వాయు మహా పురాణము
గయా మాహాత్మ్యము - 7
సనత్కుమారుడు ఇట్లు అనెను:
గయుడను రాజు బహు అన్నములు కలదియు, బహు దక్షిణలు కలదియునైన యజ్ఞమును చేసెను. అచటి ద్రవ్య (వస్తు) సమూహములను లెక్కింపనలవిగాదు. దేశ దేశములలో చక్కగా పూజింపబడిన బ్రాహ్మణులు గయయందుండి అచటి ఇరువదియైదు అన్నాది పర్వతములను ప్రశంసింతురు. ఈ విధముగా పూర్వము ఎవ్వరును చేయలేదు. తరువాతి వారునుగూడ చేయలేరు. భూ లోకమున ఇసుకవలె, ఆకాశమున తారకలవలె అనేక సువర్ణాదుల తోడి దక్షిణలు అసంఖ్యాతములు (లెక్కకు మించినవి). ఇచట పూర్వులు ఎవ్వరు ఇట్లుచేసిన వారులేరు. ముందుకూడ నెవ్వరును చేయలేరు. దేశదేశములలో చక్కగా పూజింపబడిన ప్రజలు ఇచట తృప్తినంది గయుని ప్రశంసింతురు. తరువాత విష్ణువు మొదలగువారు తుష్టులై వరమును అడుగుమని గయునితో అనిరి. గయుడువారిని “పూర్వము ఇచట అభిశప్తులైన (శాపమును బొందిన) బ్రాహ్మణులు పవిత్రులై యజ్ఞముల పూజింపబడుదురుగాక” అని ఈవిధముగా ప్రార్థించెను. గయా శ్రాద్ధ విధానమునకై మూర్త రూపమును ధరించిన బ్రాహ్మణులు పదునాలుగురు. సాక్షాత్తు బ్రహ్మ స్వయముగా ఉన్నను వారి మాటలను ఆచరింపవలెను. గౌతమము, కాశ్యపము, కౌత్సము, కౌశికము, కణ్వము, భారద్వాజము, ఔశననము, వాత్స్యము, పారాశరము, హరిత్కు మార మాండవ్యము, లోకాక్షి, లోకసంమహత్తు, వాశిష్ఠము, ఆత్రేయము-అని వీరి గోత్రములు పదునాలుగు. బ్రహ్మపురి వలెనే గయాపురియని ఇది నా పేర ప్రసిద్ధి చెందవలెను- అని వరమడుగ దేవతలు అట్లే అగుగాక అని అంతర్ధానము చెందిరి. గయుడు కూడ భోగములను అనుభవించి పరమమైన విష్ణులోకమునకు వెళ్లెను. విశాల అను నగరి యందు విశాల అను పేర రాజు ఉండెను. ఆతడు పుత్రుడు లేనివాడై బ్రాహ్మణులను అడిగెను- నాకు పుత్రాదులు ఎట్లు కలుగుదురు? అని అడిగెను. అనగానే బ్రాహ్మణులు విశాలునితో- గయలో పిండ దానము చేసిన నీకు సర్వము కలుగును అనిరి. విశాలుడుకూడ గయా శీర్షమున పిండమును ఇడి పుత్రవంతుడు అయ్యెను. ఆతడు ఆకాశమున తెల్లని - యెఱ్ఱని- నల్లని పురుషులనుచూచి, మీరు ఎవరు అని అడుగగా, వారిలో ఒక తెల్లనివాడు విశాలకు నితో ననెను. తెల్లని నేను నీ జనకుడను. ఇంద్రలోకము నుండి ఇటకు వచ్చితిని. ఓ పుత్రుడా! నా తండ్రి ఎఱ్ఱనివాడు. మిక్కిలి పాపములు చేసినవాడు. ఈ నల్లనివాడు నీ తండ్రి తండ్రి. ఈతనిచే ఋషులు చంపబడిరి. అవీచియను నరకమును పొందిన వీరు ఇరువురు నీవు పిండమిడుట వలన ముక్తిని పొందిరి. పితరులను, పితామహులను (తండ్రి తండ్రిని) అట్లే ప్రపితామహులను (తాత తండ్రిని) సంతోషింపచేతును అను నీ మాట వలనను, నీవు ఇచ్చిన జలము వలనను, ఓ శత్రుదమనుడా! సజ్జనోత్తముడా! మా ఈ యొక్కమారు కలయిక జరిగినది. ఓపుత్రా! నీచేత మాకు ముక్తి ఈయబడినది. ఆ ఉత్తమమైన స్వర్గమునకు పోయెదము-ఈ విధముగా పుత్రులు పితరులకు ఉత్తమ ముక్తిని ఇప్పింపవలె.
