భువన విన్యాసము - 5

సూతుడు పలికెను:

సరిహద్దు పర్వతమై శుభ్రమైన దేవకూట పర్వతము కలదు. విశాలమైన శిఖరముగల ఆ పర్వత శ్రేష్ఠపు శిఖరము అంతట నూరుయోజనములు ఉండి, మహాభవనములచే అలంకరింపబడి, బుద్ధిమంతుడైన, సుపర్ణుడైన, వినతాసుతుడైన గరుడునియొక్క జన్మక్షేత్రము గలదు. వేగవిక్రమము కలిగి, సంపూర్ణ వీర్యసంపద కలిగి, శత్రువులను దమింపజేయగలిగి, సర్పశత్రువులైన గరుడవంశ సంభవములైన అనేక మహాపక్షి గణములచే కూడియున్న ఆ మహాత్ముడైన పక్షిరాజు గరుడుని యొక్క భవనము అచట గలదు. ఆ పక్షిరాజు మహావాయువేగము గలవాడు, శాల్మలి ద్వీప నివాసి, ఆ దేవకూట పర్వతము యొక్క శిరోభాగము సుందరముగా ఉండును. దాని మహాసంపన్నమైన దక్షిణ(కుడి) శిఖరములు విచిత్రముగా ఉండునవి, ఏడు కలవు. అచట ఏడు గంధర్వ నగరములు కలవు. అవి సంధ్యారాగము వలె ఎఱ్ఱని కాంతిగలవి. గుమికూడి పైకెగసి నట్లుండును. బంగారు ప్రాకారములతోను తోరణములతోను కూడినవి. వనమాలలచే గొప్పకాంతిగలిగి శోభించినవి. దేవతలచే నిర్మింపబడినవి. ముప్పది యోజనముల విశాలములైనవి. నలుబది యోజనముల పొడవుగలవి. ఆగ్నేయులను గంధర్వులు మహాబల పరాక్రమము గలవారు, కుబేర సేవకులు, వారి ఆ భవన రాజములు మిక్కిలి ప్రకాశించుచుండును.

ఆ భువనపు మహాగిరియొక్క ఉత్తర శిఖరములందు ధనిక భవనములచేతను దేవబ్రాహ్మణ నివాసములైన మేడలచేతను చుట్టబడినదియు ఉద్యానవనములతో శోభితమైనదియు అగు పురముగలదు. అది అశీవిషములచే (సర్పములచే) నిండినది. గొప్ప కోటగోడలు, తోరణములునుకలది. నూర్లకొలది వాద్యముల ధ్వనులచే ఆనందింప చేయు వనమధ్య ప్రదేశములుగలది, శత్రువులకు సహింపఅలవి కానిది, ముప్పది యోజనముల మండలముగలది, ఎత్తుగా పెరిగినది, అది దేవశత్రువులైన రాహు సంతానముల నగరము, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ! ఇక దేవ కూటము నందలి సిద్ధ దేవర్షుల చరితము వినుడు.

రెండవదియై శుభమైన సరిహద్దు పర్వతమున కాలకేయులను రాక్షసుల నగరము కలదు. అది అనేక వర్ణములుగల మహాభవనముల పంక్తులతో చుట్టబడినది. ఆ భవనములు బంగారము చేతను మణులచేతను నిర్మింపబడిన చిత్రములచే అలంకరింపబడినవి. ఆ నగరము విశాలమైన రథమార్గములుకలవి. శత్రువులచే నశింపజేయ అలవి కానిది, నిత్య సంతోషము కలది, శివమైనది, స్త్రీ పురుష గణములచే నిండినది. పొడవైన కోటగోడలు, ద్వారతోరణములును కలది. అఱువది యోజనముల వెడల్పు, నూరు యోజనముల పొడవును కలది. శత్రువులకు ఎవ్వరికిని చొరరానిది. రమ్యమైన దేవకూటపు తటమున కూర్చొని ఉన్నట్లు ఉన్నది. జయింప అలవికానిది. గొప్ప మేఘముల సమూహమును పోలినది. ‘సునాసత్’ అని ప్రసిద్ధి గాంచినది.

ఆ దేవకూటము యొక్క దక్షిణ శిఖరమున ఇరువది యోజనముల వెడల్పు, అఱువది రెండు యోజనముల పొడవును గలదియై, బంగారు కోట గోడలు గలదియై, ఔత్కచులైన (పైకి నిక్కబొడుచుకొన్న తలవెంట్రుకలుగల) రాక్షసుల మహాపురము కలదు. ఆ రాక్షసులు కామరూపులు, సంతుష్టులు, బలిష్ఠులు మదించిన వారు, వారి నివాస భవనములు అచట గలవు.

దేవకూట పర్వతముయొక్క మధ్య మహాశిఖరమున, మహాత్ముడై మహాదేవుడైన ముక్కంటి యొక్క అనేక భూతగణములకు నిలయమైన భూతవటమను ఒక మహావట వృక్షముగలదు. అది ముక్కంటి యొక్క ప్రకాశవంతమైన నివాసము. సర్వలోక ప్రసిద్ధ మైనది. అది బంగారంచేతను, మణులచేతను, రాళ్లచేతను దట్టముగా ఉన్న చిత్రములు గలిగి శుభకరములైన నూరు శాఖలచేతను, వాని పైనున్న అనేక పక్ష్యాదులచే సమకూలమైనది. దట్టమైన ఆకులతోను గొప్పవేళ్ళతోను అనేక శాఖలను మోయుచున్నది. రమ్యమైనది. దట్టమైన నీడకలది. పది యోజనముల మండలము గలది. పంది, ఏనుగు, సింహము, ఎలుగుబంటి, పులి, ఒంటెపిల్ల, గద్ద, గుడ్లగూబ, గొఱ్ఱె, మేకల విశాల ముఖములు కలిగి, గుబురుగాను, వికటముగాను, లావుగాను, పొడవుగాను ఉన్న తలవెంట్రుకలు ఒడలిపై వెంట్రుకలునుగలిగి, అనేక వర్ణములు ఆకారములును ధరించి, అనేక స్థితుల లో ఉండి ఉగ్రులై ఉగ్రముఖులై, ఉగ్రపరాక్రములై, ఉజ్జ్వలులైన భూతముల చేతను, అట్లే మహాపారిషదులచే చండీశ్వరాది ప్రమథగణముఖ్యులచేతను, (ఆ వట వృక్షము) ఎల్లప్పుడు నిండిఉండును. అచట భూతములు, భూతపతి అయిన శివుని నిత్యము పూజింతురు. ఝర్ఝురములు శంఖములు, పటహములు (తప్పెటలు), భేరులు (దుందు భులు), డిండిమములు(రాయరిగిడిగిళ్ళు), గోముఖములు (ఆవు ముఖమువంటి వాద్య విశేషములు) మొదలైన వాద్యముల యొక్క రకరకములైన ధ్వనులతో కూడి గానములచేత భ్రమణములు లేని నూర్ల విస్ఫూర్జితముల చేతను శివగణ నాథులు శివపూజా యుక్తులు, సంతుష్టులు, క్రీడాపరులు అగుదురు. సిద్ధులచేతను, దేవతలచేతను, ఋషుల చేతను, గంధర్వులచేతను, యక్షులచేతను నాగేంద్రులచేతను పూజితుడై సాక్షాత్తు లోకశివంకరుడై మహాదేవుడైన శివుడు ఆ స్థానమున పూజితుడు అగుచుండును.