వాయు మహా పురాణము
పూర్వార్ధము ప్రక్రియా పాదము - అనుక్రమణిక
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్
నారాయణునకు, మానవులలో శ్రేష్ఠుడగు నరునకు, సరస్వతీ దేవికి, వ్యాసునకు నమస్కరించి, తరువాత జయము (పురాణము)ను చెప్పవలెను.
జయతి పరాశరసూనుః సత్యవతీ హృదయ నందనోవ్యాసః
యస్యాస్య కమల గలితం వాఙ్మయమమృతం జగత్ పిబతి
సరస్వతీదేవి యొక్క హృదయమునకు ఆనందమును కలిగించునట్టి, పరాశరమహర్షి యొక్క కుమారుడు అగు వ్యాసునికి జయము. ఆయన యొక్క ముఖపద్మము నుండి జాలువారిన వాఙ్మయము అనే అమృతమును మానవులు త్రాగుచున్నారు.
శాశ్వతుడు, నిత్యుడు, నాశము లేనివాడు, దేవతలలో కెల్లా గొప్పవాడు, మహాత్ముడు, జగత్తునకంతకు ప్రభువు అగు ఈశ్వరుని నేను శరణు వేడెదను, లోకములను సృజించిన బ్రహ్మదేవుని శరణు వేడెదను. సర్వజ్ఞుడు, పరాజయమును ఎరుగనివాడు, భూత భవిష్యద్వర్తమానములకు ప్రభువు, సద్రూపుడు అగు విష్ణువును శరణు వేడెదను.
జగన్నాథుడగు ఈశ్వరునియందు సాటిలేని జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అను నాల్గు సిద్ధులతో కూడిన ధర్మము కలవు. ఈశ్వరుడు క్షర (అసత్), అక్షర (సత్) పదార్థములకు నిత్య సాక్షిగా ఉన్నాడు. క్రియలకు, పదార్థములకు అధిష్ఠానమైన ఈశ్వరుని యందే ఈ లోకములన్నియు ప్రళయ కాలమునందు లీనమగును. ఈశ్వరుడు జగత్తును సృష్టించెను. ఈ జగత్తు యొక్క స్వరూపము ఆయనకే తెలియును. తత్త్వమును ఎరిగిన పరమాత్మ ధ్యాన యోగమునందు ఉన్నవాడై, ఈ చరాచర ప్రాణి వర్గమునంతనూ సృజించెను.
నేను పురాణ గాథలను తెలియగోరి, పుట్టుకలేనివాడు, సర్వకర్మాధ్యక్షుడు, చైతన్యఘనుడు, ముల్లోకములకు సాక్షి, జగన్నాథుడు అగు పరమేశ్వరుని శరణు వేడెదను.
బ్రహ్మకు, వాయుదేవునకు, మహేంద్రునకు, ఋషులలో శ్రేష్ఠుడు మహాత్ముడు అగు వశిష్ఠునికి, ఆయన మనమడు అయిన జాతూకర్ణ మహర్షికి, మరియు పరమ పావనుడగు కృష్ణద్వైపాయనునకు నమస్కరించి, ఏకాగ్రమగు మనస్సు గలవాడనై బ్రహ్మచే చెప్పబడిన పురాణమును చెప్పెదను. ఈ పురాణము వేదములకు అనురూపమైనది. ధర్మార్థ న్యాయములతో, యుక్తులతో కూడిన వివిధ శాస్త్రములు దీని యందు అలరారుచున్నవి.
పరాక్రమశాలి, సాటిలేని తేజస్సు గలవాడు, రాజులలో మేటి అగు అసీమకృష్ణ మహారాజు ధర్మబద్ధముగా ఈ భూమిని పాలించుచుండగా, అంతఃకరణము తమకు వశీకృతముగా కలవారు, సత్యమును పలుకుట అనువ్రతమునకు అంకితమైనవారు, కపటము నెరుగనివారు, రజో గుణములేనివారు, అంతరింద్రియ, బాహ్యేంద్రియ నిగ్రహము గలవారు అగు ఋషులు, ధర్మభూమి అయిన కురుక్షేత్రమునందు, స్వచ్ఛమగు ప్రవాహముగల దృషద్వతి అను పుణ్యనదీ తీరమునందు చిరకాలము కొనసాగే సత్ర యాగమును ఆచరించిరి.
నైమిశారణ్యమునందు నివసించే ఆ ఋషులు శాస్త్ర ప్రకారముగా యజ్ఞదీక్షను స్వీకరించిరి. మహాబుద్ధిశాలి, పౌరాణిక శ్రేష్ఠుడు అగు సూతుడు వారిని దర్శించుటకు అచ్చటకు విచ్చేసెను. సూతుడు తన సుభాషితములచే శ్రోతల రోమములు నిక్కబొడుచు కొనునట్లు చేసెడివాడు. ఇట్టి ప్రవచన ప్రభావము వలన ఆయనకు ఈ లోకములో లోమహర్షణుడు (రోమ హర్షణుడు) అనే ప్రసిద్ధి కలిగినది. ముల్లోకములలో కీర్తిపొందిన, బుద్ధిశాలి అగు సూతుడు తపస్సునకు, పాండిత్యమునకు, శీలమునకు నిధి, జ్ఞాని అగు వేదవ్యాసుని వద్ద శిష్యరికము చేసెను. ఆయన యందు పూర్ణమగు పురాణ రూపమైన వేదమేగాక, విశాలమైన మహాభారత రూపములో వర్ధిల్లిన సరస్వతి కూడా స్థిరముగా ఉండెను. ధర్మార్థ కామమోక్షములను వివరించే గాథలు, సూక్తములు, మరియు సుభాషితములు భూమియందు ఔషధులవలె ఆయనయందు విలసిల్లినవి.
సదాచారమును ఎరిగిన ఆ సూత మహర్షి ధీశాలురు అయిన ముని శ్రేష్ఠులను సమీపించి, దోసిలి బట్టి వారికి నమస్కరించెను. ధీమంతుడైన ఆ మహర్షి సాష్టాంగ నమస్కారము చేసి, ఆ ఋషులను సంతోషపరచెను. సత్రయాగము నందున్న మహా తేజశ్శాలురగు అ ఋషులు సభాసదులతో కూడి సంతోషించిరి. వారు ఆ మహర్షిని విధి విధానముగా సత్కరించి, ప్రీతికరమగు మాటలను పలికిరి. అపుడు వారికి పురాణమును వినాలనే కోరిక కలిగెను.
