వాయు మహా పురాణము
వ్యాస సంశయాపనోదనము
శౌనకాది ఋషులు ఇట్లు అనిరి:
ఓ సూత! మహాభాగ్యవంతుడా! భగవంతుడవైన నీచేత వ్యాసానుగ్రహమునను, ఇతరులకు బోధించుటచేతను, నీకు శాస్త్రము అబ్బినది. ఓ అనఘా! ఇతిహాసములతో పాటు, ఉపక్రమోపసంహారవిధితో చెప్పబడిన పదునెనిమిది పురాణములు మొత్తము నీకు తెలిసినవి. పదునాలుగు వేల (14000) శ్లోకములతో అతి స్పుటముగా మాత్స్య పురాణము చెప్పబడినది. అంతటి సంఖ్యతో పదియైదు శ్లోకములను చేర్చి (14015) భవిష్య పురాణము చెప్పబడినది. మహారమ్యమైన మార్కండేయ పురాణము తొమ్మిదివేల శ్లోకములు (9000) గలది. బ్రహ్మవైవర్త పురాణము పదునెనిమిది వేల(18000) శ్లోకములు కలది. బ్రహ్మాండ పురాణము పండ్రెండువేల ఒక వంద (12100) శ్లోకములు కలది. దివ్యమైన భాగవత పురాణము పదునెనిమిది వేల (18000) శ్లోకములు కలది. బ్రహ్మ పురాణము పదివేల (10000) శ్లోకములతో చెప్పబడినది. వామనము అను పురాణము అయుత (పదివేలు) (10000) శ్లోకములతో కూర్చబడినది. అది (అగ్ని) పురాణము పదివేల ఆరు వందల (10600) శ్లోకములు కలది. శుభమైన వాయుపురాణము ఇరువది మూడు వేల (23000) శ్లోకములు కలది. నారదీయ పురాణము ఇరువది మూడు వేల (23000) శ్లోకములు కలదిగా చెప్పబడినది. గరుడ పురాణము పందొమ్మిదివేల (19000) శ్లోకములు కలదిగా చెప్పబడినది. మిక్కిలి విస్తారమైన పాద్మ పురాణము ఏబదియైదు వేల (55000) శ్లోకములు కలదిగా చెప్పబడినది. మనోహరమైన కూర్మ పురాణము పదునేడువేల (17000) శ్లోకములు కలదిగా చెప్పబడినది. పరమాద్భుతమైన వారాహపురాణము ఇరువది నాలుగు వేల (24000) శ్లోకములు కలది. సువిస్తంమైన స్కాంద పురాణము ఎనుబదియొకవేల (81000) శ్లోకములు కలది.
ఈ పురాణములలో బహుధర్మములు విశేషముగా నిరూపింపబడినవి. రాగుల యొక్కయు, విరాగుల యొక్కయు, యతుల యొక్కయు, బ్రహ్మచారుల యొక్కయు, గృహస్థుల యొక్కయు, వనస్థుల యొక్కయు, విశేషించి స్త్రీ - శూద్రుల యొక్కయు ధర్మములు చెప్పబడినవి. గంగాది మహానదులును, యజ్ఞములు, వ్రతములు, తపములు అనేక విధదానములు, యమములు, నియమములు, బహువిధములైన యోగధర్మములును, సాంఖ్య మతములు, భాగవత మతములును, భక్తి మార్గములు, జ్ఞాన మార్గములు, వైరాగ్యము వల్లను, వాయువు వల్లను, జలము వల్లను కలుగు పారమార్ధిక మార్గములును చెప్పబడినవి. కర్మ సంశుద్ధ చేతస్కుల ఉపాసనా విధిగూడ చెప్పబడినది. బ్రాహ్మము, శైవము, వైష్ణవము, సౌరము, శాక్తము, అర్హతము (బౌద్ధము) - అను స్వభావ నియతములైన ఆఱు దర్శనములును చెప్పబడినవి. ఇదియును వివిధములైన వేరు విషయములును నిరూపింపబడినవి. ఇంతకంటె వేరుగా తెలియదగిన ఉత్తమమైన విషయము ఏమైన ఉన్నదా? లేదా? అది వ్యాసునకే తెలియకుండ వచ్చును. లేదా నీవే దాచుచుండవచ్చును. నీవు నిండైన పౌరాణికుడవు కావున ఈ విషయమున మా సంశయమును ఛేదింపుము.
