వాయు మహా పురాణము
ద్వాదశ వార్షిక యాగము
అటు పిమ్మట శుక్రుడు:
“తపస్సే ధనముగాగల ఆ ఋషులు సూతునితో మరల ఇట్లు పలికిరి: ‘ఆశ్చర్యమును గొలిపే కర్మలను ఆచరించు అ మహర్షులు సత్రయాగమును ఎచట చేసిరి? ఎంత కాలము చేసిరి? ఆ యాగము జరిగినవిధమెట్టిది? వారికి వాయుదేవుడు పురాణమును చెప్పిన విధమెట్టిది? ఈ విషయములను విస్తరముగా చెప్పుము. మాకు కుతూహలము అధికముగా నున్నది. అని ఇట్లు పలకగా ప్రేరితుడై సూతుడు శుభకరములగు పలుకులతో ఇట్లు పలికెను.
బ్రహ్మవేత్తలగు ఈ ఋషులు శ్రేష్ఠమగు సత్రయాగమును ఆచరించిన స్థలమును, ఆ యాగము జరిగిన కాలమును, జరిగిన విధమును వినుడు. పూర్వము జగత్తును సృష్టించిన ఆ ఋషులు జగత్తును సృష్టించాలనే కోరిక గలవారై, వేయి సంవత్సరములు పవిత్రమగు సత్రయాగమును చేసిరి. దానియందు సూర్యుడు యజమాని, బ్రహ్మ స్వయముగా బ్రహ్మత్వమును చేపట్టెను. భూమి యజమాని పత్ని. మహాత్ములగు ఋషులు నిర్వహించిన ఆ సత్రమునందు బుద్ధిమంతుడు, మహాతేజశ్శాలియగు యముడు శమితగా ఉండెను. వారు ఆ సత్రయాగమును నైమిశారణ్యమునందు వేయి సంవత్సరములు అనుష్ఠించిరి. పరుగిడుచున్న ధర్మచక్రము యొక్క అంచు (నేమి) ఒక ప్రదేశములో శిథిలమయ్యెను. ఆ స్థానమునకు నైమిశము అను పేరు వచ్చెను. ఆ స్థలమును ఋషులు పవిత్రముగా భావింతురు.
నైమిశమునందు సిద్ధులచేత, చారణులచేత సేవింపబడు పవిత్రమగు గోమతీనది కలదు. రోహిణి అచటనే సౌమ్యుడు అను కుమారుని కనెను. మహాత్ముడగు వసిష్ఠునకు అచటనే జ్యేష్ఠ కుమారుడగు శక్తి జన్మించెను. నైమిశమునందు అరుంధతికి గొప్ప తేజశ్శాలురగు వందమంది కుమారులు జన్మించిరి. అచటనే శక్తి కల్మాష పాదమహారాజును శపించెను. అచటనే విశ్వామిత్ర వసిష్ఠులకు వైరము కలిగెను. ఆ నైమిశమునందే అదృశ్యంతికి పరాశరుడు జన్మించెను. పరాశరుడు జన్మించినప్పటికీ, వసిష్ఠునకు (పుత్ర వినాశ రూపమగు) పరాభవము తప్పలేదు. అట్టి నైమిశమునందు బ్రహ్మవాదులగు ఆ మహర్షులు సత్రయాగమును చేసిరి. నైమిశమునందు సత్రయాగమును అనుష్ఠించుటచే, ఆ మహర్షులకు నైమిశేయులు అను పేరు కలిగెను.
ఆ మహర్షులు సత్రయాగమును జరుపుచుండగా పన్నెండు సంవత్సరములు గడిచెను. అపుడు పరాక్రమ వంతుడగు అగు పూరూరవసుడు భూమిని పాలించుచుండెను. పూరూర వసునకు రత్నములయందు లోభము మెండు. అతడు సముద్రములోని పద్ధెనిమిది ద్వీపములను తన వశము చేసుకొనెను. అయిననూ, ఆతని రత్నకాంక్ష తీరలేదు. దేవహూతి చేత ప్రేరేపించబడిన ఊర్వశి పురూరవసుని కామించెను. ఆతడు దేవవేశ్య ఊర్వశితో కూడి ఆ సత్రయాగమునకు వచ్చెను.
