91 - దక్ష, బ్రహ్మ, రుద్రా, కాచ్య మన్వంతర వృత్తాంతములు

మార్కండేయుడు:

సావర్ణిక మిదం సమ్యక్ ప్రోక్తం మన్వంతరం తవ

తథైవ దేవీ మాహాత్మ్యం మహిషాసుర ఘాతనమ్.

ఉత్పత్తయశ్చ యా దేవ్యా మాతౄణాం మహాహవే

తథైవ సంభవో దేవ్యా శ్చాముండాయా యథా భవః

శివదూత్యాశ్చ మాహత్మ్యం వధః శుంభ నిశుంభయోః

రక్తబీజ వధశ్చైవ సర్వ మేత త్తవోదితమ్

శ్రూయతాం మునిశార్దూల! సావర్ణిక మథాపరమ్

దక్షపుత్రశ్చ సావర్ణి ర్భావి యో నవమో మనుః

కథయామి మనో స్తస్య యే దేవా మునయో నృపాః

పారా మరీచి భర్గాశ్చ సుధర్మాణ స్తథాసురాః

ఏతే త్రిథా భవిష్యంతి సర్వే ద్వాదశకా గణాః

తేషా మింద్రో భవిష్యస్తు సహస్రాక్షో మహాబలః

సాంప్రతం కార్తికేయో యో వహ్ని పుత్రః షడాననః

అద్భుతో నామ శక్రోసౌ భావి తస్యాంతరే మనోః

మార్కండేయుడు:

ఓ మునిసత్తమా! ఈ సావర్ణిక మన్వంతరము నీకు చెప్పబడెను. మరియు ఈ ప్రసంగము నందు దేవీ మాహాత్మ్యము, మహిషాసుర వినాశనము, మహా యుద్ద మందు మాతృ గణాల యొక్క ఉత్పత్తి, చాముండ యొక్క ఉత్పత్తి, శివ దూతి యొక్క మాహాత్మ్యము. శుంభ, నిశుంభుల వధ మఱియు రక్తబీజుని వధ. వీటి నన్నింటినీ కూడా నీకు బాగుగా వర్ణించి చెప్పితిని. ఓ ముని శార్దూలా! ఇప్పుడు జరుగ బోవు దక్ష పుత్రుడగు తొమ్మిదవ సావర్ణి మనువు యోక్క మన్వంతరమును వర్ణించెదను. వినుము. ఆ మనువు యొక్క మన్వంతరము ఏ ఏ దేవతలు, ఏ ఏ ఋషులు, ఏ ఏ రాజులు ఉండెదరో, వారిని చెప్పెదను వినుము. పారా, మారీచిభర్గ, సుధర్మ దేవతల యొక్క ఈ మూడు గణాలకు ప్రత్యేక గణ మందు పన్నెండు మంది దేవత లుందురు. ఈ సమయమున ఏ వహ్ని పుత్రుడగు షడాననుడగు కార్తికేయు డుండేనో. ఆతడే రాబోవు మన్వంతరమున ‘అద్భుతు’ డను పేరుతో మహా బలశాలి యగు సహస్రాక్షు డగు ఇంద్రు డగును.

మేధాతిథి ర్వసుః సత్యో జ్యోతిష్మాన్ ద్యుతిమాన్ స్తథా

సప్తర్షయోన్యః సబల స్తథాన్యో హవ్యవాహనః.

ధృష్టకేతు ర్బర్హ కేతుః ఖండహస్తో నిరామయః

 పృథుశ్రవా స్తథార్చిష్మాన్ భూరిద్యుమ్నో బృహద్భయః.

ఏతే నృప! సుతా స్తస్య దక్షపుత్రస్య వైనృపాః

మనోస్తు దశమస్యాన్య చ్ఛృణు మన్వంతరం ద్విజ!.

మేదాతిథి, వసు, సత్య, జ్యోతిష్మాన్, ద్యుతిమాన్, సబల, హవ్యవాహనులు ఈ సమయమున సప్తర్షులుగ నుందురు. దృష్టకేతు, బర్హకేతు, హస్త, నిరామయ, పృథుశ్రవ, అర్చిష్మాన్, భూరిద్యుమ్న, బృహద్భయులు మొదలగు వారు ఎంతో మంది దక్ష సావర్ణి మనువు యొక్క పుత్రులు రాజు లగుదురు. ఓ ద్విజుడా ఆ తరువాత పదియవ మనువు యొక్క మన్వంతరమును వినుము.

మన్వంతరే చ దశమే బ్రహ్మపు తస్య ధీమతః

 సుఖాసీనానిరుద్దాశ్చ ద్విప్రకారాః సురాః స్మృతాః.

శతసంఖ్యా హి తే దేవా భవిస్యా భావినోః మనోః

యత్పుత్రాణాం శాతం ఖావి తద్దేవానాం తథా శతమ్.