సూతుడు ఇట్లు అనెను:
ఓ శౌనకా! ఈ సుదుర్లభమైన ప్రశ్నకు సమాధానము చెప్పెద వినుడు. అది మిక్కిలి దాచదగినది, దివ్యమైనది. ఎవ్వరికిని చెప్పరానిది అని చెప్పుదురు. పరాశర సుతుడైన వ్యాసుడు సర్వ వేదార్థములచే కూర్చబడిన పౌరాణిక కథను నిర్మించి మనసులో చింతించెను. వర్ణాశ్రమములు గలవారి ధర్మము నాచే చక్కగా చెప్పబడినది. వేదవిరోధము లేకుండా బహువిధములైన ముక్తి మార్గములు చెప్పబడినవి. బ్రహ్మ సూత్రముల నిర్ణయమున జీవేశ్వర బ్రహ్మ భేదము నిరాకరింపబడినది. శ్రుతియుక్తమైన విచారముతో పరబ్రహ్మ స్వరూపము నిరూపింపబడినది. అక్షరము (నాశము లేనిది), పరమమైన బ్రహ్మ, అదియే పరమాత్మ, పర(మ)మైన పదము. దాని కొఱకే మహా ప్రాజ్ఞులు బ్రహ్మచర్య - గృహస్థ - వానప్రస్థ - యతి వ్రతములను ఆచరింతురు. వేరు విధమై ధారణమును కూడ చేయుదురు. మునిశ్రేష్ఠులు, యోగాసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి, నియమములతో పాటు యమములు - ఈ అష్టాంగ యోగములను ఆ పరబ్రహ్మ ప్రాప్తి కొఱకు చేయుదురు. వేదముల ఆజ్ఞా మాత్రమునందే తత్పరులైనవారు దానికొఱకే యజ్ఞాది కర్మను చేయుదురు. కోరికలు లేనివారు గహనమైనది లేనివారై పరార్పణ బుద్ధితోనే పనులు చేయుదురు. ఆ బ్రహ్మజ్ఞానము కొఱకై తన పాపాచరణమును నివారించుటకు శుచివ్రతులు గంగాది తీర్థ చర్యలను సేవింతురు. అది పరబ్రహ్మము, శుద్ధము, ఆద్యంతములు లేనిది, రోగము లేనిది, నిత్యమైనది సర్వమునందు ఉండునది, స్థాణువైనది, ప్రళయమునందు కూడ కదలక ఉండునది, కూటస్థమైనది (ఏకరూపమున కాలవ్యాపియై ఉండునది), కూటవర్జిత మైనది (ఏ వికారములేనిది). సర్వేంద్రియములందు చరించునట్లుగా ప్రతిఫలించునది ప్రకృతి నిర్మితములైన ఇంద్రియములు లేనిది, దిక్కాలాదులతో వేరుపరుపబడనిది, శాశ్వతమైనది, చిన్మాత్రమైనది (సమస్త వస్త్వవభాసకమైనది), నాశములేనిది, త్రాడునందు సర్పమువలె దీనియందు ఈ విశ్వమంతయు అధ్యస్తమై ప్రకాశించును (ఆరోపితమై భాసించును). అట్లు త్రాడునందు భాసించిన సర్పమునందు అంతటను త్రాడు అనుసరించి ఉన్నట్లు బ్రహ్మయందు అభాసించిన విశ్వమందు అంతటను నిర్వికారమై బ్రహ్మను అనుసరించి ఉండును. నురుగు - అలలు - బుడగలు - నీరు వేర్వేరుగా కనబడినను నీరుకన్న భిన్నము కానట్లే వేర్వేరుగా చరింపచేయబడినను విశ్వముకన్న బ్రహ్మ వేరుకాదు. నిగమములు సర్వము బ్రహ్మయే! నానాత్వము లేదు అని అందురు. కారణము బ్రహ్మాండ కోటులు పుట్టుట నశించుటయును తన ఉన్మేష నిమేషములతో (సహజమైన కనురెప్పల పాటులు తెరచుటలు) జగత్తుల ప్రళయ - ఉదయములను కలుగచేయు పరాశక్తి ఆ పరబ్రహ్మ ఆధారముగా నిలిచినది. దానియందు విశ్వమున్నది. దానిచేతనే ఈ విశ్వము వచ్చినది అనబడినది. ఆ బ్రహ్మను తెలియమి వలన జగము భాసించును. ఆ బ్రహ్మను తెలిసినచో జగము భాసింపదు. జగము