భువన విన్యాసము - 6

సూతుడు అనెను:

ఏకాంతమైన సుందర శిఖరము కలదియు, కొండలతో నిండినదియు, శంఖము వలె తెల్లనిదియు పుణ్యాత్ములయిన దేవతలకును, భక్తులకును నివాసము అయినదియునగు కైలాసముగలదు. మల్లెపూవువలె రమ్యమైన ఆ కైలాస శిఖరముపైన నూరు యోజనముల పొడవై, యేబది యోజనముల వెడల్పు కలిగి అనేకములైన బంగారు మణులచేత చిత్రములచేత అలంకరింపబడిన గొప్ప భవనపంక్తులతో భూషితమై విస్తారమైన నగరము గలదు. అది ధనాధ్యక్షుడై మహాత్ముడైన దేవుడగు కుబేరుని నగరము. అది శత్రువులు ఆక్రమింప అలవికానిది, మంచి సంపదలతో కూడినది, ఆనందముతో అలరారినది. ఆ నగరమధ్యమున ఒకసభ కలదు. అది రమ్యము, బంగారముచే అలంకరింపబడినది, విశాలములైన స్తంభములతోను తోరణములతోను విపులా అను పేర ప్రసిద్ధి చెందినది. అచట పుష్పకమను విమానముగలదు. అది అనేక రత్నములతో అలంకరింపబడినది. అందమైన గొప్ప విమానము అన్ని కామ, గుణములతో కూడినది, మనస్సుతో సమానమైన వేగముకలది. బంగారు కిటికీలతో అలంకరింపబడి ఉండును. ఇది యక్షరాజై మహాత్ముడైన కుబేరుని వాహనము. అచట కేవలము గోరోజనము వంటి వర్ణముగల్గి దేవుడై స్వయముగా మహాదేవుని (శివుని) సఖుడైన కుబేరుడు నివసించు చుండును. ఆ యక్షరాజు సర్వభూతములచే నమస్కరింపబడినవాడు. అచట ఈ దేవతలలో మిక్కిలి మంచివాడై మహాత్ముడైన కుబేరుడు అప్సరోగణములతోను, యక్షులతోను, గంధర్వులతోను, చారణులతోను నివసించుచుండును.

అచట పద్మము, మహాపద్మము, మకరము, కచ్ఛపము, కుముదము. శంఖము, నీలము, నందనము అను ఎనిమిది నిధిశ్రేష్ఠములు గలవు. ఇవి ధనాధిపతి అయిన మహాత్ముడు కుబేరుని అక్షయములైన ఎనిమిది నిధులు. రత్నములచే సంపాదింపబడిన మహానిధానములై ఆ సభలో ఉండును. ప్రభువైన యక్షరాజైన కుబేరుడున్న కైలాసముననే ఇంద్ర, అగ్ని, యమ, దేవతలు అప్సరోగణములతో ఉందురు. అచట నియమింపబడిన పరిచారకులు మొదట యక్షరాజైన కుబేరుని కొలువుచేసి తరువాత వారి వారి పనులకై వెళ్ళుదురు.

అచట మందాకిని అను నడబావి (చిన్న పద్మ సరస్సు) కలదు. అది సుందరమైన విశాల జలములుగలది. బంగారముతోను మణులతోను నిర్మించినమెట్లు గలది. అనేక పుష్పముల గుంపులతో గొప్పనైనది. సుగంధము మెత్తని స్పర్శయుగల బంగారు పద్మములతోను, నీలము వైడూర్యమణుల ఆకులతోను, సుగంధముగల పెద్ద కలువలతోను, చిన్న కలువలతోను విశాలమైన పెద్ద పద్మములతోను అలంకరింపబడినది. యక్ష గంధర్వ స్త్రీల చేతను అప్సరసలచేతను ప్రకాశించునది. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు స్నానము చేయు జలములు కలిగిన సుందరమైన నడబావి ఆ మందాకిని.

అట్లే అలకనంద నదీ శ్రేష్ఠమైన ‘నంద’పై మందాకిని గుణములతోనే కూడు కొనిన నదులు, దేవతల చేతను ఋషులచేతను స్నానాది క్రియలచే సేవింపబడినవి. ఆ కైలాస పర్వతశ్రేష్ఠము యొక్క తూర్పు శిఖరమున ప్రసిద్ధములై వేయి యోజనముల పొడవై ముప్పది యోజనముల వెడల్పైన పది గంధర్వ నగరములు గలవు. అవి మిక్కిలి సమృద్ధితో నిండినవి. అనేకములైన గొప్ప భవన పంక్తులచే అలంకరింపబడినవి. సుబాహువు, హరికేశుడు మొదలైనవారు, చిత్రసేనుడు, జరుడు మొదలైన వారును, జ్వలించిన అగ్నితో సమానమైన పరాక్రమముగల పదిమంది గంధర్వ రాజులు ఆ నగరమునకు పాలకులుగా కలరు.

