86 - నిశుంభ వధ

రాజు:

విచిత్ర మిద మాఖ్యాతం భగవ! న్భావతా మమ

 దేవ్యా శ్చరిత మహాత్మ్యం రక్తబీజ వధాశ్రితమ్

భూయ శ్చేచ్చా మ్యహం శ్రోతం రక్తబీజే నిపాతితే

చకార శుమ్భో యత్కర్మ నిశుమ్భశ్చాతికోపనః.

రాజు:

భగవానుడా! తమరు విచిత్రమైన చరిత్ర గలదియు రక్త బీజ వధకు సంబంధించిన యీ దేవీ మాహాత్మ్యమును నాకు చెప్పితిరి. ఇప్పుడు రక్తబీజుడు మరణించిన పిమ్మట అత్యంత కృద్దులైన శుంభ నిశుంభులు ఏమి చేసిరి? దానిని విన వలెనని కోరు చున్నాను.

ఋషి:

చకార కోప మతులం రక్తేబీజే నిపాతితే

శుమ్భాసురో నిశుంభశ్చ హతే ష్వన్యేషు చాహవే.

హన్యమానం మహాసైన్యం విలోక్యామర్ష ముద్వహన్

అభ్యధావ న్నిశుంభోథ ముఖ్యయాసుర సేనాయా.

తస్యాగ్రత స్తథా పృష్టే పార్శ్వయోశ్చ మహాసురాః

సందష్ఠౌష్ఠ పుటాః క్రుద్దా హంతుం దేవీ ముపాయయుః

ఋషి:

యుద్దములో రక్తబీజుడు మఱియు ఇతర సేనలు మరణించిన పిమ్మట శుంభ నిశుంభు లిద్దరూ క్రోధము గల వారైరి. అనంతరము ఆ సైన్యమంతయు హత మగుట చూచి క్రోధముతో రాక్షసుల యొక్క ముఖ్య సైన్యమును వెంట తీసుకొని నిశుంభాసురుడు దేవి సమ్ముఖమునకు పరుగెత్తెను. మఱియు ఆ దైత్యునికి ముందు వెనుకల నున్న గొప్ప గొప్ప రాక్షసులు తమ తమ పండ్లను పట పట కోరుకుచూ క్రోధముతో దేవిని నాశనము చేయుటకు వచ్చు చుండిరి.

అజగామ మహావీర్యః శుంభోపి స్వబలైర్వృతః

నిహంతం చండికాం కోపా త్కుృత్వా యుద్ధం తు మాతృభిః

తతో యుద్ద మతీవాసీ ద్దేవ్యాః శుంభ నిశుంభయోః

శరవర్ష మతీవోగ్రం మేఘయో రివ వర్శతోః

చిచ్చే దాస్తా ఞ్ఛరాం స్తాభ్యాం చండికా స్వశరో త్కరైః

తాడయామాస చాంగేషు శాస్త్రౌఘై రసురేశ్వరౌ.

నిశుంభో నిశితం ఖడ్గం చర్మ చాదాయ సుప్రభమ్

అతాడయ స్మూర్ద్ని సింహం దేవ్యా వాహన ముత్తమమ్.

తాడితే వాహనే దేవీ క్షురప్రేణాసి ముత్తమమ్

నిశుంభస్యాశు చిచ్చేద చర్మ చాప్యష్ట చంద్రకమ్

తిరిగి తన సైన్యమును వెంట తీసుకొని మహా వీరుడగు శుంభాసురుడు కూడ మాతృ గణాలతో యుద్దము చేసి దేవిని చంపుటకు కృద్ధుడై వచ్చెను. అప్పుడు దేవిపై వర్షించు చున్న రెండు మేఘములతో సమానముగ అత్యంత ప్రచండ మగు శర వర్షమును గురిపించు చున్న శుంభ నిశుంభుల యొక్క భయంకర మగు ఘోర సంగ్రామము జరిగెను. చండిక ఆ ఇద్దరు రాక్షసులు వేయుచున్న శర సమూహమును తన శరములచే వెంటనే త్రుంచి వేయుచు శస్త్రములతో ఆ అసురేశ్వరుల అవయవములను తాడనము చేసెను. వాడి గల ఖడ్గమును మఱియు మెరయుచున్న ఢాలును తీసుకొని నిశుంభుడు దేవి యొక్క ఉత్తమ వాహన మగు సింహము యొక్క శిరస్సును మోదెను. వాహనమును గొట్టుట చూచి దేవి “క్షురప్ర” అను పేరు గల అస్త్రముచే నిశుంభుని యొక్క ఉత్తమ ఖడ్గమును తునకలు చేసి “అష్ట చంద్రక” నామక మగు ఢాలును కూడ ముక్కలు చేసెను.