ఇంకను “నీచేత అందరు ముక్తులుగా చేయబడిరి. ఇక అక్షయమైన స్వర్గమునకు పోయెదము. సుపుత్రుడవైన నీచేత మేము అందరము బ్రహ్మలోకమునకు పోవుచున్నాము. పుత్ర-పౌత్ర-ఆదులతో గూడినవాడవై రాజ్యముచేసి, స్వర్గమునకు పోయి అచటి భోగములతో చక్కగా తృప్తి చెందినవాడవై తరువాత మోక్షమును పొందుము.
నీవు గూడ చాలకాలము రాజ్యముచేసి, దుర్లభములైన భోగములను అనుభవించి, దక్షిణలతో యజ్ఞములను చేసి, తరువాత విష్ణుపురమునకు పోవలెను” అని ఈ విధముగా వరము పొందిన రాజు రాజ్యమునుచేసి స్వర్గమునకు పోయెను. ప్రేతరాజైన ఆతడు గయా శ్రాద్ధము వలన ప్రేతలతో కూడ స్వర్గమునకు పోయెను. ఒక ప్రేత తన విముక్తికై ఒక కోమటితో నా పేర గయాశీర్షమున పిండ నిర్వాపణము చేయుము -అని అనెను. నా ప్రేతభావ విముక్తి చేయించుటకై నీవు నా ధనమును తీసికొనుము. ఆ ధనము అంతయు తెచ్చి గయాశ్రాద్ధమునకు వ్యయము చేయుము. నీకు నేను ఇరువదియొక్క భాగముల నిచ్చితిని. న్యాయానుసారముగా నాపేరులను చక్కగా చెప్పితిని. ఆతడు గయలో గయాశీర్షము కడకుబోయి ప్రేతరాజునకు పిండమిడెను. తరువాత బంధువులతో పాటు తన పితరులకు పిండమిడెను. ప్రేత తన ప్రేతత్వము నుండి విముక్తమయ్యెను. కోమటి ఇంటికి వచ్చెను. ఈ విధముగా ఇది గయుని యొక్కయు, శంభుని యొక్కయు, విష్ణువు యొక్కయు, రవి యొక్కయు క్షేత్రము. ఆ తరువాత ఉపవసించి, మహానదిలో ఉన్న గాయత్రీ తీర్థమున గాయత్రి ఎదుట స్నానము జేసి ప్రాతః సంధ్యను ఉపాసింపవలెను. సపిండకముగా శ్రాద్ధమునుచేసి కులమును బ్రాహ్మణ హితముగా చేయవలెను. సూర్యోదయమున గాయత్రీతీర్థమున స్నానము చేసి, సావిత్రి యెదుట నరుడు మధ్యాహ్నమున సంధ్యో పాసనముజేసి నూరు కులములను స్వర్గమును చేర్చును. తరువాత పితరులు ముక్తిని కోరి పిండదానము చేయవలెను. తూరుపు సరస్వతీ తీర్థమున విధి విధానమున స్నానము చేసి సాయంకాలమున సంధ్యను ఉపాసించి పితరులను విష్ణు లోకమును చేర్చవలెను. విశాలలోని లేలిహాన తీర్థమున భరతాశ్రమమున మూడు సంధ్యల చేయువాడు బహుజన్మలనుండి చేసిన సంధ్యాలోపమునుండి విముక్తుడు అగును. దేవపాదాంకితమైన ముండపృష్ఠ పర్వతమున, గదాధర విష్ణు సమీపమున, ఆకాశగంగా తీర్థమున, గిరికర్ణ ముఖములందును స్నానముచేసి పిండమునిడువాడు తన నూరు కులములను బ్రహ్మ లోకమునకు గొంపోవును. దేవనదియైన వైతరణిలో స్నానము చేసినవాడు పితరులను స్వర్గము చేర్చును. వైతరణిలో స్నానముచేసి గోదానము