములు గల వికసించిన మహాపద్మముల చేతను, అంతట అలంకరింపబడినదియు, అట్లే తుమ్మెదలు నిండి సుగంధముగల నూరు దళములు కమలములచేతను, ఎరుపు, నలుపు రంగులు కలిగి వికసించిన పెద్ద కలువలచేతను ప్రకాశింపబడినదియు అయిన మహాపుణ్యవంతమై దేవ దానవ సేవితమై మహోరగులు నివసించినదియు నల్లని జాలములతో (జల జంతువులతో) ప్రకాశించినదియు అయిన ఒక సరోవరముకలదు.

ఆ సరోవరము మధ్యన ఒక జనపదముకలదు. అది నూరు యోజనముల పొడవై ముప్పది యోజనముల వెడల్పుగలది. ఎఱ్ఱని ధాతువులచే శిలావికారములచే అలంకరింపబడినది. దానిపైన గొప్ప మనోహరమై పొడవైన కోటగోడయు పెద్ద స్తంభములచే నేర్పడిన ద్వారమును గలది. నరనారీగణములు నిండినది. విస్తార వైభవములచే బలిసినది. కొణిగెల తోడను, రహస్య వ్యూహములచేతను, మణుల పట్టీలచే విచిత్రముగా ఉన్నవియు, రత్నములచే బొమ్మలు చిత్రించిన నేలలు గలవియు, ఆకర్షణీయ చిత్రములు గల కప్పులుగలవియు అయన గొప్ప భవన పంక్తులచే పొడవై మంగళమును ప్రకాశింపచేయుచు శోభిల్లినది.

అచట విద్యాధరపతి పులోముడు ప్రసిద్ధుడు, చిత్రవేషములు ధరించువాడు, మాలలు ధరించువాడు, మహేంద్రునితో సమానమైన తేజము కలవాడు. దీప్తులు, చిత్ర వేషములు గలవారు. సూర్యునితో సమానమైన తేజము గలవారును అయిన వేలకొలది అనేక విద్యాధరులకు అతడు రాజరాజు.

విశాఖ పర్వతశ్రేష్ఠమునకును పతంగ పర్వతమునకును మధ్యన తామ్రవర్ణ సరస్సు యొక్క పూర్వ తీరమున ప్రసిద్ధిచెందిన గొప్ప ఆమ్రవనము (మామిడితోట) గలదు. అది పంచబాణుని (మన్మథుని) బాణములైన మామిడి పూలచే గుచ్చబడినదా! అన్నట్లు (విరగ బూసిన మామిడి పూతగల)చక్కనిమామిడి పూగొమ్మలుగలది. అందమైన మామిడి పూల వర్ణముగలది. వసంత కాలములోనేకాక అన్ని కాలములలోను మామిడి పండ్లను ఇచ్చునది. ఆ పండ్లు బంగారువన్నె గలవి. మిక్కిలి రుచిగలవి. సువాసనగలవి, పెద్దకుండ లంతటివి, ఆమామిడి చెట్లకొమ్మలు విశాలములై అంతట వ్యాపించి ఉండును. గంధర్వులు, కిన్నరులు, యక్షులు, నాగులు, విద్యాధరులు అమృతము వంటి తీయని ఆ మామిడి పండ్లరసమును అచట త్రాగుదురు. మామిడిపండ్ల రసమును త్రాగి హృష్టపుష్టులైన మహాత్ముల నాదములు ఆ మామిడి వనములో వినబడుచుండును.

ఓ విప్రులారా! సుమూల పర్వత శ్రేష్ఠమునకును, వసుధార పర్వతమునకును మధ్యన బిల్వస్థలి కలదు. అది సమముగా, సుగంధము నిండినదై పక్షులతో కూడుకొన్నదై ముప్పది యోజనముల విస్తీర్ణము ఏబది యోజనముల పొడవైనదై ఒప్పినది. అచట బిల్వ వృక్షములు క్రిందికి అందుబాటులో ఉన్న ఫలశాఖలు గలవి. వాని పండ్లు రుచిగలిగి పగడపు వన్నె కలవి. అందులో కొన్ని పగులుచున్నవి. కొన్ని పగిలినవి. అట్టి బిల్వఫలముల చేత అచటి భూమి పైభాగము అంతయు తడిసినది. యక్ష, గంధర్వ, కిన్నర, సిద్ధ, నాగులు నిత్యము ఆ బిల్వఫలములు తినుచు ఆ బిల్వస్థలిని ఆశ్రయించి జీవింతురు.

