భిన్నకాలిక తృప్తి సాధము

శంయువు ఇట్లు అనెను:

ఓ ప్రవక్తలలో శ్రేష్ఠుడా (బృహస్పతీ!) పితరులకు ఇచ్చినది కొంచెమైనను సంతోష పెట్టును. కాని ఏది బహురాత్రులు ఉండునది? ఏది అనంతము మోక్షమును ఇచ్చుటకు సమర్థము? అని అడిగెను.

బృహస్పతి దానికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను:

“శ్రాద్ధవేత్తలు తెలిసిన శ్రాద్ధకాలపు హవిస్సులను అన్నింటిని, వాని బలమును, దానిని అనుసరించు ఫలితములను తెలుపుచున్నాను వినుము. నువ్వులతోను, వరియవలతోను, మినుములతోను, జలములతోను, కందమూలములతోను, ఫలములతోను చేయబడిన శ్రాద్ధ దానముతో తాతలు నెలవరకు సంతసింతురు. శ్రాద్ధమున-చేపలతో రెండు నెలలు, లేడి మాంసముతో మూడు నెలలు, కుందేటి మాంసముతో నాలుగు నెలలు, పక్షి మాంసముతో ఐదు నెలలు, పందిమాంసముతో ఆరు నెలలు, మేక మాంసముతో ఐదు నెలలు, దుప్పి మాంసముతో ఎనిమిది నెలలు, నల్లచారల దుప్పి మాంసముతో తొమ్మిది నెలలు, గోవు వంటి అడవి మృగము (గురుపోతు) మాంసముతో పదినెలలు, తాబేటి మాంసముతో పదకొండు నెలలు, గోమాంసముతో సంవత్సరము, పితరులు ఆనందింతురు. గో మాంసముతో కూడిన పాయసము, తేనె నేతులతో కూడిన ఖడ్గ (గండక) మృగము యొక్క మాంసము పితరులకు పండ్రెండేండ్ల తృప్తి కలిగించును. శ్రాద్ధమున ఖడ్గ మృగ మాంసముతో కూడినది పితృలోకమున అనంతమును కూర్చును. అట్లే నల్లని మేకయు, ఉడుమును వీని మాంసము పితరులు అనంతమునకు (మోక్షమునకు) సమర్థ మగును. ఇచట పితరులు గానము చేసిన గాథలు కలవని పురావిదులు చెప్పుదురు. వానిని నేను మీకున్నది ఉన్నట్లు చెప్పెదను వినుడు. త్రయోదశినాడు శ్రాద్ధమున అన్నము ఇచ్చినవాడు మన కులముననే పుట్టవచ్చును. ఏనుగునీడలో శ్రాద్ధమున తేనె, నేతులతో పాయసము ఇచ్చిన వాడును అట్లే అగును. పుత్రులలో ఒక్కడైనను గయకు వెళ్లి శ్రాద్ధము చేసినను, కన్యను వివాహమాడినను, నల్లని కోడెను వదిలిపెట్టినను, తక్కిన బహుపుత్రులు వర్షాకాలమునను మఘలలోను సర్వము లోహమయుడైన బ్రహ్మచే యాగము చేయింప తగినవారు అగుదురు.

శంయువు ఇట్లు అనెను:

ఓ తండ్రీ! గయాది శ్రాద్ధముల ఫలమును అడుగుచున్నాను. చెప్పుడు. దాని వలన పితరులకు కలుగు పుణ్యమును గూడ నాకు చెప్పుడు.

ఆ మాటలకు బృహస్పతి ఇట్లు అనెను:

