వాయు మహా పురాణము
యుగ ధర్మ నిరూపణము
వాయువు పలికెను:
ఆపైన ప్రణవము (ఓంకారము) యొక్క నిశ్చయ స్వరూపమును చెప్పబోవుచున్నాను. ఓంకారము అక్షర రూపమై నశింపని బ్రహ్మము. మొదటినుండియు అది మూడు వర్ణములు గలది అని చెప్పబడినది. ‘ఓం’ కారమునకు సంబంధించినదిగా ఏ యే వర్ణము ఎట్లు జన్మించినదో చెప్పబడినదో అట్లే దేవతలు, ఋక్కులు, యజస్సులు, సామములు (ఋగ్యజుస్సామ వేదములు మూడు), వాయువు, అగ్ని, జలము (అను మూడు భూతములు). ఆ అక్షరమైన ఓంకారము నుండియే పుట్టినవి. అట్లే మరికొందరు దేవతలకును దేవతలైన పదునాలుగురు మహాత్ములు కూడ పుట్టిరి. వారి అందరిలో ఉన్నవాడు తక్కిన అంతట ఉన్నవాడు సమస్త యోగములను తెలిసినను ఆ మహాదేవుడు లోకములను అనుగ్రహించుటకై ఆదియైనవాడు అనియు, మధ్యయైనవాడు అనియు, అంతమైనవాడు అనియు జెప్పబడుచున్నాడు. దేవదేవుడైన మహేశ్వరాత్మకమై నశింపని ఆ ‘ఓం’ కార అక్షరమునుండి సప్తర్షులు, పితృ దేవతలతో కూడిన దేవతలును బయలు వెడలిరి.
ఇహపరలోకముల హితము కొఱకే పరమపదమును చెప్పుదురు. యుగముల పేర్లతో పేరిడబడిన కాలముగురించి పూర్వమే నాతో చెప్పబడినది. చక్రమువలె తిరుగుచున్న వానియందు తిరుగుచుండు కృత, త్రేతా, ద్వాపర, కలియుగములచే కాలము గుర్తింపబడినది. అపుడు దేవతలు కాలమునకు వశులై భయము చెందిరి. తమతో కాలమును కౌలువలేకపోయిరి. మన్వంతరాదిలో వారు మౌనము వహించిరి. కాలమునకు భయపడిన వారై ఋషులు, దేవతలు, మహాతపస్వియైన ఇంద్రుడును, వేయి సంపూర్ణసంవత్సరములు మనస్సును తీవ్రముగా సమాధిలో ఉంచి మహాదేవుని శరణుపొందిరి. ఈ కాలుడు దేవేశుడు నాలుగు ఆకారములు కలిగి నాలుగు ముఖములు గలవాడు. ఓ మహాదేవ! ఓ మహేశ్వర! లోతైన ఈ కాలమును ఎవరును తెలియ లేరు?
ఆ తరువాత మహాదేవుడు ఆ నాలుగు ముఖములుగల కాలుని చూచెను. “భయపడ వలదనెను. మీ కోరిక యేమియో తీరును అనెను.