వసుధార పర్వతమునకు, రత్నధార పర్వతమునకును మధ్యన ముప్పది యోజనములు విస్తీర్ణము, నూరుయోజనముల పొడవునుగల కింశుక (మోదుగు) వనము గలదు. అది నిత్యము పుష్పించిన వృక్షములు గలదై చక్కని సుగంధముతో ఒప్పారుచుండును. పుష్పలక్ష్మిచే అవరింపబడినదై అంతటను మంటలచే మండుచున్నట్లు ఉండును. దాని దివ్య గంధముచే చుట్టునుగల ప్రదేశము అంతయు సువాసితముగా ఉండును. పూర్తి నూరుయోజనముల అడవులందంతట దాని సువాసన నిండును. అది సిద్ధచారణ గణములకు, అప్సరసలకు నివాసిత భూమి, ఆ రమ్యమైన కింశుకవనము జలాశయములచే అందముగా అలంకరింపబడినట్లు ఉండును. అచట ఆదిత్య భగవానుని పెద్ద మందిరము కలదు. అచట ప్రతి మాసమునను ప్రజాపతియైన సూర్యుడు అవతరించును. కాలమునకు కర్తయు, వేయికిరణములు కలవాడు, దేవోత్తముడు, సర్వలోకములచే నమస్కరింప బడువాడు అయి సూర్యునకు అచట సిద్ధసంఘములు నమస్కరించును. పంచకూట పర్వతమునకును, కైలాస పర్వతమునకును మధ్యన ముప్పది ఆఱు యోజనముల విస్తీర్ణము కలదియు నూరు యోజనముల పొడవుగలదియు అగు ఒక సరస్సు కలదు. అది క్షుద్ర జీవులకు చేరరానిది. ఆ సరస్సు అంతటను హంసలతో తెల్లగా ఉండును. సర్వ ప్రాణులకును దాటరాకుండ ప్రవేశించుటకు అలవి కానిదిగా ఉండును. ఆ సరస్సు చూచిన వెంటనే సంభ్రమాశ్చర్యాదులచే గగుర్పాటు కలుగును.

ఈ విధముగా దక్షిణమున ఉన్న ఈ ప్రదేశములు పూర్వదిక్కును అనుసరించిన అంతరద్రోణులు (కొండపల్లములు). అందు సిద్ధ సంఘములు నివసించు చుందురు. అట్లే పశ్చిమ దిక్కునకూడ అంతర ద్రోణుల విస్తరములు గలవు. ఓ ద్విజోత్తములారా! వానిని వర్ణించెదను వినుడు. సువర్ణ శిఖిశైలముల మధ్యన అంతటను నూరు యోజనములు కలిగిన ఒకే విశాలమైన రాతినేలకలదు. అది ఎల్లప్పుడు తపించ(కాచ)బడి మిక్కిలి భయంకరమై, తాకుటకు అలవి కానిదై భయముతో ఒళ్లు జలదరింప చేయునట్టిదై ఉండును. అచటికి ఏ ప్రాణులుగాని, ప్రభువులుగానిపోలేరు. ఆ రాతినేలమధ్యన ముప్పది యోజనముల విశాల మండలము కలదు. అది వేల కొలది అగ్ని జ్వాలలచే చొరరాని మిక్కిలి భయంకరమైన అగ్నియొక్క స్థానము. అచట అగ్నిదేవుడు మండు సాధనములైన కట్టెలు మొదలగునవి ఏవియు లేకయే ఎడతెగని మంటల వరుసలతో ఎల్లప్పుడును మండుచునే ఉండును. బ్రహ్మచే అధిదేవతగా అగ్నియొక్క ఏ విభాగము విధింపబడెనో ఆ భాగరూపమైన అగ్నియే సంవర్తకాగ్నియై (ప్రళయాగ్నియై) అచట నిత్యము మండుచుండును.

