మార్కండేయ మహా పురాణము
85 - రక్తబీజ వధ
ఋషి:
చండే చ నిహతే దైత్యే ముండే చ వినిపాతితే బహులేషు చ సైన్యేషు క్షయితే ష్వసురేశ్వరః తతః కోప పరాధీన చేతాః శుంభః ప్రతాపవాన్ ఉద్యోగం సర్వ సైన్యానాం దైత్యానా మాదిదేశ హ అద్య సర్వబలై ర్దైత్యాః షడశీతి రుదాయుధాః కంబూనాం చతురాశీతి రని ర్నాంతు స్వబలై ర్వృతాః కోటివీర్యాణి పంచాశ దసురాణాం కులాని వై శతం కులాని ధూమ్రాణాం నిర్గచ్చంతు మమాజ్ఞయా
ఋషి:
చండ ముండాసురులు చని పోవుటయు, సమస్త సైన్యము నాశన మగుటయు తెలిసిన పిమ్మట ప్రతాపవంతుడు, రాక్షస రాజగు శుంభుడు అత్యంత క్రోధము కలవాడై సమస్త రాక్షస సైన్యములను యుద్దము చేయుటకు ఆదేశించెను. ఇప్పుడు అన్ని విధములైన ఎనుబది ఆరు వేల “ఉదాయుధులు” మరియు “కంబు” లను పేరు గల ఎనుబది నాలుగు వేల దైత్యులు బయలు వెడలుదురు గాక. “కోటి వీర్యులు” అను పేరు గల యాబది కులముల రాక్షసులు “ధూమ్ర వంశ” జాతులగు నూరు కుల మూలా రాక్షస గణములు నా ఆజ్ఞ ప్రకారము యుద్ధమునకు నడుపుడు.
కాలకా దౌర్హ్రుదా మౌర్యాః కాలకేయా స్తథాసురాః యుద్ధాయ సజ్జా నిర్యాంతు ఆజ్ఞయా త్వరితా మమ ఇత్యాజ్ఞాప్యాసురపతిః శుంభో భైరవ శాసనః నిర్జగామ మహాసైన్య సహస్రై ర్భహుభి ర్వృతః ఆయాంతం చండికా దృష్ట్వా తత్సైన్య మతిభీషణమ్ జ్యాస్వనైః పూరయామాస ధరణీ గగనాంతరమ్ స చ సింహో మహానాద మతీవ కృతవా న్నృపః ఘంటాస్వనేన తన్నాద మంబికా చాత్యబృంహయత్
కాలకులు, మౌర్యులు, కాలకేయులు మొదలగు రాక్షస గణములు శీఘ్రముగా నా ఆజ్ఞచే యుద్ధమునకు సంసిద్ధులై వెడలుదురు గాక. భీకరమైన శాసనము గలవాడు, అసుర పతియు నగు శుంభుడు ఈ ప్రకారము ఆజ్ఞ యిచ్చి వేల కొలది మహా సేనలను వెంట బెట్టుకొని యుద్ధమునకు వెడలెను. చండికా దేవి అత్యంత భయంకర మైన ఆ సేనా సమూహము వచ్చు చుండుటను చూచి ధనుష్టంకారము చేసెను. ఆ ధ్వని భూమి, ఆకాశము అంతయు నిండెను. రాజా! పిమ్మట దేవీ వాహనమగు సింహము భయంకరమగు మహా నాదము చేసెను. ఆ సమయమున అంబికా దేవి తన ఘంటా నాదముతో సింహ నాదమును ఇనుమడింప చేసెను.
