పితృవర్ణనము

ఓ సూతా! ఇలాపుత్రుడైన పురూరవుడను రాజు ప్రతినెలలో అమావాస్యను ఎట్లు పొందెను? అప్పుడు అతడు పితరులకు ఎట్లు తర్పణము జేసెను? ఈ విషయములను మాకు సవిస్తరముగా తెలియజేయుడు అని శాంశపాయనుడు అనెను.

సూతుడు అనెను:

ఓ శాంశపాయనా! ఆ పురూరవుని ప్రభావమును చెప్పెదను. అట్లే ఇలా పుత్రుడైన పురూరవుని ఆదిత్యుని యొక్క ప్రభావమును అట్లే పురూరవుని యొక్కయు మహాత్ముడైన సోముని(చంద్రుని) యొక్కయు యోగమును తెలిపెదను. నీటిసారమై అమృతమునుండి చంద్రుని వృద్ధులు, కృష్ణ, శుక్ల పక్షములు, పితృ పక్ష నిర్ణయము. చంద్రుని నుండి అమృతము లభించుట పితరుల తర్పణము. అట్లే కావ్యాగ్ని నుండి (శుక్రాగ్నినుండి) పొందిన సోమరసముగల పితరుల దర్శనము. ఇలా పుత్రుడైన పురూరవుడు పితృతర్పణము చేసిన విధము మొదలైన వృత్తాంతమును అంతటని చెప్పెదను. వరుసగా ఆ పర్వములను కూడ చెప్పెదను. చంద్రసూర్యులు ఒకే నక్షత్రమున (తో) ఒక రాత్రి-ఒక మండలము నందు కలిసియున్నపుడు అమావాస్యలో నివసింతురు. అపుడు ఆ పురూరవుడు సూర్య చంద్రులను చూచుటకు పోవును. అపుడు అచట అభివాదనము చేసి (నమస్కరించి) కాలమును అపేక్షించినవాడై వేచి ఉండును. ఇలాపుత్రుడును, విద్వాంసుడును అయిన పురూరవుడు పితృదేవతలకై అమృతమును పరిస్రవించుచు క్షీణించుచున్న చంద్రుని నుండి (కృష్ణపక్షమున) అమృతము స్రవించుట వలన పితృమంతుడైన చంద్రుని, పురూరవుడు పగటిలో ఉన్నవాడై ప్రతిమాసమున ఉపాసించును. రెండు లవముల కాలము (లవము అనగా కనురెప్పపాటు కాలములో ఆఱవవంతు) చంద్రకళలేని (కుహువు) అమావాస్య నంతయు ఆ చంద్రసూర్యులను ఇద్దరిని విచారించి ఆతడు (పురూరవుడు) సినీవాలి (చంద్రకళతో గూడిన అమావాస్య) ప్రమాణముతో సినీవాలిని ఉపాసించు వాడయ్యెను. కుహువు విషయమున అయిన యెడల చంద్రకళలేని అమావాస్యనుగా దెలిసికొని కుహువునే ఉపాసించును. అపుడు అతడు (పురూరవుడు) సూర్యుని యందే (చంద్ర సూర్యులను) ఏక కాలమున చూడదలచి బాగుగా చూచును. చంద్రుని నుండి పదియైదు (శుక్లపక్ష దినముల) సుధామృత పరిస్రవములచే మాస తృప్తికొరకు సుధామృతము ఎందులకు (ఎక్కడి నుండి ప్రసవించును? కృష్ణ పక్షమున ఆ విధముగా (సూర్య) కిరణములచే పితుకబడుచున్న చంద్ర సుధామృతమును త్రాగి వెంటనే ఆ చంద్ర సంబం ధమైన మధువుచే ఆ శుక్ల పక్షమునందు కుఱియుటకు ఆసక్తి గలుగును కావున సుధా మృతము ప్రసవించును. ఆ రాజశ్రేష్ఠుడు నిర్వాపణమునకై పైతృక విధితో ఈయబడిన సుధామృతముతో పితరులను తర్పణములతో సంతృప్తిపరచు చుండును. సోమసంబద్ధులైన బర్హిషదులను (దర్బలపై గూర్చుండువారిని) కావ్యాగ్ని ష్వాత్తులను కూడ అట్లే తృప్తిపరచు చుండెను. అగ్నియని చెప్పబడిన ఋతువు సంవత్సరముగా సమ్మతమైనది. దానినుండి ఋతువులు జనించినవి. ఋతువులనుండి అర్తవములు పుట్టినవి. అర్తవములు అర్థమాసములు