గయ యందు శ్రాద్ధము, జపహోమ తపస్సులును అక్షయములు అగును. కావున ఓ పుత్రా! నీ పితృక్షయ దినమున అచట శ్రాద్ధ జపహోమ తపములు అక్షయములు అగును. కన్యయందు పుట్టిన సుతుడు ఇరువదియొక్క పితరులను పవిత్రము చేయును. తల్లివైపు తాతలను మరి ఏడుగురిని పవిత్రము చేయునని గయాశ్రాద్ధ ఫలము చెప్పబడినది. (గయా)శ్రాద్ధమున వదలిన అబోతుయొక్క ఫలమును చెప్పెద వినుడు. ఆబోతును వదలినవాడు గడచిన పదితరములవారిని రాబోవు పదితరములవారిని తప్పక పవిత్రముచేయును. జలము నుండి భూమిపైకి ఈది వచ్చిన ఆ అబోతును తాకిన యేకొద్ది నీటితోనైనను వృషోత్సర్గము చేసినవానియొక్క పితరులకు అక్షయము (మోక్షము సిద్ధించును). చివరకు తోక మొదలగువానిని తాకిన జలమంతయు వృషోత్సర్గము చేసిన ఆతని పితరులకు మోక్షమై సిద్ధించును. ఇందు సంశయములేదు. ఆ ఆబోతు కొమ్ములతోను, గిట్టలతోను భూమిని క్రుమ్మి రాసిన చోటులనెల్ల తేనెకాలువలు బయలుదేరి పితరులకు అక్షయము లగును. లక్షమూరల చెరువుతో వేదము తెలిపిన తృప్తి కంటె అధికముగనే వృషోత్సర్గము వలన పితరులకు హెచ్చు తృప్తి కలుగును. శ్రాద్ధకర్మములో బెల్లముతో కలిసిన నువ్వులను, తేనెను కాని, తేనెతో కలిసిన నువ్వులనుకాని ఇచ్చిన అది అంతయు అక్షయము అగును.

బృహస్పతి ఇట్లు అనెను:

మానవుడు దానము ఇచ్చునపుడు బ్రాహ్మణులను పరీక్షింప రాదు. దైవకర్మలోను, పితృకర్మలోను పరీక్షణము చేయుట జరుగుచున్నది. వేదవ్రత స్నాతులందరును (వేదముల చదువు పూర్తిచేసిన వారందరును) శ్రాద్ధభోజన పంక్తిలో పవిత్రులు. వేదోపనిషద్భాష్యములు తెలిసినవారు ముఖ్యులు. వ్యాకరణమునందు అభిరుచి కలవారును ముఖ్యులు. పురాణములను ధర్మశాస్త్రములను చదివినవారు, త్రిణాచికేత పంచాగ్నిని త్రిసుపర్ణమును ఎరిగిన వాడును, శిక్షాది షడంగముల తెలిసినవాడును, బ్రహ్మ (వేదమే) ధ్యేయముగా ఉన్న వాని (వేదవేత్త యొక్క) సుతుడు, ఛందస్సును తెలిసినవాడు, జ్యేష్ఠసామమును తెలిసిన వాడు, పుణ్యతీర్ధములందు అభిషేకము (స్నానము) చేయుటయే వ్రతముగా గలవారు. ముఖ్యములైన యాగములలో అవభృథ స్నానములచే ప్రసిద్ధులైన వారు, నిత్యము వ్రతము చేయువారు, స్వకర్మలలో (వేదోక్త కర్మలలో) ఆసక్తులైనవారు, కోపములేనివారు, శాంతి పరులు-వీరిని శ్రాద్ధమునకు నిమంత్రింప (పిలువ) వలెను. నిత్యము పది పుణ్యకర్మలందు వ్యవస్థితులైనవారు, వీరికి ఈయబడిన దానము అక్షయము అగును. వీరు శ్రాద్ధపంక్తికి పవిత్రులు. యోగధర్మమును అనుసరించి ఉన్న బ్రాహ్మణులు విశ్వాస్యులు. ధర్మాశ్రమములలో వరిష్ఠులైన ఆ బ్రాహ్మణులు హవ్య కవ్యములకు శ్రేష్ఠులు. వారిని పూజించుటచే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుకూడ పూజితులు అగుదురు. వీరిని పూజించిన నరులు పితరులకు సమాన లోకస్థులు అగుదురు. ఇది పవిత్రములకు పవిత్రము, మంగళములకు మంగళము. సర్వధర్మములకు మొదటగా శ్రేష్ఠమైన ధర్మము యోగధర్మమని చెప్పబడును. ఇక శ్రాద్ధమున భోక్తల పంక్తిలో కూర్చుండదగని వారిని గురించి చెప్పెదను వినుడు.