ధనుర్జ్యా సింహ ఘంటానాం నాదాపూరిత దిజ్ముఖా నినాదైర్భీషణైః కాలీజిగ్యే విస్తారితాననా తన్నినాడా ముపశ్రుత్య దైత్య సైన్యై శ్చతుర్దిశమ్ దేవీ సింహ స్తదా కాళీ శరౌఘైః పరివారితాః ఏతస్మి న్నంతరే భూపః వినాశాయ సురద్విషామ్ భవాయామర సింహానా మతివీర్య బలాన్వితా బ్రహ్మేశ గుహ విష్ణూనాం తథేంద్రస్య చ శక్తయః శరీరేభ్యో వినిష్క్రమ్య తద్రూపై శ్చండికాం యయుః యస్య దేవస్య యద్రూపం యథా భూషణ వాహనమ్ తద్వదేవ హి తచ్చక్తి రసురా న్యోద్దు మాయయౌ
దేవి యొక్క ధనుష్టంకార ఘంటా నాదముల చేతను, సింహ నాదముల చేతను దిక్కు లన్నియు పిక్కటిల్లెను. మరియు నా కాళికా దేవి తన నోరు తెరచి అత్యంత భయంకర నినాదములతో జయ జయ శబ్దములను చేయసాగెను. ఆ శబ్దము వినిన దైత్య సేనలు క్రోధముతో చండికా దేవి మీదకు, కాళికా దేవి వైపుకు సింహము దగ్గరకు నాలుగు వైపులా చుట్టు ముట్టిరి. రాజా! ఈ సమయమున అసుర నాశనము చేయదలచి దేవతలకు క్షేమము చేయ సంకల్పించిన యా దేవి మహావీర్య బల సమన్వితురాలై యుండెను. ఆ సమయ మందు బ్రహ్మ, శివ, కుమార స్వామి, విష్ణు, దేవేంద్ర దేవతల శరీరముల నుండి వేరు వేరుగా శక్తులు ఉత్పన్న మయ్యెను. ఆ శక్తులు వారి వారి దేవతా రూపములు ధరించి చండికా దేవి యొద్దకు వచ్చెను. ఏ యే దేవతలకు యే యే రూపములు, అలంకారములు, వాహనములు ఉండెనో,ఆ దేవతల శరీరముల నుండి జన్మించిన శక్తులు గూడ అట్టి రూప అలంకార, వాహనములతో రాక్షసుల మీదకి యుద్ధమునకు వెడలెను.
హంస యుక్త విమానస్థా సాక్షసూత్ర కమండలుః ఆయతా బ్రహ్మణః శక్తి ర్బ్రహ్మాణీ సాభిధీయతే మహేశ్వరీ వృషారూఢా త్రిసూల వరధారిణీ మహా హీవలయా ప్రాప్తా చంద్ర లేఖా విభూషణా కౌమారీ శక్తి హస్తా చమయూర వర వాహనా యోద్దు మభ్యాయయౌ దైత్యా నంబికా గుహరూపిణీ తథైవ వైష్ణవీ శక్తి ర్గరుడోపరి సంస్థితాః శంఖ చక్ర గదాశార్జ ఖడ్గ హస్తాభ్యుపాయయౌ జజ్ఞే వారాహ మతులం రూపం యా బిభ్రతే హరేః శక్తిః సా ప్యాయయౌ తత్ర వారాహీం బిభత్రీ తనుమ్
హంస యుక్త విమానమున చేతిలో అక్షర మాల, కమండలము ధరించి బ్రహ్మ శక్తి వచ్చెను. “బ్రహ్మాణీ” యను పేరుతో ఆమె ప్రసిద్ధు రాలయ్యెను. వృషభ వాహనా రూడయై త్రిశూలమును ధరించి చంద్ర రేఖచే శోభాయ మానయై సర్పములను, కంకణములుగా ధరించి శివశక్తి “మహేశ్వరి” యను పేరుతో వచ్చెను. శక్తియను ఆయుధమును ధరించి గుహ రూపిణియగు “కౌమారీ”యను శక్తి సుందర మగు నెమలి నెక్కి యుద్ధము చేయుటకై వచ్చెను. అటులనే గరుడా వాహనారూడయై “వైష్ణవీ” శక్తి శంఖ, చక్ర గదా, ఖడ్గ, శార్జములను ధరించి వచ్చెను. యజ్ఞ వారాహ రూపమును ధరించిన వాడును, భగవంతుడు నగు విష్ణు మూర్తి యొక్క శక్తి వరాహ రూపమును ధరించి “వారాహీ”యను నామముతో వచ్చెను. (బ్రాహ్మీ, మహేశ్వరీ, వైష్ణవీ, కౌమారీ, వారాహీ, ఐంద్రీ , చాముండీ, వీరు సప్త మాతృకా గణములని అందురు.)
