వాయు మహా పురాణము
చతుర్యుగాఖ్యానము
సూతుడు అటు పిమ్మట:
“ఆ తరువాత మరల ద్వాపరయుగము యొక్క విధిని చెప్పెదను. అచట త్రేతా యుగము క్షీణింపగా ద్వాపరయుగము వచ్చును. ద్వాపరయుగము ప్రారంభమున, ప్రజలకు త్రేతాయుగమునందున్న సిద్ధి, యుగముమారుటవలన నశించును. తరువాత ద్వాపరము నందు ప్రజలకు లోభము, అధైర్యము, (వ్యాపార) వైశ్య యుద్ధము, తత్త్వములు నిశ్చయము. వర్ణముల సాంకర్యము, కార్యముల నిర్ణయము లేమి, యజ్ఞౌషధియైన పశువునకు దండము, మదము, దంభము, ఓపిక లేమి బలము - వీనియొక్క రజస్తమో గుణములతో కూడిన ప్రవృత్తి ద్వాపరయుగమున ఏర్పడును. మొదటి కృతయుగమున ధర్మము ఉండును. త్రేతాయుగమున అది చక్కగా ప్రవర్తిల్లును. ద్వాపరయుగమున అది వ్యాకులమై, కలియుగమున నశించును. వర్ణములయొక్క విశిష్టమైన సర్వనాశము చక్కగా కీర్తింప బడును. అట్లే శ్రమయు ప్రశంసింపబడును. ఆ యుగమున శ్రుతియందును స్మృతి యందును ద్వైధీభావము ఏకీభావము లేకపోవుట జరుగును. ద్వైధీభావమును శ్రుతినుండి గాని, స్మృతినుండిగాని నిశ్చయముగా తెలియుటకు వీలుకాదు. అనిశ్చయము వలన ధర్మతత్త్వము నిక్కముగా చెప్పబడదు. ధర్మతత్త్వమున భేదము కలుగుటచే మానవులకు మతి భేదము గలుగును. దృష్టులయొక్క పరస్పర భేదముచేతను, భ్రమచేతను, ఇది ధర్మము, ఇది అధర్మము అని నిశ్చయము కలుగదు. కారణముల వికలత్వము వలనను, కారణము నిశ్చయముకానందునను వారి దృష్టులలో మతిభేదము కలుగుటచే విభ్రమము కలుగును. తరువాత దృష్టిలో విభిన్నులైన వారిచే ఈ శాస్త్ర నిర్ణయము చేయబడును. త్రేతాయుగమున నాలుగు పాదములుగల ఒక్క వేధ విధింపబడినది. ఆయువు యొక్క సంరోధము (అరికట్టుట) వలన ఆకారము ద్వాపరయుగములో గూడ కనబడును. ద్వాపరాదులలో వేదవ్యాసులచేత నాలుగు విధములుగా (వేదము) వేరుచేయబడినది. దృష్టి విభ్రమముగల ఋషి పుత్రులచేత, మంత్ర బ్రాహ్మణముల విన్యాసములచేతను స్వరవర్ణ (అచ్చుల)ములు తారుమారగుటచేతను వేదములు భేదములు చెందును. సామాన్యముగను వికారము చెందుటవల్లను, ఒక్కొక్కచోట వేదములచే ఋక్, యజుస్, సామవేదముల యొక్క సంహితలు ధ్వంసము చేయబడినవి. బ్రాహ్మణము, కల్పసూత్రములును, మంత్ర ప్రవచనములును, ఇతరులును తీర్థములచే పంపబడిరి. కొందరు వారికై నిలబడిరి. ద్విజులు భిన్నములైన వృత్తములు (పనులు) ఆశ్రమములు గలవారై, ద్వాపర యుగములో ప్రవర్తింతురు. పూర్వమొకే అధ్వర్యవము (యజ్ఞములోని యజుర్వేద ప్రక్రియ) ఉండెడిది. తరువాత అది రెండు విధములైనది. సామాన్య విపరీతార్థములచేత ఈ శాస్త్రవిధములు చేయబడినవి. ఆధ్వర్యవ ప్రస్తావములచే అనేక విధములుగా. అట్లే వికల్పములేని అధర్వ - ఋక్ - సామముల యొక్క వికల్పములచేత వ్యాకులము చేయబడినది. ద్వాపరము భేదింపగా అది భిన్న దర్శనములచే చేయబడును. వికల్పముల చేత కూడ నశింపని ఆ వేదముల యొక్క