కశ్యపీయ ప్రజాసర్గము

ఋషులు ఇట్లు అనిరి:

ఆ సూతుని ఈ మాటలను విని నైమిశారణ్యవాసులైన మునులు “యథాక్రమ వచనమునకు శ్రేష్ఠుడై ఈ లోకమున ఏడు మన్వంతరములలో ఇంద్ర - విష్ణు ప్రధానులైన మహౌజస్వులైన ఆదిత్యులు (అదితి పుత్రులు) ఎట్లు పుట్టిరి? ఓ రోమ హర్షణ! సూత ఇది అంతయు మాకు విస్తరముగా చెప్పుము” అని సూతుని అడిగిరి. బ్రహ్మవాదులైన మహర్షులతో అడుగబడిన వినయవంతుడు ప్రవక్తలలో శ్రేష్ఠుడును అయిన సూతుడు అప్పుడు ఇట్లనెను.

“సంతానేచ్ఛతో బ్రహ్మముఖము నుండి సృష్టింపబడిన ఆ దేవతలు అందరును మన్వంతరములలో ఈ లోకమున మంత్ర శరీరులు (మంత్రము శరీరముగా గలవారు). ధర్ముడు, పౌర్ణమాసుడు, బృహత్తైన, రథంతరము, వారిలో ప్రథముడైన ఆకూతుడు, తరువాత అకూతియు, తరువాత అధీష్టుడును, తరువాత విత్తి, సువిత్తి, అధీతియు, విజ్ఞాతీయు, విజ్ఞాతుడును, మానవుడును - వీరు పండ్రెండుగురు. ఇట్లు ద్వాదశ పుత్రులు కలవాడని పన్నెండు మాసములు గల సంవత్సరముతో సమానుడు అనియు తెలియవలెను. ఆతనిని చూచి బ్రహ్మ - ‘జయ’ దేవతలను కనెనని అనెను. దారాగ్నిహోత్ర (గార్భస్థ్యాగ్ని) సంయోగమున మిథ్యను (మిధున భావమును) మొదలిడుడు అని. ఈ విధముగా పలికి బ్రహ్మ అచటనే అంతర్థానమందెను.

