మార్కండేయ మహా పురాణము
1 - వపు శాప కథనము
నారాయణం నమస్కృతం నరం చైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్.
నర శ్రేష్టులగు నర నారాయణులను, సరస్వతీ దేవిని మరియు వేద వ్యాస మహా మునిని, నమస్కారము జేసి, యనంతరము “జయ” (జ = 8,య = 1) యను అక్షర సంఖ్యచే వాచ్యములగు పదునెనిమిది పురాణములను ప్రవచనము జేయ వలెను.
మార్కండేయం ప్రతి జైమినీ కృత మహాభారత విషయక ప్రశ్నాః
తపస్వాధ్యాయ నిరతం మార్కండేయం మహామునిమ్
వ్యాసశిష్యో మహాతేజా జైమినిః పర్యపృచ్చత
భగవన్ భారతా ఖ్యానం వ్యాసేనోక్తం మహాత్మనా
పూర్ణ మస్తమలైః శుభ్రైః నానా శాస్త్ర సముచ్చయైః
జాతి శుద్ధి సమాయుక్తం సాదు శబ్దోపశోభితమ్
పూర్వ పక్షోక్తి సిద్దాంత పరినిష్టా సమన్వితమ్
త్రిదశానాం యథా విష్ణుః ద్విపదాం బ్రాహ్మణో యధా
భూషణానాం చ సర్వేషాం యదా చూడామణి ర్వరః
మార్కండేయ మహా మునికి నమస్కరించి జైమిని మహర్షి వ్యాస భారత మందలి సందేహముల గురించి ప్రశ్నించుట. ఒకానొక సమయమున వేద వ్యాస మహర్షి యొక్క శిష్యుడు, మహాతేజస్వి యగు జైమిని మహా ముని, సర్వదా తపస్సు యందు పారాయణమందే ఆసక్తుడగు మార్కండేయ మహా మునిని ఇట్లు ప్రశ్నించెను.
హే భగవాన్! మహాత్ముడగు వేద వ్యాస మహర్షి మహాభారతమను గ్రంథమును రచించెను. ఆ గ్రంథము నందు అనేక శాస్త్ర రహస్యములతో పూర్ణమై దోషరహితమై యోప్పారుచున్నది. ఆ మహా భారతము విశుద్ధ శబ్ధములచే, పరిపూర్ణములగు ఛందస్సుల చేతను, అలంకారముల చేతను గూడుకొని యున్నది. మరియు శ్రవణ సుఖ దాయకములగు మృదు మధుర శబ్దోప శోభితము పూర్వ పక్షములగు వాక్యములకు శాస్త్రీయములగు సిద్ధాంత వాక్యములచే పరినిష్ఠా సమన్వితమునై అలరారు చున్నది. దేవతలలో విష్ణుమూర్తి శ్రేష్ఠుడు. మానవులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. సర్వ భూషణములలో చూడామణి శ్రేష్టమైనది. సర్వ శాస్త్రములలో మహా భారతము శ్రేష్ఠము.
