131 - దమ చరితము

మార్కండేయుడు:

స తాం లబ్ధ్వా తథా పత్నీం సుమనాం స మహామునే!

ప్రణమ్య స పితుః పాదౌ మాతుశ్చ క్షితిపాత్మజః

సా చ తౌ శ్వశురౌ సుభ్రూ ర్ననామ సుమనా తదా

తాభ్యాం తౌ చ తదా విప్ర! ఆశీర్భ రభినందితౌ.

మహోత్సవశ్చ సంజజ్ఞే నరిష్యంతస్య వైపురే

 కృతదారే చ సంప్రాప్తే దశార్ణాధిపతేః పురాత్.

సంబంధినం దశార్ణేశం జితాంశ్చ పృథివీశ్వరాన్

శృత్వా పుత్రేణ మముదే నరిష్యంతో మహీపతిః.

సోపి రేమేనయా మహారాజ సుతో దమః

 వరోచ్యానవ నోద్దేశే ప్రాసాద గిరిసానుషు.

మార్కండేయుడు:

ఓ మహామునీ! క్షితిపాల నందనుడగు దముడు “సుమన” అను కన్యను భార్యగా పొంది తిరిగి వచ్చి తల్లి దండ్రుల పాదములకు నమస్కరించెను. మఱియు ఆ “సుమన” కూడ అత్త మామలకు నమస్కరించెను. ఓ విప్రా! అప్పుడు వారును ఆ ఇద్దరినీ ఆశీర్వచనములచే అభినందించిరి. ఎప్పుడయుతే భార్యను పొందిన వాడై దముడు దశార్ణాధి పతి యొక్క పురము నుండి వచ్చెనో, అప్పుడు నరిష్యంతుడు పురములో గొప్ప మహోత్సవమును చేసెను. మహీపతి యగు నరిష్యంతుడు, దశార్ణేశ్వరుడు సంబంధమును,  మఱియు అనేక మంది రాజులను ఓడించు విషయములను పుత్రుని వలన విని అత్యంత సంతోషమును పొందెను. అటు పిమ్మట రాజ పుత్రుడగు దముడు విచిత్ర వన ప్రదేశములు, ప్రాసాదములు, పర్వతములు ఇత్యాది స్థానము లందు సుమనతో విహరించెను.

అథ కాలేన మహతా రామమాణా రామేన సా

అవాప గభై సుమనా దశార్దాధిప తేః సుతా

సోపి రాజా నరిష్యంతో భుక్తీభోగో మహీపతిః

 వయః పరిణతిం ప్రాప్య దమం రాజ్యేభిషిచ్య చ.

వనం జగామేంద్రసేనా పత్నీ చాస్య తపస్వినీ

 వానప్రస్థ విథానేన స తత్ర సమతిష్టత.

దాక్షిణాత్యః సుమర్వృత్తః సంక్రందనసుతో వనే

వపుష్మాన్స మృగార్హం తం యయా వల్పపదానుగః.

స తం దృష్వా నరిష్యంతం తాపసం మలపంకినమ్

ఇంద్రసేనాం చ తత్పత్నీం తపపాతిసుదుర్బలామ్.

ఈ విధముగా దమునితో విహరించుచూ కొంత కాలము గడచిన పిమ్మట దశార్ణ రాజు యొక్క పుత్రిక సుమన గర్భమును ధరించెను. సకల భోగముల ననుభవించిన వాడును. మహీపతి యగు నరిష్యంత మహారాజు వయరి పరిణతి (అనగా వృద్దావస్థను). చూచి దముని రాజ్యాభిషిక్తుని చేసి, తపస్వినియు దముని భార్యయు నగు ఇంద్రసేన గూడ భర్తతో బాటు వనమునకు బోయెను. రాజు అచట వాన ప్రస్థాశ్రమ విధానము ననుసరించి నివసింప సాగెను. ఒకనాడు దురాచారుడగు దాక్షిణాత్య రాజగు సంక్రందముని పుత్రుడు వపుష్మంతుడు కొద్ది మంది సహచరులతో ఆ వనములో మృగములను వేటాడుటకు వచ్చను. మల పంకిత శరీరుడు, అచట తపస్వియగు నరిష్యంతుని మఱియు అతని పత్నియు తపస్సుచే శుష్కించిన, అంగములు గలదియు నగు ఇంద్రసేనను చూచి ఇట్లు అడిగెను.