తరువాత వారు (ఋషులు) బ్రహ్మయొక్క ఆ మాటను అభినందించలేదు. వాక్కు, మనస్సు, కర్మలు, వీనివల్ల ఈ లోకములో పుట్టిన కర్మలు సత్యస్వరూపునకు సంబంధించినవే. దోషమును చూచి కర్మలందు నిలచి ఉండు వారు కర్మలయొక్క ఫలమును క్షయాతిశయయుక్తముగా చూచి, సంతానమును ఏవగించుచు అలసటలేని వారును, మమకారము లేనివారును అయిరి. మాటిమాటికి కోరికలను కోరుచున్నవారై (అందులో) దోషము జూచి వీరక్తులై అర్థమును, ధర్మమును, కామమును వదిలి చక్కగా ఉండిరి. పౌరుషమైన (విష్ణు సంబంధమైన) జ్ఞానమును పొంది తేజమును సంక్షేపించి కూడ ఉండిరి. వారియొక్క ఆ అభిప్రాయమును తెలిసి బ్రహ్మ కోపించెనట. అపుడు నిరుత్సాహులగు ఆ సురలతో ప్రజ కొఱకే మీరు ఉద్దేశింపబడితిరి. నేను ప్రజను సృష్టించు వానిని వేరుకాదు. “నేను పూర్వము సంతానమును కనుడు, జయింపుడు” అని చెప్పియే ఉంటిని. నా మాటను తిరస్కరించి వైరాగ్యము పొందిన కారణమున మీ స్వజన్మను ఏవగించువారై సంతతిని అభినందింపకుందురు గాక. అమరణమును కోరి కర్మలయొక్క సన్యాసము గూడ చేయబడినది. కావున మీరు ఏడు మారులు అనాదరించి తరువాత (సంతతిని) పొందుదురు. బ్రహ్మచేత శపింపబడి ఆ జయులు ఆ బ్రహ్మను శాంతింపచేసిరి. “ఓ ప్రభో! ఓ దేవ! ఓ మహాదేవ! అజ్ఞానము వలన చేసిన మా పనిని క్షమింపుము” అని నమస్కరించి సానునయముగా పలికిరి. బ్రహ్మ వారితో మరలఇట్లనెను. ఈ లోకమున నాచే అనుమతింపబడనివాడు ఎవడు స్వాతంత్య్రమునకు అర్హుడు కాడు. నాకు అంతయు తెలియును. శుభముకాని, అశుభముకాని, నా ఇష్టములేక భూతములు తెలుసుకొనలేవు. పొందలేవు. లోకమున సత్త్వము అసత్త్వము - అని వ్యవస్థితమైనది అంతయు బుద్ధ్యాత్ముడనైన నాచే వ్యాపింపబడినది. లోకమున నన్ను ఎవ్వడును వంచింపలేడు. భూతములు తర్కించినదియు ధరించినదియు, విచారించి నదియు అంతయును నాకు తెలియును. నాచేత సుస్థితమైన ఈ స్థావర జంగమాత్మకమైన జగము అంతయు ఆశామయమైన తత్త్వముతో ఇట ఏ విధముగను ఛేదింప ఉత్సహించను. నేను సృష్టికొఱకై వివృత్తుడనైతిని (అవతారములతో మార్పు చెందితిని) వేరుకాదు కావుననే లోకమున ఎవడు కర్మలను ఆరంభింపక నా ఇష్టము నుండి విడివడగలడు? అని పలికి, తరువాత బ్రహ్మ నష్టచేతస్కులై దేవతలై దండమున నిలచిన యాజయలను గూర్చి ఏ కారణమున పూర్వము నన్ను వంచించి సన్యాసము చేయబడినదో! ఏ కారణమున అంతులేని ఈ విఫలము చేయబడినదో! ఆ కారణమున సుఖమైన భవిష్యత్ఫలము కలుగును. దేవతలు భావములలో (మనస్సులలో) జన్మింతురు గాక. ఓ సురోత్తములారా! మీ స్వేష్ట ప్రకారమున మీ జన్మలు కలుగగలవు. మీరందరు ఆఱు మన్వంతరములలోనికి వెళ్లగలరు. స్వాయంభువముతో మొదలై వైవస్వత మన్వంతరముతో ముగియు మన్వంతరములలో దేవతలు అట్లే జన్మింతురు. వారిని తెలిసి అచట బ్రహ్మ పురాతనమైన శ్లోకమును గానముచేసెను. త్రయిని (ఋగ్యజస్సామ వేదములును) విద్యను, బ్రహ్మచర్యమును, సంతానమును, శ్రాద్ధమును, యజ్ఞమును, దానమును చేయు వీరిలో ఆ బ్రహ్మ విరజుడై (రజోగుణము లేనివాడై) ఇతరుల ప్రశంసతో ఉండును. బ్రహ్మ ఈ విధముగా శ్లోకమును చూచి జయులను దేవతలతో వైవస్వత మన్వం తరము గడవగనే ఇట నా సమీపమునకు రండు అని పలికెను. తరువాత మీరు నాతోబాటు శాశ్వతమైన సిద్ధిని పొందగలరు. ఈ విధముగ వారితో చెప్పి బ్రహ్మ అచటనే అంతర్ధాన మొందెను.