నారసింహీ నృసింహస్య బిభ్రతీ సదృశం వపుః ప్రాప్తా తత్ర సటాక్షేప క్షిప్తనక్షత్ర సంహతిః వజ్రహస్తా తథై వైంద్రీ గజరాజోపరి స్థితా సహస్ర నయనా ప్రాప్తా యథా శక్త స్తథైవ సా తతః పరివృత స్తాభి రీశానో దేవా శక్తిభిః హన్యంతా మసురాః శీఘ్రం మమప్రీత్యాహ చండికామ్ తతో దేవీ శరీరాత్త వినిష్క్రాంతా భీషణా చండికా శక్తి రాత్యుగ్రా శివా శత నినాదినీ సా చాహ ధూమ్ర జటిల మీశాన మపరాజితా దూతత్వం గచ్చ భగవ న్పార్శ్వం శుంభ నిశుంభయోః
“నారశింహీ” శక్తి నృసింహ రూపమును ధరించి వచ్చెను. ఆమె జూలును విదిల్చి నప్పుడు నక్షత్ర పంక్తులు ఇటునటు చలించు చుండెను. గజ రాజును అధిష్టించి సహస్ర నేత్రములతో “ఐంద్రీ” శక్తి హస్త మందు వజ్రమును ధరించి వచ్చెను. ఆమె ఇంద్రుని వలెనె యుండెను. అనంతరము ఆ సమస్త దేవతా శక్తులను వెంట బెట్టుకొని రుద్రుడు వచ్చి చండికా దేవితో “నా ప్రీతి కొరకు రాక్షసులను శీఘ్రముగా చంపుము.” అని అనెను. పిమ్మట దేవి శరీరము నుండి అత్యంత క్రూరము, అత్యంత భయంకరము, శివా శత నినాదములతో సమానమైన నాదము చేయు చున్నదియు నగు చండికా శక్తి యుద్భవించెను. అపరాజిత యగు నా చండికా దేవి ధూమ్ర వర్ణములగు జడలు గలదియై శంకరునితో, భగవానుడగు మహేశ్వరా! నీవు శుంభ నిశుంభుల సమీపమునకు దూతగా పొమ్ము.
బ్రూహి శుంభం నిశుంభం చ దానవా వతిగర్వితౌ యే చాన్యే దానవా స్తత్ర యుద్ధాయ సముపస్థితాః త్రైలోక్య మింద్రో లభతాం దేవాః సంతు హవిర్భుజః యూయం ప్రయాత పాతాలం యది జీవితు మిచ్చుధ బలావలేపా దధచే ద్భవంతో యుద్ధ కాంక్షిణః తదాగచ్చత తృప్యంతు మచ్చివాః పిశితేన వః యతో నియుక్తో దూత్యేన తయా దేవ్యా శివః స్వయమ్ శివదూతీతి లోకేస్మిం స్తతః సా ఖ్యాతి మాగతా తేపి శ్రుత్వా వచో దేవ్యాః శర్వాఖ్యాతం మహాసురాః అమర్షాపూరితా జగ్ము ర్యత కాత్యాయనీ స్థితా
అత్యంత గర్వితులగు శుంభ నిశుంభులకు యుద్ధము చేయుటకు అక్కడకు వచ్చిన ఇతరులగు దానవులకు ఇట్లు చెప్పుము. దానవులారా! దేవేంద్రుడు త్రైలోక్య రాజ్యమును పొంద వలెను. మీరందరు బ్రతుక దలచినచో పాతాళమునకు పోవలెను. బల గర్వముచే యుద్ధము చేయ దలచినచో రండు. నా శివ గణములు మీ రక్త పానముచే తృప్తిని పొందు గాక. ఇట్లు దేవి స్వయముగా శివుని దూత కార్య మందు నియోగించుటచే, ఈ లోకమున “శివ దూతీ” నామమున ప్రఖ్యాతిని పొందెను. ఇట్లు శంకరునిచే దేవి చెప్పిన మాటలను విని, యా మహా దానవులు క్రోధ పూరితులై దేవి యున్న చోటికి వచ్చిరి.