“దానిని అంతయు నెరవేర్తును ఈ పరిశ్రమ వ్యర్థముగాదు. అని భగవంతుడైన మహా దేవుడనెను. “కాలుడు (కాలము)జయించుటకు అలవికానివాడు. ఈతని ముఖము తెల్లనిదై నాలుగు నాలుకలు కలదియైకనబడును. కృతయుగము అన్నది ఇది. ఇది ఆ కాలునియొక్క ముఖము. (ప్రారంభము) ఈతడు దేవతాశ్రేష్ఠుడైన బ్రహ్మ, యముని ముఖము. ఎఱ్ఱని కాంతిగల మూడవదిగా మీకు చెప్పబడినది. మూడు నాలుకలు గలిగి పెదవులు కనబడునది త్రేతాయుగము. ఇచట మహేశ్వరునివలన యజ్ఞ ప్రవృత్తి జరుగును. అందువలన ఇచట యజ్ఞము నిర్వహింపబడును. ఓ బ్రాహ్మణులారా! మూడు నాలుకలు, మూడు అగ్నులు ట్రేల్వబడి కాలజిహ్వ ప్రవర్తించును. ఈ భయంకరమైన, రెండు నాలుకలు కలిగిన, ఎరుపు గోరోచనము వంటి రంగుకలిగిన ముఖమునందు రెండు పాదములు గలవాడనై నేను ఉందును. కావున అది ద్వాప(ద)రము అను యుగము. ఈ నల్లనై, ఎఱ్ఱని కన్నులుగలిగి, ఒక నాలుక కలిగి, విశాలమై శ్యామమై మాటిమాటికి పెదవుల నాకుకొనుచున్న, ముఖమునుండి ఘోరమై సర్వలోక భయంకరమైన కలియుగము ఏర్పడినది. ఈ కలియుగ కల్పమునకు ఇది నాల్గవదియై, భయంకరమైన ముఖము కలిగి ఉండును. ఆ యుగమున ప్రారంభముగాని అంతముగాని ఉండదు. ఆ యుగమున ప్రజ గూడ కాలగ్రస్త అగును.
కృతయుగమున బ్రహ్మ పూజ్యుడు. త్రేతాయుగమున యజ్ఞము పూజ్యము, ద్వాపర యుగమున విష్ణువు పూజ్యుడు. నాలుగు యుగములలోను నేను పూజ్యుడను. బ్రహ్మ, విష్ణువు, యజ్ఞము ఇవి కాలము యొక్క మూడు కళలు. అన్ని కాలములందును చతు ర్మూర్తియై మహేశ్వరుడను నేను ఉందును, నేను జనుడను (జనించినవాడను) పుట్టించు వాడను, కాలస్వరూపుడను. కాలమును ప్రవర్తింప చేయువాడను. అట్లే యుగకర్తను. అన్నిటి కంటె పరుడైన పరాత్పరస్వరూపుడను. అన్నిటికంటే ఉత్కృష్టులైన వారియందు సక్తుడను.
కావున ఓ సురోత్తములారా! కలియుగమును పొంది లోకముల హితమును కారణముగా చేసికొని, దేవతల అభయము కొఱకు దేవమానవలోకముల యందు రెంటికి భవ్యుడను (శుభమైన వాడను) పూజింప దగినవాడను కూడ అగుదును. ఓ మహాతేజో వంతులారా కలియుగమును పొంది భయపడరాదు అని ఈ విధముగా చెప్పబడిన ఆ దేవతలు అందరును ఋషులతో గూడి తలలువంచి నమస్కరించి ఆ జగత్పతియైన మహా దేవునితో ఇట్లనిరి.
దేవతలును ఋషులును అనిరి:
మహాతేజుడు, మహాకాయుడు, మహావీర్యు(బలు)డు, మహాకాంతిమంతుడు, సర్వ భూతములకు భయంకరుడు అయిన కాలుడు (సమయము) నాలుగు ముఖములు గల వాడెట్లు అయ్యెను?
మహాదేవుడు అనెను:
“ఈ కాలస్వరూపుడు నాలుగు ఆకారములు గలవాడు. నాలుగు కోరలు గలవాడు. నాలుగు ముఖములు గలవాడు. లోకసంరక్షణము కొఱకు అంతట సంచరించును. చరాచరమైన ఈ ప్రపంచము అంతటను ఈతనికి అసాధ్యము లేదు. కాలము భూతము లను సృజించును. మరల క్రమముగా సంహరించును. అందరును కాలమునకు వశులై నడుచుకొందురు. కాలము ఎవ్వరివశమున ఉండదు. కావున ఎల్లప్పుడు కాలము సమస్త భూతములను తమ తమ పనులలో ప్రవర్తింపజేయును.
ఈతని వీరోచితమైన నడకలో పూర్వము చెప్పబడిన పదములు దెబ్బది యొక్కటి. కాలము నడచుచు గడచినప్పుడు మన్వంతర క్షయమగును.