భేదములను, ప్రభేదములను, ద్వాపరమున చక్కగా ప్రవర్తిల్ల చేయుదురు. మరల కలియుగమున నశించును. ద్వాపరమున వేదముల యొక్క వ్యత్యాసములు కలుగును. అవి వర్షములేమి, మరణము, వ్యాధులు, ఉపద్రవములును అగును. మాట, మనస్సు, కర్మ, వీనివల్ల గలిగిన దుఃఖములచే మరల నిర్వేదము (వైరాగ్యము కలుగును. నిర్వేదము వలన వానియొక్క దుఃఖ మోక్షముల విచారణ కలుగును. ఆ విచారణవల్ల వైరాగ్యము, వైరాగ్యమువల్ల దోషదర్శనము, దోష దర్శనము వలన ద్వాపరమున జ్ఞానోత్పత్తియు జరుగును. పూర్వము మొదటి స్వాయంభువ మన్వంతరమున ద్వాపర యుగములో ఆ మానవంతుల యొక్క శాస్త్రములకు శత్రువులు పుట్టుదురు. ఆయుర్వేద వికల్పములును, వేదాంగములయొక్కయు, జ్యోతిషముయొక్కయు వికల్పములును అర్ధశాస్త్ర వికల్పమును, హేతు శాస్త్ర వికల్పమును, స్మృతిశాస్త్ర భేదములును వేరువేరు ప్రస్థానములును ద్వాపరమున ప్రవర్తిల్లుచుండును. అట్లే మానవులకు మతిభేదములు గూడ ద్వాపరమున సర్వ ప్రాణులకును కాయకష్టముతో గూడినదై మనోవాక్ కాయ కర్మలతో కష్టముగా వృత్తి అనగా అర్థానర్ధ విచారవిద్య సిద్ధించును. లోభము, ధైర్యము, వ్యాపారుల యుద్ధము, తత్త్వముల అనిశ్చయ స్థితి, వేద శాస్త్రములను తీసికొనిపోవుట, ధర్మముల సంకరము, రోగము, లోభము, వధయు, వర్ణాశ్రమధ్వంసము, కామద్వేషములును ద్వాపర యుగమున ప్రవర్తిల్లును. అట్లే మానవుల పరమాయువు నిండు రెండువేలు, ఆ ద్వాపరము నిశ్శేషముగా దాని సంధ్య పాద(పావుభాగ) ముగా ఉండును. గుణములతో హీనమైనది ద్వాపరము యొక్క ధర్మము. అట్లే దానియొక్క అంశము సంధ్యా పాదముగా ఉండును. ద్వాపర యుగములోని సంవత్సరముయొక్క ప్రతిపత్తి అనగా జ్ఞానమును వినుడు. ద్వాపరాంశము మిగులు నందే కలియుగము యొక్క ప్రతిపత్తి కలుగును. హింస, అసూయ, అసత్య మాడుట, మోసము, తపముచేయు మునులను చంపుట - ఇవి కలియుగము యొక్క స్వభావములు. ప్రజలు వీనిని సాధింతురు. ఇదియే ధర్మముగా చేయబడినది. నిజమైన ధర్మము అంతయు క్షీణించును. వృత్తి (జీవనము) మనస్సుతోను, క్రియతోను, పొగడ్తల రూపమైన మాటతోను సిద్ధించునో లేదో పందిగ్ధార్థమే కలియుగమున బహుళముగా చంపునది రోగము. ఎల్లప్పుడు ఆకలి భయములు ఉండును. వర్షములేని కాటకముయొక్క భయము ఘోరము అగును. దర్శనము వ్యత్యాసము అగును. కలియుగమున లోకమందు స్మృతికి ప్రామాణ్యము ఉండదు. ఒకడు గర్భమున ఉండియే మరణింపగా మరొకడు యౌవనమున ఉండియే మరణించును. కలియుగమున ప్రజలు వృద్ధాప్యమున అధార్మికులు, అనాచారులు, తీక్ష్ణకోపులు, అల్పతేజము అనగా అల్పవీర్యము గలవారు, ఎప్పుడు అసత్యముఆడు వారును అయిన ప్రజలు పుట్టుదురు. బ్రాహ్మణుల యొక్క దుష్టమైన కోరికలచేతను దుష్టమైన యజ్ఞకర్మలచేతను, దుష్టమైన అధ్యయనముల చేతను, ఆగమము (వేదశాస్త్రము) లచేతను, ఈ విధములైన అనేక దుష్టకర్మలచేతను ప్రజలకు