ఈశ్వరుడైన బ్రహ్మ అంతర్థానము చెందగా, ఎక్కడినుండి కూడ భయము లేని వారై దేవతలు, అణిమాది సిద్ధులతో కూడినవారును, యోగబలముతో కూడినవారును అయిరి. తరువాత వారిశరీరములు పండ్రెండు మడుగులైనవి. అవి జయములని చక్కగా పిలువబడినవియు, సముద్రముతో సమానమైనవియు అయినవి. తరువాత స్వాయంభువ మన్వంతరమున నా సృష్టిలో సురలు పుట్టిరి. రుచికి అజితయందు పుట్టిన పుత్రులు పండ్రెండుగురు అజితులు అనబడిరి. విధి, మునయుడు, క్షముడు, నందుడు, అవ్యయుడు, ప్రాణుడు, అపానుడు, సుధాముడు, క్రతు, శక్తి, వ్యవస్థితుడు, అజితుడు ఈ పండ్రెండుగురు అజితులు అనబడిరి. వీరందరు మానస పుత్రులు. వారు యజ్ఞమున దేవతలతో పాటు యజ్ఞభాగమును పొందువారు. స్వాయంభువ మన్వంతరమునను పూర్వము స్వారోచిష మన్వంతరమునను మరల స్వరోచికి తుషితయందు పుత్రులు పుట్టిరి. వారు తుషితులను పేర ప్రసిద్ధిచెందిరి. వారు ప్రాణులను పేరుగల యాజ్ఞకులు. మరల వారు ఉత్తమ మన్వం తరమున తుషితులను దేవతలు. వారు స్వయముగా ఉత్తమునకు సత్యయందు పుట్టిన శుభులైన పుత్రులు. కావున ఉత్తమ మన్వంతరమున సత్యులని పిలువబడిరి. మూడవ ద్వాపరాంతరమున వారు యజ్ఞభాగమును పొందువారైరి. తామస మన్వంతరము రాగా ఆ సత్యులు మరల దేవతలైరి. హర్షులు పండ్రెండుగురు తమసునకు పుత్రులుగా జన్మించిరి. వారు హరులు అనుపేర దేవతలు యజ్ఞ భాగమును పొందువారుగా అయిరి. తరువాత ఆ హరులను దేవతలు చారిష్ణవ మన్వంతరము రాగా వైకుంఠమందు చరిష్ణు వు నకు సురలై జన్మించిరి. పంచమ మన్వంతరమున వారు వైకుంఠులు అను దేవతలు. తరువాత ఆ వైకుంఠ దేవతలు చాక్షుష మన్వంతరమును చేరి సాధ్యయందు ధర్మపుత్రులుగా పండ్రెండుగురు పుత్రులై జన్మించిరి. తరువాత మరల వారు చాక్షుష మన్వంతరము క్షీణింపగా, వైవస్వత మన్వంతర సృష్టి రాగా సాధ్యులైరి. వైవస్వత మన్వంతరమున మొదటి త్రేతాయుగ ప్రారంభము రాగా మారీచుడైన కశ్యపుని వలన అదితియందు ఆ సాధ్యులే అంశముగా పుట్టిరి. వీరు వర్తమాన చాక్షుష మన్వంతరమున ద్వాదశాదిత్యులు. తరువాత స్వాయంభువ మన్వంతరమున ఆసాధ్యులు పండ్రెండుగురు దేవతలుగా జన్మించిరి. ఈ మొదలుగాగల జయులు అప్పుడు శాపముతో పుట్టిరి. దేవశాసనమున, ఈ దేవతల సప్త సంభూతిని (ఏడు జన్మలను) శ్రద్ధాయుక్తుడై పఠించునో,వాడు ప్రత్య వాయమును (పాపమును) పొందడు అని ఈ జయులయొక్క ఏడు లక్షణములు గల ఏడు జన్మలు సంపూర్ణముగా ఇప్పుడు చెప్పబడినవి. మరల ఇంకేమి వినగోరుచున్నారు అని మునులను సూతుడు అడిగెను.

దైత్యుల యొక్కయు, దానవుల యొక్కయు, గంధర్వ, ఉరగ, రక్షస్సుల యొక్కయు, సమస్త భూత పిశాచముల యొక్కయు, పశువుల యొక్కయు, పక్షులయొక్కయు, తీగల యొక్కయు జననమును మరణమును విస్తరముగా మాకు చెప్పుము అని...

ఋషులు అనిరి:

ఈ విధముగా అడుగబడిన సూతుడు ఋషి సత్తములతో ఇట్లు అనెను. కశ్యపుని వలన దితికి పుత్ర ద్వయము కలిగెనని మాచే చెప్పబడినది. కశ్యప పుత్రులైన వారు ఇరువురు కశ్యపుని అశ్వమేధిక యజ్ఞమునందు అతిరాత్రముయొక్క సూత్య దినమున అందరికన్న మొదటివారుగా పుట్టినవారని అనబడిరి. హిరణ్యకశిపుడు అనగా మొదటి ఋత్విజుని యాసనము, దితియొక్క గర్భము నుండి బయల్వెడలి ఉన్నతమైన ఆ వేదసభ అందు కూర్చుండెను. ఆ కారణమున ఆ పనిచేత అతడు హిరణ్యకశిపుడు అనబడెను.

ఋషులు ఇట్లు అనిరి:

మహాత్ముడైన హిరణ్యకశిపుడు అను రాక్షసునియొక్క పుట్టుకను ప్రభావమును ఓ ప్రభూ! మాకు విస్తరముగా చెప్పుము.

