శ్రాద్ధకల్పము

సూతుడు ఇట్లు అనెను:

దేవతలును, పితరులును, అట్లే వారికంటె వేరైన పితరులును - అనునిది ఆధర్వణ విధి అని బృహస్పతి చెప్పెను. మొదట పితరులను పూజింపవలెను. విశేషించి దేవతలను పూజింపవలెను. ఈ లోకమున దేవతల కంటెను పూర్వము ప్రయత్నముతో పితరులను పూజింతురు.

దక్షునకు కూతురు కలదు. లోకమున ఆమె విశ్వ అను నామముతో ప్రసిద్ధి చెందినది. ఓ ధర్మజ్ఞుడా! అమె ధర్మముతో శాస్త్రీయముగా ధర్మునకు (యమునకు) ఈయబడినది. ఆమె పుత్రులు మహాత్ములైన విశ్వేదేవులని శ్రుతి. ముల్లోకములలో ప్రసిద్ధులును, సర్వ లోకములచే నమస్కరింపబడినవారును అయిన ఆ మహాత్ములందరును మహా ఉగ్ర తపమును చేసిరి. దేవ, గంధర్వులతో సేవింపబడినదియు, సమస్త అప్సరసలచే చరింపబడినదియునై రమ్యమైన హిమవత్పర్వత శిఖరమున ఆ విశ్వేదేవులు ఉగ్రమహాతపమాచరించిరి. దానికి శుద్ధమైన మనస్సుతో సంతసించిన పితరులు వారితో “వరమును అడుగుడు, మేము సంతసించితిమి, ఏ కోరికను నెరవేర్పవలెను అని అడిగిరి.” పితరులు ఈ విధముగా అడుగగనే, త్రైలోక్య భావనుడైన, ప్రజలకు అధిపతియైన బ్రహ్మ ఆ విశ్వే దేవతలకిట్లు చెప్పెను.

మహాతేజస్వియైన మహాదేవుడు విశ్వేదేవుల తపముచే తపింపబడెను. ఆ తపముతో సుప్రీతుడై మీకు ఏకోరికను నెరవేర్చవలెను? అని అనెను. లోకకర్తయగు బ్రహ్మ ఇట్లు అడుగగానే విశ్వేదేవులందరును గలిసి లోకభావియైన బ్రహ్మతో ఇట్లనిరి. “శ్రాద్ధమున మాకు భాగము రావలెను. ఇది మేము కోరిన వరము” అనిరి. తరువాత బ్రహ్మ ఆ స్వర్గ పూజితులైన విశ్వేదేవులతో - “మీరు కోరిన వరమట్లే సిద్ధించును అనెను. పితరులు అట్లేయని - ఇది అట్లే అగును సంశయములేదు అనిరి. ఈ లోకమున పితరులకు దేనిని చేసినను విశ్వేదేవులతో గలిపియే చేయబడవలెను. పితరులకు ఏర్పరచిన శ్రాద్ధమున మిమ్ములను (విశ్వేదేవులను) అగ్రాసనము వరించును అని బ్రహ్మ అనెను. మనుష్యులలో ఇది సత్యముగా జరుగునని నేను చెప్పుచున్నాను. మాల్యములచేతను, గంధములచేతను, అన్నముచేతను, మిమ్ములనే (విశ్వేదేవులనే) మొదట శ్రాద్ధకర్త పూజించును. మొదట మీకు దాత. తరువాత మాకు దానము చేయబడును. ఇక విసర్జనము మొదట మాకు పితరులకు తరువాత దేవతలకు, శ్రాద్ధముయొక్క రక్షణము - ఆతిథ్యము అనునవి శ్రాద్ధమున రెండు విధులు. భూతములయు, దేవతలయు, పితరులయు శ్రాద్ధకర్మయందు ఈ విధముగ శాస్త్రీయముగా చేయబడినది అంతయు చక్కగా జరుగగలదు” అని ఈ విధముగ విశ్వేదేవులకు వరమిచ్చి, భూతానుగ్రహకారియైన ఆ బ్రహ్మదేవుడు పితృగణములతో యథా సుఖముగ తిరిగెను.