యథా యుదానాం కులిశం ఇంద్రియాణాం యథా మనః
తథేహ సర్వ శాస్త్రాణాం మహాభారతముత్తమమ్
అత్రార్థశ్చైవ ధర్మశ్చ కామో మోక్షశ్చ వర్ణ్యతే
పరస్పరానుబంధాశ్చ సానుబందాశ్చ తే పృథక్
ధర్మ శాస్త్ర మిదం శ్రేష్టం అర్థ శాస్త్ర మిదం పరమ్
కామ శాస్త్ర మిదం చాగ్ర్యం మోక్ష శాస్త్రం తథోత్తమమ్
చతురాశ్రమ ధర్మాణాం ఆచార స్థితి సాదనమ్
ప్రోక్తమేత న్మహా భాగ! వేదవ్యాసేన ధీమతా
ఆయుధములలో వజ్రాయుధము, సర్వేంద్రియములలో మనస్సు ఎట్లు శ్రేష్టములో, సమస్త శాస్త్రములలో మహాభారతమట్లు సర్వోత్తముగా నున్నది. ఈ మహా భారతము నందు ధర్మ, అర్థ, కామ, మోక్షములు పరస్పర సంబంధములు గలవి గాను, మరియు ప్రత్యేకము గాను విశేష విషయములతో వర్ణింప బడినవి. ఇందు వలననే ఈ గ్రంథము ధర్మ శాస్త్ర, అర్థ శాస్త్ర, కామ శాస్త్ర, మోక్ష శాస్త్ర గ్రంథములలో ప్రధాన సాధనమగు శాస్త్ర గ్రంథముగాను, అత్యుత్తమ మైనదిగాను చెప్పబడినది. మహాభాగా! మహా బుద్దియగు వేదవ్యాస మహర్షిచే నాలుగాశ్రమముల ఆచారములు, వాటి స్థితులు, సాధనములు సంపూర్ణముగా విశేషముగా వర్ణింప బడినవి.
తథా తాత కృతం హ్యేతత్ వ్యాసే నోదార కర్మణా
యథా వ్యాప్తం మహాశాస్త్రం విరోధై ర్నా భిభూయతే
వ్యాస వాక్య జలౌఘేన కుతర్క తరు హరిణా
వేద శైలావతీర్ణేన నీరజస్కామహీ కృతా
గురువర్యా! ఉదార స్వభావుడగు వేదవ్యాస మహర్షి ఈ మహా భారతమను మహా శాస్త్రమును మహా విస్తృతముగా రచించిననూ, ఏ స్థలము లందునూ పరస్పర విరోధ వాక్యములు లేవు. వ్యాస వాక్యములను జల ప్రవాహము వేదరూప పర్వతము నుండి బయలు వెడలి కుతర్క రూప వృక్షములను సమూలముగా పెకలించి వైచుచు ప్రవహించి భారత భూమిని దోష రహితముగా చేసినది.
కలశబ్ద మహా హంసం మహాఖ్యాన వరాంభుజమ్
కథా విస్తీర్ణ సలిలం కార్ష్ణం వేదం మహాహ్రదమ్
తదిదం భారతా ఖ్యానం బహ్వర్థం శ్రుతి విస్తరమ్
తత్వతో జ్ఞాతుకామోహం భగవంస్త్వా ముపస్థితః
కస్మాన్మానుషతాం ప్రాప్తో నిర్గుణోపి జనార్దనః
వాసుదేవో జగత్ సూతి స్తితి సంయమ కారణమ్
కస్మాచ్చ పాండు పుత్రాణాం ఏకాసా ద్రుపదాత్మజా
పంచానాం మహిషీకృష్ణా హ్యత్ర న స్సంశయో మహాన్
భేషజం బ్రహ్మహత్యయా బలదేవో మహాబలః
తీర్ధయాత్రా ప్రసంగే న కస్మా చ్చక్రే హలాయుధః
కథం చ ద్రౌపదేయాస్తే కృతధారా మహారథాః
పాండునాధా మహాత్మానో వధమాపు రనాథవత్
ఏతత్సర్వం విస్తరశో మమాఖ్యాతు మిహార్హసి
భవంతో మూఢ బుద్దీనాం అవభోదకరాః సదా
కృష్ణాద్వైపాయన ప్రణీతము పంచమ వేద స్వరూపమునగు నీ మహా భారతమను మహాసరస్సు మధుర శబ్దములను, మహా హంసలు, మరియు మహా వ్యాఖ్యానములను, కమలములను కలిగి శోభాయ మానమై విస్తారమగు కథలు అను మహా జలముచే పరిపూర్ణమై యున్నది. హే భగవాన్! వేదార్థోపబృంహకము, (శృత్యర్థముల విపులీకరించు నదియు) నానా గూడార్థములు గలదియునగు మహా భారత నామకమగు మహాశాస్త్ర మందలి నిగూడము లైయున్న శాస్త్ర తత్వములను తెలిసికొను