మిక్కిలి శ్రద్ధ కలవాడు, విద్వాంసుడు అగు ఆ లోమహర్షణుని సత్రయాగము నందలి యజమాని చూచెను. అయన కూడా శాస్త్రములన్నిటిలో దిట్ట. ఆయన ఋషుల ముఖ కవళికలను బట్టి వారి హృదయములోని భావమును తెలుసుకొని, సూతుని ఈ విధముగా ప్రోత్సహించెను. “ఓ సూతా నీవు మహా బుద్ధిశాలివి, బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు అగు వేద వ్యాస భగవానుని, ఇతిహాస పురాణములను తెలుసుకొనుట కొరకై చక్కగా సేవించితివి. నీవు వ్యాసుని బుద్ధి (అనే గోవు) నుండి పురాణ గాథలను పితికితివి. ఓ మహాబుద్ధి! ధీమంతులగు ఈ ఋషి శ్రేష్ఠులు పురాణమును వినగోరుచున్నారు. కావున, నీవు పురాణమును వినిపింపవలెను. వీరందరు మహాత్ములు, బ్రహ్మవేత్తలు, వివిధ గోత్రములకు చెందినవారు. అట్టి వీరు ఒకచో సమకూడిరి. వీరు తమతమ వంశములను గూర్చి పురాణ వచనముల ద్వారా వినెదరు గాక! దీర్ఘ సత్రయాగములో తమ పుత్రులతో కూడియున్న ఈ మునులకు నీవు పురాణమును వినిపింపుము. మేము యాగమునకు ముందు దీక్షను స్వీకరించబోవు సమయములో నిన్ను స్మరించి ఉంటిమి అని పలికెను.
పూర్వము సత్యవాక్య పాలనా పరాయణులు, పురాణములను ఎరిగిన వారు అగుమునులు పురాణము వినుట కొరకై సూతుని ఈ విధముగా ప్రోత్సహించిరి. ఇది సూతునకు స్వధర్మమని ప్రాచీనులగు ఋషులు భావించిరి. దేవతల యొక్క, ఋషుల యొక్క మరియు గొప్ప తేజశ్శాలురగు రాజుల యొక్క వంశములను సూతుడు గుర్తుంచుకొనవలెను. మరియు, ఇతిహాస పురాణములలో బ్రహ్మవేత్తలచే నిర్దేశింపబడి ప్రఖ్యాతిగాంచిన మహాత్ములను గురించి సూతుడు తెలుసుకొని యుండవలెను.
వేదములయందు సూతునకేమియూ అధికారము లేదు. ఎందుకు అనగా, వేనుని కుమారుడు, మహా పురుషుడు అగు పృథువు యజ్ఞమును చేయుచుండగా, సుత్య (యజ్ఞమునకు అంగమగు) కర్మ జరుగుచుండగా, మొదటిసారిగా వర్ణ వికృతి కలిగిన సూతుడు జన్మించెను. ఆ యజ్ఞములో బృహస్పతికి ఉద్దేశించిన హవిస్సు, ఇంద్రుని హవిస్సుతో కలిసిపోయెను. దానిని దేవేంద్రుని కొరకు హోమము చేసిరి. అపుడు సూతుడు జన్మించెను. ఆ యజ్ఞములో, ఇట్టి పొరపాటు వలన యజ్ఞాంగకర్మలలో ప్రాయశ్చిత్తము చేయవలసిన అవసరము ఏర్పడెను. గురువునకు ఉద్దేశించిన హవిస్సు శిష్యుని హవిస్సుతో కలిసి, తిరస్కారమునకు గురి అయ్యెను. ఇట్లు నికృష్టమును ఉత్కృష్టముతో కలిపి అనుష్ఠించుట వలన వర్ణ వికృతి కలిగిన సూతుడు జన్మించెను.
బ్రాహ్మణ స్త్రీయందు క్షత్రియుని వలన సూతుడు జన్మించెను. కాని, బ్రాహ్మణత్వ లక్షణములు ఉండుటచే, సూతుని ధర్మము బ్రాహ్మణ సదృశమని చెప్పబడెను. క్షత్రియులను ఆశ్రయించి, రథమును నడుపుట, ఏనుగులను, గుర్రములను సంరక్షించుట సూతునకు మధ్యమ ధర్మము, వైద్యవృత్తి అధమము. కావున బ్రహ్మవేత్తలగు మీరు నన్ను స్వధర్మమునకు చెందిన విషయమును అడిగితిరి. ఋషులచే పూజింపబడే పురాణమును నేను శ్రద్ధగా ప్రవచనమును చేయక ఉందునా?” అని ఇంకను
పితృ దేవతలకు వాసవి అను మానస పుత్రిక జన్మించెను. ఆమె పితృ దేవతలచే మానసికముగా శపింపబడి మత్స్యకన్యగా జన్మించెను. అరణి నుండి అగ్ని ఉద్భవించినట్లు, ఆమె యందు గొప్ప యోగి, వేదవేత్తలలో శ్రేష్ఠుడు అగు వ్యాసుడు జన్మించెను. మహా విద్వాంసుడగు ఆ వ్యాసభగవానునకు నమస్కారము. పురాణ పురుషుడు, జగన్నాథుడు అగు శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి వాక్యమును సత్యము చేయగోరి, వేదవ్యాస రూపముగా మనుష్య దేహమును స్వీకరించెను. పుట్టుటతోడనే సంపూర్ణ వేదము సాంగముగా ఆయనకు సాక్షాత్కరించెను. కాని, ఆయన విద్యాధర్మమును పాటించి, జాతూకర్ణుని వద్ద ఆయన వేదమును అధ్యయనము చేసెను.