సూతుడు ఇట్లు అనెను:

పూర్వము పుష్కర ప్రదేశమున కశ్యపుని అశ్వమేధయాగము జరిగెను. అది ఋషులతోను, దేవతలతోను, గంధర్వులతోను ప్రకాశించినది. అచట ఉత్కృష్టమైన విధా నముచేత శాస్త్రీయముగా అఖ్యాన ప్రారంభమున ఐదు బంగారు ఆసనములు చక్కగా కల్పించబడినవి. ఇచట కుశలచే పవిత్రములైన మూడు ఆసనములు, కూర్చము ఒక ఫలకమున్ను కల్పింపబడినవి. నలగురు ముఖ్యులైన ఋత్విక్కులు. ఆ ఋత్విక్కులకు అ ఆసనములను కల్పింవలెను. అచట శుభమైన ఆసనము హోత కొఱకు ప్రకల్పింపబడినది. అది బంగారుమయమైనది. అట్లే దివ్యమైనది. దివ్యమైన చిత్రాసనము పరచినది. గర్భవతియైన దితి భార్యగా ఉండెను. ఆమె గర్భము పదివేల సంవత్సరములు ఉండెను. అ హిరణ్యకశిపుడు తల్లియొక్క గర్భమునుండి బయలువెడలి హోతకొఱకై ప్రకల్పింపబడిన బంగారు ఆసనమున కూర్చొనెను. అచట అట్లు కూర్చున్న గర్భము (గర్భమున ఉన్న హిరణ్యకశిపుడు). ఆఖ్యాన పంచమములైన వేదములను కాశ్యపుడు చెప్పిన విధముగనే చెప్పెను. అతనిని జూచిన మునులు అతనికి ఆపేరు (హిరణ్యకశిపుడు అని) పెట్టిరి. దానివలన హిరణ్యకశిపుడు పనిచేత ప్రసిద్ధుడు అయ్యెను. అతని తమ్ముడు (తరువాత పుట్టినవాడు) హిరణ్యాక్షుడు. అతని చెల్లెలు సింహిక విప్రచిత్తిని పెండ్లాడినందున రాహు వునకు జన్మను ఇచ్చిన తల్లి అయ్యెను. హిరణ్యకశిపుడు అను రాక్షసుడు నూరువేల యేండ్లు నిరాహారుడై తలక్రిందులుగా ఉండి గొప్ప తపముచేసెను. బ్రహ్మ అతనిని వరముతో అనుగ్రహించెను. బ్రాహ్మణుల నుండియు, సర్వభూతముల నుండియు చావులేక అమరత్వ మును పొంది యోగమువలన దేవతలను అందరిని జయించి సర్వదేవుడై నిలిచెను. దానవులును, అసురులును, దేవతలును, హెచ్చుతగ్గులు లేక సమానులు అగుదురుగాక, మారుతియొక్క మహైశ్వర్యము నాకు వరముగా ఈయబడు గాక! (అని హిరణ్యకశిపుడు బ్రహ్మనుండి వరమును కోరెను). ఈ విధముగా అడుగబడిన బ్రహ్మ అతనికి కోరినది ఇచ్చి ఇంకను అతనికి దివ్యములైన వరములను కూడ ఇచ్చి అచటనే అంతర్థానము పొందెను. రాక్షస హిరణ్యకశిపుని గురించి ‘రాజైన హిరణ్య కశిపుడు ఏ దిక్కునకు పోవునో ఆయా దిక్కునకు ఎల్ల దేవతలు మహర్షులతో పాటు నమస్కరింతురు. ఓబ్రాహ్మణులారా! రాక్షసరాజైన హిరణ్యకశిపుడు ఇటువంటి ప్రభావము గలవాడు. పూర్వము ఆతనికి నరసింహరూపుడైన విష్ణువు మృత్యువు అయ్యెనట. ఆ నరసింహ విష్ణువుచే గోళ్లతో ఆ హిరణ్యకశిపుడు చీల్చబడినాడు అని శ్లోకములతో ఇట్లు గానము చేయబడును. దానివలన నఖములు శుద్ధములు అనబడినవి. హిరణ్యాక్షుని పుత్రులు ఐదుగురు విక్రమము, బల మును కలవారు