జూదరి, మద్యపానము చేయువాడు, క్షయరోగి, పశుపాలుడు, ఆకారము సరిగా లేనివాడు, గ్రామసేవకుడు, వడ్డీ వ్యాపారి, గాయకుడు, వ్యాపారియు, ఇండ్లను కాల్చువాడు, విషము ఇచ్చువాడు, లంజకొడుకు మీద ఆధారపడి జీవించువాడు, పూవులను అమ్మువాడు, సముద్రమున పోవువాడు, చెడుచర్మము కలవాడు, గాండ్లవాడు, కపటము చేయువాడు, తండ్రితో వివాదపడుచున్నవాడు, ఇంటిలో ఉన్న రంకుమగడు, పరస్త్రీ గమనాది నిందితుడు, దొంగ, శిల్పజీవి, కొండెము చెప్పువాడు, పర్వకారి (అమావాస్యాది పర్వము సర్వ సామాన్యముగ చేయువాడు), మిత్రద్రోహి, గణమునకై యాచించువాడు, నాస్తికుడు, వేదములు విడిచినవాడు, ఉన్మత్తుడు, నపుంసకుడు (అపకారము చేయు) నిందితుడు, గర్భమును చంపువాడు, గురుభార్యను సంగమించినవాడు, వైద్యజీవి, ప్రైషణికుడు (ప్రేరేపకుడు), పరస్త్రీ గమనము చేయువాడు, వేదమును, వ్రతములను, తపములను విక్రయించువాడు- వీరు భోజనపంక్తి బాహ్యులు, నాస్తికునకు, చేసిన మేలు మరచినవారికి, పొగడువానికిని ఇచ్చినది నశించును. వర్తకునకు ఇచ్చినది ఇహపరములకు పనికిరాదు. అట్లే నిక్షేపము (ఉంచుకొనుమని ఇచ్చిన నిధి), ఇల్లడ పెట్టిన సొమ్మును వీనిని అపహరించువానికి, జూదరికి, వేదనిందకునకు ఇచ్చినది ఇహపరములకు రాదు. వడ్రంగి మొదలగు శిల్పికి, వ్యాపారికి, ధర్మమును విడిచినవానికి, నిందించుచు వస్తువులను కొనువానికి, అమ్ముచు వస్తువులను పొగడువానికిని ఇచ్చినది ఇహపరములకు కొరగాదు. అబద్ధమునకు చక్కగా వాసమైన వణిజుడు శ్రాద్ధమునకు తగదు. మారుమనువున పుట్టిన బ్రాహ్మణునకు ఇచ్చినది భస్మములో హోమముచేసిన హవ్యమువలె వ్యర్థమగును. గ్రుడ్డివాడు అరువది (యేండ్లు), నపుంసకుడు నూరేండ్లు, బొల్లి మచ్చవాడు చూచినంత వరకును, పాపరోగి వేయి ఏండ్లు దాతయొక్క ఫలమును నశింపజేయును. బాలిశునకు (అజ్ఞాని) తలను వస్త్రముతో చుట్టికొని భుజించు వానికి దక్షిణ దిక్కు ముఖముజేసి భుజించువానికిని దానమిచ్చిన దాత సత్ఫలము నుండి భ్రష్టుడగును. చెప్పులతో భుజించువాడు, తిరస్కరించిన వాడు-వీరు తిన్నదంతటిని బ్రహ్మరాక్షసుల భాగముగా చేసి ఇచ్చెను. కుక్కలు, రాక్షసులు ఎట్టి పరిస్థితులలో నైనను శ్రాద్ధమును చూడరాదు. కావున తిలలను చల్లి, దానికి పరివృత్తిని చేయవలెను. మరల్చవలెను. రాక్షసులకు నువ్వులు మరల్చునవిగా చెప్పబడినవి. కుక్కలకు పరివృతి (త్రిప్పి పంపుట, చూపుతో పంది (శ్రాద్ధమును) నశింప జేయును. రెక్కలు కొట్టుటచే కోడి శ్రాద్దమును నశింపజేయును. ముట్టైన స్త్రీ స్పర్శతో, కోపించి శ్రాద్ధదానము చేసినచో ఆ శ్రాద్ధములు ఆ హవిస్సులు, పితరులనుగాని, దేవతలనుగాని సంతోషపెట్టలేవు. అతడును స్వర్గమును పొందడు. రమ్యములైన నదీతీరములందును, నదులందును, సరస్సులందును, విజన ప్రదేశములందును చేయబడిన శ్రాద్ధదానముచే తాతలు సంతసింతురు. ఒకప్పుడైన (శ్రాద్ధమున) కన్నీటిని వదలరాదు, నియమయుక్తుడై మాటాడరాదు. భోజనము చేయుచు మత్సరుడై పరస్పరము మాటాడరాదు. విధివిధానమున దర్భలు చేత పట్టుకొని జందెము అపసవ్యము చేసికొని తాను చచ్చునందాక పితృకార్యము (శ్రాద్ధము)ను చేయవలెను. ఈ విధముగ అతడు పితరులను సంతోషపెట్టగలడు. మొదటినుండియు బ్రాహ్మణుని అసుమతితో యథావిధిగా అగ్నిహవనము చేయవలెను. పితరులకు దర్భలు పరచిన చేటయందుకాని, భూమియందు కాని పిండదానము చేయవలెను. వివేకియైనవాడు శుక్ల పక్షపు పూర్వాహ్ణమున శ్రాద్ధము చేయవలెను. కృష్ణ పక్షమున అపరాహ్ణమున శ్రాద్ధము చేయవలెను. కాని దినముయొక్క పదియైదింట తొమ్మిదవ భాగమును దాటనీయరాదు (దినమునకు 15 భాగములు వానిలో తొమ్మిదవభాగము రౌహిణము). ఈ విధముగ మహాత్ములు, మహాయోగులు, మహా తేజస్సులు, దేశకాలములు ఎప్పుడును చూచువారును అయిన పితరులు నిత్యము పూజింప తగినవారు.