భయము కలుగును. కలియుగములో ప్రాణుల కంతటను హింస, మాయ, అసూయ, కోపము, ఈర్ష్య, ఓపికలేమి సహనములేమి అబద్ధమాడుట, రాగము, లోభము - ఇవి కలుగు చుండును. కలియుగము వచ్చినందున మిక్కిలి సంక్షోభము కలుగును. బ్రాహ్మణులు వేదములు చదువరు. యజ్ఞములు చేయరు. క్రమముగా నరులు వైశ్యులతో పాటు క్షత్రియులును నశింతురు. కలియుగమున క్షుద్రులకును అంత్యజులకును పడక - కూర్చొనుట, భోజనము - వీనిలో బ్రాహ్మణులతో సంబంధములు కలుగుచుండును. శూద్రజాతులువారు రాజులు అగుదురు. వారు పాషండులకు (వేద బాహ్యులకు) ప్రవర్తకులు అగుదురు. ప్రజలు భ్రూణ (గర్భశిశువు) హత్యలు చేయుదురు. ఈ విధముగ ప్రజ ప్రవర్తించును. ఆయువు, మేధా బలములు, రూపము, కులము - ఇవి క్షీణించును. శూద్రులు బ్రాహ్మణాచారములు చేయగా బ్రాహ్మణులు శూద్రాచారములు చేయుదురు. దొంగలు రాజవృత్తిలో ఉండగా రాజులు చోరవృత్తిని (దొంగతనము) చేయుదురు. సేవకులు తమమిత్రులను కోల్పోవుదురు. కలియుగమురాగా ఇది జరుగును. కలియుగము రాగా స్త్రీలు శీలములేని వారు, వ్రతములేనివారును, మాంసప్రియులునునై మాయమాత్రమే తమలో మిగిలిన వారుగా అగుదురు. కలియుగమున పులులు ప్రబలమగును. గోవులు క్షీణించును. సాధువులు మరలిపోవుదురు. అపుడు భోగులకు సూక్ష్మమున రాగల మహాఫలము, అట్లే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమములు శిథిలములు అగుటచే ధర్మము మిక్కిలి చలించిపోవును. విశాలమై గొప్పనైన భూదేవి స్వల్పఫలము ఇచ్చునదిగా అగును. కలియుగము రాగానే శూద్రులు తపము చేయుదురు. త్రేతాయుగమున సంవత్సరకాలముండు ధర్మము ద్వాపరయుగమున నెలవరకు ఉండు ధర్మము. అది కలియుగమున ఒక దినపు ధర్మము అగును. కాని అది (కాల ప్రభావము) ఒక దినముకన్న మించిపోవును. కలియుగములో ప్రజలను రక్షింపనివారై రాజులు, ప్రజలు ఇచ్చిన పన్నులను హరించినవారై రాజులు స్వరక్షణ పరాయణులు అగుదురు. కలియుగమున క్షత్రియులుగానివారు రాజులు అగుదురు. వైశ్యులు శూద్రులను ఆశ్రయించి జీవింతురు. సమస్త బ్రాహ్మణులును శూద్రులకు నమస్కరించు వారగుదురు. ఈ కలియుగమున ఒక్క స్త్రీకి పెక్కురు పతులు ఉందురు. కలియుగము చివర దేవుడు (వరుణుడు) చిత్రముగా వర్షించును. కలియుగమున అందరు వ్యాపారము చేయువారు కూడ అగుదురు. మిక్కిలి మోసపు కొలతలచే సరకులను అమ్ముదురు. కలియుగము వచ్చినపుడు నాట్యచర్య వ్యాపించును. వ్యర్థ రూపము (వేషము)లు గలిగిన వేదబాహ్యులచే ఆవరింపబడును. పురుషులు అల్పమై స్త్రీలు అధికమై ఉందురు. లోకము బహుభిక్షుకులతో నిండిపోవును. పరస్పరముగా జనము మాంసభక్షకమై, క్రూరవాక్కుగలదై, కుటిలమై, అసూయ కలది అగును. చేసిన (చెడు) పనికి ప్రతికర్త ఉండకుండుటచే, లోకము క్షీణించును. పతితుడైనను శంకించదు - ఇది కలియుగ లక్షణము. భూమి సరులు లేక శూన్యము