ఉత్కరుడు, శకుని, కాలనాభుడు, విక్రమించిన మహానాభుడు, భూత సంతాపనుడును-హిరణ్యాక్షసుతులైన వీరు దేవతలకుకూడ జయింప అలవికాని వారు. వారియొక్క పుత్రులు పౌత్రులును సగణుడైన బాడేయుడు అనబడెను. నూరువేలున్న వారు తారకా మయమున నిహతులైరి. హిరణ్యకశిపుని పుత్రులు నలుగురు మహాబలులు. వారిలో మొదటివాడు ప్రహ్లాదుడు, తరువాతివారు అనుహ్లాదుడు, సంహ్లాదుడును, హ్రదుడును. హ్రదుని పుత్రులను వినుడు హ్లాదుడు నిసుందుడును-వీరు హ్రదపుత్రులైరి. విక్రమించిన సుందోపసుందులు ఇరువురు నిసుందుని తనయులు. బ్రహ్మఘ్నుడు, మహా వీర్యుడు, మూకుడును వీరు హ్రదుని కుమారులు. మారీచుడైన సుందపుత్రుడు తాడకను చేరెను. ఆ తాడక బలవంతుడైన రామునిచే చంపబడినది. మూకుడు కిరాతమున సవ్య సాచియైన అర్జునునిచే చంపబడెను. స్వయంభావితులై మహాతపముతో పుట్టినవారును మణివర్తమున నివసించువారును దేవతలచేత గూడ వధింప నలవిగాని వారును అయిన మూడు కోట్ల రాక్షసులు సవ్యసాచిచే చంపబడిరి. అనుహ్లాదుని సుతుడు వాయువు శినీ లాలియును. వారియొక్క లక్ష హాలాహాలము అనుగణము. ప్రహ్లాద పుత్రుడు వైరోచనుడు. ఆతనికి ఐదుగురు పుత్రులు. వారు-గనేష్ఠీ, కాలనేమి, జంభుడు, బాష్కలుడు, శంభుడు. పై నలువురి తమ్ముడు-వీరందరు ప్రహ్లాదపుత్రులు. ప్రాధాన్యమును బట్టి శత్రువులకు జయింప అలవిగాని ఆ ప్రహ్లాదపుత్రులను తెల్పెదను. శంభుడు, నిశుంభుడు, విష్వక్సేనుడు-అనువారు మహోజస్వియైన గవేష్ఠి పుత్రులు. జంభునకు శతదుందుభి, దక్షుడు, ఖండుడు- అను మువ్వురు పుత్రుల విరోధుడు, మనువు, వృక్షాయువు, కుశలీ ముఖుడు-వీరు బాష్క లుని పుత్రులు. కాలనేమి సుతులను గురించి వినుడు. బ్రహ్మజిత్తు, క్షత్రజిత్తు, దేవాంతకుడు, నరాంతకుడు-వీరు కాలనేమి పుత్రులు. శంభుని పుత్రులను వినుడు. ధనుకుడు. అసిలోముడు, నాబలుడు, గోముఖుడు, గవాక్షుడు, గోమంతుడు-వీరు శంభుని పుత్రులు. విరోచనునకు బలి ఒక్కడే ప్రతాపవంతుడైన పుత్రుడు. బలికి నూరుగురు పుత్రులు పుట్టిరి. వారందలును రాజులే. వారిలో ప్రధానులు నలుగురు విక్రమము బలమును కలవారు. వారిలో జ్యేష్ఠుడు వేయి బాహువులు కలిగి ద్రవిణ సమ్మతుడైన బాణుడు. కుంభనాథుడు, గర్దభాక్షుడు, కుశీ -అను మొదలగువారు తక్కిన పుత్రులు. కుశినీ, పూతన అను ఇరువురు బలికి పుత్రికలైన కన్యలు. బలియొక్క పుత్రులును, పౌత్రులును నూర్ల కొలదియు వేలకొలదియు ఉన్నారు. బలి అను పేర ప్రసిద్ధమైన గణము. విక్రమము పౌరుషమును కలది. చంద్రమనస్సుగల బాణునకు ఎఱుపుదనము తగియుండును.