బుద్ధిని కవ్వముగా చేసి వేదములు అను సముద్రమును, మథించగా, మహాభారతమనే చంద్రుడు ఉదయించి, లోకమును ప్రకాశింప చేసెను. సారవంతమగు నేల యందున్న చెట్టు కొంత కాలములో అనేక శాఖలుగా విస్తరించిన విధముగా వేదమనే వృక్షము ఆయనవలన శాఖలు కలది అయ్యెను. బ్రహ్మవేత్తయగు ఆ వేదవ్యాసుని నుండి నేను పురాణమును వినివుంటిని. ఆయన సర్వజ్ఞుడు. సర్వ వేదములయందు కీర్తింపబడినాడు. మహాతేజశ్శాలి. ఆయననుండి పొందిన పురాణమును నేను ప్రవచించెదను. ఈ పురాణమును పూర్వము నైమిశారణ్య వాసులు, మహాత్ములు అగు మునులు కోరగా, వారికి వాయుదేవుడు చెప్పి ఉండెను.
మహేశ్వరుడు సర్వోత్కృష్టుడు. ఆయన ఇంద్రియ గోచరుడు కాడు; నాల్గు చేతులు, నాల్గు ముఖములు గలవాడు; మనస్సునకు గోచరము కానివాడు; ప్రత్యక్షాది ప్రమాణములచే పొందశక్యము కానివాడు; స్వయం సిద్ధమగు జగత్కారణుడు; మరియు జగన్నియంత. ఆయనయే అవ్యక్త (మూల ప్రకృతి) రూపముగా జగత్కారణమై ఉన్నాడు. ఈ మూల ప్రకృతి నుండియే మహత్తు మొదలుకొని అణువుల విశేష ధర్మముల వరకు గల జగత్తు పుట్టినది అని శాస్త్ర నిర్ణయము. ఈ జగత్తు అధిష్ఠాన (ఈశ్వరుడు) రూపముగా సత్; జగద్రూపముగా అసత్ (మిథ్య). మూల ప్రకృతి నుండి సాటిలేని, తేజోమయమగు (హిరణ్య) అండము పుట్టినది. ఈ అండము జలము చేతను, జలము తేజస్సు చేతను ఆవరింపబడి ఉన్నవి. తేజస్సు వాయువు చేతను, వాయువు ఆకాశము చేతను అవరింపబడి ఉన్నవి. ఆకాశము సమష్టి అహంకారము చేతను, సమష్టి అహంకారము మహత్తు (సమష్టి బుద్ధి) చేతను, మహత్తు మూలప్రకృతి చేతను ఆవరింపబడి ఉన్నవి.
ఈ పురాణమునందు దేవతలందరియొక్క ఋషుల యొక్క నదులయొక్క పర్వతములయొక్క ఉత్పత్తి వర్ణింపబడును. అన్ని మన్వంతరములు, కల్పములు కూడా వర్ణింపబడును. బ్రాహ్మణ, క్షత్రియ వంశముల ఉత్పత్తి, బ్రహ్మయొక్క పుట్టుక కూడ కీర్తింపబడును. బ్రహ్మయందు సృష్టి కర్తృత్వము, ప్రజలయొక్క సృష్టి, ఇంకా మూల ప్రకృతి నుండి జన్మించిన బ్రహ్మయొక్క అవస్థలు కూడా దీనియందు కీర్తింపబడును. కల్పములలోని సంవత్సరములు, జగత్తుయొక్క స్థితి, విష్ణువు శయనించుట, భూమిని ఉద్ధరించుట దీని ద్వారా వివరింపబడును.
వర్ణాశ్రమ విభాగ పూర్వకముగ నగరాదులను తీర్చిదిద్దుట, ఇంటిలో ఉండు వృక్షములు అమరిక, సిద్ధపురుషులు నశించుట, బహుదూరము వరకు విస్తరించిన మార్గములు, వాటి నిడివి, వాటి యందలి సంచారము, స్వర్గమునందు స్థానముల విభాగము, భూలోకమందు ఉండు మానవుల స్థానములు వర్ణింపబడును. వృక్షములు, ఔషధులు మరియు లతలు వర్ణింపబడును. మానవులు పాపము వలన పొందే వృక్ష కీటాది జన్మలు వివరింపబడును. దేవతలకు, ఋషులకు సంబంధించిన రెండు మార్గములు, అన్నము, శరీరములు మొదలగు వాని సృష్టి మరియు శరీర త్యాగము ఇందు కీర్తింపబడినవి.
శాస్త్రములన్నింటిలో బ్రహ్మ ముందుగా పురాణమును స్మరించెను. తరువాత, ఆయన ముఖముల నుండి వేదములు బయల్వెడలినవి. వేదాంగములు, ధర్మశాస్త్రము, వ్రతములు, నియమములు, పశువుల ఉత్పత్తి మరియు మానవుల ఉత్పత్తి కూడా ఈ పురాణము నందు వివరింపబడినవి. ఇంకను కల్పము యొక్క మూలము, నిర్వచనము చెప్పబడినవి. బ్రహ్మ చేసిన తొమ్మండుగురు మానస పుత్రులు సృష్టి చెప్పబడినది. ఇంతే గాక, బ్రహ్మ ముగ్గురు మానస పుత్రులను సృజించి, తరువాత లోకములను సృజించెను. బ్రహ్మయొక్క అవయవముల నుండి ధర్ముడు మొదలగువాని పుట్టుక కూడా వర్ణింపబడెను.
ప్రతి కల్పమునందు మరల జన్మించే ఈ పన్నెండుగురు పురుషులు, కల్పముల మధ్యన ఉండే కాలము, మరియు వాటి సంధి కాలము వర్ణింపబడినవి. తమోగుణముచేత పూర్తిగా అవరింపబడిన బ్రహ్మ నుండి అధర్మము పుట్టుట, ఆ తరువాత శతరూప యొక్క జన్మ వర్ణింపబడినవి. తరువాత ప్రియవ్రత, ఉత్తానపాదుడు, ప్రసూతి, ఆకూతి కీర్తింప బడుదురు. వీరియందు పాపక్షాళనము చేయబడిన ప్రజలు ప్రతిష్ఠితులై ఉందురు. తరువాత, రుచిప్రజాపతికి ఆకూతి యందు ఇద్దరు సంతానము కలుగుట, దక్షునకు ప్రసూతి యందు అనేక కన్యలు జన్మించుట, ఆ తరువాత ధర్ముడు మహా పతివ్రతలైన శ్రద్ధ మొదలగు దక్షుని కుమార్తెలయందు గావించిన సుఖదాయకము, సత్త్వగుణ ప్రధానము అగు సృష్టి తెలుపపబడును.
