వాయు మహా పురాణము
యతి ప్రాయశ్చిత్తవిధి
వాయువు ఇట్లు పలికెను:
ఆపైన యతులయొక్క నిజముగా చేసిన అకామకృతములైన పాపకృత్యములకు తెలియక చేసిన పాపకర్మలకు ప్రాయశ్చిత్తములను నిశ్చయముగా చెప్పనున్నాను. ధర్మసూక్ష్మముతెలిసిన వారు కావలెనని తెలిసిచేసిన పాపములకును ప్రాయశ్చిత్తములు ఉన్నవి అని అందురు. పాపము మూడు విధములు మాటతో కలిగినది, మనస్సుతో కలిగినది, శరీరముతో కలిగినది. ఈ త్రివిధ పాపముచే రాత్రింబవళ్లు ఈ జగము బాధింపబడుచున్నది. కర్మలు ఉండవు, కర్మలు చేయువాడు గూడ ఉండడు అని శ్రేష్ఠమైన వేదము చెప్పినది. ఆయుష్యము స్థిరముగా నిలువనిది, కావున ప్రాయశ్చిత్తము క్షణకాలమే ప్రయోగింపదగినది. ధీరుడై ఉండవలెను. అప్రమత్తుడై ఉండవలెను. యోగమే ఉత్కృష్టమైన బలము. నరులకు యోగముకన్న వేరైన బలము ఏదియులేదు. కావున ధర్మయుక్తులైన విద్వాంసులు యోగమును ప్రశంసింతురు.
విద్యచే అవిద్యను దాటి, ఉత్తమోత్తమమైన ఐశ్వర్యమును పొంది, పరమును, అపరమును చూచి ధీరులు ఆ పరమపదమును పొందుదురు.
భిక్షువులకు కొన్ని వ్రతములు ఉపవ్రతములు విధింపబడినవి. వానిలో ఒక్కొక్క దానిని పాటించనప్పుడు వానికి ప్రాయశ్చిత్తము విధింపబడును. కామముతో స్త్రీని పొందినప్పుడు ప్రాయశ్చిత్తముగా అతడు ప్రాణాయామముతో బాటు సాంతపన వ్రతమును ఆచరింపవలెను. అనగా మూడు దినములు పగళ్లును, మూడు దినములు రాత్రులును భుజించి, మూడు దినములు అయాచిత పదార్థములను భుజించి, పిమ్మట మూడు దినములు నిట్రుపాసము ఉండెడు వ్రతము. కొందరిమతమున పంచగవ్యమును కుశోదకమును పుచ్చుకొని ఒక రాత్రియు ఉపవాసముండు వ్రతమును చేయవలెను. ఆ తరువాత పై చెప్పిన సొంతపన వ్రతము చివర సమాహితుడై (సమాధి యందు ఉన్నవాడై) ఇంతకు ముందు చెప్పిన దానిని చేయవలెను. తరువాత ఆశ్రమమునకు మరలవచ్చి సోమరితనము వీడి భిక్షువుగా చరింపవలెను. కిటుకులు గల మాటలు హింసింపవని పండితులందురు. ఐనను ఈ ప్రసంగమును దారుణముగా చేయరాదు. అహోరాత్రములు (ఒకదినము ఒకరాత్రి) మించిన అధర్మము లేదు అని శ్రుతి చెప్పినది. అనగా చేసిన అధర్మము ఒక రాత్రింబవళ్ళతో కూడిన దినమునకు మించి ఉండదని వేదము చెప్పినది.
ఈ హింస దేవతలచేతను మునులచేతను సృష్టింపబడి పెద్దదైనది. ఈ డబ్బు అనునది బాహిరమున చరించు ప్రాణములు (పంచప్రాణములు) అని ఈ విధముగా అనుకొని, దుష్టాత్ముడు, భిన్నమైన నడవడిక కలవాడై, వ్రతమునుండి భ్రష్టుడగును.వాడు మరల దుఃఖమును పొంది చాంద్రాయణవ్రతమును జేయవలెను. శాస్త్రము చెప్పిన తీరుగా చాంద్రాయణ వ్రతమును సంవత్సరము పాటు చేయవలెనని శ్రుతి అనుచున్నది. తరువాత సంవత్సరాంతమున మరల క్షీణించిన పాపము గలవాడై మరల వైరాగ్యము చెందినవాడై, సోమరితనములేక భిక్షువుగా తన ధర్మమున చరింపవలెను.
భిక్షువు మనస్సుతో, మాటతో, శరీరముతోను సర్వప్రాణుల యెడ అహింసను పాటించవలెను. కావలెనని కాక, అబుద్ధి పూర్వకముగనైనను, పశువులను మృగములను హింసించినచో, కృచ్ఛ్రాతి కృచ్ఛ్ర వ్రతమునుగాని, చాంద్రాయణ వ్రతమునుగాని ప్రాయశ్చిత్తముగా చేయవలెను. యతి, స్త్రీని చూచి ఇంద్రియ దౌర్బల్యమున వీర్యస్ఖలనము గావించెనేని ప్రాయశ్చితముగా పదహారు ప్రాణాయామములు చేయవలెను. పగలు వీర్యస్ఖలనము గావించిన యతికి మూడు రాత్రులు ఉపవాసమును, నూరు ప్రాణాయామములును ప్రాయశ్చిత్తముగా విధింపబడినవి. రాత్రియందు వీర్య స్ఖలనము గావించినవాడు స్నానము జేసి శుచియై పన్నెండు ధారణలు (యోగముచే మనస్సును ఆత్మయందు నిలుపుట) ప్రాయశ్చిత్తముగా చేయవలెను. బ్రాహ్మణుడైన యతి ప్రాణాయామముతో శుద్ధాత్ముడును రజోగుణములేని శుద్ధసాత్త్వికుడడు అగును. యతులు ఏకాన్నమును (కేవలము అన్నమును), మధువును, (మద్యమును), మాంసమును, అమశ్రాద్ధము నందలి భోజనమును, ప్రత్యేకముగా ఉన్న లవణములను తినరాదు. నిషేధమును దాటి ఒక్కొక్క దానిని భుజించినపుడు ప్రాయశ్చిత్తము విధింపబడినది. ప్రాజాపత్య వ్రతముచేతను కృచ్ఛ్ర వ్రతముచేతను ఆ పాపమునుండి విముక్తుడగును. నియమమును అతిక్రమించి వాక్కు మనస్సు, శరీరములతో చేసిన పాపములకు సజ్జనులైన విద్వాంసులతో కూడిన వారు నిర్ణయించి చెప్పిన ప్రాయశ్చిత్తమును చేసికొనవలెను. విశుద్ధ బుద్ధియై, మట్టి, బంగారములను సమముగా జూచువాడై, సర్వ భూతములందు చరించు సమాధియందు ఉండువాడు, శాశ్వతము, నాశములేని స్థిరమైన పరమైన స్థానమును పొంది పునర్జన్మ రహితుడగును.