తత ప్రథమ మేవాగ్రే శర శక్త్ర్యుష్టి వృష్టిభిః వవర్షు రుద్ధతామర్షా స్తం దేవీ మమరారయః సా చ తత్ప్రహితా న్బాణా ఞ్ఛూల శక్తి పరశ్వధాన్ చిచ్చేద లీలయా ధ్మాత ధను ర్ముక్తై ర్మహేషుభిః తస్యాగ్రత స్తథా కాళీ శూల పాత విదారితాన్ ఖట్వాంగ పోథితాం శ్చారీ న్కుర్వటీ వ్యచర త్తతః కమండలు జలాక్షేప హత వీర్యాన్ హతౌజసః బ్రహ్మాణీ చాకరో చ్చత్రూ నయేన యేన సమ ధావతి మహేశ్వరీ త్రిశూలేన తథా చక్రేణ వైష్ణవీ దైత్యాన్ జఘాన కౌమారీ తథా శక్త్యాతికోపనా ఐంద్రీ కులిశ పాతేన శతశో దైత్య దానవాః పేతు ర్విదారితః పృథ్వ్యాం రుదిరౌఘ ప్రవర్షిణః
అనంతరము అత్యంత క్రోధితు లైన ఆ అసుర బృందము ప్రథమముగా దేవి ఎదుట శర, శక్తి, ఋష్టి ఇత్యాదులను వర్షింప సాగెను. ఆ అసురు లందరు వేయుచున్న బాణములు, శూలములు, చక్రములు, గొడ్డళ్ళు మొదలగు వాటిని చండికా దేవి ధనుస్సు ఎక్కు పెట్టి వదులు చున్న పెద్ద పెద్ద బాణములతో లీలా పూర్వకముగా త్రుంచి వేసెను. అదే సమయ మందు చండికా దేవి సమ్ముఖమున కాళి ఎందరెందరినో రాక్షసులను శూలములతో చీల్చు చుండెను. మరికొందరిని ముసలముచే బాదుచూ విహరించ సాగెను. శత్రు గణాలు ఏ వైపుగా పరుగెత్త సాగెనో, ఆ వైపున బ్రహ్మాణీ శక్తి వారిపై కమండలము నందలి జలమును జల్లి వారిని హత వీర్యులుగా, తేజో హీనులుగా చేయ సాగెను. మహేశ్వరీ శక్తి త్రిశూలముచే, వైష్ణవీ శక్తి చక్రముచే, దైత్యులను సంహరింప సాగిరి. అతి కృద్దురాలైన కౌమారీ శక్తి శక్తిచే అనేక మంది దైత్యులను సంహరించెను. ఐంద్రీ యొక్క వజ్ర ఘాతముచే వందల కొలది దైత్య దానవులు నెత్తురు కక్కుచు నెల కొరుగు చుండిరి.