ఇంకను అధర్మునకు హింసయందు కలిగిన తమోగుణ ప్రధానమైన, అమంగళ లక్షణములతో కూడిన ప్రజాసృష్టి వర్ణింపబడెను. ఇంతేగాక, మహేశ్వరునకు సతి యందు కలిగిన ప్రజాసృష్టి కీర్తింపబడినది. దోషరహితుడగు బ్రహ్మ కీర్తింపబడెను. యోగ శాస్త్రమునందు నిధియగు పరమేశ్వరుడు మోక్షమును కోరు ద్విజులకు యోగమును ఉపదేశించెను. రుద్రుని అవతారము, మరియు ఎనలేని సంపద, మూడు వేదములకు సంబంధించిన గాథ, బ్రహ్మ నారాయణులతో రుద్రునకు జరిగిన శ్రేష్ఠమగు సంవాదము వర్ణింపబడును. వారిద్దరు ఆ దేవదేవుని స్తుతించగా, ఆయన ఎంతయో సంతసించెను. ఈ స్తోత్రము కూడా ఆ పురాణములో వర్ణింపబడినది.
తరువాత బ్రహ్మయొక్క అంగము నందు పరమాత్మయగు రుద్రుని ఆవిర్భావము, ఆయన నామములోని వైశిష్ట్యము, మరియు గొప్ప మనస్సుగల రుద్రుడు రోదించుటకు గల కారణము కీర్తింపబడును. స్వయంభువుడు (అనగా సర్వకారణ కారణుడు, పుట్టుక లేనివాడు, స్వయముగా ప్రకాశించు జగత్పిత) అగు శివుడు ‘రుద్ర’ మొదలగు ఎనిమిది నామములను పొందిన తీరు, స్థావర జంగమాత్మకమగు ఈ ముల్లోకములు శివుని ఆ ఎనిమిది రూపములచే వ్యాప్తమైయున్న విధము వర్ణింపబడును. భృగువు మొదలగు ఋషుల ప్రజా సృష్టి, బ్రహ్మర్షియగు వశిష్టుని గోత్రము ఈ పురాణములో కీర్తింపబడును. అగ్నికి స్వాహాదేవియందు కలిగిన సంతానము వర్ణింపబడును. తరువాత, రెండు రకముల పితృ దేవతలకు స్వధాదేవియందు కలిగిన సంతానము కీర్తింపబడును.
ఈ పితృవంశ ప్రసంగము తరువాత, మహేశ్వరుడు సతీదేవి విషయములో దక్షునకు, భృగుడు మొదలగు ధీమంతులగు ఋషులకు శాపమును ఇచ్చిన ఘట్టము వర్ణింపబడును. విస్మయమును కలిగించు కర్మల నాచరించు దక్షుడు, రుద్రునకు తిరిగి శాపమును ఇచ్చుట, ఆ తరువాత వైరము తొలగుట అను వృత్తాంతము ఈ పురాణములో వివరముగా చెప్పబడినది. పై విధముగా సృష్టింపబడినవారు వేర్వేరు ద్వీపములలో వేర్వేరు దేశములలో నియోగింపబడిరి. తరువాత స్వాయంభువమనువుయొక్క సృష్టి గానము చేయబడును. మరియు, నాభి యొక్క సృష్టి, మహాత్ముడగురజసుని సృష్టి వర్ణింపబడును. ఇంతేగాక, ద్వీపములు, సముద్రములు, పర్వతములు వివరింపబడును.
కురు, ఇలావతాది దేశములు, నదులు, వాటి ఉపనదులు, సప్త ద్వీపములు, వాటిలోని వేలాది అవాంతర భేదములు, జంబూద్వీప, సముద్రముల మండల విస్తారము, యోజనములలో వాటి నిడివి, మరియు వాటియందలి పర్వతములు, హిమవంతుడు, హేమ కూటము, నిషధము మేరువు, నీలము, శ్వేతము, శృంగవాన్ అను వర్ష (దేశ) పర్వతములు కీర్తింపబడును. ఆ పర్వతముల చుట్టుకొలత, ఎత్తు, వైశాల్యము, విస్తారములు యోజన ప్రమాణములలో చెప్పబడును. ఇంకను ఆ పర్వతములలో నివసించు జనులను ఈ పురాణము వర్ణించును.
భారత మొదలగు దేశములు, వాటిలోని నదులు, పర్వతములు, చలనముగల ప్రాణులు, చలనములేని ప్రాణులు, ఏడు సముద్రములచే చుట్టుకొనబడియున్న జంబూ ద్వీపము మొదలగు ద్వీపములు, ఆ తరువాత జలమయమగు భూమి, లోకాలోక పర్వతము వర్ణింపబడును. ఈ లోకములు, మరియు ఏడు ద్వీపములతో కూడిన భూమి, ఆ హిరణ్యాండములోపల ఉన్నవి. భూరాది లోకములు, వాటిని చుట్టుకొని ఉన్న పదార్థములు కూడా వర్ణింపబడును. ఇది అంతా ప్రధానము (మూల ప్రకృతి) యొక్క పరిమాణములో ఒక అంశము మాత్రమే. ఇంకను లోకముల పరిమాణము వాని వ్యాసములతో సహా సంక్షేపముగా వివరింపబడును.