పితృభక్తి యందు నిత్యము ఆసక్తుడైనవాడు అనుత్తమ యోగమును బొందును. ధ్యానముతో వారు శుభాశుభకర్మలను (మిత్ర శత్రువులకు) వదలి మోక్షమునకు పోవుదురు. మహాత్ముడైన కశ్యపుడు జగమును మోహింప జేసి యజ్ఞకారణమున ఉద్ధరించి గుహయందు అనగా బుద్ధియందు యోగమును ఉంచెను. ఓ యోగవేత్తలలో శ్రేష్ఠుడా! అమృత రూపమై రహస్యమైన యోగమును ఉద్ధరించి ఆ యోగమును చెప్పెను. అది శాశ్వతమైన మహాధర్మము. దేవతలకు పరమ రహస్యమై ఋషులకు ఆశ్రయమై ఇష్టమైనదై, పితృభక్తులు తమ పితృభక్తిచే ప్రయత్నముతో నిత్యము అవలంబనీయమైనది యోగము. పితృభక్తులు తమ పితృభక్తిచే ప్రయత్నముతో నిత్యము అవలంబనీయమైనది యోగము. పితృభక్తుడు తన ప్రయత్నముతో సంగ్రహము గను, మొత్తముగను ఆయోగమును పొందును. ఈ విషయమున సంశయము లేదు. ఏ తీర్థములలో ఏ నదులలో శ్రాద్ధము అక్షయమగునో, వేనియందలి శ్రాద్దము స్వర్గమును పొందించునో సంగ్రహముగ అది అంతయు నీకు చెప్పబడినది.

బృహస్పతి ఇట్లు అనెను:

ఈ విధముగ శ్రాద్ధ కల్పమును విని అసూయచెందు నాస్తిక నరుడు తమస్సుతో కప్పబడినవాడై ఘోర నరకమున మునుగును. సంయత మనస్కుడు గూడ మహారోగముతో అంత్యకాలమున బాధ చెందును. వేదాశ్రయమునుండి వీడిన చిత్తముకలవాడై కుంభీ పాకములు అను (నరకములను)పొందును. నాలుకను కోయు దొంగను చేరి, వానితో పాటు నరకమును పొందుదురు. యోగమును ద్వేషించువారు భూమి ఉన్నంత వరకు సముద్రమున మట్టిగడ్డలై ఉందురు. కావున శ్రాద్ధమున ధర్మము చెప్పబడినది. పురుషుడు దానిని శ్రద్ధతో ఆచరింపవలెను. అపవాదము చేయవలదు. విశేషించి యోగుల విషయమున బొత్తిగ పనికిరాదు. ఈ అపవాదమును చేయుటచే పురుగై అచటనే పరిభ్రమించును. ధ్యానులకు మోక్ష కారణమైన యోగమును నిందించువాడును, దానిని వినువాడును ఘోరనరకమును పొందును. మానవుడు యోగీశ్వరనిందవలన మొత్తము తమస్సుచే ఆవరింపబడిన భయంకర నరకమును తప్పక పొందును. నిగ్రహించిన ఆత్మలుగల యోగీశ్వరుల వేదనను వినువాడు కుంభీపాక నరకమున చాలకాలము మునిగి ఉండును. ఇందు సంశయములేదు. మనస్సుతోగాని, వాక్కుతోగాని, క్రియతోగాని యోగుల విషయమున ద్వేషమును వహింపరాదు. అట్లు చేసినవాడు భూలోకముననే మరణించి పిశాచమై అన్నమును భుజించును. సంశయములేదు. వేదపారగుడు ఆత్మయొక్కపారమును పొందలేడు. తన కర్మలచే ముల్లోకముల మధ్యచరించును. ఋగ్యజుః సామవేదముల యొక్కయు తదంగముల యొక్కయు అంతమును దెలిసినవాడు ఏవికార మును పొందకయే పోవును. వికారముయొక్క పారమే ప్రకృతియొక్క పారమును పొందును. గుణముల యొక్క త్రయి (త్రిగుణసమూహము) త్రిగుణాంత పారమును పొందునది. ఇక ఇరువది నాలుగవ తత్త్వము సాంఖ్యయోగము యొక్క పారమును తెలిసినది. అయనాంత (మార్గము చివరి) పారమును పొందినవాడు నిజమైనపారగుడు. ఈ మొత్తము ఆత్మతత్త్వ సృష్టి ఎట్లో! అట్లే మరల ఆ సదాత్మయొక్క ప్రళయము కూడ. యోగవేత్త తన యోగబలముచే దీనిని అంతయును ఉపసంహరింపవలెను. ఆతడు సర్వపారముల క్రమ మార్గమున కనబడు వాడు. వేదములు తెలిసినవాడు యోగవేత్తయై తెలియదగిన పరమాత్మతత్త్వమును తెలియును. ఆతనినే వేదవేత్తగను వేదపారగునిగను చెప్పుదురు. తెలియదగిన దానిని, తెలియవలసిన దానిని, యథావిధిగా తెలిసికొనినవానిని వేదవేత్తనుగా చెప్పుదురు. తక్కిన వారు వేదచింతకులు మాత్రమే. పితృభక్తుడు యజ్ఞములను, కామములను, వివిధ జ్ఞానములను, ఆయువును, సంతానమును, ధనములను పొందును. శ్రాద్ధేయుడు శ్రాద్ధము చేయదగినవాడు, శ్రాద్ధకల్పము - వీనిలో తరువాతిది నియతమగును. అపుడు దానిని అనుసరించిన శ్రాద్ధ కర్త తీర్థమున దాన ఫలములు మొదలగు వీని అన్నింటిని పొందును. ఆతడు భోక్త పంక్తికి పావనుడు, బ్రాహ్మణులలో ముందుగా భుజించువాడును అగును. దీనిని (కల్పమును) బ్రాహ్మణులకు చదివించి సర్వకామములను పొందును. నిత్యము దీనిని విన్నవాడు కూడ అంతులేని స్వర్గమును పొందును. అసూయలేని వాడు, కోపమును జయించినవాడు, లోభమోహములు లేనివాడు, తీర్థములన్నింటి ఫలమును, దానాదుల ఫలమును పొందును. ఇది (శ్రాద్ధకరణము) శ్రేష్ఠమైన మోక్షో పాయము. ఇది ఉత్కృష్ణమైన స్వర్గోపాయము. దీనియందు లోకమున కూడ మిక్కిలి ఆనందము కలుగును. కాబట్టి ప్రయత్నముతో శ్రాద్ధమును చేయవలెను. ఈ శ్రాద్ధకల్ప విధిని ఏకాగ్ర మనస్కుడై అలసట లేక సభలోను పర్వసంధులలోను చదువువాడు సంతానవంతుడు అగును. ఉత్కృష్టమైన తేజస్సుతో స్వర్గవాసులకు సమాన లోకవాసి అగును. ఈ కల్పమును చెప్పిన బ్రహ్మకు నమస్కారము. మహాయోగేశ్వరులకును నిత్యము నేను నమస్కరింతును. ఓ తండ్రీ! ఈ పితరులు - దేవతలకుకూడ దేవతలు. ఈ యేడు స్థానములలో ఆ పితరులు బాధలేనివారు. వీరు బ్రహ్మయొక్క కుమారులు. వీరందరును మహాత్ములు. మొదటిది యోగముల గణము. అది నిత్యము యోగమును వృద్ధి జేయునది. రెండవది దేవతల గణము. మూడవది దేవ శత్రువులైన రాక్షసులగణము. తక్కినవి బ్రహ్మచారి గణములుగా తెలియవలెను- అని ఈ గణములన్నియు చెప్పబడినవి. దేవతలు వీరిని అందరిని పూజింతురు. వీరు అందరిలో ఉందురు. బ్రహ్మచర్యాదులైన నాలుగు ఆశ్రమములలో గూడ వరుసగా వీరిని పూజించును. బ్రాహ్మణాదులైన నాలుగు జాతులు యథావిదిగా వీరిని పూజించవలెను. అట్లే సంకర జాతులు మ్లేచ్ఛులును వీరిని పూజింతురు. పితరులను భక్తితో పూజించినవారిని పితరులు పూజింతురు. పుష్టి కామునకు పితరులు పూజ్యులు. సంతానము కోరువారికిని పితరులు పూజ్యులు. పితరులు పుష్టిని ప్రజలను, స్వర్గమును ఇత్తురు. పుత్రునకు దేవకార్యమున కంటె పితృకార్యము విశిష్టమైనది. కావున దేవతలకు పితరులు ముందుగా స్వయముగా సంతోషపెట్ట తగినవారు. యోగగతి సూక్ష్మమైనది కాదు. పితరులకు ఇది పరాగతి. దూరముగా ఉండియు తపస్సుతో చర్మ చక్షువులతోనే చూడబడును. అందరికి వెండి పాత్రముగాని, వెండితో కలిసిన పాత్రగాని పవిత్రమైనదిగను, ఉత్తమమైనది గను, దేవతలకు పితరులతో సహా ఉపయోగించతగినది. బాంధవులు ఎవరికి నామ గోత్రములు చెప్పి మూడు పిండములను దర్భలు ఉత్తరముగాగల భూమియందు అపసవ్య విధానముతో పెట్టుదురో! ఆ పిండములు విశ్వము అంతట నుండి పితరులను సంతోషపెట్టును. ప్రాణి ఏ ఆహారము తినువాడో, ఆ ఆహారము అతనికి కలుగును. ఆవుల కొట్టమున కనబడకుండ ఉన్న తల్లిని దూడ ఎట్లు చేరునో! అట్లే శ్రాద్ధమంత్రము శ్రాద్ధమున ఇచ్చిన అన్నమును పితరుడైన ప్రాణి ఉన్నచోటికి చేర్చును. నామము గోత్రము మంత్రము-ఇవి శ్రాద్ధ దత్తమైన అన్నమును పితరులకు చేర్చును. నూర్లజన్మలు అందినను శ్రాద్ధ దత్తాన్న తృప్తి వారిని చేరును. ఈ విధముగా పరమేష్ఠియైన బ్రహ్మచే పితరులు సంస్థ నిలుపబడినది. అక్షయమును కోరు పితరుల యొక్క పితృ లోకముల యొక్కయు ప్రథమ సృష్టి జరిగినది. అను ఈ పితరులు దేవతలు. ఆ దేవతలు మరల పితరులు. శ్రాద్ధమున పుణ్యాత్ములై దౌహిత్రులు (కూతురు కొడుకులు) యజమానులుగా నాచే చెప్పబడిరి. లోకములు (పితృలోకములు)ను కూతుళ్లును, కూతురు కొడుకులును, పుత్రులును, శౌచముతో దానములును, తీర్థములును, ఫలములును, బ్రాహ్మణులును, ఆ యావర విధియు, అక్షయత్వమును ఈ సర్వము యధాన్యాయముగా పూర్వము బ్రహ్మ చెప్పినట్లు చెప్పబడినది.