ఆ రెండు పర్వత శ్రేష్ఠముల మధ్యనున్న దేవతలుగూడ శుభులు. అచట పది యోజనముల వైశాల్యముగల మాతులుంగ (మాదీఫల) వృక్షములుగల స్థలము కలదు. ఆధరువుగా తినదగిన తేనెలకు నెలవైనవి, మంచి రసముగలవియు, బంగారు వన్నెగలవి యునై బాగుగా పండిన ఫలములచేత ఆమహాస్థలి అంతయు శోభించుచుండును. మహా పుణ్యమై, సిద్ధ సంఘములకు నివాసమై సర్వకామగుణములతో కూడినదై ఆనందమైన బృహస్పతి ఆశ్రమము అచ్చట కలదు.

అట్లే శైల శ్రేష్ఠములైన కుముద- అంజన పర్వతముల మధ్యన కేసర ద్రోణిఅను కొండపల్లము గలదు. అది అనేక యోజనముల పొడవుగలది. రెండు చేతుల వైశాల్యము (వెడల్పు)తో మూడు చేతుల పొడవుతో విస్తరించినదియు, చంద్రకిరణములవలె తెల్లనై నవియు, గొప్ప సువాసనగలవియు, మనోహరము లైనవియు, అన్నికాలములలోను పూయు నవియు అయిన పూవులచే ఆ వనము చిత్రవర్ణముగలదై ప్రకాశించుచుండును. అచట దేవగురువైన విష్ణువు యొక్క గొప్పమందిరముగలదు. అది ముల్లోకములలో ప్రసిద్ధి చెందినది. సర్వలోకములకును నమస్కరింప తగినట్టిది.

కృష్ణ-పాండుర(నలుపు, తెలుపు) తైలముల రెంటి మధ్యనగూడ ముప్పది యోజనముల వెడల్పు, తొంబది యోజనముల పొడవునుగల దట్టమైన ఒకేరాతి నేలగల ప్రదేశము కలదు. అచట వృక్షములు తీగలును లేవు. అందు సుఖముగా కాలినడకతో సంచరింపవచ్చును. ఎగుడుదిగుడు లేనిది. ఆ సరస్సు మధ్యన మనోహరమైన స్థలపద్మిని (నీరులేక పద్మములు పూయు) ప్రదేశము గలదు. అది ఛత్రములంతటి ప్రమాణముగల వికసించిన నూరుదళములుగల కుశేశయములచేతను, నీళదళములుగల కలువలచేతను, మృదువై గద్గదములైన కంఠములుగల కిన్నరులయొక్క గాననాదములచేతను, మదముతో విజృంభించిన తేనెటీగలచేతను, గానము చేయబడెడి తుమ్మెదలచేతను, పద్మ సమూహములతోను ఒప్పినదై ఆ స్థలపద్మిని, (మెట్టతామర వనము) వ్యాపించి ఉన్నది. యక్ష గంధర్వులచే రచింపబడి సిద్ధచారణులచే సేవింపబడినది. ఆ మెట్టతామర (స్థలపద్మిని) ప్రదేశము యొక్క మధ్యన ఐదు యోజనముల మండలము చుట్టు గలదియు, అనేకములైన బోదెలు కలదియు, అనేకములైన చెట్టుకొమ్మల చివరల వరకు ప్రాకు తీగలచేతను, జంతువుల చేతను అలంకరింపబడిన మఱ్ఱిచెట్టు గలదు. అచట చంద్రకాంతి కలిగి, పూర్ణ చంద్రుని బోలు ముఖము కలిగి, లక్ష్మీయుతుడై (శ్రీమంతుడై) వేయిముఖములు కలిగిన దేవుడును, నీలవస్త్రము ధరించినవాడును, దేవ శత్రువులైన రాక్షసులను చంపువాడును, పద్మమాలలు ధరించిన వాడును, పరాజయములేని మహాభాగుడు అయిన హరి ఎల్లప్పుడు ఆ స్థలములో యక్షగంధర్వుల చేతను, విద్యాధర గణముల చేతను పూజింపబడును. ఆ మందిరమున ఆద్యంతములు లేని, హరి సిద్ధ చారణులచే అనేక విధములైన పద్మమాలలచే సాక్షాత్తుగా పూజింపబడును. అది అనంతపదమని సర్వలోకములలో ప్రసిద్ధి చెందినది. అది పద్మ మాలలచే వ్రేలాడు పొడవైన దండలచే ప్రకాశించుచుండును.