సూర్యుడు, చంద్రుడు, భూమి వీటి ప్రమాణము యోజనములలో అ వర్ణింపబడును. వీటి అభిమాన దేవతలు కూడ కీర్తింపబడుదురు. మానససరోవరము యొక్క ఊర్ధ్వభాగమునందు మహేంద్రుని పవిత్ర సభ మొదలగునవి, ఆపైన అలాత (అగ్ని) చక్రము స్వర్గమును పొందు మార్గము చెప్పబడినవి. నాగవీధి, అజవీధుల స్వరూపము చెప్పబడినది. ధ్రువములు, అభిమాని దేవతలు వర్ణింపబడిరి. లోకాలోకము (సూర్యకాంతి ప్రసరించని అంతిమ భాగమునందుండు పర్వతము) యొక్క పరిమాణము యోజనములలో తెలుపబడినది. ఈ భాగమునకు, జగత్తునకు మధ్యగల సంధి వర్ణింపబడినది. మరియు భూమధ్య రేఖవద్ద పగలు వర్ణింపబడును. నాల్గు దిక్కులలో ఊర్ధ్వ భాగమునందు ఉండే లోకపాలురు కీర్తింపబడుదురు.
రజోగుణ ప్రధానులగు గృహస్తులు పొందే దక్షిణ (పితృ) మార్గము, సత్త్వగుణ ప్రధానులగు సన్న్యాసులు పొందే ఉత్తర (దేవ) మార్గము, ధర్మాదులు నిత్య నివాసముచేసే శ్రీమహావిష్ణువు యొక్క ధామము వర్ణింపబడును. సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రముల గతి, ధ్రువునివలన ప్రజలకు కలుగు శుభాశుభములు కీర్తింపబడును. బ్రహ్మ ఒక విశిష్ట ప్రయోజనము కొరకై స్వయముగా సూర్యరథమును నిర్మించెను. భగవానుడు సూర్యరూపుడై స్వయముగా ద్యులోకమునందు సంచరించును. ఆ రథమును దేవతలు, ఆదిత్యులు, ఋషులు, మరియు గంధర్వులు, అప్సరసలు, సర్పములు, మరియు రాక్షసులు అధిష్ఠించిరి. ఇంతేగాక, జలముల యొక్క సారభూతుడైన చంద్రుని రథము కూడా వర్ణింపబడును. సూర్యుని వలన కలుగు చంద్రుని పెరుగుదల, తరుగుదలలు కీర్తింపబడును. సూర్యాదుల రథములు ధ్రువునినుండియే వచ్చునని చెప్పబడెను. శింశుమారుడు (సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుడు) దీని యందు వర్ణింపబడును, శింశుమారుని పుచ్ఛములో ధ్రువుడు ఉండును. నక్షత్రముల స్వరూపము, గ్రహముల స్వరూపము వర్ణింపబడును. ఈ పురాణములో దేవతల నివాసములు, పుణ్యాత్ములు నివసించు లోకములు వర్ణించబడును. వర్షమునకు, చలికి, వేడికి ఆధారమగు అనంత సూర్యరశ్మి వర్ణింపబడును. పేరు, కర్మ, స్వరూపము ఆధారముగా సూర్యరశ్ముల విభాగము వర్ణింపబడును. సూర్యుని చుట్టూ తిరుగు గ్రహముల పరిమాణములు, గతులు చెప్పబడును.
బ్రహ్మచే ప్రార్థింపబడిన శివుడు విషమును భక్షించగా, కంఠము నీలవర్ణమును పొండుట, శివుడు విషాదమును పొందుట తెలుపబడును. దేవతలు విష్ణువును ప్రార్థించుట, విష్ణువు మహేశ్వరుని స్తుతించుట, పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్రమైన లింగోద్భవ కథ వర్ణింపబడును. రూపములన్నీ ఈశ్వరుని రూపములే. ప్రధానము (మూల ప్రకృతి) యొక్క ఈ లింగాకార పరిణామము గొప్ప అద్భుతము. అదియు దాని తరువాత, ఇలుని కుమారుడగు పురూరవసుని మహిమ, రెండు రకముల పితృ దేవతలకు అమృత రూపమగు తర్పణము, తరువాత, పర్వదినములు (చంద్రుని వృద్ధి క్షయములు), వాటి సంధులు వర్ణింపబడును.
స్వర్గలోకమును పొందినవారు, అధోగతిని పొందినవారు అను రెండు రకముల పితరులకు శ్రాద్ధముచే కలిగే గొప్ప అనుగ్రహము, యుగముల సంఖ్య, వాటి పరిమాణము, కృతయుగ, త్రేతాయుగములలో క్రమముగా ధర్మనిష్ట మహిమ తగ్గి ప్రవర్తిల్లుట, అను విషయములు కీర్తింపబడును. వర్ణాశ్రమముల గణనము, వాటిని ధర్మబద్ధముగా పరి రక్షించుట, యజ్ఞమును చేయుట, దానిలో ఋషులకు, వసువునకు మధ్య సంవాదము, వసువు మరల అధోగతిని పొందుట మొదలగు విషయములు కీర్తింపబడును.
స్వాయంభువమనువు తప్ప ఇతరులు ప్రశ్నలకు సమాధానమును చెప్పలేక పోవుట, తపస్సుయొక్క మహిమ, యుగములలోని స్థితిగతులు సవిస్తరముగా చెప్పబడినవి. ఈ పురాణములో ద్వాపర, కలియుగములు సంక్షేపముగా వర్ణించబడినవి. ప్రతియుగము నందు దేవతలు, పశుపక్ష్యాదులు, మరియు మానవుల ప్రమాణము (ఒడ్డు, పొడవు)లు, యుగ ప్రభావముచే ప్రాణులు విశాల దేహములను కలిగి, గొప్ప ఆయుర్దాయమును కలిగి ఉండుట, మహాత్ముల ప్రాదుర్భావము మొదలగు విషయములు కీర్తింపబడును. వేదములు, వాటిలోని మంత్రములు, వేదశాఖలు, వాటి పరిమాణము, వేదవ్యాస శబ్దము యొక్క సార్థకత ఇత్యాదులు వర్ణింపబడును.
ప్రళయములో మన్వంతరముల ఉపసంహారము, ప్రళయాంతమునందు దేవతలు, ఋషులు, మనువు, పితృ దేవతలు తిరిగి జన్మించుట. మొదలగు సృష్టిని విస్తరముగా చెప్పుట అసంభవము కాబట్టి, సంక్షేపముగా చెప్పబడును. మనుష్య మానములో మన్వంతర కాలగణనము ఈయబడును. గడచుచున్న మన్వంతరమునకు చెప్పబడిన ఈ గణనము గడచిన, రాబోవు మన్వంతరములకు కూడా వర్తించును. మరియు స్వాయంభువ మన్వంతరమునకు గడచిన, రాబోవు మన్వంతరములతోగల ప్రతిసంధానము (మధ్యలో నుండు కాలము) కూడా తెలియజేయబడినది.