ఎక్కువమంది పుత్రులు నశించిన దితి తన భర్తయైన కశ్యపుని తన సేవతో సంతోష పెట్టెను. ఆ కాశ్యపుడు అమెయెడ ప్రసన్నమైన మనసుగలవాడై, ఆమెచే చక్కగా సేవలను పొంది, వరముతో ఆమెను అనుగ్రహించెను. తరువాత ఆమె కూడ వరమును కోరుకొనెను. భగవత్స్వరూపుడై, ఆమెకు భర్తయైన కశ్యపుడు ఆమెకు కోరిన వరము ఇచ్చుటకు సంసిద్ధుడై ఓ మంగళకరురాలా! నా నుంచి నీవు ఏమి కోరుచున్నావు-అని అడిగెను. ఆమె తన చేతులు జోడించి సంతుష్టిచెందిన మారీచ వంశజుడైన కశ్యపమహా మునిని ఓ భగవత్స్వరూపుడా! అదితికి పుట్టిన నీ కుమారులచేతిలో నేను గర్భశోకమును పొందితిని. కావున దీర్ఘతపముతో గూడి ఇంద్రుని చంపగలిగిన వాడైన పుత్రుని పొందగోరుచున్నాను. నేను తపము ఆచరించెదను. నాకు గర్భమును కలుగ జేయుము అని అడిగెను. ఆమెయొక్క అమాటను విని కశ్యపుడు మహాతేజస్వియై మిక్కిలి దుఃఖితురాలైన, దితితో “అట్లే అగుగాక! నీకు క్షేమము అగుగాక! ఓ తపోధనురాలా! పవిత్రురాలవు కమ్ము. యుద్ధమున ఇంద్రుని చంపగలుగు సత్పుత్రుని కనగలవు అని చెప్పెను. నిండునూరేండ్లు పవిత్రురాలుగా ఉన్నచో ముల్లోకములను అధిపతిగా చరించు పుత్రుని నీవు కనగలవు” అనిపలికి ప్రభువైన మహాతేజస్వి ఆమెతో సంగమించెను. ఆమెను ఆలింగనము చేసికొని భగవంతుడైన కశ్యపమహర్షి ముల్లోకములలో సంచారము చేయుటకు పోయెను. ఆ విధముగా భర్త వెడలిపోగా ఆ దేవియైన దితి మిక్కిలి సంతసించినదై కుశలమైన (దర్భలు నిండిన) వన మును చేరి మిక్కిలి దారుణమైన తపముచేసెను. సహస్రాక్షుడై దేవశ్రేష్ఠుడైన ఇంద్రుడు తపము జేయుచున్న ఆ దితికి ఉత్తమగుణ సంపదతో పరిచర్య చేసెను. అగ్నిని, సమిధలను, దర్భలను, కట్టెలను, ఫలములను, కందమూలములను, ఇంకను కావలసిన అన్నింటిని ఇంద్రుడు తెచ్చి ఇచ్చెను. శ్రమను పోగొట్టునట్టి ఒడలు పట్టుటవంటి చర్యలచేత ఇంద్రుడు సర్వ కాలములందు ఆ దితిని సేవించెను. ఇట్లు ఇంద్రునిచేత ఆరాధింపబడిన దితి సంతోషముతో ఇంద్రునితో ఇట్లనెను.