ఛిన్నే చర్మణి ఖడ్గే చ శక్తిం చిక్షేప సోసురః

తా మప్యస్య ద్విధా చక్రే చక్రేణాభిముఖాగతామ్

కోపాధ్మాతో నిశుమ్భోథ శూలం జగ్రాహ దానవః

ఆయాంతం ముష్టి పాతేన దేవీ తచ్చాప్యచూర్ణయత్.

అథాదాయ గదాం సోపి చిక్షేప చణ్థీకాం ప్రతి

సాపి దేవ్యాః త్రిశూలేన భిన్నా భాస్మత్వ మాగాతా

తతః పరశు హస్తం త మయాంతం దైత్య పుంగవమ్

ఆహత్య దేవీ బాణౌఘై రాపాతయత భూతలే

తస్మి న్ని పతితే భూమౌ నిశుమ్భే భీమ విక్రమే

భ్రాత ర్యతీవ సంకృద్దః ప్రయయౌ హంతు మంబికామ్.

ఖడ్గము మఱియు ఢాలు విరిగి పోవుటచే నిశుంభా సురుడు శక్తిని వదలెను. కాని దేవి ఎదురుగా వచ్చు చున్న ఆ శక్తిని గూడ చక్రముచే రెండు తునకలు చేసెను. అనంతరము కోపముతో శూలమును గ్రహించి విసరెను. దానిని కూడ ముష్టి ఘాతము చే చూర్ణము చేసెను. అప్పుడు ఆ అసురుడు గదను త్రిప్పి వేసెను. కాని ఆ గదను కూడ దేవి త్రిశూలముచే విరగ గొట్టి భస్మము జేసెను. తిరిగి చేతి యందు గొడ్డలిని తీసుకొని వచ్చు చున్న దైత్య శ్రేష్టుడగు ఆ నిశుంభుని దేవి బాణములచే గాయ పఱచి భూమిపై బడ వేసెను. భయంకర విక్రము డగు నిశుంభుడు భూమి యందు పడి చని పోవుట చూచిన శుంభాసురుడు అత్యంత క్రోధముచే దేవిని చంపుటకై మీదికి బోయెను.

సరఢస్థ స్తదాత్యుచ్చై ర్గృహీత పరమాయుధైః

భుజైరష్టాభి రతులై ర్వ్యాప్యాశేషం బభౌ నభః

త మాయాంతం సమాలోక్య దేవీ శంఖ మవాదయత్

జ్యాశాబ్దం చాపి ధనుష శ్చకారాతీవ ధుఃసహామ్

పూరయామాస కకుభో నిజఘంతా స్వనేన చ

సమస్త దైత్య సైన్యానాం తేజోవథ విధాయినా.

తతః సింహో మహానాదై స్త్వాజితేభ మహామదైః

పూరయామాస గగనం గాం తథైవ దిశో దశ

తతః కాళీ సముత్పత్య గగనం క్ష్మా మతాడయత్

కరాభ్యాం తన్నినాదేన ప్రాక్స్వానా స్తే తిరోహితాః

మరియు గొప్ప గొప్ప ఆయుధములు తీసుకొని, అత్యంత పొడవైనవి, అతుల పరాక్రమము కలవి యగు ఎనిమిది భుజములతో నతడు రథము నందు కూర్చొని ఆకాశ మండల మంతయు సంచరించుచు కనిపించ సాగెను. తన పైకి వచ్చుచున్న అతనిని చూచి దేవి శంఖము పూరించెను. అత్యంత దుఃస్సహ మగు ధనుష్టంకారావమును చేసెను. మరియు సమస్త దైత్యుల సైన్యము యొక్క తేజస్సును నాశము చేయునట్టి తన ఘంట యొక్క శబ్దముచే అన్ని దిక్కులను పూరించెను. తిరిగి ఏనుగుల యొక్క మహా మదము నణచు నట్టి గొప్ప శబ్దముతో సింహము కూడా ఆకాశము, భూమి మరియు దశ దిశలను వ్యాపించు నట్టి మహా నాదమును చేసెను. అనంతరము కాళికా దేవి ఆకాశము పైకెగిరి తిరిగి క్రిందికి దుమికి రెండు చేతులతో భూమిని చరచుటచే కలిగిన శబ్దము వలన ఇంతకు ముందు కలిగిన శబ్దము లన్నియు స్వల్ప మయ్యెను.