అనబడినవి. పితరులు సంవత్సర పుత్రులు. ఋతువు పితామహులైన మాసములు ఋతువే సంవత్సర పుత్రులు, ప్రపితా మహులు దేవతలు. ఐదు సంవత్స రములు బ్రహ్మయొక్క కుమారులు సోమునకు పుట్టిన వారు సౌమ్యులు. కవి కుమారులు కావ్యులు, ఉపహూతులు దేవతలు అనబడిరి. అజ్యవులు (నేయి(త్రావువారు) కావ్యులు అనబడిరి. ఈ పితృజాతులు అందరును తృప్తి పొందుదురు. ఆ పితృజాతులు కావ్యులు అనియు బర్హిషదులు అనియు అగ్నిష్వాత్తులు అనియు మూడు విధములుగా ఉన్నారు. యజ్వానులైన గృహస్థులు ఋతువయి నిశ్చయముగా బర్హిషదులు అగుదురు. యజ్వానులైన గృహస్థులు, అగ్నిష్వాత్తులు, అట్లే ఆర్తవులు, అష్టకాపతులు, కావ్యులును పంచాబ్దులు అనబడిరి. వారిని గూర్చి వినుడు. వీటికి అగ్ని సంవత్సరము సూర్యుడు పరివత్సరము. సోముడు ఇద్వత్సరము. వాయువు అనువత్సరము అనబడురు. యుగాత్మకములైన అయిదు అబ్దములకు రుద్రుడు వత్సరము. వారు లేఖులు (దేవతలు), అగ్నులును దివాకీర్త్యులు (పగలు కీర్తింపదగినవారు) అనబడినారు. వీరు ప్రతి మాసమున ఆకాశమునందు అమావాస్యగా అమృతము త్రాగుదురు. ఆ కారణముచేత పురూరవుడు తాను ఉన్నంత కాలము వారిని అమృతము చేత తృప్తి చెందచేయుచుండెను.

ప్రతి మాసమున సోముని (చంద్రుని) నుండి స్రవించుట వలన అది సోమపాయులైన పితరులకు సుధామృతమైనది. ఈ విధముగా సోమసంబంధియైన ఆ అమృతమును సుధా, మధువును కృష్ణపక్షమున పదియైదు చంద్రకళలవలె వరుసగా చంద్రమున పుట్టి జలమయములైన ముప్పది ముగ్గురు దేవతలు త్రాగుదురు. ఆ విధముగా నెలరోజులు సుధామృతమును త్రావి చతుర్దశినాడు వెళ్లుదురు. ఈ విధముగా దేవతలచే త్రాగబడుచు చంద్రుడు పదియైదవ భాగమున ఉన్నవాడై అమావాస్యను చేరును. ఆ పితరులు సుషుమ్న అను సూర్య కిరణములచే తనివి చెందిన (నిండిన) సుధామృతమును యథాక్రమముగా అమావాస్యయందు (గా) ముప్పది ఆరు రెప్పపాట్ల కాలము త్రావుదురు. తరువాత చంద్రుడు త్రాగబడి క్షీణింపగా, ఈ సూర్యుడు సోమపాయులుగా (చంద్రుని త్రాగు) పితరులకై సుషుమ్నము అను ఒకకిరణముచేత సుధను నింపి సంతృప్తి పరచెను. (చంద్ర) కళనిశ్శేషముగా, మరల చంద్రుని (సుధాకళలతో) నింపి సంతృప్తి పరచెను. దినక్రమమును బట్టి ప్రతిభాగము సుషుమ్నమను సూర్య కిరణములతో అమృత కళలు నింపబడుచున్న చంద్రుని శుక్ల పక్ష కళలు నింపబడుచున్నవి. కృష్ణపక్ష కళలు క్షీణించుచున్నవి. ఈ విధముగా సూర్యుని వీర్య (బల)ముచే చంద్రుని శరీరము (సుధాకళలతో) నిండి సంతృప్తి చెందబడినదగును. కావున పూర్ణిమయందు తెల్లనివాడై సంపూర్తిగా ఉన్న మండలము (బింబము) కలవాడై కనబడును. శుక్ల, కృష్ణ పక్షములలో చంద్రుని సంసిద్ధి ఈ విధముగా ఉండును. అని ఈచంద్రుడు పితృమంతుడుగా (పితృదేవతలు గల వాడుగా)చెప్పబడినాడు. పదియైదు సుధామృత పరిస్రవములచేత క్రమముగా జేరినవాడై ఇద్వత్సరముగ కూడ చెప్పబడినాడు.