మల్లెపూవు వలెను, చంద్రుని వలెను తెల్లనైన ఆ కైలాస పర్వతపు పడమటి శిఖరము అనేక ధాతువులచేత, చిత్రించిన నూర్లకొలది చిత్రములు గలది. సిద్ధులు-దేవతలు ఋషులు వీరిచే సేవింపబడినది. అట్టి పడమటి శిఖరమున ఒక్కొక్క యక్ష భవనము ఎనుబది యోజనములు పొడవు, నలుబది యోజనముల వెడల్పుగలదై మహా భవన పంక్తులు కలిగి ఉండును. ఇచట అఢ్యములై (మహాధనికములై)న ముప్పది మహా యక్షాలయములు ఉన్నవి. వానిని గురించే చెప్పుచున్నాను వినుడు. అవి అంతటను సంతోషముతోను మహా సంపదతోను కూడియున్నవి. మహామాల, సునేత్రుడు మొదలగు వారును అట్లే మణివరుడు మొదలగు మిక్కిలి పెంపొందిన యక్షరాజులు ముప్పదుగురు అచట ఎల్లప్పుడును ప్రకాశించుచుందురు.

అని ఈ విధముగా వాయ్వగ్నులతో సమానమైన తేజస్సులుగల యక్షుల గురించి చెప్పబడెను. శ్రీమంతుడైన ప్రభువైన కుబేరుడు వారి అధిపతి. ఆ కైలాసము యొక్క కుడిప్రక్క హిమవత్పర్వత శ్రేష్ఠముకలదు. దాని తటమున పొదరిండ్లు సెలయేరుల గుహలు, అనేకములైన చరియలును గలవు. అది తూరుపు సముద్రము నుండి పశ్చిమ సముద్రము వరకును (మానదండకమువలె పొడవై) వ్యాపించియున్న పర్వతము. అనేక శిఖర సమూహములు గల ఆ హిమవత్పర్వత శ్రేష్ఠము యొక్క కక్ష్యలలో (మధ్య భాగములలో) అచ్చటచ్చట, నరనారీ సంతోష భరితమును, హృష్టులు పుష్టులు పటిష్టులు అయిన జనులచే కలకలలాడు కిన్నరుల నూరు పురములుగలవు. ద్రుమ, సుగ్రీవసైన్యము మొదలగు వారును, భగదత్తుడు మొదలగువారును అచ్చట ఉండిరి. తేజస్వులై బలశాలురైన పై వారి రాజులు నూరుగురు అచట ఉండిరి. దేవియైన ఉమతో రుద్రుని వివాహయు ఇచటనే జరిగినది. వరాంగనయైన ఆ ఉమాదేవి ఇచటనే ఈశ్వరునికై తపము చేసినది. కిరాత రూపమున రుద్రుడు ఇచటనే ఓడించెను. కిరాత రూపులైన నయుమారుద్రులచే ఇచటనే జంబూద్వీపావలోకనము జేయబడినది. మిక్కిలి సంతోషించిన నానా భూత గణములతో రుద్రుడు క్రీడించిన భూములు ఇవియే. చిత్ర పుష్ప ఫలములతో కూడి ఉన్నవి. గిరిగుహలలో ఉన్న సన్నని నడుములు కలిగి, చక్కని కన్నులు కలిగి, మనోహర సుందరులైన కిన్నర స్త్రీలు ఇచటనే సంతోషముతో క్రీడించిరి. విశాలాక్షులైన యక్షులు, తక్కిన అప్సరోగణములు చక్కని అంగసౌష్టవముగల గంధర్వులును ఇచటనే ముదముతో మెదలిరి. శంకరుడు అర్థనారీనరమైన రూపము ధరించినట్టి సర్వలోక ప్రసిద్ధమైన ఉమా వనమ అను వనము ఇచ్చటనే కలదు. షణ్ముఖుడైన కుమారస్వామి జనించిన శరవణము ఇచ్చటనే ఉన్నది, కుమార స్వామి క్రౌంచ శైలవన ధనుః క్రీడలో ఉత్సాహము చూపినది, క్రౌంచ పర్వతమునకు తన బాణముతో రంధ్రము జేసినది ఇచటనే. మహా ధీశాలియైన కృత్తికాపుత్రుడైన కుమారస్వామికి ధ్వజము పతాకము చిరుగంటలు మాలలును గల సింహరథమును పూన్చుట ఇచటనే జరిగినది. చిత్రముగా పుష్పించిన పొదరిండ్లుగల క్రౌంచపర్వతము యొక్క తటమున, దేవశత్రువులైన రాక్షసులను ధ్వంసము చేయునట్టి స్కందుడు (కుమారస్వామి) ఇచటనే తన శక్తి బాణమును ప్రయోగించెను. పండ్రెండుగురు సూర్యులతో సమానమైన ప్రతాపము గలిగి రాక్షస శత్రువైన విష్ణువు, ఇంద్ర, ఉపేంద్రులు మొదలైన దేవశ్రేష్ఠులు, గుహుడు (కుమారస్వామి)ని ఇచటనే దేవసేనాధిపతిగా అభిషేకించిరి. ఓ బ్రాహ్మణులారా! భూతసంఘములతో వ్యాపించిన ఈ స్థానములును మరికొన్ని స్థానములును, కుమారస్వామి యొక్క నివాస స్థానములైనవి. అట్లే అనేక భూతగణములు వ్యాపించి హిమవత్పర్వతము యొక్క ఉపరితలమున క్రౌంచ పర్వతమునకు తన బాణముచే రంధ్రము చేసిన కుమారస్వామి యొక్క క్రీడాస్థానమైన పాండుశీల అనునది ఇచటనే కలదు.