తుండ ప్రహార విధ్వస్తా దంష్ట్రా గ్ర క్షత వక్షసః వారాహా మూర్త్యా న్యపతం శ్చక్రేణ చ విదారితాః నఖైర్విదారితాం శ్చాన్యా న్భక్షయంతీ మహాసురాన్ నారసింహీ చచారాజౌ నాదాపూర్ణ దిగంతరా చండాట్టహాసై రసురాః శివదూత్యభి దూషితాః పేతుః పృథివ్యాం పతితాం స్తాం శ్చఖాదాథ సా తదా ఇతి మాతృగణం కృద్ధం మర్ధయంతం మహాసురాన్ దృష్ట్వా భ్యూపాయై ర్వివిథై ర్నేశు ర్దేవారి సైనికాః పలాయన పరా న్దృష్ట్వా దైత్యా మాతృగణార్దితాన్ యోద్దు మభ్యాయయౌ కృద్ధో రక్తబీజో మహాసురః రక్తబిందు ర్యదా భూమౌ పత త్యస్య శరీరతః సముత్పతతి మేదిన్యా స్తత్ప్రమాణో మహాసురః
వరాహమూర్తి శక్తి యొక్క తుండా ఘాతముచే విధ్వంసులై, చక్రా ఘాతముచే చీల్చ బడిన వారై, కోరల యోక్క అగ్ర భాగముచే గుండెలు పగిలిన వారై దైత్య గణాలు కూల సాగిరి. నారసింహీ శక్తి భూమ్యాకాశములు నిండు నట్లుగా గర్జించుచు గోళ్లచే చీల్చి, అసురులను భక్షించుచు యుద్ధ క్షేత్రమున విహరించ సాగెను. శివదూతి చేసిన భీకర అట్టహాసముచే భీతావహులై అసుర గణాలు పృథ్వి యందు పడ సాగిరి. అట్లు పడుచున్న అసురులను శివదూతి భక్షించు చుండెను. మాతృ గణాలు ఈ విధముగా క్రోధ పూరితులై అనేక ఉపాయములచే రాక్షసులను మర్దించు చుండిరి. ఇది చూచిన అసుర సేనలు పారిపోవ మొదలిడిరి. మాతృ గణాలచే పీడితులై దైత్య గణాలు పారిపోవు చుండిరి. ఇది చూసి రక్త బీజుడను మహాసురుడు కృద్దుడై యుద్దము చేయుటకు వచ్చెను. ఈ రక్త బీజుడను రాక్షసుని శరీరము నుండి ఒక రక్త బిందువు భూమి మీద పడిన వెంటనే భూమి నుండి అతనితో సమానుడగు ఒక రాక్షసుడు ఉత్పన్నమగు చుండెను.
యుయుధే స గదాపాణి రింద్ర శక్త్యా మహాసురః తత స్చైం ద్రీ స్వవజ్రేణ రక్తబీజ మతాడయత్ కులిశేనా హతస్యాశు బహు సుస్రావ శోణితమ్ సముత్తస్థు స్తతో యోదా స్తద్రూపా స్తత్పరా క్రమాః యావంతః పతితా స్తస్య శరీరా ద్రక్త బిందవః తావంతః పురుషా జాతా స్త ద్వీర్య బల విక్రమాః తే చాపి యుయధు స్తత్ర పురుషా రక్త సమ్భవాః సమం మాతృభి రత్యుగ్రం శస్త్ర పాతాతిభీషణమ్ పునశ్చ వజ్ర పాతేన క్షత మస్య శిరో యదా వవాహ రక్తం పురుషా స్తతో జాతాః సహస్రశః
అట్టి రాక్షసుడగు రక్తబీజుడు చేతి యందు గదను ధరించి ఇంద్ర శక్తి యొక్క సహాయముచే యుద్ధము చేయ సాగెను. అపుడు ఐంద్రి తన వజ్రముచే రక్తబీజుని కొట్టెను. వజ్ర పీడితుడైన రక్త బీజుడి శరీరము నుండి పడిన రుధిరముచే అతనితో సమానులగు పరాక్రమ శాలురైన అనేకులగు యోధులు ఉత్పన్నమైరి. నెత్తురు కారు చుండుటచే అతని శరీరము నుండి ఎన్ని రుధిర బిందువులు పడు చున్నవో, అంత మంది పురుషులు ఉత్పన్నమైరి. బల, వీర్య పరాక్రమముల యందు రక్తబీజుని వలె ఉండిరి. ఆ రక్త బిందువుల నుండి ఉత్పన్నమైన పురుషులు కూడా ఆ రణ క్షేత్రమున మాతృ గణాలతో ఉగ్ర శాస్త్రములు విడుచుచూ అతి భయంకరముగా యుద్ధము చేయ సాగిరి. తిరిగి ఎప్పుడు వజ్రముచే ఐంద్రి ఆ రాక్షసుని తల నరికెనో అప్పుడు దెబ్బ తగిలిన స్థానము నుండి రక్తము ప్రవహించ సాగెను. మరియు దాని నుండి వేల కొలది అసురులు ఉత్పన్నమైరి.