ఆ మహారాజు సన్నిధిలో నైమిశీయుల సత్రయాగము కొనసాగుచుండెను. పూర్వము అగ్నివలన గంగ గర్భమునుదాల్చి, గర్భమునందలి తేజోమయమగు పిండమును పర్వతము నందు విడువగా, అది బంగారమాయెను. ఆ మహర్షుల యాగవేదిక ఆ బంగారముతో నిర్మింపబడెను. మహాతేజశ్శాలురగు, ఆ ఋషుల యాగము కొరకు నిర్మించెను. ధీమంతుడగు విశ్వకర్మ లోకక్షేమమును గోరి, స్వయముగా ఆ యజ్ఞవాటి కను ఇలా కుమారుడగు పురూరవసుడు అడవిలో వేటాడుతూ, ఆ స్థలమునకు వచ్చి, అచట బంగరు యజ్ఞవాటికను చూచి, గొప్ప ఆశ్చర్యమును పొందెను.
లోభము వలన నశించిన వివేకముగల ఆ పురూరవ మహారాజు, బంగరు యజ్ఞవేదిని తన అధీనము చేసుకొనుటకు యత్నించగా, నైమిశేయులగు ఋషులకు తీవ్రమగు కోపము కలిగెను. క్రుద్ధులగు ఆ మహర్షులు దైవముచే ప్రేరితులై, ఉదయ సమయములో అ రాజును దర్భలు అను వజ్రములతో కొట్టిరి. దర్భవజ్రములచే కొట్టబడిన ఆ రాజు దేహమును చాలించెను. అపుడు, ఆరాజునకు ఊర్వశియందు జన్మించిన కుమారుని చక్రవర్తిని చేసిరి. ఆ కుమారుడే నహుషుడు. ఆ మహాత్ముడగు రాజు ధర్మబుద్ధి గలవాడై, ఆ మహర్షుల యెడ యోగ్యమగు వర్తనము కలిగియుండెను. ఆతని పేరు ఆయుషుడు. శక్తిశాలియగు ఆ మహారాజును బ్రహ్మవేత్తలగు మునులు ఓదార్చిరి. అపుడా మహర్షులు ధర్మము యొక్క అభివృద్ధి కొరకు యథాశాస్త్రముగా యజ్ఞమును మరల కొనసాగించిరి. వారి ఆ సత్ర యాగము గొప్ప విస్మయమును కలిగించెను. జగత్తును సృష్టించగోరి పూర్వము జగత్ స్రష్టలగు మహర్షుల యాగమువలె అది భాసించెను. ఆ యాగమునందు వారి ప్రియ మిత్రులగు వైఖానస, వాలఖిల్య, మరీచిక మహర్షులు, సూర్యునితో, అగ్నితో సమమగు తేజస్సుగల ఇతర ఋషులు, పితృదేవతలు, దేవతలు, అప్సరసలు, సిద్ధులు, గంధర్వులు, నాగులు, చారణులు కూడా పాల్గొనిరి.
ఆ యాగశాల పవిత్రమగు సంభారములతో ఇంద్రసభవలె విరాజిల్లుచుండెను. మహర్షులు దేవతలను స్తోత్రములతో, గ్రహము (సోమమును నింపే చెక్కపాత్ర)లతో ఆరాధించిరి. పితృకర్మలతో పితృదేవతలను ఆరాధించిరి. గంధర్వులు మొదలగు వారిని శ్రద్ధతో యథావిధిగా ఆరాధించిరి. కర్మల మధ్యలో, గంధర్వులు సామగానము చేసిరి. అప్సరసల గణములు నృత్యము చేసినవి. మునులు చిత్రములగు పదములతో కూడిన మంగళాశీస్సులను పలికిరి. మంత్రములు మొదలగువాటి స్వరూపమును ఎరిగిన విద్వాంసులు పరస్పరము సంభాషించుకొనిరి. వితండవాదులు (స్వీయపక్షము లేకుండగనే వాదించువారు) ప్రతివాదులను ఓడించిరి.