నిమిత్తమై నేను తమ వద్దకు వచ్చితిని. ప్రపంచము యొక్క సృష్టి స్తితి లయలను జేయు జనార్ధనుడు, వాసుదేవ పర బ్రహ్మము, నిర్గుణుడై యుండియు ఏ కారణమున సగుణుడై మనుష్యత్వము బొందెను? కృష్ణ యను పేరు గలదియు, ద్రుపద పుత్రియునగు ద్రౌపది పాండుపుత్రు లైదు గురికి ఒకేయొక పట్టమహిషి ఎట్లయ్యెను? ఈ విషయములో నాకు చాలా సందేహముగా నున్నది. హలాయుధుడు, మహాబలుడగు బలదేవుడు తీర్థ యాత్రలు జేయుచున్న సమయమున బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తము నెందు వలన జేసెను? మరియు పాండవ సహాయము గలవారు, మహారథులు, మహాత్ములునగు ద్రౌపదీ పుత్రులు దిక్కులేని వారై, అనాధులై,అవివాహితులై, చచ్చుటకు కారణమేమై యుండును? ఇవన్నియు తమరు నాకు సవిస్తరముగా తెలుప ప్రార్థించు చున్నాను. తమరు జ్ఞానము లేని వారికి జ్ఞానము గలుగ జేయు వారై యుందురు కదా!
ఇతి తస్య వచ శ్రుత్వా మర్కండేయో మహామునిః
దశాష్టదోషరహితో వక్తుం సమువ చక్రమే
క్రియాకాలోయ మస్మాకం సంప్రాప్తో మునిసత్తమః
విస్తరే చాపి వక్తవ్యే నీశ కాలః ప్రశస్యతే
యే తు వక్ష్యంతి వక్షేద్య తానహం జైమినే
తవ తథా చ నష్ట సందేహం త్వాం కరిష్యంతిపక్షిణః
పింగాక్షశ్చ విభోదశ్చ సుపుత్ర స్సుముఖ స్తథా
ద్రోణ పుత్రాః ఖగ శ్రేష్టాః తత్వజ్ఞా శ్శాస్త్ర చింతకాః
వేద శాస్త్రార్థ విజ్ఞానే యేషామవ్యాహతా మతిః
వింధ్య కందర మధ్యస్థాః తా నుపాస్య చ పృచ్చ చ
ఏవ ముక్త స్తదా తేన మార్కండేయేన ధీమతా
ప్రత్యువాచర్షి శార్దూలో విస్మయోత్పుల్ల లోచనః
యోగశాస్త్రోక్తా (నిద్రా, తంద్రా, భయ, క్రోధ, మోహ, మద, ఉన్మాద, ప్రమాద, విస్మయ, సందేహ, లోభ, అసూయ, మాత్సర్య, కపటతా, మిథ్యా, నాస్తికతా, ఆగమా దర్శిత, ఆశిక్షా - ఇవి యోగ శాస్త్ర మందు చెప్ప బడిన అష్టాదశ (18) దోషములు), అష్టాదశ దోష రహితుడు, మహా మునియునగు మార్కండేయుడు జైమిని మహర్షి యొక్క ఈ మాటలను విని చెప్పుటకు నుపక్రమించెను. మార్కండేయు డిట్లనియెను. ముని సత్తమ! నాకు సంద్యా వందనాది క్రియా కలాపమునకు సమయమైనది. నీవడిగిన యీ ప్రశ్నలకు సవిస్తరముగా సమాధానము జెప్పుటకీ కాలము ప్రశస్తముగా లేదు. జైమినీ! నీకు గలిగిన సందేహములు ఏవైతే గలవో, వాటిని పక్షులు చెప్పగలవు. నీకు సంశయములు లేకుండా జేయగలవు. పింగాక్షుడు, విభోదుడు, సుపుత్రుడు, సుముఖుడు అను నామములు గల ఈ నలుగురు ద్రోణ మహర్షి యను ఒక ముని శ్రేష్టుని కుమారులు. వారెల్ల వేళలా శాస్త్ర చింతనము జేయు చుందురు. శాస్త్ర తత్వములను బాగుగా ఎరిగిన వారు. పక్షి జన్మ నందిన ఈ నలుగురు వింధ్య పర్వత కందర మధ్య మందున్నారు. వారికి వేద శాస్త్రార్థములలో విశేష జ్ఞానము గలదు. వారి నుపాసించి, నీ సందేహముల నడుగుము. జ్ఞాన నిష్టుడగు మార్కండేయు డిట్లు పలికిన పలుకులను విని, ఋషి శ్రేష్టుడగు జైమిని విస్మయోత్పుల్ల లోచనుడై ఆశ్చర్యముతో నిట్లనియె.