అగును. ఇచట దేశములలోను, నగరములలోను మండలములు ఏర్పడును. భూమి అల్పజలముగలదై అల్పఫలమును ఇచ్చునది అగును. రక్షించువారు రక్షింపనివారై శాసనములేక ప్రభువులు అగుదురు. జనులు పరుల సంపదలను హరించువారును. పరస్త్రీలను చెఱచువారును, కాముకులును, దురాత్ములును, అధర్మమువలన సాహసప్రియులును అగుదురు. కలియుగమున నష్టచేతసులుగాని పురుషులు, విదిలించిన వెంట్రుకలుగల పిలక జుట్టులు, పదిహేనేండ్ల వయస్సుగల వారునుఅయి ప్రజలు జన్మింతురు. కలియుగము వచ్చినపుడు శూద్రులు తెల్లని శుభ్రమైన దంతములుగల వారును, ఇంద్రియములను జయించిన వారును, తల గొరగించుకొన్నవారును, కాషాయ వస్త్రములు ధరించిన వారునునై ధర్మమును ఆచరింతురు. పంటలు దొంగిలించువారు పుట్టగలరు. అట్లే బట్టలను ఊడదీయువారును పుట్టగలరు. దొంగలను అపహరించు దొంగలు, అపహరించువారినే అపహరించువారును కలుగగలరు. జ్ఞానకర్మ నశింపగా లోకము నిష్క్రియముగా పురుగులు, ఎలుకలు, సర్పములును, మానవులను మట్టుబెట్టగలవు. సుభిక్షము, క్షేమము, ఆరోగ్యము, సామర్థ్యము - ఇవి దుర్బలము అగును. ఆకలి భయములతో పీడింపబడిన దేశములలో గుడ్లగూబలు వికసించును. దుఃఖములతో ఆవరింపబడినవారికి పరమాయువు నూరేండ్లు మాత్రమే ఉండును. కలియుగమున సమస్త వేదములు కనబడి కనబడకుండ పోవును. అట్లే యజ్ఞములు కేవలము అధర్మముచే పీడింపబడినవై నశించును. కాపాలికులు కాషాయ వస్త్రములు ధరించి గ్రంథములు లేనివారు అగుదురు. వేదబాహ్యులైన ఇతరులు వర్ణాశ్రమములకు శత్రువులు అగుదురు. కొందఱు వేదములను అమ్ముదురు. మఱికొందఱు తీర్థ (పవిత్ర దేవాలయాది) స్థలములను అమ్ముదురు. కలియుగము రాగానే పై విధములైన జనులు పుట్టుదురు. వేదములను చదువరు. శూద్రులు ధర్మార్థములలో పండితులు అగుదురు. శూద్రజన్ములైన రాజులు అశ్వమేధ యాగము చేయరు. ప్రజలు స్త్రీవధను, గోవధను చేసి పరస్పరము చంపుకొందురు. ప్రజలు ఒండొరుల చంపుకొని పోవుదురు. దుఃఖప్రచారము వలన అల్పాయువు, దేశనాశము, రోగములతో నిండి ఉండుట, మోహము, బాధ, అట్లే అసౌఖ్యము తామస ప్రవృత్తి - ఇవి కలియుగమున ఉండును. ప్రజ అంతయు భ్రూణహత్యలకు పూనుకొనును. కావున కలియుగమున ఉన్న వారికి ఆయువు, బలము, రూపము విశేషముగ క్షీణించును. దుఃఖము అవరించిన మానవులకు పరమాయువు నూరేండ్లు. కలియుగమున వేదములు అన్నియు కనబడియు కనబడవు. యజ్ఞములు కేవలము ధర్మపీడితములై నశించును. కలియుగ కాలమున మానవులు అల్పకాలముననే సిద్ధిని పొందుదురు. కలియుగము అంతమున బ్రాహ్మణ సజ్జన ఉత్తములు ధన్యులై ధర్మము ఆచరింతురు. వారు శ్రుతిస్మృతులు చెప్పిన ధర్మమున అసూయలేక నడుచుకొందురు. త్రేతాయుగమున సంవత్సరము ఆచరించు ధర్మము ద్వాపరమున ఒక నెలలో ఆచరింపబడినది. కలియుగమున దానిని తన శక్త్యానుసారము ఒక దినము ఆచరించిన ఫలమునందును.