అట్టాట్ట హాస మశివం శివదూతీ చకార హ

తైః శద్భై రసురా స్త్రేసుః శుమ్భః కోపం పరం యయౌ

దురాత్మన్! స్తిష్ట తిష్టేతి వ్యజహారాంబికా యదా

 తదా జయేత్యభిహితం దేవై రాకాశ సంస్తితైః

శుమ్భేనాగత్య యా శక్తి ర్ముక్తా జ్వాలాతి భీషణా

ఆయాంతీ వహ్ని కూటాభా సా నిరస్తా మహోల్కయా.

సింహనాదేన శుమ్భస్య వ్యాప్తం లోకత్రయాంతరమ్

నిర్ఘాత నిఃస్వనో ఘోరో జితవా నవనీపతేః

శుంభ ముక్తం ఛరా దేవీ శుమ్భ స్త త్ప్రహితా ఞ్ఛరాన్

చిచ్ఛేద స్వశరై రుగ్రైః శతశోథ సహస్రశః

శివదూతి కూడ శత్రవులకు అమంగళ కారి యగు అట్టహాసమును చేసెను. ఆ శబ్దముచే అసుర గణాలకు దుఃఖము కలిగెను మఱియు శుంభుడు అతిశయించిన క్రోధము కల వాడయ్యెను. ఎప్పుడయితే అంబిక శుంభునితో “ఓరీ దురాత్మా ఆగు” అని పలికినదో అప్పుడు ఆకాశ మందున్న దేవతలు జయ జయ ధ్వానములు చేసిరి. శుంభాసురుడు వచ్చి ఉగ్ర దీప్తి గల అతి భయంకర మగు ఏ శక్తిని వదలేనో, అగ్నితో సమాన మగు ఆ వచ్చు చున్న శక్తిని దేవి “మహోల్క” అను పేరు గల శక్తిచే త్రుంచి దూరముగా విసరి వేసెను. అనంతరము శుంభుని సింహ నాదము మూడు లోకాలను వ్యాపించెను. అప్పుడు ఓ అవనీపాలా! దేవీ ప్రభావముచే ఆకాశములను దేవి తన ఉగ్రమగు బాణములతో త్రుంచు చుండెను. మఱియు శుంభుడు కూడ దేవి విడిచిన వందల, వేల బాణములను తన ఉగ్రమగు బాణములచే ఖండించు చుండెను.

తతః సా చండికా క్రుద్దా శూలేనాభిజఘాన తమ్

స తదాభిహతో భూమౌ స్మూర్చితో నిపపాత హ.

తతో నిశుంభః సంప్రాప్య చేతనా మాత్త కార్ముకః

ఆజఘాన శారైర్దేవీం కాళీం కేసరిణం తథా.

పునశ్చ కృత్వా బాహూనా మయుతం దనుజేశ్వరః

చ కాయుతేన దితిజ శ్చాదయామాస చండికామ్.

తతో భగవతీ కృద్దా దుర్గా దుర్గార్తినాశినీ

చిచ్చెద తాని చక్రాణి స్వశారైః సాయకాంశ్చ తాన్.

తతో నిశుంభో వేగేన గదా మాదాయ చండికామ్

 ఆభ్యథావత వై హంతుం దైత్య సేనా సమావృతః

ఆ తరువాత ఆ చండికా దేవి కృద్దురాలై శూలముచే గాయ పరచెను. మఱియు శూలము యొక్క దెబ్బచే శుంభుడు మూర్చితుడై భూభాగ మందు బడెను. అనంతరము నిశుంభాసురుడు చైతన్యమును పొంది ధనర్దారియై బాణములతో కాళికా దేవిని మఱియు సింహమును గాయ పరచ సాగెను. తిరిగి దనుజపతి యగు నిశుంభుడు పది వేల బాహువులను ధరించి చక్రా యుధముల ద్వారా చండికా దేవిని కంపింప వేసెను. అప్పుడు సంకట నాశినీ, భగవతి యగు దుర్గ కృద్దురాలై ఆ చక్రములను మఱియు బలములను తన బాణములచే త్రుంచి వేసెను. అనంతరము రాక్షస సైన్యమును వెంట బెట్టుకొని నిశుంభుడు దేవిని చంపుటకు గదను తీసుకొని అతి వేగముగా నురికెను.