జైమిని:
అత్యద్భుతమిదం బ్రహ్మాన్ ఖగ వాగివ మానుషి
యత్ పక్షిణస్తే విజ్ఞానం ఆపు రత్యంత దుర్లభమ్
తిర్యగ్యోన్యాం యది భవః తేషాం జ్ఞానం కుతో భవత్
కథం చ ద్రోణ తనయాః ప్రోచ్యంతే తే పతత్రిణః
కశ్చ ద్రోణః ప్రవిఖ్యాతో యస్య పుత్రా చతుష్టయమ్
జాతం గుణవతాం తేషాం ధర్మ జ్ఞానం మహాత్మనామ్
జైమిని:
బ్రహ్మణ్యుడా! మనుష్యుడు మాటలాడు విధమున పక్షులు బలుకునను నీ కథనము అత్యంత మద్భుతముగా నున్నది. ఇంతేగాక ఆ పక్షు లత్యంత విజ్ఞానము గలవగుట అంత కంటే ఆశ్చర్యమును గలుగ జేయు చున్నది. తిర్యగ్యోని యందు జన్మించినచో వాటికి జ్ఞానమెట్లు గలిగెను? ద్రోణ కుమారులగు వారిని పక్షులని చెప్పు చున్నారేమి? గుణవంతులు, మహాత్ములునగు వారికి ధర్మ జ్ఞాన మెట్లు గలిగినది? ఇట్టి పుత్ర చతుష్టయము యొక్క తండ్రిగా ప్రసిద్ధుడైన యా ద్రోణమహర్షి ఎవరు?
మార్కండేయుడు:
శ్రుణుష్వావహితో భూత్వా యద్ వృత్తం నందనే పురా
శక్రస్యాప్సరసాం చైవ నారదస్య చ సంగమే
నారదో నందనేపశ్యత్ పుంశ్చలీ గణ మధ్యమం
శక్రం సురాధిరాజానాం తన్ముఖాసక్త లోచనమ్
స తేనర్షి వరిష్టేనా ద్రుతమాత్ర శ్శచీపతిః
సముత్తస్తౌ స్వకం చాస్మై దదా వాసన మాదరాత్
తం దృష్ట్వా బాల వృత్ర ఘ్న ముత్తితం త్రిదశాంగనః
వ్రణేముస్తాశ్చ దేవర్షిం వినయావనతాః స్తితాః
మార్కండేయుడు:
జైమినీ! పూర్వము నందన వనమున నారదుడు, దేవేంద్రుడు, అప్సరస స్త్రీలు సమావేశమైన సమయము నందు జరిగిన వృత్తాంతమును జెప్పెదను. సావదానుడవై వినుము. ఒకసారి నందన వనమున నారదుడు అప్సర స్త్రీల మధ్య యుండి యప్సర స్త్రీ ముఖాసక్త లోచనుడై యున్న దేవరాజగు ఇంద్రుని చూచెను. శచీ భర్తయగు దేవేంద్రుడు మహర్షి శ్రేష్టుడగు నారదుని చూసినంతనే తన ఆసనము నుండి దిగ్గున లేచెను. అత్యంతాదరముతో తన ఆసన మిచ్చెను. ఇంద్రుడు లేచి తన ఆసనమిచ్చి గౌరవించుట చూసిన యా దేవాంగనలు గూడ వందనములు చేసిరి. మరియు వినయ విధేయతలు గలవారై తలలు వంచుకొని నిలిచి యుండిరి.