ఇక, చెఱకును వెదురునకును గ్రంథులు (ముడులు) గల సర్వములు (కణుపులు) ఉండినట్లు, పర్వములను అట్లే పర్వసంధులను చెప్పెదను. అర్థమాస పర్వములు శుక్ల, కృష్ణ పక్షములుగా పెద్దలు తెలుపుదురు. పూర్ణిమ, అమావాస్య అనునవి గ్రంథులు సంధులును అనబడును. అర్ధమాసములు పర్వములు. అవి తృతీయా తిథి మొదలుకొని (పూర్ణిమ, అమావాస్యల వరకు ఉన్న భాగము) ఉండును. సాయంకాలమునను ప్రతిపత్తిథి యందును పర్వసంధులందు అగ్న్యాధాన క్రియ చేయబడును కావున ఆ కాలము పౌర్ణ మాసికము. వ్యతిపాతమున సూర్యుడు ఉండగా యుగాంతరమున చంద్రునకు లేఖోర్థ్వ మగును. సూర్యుడు యుగాంత రోదితుడైనను చంద్రునకు లేఖోర్థ్వము అగును. వ్యతీ పాతమున పూర్ణిమయందు చంద్ర సూర్యులు పరస్పరము చూచుకొన్నప్పుడు ఆ కాలము సీమాంతమున వ్యతీపాతమే అగును. సూర్యుని చెప్పు కాలమానమును చూచి సంఖ్య ముందుకు పోవును. అది క్రియా కాలము. అది కాలమువలన వెంటనే విధింపబడును. పూర్ణ (శుక్ల) పక్షమున పూర్ణచంద్రుని రాత్రి సంధులలో పూర్ణిమ ఉండును. పితరులు దేవతలతో పాటు ఆ పూర్ణిమను చూతురు. కావుననే మొదటి పూర్ణిమ అనుమతి అనబడినది. (చతుర్దశితో గూడిన పూర్ణిమ అనుమతి) పూర్ణిమయందు చంద్రుడు మిక్కిలి ప్రకాశించును. చంద్రునియొక్క రంజనమువలన (కళలచే పూర్ణముగా ఉండి పూసినట్టుగా నుండి నందున కవులు ఈ సర్వ కళాసంపూర్ణుడైన చంద్రుడు గల పూర్ణిమ ‘రాకా’ అని వర్ణింతురు. చంద్ర సూర్యులు కూడి ఒకే నక్షత్రమందు పదియైదవ (పంచదశి) రాత్రి అంతయు ఉన్నందున అది అమావాస్య అనబడినది. ఇక తరువాతి (శుక్ల) పక్షము యొక్క పూర్ణిమయందు (అన్ని) కళలతో చంద్రుడు వ్యక్తుడు అగును. వ్యతీపాతమున పగటియందు పూర్ణమై ఉన్నప్పుడును, అపరాహ్ణమునందును, చంద్రసూర్యులు పూర్ణాత్ములై పరస్పరము చూచుకొన్నప్పుడు పూర్ణిమ అగును. చంద్రసూర్యులు ఒకచోట చేరి పరస్పరముగా విచ్ఛిన్నమైన ఆ అమావాస్యను చూచినపుడు అది ‘దర్వ’ (సూర్యేందు సంగమము) అనబడును. పర్వసంధులు అమావాస్యలో రెండేసి లవముల (ముప్పది ఆఱు కనురెప్పపాట్లు) కాలము రెండు అక్షరములుగా ‘కుహు’ (చంద్రకళలేని అమావాస్య)గా చెప్పబడినది. చంద్రుడులేని అమావాస్య (కుహువు) మధ్య సూర్యునితో కలిసి ఉండును.