అసత్యమనియు, జడమనియు, దుఃఖమనియు, అవస్తువనియు నిరూపింపబడినది. దీనికి విరుద్ధమైనది సచ్చిదానందమూర్తికము. జీవుడు మేల్కొని ఉన్నపుడు అది విశ్వమనునది. జీవుడు స్వప్నమున (కలలో) ఉన్నప్పుడు అది తైజసమనబడును. జీవుడు నిద్రించినపుడు ప్రాజ్ఞుడు అనబడును. ఇట్టి పరబ్రహ్మ జీవుని సర్వావస్థలయందు ఉండునదిగా చెప్పబడినది. అది కన్నులకు కన్ను, చెవులకు చెవి, చర్మములకు చర్మము (చర్మేంద్రియములకు చర్మేంద్రియము) నాలుకకు నాలుక, ప్రాణములకు ప్రాణము - అని బుద్ధిమంతులు తెలియుదురు. బుద్ధి జ్ఞానము చేతను, ప్రాణములు నిరంతరము తమ క్రియాశక్తిచేతను పరబ్రహ్మను చేరుటకుగాని పరమార్థముగా తెలియుటకుకాని సమర్థములు గావు. త్రాడునందు పామువలె, మరుభూమి యందు నీరువలె, ఆకాశమున నీలిమవలె ఆ పరబ్రహ్మయందు జ్ఞాన కల్పితమై అసత్తైన (అసలులేని) ఈ విశ్వము భాసించును. ఈ మహాకాశము కుండయందు వేరుగా కన్పించి వేరుచేయబడును. అట్లే కార్యోపాధిచే వేరుగానై ఆ పరబ్రహ్మ జీవుడు అని పిలువబడును. విచిత్ర గుణ శీలములు కలిగిన చిత్రకారిణియైన మాయచే గోడమీదవలె పరబ్రహ్మపై ఈ సాటిలేని బ్రహ్మాండము చిత్రితమైనది. పరిగెత్తుచున్నవానికి ఇతరులచే అతిక్రమింప బడనిది, చెప్పువానికి వాక్కులకు గోచరముగానిది, వేదవేదాంత సిద్ధాంతములచే నిర్ణయింపబడినది ఆ అక్షరమైన (నాశములేని) పరబ్రహ్మము. ఆ అక్షరము కన్న పరమైన దేమియు లేదు. అదియే (అక్షరమే) పర్యవసానము. ఉత్కృష్టమైన ప్రాప్తిస్థానము. అనేక విధముల విచారింపబడిన వేదము ఈ విధముగ వినబడును. అక్షరమైన తనకును ఆత్మరూపముగ ఉన్నవాడు, పరమానంద సమూహరూపుడు, ఆనందమే ఆకారముగా గలవాడు, లీలా విలాసముల రసికుడు, గోపికాస్త్రీల సమూహ మధ్యమున ఉన్నవాడు, ప్రకాశించు రత్నములు పొదిగిన నెమిలి పింఛముకల కిరీటముతోను ప్రకాశించుచున్న మెరుపు కాంతులు కల కర్ణకుండలముల తోను ప్రకాశించినవాడు, చెవుల సమీపము వరకు కదలాడుచున్న కాటుక పిట్ట వంటి కన్నులతో మనోహరముగా ఉన్నవాడు, ప్రతి పూపొదరింటిలోను ప్రియురాండ్ర సమూహముల విలాస రతియందు అత్యాసక్తి కలవాడు, పీతాంబరమును ధరించువాడు, దివ్యుడు, చందనపు మైపూతతో అలంకరింపబడినవాడు, అధరామృతముతో తడిసిన వేణువు యొక్క నాదముచే గోపికాస్త్రీలను మోహింప చేయువాడు, చిదానందుడు, మన్మథ మదమును భంగము చేయువాడు, కోటికాయ కళలతో నిండినవాడు, కోటిచంద్రుల కిరణములవలె నిర్మలుడు, మూడు రేఖలలో కంఠమున ప్రకాశించు రత్నములు గురిగింజలుగల మృగములతో వ్యాకులుడు, యమునానదిలోని ఇసుకతిన్నెలలోను, కదంబ - చంపక - అశోక - పారిజాత వృక్షములతో మనోహరమై నెమళ్ళయొక్క పావురములయొక్క, చిలుకలయొక్క, కోకిలల యొక్కయు కోలాహలములచే వ్యాకులమై ఎత్తైన కానుగచెట్ల అడవిలో మేతమేయు విచ్చలవిడిగా పోవు గోవుల నిరోధించుటకు ఇటునటు