ఇది కలియుగము యొక్క స్థితి. ఇక సంధ్యాంశమును గూర్చి వినుడు. యుగ యుగమున సిద్ధులు మూడు. మూడు పాదములను పాద (1/4) భాగము పోగొట్టుకొనును. యుగప్రభావమువలన ఈ పాదములు పాదపాదముగ ఉండును. సంధ్యా స్వభావము వలన అంశములందు సంధ్య పాదములుగా నిలిచి ఉండును. కలియుగమున ఈ విధముగా సంధ్యాంశ కాలము రాగా భృగువంశీయుల మరణమున పుట్టినవాడును, అసాధువులను శాసించువాడును, చంద్రుని గోత్రమునకు సంబంధించిన వాడును పేరున ప్రమతి అని పిలువబడును. ఆతడు పూర్వము స్వాయంభువ మన్వంత రమున మాధవుని అంశమున పుట్టినవాడు. అతడు ఇరువది నిండు సంవత్సరములు భూమియందు తిరుగుచు గుఱ్ఱములు, రథములు, ఏనుగులునుగల సేనను కూర్చును. విశేషముగా ఆయుధములను గ్రహించిన నూర్ల కొలది వేలకొలది ద్విజులచే ఎల్లప్పుడును చుట్టబడిన వాడై అతడు (ప్రమతి), వేలకొలది మ్లేచ్ఛులను చంపును. ఆ ప్రభువు అంతట ఉండువాడై శూద్రజన్ములైన ఆ రాజులను జంపి, తరువాత వేద బాహ్యులను అందరిని తుదముట్టించును. మిక్కిలి ధార్మికులుగానివారిని గూడ అంతట చంపును. వర్ణ వ్యత్యాసము వలన పుట్టినవారిని, వారిని అనుసరించి జీవించువారిని అంతట చంపివేయును. ఉత్తర దేశములను, మధ్యదేశములను, పర్వతప్రాంతములను, అట్లే తూర్పుదేశములను, పశ్చిమదేశములను, వింధ్య వెనుకటి అపరాంతిక దేశములను దాక్షిణాత్య దేశములను, సింహళములతో బాటు ద్రవిడదేశములను, గాంధార దేశములను పారదదేశములను, పహ్నావదేశములను, యవనదేశములను, తుషారదేశములను, బర్బరదేశములను, చీనదేశములను, శూలికదేశములను, దరదదేశములను, ఖసదేశములను, లంపాక దేశములను - వీనిలోని ప్రజలను కేతులను కిరాత జాతులను గూర్చుకొని వీరితో రాజ్యచక్రమును ఏర్పరచుకొని (చక్రవర్తియై) మ్లేచ్ఛులను జంపి ప్రభువై, సర్వ ప్రాణులకు అజేయుడై భూమిని తిరిగెను. అతడు దేవుడైన విష్ణువు యొక్క అంశమున పుట్టినవాడు. పూర్వజన్మవిధులను తెలిసినవారిచే వీర్యవంతుడైన ప్రమతి అనియు, చంద్రవంశజుడైన ప్రభువు అనియు పిలువబడెను. ముప్పది రెండేండ్ల అభ్యుదయ వర్షము ప్రారంభముకాగా, ఇరువదియేండ్లు సర్వప్రాణులను వేలకొలది మానవులను చంపుచు తన రూఢమైన కర్మచే భూమిని తన పరాక్రమము మాత్రమే మిగిలినదానిగా చేసెను. పరస్పర నిమిత్తకమైన ఆకస్మిక కోపముచేతను, సామాన్యముగాన ధార్మికులైన నీచులగు శూద్రులను వశము చేసికొనెను. తరువాత గంగా యమునల మధ్యమున తన సేవకులతో గూడి నిష్ఠను (సమాధిని) పొందెను. అంత, సమస్త రాజులను, వేలకొలది మ్లేచ్ఛులను పెఱికివైచి సత్యసైనికుడైన ఆ అమాత్యుడు (రాజును) గడచిపోయెను. అచట కలియుగమున సంధ్యాంశ కాలమురాగా ఇచ్చటచట ప్రజలు అల్పావశిష్ఠులైరి (కొద్దిగా మిగిలినవారులైరి.) పగ్గములులేని వారై గుంపులు