పప్రచ్ఛ కస్త్వం భో విప్రః క్షత్రియో వా వనే చరః

వానప్రస్థ మను ప్రాప్తో వైశ్యోవా మమ కధ్యతామ్.

తతో మౌనవ్రతీ భూపో న హి తస్యోత్తరం దదౌ

ఇంద్రసేనా చ తత్సర్వ మాచష్టాస్మై యథాతథమ్.

“మీరెవరు? బ్రాహ్మణులా? క్షత్రియులా? లేక వైశ్యులా? ఈ జాతి గలవారై మీరు వాన ప్రస్తము నవలంబించి  వనవాసు లైనారు? అది అంతయు చెప్పు” రాజు మౌన వ్రతుడగుటచే ఈ మాటలకు ప్రత్యుత్తర మివ్వ లేదు. కాని ఇంద్రసేన అతనితో వృత్తాంతము నంతయు యథా తథముగా చెప్పెను.

మార్కండేయుడు:

జ్ఞాత్వా తం చ నరిష్యంతం  వపుష్మా న్పితరం రిపోః

ప్రాప్తోసీతి  వదన్ జ్జటాను పరిగృహ్య చ.

హాహేతి చంద్ర సేనాయాం రుడంత్యాం భాష్పగద్గతమ్

చకర్ష కోపా త్ఖడ్గం చ వాక్యం చేద మువాచ హ.

నిర్జితః సమరే యేన యేన మే సుమనా హృతా

 దమస్య తస్య పితరం హనిష్యేవతు తం దమః.

మార్కండేయుడు:

అతనిని తన శత్రువు యొక్క తండ్రి నరిష్యంతునిగా తెలిసి కొని వపుష్మానుడు “దొరికితివి” అని పలుకుచూ క్రోధముచే ఆతని జటలు పట్టుకొనెను. అప్పుడు ఇంద్రసేన హాహా కారములు చేయుచూ, గాద్గదిక స్వరముచే దుఃఖింప సాగెను. ఆ సమయమున దుష్టుడగు నతడు ఒరనుండి కత్తిని బయటకు లాగి ఇట్లనెను “ఎవడు నన్ను యుద్దమున ఓడించెనో, ఎవడు నా సుమనను హరించి తీసుకు పోయెనో, అట్టి దముని యొక్క తండ్రిని ఇప్పుడు వధించెదను.”

యేనాఖిల మహీపాల పుత్రాః కన్యార్ధ మాగతాః

అవధూతా హనిష్యేహం పితరం తస్య దుర్మతేః.

యౌవనాస్త్ర స్వరూపేషు మదో యస్య దురాత్మానః

స దామో వారయత్వేష హన్మి తస్యా రిపో ర్గురుమ్.

కన్యార్ధమున వచ్చి యున్న రాజపుత్రు లందరినీ ఎవడు అవమానించెనో, ఆ దుర్మతి యగు దముని తండ్రిని నేడు నేను వధించెదను. ఏ దుర్మాత్ముడు స్వభావము చేతనే రిపులనణచు వాడై యుండెనో, నేడు అట్టి శత్రువు యొక్క తండ్రిని వధించు చున్నాను. దముడు వచ్చి రక్షించు గాక.”

మార్కండేయుడు:

ఇత్యుక్త్వా స దురాచారో వపుష్మా నవనీపతిః

క్రంద న్త్యా మింద్రసేనాయాం శిర శ్చిచ్చేద  తస్య చ.

తతో దిగ్దిజ్ మునిజనా అన్యే చ వనవాసినః

 తమూచః స చ తం హత్వా జగామ స్వపురం వనాత్.

గతే తస్మి న్వినిశ్వస్య సేంద్రసేనా వపుష్మతి

ప్రేషయామాస పుత్రస్య సమీపం శూద్ర తాపసమ్.