చేయువాడు తన ఇరువదియొక్క వంశములను ఉద్ధరించును. వైతరిణి విషయమున ఇది ముమ్మాటికి నిజము. ఓ నారదా! వంశములు ఇరువదియొక్కటియని చెప్పుదురు. వైతరణీ స్నానము ఆ వంశములను తరింపచేయును. సంశయము లేదు. వైతరణి అనునది ముల్లోకములలో ప్రసిద్ధి చెందినది. అది పితరులను తరింపచేయుటకై గయాక్షేత్రమున అవతరించినది. గోదావరిలోను, వైతరణిలోను, యమున యందును, అట్లే దేవనది గంగయందును, గోప్రచార క్షేత్రమునను శ్రాద్ధము చేయువాడు పితరులను స్వర్గము చేర్చును. పుష్కరిణి యందు ఘృతకుల్యయందు, మధుకుల్య యందు అట్లే, రుక్మిణీయైన కోటి తీర్థమందును పిండమిడువాడు పితరులను స్వర్గము పొందించును. పై తీర్థములలో మూడురాత్రుల ఉపవాసముతోను, తీర్థమునకు వచ్చుట చేతను, పితరులను స్వర్గము చేర్చును. ఘృతకుల్యా, మధుకుల్యా, దేవికా, మహానదీ-వీనిలో బంగారమును గోవును దానము చేయక నరుడు దరిద్రుడగును. శిలా సంగమము జరిగినది మధుస్రవ అనబడినది. ఆ నదిలో స్నానము చేసినవాడు పదివేల అశ్వమేధ యాగముల ఫలమునందును. అట, సపిండక శ్రాద్ధముచేసి, పిండదానము చేసిన నరుడు తన నూరు వంశములను ఉద్ధరించి విష్ణులోకమును చేర్చును. దశాశ్వమేధికమున, హంస తీర్థమున, అమరకంకటమున, కోటి తీర్థమున, రుక్మకుండమున పిండమిడువాడు పితరులకు స్వర్గమును అందించును. వైతరణియందు, ఘృతకుల్యయందు, మధుకుల్యయందు, కోటితీర్థమునందు స్నానముచేసి, కోటీశ్వరుని చూచిన బ్రాహ్మణుడు కోటి జన్మలలోను బ్రాహ్మణుడై ధనాఢ్యుడును వేదపారగుడును అగును. అట మార్కండే యేశ-కోటీశులకు నమస్కరించిన పితృకారకుడు (పితరుల మోక్ష కారకుడు) అగును. పూర్వము రుక్మపారిజాత వనమున పార్వతితో కూడి ఏకాంతమున నుండి శంకరుడు పదివేల ఏండ్లు క్రీడించెను. అప్పుడు మరీచిముని ఫల పుష్పములకై పారిజాత వనమునకు పోయెను. ఆతనిని జూచి శంకరుడు తన సుఖ విఘాతకుడు అయినందున దుఃఖివికమ్మని శపించెను. దానిచే భయము చెంది మరీచి శంకరుని శాపవిమోచనము కోరెను. శివుడు గయలో నీకు విముక్తి లభించుననెను. మరీచి గయకు వెళ్లెను. అచట శిలయందు సర్వ దుష్కరమైన తపము చేసెను. పూర్వము ఈశ్వరశప్తుడు అయిన మరీచి నలుపుదనమును పొందెను. ఇచటి దారుణమైన తపముచేత ఆ బ్రాహ్మణుడు (మరీచి) తెల్లనివాడయ్యెను. విష్ణువు-ఓ పుత్రకా! వరమును కోరుకొమ్ము అనెను. మరీచి మాధవునితో నీవు సంతుష్టుడ వైనచో లభింపనిది ఏమున్నది? శివశాపము నుండి నేను విముక్తుడను