సృష్టి ప్రకరణము

అని చెప్పి మరల లోమహర్షణుడు ఇట్లు పలికెను:

ఓ విప్రులారా! నేను మరియొక కాలములో చేయబడిన సృష్టిని గురించి వివరించితిని. ఈ కాలము పరమేశ్వరునికి పగలు అని తెలుసుకొనుడు. పరమేశ్వరుని రాత్రి పగటితో సమానమైన వ్యవధిని కలిగియుండును. సృష్టికాలము పరమేశ్వరుని పగలు అనియు, ప్రళయము రాత్రి అనియు చెప్పబడును. సామాన్య జనుల క్షేమమును కోరి, పరమేశ్వరునకు పగలేగాని, రాత్రి ఉండదని, ఉపచారము (కల్పన)గా పండితులు చెప్పుదురు. ప్రజలు, ప్రజాపతులగు ఋషులు, మునులు, బ్రహ్మ లోకమునందు ఉండి సనత్కుమారుడు మొదలగు ఋషులు, ఇంద్రియములు, ఇంద్రియ గోచరములగు పదార్థములు, ఐదు మహా భూతములు, తన్మాత్రలు (సూక్ష్మ భూతములు), మనస్సు, బుద్ధి అనునవి జ్ఞానస్వరూపుడగు పరమేశ్వరుని పగటి యందు ఉన్నవి. పగలు పూర్తికాగానే ఆయన యందు లీనమగును. రాత్రి పూర్తికాగానే మరల జగత్తు సృష్టింపబడును. కార్యరూపమగు జగత్తు ఉపసంహరింపబడును. సమస్త ప్రాణులు తమలో లీనము కాగా, ప్రధాన పురుషులు ఇద్దరు సమాన ధర్మముగలవారై ఉండిరి. ప్రధానము (ప్రకృతి) నందు తమస్సత్త్వ గుణములు సమముగా నుండెను. వాటిలో ఒకటి ఉద్రేకమును పొందినపుడు మరల సృష్టి కలుగును. గుణములు సమముగా ఉన్న అవస్థ ప్రళయమనియు, గుణములలో విషమస్థితి కలిగినపుడు సృష్టి అనియు చెప్పుదురు. నువ్వు గింజలలో నూనెవలె, పాలలో నేయివలె, రజోగుణము తమస్సత్త్వ గుణములయందు అవ్యక్తమును ఆశ్రయించి ఉండును. పరమేశ్వరుడు రాత్రి భాగమునంతను గడుపగా పగలు ప్రారంభము అయ్యెను. అపుడు మరల ప్రకృతి నుండి సృష్టి బయలుదేరెను. పరమేశ్వరుడు సర్వోత్కృష్ట మగు యోగము యొక్క ప్రభావము వలన, ప్రధాన పురుషుల యందు అండము నందు తీవ్రమగు కదలికను కలుగజేసెను. ఆ విధముగా క్షుబ్ధము చేయబడిన ప్రధానము నుండి రజోగుణము బయల్వెడలెను.

బీజము నుండి అంకురము వచ్చునట్లు చేయునది జలము. అటులనే, గుణవైషమ్యమును పొందిన ప్రధానము నుండి ప్రాణులు జన్మించునట్లు చేయునది రజోగుణము. ఈ విధముగా గుణములలో క్షోభను కలుగజేయగా, ముగ్గురు దేవతామూర్తులు జన్మించిరి. సర్వ ప్రాణులకు ఆశ్రయమైన ఆ దేవతలు సర్వశ్రేష్ఠులు. వారి తత్త్వము తెలియుట దుష్కరము. వారు శరీరాకారమును ధరించిరి. రజోగుణము బ్రహ్మగను, తమోగుణము అగ్నిగను, సత్త్వగుణము విష్ణువుగను పరిణమించెను. రజోగుణము ప్రముఖముగా గల బ్రహ్మ సృష్టికర్త అయినాడు. తమోగుణము ప్రముఖముగా గల అగ్ని కాలరూపుడైనాడు. సత్త్వము ప్రధానముగా గల విష్ణువు ఉదాసీనుడుగ నున్నాడు. ఈ ముగ్గురు దేవతలు మూడు వేదములుగను, మూడు అగ్నులుగను ప్రకాశించుచున్నారు. వీరు పరస్పర సహకారముతో జగత్కార్యమును నిర్వహించుచున్నారు.

వీరు ఒకరిని మరియొకరు ధరించుచున్నారు. ఒకరికి మరియొకరు ఆధారముగా, ఒకరితో మరియొకరు కూడి, జగత్కార్యమునందు ప్రవర్తిల్లుచున్నారు. వీరు ఒకరినొకరు విడిచి క్షణకాలమైననూ ఉండరు. దేవతలకు కూడా దైవము పరమేశ్వరుడు. మహత్తుకంటె ఉత్కృష్టమైనవాడు విష్ణువు. రజోగుణముయొక్క ఉద్రేకము గల బ్రహ్మ సృష్టి కార్యమునందు ప్రవర్తిల్లును. పురుషుడు పరుడు (సర్వోత్కృష్టుడు) అనియు, ప్రకృతి పర (సర్వోత్కృష్టమైనది) అనియు చెప్పబడినది. ఈ ప్రకృతి మహేశ్వరునిచే అధిష్ఠితమై, సర్వదా ఆయనచే ప్రేరితమై ప్రవర్తిల్లుచున్నది. బ్రహ్మ మొదలగు మహాత్ములు తదనుసారముగా తమ క్షేత్రములలో తమ ధర్మములను ప్రేమతో నిర్వర్తించుచున్నారు.