చంద్రుడు రాత్రి సగముతో కూడిన పగటితో సూర్యునిపొంది, వెంటనే సూర్యునితో విముక్తిని పొంది, ప్రాతఃకాలోత్సవము కలవారు అగుదురు. వారి సంగమము రెండు కాలములు. రవి మధ్యాహ్నమున పడును. శుక్లపక్షము యొక్క ప్రతిపత్తు (తిథి) సూర్య మండలము నుండి విడిపడుచున్న మొదటి మండలముల మధ్యనున్న చంద్రుడు అగును. అప్పుడు అది సూర్యేందు సంగమరూపమైన దర్శ (అమావాస్య) యొక్క కాలము. వషట్క్రియయు అగుచున్నవి. దీనిని ఋతువు యొక్క ముఖము (ప్రారంభము)గా తెలియవలెను. అది ఈ పర్వదినము యొక్క అమావాస్యారూపమైనది. క్షీణచంద్రుడుగల బహుళ పక్షమున పగటి పర్వమునందు అమావాస్యను గ్రహింతురు. కావుననే సూర్యుడు పగలే అమావాస్యను గ్రహించును. ఇందువలననే దేవతలచేత అమావాస్యనుగూర్చి పగలే గ్రహింపబడుచున్నది. ఆ కళలయొక్క స్థితి బహుమానింపదగినది. అజడాత్మకులైన పండితులచే తిథులయొక్క నామధేయములు కూడ చెప్పబడినవి. సూర్యచంద్రులు ఇద్దరు పరస్పరము చూచుకొందురు. తరువాత క్రమముగా చంద్రుడు సూర్యమండలము నుండి బయల్వెడ లును. చంద్రుడు రాత్రింబవళ్లు ద్విలవముతో సూర్యుని స్పృశించును. ఆకాలము దర్శ (అమావాస్య) యొక్క ఆహుతికాలము. వషట్ర్కీయయును కోకిల కూతకు సమానమైన కాలముతో గుర్తింపబడినందున అమావాస్య కుహు అనబడినది. సినీవాలీ ప్రమాణముతో చంద్రుడు క్షీణశేషుడుగా ఉండి అమావాస్యలో సూర్యుని ప్రవేశించుటచే సినీవాలి అనబడినది. పర్వముయొక్క పర్వకాలము వషట్ర్కీయయు సమానులు. చంద్ర సూర్యవ్యతీపాతములు రెండును పూర్ణిమలు అనబడినవి. ప్రతిపత్పంచదశులలో ద్విమాత్రి కాలము పర్వకాలము. కుహుసినీవాలుల సముద్రకాలము రెండులవములు గలది. అర్కాగ్ని మండలమైన సోమునందు పర్వకాలము కలాశ్రయమైనది. ఈ విధముగా రాత్రియొక్క పర్వసంధులలో శుక్లపక్షము. దీనిలో చంద్రుడు సంపూర్ణమండలుడై రాహువుచే గ్రహింపబడును (గ్రహణమేర్పడును). శుక్ల పక్షపు పదియైదవ దినమున దివసక్రమమున పదియైదు కళలచే చంద్రుడు సంపూర్ణ కళామంతుడుగా జేయబడును గాన పూర్ణిమ అనబడినది. కావున పదియైదవ కళ చంద్రుని యందు ఉండును. పదియాఱవ కళ ఉండును. కావుననే పంచదశి (అమావాస్యయందు చంద్రునకు మహాక్షయముగలుగును. ఈవిధముగా పితృ దేవతలు సోమ(చంద్రు)ని త్రాగుదురు. సోముని వృద్ధిచెందించువారును అగుదురు కావున   ఆ పితృదేవతలే ఋతువులును ఋతువులకు సంబంధించిన వారును అని ఈ విధముగా ఆ దేవతలు భావింతురు.