కావలెను. శిలపవిత్రమైనది కావలెను, పితరులకు విముక్తిని ఇచ్చునది కావలెను అని అడిగెను. విష్ణువు అట్లే అగునని స్వర్గమునకు పోయెను. దేవతల పుష్కరిణిని పొంది నరుడు శుచియగును. అచట పితరులకు ఇడిన పిండము అక్షయమగును. అచట స్నానముచేసిన మానవుడు తన శరీరముతో స్వర్గమునకు పోవును. పాము కుబుసమును వదలినట్లు ఇట స్నానముచేసినవాడు పాపమును వదిలివేయును. అచటి కమలవనము పుణ్యమైనది. దానిని పుణ్యము చేసినవారే సేవింతురు. అచట తెల్లని శిల ఉన్నది. అచట శ్రాద్ధముచేసిన అక్షయమగును. ఓ నారదమునీ! ఆ శిలయందు యుధిష్ఠిరుడు శ్రాద్ధము చేయుటకు వెళ్లెను. అచట శ్రాద్ధకాలమున పాండురాజు- నాచేత పిండము నిడుము -అని చేయిచాచెను. కాని ధర్మరాజు మాత్రము ఆ చేతిని వదలి శిలయందే పిండ దానముచేసెను. శిలయందు పిండ దానముచే వ్యాసపుత్రుడైన పాండురాజు సంతుష్టుడయ్యెను. తన పుత్రునితో ఓ పుత్రక! భూమండలమున రాజ్యము జేయుము, నీ రాజ్యము కంటకమై సంపూర్ణ మగును. నీవు నా రక్షకుడవు. సోదరులతో కూడినవాడవై, శరీరముతో పాటు స్వర్గమునకు పొమ్ము. నరకములో ఉన్నవారిని దర్శన మాత్రమున పవిత్రులనుచేసి స్వర్గమును పొందించుము’- ‘అని చెప్పి పాండురాజు శాశ్వతమైన అవ్యయమైన పదమును పొందెను. భూమిని ఛేదించుకొని పుట్టు వృక్షాదులు, చెమటవల్ల పుట్టునవి, గ్రుడ్లవల్ల పుట్టునవి, మావివల్ల పుట్టునవియును మధుస్రవ నదిని చేరి మరణించినవై స్వర్గ పురమును చేరినవి. దశాశ్వ మేధికమున, హంసతీర్థమునను శ్రాద్ధము వలన స్వర్గమునకు పోవును. దశాశ్వ మేధ హంసలకు నమస్కరించి శివపురమునకు చేరును. భరతుని ఆశ్రమమున శ్రాద్ధము వలన పితరులను బ్రహ్మా లయమును చేర్చును. మతంగుని పదమున శ్రాద్ధము చేయువాడు పితరులను బ్రహ్మ లోకమును చేర్చును. బ్రహ్మ విష్ణ్వాదులతో సహా శమీ గర్భమున మధించి యజ్ఞమునకై అగ్నిని పొందెను. తరువాత దానితో యాగము చేయుటకై ముల్లోకముల ప్రసిద్ధిచెందిన ఈ తీర్థమును పొందెను. ఆ తీర్థము ముఖమను పేరుగలది. అది పితరులకు ముక్తినిచ్చునది. అచట స్నానముచేసి పిండమును ఇచ్చువాడు ముక్తిని పొందును. సంగమమున అంగారక- ఈశ్వరులకు నమస్కరించి పితరులను స్వర్గము చేర్చును. గయా కూటమున పిండదానము వలన అశ్వమేధ ఫలమును పొందును. భస్మ కూటమున భస్మనాథుని నమస్కరించి పితరులను తరింపజేయును. పాపములు వదిలిన వాడై ముక్తుడై సంగమమున స్నానము చేయవలెను. మునిసత్తముడైన వశిష్ఠుడు