వైష్ణవీ సమరే చైనం చ కేణాభి జఘాన హ గదయా తాడయామాస ఐంద్రీ త మసురేశ్వరమ్ వైష్ణవీ చక్ర భిన్నస్య రుధిర స్తావ సమ్భవైః సహస్రశో జగద్వ్యాప్తం తత్ప్రమాణై ర్మహాసురైః శక్త్యా జఘాన కౌమారీ వారాహీ చ తథాసినా మహేశ్వరీ త్రిశూలేన రక్తబీజం మహాసురమ్ స చాపి గదయా దైత్యః సర్వా ఏవాహన త్పృథక్ మాతౄః కోప సమావిష్టో రక్తబీజో మహాసురః తస్యాహతస్య బహుధా శక్తి శూలాదిభి ర్భువి పపాత యో వై రక్తౌఘ స్తేనాసన్ శతశోసురాః
వైష్ణవీ శక్తి యుద్దమున అతనిని చక్రముతో నరికెను. ఐందరి గదచే ఆ అసురేశ్వరుని గొట్టెను. వైష్ణవీ యొక్క చక్రముచే నరకబడిన ఆ అసురుని యొక్క రుధిరము ప్రవహించుటచే అతని వలెనే యున్న వారై ఉత్పన్న మైన వేల కొలది గొప్ప గొప్ప రాక్షసులచే జగత్తు వ్యాపించెను. కౌమారి శక్తిచే, వారాహి ఖడ్గముచే, మహేశ్వరి త్రిశూలముచే మహాసురుడగు ఆ రక్త బీజుని కొట్ట సాగిరి. మరియు అసురుడగు ఆ రక్తబీజుడు కూడా కృద్ధుడై గదచే సమస్త మాతృ గణాలను వేరు వేరుగా కొట్ట సాగెను. శక్తి, శూలము మొదలగు నానా విధములగు అస్త్రములచే గాయ పడిన ఆ రక్తబీజుని శరీరము నుండి ఎంత రక్తము భూమిపై పడు చున్నదో, దాని నుండి వందల కొలది రాక్షసులు పుట్టు చుండిరి.
తైశ్చాసురా సృత్సంభూతై రసురైః సకలం జగత్ వ్యాప్త మాసీ త్తతో దేవా భయా మాజగ్ము రుత్తరమ్ తా న్విషణ్ణాన్ సురాన్ దృష్ట్వా చండికా ప్రాహ సత్వరా ఉవాచ కాళీం చాముండేః విస్తీర్ణం వదనం కురు మచ్చస్త్ర పాత సంభూతా న్రక్త బిందూ న్మహాసురాన్ రక్తబీజా త్ప్రతీచ్చ త్వం వక్త్రేణానేనా వేగినా భక్షయంతీ చర రణే తదుత్పన్నా న్మహాసురాన్ ఏవ మేష క్షయం దైత్యః క్షీణ రక్తో గమిష్యతి భక్ష్యమాణా స్త్వయా చోగ్రా నైవోత్పత్ప్యంతి చాపరే
ఆ అసురుని రక్తముచే ఉత్పన్నమైన రాక్షసులు విశ్వమంతా వ్యాపించిరి. అపుడు దేవతలు అత్యంత భీతా వహులైరి. అనంతరము అట్లు భయపడు చున్న దేవతలను చూచినదై చండిక వెంటనే కాళితో ఇట్లు పలికెను. ఓ చాముండీ! నీవు నీ నోటిని విస్తరింప జేయుము. నా శస్త్ర ఘాతముచే ఉత్పన్న మగుచున్న రక్త బిందువులచే ఉత్పన్న మగుచున్న రాక్షసులను నీవు నోటి లోనికి వేగముగా గ్రహింపుము. మరియు అట్లు ఉత్పన్నమైన రాక్షసులను భక్షించుచూ రణమున సంచరించు చుండుము. అట్లు చేయుటచే ఈ దైత్యుని రుధిరము క్షీణ మగును. అపుడు ఆతడు వినాశమును పొందును. ఎప్పుడైతే నీవు వారిని భక్షించుట ప్రారంభించుదువో అప్పుడు తిరిగి వారు పుట్టుట ఉండదు.