పరుగెత్తుచున్నవాడును, రాధతో విలాసరసికుడైన కృష్ణుడు అను పరమపురుషుని - వేద వాక్కులకు గోచరుడైనందున - ఆ వేదములవలన వింటిని. ఈ విధముగ భేదమువదలి నిర్గుణుడై, జ్ఞానమాత్రుడై గోలోకమను బ్రహ్మయందు క్రీడించి శోభించునని నేను వింటిని. దీనికంటె పరతరమైనది ఏమియులేదు. నిగమాగమములలోకూడ నిగమము అక్షరము కంటెను పరమైన పరము కంటెను పరుడని ఆతని చెప్పును. గోలోకవాసియైన భగవంతుడు అక్షరమున కంటె పరుడుగా చెప్పబడును. అతని కంటెను పరుడై ఎల్లప్పుడు వేదములచే గానముచేయబడు వీడెవడు? వేద వచనములచే ఉద్దేశింపబడినవాడెవడు? విశేషము ఎట్లు తెలియును? అక్షరమునకన్న పరముగా ఉండువాడన్న శ్రుతియొక్క అర్థము వేరుగా తెలియవలెనా? వేదార్థమున సంశయమును పొందినవాడై సత్యవతీ సుతుడైన వ్యాసుడు చాలాకాలము విచారించెను (ఆలోచించెను). నిజముగా ఉన్న తత్త్వమును అందలేదు.
సూతుడు ఇట్లు అనెను:
ఎంత విచారించుచున్నను వేదార్థ నిశ్చయమును వ్యాసుడు పొందలేదు. వేదము సాక్షాత్తుగా నారాయణుడు. దానిలో పండితులు ముగ్థులు అగుదురు. ఐనను వ్యాసుడు సజ్జనుల హృదయమును తపింపచేయు మహాబాధనందెను. మరల విచారించెను. ఎవరి కడకు పోవుదును? ఏమి చేయుదును? ఈ జగమున సర్వజ్ఞుని సర్వమును చూచు వానిని కానను, అనేకులలో ఒక్కని నైనను సందేహమును నివారించు వానిని తెలియక, మేరువు యొక్క కుహరిణిని (గుహను) చేరి అచట వ్యాసుడు పరమ తపస్సును చేసెను. అచట బంగారపు కాంతులతోను, వజ్రనిర్ఘోషములతోను, వెన్నెలల (మెరపుల) సమూహములతోను నిరంతరముగా కన్నుల బాధించు చిమ్మచీకటులను అంతటను ఆ గుహ బాధించును. అచటఅతిసుందరమై ఉత్కృష్టమైన అడవి ప్రకాశించును. అది అనేక వృక్షములలో తీవలలో పొదరిండ్లలోను కూయుచున్న పక్షులచే ప్రతిధ్వనింప చేయబడినది. ఆకలి, దప్పి, భయము, క్రోధము, తాపము, బాధ ఇవేవియు లేనట్టిది. అది బహువిధములు అయిన జలాశయములతో కూడినది. ఆ జలాశయములు తామర తూండ్లతో అలంకరింపబడినవి. బంగారు శిలలతో కట్టబడిన ఒడ్డులందు తిరుగుచున్న పక్షులుకలది. కమలములపై వీచు వాయువులతో ఆవనము అంతయు సేవింప బడును. అది మంగళకరములైన భావములతో అధ్యాసితమైనది. హింసించు ప్రాణులు లేనిది. జనములు లేనిది, దివ్యములైన తీగలు ప్రియమైన శాఖలతో విరాజిల్లినది. మనోహరములు అయిన చిలుకలతో, పావురములతో, మిక్కిలి మదించిన మత్తకోకిలలతోను కూడినది. పైకెగిరి వచ్చు పద్మముల పుప్పొడుల సమూహముల పరిమళములుకల దిఙ్ముఖములు కలది. అచట కూడ పరమ శోభనమైన బంగారు గుహకలదు. వ్యాసుడు ఆ గుహలో ప్రవేశించి, ఆహారమును, చిత్తమును, ఆసనమును వదిలినవాడై తదేకాగ్ర మనస్కుడై నాలుగు వేదములను స్మరించెను. అట్లు వేదలములను స్మరించుచున్న ఈ వ్యాసునకు మూడువందల ఏండ్లు కడచినవి. అంత సుందర దర్శనములైన నాలుగు వేదములు ఎదుట ఆవిర్భవించినవి.