అశ్వ మేధమను ఇష్టిని చేసెను. ఆ ఇష్టి నుండి వెలువడిన శివుడు వశిష్ఠుని వరము అడుగు కొమ్మనెను. వశిష్ఠుడు గూడ- “ఓ శివా! దేవేశా! నావల్ల సంతుష్టుడవు అయినచో ఇచట ఉండవలెను” అని కోరెను. శివుడు అట్లే అని అచటనే ఉండెను. ధేనుకారణ్యమున, కామధేనుపదములందు స్నానముచేసి నమస్కరించి పిండమిడువాడు పితరులను బ్రహ్మ లోకమునకు చేర్చును. ముండపృష్ఠ పర్వత సమీపమున గయానాభిలో కర్దమాలమున స్నానముచేసి శ్రాద్ధాదికమును చేసియు పితృ-ఋణ విముక్తుడు అగును. ఫల్గు, చండి, శ్మశానాక్షి, మంగళ మొదలగు శక్తులకు సమర్పింపవలెను. గయలో వృషోత్సర్గము (ఆబోతును వదలుట) వలన ఇరువది యొక్క వంశములను ఉద్ధరించును. దేవతలు, జితేంద్రియులైన ఋషులును అక్కడ అటనటను ఉందురు. ఆద్యగదాధరుడైన విష్ణువును ధ్యానించుచు చేసిన శ్రాద్ధపిండాది దానములవలన నూరు వంశములను ఉద్దరించి పిత రులను బ్రహ్మలోకము చేర్చును. గయ, గయుడు, గయాదిత్యుడు, గాయత్రి, గదాధరుడు, గయాగయాసురుడు - ఈ యారుగయలు ముక్తి దాయకములు. ఈ పుణ్యమైన గయా ఖ్యానము నెల్లప్పుడు పఠించు నరుడును శ్రద్ధతో వినువాడును పరమపదమును పొందు దురు. ఓ నారదా! గయాఖ్యానమును బ్రాహ్మణులవల్ల చదివించువాడును పుణ్యముచేయు నరుడగును. గయా శ్రాద్ధము చేయుట, సునిశ్చితముగా చేయదగిన పుణ్యము చేయుట, గయయొక్క మహిమను అభ్యసించిన మానవుడు రాజసూయ యాగమును, అశ్వమేధ యాగమును చేసినవాడగును. ఈ గయామాహాత్మ్యమును వ్రాసిన వాడును, వ్రాయించిన వాడును, పుస్తకమును పూజించినవాడును రాజసూయ, అశ్వమేధ యాగములు చేసినవాడ గును. ఈ పుస్తకము ఇంటనున్నవారి గృహమున లక్ష్మి స్థిరురాలై సుప్రసన్నురాలు అగును.
అచట సర్ప - అగ్ని - చోరుల వల్ల భయముండదు. శ్రాద్ధ కాలమున ఉత్తమమైన ఈ గయా మాహాత్మ్యము ఎవడు చదువునో,వాడు పెట్టిన శ్రాద్ధము విధి విహీనమైనను గయా శ్రాద్ధముతో సమానము అగును. ఓ నారదమునీ! ఈ గయాఖ్యానము తెలిసిన వానిలోను, విన్నవానిలోను, చదివిన వానిలోను, ముల్లోకములలో ఉన్న తీర్థములు అన్నియు ఉండును అని చెప్పగా...
సూతుడు ఇట్లు అనెను:
సనత్కుమారుడు ముని శ్రేష్ఠుడైన నారదునకు ఈ పుణ్యమైన యాగమాహాత్మ్య కథను భక్తితో తెలిపి, సంగీతగురువైన నారదుని వదలి, పుణ్యవనములతో కూడిన తన ఆశ్రమమునకు వెళ్లెను.
ఇది శ్రీవాయుమహాపురాణమున
గయా మాహాత్మ్యము అను
ఏబదియవ అధ్యాయము
సమాప్తము.
వాయు మహాపురాణము సమాప్తము
ఓం తత్ సత్.