మూడు మన్వంతరములు, కాలజ్ఞానము, మన్వంతరములలోని దేవతలు, మహారాజులు వర్ణింపబడిరి. దక్షుని ప్రియ కుమార్తెకు జన్మించిన కుమారుల వర్ణనకలదు. వారు ఈవిధముగా బ్రహ్మ, దక్షుడు అను పరంపరకు చెందినవారైరి. మేరు పర్వతము నందుండు సావర్ణుడు మొదలగు మనువులు; ధ్రువుడు, ఉత్తానపాదుడు చేసిన ప్రజాసృష్టి వర్ణింపబడినవి. వేనుని కుమారుడగు పృథువు భూమిని గోవుగా చేసి పాలను పితుకుట, ఉపయోగించిన పాత్రలు, పితికిన పాలు వర్ణింపబడుటయేగాక, రాజవంశముల వర్ణన కూడా గలదు.
ఈ భూమిని బ్రహ్మాదులు పూర్వమే పితికియున్నారు. పదిమంది ప్రచేతసుల వలన మారిష యందు, సోముని అంశముతో ధీమంతుడగు దక్షప్రజాపతి జన్మించుట, భూర్భువస్సువర్లోకములపై మహేంద్రుల ఆధిపత్యము తెలుపబడును. మన్వాదులకు చెందిన అనేక గాథలు వర్ణింపబడును. మరియు, వైవస్వతమనువు యొక్క ప్రజాసృష్టి వివరించబడును. మహాదేవుని యజ్ఞములో వారుణ దేహమును ధరించిన బ్రహ్మయొక్క శుక్రము నుండి భృగువు మొదలగు వారి ఉత్పత్తి తెలుపబడును.
చాక్షుషమనువు యొక్క శుభకరమగు ప్రజాసృష్టి, తరువాత వైవస్వత మన్వంతరములో ధ్యానమునుండి దక్షుడు చేసిన సృష్టి గురించి చెప్పబడును. బ్రహ్మపుత్రుడు, ప్రియముగా మాటలాడువాడు అగు నారదుడు తన శాపము కొరకై మహా బలశాలురగు దక్షుని కుమారులను నశింపజేసెను. అపుడు దక్షుడు వీరిణియందు కీర్తిపొందిన కన్యలను సృజించెను. తరువాత, ధర్ముని సృష్టి, ధీమంతుడగు కాశ్యపుని సృష్టి వర్ణింపబడును. ఆ తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మధ్యగల ఐక్యము, భిన్నత్వము, మరియు వారిలోని విశేషములు కీర్తింపబడును.
దేవతలకు అధిపతియగు బ్రహ్మ దేవతలను శపించుట, దితి యొక్క అనుగ్రహముచే దేవాంశతో కూడి మరుత్తులు జన్మించుట, ఏద్గురు చొప్పునగల మరుత్తుల ఏడు, గణములు ఏడు, తండ్రి మాటచే వారికి దేవత్వము, వాయువు యొక్క ఆవహ, ప్రవహ మొదలగు స్కంధములలో ఆశ్రయము లభించుట, దైత్యులు, దానవులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు, సర్వభూతములు, పిశాచములు, పశువులు, పక్షులు, లతలు, అప్సరసలు అను వాటి ఉత్పత్తి విస్తరముగా వివరింపబడును. సముద్రము నుండి ఐరావత గజము పుట్టట, గరుత్మంతుని పుట్టుక, అభిషేకము, భృగువుల, అంగిరసుల వివరములు చెప్పబడినవి.
మహాత్ములగు కశ్యప, పులస్త్య, అత్రి, పరాశర మహర్షుల సంతానము ఈ పురాణములో వివరింపబడును. దేవతలకు, ఋషులకు కలిగిన సంతానము గురించి తెలుపబడును. లోకములకు ఆధారమైన ముగ్గురు కన్యల కీర్తి గానము చేయబడును. దేవతలతండ్రులు, మనుమలు, వారి జన్మల గురించి వివరింపబడును. ఐదుగురు మహాత్ముల చరిత్ర వర్ణింపబడును. భూమి విస్తారము, ఆదిత్యుని విస్తారము, తరువాత కుక్షి చరిత్ర, మరియు ధుంధువధ వర్ణింపబడినది.
ఇక్ష్వాకువు నుండి బృహద్బలుని వరకు, నిమి మొదలుకొని జహ్ను గణము వరకుగల చక్రవర్తులు ఇందు కీర్తింపబడిరి. యయాతి మహారాజ చరితము, యదువంశ చరిత్ర, హైహయుని చరిత్ర కీర్తింపబడినది. తరువాత, క్రోష్ణువు యొక్క వంశము, జ్యామఘుని మాహాత్మ్యము, ప్రజాసృష్టి కీర్తింపబడును. దేవావృధుడు, అర్కుడు, మహాత్ముడగు వృష్టి అను మహారాజుల చరిత్ర, అత్రిమిత్ర వంశము, మరియు విష్ణువు యొక్క మహిమ తెలుపబడును. తరువాత, సూర్యుడు శ్రేష్ఠమగు మణిని పొందుట, ధీమంతుడగు యుధాజితుని ప్రజాసృష్టి కీర్తింపబడును.
దేవమీఢుడను రాజర్షి యొక్క శోభాయుతమగు వంశము, ఆ మహాత్ముని చరిత్ర, పునర్జన్మ వర్ణింపబడినవి. కంసుని దుష్టబుద్ధి, దేవకీ వసుదేవులకు జగన్నాథుడగు విష్ణువు రహస్యముగా జన్మించుట, తరువాత ప్రజాసృష్టి తెలుపబడెను. దేవాసుర యుద్ధములో విష్ణువు ఇంద్రుని ప్రాణములను రక్షించుట కొరకై స్త్రీని వధించగా, భృగువు విష్ణువును శపించెను. భృగుమహర్షి శుక్రుని మాతృదేవిని తిరిగి బ్రతికించెను.