గుణములలో విషమస్థితి ఏర్పడుట వలన ప్రధానము (ప్రకృతి, అవ్యక్తము) ఈశ్వరా ధిష్ఠితమై జగత్సృష్టియందు ప్రవర్తిల్లుచున్నది. ప్రధానము కారణ రూపములో అసత్ అనియు, కార్యరూపములో సత్ అనియు చెప్పబడుటచే (సత్ + అసత్ ఆత్మకము) సద సదాత్మకమగును. బ్రహ్మ, మహత్తు అను జంట దాని నుండి ఒక్కసారిగా పుట్టెను. పం ‘బ్రహ్మ అనబడు క్షేత్రజ్ఞుడు అవ్యక్తమును వ్యాపించి, దేహేంద్రియములతో కూడి బ్రహ్మ రూపములో సృష్ట్యాదియందు ప్రకటమయ్యెను. ప్రథమ జీవుడగు బ్రహ్మ బుద్ధిశాలియై, తేజశ్శాలియై ప్రకాశించెను.

ఆ ప్రథమ జీవుడు జగత్సృష్టి యందు ప్రవర్తిల్లెను. ఆయన సాటిలేని జ్ఞానముతో, ఈశాన శక్తితో, ధర్మముతో, జ్ఞాన వైరాగ్యములతో ప్రకాశించెను. ప్రథమ శరీరాభిమా నియగు బ్రహ్మ బుద్ధి ధర్మముతో, ఈశన శక్తితో నిండియుండెను. ఆయన మనస్సులో దేనిని సంకల్పించిననూ, అది అవ్యక్తమునుండి పుట్టుచుండెను. ఆయన స్వభావముచేతనే జితేంద్రియుడు, విశేషగుణ సంపన్నుడు, దేవతలకు అధిపతి అగుట వలన ఇది సంభవమయ్యెను. పురుషుడు చతుర్ముఖ బ్రహ్మ ఆయెను. ఆయనయే సంహారకుడగు కాల స్వరూపుడాయెను. స్వయంభువు (స్వయముగా ఉండువాడు, పుట్టుక లేనివాడు) అనంత శిరస్సులు గలవాడు (సమస్త ప్రాణిరూపుడు) అగు పురుషునకు మూడు అవస్థలు గలవు. సత్త్వరజస్సులు ప్రముఖముగాగల బ్రహ్మ, రజస్తమస్సులు ప్రముఖముగా గల సంహారకుడు, సత్త్వము ప్రముఖముగాగల పురుషుడు అను మూడు గుణ ప్రయుక్తములగు అవస్థలు స్వయంభువు అగు పరమాత్మకు కలవు. ఆయన బ్రహ్మరూపుడై లోకములను సృజించును. సంహా రకుడై లోకములను ఉపసంహరించును. అసంగుడగు పురుషుడు అనునది మూడవ అవస్థ.

బ్రహ్మ పద్మములోపలి భాగమువలె ఉండును. సంహారకుడగు కాలుడు కాటుక కాంతి గలవాడు. పురుషుడు పద్మమువంటి నేత్రములు గలవాడు. పరమాత్మ యొక్క రూపము ఇట్లుండెను. యోగశక్తి సంపన్నుడగు పరమేశ్వరుడు తన లీలచే వివిధ ఆకారములను ధరించి, వివిధ క్రియలను ఆచరించుచూ, వివిధ నామములతో వివిధ దేహములలో ప్రకటమై, మరల వాటిని, అంతర్ధానము ఒనర్చుచుండును. ఆయన మూడు రూపములలో, మూడు వేర్వేరు గుణములతో ప్రకటమగుటచే త్రిగుణుడు అనబడును. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అను నాల్గు రూపములలో విభాగమును పొందుటచే చతుర్వ్యూహుడు అని కీర్తించబడును. జీవదేహమునందు చైతన్య రూపుడుగ ఉండి, సుషుప్తిలో స్వరూపమును పొందును. స్వప్నముతో స్వయంప్రకాశముతో విస్తరించును. జాగ్రదవస్తలో విషయ సంస్కారములను అనుభవించును. జీవుని వివిధ అవస్థలలో ఏకరూపము (అహం ప్రత్యయ రూపము)గ ఉండును. కాన, పరమేశ్వరునకు ఆత్మ అను సార్థక నామము కలిగినది. ఆయన సర్వవ్యాపకుడగుటచే ఋషి అనియు, సర్వముపై అధిపతి యగుటచే ప్రభువు అనియు, సర్వమునందు ప్రవేశించుటచే విష్ణువు అనియు కీర్తింపబడును.