మార్కండేయుడు:

అని పలికి దురాత్ముడగు వపుష్మానుడు రోధించు చున్న ఇంద్రసేన యెదుటనే నరిష్యంతుని తల నరికెను. అప్పుడు ముని గణాలు మఱియు వన వాసులు ఆతనిని ధిక్కరింప సాగిరి. పిమ్మట అతను కూడా నరిష్యంతుని ఆ స్థితిని చూచి వనము నుండి తన పురమునకు బోయెను. వపుష్మానుడు వెళ్ళిన పిమ్మట ఇంద్రసేన దీర్ఘముగా నిట్టూర్చి ఒక శూద్ర తాపసుని పుత్రుని వద్దకు పంపెను.

గచ్చేథా ఆశు మే పుత్రం దమం బ్రూహి వచో మమ

అభిజ్ఞో హ్యాసి మద్భర్తృ వృత్తాంతం ప్రోచ్యతేత్ర కిమ్.

తథాపి వాచ్యః పుత్రో మే యద్భ్రవీ మ్యతిదుఃఖితా

 లంఘనా మీదృశీం ప్రాప్తాం విలోక్యైతాం మహీపతేః.

మద్భార్త్రాధికృతో రాజా చతుర్ణాం పరిపాలకః

త్వ మాశ్రమాణాం కిం యుక్తం తాపసా న్యన్న రక్షసి.

భర్తా మమ నరిష్యంత స్తాపస స్తపసి స్థితః

విలపన్త్యా స్తథో నాథా యథా నాసి తథా త్వయి.

ఆకృష్య కేశేషు బలా దపరాథం వినా తతః

 హతో వపుష్మతా ఖ్యాతి మితి తే భూపతి ర్గతా.

అతనితో నిట్లు పలికెను. “నీవు వెంటనే వెళ్లి నా పుత్రుడగు దమునితో మా వృత్తాంతమును చెప్పుము. నీవు నా స్వామి యొక్క వృత్తాంతము సమస్తమును ఎరుగుదువు. అయినను మహీపతికి ఉపస్థిత మైన ఈ అవమానమును చూచుటచే అత్యంత దుఃఖమును పొందిన నేను చెప్పిన దాని నంతయు నా పుత్రునితో చెప్పుము. “నీవు రాజువు నీవు నాలుగు దిక్కుల ఆశ్రమాలను పాలించు భర్తవుగా నియమింప బడినావు. కాని నీవు అట్టి తాపసులను రక్షించుట లేదు. ఇది నీకు ఉచితమా? నా స్వామి యగు నరిష్యంతుడు తపస్వియై తప మాచరించు చచుండెను. నీవు రక్షకుడుగా నున్నను అనాథ వలె అపరాథ మేమియు లేకయే అతని కేశము లను లాగి విలపించు చుండగనే  వపుష్మాణుడు అతనిని చంపి వేసెను. నీవు రాజువై ఈ విధముగా ఖ్యాతి నార్జించితివి.”

ఏషం స్థితే త త్క్రియతాం యథా ధర్మో న లుప్యతి

తథా చ నైవ వక్తవ్యం మాతాహం తాపసీ యతః.

పితా వృద్ద స్తపస్వీ చ నాపరాధేన దూషితః

నిహతో యేన యత్తస్య కర్తవ్యం తద్విచింత్యతామ్.

సంతి తే మం తిణో వీరాః నర్వ శాస్త్రార్ద వేదినః!

తైః సమాలోచాయ్ యత్కార్య మేవంభూతే కురుష్వ తత్.

నాస్మాక మధికాలోత్ర తాపసానాం నరాధిప!

కురుష్యైతదిత్థం త్వ మేవం భూపతి భాషితమ్.

విదూరధన్య జనకో యవనేన యథా హతః

తధాయం తవ పుత్రస్య కులం తేన వినాశితమ్.