ఇక మాసశ్రాద్ధమును భుజించువారైన పితరులను గూర్చియు, వారి గతిని గూర్చియు, బలమును గూర్చియు, శ్రాద్ధ మార్గమును (విధిని) గూర్చియు చెప్పెదను. మరణించిన వారి పోకయును, మరల రాకయును ప్రసిద్ధమైన తపస్సుతోగూడ తెలియుటకు అలవికాదు. మాంసముతో ఏర్పడిన కన్నుతో తెలియుట సాధ్యమగునా? ఈ పితరులను శ్రాద్ధదేవులనుగా తెలియవలెను. పితరులు లౌకికులుగా చెప్పబడినారు. సౌమ్యులు, యాగము చేయువారు, యోని నుండి జనించని అందరు దేవతలు పితరులు. దేవతలందఱు పితరులను భావింతురు. మనుష్యులు పితరులను వారికంటే వేరైనవారును లౌకికులు అనబడిరి. పితయు, పితామహుడును, ప్రపితామహుడును సోమునితో యాగము చేయువారును సోమవంతులు అనబడినారు. యాజ్వానులు అనబడినవారు బర్హిషదులు అనబడినారు. వారీకర్మలందు పూనుకొనినవారై, దేహము పుట్టినప్పటి నుండి సంతుష్టి చెందుదురు. వారిలో హోమము చేయువారును యాగము చేయింపతగిన వారిని యాగము చేయించు వారును అగ్నిష్వాత్తులు అనబడినారు. వీరు ఆశ్రమ ధర్మమును అనుసరించి ప్రస్థానము నందున్నవారు. వీరుచివరకు శ్రాద్ధకర్మతో నశింపరు. బ్రహ్మచర్యము చేతను, తపస్సుచేతను, యజ్ఞముచేతను, సంతానముచేతను, శ్రద్ధచేతను, విద్యచేతను, దానము చేతను ఏడు విధములుగా దేహపతనమగునంత వరకును కర్మలలో పూని యుందురు. పితరులతో బాటు సూక్ష్మకులై, సోమపాయకులై స్వర్గమును పొందినవారై దేవతలతో స్వర్గమున సంతసింతురు. పితృమంతుని (తండ్రిగలవానిని) ఉపాసింతురు. శ్రాద్ధ క్రియగల సంతానవంతులకు ప్రశంసయే సిద్ధమనబడినది. వారి కులమువారి చేతను, బంధువుల చేతను, వారికి నివాసముగా ఈయబడిన అన్నముగూడ ప్రశంసింపబడినది. సోమ లౌకికులు ఒకనెల శ్రాద్ధమును భుజించువారై తృప్తిని పొందుదురు. వీరు మనుష్యులైన పితరులు. వారు మాసశ్రాద్ధభుజులు. వారికంటే వేరైన వారు తక్కిన కర్మయోనులలో సంకీర్ణులైనవారును, ఆశ్రమధర్మముల నుండి భ్రఘ్ఠలైన వారును, స్వధాస్వాహలు లేనివారును, భిన్నదేహులును దురాత్ములును యముని ఇంటిలో ప్రేతులైనవారును, యాతనాస్థానమును (తీవ్రవేదనా స్థానమును) చేరి తాము చేసిన కర్మలకు దుఃఖింతురు. దీర్ఘాయుష్యము గలవారును, మిక్కిలి ఎండి క్షీణించిన వారును, వర్ణము మారినవారును, వస్త్రములు లేనివారును ఆకలిదప్పులనుకొన్నవారునునై, ఇటునటు పరుగెత్తుదురు. ఆ తరువాత, నదులు, సరస్సులు, చెఱువులు, బావి - వీనిలో నీటిని కోరువారు అగుదురు. వణుకుచున్న వారై ఇతరులు అన్నములను పొందగోరుదురు. రాకపోకలుగల యా స్థానములలో వండబడుదురు. శాల్మలి (ముండ్ల బూరుగు) చెట్టునందు వైతరణి (నరకము నందలి నిప్పుల