తాభి రభ్యర్చిత స్సో థ, ఉపవిష్టే శతక్రతౌ
యథార్హం కృత సంభాషాః కతాశ్చక్రే మనోరమాః
తతః కతాంతరే శక్రః తమువాచమహామునిమ్
ఆ స్త్రీలచే నిట్లభ్యర్చితుడైన యనంతరము శత క్రతువులు చేసిన ఇంద్రుడు గూడ గూర్చొనిన పిమ్మట, నారదుడప్పుడు యధా యోగ్యముగా పరస్పరము మనోహరములగు సంభాషణా విశేషములతో కాలక్షేపము జరిపెను. ఇట్లన్యోన్య సంభాషణలు జరిగెను. అనంతరము ప్రసంగా మధ్యమమున ఇంద్రుడు నారదునితో నిట్లనియె.
ఇంద్రుడు:
దేహ్యాజ్ఞాం నృత్యతా మాసాం తవ యాభిమతేతి వై
రంభా వా కర్కశా వాథ, ఊర్వశ్యథ తిలోత్తమా
ఘ్రుతాచీ మేనకా వాపి యత్ర వా భవతో రుచిః
ఏతచ్చృత్వా ద్విజశ్రేష్టో, వాచం శక్రస్య నారదః
విచింత్యా ప్సరసః ప్రాహ,వినయా వనతాః స్తితాః
యుష్మాకమిహ సర్వాసాం రూపౌదార్య గుణాదికమ్
ఆత్మానాం మన్యతే యాతు, సా నృత్యతు మమాగ్రతః
గుణరూపవిహినాయా, స్సిద్ది ర్నాట్యస్య నాస్తి వై
చార్వాదిష్టానవ న్నృత్యంనృత్య మాన్య ద్విడంబనమ్
ఇంద్రుడు:
నారదా! ఈ అప్సరసలలో తమకు నచ్చిన దానిని నృత్యము చేయ వలసినదిగా ఆజ్ఞను యిమ్ము. రంభ, కర్కశ, ఊర్వశి, తిలోత్తమ, ఘ్రుతాచి, మేనక వీరిలో తమ అభీష్టము ననుసరించి యాజ్ఞ యివ్వ గోరెదను. ద్విజ శ్రేష్టుడగు నారదుడు దేవేంద్రుని యీ మాట విని కొంచ మాలోచించి వినయా వనతులై నిల్చోని యున్న యా స్త్రీలను జూచి ఇట్లనెను. అచ్చరలారా! మీలో రూపౌదార్య గుణములచే నదికులమని తలచినవారు నా ముందట నృత్యము జేయుదురు గాక. గుణరూప విహీనురాలికి నాట్య సిద్ది లేదు. హావ, భావ, కటాక్ష, విక్షేపాది యుక్త నృత్యమే నృత్య మనిపించు కొనును. అట్లు లేని నృత్యము వ్యర్థము. (ఆడంబరము).