అట్లు ఆవిర్భవించిన ఆ వేదపురుషులు స్ఫురించు పద్మ దళముల వంటి కన్నులు కలవారు, జటలను ముకుటములుగా ధరించినవారు, దర్భముష్టులు గల పద్మముల వంటి చేతులు కలవారు, లేడి చర్మముతో అలంకరించిన భుజములు కలవారు. పదునారు స్వరములతో (అచ్చులతో) నిండిన ముఖములు కలవారు, ఓంకారము లోపల (హృదయమున) కలవారు. కవర్గ - చవర్గములలో పుట్టిన (కఖగఘఙ - చఛజఝఞ వర్ణములతో ఏర్పడిన) ఐదేసి వ్రేళ్లు కలిగిన చేతులు కలవారు. పవర్గలోని ‘పఫబభమ’ వర్ణములతో ఏర్పడిన కుడిపాదములు కలవారు. ‘త’ వర్గలోని ‘తథదధన’ వర్ణములతో ఏర్పడిన యెడమ పాదములు కలవారు. కుక్షి ద్వయాత్మకములు అయిన అంతస్థ వర్ణములు (యరవలవ - శషసహలు) కలవారై తరింతురు. నాభినిద్ర కలవారు. కాంతములు పృష్ఠము (వీపు) గా కలవారు. ‘మ’ కారము ఉదరముగా కలవారు. ‘యరలవలు’ ఊర్ధ్వములైన వెంట్రుకలుగా కలవారు. అగ్ని దక్షాంశముచే ప్రకాశించువారు, భూమి కంఠముగా కలవారు. భృతములు భుజములుగా కలవారు, అంతస్థములైన ‘యరలవలు’ సంధి సంస్థానములుగా కలవారు. వైఖరీ వాక్కులతో విజృంభించినవారు. ఈ వేదపురుషులు యొక్క హృదయ కమలమున కల్పితమైన మధురానగరమును (వ్యాసుడు) చూచెను. ఆ మధుర భగవంతుడైన హరి కృష్ణుడు సాక్షాత్తుగా ఆవిర్భవించిన స్థలము. వేదపురుషుల యొక్క భ్రూమధ్యమున (కనుబొమ్మల నడుమ) కాశీ నగరమును చూచెను. మూలాధారమున ఉన్నదానినిగా మాయను ఉజ్జయిని (నగరమును) చూచెను. లింగ ప్రదేశమున కాంచీ నగరమును, నాభిమండలమున అవంతీ నగరమును, కంఠస్థముగ ద్వారకను, ప్రాణగతముగా ప్రయాగను, సవ్యాపసవ్యము (కుడి యెడమ)లలో గంగాయమునలను, మధ్యన సరస్వతీనదిని, ముఖమున గయాక్షేత్రమును, కంఠమునకు చెక్కిళ్ల పై భాగమునకు ఉన్న ప్రదేశమున ప్రభాస క్షేత్రమును, వీరి (వేద పురుషుల) బ్రహ్మరంధ్రమున బదరి ఆశ్రమమును చూచెను. కన్నుల జంటలో పౌండ్రవర్ధన నేపాల పీఠమును, ఫాలభాగమున పూర్ణగిరియను పీఠమును చూచెను. వీరి కంఠమున మధురాపీఠమును, కటిస్థలమున (నడుమున) కాంచీపీఠమును, స్తన ప్రదేశములలో జాలంధర పీఠమును చూచెను. చెవుల ప్రదేశమున భృగుపీఠమును, ముక్కుపుటమున అయోధ్యను, బ్రహ్మ రంధ్రమున బ్రాహ్మ్యమైన పీఠమును, సీమంత (పాపెట) ప్రాంతమున శైవపీఠమును, నాలుక చివర బుద్ధిమంతమైన శాక్తపీఠమును, హృదయకమలమున వైష్ణవపీఠమును, కన్నులలో ఉన్నదిగా సౌరపీఠమును, ఛాయా సుసంగతముగా (నీడనంటి ఉండునదిగా) బౌద్ధ పీఠమును, కంఠదేశమున సౌత్రామణి