ధీరుడగు శుక్రుడు వరదానమును గోరి, శివుని ఆరాధిస్తూ తపస్సు చేయుట, శివస్తుతి, ఆ తరువాత దేవాసురుల వృత్తాంతము వర్ణింపబడినవి. మహాత్ముడగు శుక్రుడు జయంతితో కూడి యుండగా, బుద్ధిశాలియగు బృహస్పతి శుక్రరూపముతో రాక్షసులను మోహపెట్టెను. అపుడు గొప్ప తేజశ్శాలియగు శుక్రుడు వారిని శపించెను. విష్ణు మాహాత్మ్యము, విష్ణువు జన్మించుట వర్ణింపబడినది. యయాతికి శుక్రాచార్యుని కుమార్తెయగు దేవయాని యందు తుర్వసుడు, అనువు, ద్రుహ్యుడు, పూరువు అను కుమారులు కలిగిరి. వారి వంశములో జన్మించిన మహాత్ములగు చక్రవర్తులు ఈ పురాణములో కీర్తింపబడిరి. ఆ చక్రవర్తుల దీర్ఘకాల కీర్తి వారి సంపద, తేజస్సు గానము చేయబడినవి. విప్రర్షియగు కుశికుని ధర్మనిష్ఠ తెలుపబడినది.
సురభి బృహస్పతి శాపమును తొలగించుట, జహ్నువంశము, శంతనుని పరాక్రమము వర్ణింపబడును. భవిష్యత్తులో రాబోవు రాజుల వర్ణనము, రాబోవు ఏద్గురు మనువుల వర్ణనము ఈ పురాణము నందు కలవు. కలియుగాంతమున ప్రాణి సంహారము, పరార్ధ లక్షణము, పరలక్షణములు కీర్తించబడును. యోజనములలో బ్రహ్మ యొక్క పరిమాణము, నైమిత్తిక, ప్రాకృతిక, అత్యంతికములనే, సర్వప్రాణుల యొక్క మూడు రకముల ప్రళయము, అనావృష్టి, సూర్యుని నుండి భయంకరమగు ప్రళయకాలాగ్ని పుట్టుట వర్ణింపబడును.
ప్రళయకాల మేఘము వర్షించగా సర్వము జలమయము అగుట, అప్పటి వాయువు వర్ణింపబడును. అటు తరువాత మహాత్ముడగు బ్రహ్మకు రాత్రి అగుట, ఆ రాత్రి యొక్క కాలమానము నిర్దేశింపబడును. భూరాది ఏడు లోకములు, పాపులు పొందే రౌరవాది నరకములు వర్ణింపబడును. బ్రహ్మ లోకమునకుపైన పవిత్రమగు శివలోకము కలదు. సర్వప్రాణులు ప్రళయములో అచటనే లీనమగుదురు. సర్వప్రాణుల ఉత్తరగతులు అచటనే నిర్ణీతమగును. ప్రళయమునందు సర్వప్రాణుల సంహారము వర్ణింపబడును.
ధర్మాచరణము వలన ఊర్ధ్వగతి, అధర్మాచరణము వలన అధోగతి, ప్రతి కల్పము నందు మహాభూతములు కూడా వినాశము చెందుట, దుఃఖగణనము, సృష్టికర్త కూడా అనిత్యుడేనని నిరూపించుట. భోగములు పరిణామములో హానిని కలిగించునని నిర్ణయించుట, మోక్షము దుర్లభమని ప్రతిపాదించుట, వైరాగ్యముచే భోగములయందు దోషమును దర్శించుట అను విషయములు ఈ పురాణములో వర్ణింపబడినవి. వ్యక్తము (పృథివి, అగ్ని, జలము), అవ్యక్తము (వాయువు, ఆకాశము) అగు జగత్తు నుండి మనస్సును మరలించి, బ్రహ్మమునందు స్థిరముగా ఉంచుట వలన, అది శుద్ధమై ద్వైత దర్శనమును అతిక్రమించ గల్గును.
తరువాత త్రివిధ తాపములకు అతీతము, రూపములేనిది, పుణ్యపాప సంగము లేనిది, ఆనందఘనము, అభయ స్థానము అగు పరబ్రహ్మ వర్ణింపబడును. బ్రహ్మ పూర్వ సృష్టిని పోలిన ఇంకో సృష్టిని చేయుట, పాపములను అన్నిటినీ పోగొట్టు ఋషివంశ వర్ణన మొదలైనవి ఈ పురాణమునకు విషయవస్తువులు. దీనియందు జగత్తుయొక్క సర్వ వికారములు, ప్రళయము కీర్తింపబడును. ప్రాణుల ఉత్పత్తి వినాశములు, కర్మ ఫలములు కూడా వర్ణింపబడును. వశిష్టుని ఉత్పత్తి, మరియు శక్తి యొక్క జన్మ వర్ణింప బడును.
తరువాత విశ్వామిత్రునికి సౌదాసుని వలన కలిగిన అవమానము, అట్లే పరాశరుని ఉత్పత్తి, ఆయన అంతర్ధానము చెప్పబడినది. పితరుల కన్య వలన వ్యాసుని జనన వృత్తాంతము, తరువాత పుత్రునిత సహా శుకుని ఉత్పత్తికి సంబంధించిన విషయములు చెప్పబడినవి. అటు పిమ్మట పరాశరునికి విశ్వామిత్రునితో విరోధము కలిగిన వృత్తాంతము, విశ్వామిత్రుని వధించవలెనను కోరికతో వశిష్ఠుడు అగ్నిని ప్రస్తుతించుట, దైవవశమున విశ్వామిత్రుని హితము కోరిన స్కందుడు సంతాన నమిత్తమై అతడిని రక్షించిన వృత్తాంతము తెలుపబడినది.