మార్కండేయుడు:
తద్వాక్య సమకాలం చ, ఏకై కా స్తా నతా స్తతః
అహం గుణాధికా న త్వం న త్వం చాన్యాబ్రవీదిదమ్
తాసాం సంభ్రమ మాలోక్య,భగవాన్ పాక శాసనః
పృచ్చతాం మునిరిత్యాహ,వక్తా యాం వో గుణాదికామ్
శక్రచ్చందాను యాతాభిః, వృష్టస్తాభిస్స నారదః
ప్రోవాచ యత్ తదా వాక్యం జైమినే తన్నిభోద మే
తపస్యంతం నగేంద్రస్థం, యావత్ క్షోభయతే బలాత్
దుర్వాసనం మునిశ్రేష్టం, తాం వో మన్యే గుణాధికామ్
తస్య తద్వచనం శ్రుత్వా, సర్వా వేపిత కంధరాః
అశక్య మేత దస్మాక, మితి తాశ్చక్రిరే కథాః
తత్రాప్సరా వపుర్నామ, మునిక్షోభాణ గర్వితా
ప్రత్యువాచా నుయాస్యామి, యత్రా సౌ సంస్థితో మునిః
ఆద్య తం దేహయంతారం, ప్రయుక్తేంద్రియ వాజినమ్
సమర శస్త్ర గళ ద్రశ్మిం, కరిష్యామి కుసారథిం
బ్రహ్మా జనార్ధనో వాపి యది వా నీలలోహితః
తమప్యద్య కరిష్యామి కామ బాణ క్షతాంతరమ్
ఇత్యుక్త్వా ప్రజగామా థ ప్రాలేయాద్రిం వపుస్తదా
మునే స్తపః ప్రభావేణ, ప్రశాంత శ్వాపదాశ్రమమ్
మార్కండేయుడు:
ఇట్లు నారదుడను చున్న సమయముననే వారు రూప గుణాదులలో నేనెక్కువ నీవు కాదని పరస్పరము వాదించు కొన సాగిరి. భగవానుడగు దేవేంద్రుడు వారిట్లు వాదించు కొనుట గాంచి, మీరు నారదుని యడుగుడు. నారదుడు మీలో రూప గుణాధికు లెవరో యామెను జెప్పును. జైమినీ! అప్పుడా యచ్చరలు దేవేంద్రుని అనుమతిని నారదుని యడిగిరి. అట్లడిగిన వారిని జూచి యేమనెనో జెప్పెద వినుము. దేవాంగనలారా! ఒక పర్వతము నందు దుర్వాస మహర్షి తపస్సు జేయు చున్నాడు. ఆయన నెవరు మోహింప జేయ గలరో, ఆమె గుణాదికురాలిగా నిర్ణయము. ఆ నారదుని యా మాటలు విని యా స్త్రీ లందరూ వణక సాగిరి.ఈ కార్యము అశక్యమని జెప్పుకొను చుండిరి. అప్పుడు వారలలో యనేక మహర్షుల తపోభంగము జేసిన గర్వముతో, ‘వపువు’ అను నామె నేను దుర్వాసుడున్న చోటికి వెళ్లి యాతని తపోభంగము జేయుదుననియే. నేనిప్పుడే కామబాణ ప్రహారముచే మనస్సనే పగ్గమును చేదించి, ఇంద్రియములనే గుఱ్ఱములను యధేచ్చగా విహరించు నట్లు జేసెదను. దేహరూప రథమునకు, బుద్ధియను సారథిని లేకుండ జేసెదను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనైనా ఇప్పుడు నేను నిస్సందేహముగా కామబాణ పీడితుల జేసెదను. ఇట్లు పలికి యనంతరమా వపువు ముని తపః ప్రభావముచే శ్వాపదాశ్రమము గల హిమాలయమునకు బోయెను.