యాగమును, ఎదపైన పశుబంధ యాగమును, నడుమున వాజపేయ యాగమును, ముఖమున అగ్నిహోత్ర యాగమును, కటితటమున (నడుమున) అశ్వమేధ యాగమును, కడుపుపైన నరమేధ యాగమును, తలపైన రాజసూయ యాగమును, క్రింది పెదవిపైన అవసథ్య యాగమును, పై పెదవిపైన దక్షిణాగ్నిని, నోటిలోపల గార్హపత్యాగ్నిని, చెవియందు హవ్యమును, రోమములందు ఉండునవిగా మంత్ర భేదములను చూచెను. సేవకులచే మహారాజు సేవింపబడినట్లు వేద పురుషులు న్యాయములలో కూడిన పురాణములతోను, సంహితలతోను, తంత్రములతోను వేరువేరుగా ఉపాసింపబడినవారు. కర్మ, జ్ఞాన, ఉపాసనలతో జనకానుగ్రహకారకులు, ఇట్టి వీరిని (వేదపురుషులను) చూచి ఆశ్చర్యము చెందినమనస్సు కలవాడై వ్యాసముని కృష్ణుడు అయ్యెను. (నల్లనివాడు కృష్ణు డును - కృష్ణ వ్యాసుడు). (బ్రహ్మ తేజోమయులు, దివ్యులు. భూమికి జారిపడి తపించు సూర్యునివలె ఉన్నవారు, మండుచున్న అగ్నులవలె ఉజ్జ్వల భవిష్యత్తు కలవారు, కోటి చంద్రులతో సమానమైన చల్లని తెల్లని కాంతిగలవారు - ఇట్టివారైన వేదపురుషులను వ్యాసముని చూచి వెంటనే లేచి నేను ధన్యుడను, నేను ధన్యుడను - అనుచు వారికి దండ ప్రణామములు చేసెను. మీరు ప్రత్యక్ష మైనందున ఈనాడు నాజన్మ సఫలమైనది. ఈనాడు నా మనము (చింతించుట) సఫలమైనది. ఈనాడు నా ఆయువు (బ్రదికి ఉండుట) సఫలమైనది. లౌకికముగాని, అలౌకికముగాని మీకు తెలియనిది లేదు. అట్లే తెలియదగిన భూతముగాని, భవిష్యత్తుగాని, వర్తమానముగాని మీకు తెలియనిదిలేదు. వానిని ఎల్లప్పుడు మీరు చూచుచున్నను వానిలో ప్రవర్తించుట ఫలముగా కలవారు కారు. రాగుల విషయమున స్వేచ్ఛగానే పనుల చేయుటగాని, ఉపసంహరించుటగాని చేయుదురు. ప్రపంచము కూడ మిథ్య అనిగాని, బ్రహ్మ అనిగాని, విధించుటగాని, నిషేధించుటగాని మీకుండవు. దాని సంకోచ - విధి - క్షయములు వ్యర్థముగా మీరాగ విషయములు కావు. అందువలననే పరమార్థ నిరూపణమున లోకహితులచేత స్వాక్తములైన స్వర్గాది విషయములు నిశ్చయముగా నశ్వరములని నిందింపబడినవి. శబ్ద బ్రహ్మాత్మ మూర్తులచే అధికారి విభేదముచే కర్మ జ్ఞాన ఉపదేశము ద్వారా జగమంతయు నిశ్చయముగా రక్షింపబడినది. కావున నేను అడుగదలతును. మీరు దయాళువులైనచో చెప్పుడు. కామైకచిత్తులకు కర్మల ఫలము సర్గము (సృష్టి) మోక్షము కాదు. అని చెప్పుదురు. ఈశ్వరార్పిత బుద్ధితో చేసినను పురుషుల ఆకర్మకు ఫలము చిత్తశుద్ధి. దాని తరువాత జ్ఞానము, దాని తరువాత మోక్షము కలుగును. బ్రహ్మైక్యము