వ్యాస భగవానుడు నాల్గు పాదములతో కూడియున్న ఒకే ఒక వేదమును తన బుద్ధితో నాల్గు భాగములుగా విభాగము చేసిన విధానము, ఆయన శిష్యులు, శిష్యుల శిష్యులు, మరల వాటిని శాఖలుగా విభాగముచేయుట తెలుపబడినవి. తరువాత స్వయంభులైన బ్రహ్మదేవుడు పుణ్యప్రదేశమును చేరుకొనవలెనను కోరికగల మనులతో, వారి హితమును కోరి, సుందర నాభి ప్రదేశమును కలది అగు దివ్యరూప అను పేరుగల శుభకరమైన అతిగొప్పదైన వర్తమాన చక్రమును చూపించి దీని వెనుక విడువ కుండా జాగరూకులై వెళ్లుడు. మీకు హితమును కలిగించు దేశమును పొందగలరు. పరుగిడే ఈ ధర్మ చక్రము యొక్క అంచు ఎక్కడ శిథిలమగునో, ఆ ప్రదేశము పవిత్రమైనదని తెలుసుకొనుడు” అని చెప్పెను. బ్రహ్మ ఋషులను ఉద్దేశించి ఇట్లు పలికి, మరల అంతర్ధానమయ్యెను.
గంగాదేవి యొక్క గర్భము నుండి జనించిన బంగారమును తీసుకొనివచ్చుట, ఆ ఋషులకు నైమిశీయులు అనుసార్థక నామధేయము ఇవ్వబడినవి. అపుడు ఋషులు నైమిశమునందు సత్రయాగమును అనుష్ఠించిరి. శరద్వంతుడు మరణించగా, ఆతడు పునరుజ్జీవితుడుగా చేయబడెను. నైమిశమునందలి ఋషులు అతిశయించిన శ్రద్ధతో, ఈ సమస్త భూమిని సరిహద్దులు లేకుండా చేసి, రాజును తీసుకొనివచ్చిరి. అతనిని శాస్త్రోక్త విధానముగా అతిథి మర్యాదలతో ఆదరించిరి. ఆ విధముగా యథావిధిగా చేయబడిన ఆతిథ్యముచే సంతసిల్లిన రాజును క్రూరుడు, కనబడకుండ సంచరించువాడు అగు స్వర్భానుడు అను రాక్షసుడు అపహరించెను.
ఆ మహారాజు యజ్ఞములో మహర్షులను కలుసుకొనుట, ఆ మహాత్ముల యజ్ఞములోని సామగ్రి అంతా బంగరుదై ఉండుటను చూచుట. నైమిశేయులగు మహర్షులు చేయు పన్నెండు సంవత్సరముల యాగములో ఆ రాజునకు మహర్షులతో వివాదము, అతడు, వారిచే సంహరింపబడుట. అతని కుమారుడగు ఆయుషుని నైమిశారణ్యములో చక్రవర్తిని చేయుట, తరువాత యాగమును పూర్తిచేసిన ఆ మహారాజును సేవించుట వర్ణించబడినవి. ఓ ద్విజశ్రేష్ఠులారా! ఋషులయొక్క మహిమాన్వితమగు చరితము జరిగినది జరిగినట్లుగా ఈ పురాణమునందు వ్యాఖ్యానింపబడినది.
ఉత్తమ జ్ఞానరాశియగు ఈ పురాణమును పూర్వము బ్రహ్మ చెప్పియుండెను. రుద్రుడు ద్విజులను అనుగ్రహించుట కొరకై అవతరించుట, పాశుపతయోగములు, స్థానములు, లింగోద్భవము, శివుడు నీలకంఠుడు అగుట అను విషయములు కూడా దీని యందు కీర్తింపబడును. ధన్యము, కీర్తిని ఇచ్చునది, ఆయుర్దాయమును ఇచ్చునది అగు ఈ పురాణమును బ్రహ్మవాదియగు వాయుదేవుడు విప్రులకు చెప్పియుండెను. దీనిని ప్రవచించుట, వినుట, విశేషించి కంఠస్థము చేయుట వలన పాపములు తొలగి, పుణ్యము లభించును. ఈ పురాణములో ఇదే క్రమములో చెప్పబడినది.
విశాలమగు విషయము నైననూ తేలికగా, సంగ్రహముగా చెప్పుటకు వీలుపడును. అందువలన, ముందుగా సంగ్రహముగా చెప్పి, తరువాత విస్తరముగా వివరించబడెను. ఎవరు ఇంద్రియములను జయించి ఈ పురాణములోని మొదటి పాదమును శ్రద్ధగా అధ్యయనము చేసెదరో, వారు పురాణము నంతనూ అధ్యయనము చేసిన ఫలమును పొందెదరు అనుటలో సందియము లేదు. నాల్గు వేదములను వేదాంగములతో, ఉపనిషత్తులతో సహా అధ్యయనముచేసిన ద్విజుడైననూ, పురాణమును ఎరుగని వాడైనచో, పండితుడు కాజాలడు. ఇతిహాస, పురాణముల జ్ఞానముతో వేదమును విస్తారముగా వ్యాఖ్యానించ వలెను. వేదము అల్పజ్ఞుడగు వ్యక్తివలన ‘ఈతడు నన్ను తప్పుగా వ్యాఖ్యానించునేమో’ అని భయపడుచుండును. బ్రహ్మ స్వయముగా చెప్పిన ఈ అధ్యాయమును పునః పునః పఠించే వ్యక్తి ఆపదల నుండి విముక్తుడై, అభీష్టమగు పుణ్యగతిని పొందును.
‘పురా’ అనితీతి ‘పురాణమ్’ పూర్వము (సృష్ట్యాదిలో) ప్రవర్తిల్లినది గనుక పురాణము అనబడును. ఈ నిర్వచనమును ఎరిగిన వ్యక్తి పాపములన్నిటి నుండి విముక్తుడగును. నారాయణుడు ఈ జగత్తునంతనూ వ్యాపించియున్నాడు. జగత్తును సృష్టించిన బ్రహ్మను కూడా సృష్టించినవాడు మహేశ్వరుడు. మీరీ పురాణసంగ్రహమును వినుడు. ఈ పురాణము అంతా మహేశ్వరుని స్వరూపము. ఆయన సృష్టి కాలములో ప్రాణులను సృష్టించి, ప్రళయ కాలములో తనలో లీనము చేసుకొనిన వృత్తాంతమంతయు ఇందులో కలదు అని బ్రహ్మ చెప్పెను. (1)