ఈ పరిస్థితిలో ఎట్టి దాని వలన ధర్మము లోపము కలుగ కుండునో, అట్టి కార్యమును చేయుము నేను తాపసిని. ఇంతకు మించి అధికముగా చెప్పుట నాకు ఉచితము గాదు. నీ తండ్రి ఒక వృద్దుడు, మీదు మిక్కిలి తపస్వి, మఱియు అతడెట్టి అపరాధ మును చేసిన వాడు కాదు. అట్టి స్థితి యందు ఎవడు అతనిని వధించెనో, ఇప్పుడు ఆతని విషయమున ఏది కర్తవ్యమో, అట్టి దాని గురించి యోచింపుము. సర్వ శాస్త్రములను తెలసిన వారు, మహా వీరులు నగు  మంత్రులు నీ వద్ద యున్నారు. వారితో ఆలోచించి ఈ పరిస్థితిలో ఏది కర్తవ్యమో, దానిని చేయుము. ఓ నరాధిపా! నీ తండ్రి యగు నరిష్యంత మహారాజు చనిపోవు సమయమున ఇట్లు పలికెను. “నేను తాపసుడను, యీతని విషయమున నాకేమియు అధికారము లేదు నీవే దీనికి ప్రతీకారము చేయుము.” విదూరథుని తండ్రి ఏ విధముగా యవరునిచే మృతి చెందెనో, అట్లే ఓ కుమారా! నీ తండ్రిని వధించి వపుష్మానుడు నీ కుల గౌరవమును నాశనము చేసినాడు.

జంభసాసురాజస్య పితా దష్టో భుజంగమైః

తేనాప్యఖిల పాతాల వాసినః పన్నగా హతాః.

పరాశరేణ పితరం శక్తిం తం రాక్షసాహతమ్.

శ్రుత్వాగ్నౌ పాతితం కృత్స్నం రక్షసా మభవ త్కులమ్.

అస్యస్యాపి స్వపంశస్య లంఘనా క్రియతే హి యా

తాం నాలం క్షత్రియః సోఢుం కి పునః పితృ మరణమ్.

నాయం పితా తే నిహతో నాస్మిం ఛస్త్రం నిపాతితమ్

త్వా మత్ర నిహతం మన్యే త్వయి శస్త్రం నిపాతితమ్.

నిభేత్యస్య హి కః శస్త్రం న్యస్తం యేన వనౌకసామ్

తవ నృపస్య పుత్రస్య మా బిభేతు బిభేతు వా.

అసుర రాజగు జంభుని తండ్రిని ఎప్పుడయితే సర్పములు కాటు వేసినవో, అప్పుడు జంభుడు పాతాల వాసులగు సమస్త వాసులగు పన్నగాలను చంపి వేసెను. మరియు రాక్షసులచే తండ్రి యగు శక్తి హతమగుట విని పరాశరుడు సంపూర్ణ రాక్షస కులమును అగ్నిలో పడివేసి దగ్ధము చేసెను. తన వంశమును ఇతరులు అవమానించుట చేతనే క్షత్రియుడు ఎప్పుడయితే దానిని కూడ సహింప లేక పోయెనో, ఇక తండ్రిని వధించిన విషయమున ఏమని చెప్పుదును? నా ఉద్దేశ్యమున నీ తండ్రి మరణింప లేదు. మరియు అతనిపై శస్త్రాఘాతమునూ కలుగ లేదు. ఈ విషయమున నీవే మరణించితివి. మఱియు నీ పైనననే శస్త్రా ఘాతము కలిగినది. ఎవడు వనవాసులపై శస్త్ర ప్రయోగమును చేయునో, అతడు పాపి, నీవు రాజువు, నీవు శత్రువును నాశనము చేసినచో నీకు అందఱును భయ పడుదురు. అట్లు చేయనిచో నీ కెవరును భయము చెందరు. ఈ కారణము వెంటనే నీ రాజ్యము నాశన మగును.

తలేయం లంఘనా యుక్తా యదస్మి స్తత్స తలేయంమాచర

వపుష్మతి మహారాజ! స భృత్య జ్ఞాతి బాంధవే.

ఈ అవమానము నీకే జరిగినది. అందు వలన ఓ మహారాజా! భృత్య, జ్ఞాతి, బంధు సహితముగా వపుష్మానుని సంబంధ మున ఏది కర్తవ్యమో, దానిని చేయుము.

మార్కండేయుడు:

ఇతి సంక్రాంత సందేశ మింద్రసేనా విసృజ్య తమ్.

పతి దేహ ముపాశ్లిష్య వివేశాగ్నిం మనస్వినీ.

మార్కండేయుడు:

మనస్విని యగు ఇంద్రసేన శూద్ర తపస్వితో ఈ విషయ మంతయు చెప్పెను. మరియు అతనికి అనుజ్ఞ నిచ్చి భర్త దేహమును ఆలింగనము చేసుకొని అగ్ని ప్రవేశమును చేసెను.