తస్యాపతత ఏవాశు గదాం చిచ్చేద చండికా

ఖడ్గేన శిత ధారేణ స చ శూలం సమాదదే.

శూలహస్తం త మాయాన్తం నిశుంభ మమరార్ధనమ్

హృది వివ్యాద శూలేన వేగావిద్దేన చండికా.

భిన్నస్య తస్య శూలేన హృదయా న్నిఃశ్రుతోపరః

మహాబలో మహా వీర్య స్తిష్టేతి పురుషో వదన్.

తస్య నిష్క్రామతో దేవీ ప్రహస్య స్వనవ త్తతః

శిర శ్చిచ్చేద ఖడ్గేన తతోసా వపత ద్భువి.

తతః సింహ శ్చాఖాదోగ్ర దంష్ట్రా క్షుణ శిరోధరాన్

ఆసురం స్తాం స్తథా కాలీ శివదూతీ తథాపరాన్.

అప్పుడు ఆ వచ్చుచున్న నిశుంభా సురుని యొక్క ఆ గదను చండికా దేవి పదునైన ఖడ్గముచే త్రుంచెను. తిరిగి శూలమును గ్రహించి దగ్గరగా వచ్చు చున్న నిశుంభా సురుని దేవి అత్యంత వేగముగా తన త్రి శూలమును వేసి హృదయ మందు గ్రుచ్చెను. త్రిశూలముచే చేదించ బడిన ఆ అసురుని హృదయము నుండి మహా బల వంతుడు. మహా వీర్య వంతుడు నగు వేరొక పురుషుడు దేవితో దేవితో “ఆగు” అని పలుకుచూ బయటకు వచ్చెను. అప్పుడు దేవి పెద్దగా నవ్వుచూ బయటకు వచ్చిన ఆ అసురుని మస్తకమును ఖడ్గముచే తెగ వేసి భూమిపై బడ వేసెను. అనంతరము పదునైన దంతములచే సింహము అసురులను నములుచూ, భక్షింప సాగెను. శివదూతీ మఱియు కాళీ అన్యాన్యులగు అసురులను భక్షింప సాగిరి.

కౌమారీ శక్తి నిర్భిన్నాః కేచి న్నేశు ర్మహాసురాః

బ్రాహ్మణీ మంత్రం పూతనే తోయేనాన్యే నిరాకృతాః.

మాహేశ్వరీ త్రిశూలేన భిన్నాః పేతు స్తథాపరే

వారాహీ తుండ ఘాతేన కేచి చ్చూర్ణీ కృతా భువి.

ఖండం ఖండం చ చక్రేణ వైష్ణవ్యా దానవాః కృతాః

వజ్రేణ చైంద్రీ హస్తాగ్ర విముక్తేన తథాపరే

కేచి ద్వినేశు రాసురాః కేచి న్నష్టా మహాహవాత్

భక్షితాశ్చపరే కాళీ శివదూతీ మృగ్నాధిపైః

ఎంద రెందరో మహా సురులు కౌమారీ శక్తి యొక్క శక్తిచే తునకలై మరణించిరి. బ్రాహ్మణీ యొక్క మంత్ర పూత జలముచే అనేకులగు అసురులు నష్ట పోయిరి. అనేక మంది అసురులు మాహేశ్వరి యొక్క త్రిశూలముచే చిన్నా భిన్నులై పడి పోయిరి. మఱియు ఎందరెందరో అసురులు వారాహి ముఖము యొక్క తుండ ఘాతములచే చూర్ణమై భూమి యందు పడి పోయిరి. అనేక మంది దానవులను వైష్ణవి చక్రముతో ఖండ ఖండములుగా చేసెను. మఱియు ఐంద్రి యొక్క హస్తముతో వదలు చున్న వజ్రాయుధముచే గాయపడి ఆ అసురులలో అనేక మంది నష్ట పోయిరి. అనేక మంది ఆ మహా యుద్దము నుండి పారి పోయిరి, మరియు ఏ అసురులు మిగిలి యున్నారో, వారిని కాళీ, శివదూతి మఱియు సింహము భక్షించ మొదలిడిరి.