“ఓ సుర శ్రేష్ఠుడా! ఓ ప్రియ పుత్ర! నీవు చేసిన సేవలచేత సంతుష్టురాలనైతిని. ఇంకను పదియేండ్లు మిగిలియున్నవి. నీకు భద్రమగుగాక. ఆ తరువాత నీవు తమ్ముని చూడగలవు. నిన్ను జయించు పుత్రుడు కావలెనను వాంఛను మనమున ఉంచుకొన్నాను. ఆ జయమును ఇచ్చునట్టి పుత్రుని త్వరలో పొందనున్నాను. ఓ పుత్రుడా! ఆతనితో ముల్లో కముల విజయమును పొందగలను” అని ఈ విధముగా ఇంద్రునితో పలికి, సూర్యుడు మధ్యాహ్నమునకు రాగా, మోకాళ్లపై తల ఉంచి నిద్రావశురాలు అయ్యెను. పాదములపైబడిన తల వెంట్రుకలు కలది అగుటచే అశుచి అయిన ఆ దితిని చూచి, ఇంద్రుడు ఆమెను వంచించు ఒక అవకాశమును పొంది, మనసులో సంతోషపడెను. అపుడు ఇంద్రుడు తెరచుకొన్న ఆమె శరీరమున ప్రవేశించెను. ప్రవేశించి మహా తేజస్సులతో అమితమైన గర్భమును చూచెను. మహాయశస్వియైన ఇంద్రుడు ఆ ప్రధానమైన గర్భమును వజ్రముతో భిన్నముచేసెను. నూరు కణుపులుగల ఆవజ్రముతో భేదింపబడుచున్న ఆగర్భము కంపిం చుచు, సస్వరముగా, భయంకరముగా రోదనము చేసెను. అప్పుడు ఇంద్రుడు-’ఏడవ కుము’ అని ఆ గర్భముతో పలికెను. ఏడు విధములుగా అయిన ఆ గర్భమును, మరల ఒక్కొక్కటి ఏడు విధములు అగునట్లు ఇంద్రుడు వజ్రముతో భిన్నము చేసెను. అంత దితి మేలుకొనెను. “చంపరాదు! చంపరాదు! “ అని దితి పలికెను. తల్లి మాటపై గౌర వము వలన వజ్రము ధరించిన ఇంద్రుడు దితి కడుపునుండి కింద పడెను. వజ్రముతోనే ఇంద్రుడు చేతులు జోడించి దితితో ఇట్లనెను. “ఓ యమ్మా! పాదములపై తలవెంట్రుకలు పడునట్లు అపవిత్రురాలపై నిద్రించితివి. అ అవకాశమును తీసికొని యుద్ధమున ఇంద్రుని జంపగల నీ ఈ గర్భమును భిన్నము జేసితిని. నన్ను క్షమింపుము అనెను” ఆ విధముగా ఆ గర్భము విఫలము కాగా దితి మిక్కిలి దుఃఖితురాలై తన తల్లికి కంటివంటి వాడయిన ఇంద్రునితో ఇట్లు అనెను. “నా అపరాధముననే ఈ గర్భము విఫలముచేయబడినది. ఓ దేవరాజా! ఋషిపుత్ర! మహాబల! నీ అపరాధము ఏమియులేదు. నీ శత్రువును చంపుటలో నీకు దోషము లేదు. అందువలన నిన్ను నేను శపింపను. నీకు ప్రియమునే చేయకోరుడును. నా గర్భమునకు శ్రేయమును గూర్చుము. నా పుత్రులకు ఆకాశమున ఏడు స్థానములు ఏర్పడుగాక!” నా పుత్రులు ఈ యేడు వాత స్కంధములను చరింతురు గాక. సప్తసప్తకులైన నలుబది తొమ్మిదిమంది నా పుత్రులు మరుద్గణములని ప్రసిద్ధి చెందుదురుగాక! పృథివి యందు మొదటి స్కంధము, భాస్కరునియందు రెండవ స్కంధము, సోమునియందు మూడవస్కంధము, జ్యోతిర్గణము నందు నాలుగవ స్కంధము, గ్రహములందు ఐదవ స్కంధము, సప్తర్షి మండలమున ఆరవ స్కంధము ఏర్పడునుగాక! ధ్రువునియందు ఏడవ స్కంధము. నా ఈ పుత్రులు పై స్కంధముల చుట్టు ఇపుడు ప్రతికాలమున ఈ వాత స్కంధములయందు తిరుగుదురు గాక! అందలి మొదటి స్కంధము భూమి అపవి త్రముల నుండి ప్రవహించు అవహము (అవహవాయు స్థానము) మొదటిదైన చరించు గణముగా నా పుత్రకులు ఇందు చరింతురు గాక! రెండవది కూడ పవిత్ర ప్రదేశముల నుండి సూర్యుని వరకు ప్రవహించునది. ప్రవాహవాయుస్థానము. ఈ వాత స్కంధమున రెండవ ‘చరించుగణము చరించుగాక. సూర్యునకు పైన చంద్రుని నుండి ప్రవహించు వాయు ఉద్వహమే అనబడును. దానిని మూడవ వాత స్కంధము అందురు. దీని యందు మూడవ చరించు గుణము చరించుగాక. సోమునకు పైన నక్షత్రముల నుండి ప్రవహించు వాయువు నాలుగవది అయిన సువహ అనునది. నా పుత్రులగు నాలుగవ చరించుగణము అచట చరించుగాక. యక్షులకు (నక్షత్రములకు) పైన గ్రహములవరకు ప్రవహించు వాయువు నివహము ఐదవది. ఈ అయిదవ దానియందు యైదవ స్కంధమున చరించు గణము చరించుగాక. గ్రహములకంటె పైన ఋషులు వరకు చరించు వాయువు ఆరవది ‘పరాహతము’ (పరావహము). అచట ఆరవగణపు నా పుత్రులు చరింతురు గాక. సప్తర్షులకునుపైన ధ్రువ నక్షత్రమువరకు చరించు ఏడవ వాయుస్కంధము పరివహము అచట నాపుత్రులు ఉందురుగాక. ఈ నా పుత్రులు దీనిని అంతయు ప్రతికాలమున చరింతురుగాక! అచట ఆపేరుతో మరుత్తులగుదురు గాక.