బృహస్పతి ఇట్లు అనెను:

ఈ శ్రాద్ధ కల్పము అంతయు నిత్యము వినుచున్న ఋషులకు అంగిరసుడు ఆ పితరుల సభలో అడిగిన సంశయములకు గూడ ఉత్తరముల చెప్పెను. పూర్వము వేయి యేండ్ల సత్రయాగము ప్రవర్తిల్లగా అందు ప్రభువైన బ్రహ్మ దేవతయై గృహపతిగా (యజమాని) ఉండెను. అచట నూరేండ్లు దేవతలు కూడిరని శ్రుతి. ఈ విషయములో పూర్వము బ్రహ్మవాదులైన ఋషులచే శ్లోకములు గానము చేయబడినవి. అపుడు ఆ సత్ర యాగమున దీక్షితుడై పరమాత్ముడైన బ్రహ్మకు పితరులు అక్షయమును కోరి లోక హితమును కోరి పరమేష్ఠియైన బ్రహ్మచే అచటనే అత్యుగ్రము సంభవించినది అని బృహస్పతి చెప్పెను.

ఈ విధముగా చెప్పి మరల సూతుడు ఇట్లు అనెను:

ఈ విధముగ పూర్వము బుద్ధిమంతుడైన పుత్రుడుగ బృహస్పతి పితృ వంశమును చెప్పెను.