అగుట అన్నదే మోక్షము. అది సచ్చిదానంద రూపము. అది తెలిసినపుడు కృతాకృతము అంతయు (చేసినది చేయనిది అంతయు) సమాప్తి చెందును. అది సంగములేనిది, జ్ఞానాకాశము, ఆవరణములేని అనంత జ్ఞాన రూపము, కోరికలు లేనిది, చలింపనిది, శుద్ధమైనది, గుణములేనిది, వ్యాపకముకానిది అగును. గాఢాంధకారము వ్యాపించిన లోకమున సూర్యుడు తన నిర్వికారమైన తేజస్సుతో నశింపకయే ఉండును. కాని యాకాంతికి చీకటి మాత్రము నశించుచునే ఉండును. అట్లే వికారములు నశించుచుండ నిర్వికారము నశింపదు. లోహమువలన అయస్కాంత మణిలోని ఆకర్షక శక్తి బయల్పడి విజృంభించును. మథనమువల్ల అరణిలోని అగ్ని బయల్పడి విజృంభించును. అట్లే మిథ్య యొక్క ఆభాసమున (అసత్యమైనదని తెలియుటచే) సత్య బ్రహ్మ జ్ఞానము సత్తను వెలువరచి విజృంభించును. మొదట జీవేశ్వర అకారముతోను, విశ్వాకారముతోను భాసించి అది ప్రలీనముకాగా ఒకే ఒకడైన కూటస్థుడు ఉండును. మీచేత ఈ విధముగ నిర్ణయింపబడినది. అదిఅంతే సంశయములేదు. అయినను కేవలము నా హృదయమున తెలిసికొను కోరిక (జిజ్ఞాస) కలదు. అంతకంటెను పరమైనది ఏమైన ఉన్నదా? లేదా? ఓ మహాభాగ్యవంతులారా! మీరు తత్త్వమును చూచినవారు దానిని చెప్పుడు. దానిని వినుట అన్నఫలమే ఇట నాజన్మకు సార్థక్యము. ఈ విధముగా చెప్పుచున్న సత్యవతీసుతుడైన వ్యాసుని బాగు బాగు అని పొగిడి ఆ వేదములు వేద పురుషులు ఈ మాటలు పలికిరి. వేదములన్నవి (వేదపురుషులు అనిరి) ఓమహాప్రాజ్ఞా! బాగుబాగు. శరీరులకు ఆత్మ విష్ణువు. నీవు జన్మలేని వాడవు అయినను జన్మను పొంది లోకము అనుగ్రహమును కోరుచున్నావు. కాకున్న, నీకు కర్మబంధన రూపమైన సంసారము ఘటింపదు. ఒకప్పుడు జ్ఞానమును కప్పివేయు మాయచే తాకబడనివాడవు. కాని స్వేచ్ఛచేతనే రూపమును ధరించుచున్నావు. స్వేచ్ఛచేతనే రూపమును కప్పి వేయుచున్నావు. మాకు సమ్మతమైన అర్థమునే (విషయమునే) నీవు చెప్పితివి. పురాణములలోను, ఇతిహాసములలోను, సూత్రములలోను (బ్రహ్మ సూత్రములలోను) అనేక విధములుగా సర్వకారణములకు కారణమై, అక్షరమై, పరమమైన బ్రహ్మ చెప్పబడినది. పూవునకు గంధమువలెను (మకరంద) రసమువలెను, ఈ అత్మకాత్మగా ఉన్న రూపమును అ పరబ్రహ్మ రూపముగా తెలియుము. ప్రాకృతికమైన మహాప్రళయము జరుగగా అది మాచే అనుభవింపబడినది. అది అక్షరమునకున్న పరముగా పరమమై కేవలానంద రసరూపము. శబ్దాతీతమైన ఆ పరబ్రహ్మ విషయమున శబ్దాత్మకులమైన మేము వివరించుటకు అశక్తులము.