అని భగవంతుడు ఈ విధముగా దేవర్షి పితృ దానవులకు చెప్పి, వారందరిచే నమస్కరింపబడి అచటనే అంతర్థానమందెను. ఈ విధముగా ఆ భగవంతుడు కాలమున దేవర్షి, పితృ, దానవులను మరల మరల సంహరించును. మరల మరల పుట్టించును. అందువలన మన్వంతరమున గూడ భగవంతుడైన ఈశుడు కాలభయమున దేవర్షి, పితృ, దానవులచే పూజింపబడును.
కావున బ్రాహ్మణుడు అన్ని విధముల ప్రయత్నముతో మహాదేవుని గూర్చి తపము చేయవలెను. మహాదేవుని శరణు పొందిన వానికి గొప్పపుణ్య ఫలము లభించును. కావున దేవతలు ఋషులును స్వర్గమునకు వెళ్లి భూతలమున దిగి, అతి భయంకరమైన కలిని పొంది ధర్మ పరాయణులై మిక్కిలి తపము చేయగోరుదురు. కలిని పొంది మరల మరల అవతారములను ధరింతురు.
ఈ విధముగా కాలాంతరమున వేలకొలది గతించినవారందరు వైవస్వత మన్వం తరమున దేవర్షులు, రాజర్షులును అగుదురు. ఆ విధముగనే పురువంశరాజైన దేవాపియు, ఇక్ష్వాకువంశమున పుట్టిన మనువును మహాయోగబలముతో కూడిన వారై కాలాంతరమును చేరియుండిరి. ఆ కలియుగము క్షీణింపగా, కలియుగము కృతయుగముగా చేయబడగా, మరల సప్తర్షులతో బాటు త్రేతాయుగము తప్పక రానుండగా, క్షత్రియ వంశములకు చెందినవారు(మరల) రాగలరని చెప్పబడిరి. (కృత త్రేతల ప్రతిష్ఠాంతమైన ద్వాపరాంత మునను ఋషులతో పాటు క్షత్రియులు కూడారాగలరు. కృతయుగము, త్రేతా యుగము, ద్వాపర యుగమును గడచిపోగా కలియుగమున వారందరు పాతకులైన నరులుగానే ఉందురు.
ఏడు మన్వంతరములయొక్క సంతానమే శ్రుతికి స్మృతికిని అర్థము. ఈ విధముగా ఈ అన్నింటి యందును యుగములు అక్షయ క్రమములుగా ఉండును అట్లే పరస్పరముగా యుగములలో బ్రహ్మ, క్షత్రియుల పుట్టుక జరుగును. క్షయము ననుసరించి వారినుండి ప్రవర్తిల్లిన ప్రకృతి, స్త్రీలు మొదలగువారి ప్రకృతి ఎట్లుండునో తెలియును. జమదగ్ని పుత్రుడైన పరశురామునిచే క్షత్రము (జాతి) నిశ్శేషముగా వసుధాధిపులైన (రాజులైన) క్షత్రియులచేత (వారు చంపబడుటచేత) వారి స్త్రీలందరు కులటలు (వ్యభిచారిణులు)గా చేయ బడిరి. ఆ విధముగా స్వర్గమును పొందిన (చనిపోయిన) వారిని నేను మీకు చెప్పెదను వినుడు.