సమగ్రమగు ఐశ్వర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము అను ఆరు గుణములకు భగము అని పేరు. అవి కలవాడు గనుక పరమాత్మకు భగవానుడని పేరు. ఆయన రాగమును శాసించువాడు కనుక, ‘రాగుడు’ అనబడును. ప్రకృతి కంటే ఉత్కృష్టుడు కనుక పరుడు అనియు, రక్షించువాడు గనుక ‘ఓం’ అనియు కీర్తింపబడును. సర్వమును ఎరిగినవాడు గనుక సర్వజ్ఞుడనియు, సర్వము ఆయన నుండియే ఉద్భవించినది కనుక సర్వుడు అనియు అనబడును. సర్వప్రాణులకు ఆశ్రయము కనుక నారాయణుడు అనబడును. ఆయన తనను తాను మూడు రూపములుగా విభాగముచేసి, ఒక రూపముతో ముల్లోకముల సృష్టిని, మరియొక రూపముతో స్థితిని, ఇంకొక రూపముతో లయమును చేయుచున్నాడు.

నాల్గుముఖములుగల హిరణ్యగర్భుడు మున్ముందు ఆవిర్భవించెను. ఆయన సర్వమునకు ఆదియందు ఉండుటచే, ఆది దేవుడనబడును. పుట్టుకలేనివాడు గనుక, అజుడు అనబడును. ప్రజలను అందరిని పాలించువాడు గనుక, ప్రజాపతి అనబడును. ఆయన దేవతలందరిలో శ్రేష్ఠుడగు దేవుడు గనుక, మహాదేవుడు అనబడును. సర్వ లోకములకు ప్రభువగుటచే ఈశ్వరుడనియు, మహాపరిమాణము కలవాడు గనుక బ్రహ్మ అనియు, సత్తా (ఉనికి) రూపుడు గనుక ‘భూతుడు’ అనియు చెప్పబడును. క్షేత్రము (విరాట్ దేహము, లేక ప్రాణి దేహము)ను యెరిగినవాడు గనుక క్షేత్రజ్ఞుడనియు, సర్వ వ్యాపకుడు గనుక విభుడనియు, దేహము (పురము) నందు నివసించువాడు గనుక పురుషుడనియు బ్రహ్మకు నామములుగలవు. పుట్టుక లేనివాడు అగుటచేతను, సర్వమునకు ఆదియందుండుట చేతను పరమేశ్వరునకు స్వయంభువు అని పేరు. యజ్ఞములలో ఆరాధింపబడును గనుక యజ్ఞుడనియు, ఇంద్రియ గోచరము కాని తత్త్వమును దర్శించువాడు గనుక కవి యనియు ఆయన కీర్తింపబడును.

బ్రహ్మ జ్ఞానముచే ప్రాజాపత్య స్థానమును అతిక్రమించుట సంభవము గనుక ప్రజాపతికి క్రమణుడు అని పేరు. ఈశ్వర స్తుతి రూపములగు వేదములను బ్రహ్మ రక్షించును. ఆయనకు ఆదిత్యుడు, కపిలుడు, అగ్ని, అగ్రజుడు అను నామములు గలవు. బ్రహ్మ యొక్క గర్భమునందు హిరణ్యము (తేజస్సు) ఉండుట వలన, లేదా, ఆయన హిరణ్యము యొక్క గర్భము నుండి జన్మించుట వలన, హిరణ్యగర్భుడు అయ్యెను. గడచి పోయిన ప్రజాపతుల కాలమును వందల సంవత్సరములలో నైననూ లెక్కించుట సంభవము కాదు. గడచిపోయిన కల్పముల సంఖ్యను బట్టి బ్రహ్మగారి ఆయుర్దాయము (పరము)లో సగభాగము గడచినది. మరియొక సగము ఆయుష్షు మిగిలినది. ఆ తరువాత ప్రళయము సంభవించును. పరములో అంతర్భాగములుగా ఉండు కల్పములు కోట్లాది సంవత్సరములు గడిచి పోయినవి. ఇంకను అనేక కల్పములు వచ్చుచునే ఉండును.

ఓ ద్విజులారా! ప్రస్తుతములో వారాహ కల్పము గడచుచున్నది అని తెలియుడు. ఇది కల్పములలో మొదటిది. దీనియందు గడచిన, గడచుచున్న, మరియు రాబోవు మనువులు పదునాల్గుమంది కలరు. వీరిలో స్వాయంభువ మనువు ఒకడు. ఆ చక్రవర్తులచే ఏడు ద్వీపములతో కూడిన, ఈ భూమి అంతా వేయియుగముల కాలము పూర్తిగా పాలింపబడును. వారి ప్రజాపాలనమును వారి తపస్సును విస్తరముగా వివరించెదను వినుడు. ఒక మన్వంతరమును గురించి తెలుసుకున్నచో, రాబోవు మన్వంత రములు అన్నియూ తెలిసినట్లే అగును. గడచిన కల్పములను, వంశములను వర్ణించెదను. వాటిని తెలుసుకొని, రాబోవు వాటి గురించి తదనురూపముగా ఊహించుకొనవలెను.