గుంపులుగా లోకచేష్టలు చేయువారై పరస్పరము హింసించుకొనుచుండిరి. రక్షణము కోరుచుండిరి. (కలి) యుగవశమున అరాజకము వచ్చి జీవిత సంశయ మేర్పడినది. అ సమస్త ప్రజలు పరస్పర భయములచే పీడింపబడిరి. వారు భార్యలను ఇండ్లను వదిలి వ్యాకులులై అలిసిపోయిరి. తమ ప్రాణములను చూచుకొనుచు మిక్కిలి దుఃఖితులై చేటును పొందిరి. శ్రుతి స్మృతులు చెప్పిన ధర్మము నశించినది. అపుడు మర్యాద, పిలుపు, స్నేహము, సిగ్గు, ఇవి ఏవియు లేనివారైరి. భార్యా పుత్రులను వదలి దుఃఖముతో కలతజెందిన ఇంద్రియములు కలవారైరి. వర్షము లేమిచే చచ్చిరి. జీవన వృత్తులు వదిలి దుఃఖితులైరి. తమ పల్లెలను వదలి సమీపములోని నగరదేశములను సేవించిరి. అపుడు జనులు నదులను, సముద్రములను, బావులను, పర్వతములను చేరిరి. మిక్కిలి దుఃఖించినవారై మధుమాంసములతోను, మూలఫలముల తోను జీవించుచుండిరి. నారచీరలను చర్మములను ధరించిరి. వారికి ఆకులు గూడ లభించలేదు. ఏ దానములు కూడ లేవు. వర్ణాశ్రమములనుండి భ్రష్టులై ఘోరమైన సంకరము పొందిరి. ప్రజలు ఈ దశకుచేరి కొద్దిమాత్రమే మిగిలిరి. ముసలితనము, వ్యాధి, ఆకలి - వీనిచే అలమటించి దుఃఖమును వైరాగ్యమును పొందిరి. నిర్వేదము నుండి విచారమును, విచారమునుండి సామ్యావస్థను, సామ్యావస్థలలో సంబోధము (జ్ఞానము)ను, సంబోధమునుండి ధర్మశీలతను మానవుడు పొందును. కలి శిష్టములైన పైని చెప్పబడిన ఉపద్రవములు రాత్రింబవళ్లు ఉపగమము (అంగీకారము) తో కూడిన వైనపుడు వానియొక్క యుగము మారును. వానికి (1.నిర్వేద, 2. విచారణ, 3. సామ్య, 4. సంబోధ, 5. ధర్మశీలత, 6. ఉపగమము) ఏడవదిగా చిత్తసమ్మోహనమును గూర్చి రాబోవు అర్థము యొక్క బలమువలన తరువాత కృతయుగము ఏర్పడెను.
తరువాత మరల కృతయుగము ప్రవర్తిల్లగనే కలియుగమున మిగిలినవారు కృతయుగపువారుగా ప్రజలు పుట్టిరి. ఇచట సిద్ధులుగా ఉన్నవారును చక్కగా కనబడి తిరుగుచుండిరి. ఆ సప్తర్షులుకూడ అచట చక్కగా నివసించి ఉండిరి. ఇచట బీజ ప్రాయులుగా చెప్పబడిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కలిలోపుట్టినవారును అప్పుడు సమానముగా ఉండిరి. సప్తర్షులు వారియొక్క ధర్మమును ఇతరుల విషయమున కూడ చెప్పుచుండిరి. వర్ణాశ్రమాచారయుక్తుడు శ్రౌతుడు అనియు స్మార్తుడు అనియు రెండు విధములు. తఱువాత, కృతయుగమున ఆ క్రియావంతులలో ప్రజలు ఉండిరి. శ్రౌతస్మార్త క్రియలు కృతములై నందున కృతయుగమును పేరు వచ్చినది. కృతయుగపువారికి శ్రౌతము (వేదోక్తము) స్మార్తము (స్మృతులలో చెప్పబడినది) అయిన ధర్మము సప్తర్షులచే చెప్పబడినది. (శ్రుతి, స్మృత్యుక్త ధర్మమే కృతయుగ ధర్మము). ప్రజలలో ఆ ధర్మమును వ్యవస్థాపించుటకై మునులు యుగాంతము వరకు మన్వంతరాధికారములలో ఉండిరి.