సాంఖ్య, న్యాయాది శాస్త్రములలో పండితులైన మహర్షులు ఆ యాగములో ఉండిరి. అచట బ్రహ్మరాక్షసులు పాపములను ఆచరించుట గాని, దైత్యులు యజ్ఞమునకు హాని చేయుటగాని, అసురులు యజ్ఞసంభారములను అపహరించుట గాని లేదు. ఆ యజ్ఞములో ప్రాయశ్చిత్తముగాని, ఇతరులకు హాని కలిగించే కర్మగాని లేదు. ఈ విధముగా ఆ మహర్షులు తమ శక్తిని, విద్వత్తును, కర్మ సామర్థ్యమును కలబోసి, సత్రయాగమును పన్నెండు సంవత్సరములు యథా విధిగా అనుష్ఠించిరి. జ్ఞానులగు, భృగువు మొదలైన మహర్షులు అయుతము (10,000) దక్షణ గల జ్యోతిష్టోమ యాగములను వేర్వేరుగా ఒక దాని తరువాత మరియొకటి అనుష్ఠించిరి.
ఓ ద్విజులారా! మీరు నన్ను కోరిన విధముగనే, ఆ ఋషులందరు యజ్ఞమును పూర్తి చేసుకొని, మహాప్రభువు, అనంత స్వరూపుడు అగు వాయువును కోరిరి. వారిచే పురాణము కొరకు ప్రేరితుడై, వాయుదేవుడు వారికి ఈ పురాణమును చెప్పెను. వాయు దేవుడు పరమేశ్వరునకు శిష్యుడు, సర్వమును ప్రత్యక్షముగా చూచువాడు; వశి. ఆయన అణిమ మొదలగు ఎనిమిది ఐశ్వర్యములతో కూడినవాడు. పశుపక్ష్యాది సర్వ ప్రాణులను భరించువాడు ఆయనయే. ఆవహ, ప్రవహ, సంవహ, ఉద్వహ, నివహ, పరివహ, పరావహ అనే ఏడు స్కంధములయందు వాయుదేవుడు సదా వేగముగా సంచరించుచుండును. సప్త మరుద్గణములు ఆయన అధీనమునందు ఉండును. మహాబలశాలియగు వాయుదేవుడు పృథివి, జలము, అగ్ని అనే మూడు భూతముల రచనా రూపములగు ప్రాణుల శరీరమునకు ప్రాణముపోసి, ఆహారమును జీర్ణమును చేయుటలో అగ్నికి సహకరించుచూ, ప్రాణులను ధరించు చున్నాడు.
ఇంద్రియముల వ్యాపారములచే ప్రేరితములైన, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములనే అయిదు వాయువృత్తులు (క్రియలు) ప్రాణుల శరీర ధారణమునకు మూలముగ ఉన్నవి. ఆకాశ గుణమగు శబ్దము, స్పర్శతో కూడి గాలికి గుణములు అగును. అకాశము నుండి గాలి పుట్టెను. గాలి నుండి అగ్ని పుట్టెనని విద్వాంసులు చెప్పెదరు. అట్టి గాలికి అభిమాని వాయుదేవుడు. ఆయన క్రియా స్వరూపుడు. వ్యాకరణ శాస్త్ర కోవిదుడు. ఆయన సర్వకాలములయందు వీచుచునే ఉండును. పురాణములను ఎరిగిన అట్టి వాయుదేవుడు పవిత్రమగు మనస్సుగల మునులను అందరినీ సంతోషపెట్టు చున్నవాడై, మధురమగు వాణితో పురాణమును బోధించెను.