ఆ హిమవత్పర్వతపు రమ్యమైన తూర్పు తటమున కలాపగ్రామము అను పేర విద్వాంసులచే పిలువబడిన యొక సిద్ధావాసముగలదు. ఈ హిమవంతమును మృకండుడు, వసిష్ఠుడు, భరతుడు, నలుడు, బ్రహ్మర్షియైన విశ్వామిత్రుడు, ఉద్దాలకుడును, తక్కిన ఉగ్ర తపస్వులు ఆత్మభావనగల ఋషులును మొదలగువారు తమ తమ ఆశ్రమములను ఏర్పరచుకొనిరి. ఆ ఆశ్రమములు లక్షకలవు. అది అనేక సిద్ధ గణముల నివాసము. అనేకములైన మానవుల ఉనికిపట్టులచేతను, యజ్ఞశాలలచేతను, శోభాయమానమైనది. యక్షులు, గంధర్వులు చరించినది. అనేక మ్లేచ్ఛగణములచే కూడియున్నది. అనేక రత్న నిధులచే నిండినది. అనేక ప్రాణులచే సేవింపడినది. అనేక నదీ సహస్రములకు ఈ హిమవత్పర్వతము శ్రేష్ఠము పుట్టు స్థానము. ఓ ద్విజులారా! పడమటి పర్వతమై యదార్థముగా సంపూర్ణముగా కీర్తింపబడు విశేషమును నిషధ పర్వతము యొక్క కీర్తిని వినుడు. దానికి విశాలమైన మధ్య శిఖరము కలదు. అది బంగారు ధాతువులచే విభూషితము. దానియందు సిద్ధ, ఋషి, గణసేవితమై ఉజ్జ్వలముగా బ్రకాశించిన విష్ణువుయొక్క మందిరము గలదు. అది యక్షులచేతను అప్సరసల చేతను సేవింపబడుచు ఉన్నది. గంధర్వ గణములచే సేవింపబడినది. అచట సాక్షాత్తుగా మహదేవుడు (శివుడు)ను, లోకకర్తయై సనాతనుడై పీతాంబరమును ధరించి వరదుడైన హరియును సిద్ధులచే నిత్యము సేవింపబడుచుందురు.

ఆ నిషధపర్వత శిఖరమునకు అభ్యంతరశిఖరముగలదు. అది అనేక ధాతువులచే అలంకరింపబడినది. దట్టమై సుందరమైన శిలాతలముగల ఆ శిఖరమున ఉల్లంఘులను రాక్షసుల రాక్షసమను పురము కలదు. అది లోహములతోను, బంగారముతోను చేయబడిన నాగ వాసములు గలది. కాచిన బంగారు తోరణములు గలది. అనేకములైన చంద్రశాలల గుంపులతోను నూరు పెద్ద వీధులతోను గజిబిజిగా ఉండును. ధనిక భవనములచేతను, మందిరములచేతను సాటిలేనిది. కాచిన బంగారముచే నలంకరింపబడినది. ధనిక భవనములచేతను దేవళములచేతను బంధింపబడినట్లున్నది. నిత్య సంతుష్టమైనది. మిక్కిలి విస్తారమైనది. ఉద్యాన పంక్తులతో ఒప్పినది. ముప్పది యోజనముల పొడవైనది. విషసర్పముల వంటి శత్రువులకు ప్రవేశింప అలవి కానిది. నిండైనది.