సా పుంస్కోకిల మాదుర్యా యత్రాస్తే స మహామునిః
క్రోశమాత్రం స్తితా తస్మా దగాయత వరాప్సరాః
తద్గీతధ్వని మా కర్ణ్య మునిర్విస్మిత మానసః
జగామ తత్ర యత్రాస్తే సా బాలా రుచిరాననా
తాం దృష్ట్వా చారుసర్వాంగీం మునిస్సం స్తభ్య మానసమ్
క్షోభణాయా గతాం జ్ఞాత్వా కోపామర్శ సమన్వితః
ఉవాచేదం తతో వాక్యం మహర్షిత్వాం మహాతపాః
యస్మాద్దుఃఖార్జిత స్యేహ తపసో విఘ్న కారణాత్
ఆగతాసి మదోన్మత్తేః మమ దుఃఖాయ ఖేచరిః
తస్మాత్సు పర్ణ గోత్రే త్వం మత్ క్రోధకలుషీకృతా
జన్మ ప్రాప్యసి దుష్ప్రజ్ఞే యావద్వర్షాణి షోడశ
నిజరూపం పరిత్యజ్య పక్షినీ రూపధారిణీ
చత్వార స్తే చ తనయా జనిష్యంత్యధమాప్సరః
అప్రాప్య తేషు చ ప్రీతిం శస్త్ర పూతా పునర్ది వి
వాసమాప్యసి వక్తవ్యం నోత్తరం తే కథంచన
ఇతి వచన మసహ్యం కోపసంరక్త దృష్టిః
చలకరవలయాం తాం మానినీం శ్రావయిత్వా
తరాల తర తరంగాం గాం పరిత్యజ్య విప్రః
ప్రథిత గుణ గణౌఘాం సంప్రయాతః ఖగంగామ్
అప్సర శ్రేష్టురాలగు వపువు దుర్వాసుని ఆశ్రమమునకు క్రోశేడు దూరము నుండి పుంస్కోకిల మాదుర్యముతో పాడ సాగెను. మునివరుడగు దుర్వాసుడు ఆ గానము విని విస్మయము జెందెను. కోకిల కంఠము, మనోహర ముఖ సౌందర్యము గలదియునగు ఆమె ఉన్న చోటికి బోయెను. ముని సర్వాంగ సుందరియగు నామెను గాంచి, తన తపో భంగమునకు వచ్చినదిగా తెలిసికొని పట్టరాని కోపము గలవా డయ్యెను. అనంతరము ఆ మహా తపస్వియగు దుర్వాసుడామెతో నిట్లనియె: ఓసీ ఖేచరీ! మదోన్మత్తురాలా! దుఃఖార్జితమగు నా యీతపస్సును విఘ్నము జేయుటకు నాకు కష్టము కలిగించుటకు వచ్చితివి. దుష్టబుద్ది గలదానా! మత్ క్రోధ కలుషీక్రుతురాలవై పదునారు సంవత్సర పర్యంతము గరుత్మంతుని వంశములో జన్మ బొందెదవు గాక. అథమాప్సరా! నీ నిజ రూపము వదిలి పక్షి రూప దారిణివై నల్వురు పుత్రులను బడసెదవు గాక. నీవు పుత్ర ప్రేమను పొందకనే బాణముచే కొట్టబడి పవిత్రురాలవై తిరిగి స్వర్గమునకు పోయెదవుగాక. మారు మాటాడక పొమ్ము. ఇట్లు బ్రాహ్మణ శ్రేష్టుడగు దుర్వాస మహర్షి క్రోధముచే ఎర్రబడిన నేత్రములతో చలించు చున్న (చంచలములు) (మనోరమ్యములు) కర కంకణములు ధరించి యున్న వపువును గూర్చి సహించ రాని ఇట్టి శాపమును వినిపించి భూలోకమును వదిలి, తరళ తర తరంగ విలసితము, ప్రథిత గుణ గనౌఘమునగు ఆకాశ గంగా తీరమునకు బోయెను.
Summary of chapter 1 of the Mārkandeya Mahā Purana is as follows:
In the sacred hermitage of the revered Maharshi Mārkaṇḍeya, the devout disciple Jaimini approaches with deep humility to resolve four profound doubts concerning the epic Bharata war. Seeking to comprehend why Supreme Bhagavān Vāsudeva descended into a human body, how the young sons of Draupadī were slain in sleep without marriage, why Balarāma underwent pilgrimage to expiate the death of Sūta, and how Draupadī became the wedded spouse of the five Pāṇḍavas, Jaimini seeks divine illumination. Mārkaṇḍeya, bound by his holy Vedic vows, gently directs Jaimini to four wise, celestial birds dwelling in the Vindhya mountains who possess flawless memory of the sacred scriptures.