అట్లే సహస్ర శిఖర- కుముద పర్వతముల మధ్యన, ఏబది యోజనముల పొడవు ముప్పది యోజనముల వెడల్పును ఉండి బాణక్షేపమునకు మాత్రమే చోటుగల వాడియైన ఎత్తైన శిఖరము గలదియు, అనేక పక్షులు నివసించినదియు. గొప్ప గంధపు రుచి కలిగి ఏనుగులంతటి పండ్లచేత ఒప్పినదై, తేనెలుగారు మహావృక్షములచేత అంతట నిండియున్న పర్వతము గలదు. అచట మహాపుణ్యమై, దేవర్షి గణములు నివసించునట్టి దివ్య ప్రకాశము కల పుణ్యకర్ముడుగా ప్రసిద్ధిగాంచిన శుక్రుని ఆశ్రమము గలదు.

శంకుకూట, వృషభపర్వతముల మధ్యన పురూషకస్థలిఅను ఒక పల్లపు భూమి స్థలముకలదు. అది రమ్యము. అనేక యోజనముల పొడవైనది. బిల్వఫలములంతటివియు, శుభములైనవియు, గొప్ప రుచిగలవియు, సువాసనగలవియు, తొడిమెల నుండి జారిపడినవియు అగు పరుషములైన పండ్లచే అచటి భూమి అంతయు తడుపబడు చుండును. కిన్నరులు, నాగులు, సాధువులును మానాఢ్యులగు చారణులును పురూషక ఫల రసములచే ఉన్మత్తులై మానాఢ్యులై ఆ పురూషకస్థలి ఆశ్రయించి జీవింతురు.

కపింజల-నాగ శైలముల మధ్యన రెండు యోజనముల పొడవు నూరు యోజనముల వెడల్పుగల ప్రదేశము కలదు. అది మనోహరము అనేక వనములతో అలంకరింపబడినది. అనేక పుష్పఫలములుగలది. కిన్నరులచేతను, ఉరగులచేతను నివసింపబడినది. సుందర ద్రాక్షవనములు, నాగవనములు, ఖర్జూరవన ఖండములును, నల్లని అశోకవనములును, అగిసె తిలక కదళీ వనములును, రుచ్యములైన రేగుచెట్ల వనములును అచటగలవు. అంతటను తీయని చల్లని నీటితో నిండిన నదులచేత ఆ వనములు ప్రకాశించును.

ఓ బ్రాహ్మణోత్తములారా! అట్లే పుష్పక-మహామేష పర్వతముల మధ్యన అఱువది యోజనముల వెడల్పు నూరు యోజనముల పొడవైన భూమి కలదు. అది సమమైనది. పాణితలముతో సమానమైనది. చక్కని ఆకారముగలది, కఠినమైనది. తెల్లనైనది. గొప్పనై నది. చెట్లపొదలు, తీవపొదలును గడ్డియును లేనిది. ఇచట వివిధములైన ప్రాణులు లేవు. ఇది నిరాశ్రయము. ఎవరికిని ఆశ్రయము కానిది. ఆ కాననస్థలి భయంకరమై గగుర్పాటు కలుగజేయునది. మహాసరస్సులును, మహావృక్షములును, మహావనములు అన్నియు అంతట ఆకర్షణీయ నామములు కలవి. సరస్సుల యొక్కయు వనముల యొక్కయు ఆ స్థలము ప్రజాపతికి సంబంధించినది. అచట చిన్నసరస్సుల సంఖ్య ఇంత అని లేదు. లెక్కకు మించినవి. పది, పండ్రెండు, ఏడు, ఎనిమిది, ఇరువది ముప్పదియు యోజనములు గల స్థలములును, కొండపల్లపు భూములును, సరస్సులు, వనములును ప్రసిద్ధములైనవి. కొన్ని మహాభయంకరములైన, నల్లనైన పర్వత గర్భములైన గుహలు గలవు. అవి సూర్యకిరణములు చొరనివి. నిత్యము చల్లనైనవి. చేరఅలవికానివి. శైల గర్భములలో ఉన్న వేల, నూర్ల సరస్సులు అగ్నితప్తములవలె సలసల మసలుచుండును. (38)