ఋషి:
ఇత్యుక్త్వా తాం తతో దేవీ శూలేనాభిజగామ తమ్ ముఖేన కాళీ జగృహే రక్తబీజస్య శోణితమ్
ఋషి:
ఇట్లు కాళితో చెప్పి చండికా దేవి త్రిశూలముచే ఆ రాక్షసుని గాయపరచెను. కాళి ఆ గాయ పడిన రక్తబీజుని రక్త బిందువులను నోటి లోనికి గ్రహింప సాగెను.
తతోసా వాజఘానాథ గదయా తత్ర చండికామ్ న చాస్యా వేదనాం చక్రే గదాపాతో ల్పికా మపి తస్యాహతస్య దేహాత్తు బహు సుస్రావ శోణితమ్ యత స్తతః స్వవక్రేణ చాముండా సంప్రతీచ్చతి ముఖే సముద్గతా యేస్యా రక్తపాతా న్మహాసురాః తాం చఖాదాద చాముణ్డా పపౌ తస్య చ శోణితమ్ దేవీ శూలేన చక్రేణ బాణై రసిభి రిష్టిభిః
జఘాన రక్తభీజం తం చాముండా పీత శోణితమ్
స పపాత మహీపృష్టే శస్త్ర సంహతితో హతః నీరక్తశ్చ మహీపాలః రక్త బీజో మహా సురః తత స్తే హర్ష మతుల మవాపు స్త్రిదశా నృపః తేషాం మాతృగణో మత్తో ననర్తాసృ జ్మదోద్దతః
అపుడు ఆ రక్తబీజాసురుడు రణ క్షేత్రమున గదచే దేవిని కొట్టెను. కాని ఆ గదా ఘాతము దేవిని అల్ప మాత్రమును కూడా వేదన కలుగ జేయలేక పోయెను. ఇపుడు గాయ పడిన ఆ అసురుని శరీరము నుండి ఏ రుధిరము పడు చున్నదో, దాని నంతయు చండిక నోటి లోనికి గ్రహించెను. చాముండికా దేవి ముఖము నుండి రక్తము జారి పడగానే ఏ రాక్షసులు ఉత్పన్న మైనారో వారందరినీ రుధిర సహితముగా గ్రహించసాగెను. చాముండి ఈ విధముగా రక్త బీజుని రుధిరమును పానము చేయగానే చండికా దేవి వారిని శూల, చక్ర, బాణ, ఖడ్గాదులచే చంపి వేసెను. అనంతరము ఓ మహీపాలా! మహాసురుడగు ఆ రక్తబీజుడు శస్త్ర సమూహములచే కొట్టబడి రుధిర హీనుడై భూమిపై పడి ప్రాణములను వదిలెను. ఓ రాజా! అనంతరము దేవతలు అమితమగు ఆనందమును పొందిరి. మాతృ గణాలు అసురుల రక్త పానముచే మత్తెక్కిన వారై నృత్యము చేయు చుండిరి.
Summary of chapter 85 of the Mārkandeya Mahā Purana is as follows:
In subsequent ages, when demonic brothers Śumbha and Niśumbha seized the divine shares of sacrifices and banished the devas to Earth, the devas assembled on the Himalayan peaks to recite the glorious Aparājitā Stuti. Responding to their devotion, Goddess Pārvatī shed Her dark sheath, manifesting as radiant Ambikā, while Her dark form became Goddess Kālikā. Seeing Her divine beauty, the demonic messengers Caṇḍa and Muṇḍa reported to Śumbha, who sent his envoy Sugrīva with an arrogant marriage proposal, which the Goddess firmly rejected by declaring Her solemn vow to wed only him who conquers Her in battle.