దానియొక్క కుడిపక్కనే అనేక రాక్షస గణముకు నిలయము. అచట పర్వత గర్భమున ఇతరులు పోవుటకు అలవిగాని గుహలద్వారా ప్రవేశింపదగిన నగరము గలదు.

అట్లే పశ్చిమ శిఖరము పారిజాత వృక్షములు గల శిలలతో ఎత్తైనది. దానియందు దేవతలయొక్క దానవుల యొక్కయు సుసంపన్నములైన పురములు గలవు. అచట ఆ పర్వతపు మహాతటమున ప్రతిపర్వము నందును (పూర్ణిమ) సోముడు (చంద్రుడు) అవతరించు సోమశిల కలదు. ఇచట ఋషి, కిన్నర, గంధర్వులు చీకటిని బారద్రోలు సాక్షాత్తు దేవుడై అనిందితుడై శ్రీమంతుడైన తారాపతిని (చంద్రుని) ఉపాసింతురు.

దాని ఉత్తరకూటముననే బ్రహ్మపార్శ్వము అను ప్రసిద్ధ స్థానముగలదు. అది సురేశ్వరుడైన బ్రహ్మయొక్క స్థానమని స్వర్గమున ప్రసిద్ధము. అచట సిద్ధులు యక్ష గంధర్వ దానవులును ఆ స్వయంభువై మహాత్ముడైన బ్రహ్మను యజ్ఞ, పూజలతో ఉపాసింతురు. అట్లే అచట సర్వలోక ప్రసిద్ధమైన అగ్నిదేవునియొక్క స్థానము గలదు. అచట సిద్ధచారణులచే మూర్తి మంతుడైన అగ్ని సేవింపబడును.

అట్లే రమ్యమైన ఉత్తరమున త్రిశృంగమను పర్వతశ్రేష్ఠము గలదు. అది ఋషులు చేతను సిద్ధులచేతను సేవింపబడినది. అనేక భూతగణములకు ఆలయము. అచట ఉన్న పురము బంగారు చిత్రములు గలదై, ముల్లోకములలో ప్రసిద్ధిచెందినది. అచట దేవ ముఖ్యులైన (బ్రహ్మ, విష్ణు మహేశులకు) మువ్వురికి మూడే స్థానములు గలవు. ఓ బ్రాహ్మణోత్తములారా! తూర్పు శిఖరమున నారాయణుని మందిరము గలదు. మధ్యమ శిఖరమున బ్రహ్మయొక్క మందిరము గలదు. పడమటి శిఖరమున శంకరుని మందిరము కలదు. దైత్యులు, దానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు వీరిచే ఆ మహాబలులైన దేవదేవులు యజ్ఞములుచేయుచు పూజింపబడుదురు. అట్లే త్రిశృంగ పర్వతమున అచటచట యక్షగంధర్వ నాగులు రమ్యములైన పురములు గలవు.

అట్లే ఉత్తర ప్రదేశమున జారుధిఅను దేవపర్వతము కలదు. అది అనేక శిఖరములతో ఒప్పినది. సిద్ధులు సాధువులును నివసించునది. యక్షుల యొక్కయు, కిన్నరులయొక్కయు, గంధర్వులయొక్కయు, వేలకొలది నాగుల యొక్కయు, రాక్షసుల యొక్కయు, దైత్యులయొక్కయు గొప్పబలముగలది. దాని మధ్య శిఖరము సిద్ధ సంఘములకు ఆవాసము, రమ్యమైనది, దేవతలును, ఋషులును సంచరించునది. రత్నములచేతను, ధాతువులచేతను అలంకరింపబడినది. వికసించిన కమలముల యొక్కయు వనములచే ప్రకాశించినది. అట్టి శిఖరమునందు పక్షులు గూళ్ళచే వాని నాదములచే మ్రోగినదియు, అనేక ప్రాణులు నివసించినదియు, హంసలచే, కారండవ పక్షులచే వ్యాపించినదియు, మదించిన తుమ్మెదలు గలదియు, అనేక ప్రాణిగణములు వ్యాపించినదియు, పక్షులచే శోభించినదియు, సుందరములైన నదులచేతను వాని యొడ్డున వెలసిన పుణ్యక్షేత్రముల చేత క్రిక్కిరిసినదియు, ముప్పది యోజనముల మండలాకారము గలదియు, సిద్ధులు ఆచమనము చేసిన పవిత్ర జలములు గలదియు, జలదోషములు లేనిదియు, మహా పుణ్యజలములుగల ‘ఆనంద జల’మను సరస్సు గలదు. అచట చండుడను నాగపతి కలడు. అతడు శత్రువులకు సమీపింప అలవికానివాడు. వేయి తలలు గలవాడు. మహాభాగ్యవంతుడు. విష్ణుచక్రపు గుర్తులు గలవాడు.