ఏటి) అందు, కుంభీపాకములందును, కరంభవాలుక (పేల పిండివంటి వేడి ఇసుక) యందును, అసిపత్రవనము (కత్తి ఆకుల వనము) నందును, శిలలను పిండిచేయుట యందును, వారి వారి పాపకర్మలను అనుసరించి పడవేయ బడుదురు. అచట వారికి స్వర్గ భిన్నమైన నరకము నందువలె దుఃఖ స్థానములు ఉండును. అవి లోకాంతరమున ఉన్న వారియొక్క వివిధములైన నామ, గోత్రములను బట్టి ఉండును. ప్రేత స్థానములలో అధిష్టించిన వారై భూమిపై అపసవ్యదర్భలందు మూడు పిండములిడి పతితులను తృప్తి పొందచేయుదురు. యాతనా (తీవ్రవేదనా) స్థానమును పొందలేక ఏడు విధములుగా సృజింపబడినవారు భూతము(ప్రాణు)లలో పశువులు మొదలుకొని స్థానముల వరకున్న వారియందును, వారి కర్మలందును అనేక రూపములైన జాతులందును, తిర్యగ్యోని జాతులందును. ఏ ఆహారములవారు అగుదురో, ఇచట ఆయా యోనులందు ఆయా చోటునందు ఆయా ఆహారమును శ్రాద్ధదాత చేకూర్చును. బంధువున్నచోట సకాలమున న్యాయముగా వచ్చిన పాత్రను, శాస్త్రీయముగా సమర్పింపబడిన అన్నమును ఇచ్చినది ఇచ్చినట్లుగా పొందును. ఆవుల మందలో కనబడకుండా తిరుగుచున్న తల్లి ఆవును పిల్లదూడ తెలిసికొనునట్లు మంత్రము, శ్రాద్ధమున ఈయబడిన పదార్థములను కర్తకు ఇష్టులుగా సంకల్పించిన పితరులకు చేర్చును.

ఈ విధముగా శ్రాద్ధము, శ్రాద్ధములో ఈయబడినదియు మంత్రముతో ఏ లోపము లేక సంపూర్ణమగును. అని సనత్కుమారుడు తన దివ్య దృష్టితో చూచి చెప్పెను. సనత్కుమారుడు ప్రేతలయొక్క గమనాగమనములు తెలిసినవాడు, శ్రాద్ధము ప్రాప్తించినవాని గమనాగమనములను తెలిసినవాడు. వారు (పితరులు) బహ్వీకులనియు, ఊష్మపులనియు, దివాకీర్త్యులనియు అనబడినారు. ఈ విధముగా పితరులు దేవతలు, దేవతలు పితరులు, ఋతార్తవులైన అనేకులు అన్యోన్యముగా పితరులనబడినారు. వీరు పితృదేవతలు శ్రాద్ధకర్మతో వారు సంతుష్టి చెందినపుడు మనుష్యులైన పితరులు సంతుష్టి చెందుదురు అని ఈ విధముగా పితరులు చెప్పబడినారు. సోమపాయులైన పితరులయొక్క పితృ మతత్వము ఇదియే నిశ్చయము. పురాణమున నిశ్చయమైనది. అని ఈ విధముగా పితృ సోముల యొక్కయు ఇలాపుత్రుని యొక్కయు సమాగమము, సుధామృతప్రాప్తియు, పితరుల సంతృప్తి పరచుటయు, పూర్ణిమ, అమావాస్యల కాలమును, పితరుల స్థానమును మీకు సంగ్రహముగా జెప్పబడినవి. ఇది సనాతనమైన సృష్టి. ఈ మొత్తము విశ్వ రూపత్వం ఒక్క చోటనుండినదిగా చెప్పబడినది. దీనిని లెక్కించుటకు సాధ్యముగాదు. ఐశ్వర్యమును కోరినవాడు దీని విషయమై శ్రద్ధ వహింపవలెను. అను ఈ స్వాయంభువ సృష్టి ఇచట నాచేత విస్తరముతోను అనుపూర్వితోను చెప్పుట ముగించబడినది. ఇంక నేనేమి వర్ణింప వలెను? అని సూతుడు ప్రశ్నించగా.....