ఈ లోకమున ఎండకాలములో కారుచిచ్చుతో, భూమిపైన గడ్డి అంతయు తగులబడి పోవును. మరల వర్షకాలమున మొదట ఆ కాలిన గడ్డిమూలముననే క్రొత్తగడ్డి మొలకలు పుట్టును. అట్లే యుగమునుండి యుగమునకు ఎడతెగకుండా మన్వంతర క్షయమగువఱకు పరస్పరము సంతాన సంక్రమము జరుగుచుండును. సుఖము, ఆయువు, బలము, రూపము, ధర్మము, అర్ధము, కామములును - ఈ మూడును యుగములలో పాఠక్రమముగా క్షీణించును. యుగములయొక్క ధర్మ సిద్ధులు సంధ్యంశలలో క్షీణించును. ఓ ద్విజులారా! ఈ విధమైనది ప్రతిసంధి విధానము.
పె చెప్పిన లక్షణములతోనే నాలుగు యుగముల అన్నింటి యొక్క క్రమ నిర్మాణము. ఈ నాలుగు యుగముల ఆవృత్తి వేయి వఱకు జరుగుచుండును. ఆ వేయి యుగములు బ్రహ్మకు ఒక పగలు. అట్టిమరొక వేయి యుగములు బ్రహ్మ యొక్క రాత్రి అనబడినది. ఇదియే సమస్త యుగములకు లక్షణము. ఈ నాలుగు యుగములు దెబ్బదియొక్క మారులు తిరిగినచో మన్వంతరము అనబడును. నాలుగు యుగములలో (ప్రతి) ఒకదాని యందు పూర్వము విన్న విధముగ జరుగును. అట్లే అన్ని చతుర్యుగములలో గూడ వరుసగా ప్రతియుగము జరుగును. ప్రతిసర్గమున (సృష్టియందు) భేదములు ఉత్పన్నమైన విధముననే (యుగములు) ఇరువదియైదు విధములు. అంతకు తక్కువగాని ఎక్కువగాని లేవు. అట్లే కల్పయుగములతో గూడ సమాన లక్షణములు కలవి అగును. సమస్త మన్వంతరమునకు ఇదియే లక్షణము. అట్లే యుగస్వభావము వలన పరివర్తనములు చాలకాలము నుండియే జరిగినవి. ఆ విధముగా జీవలోకము క్షయ - అభివృద్ధులతో తిరుగుచు ఉండును అని ఈవిధముగా సంగ్రహముగా ఇచట మన్వంతరములలో భూత - భవిష్యత్ యుగముల లక్షణము తెలియచేయబడినది. ఆ విధముగనే విజ్ఞాని భవిష్యత్ యుగముల విషయమై తర్కించవలెను. సమస్త మన్వంతరములోను భూత - భవిష్యత్ యుగములను గూర్చి ఊహింపవలెను. ప్రతి కల్పమునను ఒక్క మన్వంతర (వివరణ)ముతో సమస్త మన్వంతరములు వివరింపబడినట్లు తెలియవలెను. నామరూపము లతో అందరు ఈ యుగ అభిమానులు అగుదురు. ఇచట ఎనిమిది విధములైన దేవతలు మన్వంతరాధిపులు. ప్రయోజనములతో ఋషులు, మనువులు, అందఱును సమానులే. యుగ యుగమున వర్ణాశ్రమముల విభాగము. ఈ విధముగ ప్రభువు ఉండును. అతడు ఎల్లప్పుడు యుగ స్వభాగమును అనుసరించును. ఇట్లు అనుషంగము చెప్పబడినది. ఇచట అనుపూర్వీతో విస్తరముగా యుగములలోని స్థితిని జెప్పెదను, సృష్టి సర్గమును వినుడు.