ఈ విధముగా విచిత్రములైన ఎనిమిది దేవపర్వతములు అచ్చట కలవు. ఇవి పురములు. పుణ్యములైన మందిరములు, పుణ్య జలములుగల సరోవరములు అనేకములైన బంగారుపర్వతములు అట్లే వెండి పర్వతములు, అనేక రత్నకాంతులుగల మణిపర్వతములు, హరిత పర్వతములు, ఇంగిలీకపురంగు, బంగారురంగును గల, శుద్ధములైన మణిశిలా సమూహములతో కూడి మిక్కిలి ప్రకాశించు ఎఱ్ఱని కాంతిగల అనేక ధాతువులచే చిత్రములైన అనేకమణి పర్వతములు వీనిచే ఒప్పినవి. దానికి తూర్పుభూమి యంతయు అనేక విస్తారములుగల గిరులచే ఒప్పినది. అనేకములైన నదులు, గుహలు, శైలములు మొదలగువాని చేతను చిత్రములైన చరియల చేతను ఒప్పినది. ఈ విధముగా పర్వతములతో గూడి, దైత్యులు, రాక్షసులు, సాధువులు, కిన్నరులు, ఉరగులు, గంధర్వులు, సిద్ధచారణులు, గంధర్వాప్సరసలు వీరందరిచే కూడియు, అనేక విస్తారములు కలిగి పుణ్యాత్ములచే వ్యాపింపబడి వెంట్రుకలు (లేక సింహపు జూలు) ఆకారములలో ఉన్న పర్వతములు గలవు.

ఆ మేరువుయొక్క గిరి సమూహమంతయు సిద్ధలోకమున స్మరింపబడినది. అది చిత్రము. అనేకములైన ఆశ్రమములతో కూడినది. పుణ్యాత్ములు ఎక్కువగా సంచరించునది. అది స్వర్గమని చెప్పబడినది. అట్టి ఈ భూమి నాలుగు మహాద్వీపములు కలది. అనేక వర్ణములు (రంగులు), ప్రమాణము (ఎత్తులు - పొడవులు) వెడల్పులు అనేక జాతుల బలములు, అనేకములైన భక్ష్యములు (నమిలితినునవి), అన్నములు, పానములు అనేక విధములైన కప్పుకొను వస్త్రములు, సొమ్ములు, అచటనున్న అనేక విధములైన ప్రజలతో కూడియున్న నాలుగు మహాద్వీపములు ప్రసిద్ధములు. ఇవి అనేక వర్ణాదులు (జాత్యాదులు) గలవి. భద్రములు భరతములు, కేతు మాలములును పశ్చిమములు (పడమటివి). నిర్మింపబడిన పుణ్యాత్ముల గృహములుగల కురువులు ఉత్తరపువి. ఓ బ్రాహ్మణులారా! అట్టి ఈ నాలుగు మహాద్వీపములు గలదియు అనేక ద్వీపములతో కలకలలాడుచున్నదియు నైన సమస్త భూమి పద్మాకార అని చెప్పబడినది. ఆయా అంతర ద్వీపములతోను, శైలములతోను, వనములతోను, సెలయేరులతోను, అడవులతోను బహువిస్తరమైన సమస్త భూమి ‘పద్మ’ అని పిలువబడును. ఆ బ్రహ్మ నివాసమైన (పద్మయైన) లోకము దేవతలతోను, అసురులతోను, మానుషులతోను కూడినదై త్రిలోకమని ప్రసిద్ధి చెందినదై అచ్చటి ప్రాణులచే పిలువబడినది. చంద్ర, సూర్యులచే (క్రిందుగా) తపింపబడినదై అది జగత్తని గానము చేయబడినది. శబ్దస్పర్శ రూప రస గంధములు అను గుణములచే గూడిన ఆ లోకపద్మము శ్రుతులచే పద్మమని చెప్పబడినది. ఈక్రమము సర్వపురాణములందును చక్కగా నిశ్చయింపబడినది. (41)