వేదమున నరులకు పంచమహాయజ్ఞములు నిత్యకరణీయములుగా చెప్పబడినవి. అవి 1. భూతయజ్ఞము; 2. మనుష్యయజ్ఞము; 3. పితృయజ్ఞము, 4. దేవయజ్ఞము; 5. బ్రహ్మ యజ్ఞము. నరుడు ఎల్లప్పుడు ఈ యజ్ఞములను నిర్వహించవలెను. శ్రద్ధ యజ్ఞ దాతలు భయములేనిది, అహంకారములేనిది, శోకములేనిది, వ్యధలేనిది, శ్రమతో వాడి పోవుట లేనిది, సర్వకామములతో కూడుకొనినదియు అయిన బ్రహ్మస్థానమును శ్రాద్ధదాత పొందును. శూద్రుడు గూడ ఈ పంచమహాయజ్ఞములను మంత్రములు లేక చేయవలెను. కావున పంచమహాయజ్ఞములు చేయక భుజించువాడు కేవలము ఋణమును భుజించువాడు అగును. ఆత్మ కారణమున ఏ పాపాత్ముడు పాకము చేయునోవాడు ఋణమును మాత్రమే తినును. కావున పండితుడు ఎల్లప్పుడు ఈ పంచమహా యజ్ఞములు నిర్వర్తింప వలెను. జీవించినవాని విషయమున కూడ కొందరు నైవేద్యమును కోరుదురు. ఈశాన్య దిక్కుగా బలిని, జలకుంభమును ఈయవలెను. బలిని అందరికి తెలియునట్లుగా చేయవలెను. ఎత్తుకన్న ఎత్తుగా ఉంచవలెను. పరశృంగ గోవుల బలిని మొదట సూక్ష్మముగా ఎత్తి పెట్టవలెను. పితరులలో జీవించినవాడికి పిండ నివేదనము చేయరాదు. ఇష్టమైన అన్నముతో భక్ష్యములతో యథావిధిగా భుజింపచేయవలెను. ఆ విధానము వేదవిహితమైనది. దానిని చెప్పెదను. పితరులు మహాత్ములైన దేవదేవులు. ఆచార్యులు కొందరు కొద్ది నివేదనము చేయవలెననియు, తరువాత పిండనివేదనము చేయవలెననియు అందురు. బ్రాహ్మణుల పూజను అంతయు నిత్యము చేయవలెను. బృహస్పతి “ధర్మార్థకుశలురను పూజింపవలెను” అని అన్నాడు. పూర్వము పిండమును నివేదింపవలెను. తరువాత బ్రాహ్మణులు భుజింపవలెను. యోగాత్ములు, మహాత్ములు అయిన పితరులు యోగ సంభవులు. ఈ పితరులు యోగమునందున్నవారై సోమమును ద్రావి తృప్తి చెందుదురు. కావున శ్రాద్ధతత్పరుడై, శుచియై, యోగులకే పిండములను ఈయవలెను. ఇది పితరులకు సాక్షాత్తుగా హోమము చేసిన హవిస్సు వంటిది అగును. వేల బ్రాహ్మణులలో యోగిముందున్నచో, జలమున నౌకవోలె, యజమానిని, భోక్తలను తరింపచేయును. ఆ సజ్జనులను పరిగ్రహించిన చోటను, సజ్జనులను అవమానించిన చోటను వెంటనే దేవతలు విధించిన దండము దారుణముగా పైబడును. ధర్మముతో బాటు ఆగమమును వదిలి బాలిశుని శ్రాద్ధమున భుజింపజేసిన చోట దాత తన ఆదికర్మను వదిలి వినాశమందును. భోగార్థి అయినవాడు మధ్యపిండమును అగ్నిలో వేయవలెను. సంతానము కోరువాడు దానిని పక్షికి ఈయవలెను. ఉత్తమ కాంతిని కోరువాడు దానిని గోవులకు ఈయవలెను. ప్రజ్ఞను, పూజను, యశస్సును, కీర్తిని కోరువాడు గోవులకు ఈయవలెను. దీర్ఘాయుష్యము కోరువాడు కాకులకు ఈయవలెను. సౌకుమార్యమును కోరువాడు కోళ్లకు ఈయవలెను. ఇది పిండనిర్వపణమువల్ల కలుగుఫలము. సుస్థితి యందు దక్షిణాముఖుడై ఆ పిండము ఆకాశమునకు విసిరివేయవలెను. ఏలనన పితరులు స్థానము ఆకాశము. వారి దిక్కు దక్షిణము, బ్రాహ్మణులు మరల ఒక విషయము చెప్పుదురు. బ్రాహ్మణులచే అనుమతిని పొంది ముందు పిండోద్ధరణమును, తరువాత ధర్భాసనమును తీసివేయుటను చేయవలెను. అన్నము నుండి పుష్పములు, ఫలములు, భక్ష్యములు మొదలగు వాని యొక్క అగ్రమును తీసివేసి అగ్నిలో హోమము చేయవలెను. భక్ష్యము, అన్నము, త్రాగదగినవి, శ్రేష్ఠములైన ఫలములును - వీనిని అగ్నిలో హోమము చేసి తరువాత దక్షిణాముఖుడై పిండములను నిర్వాపము చేయవలెను. అట్లే నేతితో తడిపిన సుగంధములైన భక్ష్యములతోను, రసములతోను తర్పణము (తృప్తిని కలుగ) చేయవలెను. ఏకాగ్రచిత్తుడై, నియమబద్ధుడై, చేతులు జోడించి నిలిచి ఉపాసింపవలెను. తత్పరుడై శ్రద్ధగలవాడై మానవుడు పై ప్రక్రియ చేయవలెను. దానివల్ల కోరికలను పొందును. పితరులు నైచ్యము లేమిని, కృతజ్ఞతను, సత్కృతమైన దాక్షిణ్యమును, తరువాత యజ్ఞమును, దానమును ఇత్తురు. తరువాత బ్రాహ్మణులు భుజించిన తరువాత సౌమ్యమైన విధిని అనుపూర్వముగ చెప్పెదను వినుడు. పితృపరాయణుడై ముందు భూమిని ప్రోక్షించి, తరువాత కొంతపైకి తీసి అచట శాస్త్ర దృష్ట క్రియతో వికిరమును చేయవలెను. ఓ బ్రాహ్మణులారా! తరువాత స్వధను ఉచ్చరించి అన్న శేషమును తినుటకు అనుమతిని పొంది, భూరిదక్షిణలను పొందిన బ్రాహ్మణ శ్రేష్ఠులను సత్కరించి, నియతుడై చేతులు జోడించి ఆసీమాంతము వెంబడించి పంపివేయవలెను. (14)