ఇక్ష్వాకు వంశమునకు ఐడుడను వానిని మూలముగా చెప్పుదురు. వరుస కట్టుట వలన భూలోకమున ఇతర క్షత్రియులు రాజులుగా ఉండిరి. తరువాత ఐడుని వంశమున పుట్టినవారు ఇక్ష్వాకు రాజులు. వంద కులములు వారినుండి వచ్చినవే రాజ్యాభిషేకము చేయబడినవి. భోజులు అను వందరాజవంశములు కూడ రాజ్యమునందు అభిషేకింపబడినవి. వాని విస్తారము రెండింతలైనవి. భోజ క్షత్రియ వంశములు మూడు వందలైనవి. అవి దిక్కులను అనుసరించి నాలుగు విధములైనవి. వారిలో గతించిన రాజులను చెప్పెదను వినుడు. ప్రతివింధ్యులకు సంబంధించినవారు వంద మంది గతించిరి అట్లే హైహయులు వంద (గతించిరి) ధృతరాష్ట్రునకు సంబంధించిన వారు నూట ఒక్కటి (గతించిరి) జనమే జయులు ఎనుబది బ్రహ్మదత్తులకు సంబంధించినవారు వంద. వీర్యవంతులైన వారికి సంబం ధించిన కులములు వందయు గతించిరి. తరువాత పౌలులకు సంబంధించినవారు వంద, కాశికుశాదులు (కాశీ-కుశ దేశమునకు సంబంధించినవారు) వందగతించిరి. అట్లే గతిం చిన శశ బిందువులు వేయికిమించిఉండిరి. వారందరు లక్షదక్షిణలతో కూడిన యశ్వమేధ యజ్ఞములు చేయుచుండిన వారే.
ఈ విధముగ యుగములతో బాటు గతించిన రాజర్షులను గురించి సంక్షేపముగ జెప్పబడినది. వారిని పూర్తిగా చెప్పుట సాధ్యము గాదు. వీరు యయాతి వంశ వర్ధనులుగా ఉండిరి. లోకములను ధరించిన వీరు ద్యుతిమంతులుగ కీర్తింపబడిరి. వీరు దుర్లభములై బ్రహ్మ లోకమునకు సంబంధించిన ఐదువరములు పొందిరి. అవి-ఆయువు, పుత్రులు, ధనము, కీర్తి, ఈశ్వర సంబంధమైన భూతి (ఐశ్వర్యము). ఈ పంచ వర్గమును ధరించుట వల్లను, వినుట వల్లను బుద్ధిమంతులు బ్రహ్మలౌకికులై బ్రహ్మలోకమును పొందుదురు. కృత యుగము నాలుగు వేల యేండ్లు. దానికి అన్నివందలే (నాలుగువేలే) సంధ్యలు సంధ్యాంశమును గూడ అనారీతిగానే ఉండును. కృతయుగమున ప్రక్రియాపాదము నాలు వేలు. కావున నాలుగు వందలు సంధ్యలు. సంధ్యాంశము గూడ అంతియే. త్రేతాది యుగములు ఏడు వేలయేండ్లు. దానికిగూడ మూడువందల సంధ్యలు. సంధ్యాంశములు గూడ మూడు వందలు అనబడినవి. త్రేతాయుగమున అనుషంగ పాదము మూడువేల యేండ్లు. ద్వాపరమున రెండువేల యేండ్లని చెప్పబడినవి. దానికి గూడ సంధ్యలు, రెండు వందలు సంధ్యాంశములు గూడ రెండువందలే. ద్వాపరమున ఉపోద్ఘాతము అనునది మూడవ పాదము అనబడును. సంఖ్యావేత్తలగు జనులుకలిని వేయి ఏండ్లుగనే చెప్పుదురు. దానికి కూడ సంధ్యలు నూరు సంధ్యాంశములు గూడ నూరే. కలియుగమున సంహార పాదము నాలుగవదిగా చెప్పబడినది. సంధ్యలతోను సంధ్యాంశలతోను గూడినవి నాలుగు యుగములు. ఇది పండ్రెండు వేలయేండ్లు కలది నాలుగు యుగముల సమూహము అని చెప్పబడినది. ఈ విధముగ పాదములతో శ్లోకముల సంఖ్య ఐదు ఐదు వేలు. అట్లే సంధ్యా సంధ్యాంశకములతోనే తక్కినవి రెండు వేలు. ఈ విధముగ కవులు పురాణమును పండ్రెండు వేలు కలదిగా చెప్పుదురు. వేదము నాలుగు పాదములు గలదైనట్లే యుగము గూడ నాలుగు పాదములు కలది. యుగము నాలుగు పాదములు గలదిగా బ్రహ్మ స్వయముగా నిర్మించినట్లే దేవతలకు గూడ పూర్వము బ్రహ్మచే నాలుగు పాదములు గలదిగా యుగము చెప్పబడినది.