తరువాత ఆ తల్లికొడుకులు (దితి-ఇంద్రులు) వారికి పేరులను పెట్టిరి. దానికై మరుత్తులు తమ కర్మలతో వేరువేరుగా అయిరి. సత్త్వజ్యోతి, దిత్యుడు, సత్యజ్యోతి, తిర్యగ్ జ్యోతి, సజ్యోతి, జ్యోతిష్మంతుడు, ఇది ప్రథమ గణము. రెండవ గణమును వినుడు. ఋతజిత్తు, సత్యజిత్తు, సుషేణుడు, సేనజిత్తు, సత్యమిత్రుడు, అభిమిత్రుడు, హరిమిత్రుడు-ఇది రెండవ గణము. మూడవ గణమును వినుడు, కృతుడు, సత్యుడు, ధ్రువుడు, ధర్త, విధారయుడు, ధ్వాంతుడు, ధుని, ఉగ్రుడు, భీముడు, అభియువు, సాక్షిపుడు, అహ్వయుడు-ఇది మూడవ గణము. ఈదృక్కు, అన్యాదృక్కు, యాదృక్కు, ప్రతికృత్తు, సమితి, సంరంభుడు-ఇది నాల్గవ గణము. ఈదృక్కును, పురుషుడును, అన్యాదృక్షమైన (ఇతరులతో సమానమైన) చిత్తము నుండి వెలసిన వారును, సమితా సమితులతో సమానమైన చిత్తమునుండి వెలసిన వారును, విరోధితో సమానమైన చిత్తమునుండి వెలసినవారును గణములవారు. వీరు నలుబది తొమ్మండుగురు వీరు మరుత్తులు అను పేరులతో పిలువబడిరి. దితి- ఇంద్రులు ఇద్దరిచేత అట్లు చక్కగా లెక్కింపబడిరి గదా! ఆ మరుత్తుల పేర్లను విని దితి ఇంద్రునితో ఇట్లనెను. “ఓ పుత్రక! ఇంద్రా! ఈ నా పుత్రులు వాత స్కంధమును చరిం తురుగాక. నా పుత్రులు దేవతలతో కలిసి చరింతురు గాక! నీకు భద్రమగుగాక! ఆమెయొక్క ఆ మాటలను విని సహస్రాక్షుడైన ఇంద్రుడు చేతులు జోడించినవాడై” తల్లీ! అట్లే అగుగాక”-అనెను. నీకు నేను చెప్పినట్లు అంతయు జరుగగలదు. సంశయము లేదు. మహాత్ములైన నీ కుమారులు దేవసమ్మతులైన దేవతలు అగుదురు. అట్లే పుత్రులు దేవతలతోపాటు యజ్ఞభాగమును అందుకొనువారును కాగలరు. కావున ఈ మరుత్తులైన దేవతలు అందరును ఇంద్రుని తమ్ములైన అమరులు, కశ్యపముని వల్ల దితికి పుత్రులైన వారందరు అమరులుగా తెలియవలెను. ఈ విధముగ తపోధనులైన తల్లి-కొడుకులు (దితి-ఇంద్రులు) ఇరువురు నిర్ణయమును తెలిసికొనినవారై స్వర్గమునకు వెళ్లిరి. ఈ మరుత్తులయొక్క మంగళకరమైన జన్మను విన్నవాడును, చదివిన వాడును అనావృష్టి వల్ల కలుగు భయమును పొందడు. తరువాత దీర్ఘమైన ఆయువు కలవాడును అగును.