శాంతి రింద్ర స్తథా భావీ సర్వై రింద్ర గుణైర్యుతః

సప్తర్షీం స్తా న్నిబోధ త్వం యే భవిష్యంతి వైతదా.

ఆపోమూర్తి ర్హ విష్మాంశ్చ సుకృతీ సత్య ఏవ చ

నాభాగోప్రతిమశ్చైవ వాశిష్ఠశ్చైవ సప్తమః.

సుక్షేత్ర శ్చోత్తమౌజాశ్చ భూరిషేణశ్చ వీర్యవాన్

శతానీకోథ వృషభో హ్యనమి తో జయద్రథః.

భూరిద్యుమ్నః సుపర్వా చ తస్యైతే తనయా మనోః

భవిష్యా థర్మ పుత్రస్య సాపర్ణస్యాంతరం శృణు.

ఈ మన్వంతరము నందు ధీమంతు డగు బ్రహ్మ యొక్క పుత్రుడు దశమ మనువు అగును. వాని మన్వంతరమున సుఖాసీన అనిరుద్ధ నామములు గల ద్వివిధ దేవత లుందురు భావి మనువు యొక్క మన్వంతరమున భవిష్య ద్దేవతలు నూరు సంఖ్యలో నుందురు. ఎందువల్ల ననగా ఈ మన్వంతరమున ప్రాణుల సంఖ్య నూరు అందుచేత దేవతల సంఖ్య కూడా నూరు ఉండును. ఇంద్రుని యొక్క సంపూర్ణ గుణ యుక్తుడై యున్న “శాంతి” యను వాడు ఆ సమయమున ఇంద్రు డగును. మరియు ఎవరు సప్తర్షులుగ నున్నారో. వాని విషయమును చెప్పెదను వినుము. అపోమూర్తి, హవిష్మాన్, సుపిత, సత్య, నాభాగ, అప్రతిమ, వసిష్ఠులు సప్తర్షులుగా నుందురు. సుక్షేత్ర, ఉత్తమౌజస, భూరిషేణ, వీర్యవాన్, శతానీక, వృషభ, అనమిత్ర, జయద్రధ, భూరిద్యుమ్న, సుపర్వులు, దశమ మనువు యొక్క పుత్రులు. భావి మనువు, ధర్మ పుత్రుడునగు సావర్ణిక మన్వంతరమును వినుము.

విహంగమాః కామగాశ్చ నిర్మాణపతయ స్తథా

 త్రిఃప్రకారా భవిష్యంతి ఏకైక స్త్రింశకో గణః.

మాసర్తు దివసా యే తు నిర్మాణవతయస్తు తే

 విహంగమా రాత్రయోధ మౌహూర్తాః కామగా గణాః.

ఇంద్రో వృషాఖ్యో భవితా తేషాం ప్రఖ్యాత విక్రమః

హవిష్మాంశ్చ వరిష్ఠశ్చ ఋషి రన్య స్తథారుణిః.

నిశ్చరశ్చానఘశ్చైవ విష్టిశ్చాన్యో మహామునిః

 సప్తర్శాయోంతరే తస్మి న్నగ్నితేజశ్చ సప్తమః.

విహంగము, కామగ నిర్మాణ పతులను ఈ ముగ్గురును దేవతా గణాలు. ఒక్కొక్క గణ మందు ముప్పది దేవత లుందురు. మాస, ఋతు, దినములకు వారే నిర్మాణ పతులు. రాత్రులు విహంగమ దేవతలు, సమస్త ముహూర్త జాతక విషయము లకు కామగ దేవతల యొక్క గణాలు. ప్రసిద్ద పరాక్రమము గల “వృషా”ఖ్యుడు వారికి ఇంద్రు డగును. ఈ మన్వంతరమున హవిప్మాన్, వరిష్టులు అరుణ తనయు డగు ఋషి, నిశ్చర, అనఘులు మహాముని యగు విష్టి, మరియు సప్తముడు అగ్ని దేవుడు సప్తర్షులుగా నుందురు.

సర్వత్రగః సుశర్మా చ దేవానీః పురూద్వాహః

హేమధన్వా దృఢాయుశ్చ భావివ స్తత్సుతా నృపాః.

ద్వాదశే రుద్రా పుత్రస్య ప్రాప్తే మన్వంతరే మనోః

సావర్ణాఖ్యాశ్చ యే దేవా మునయశ్చ శృణుష్వ తాన్.

సుధర్మాణః సుమనసో హరితో రోహిత స్తథా

సువర్ణాశ్చ సురా స్తత్ర పంచైత దశకా గణాః.

తేషా మింద్రస్తు విజ్ఞేయ ఋతధామా మతహాబలః

సర్వైరింద్రగుణై ర్యుక్తాః సప్తర్షీ నపి మే శృణు.

ద్యుతి స్తపస్వీ సుతపా స్తపోమూర్తి స్తపోనిధిః

తపోరతి స్తభై వాన్యః సప్తమస్తు తపోధృతిః

సర్వత్రగ, సుశర్మ, దేవానీక, పురూద్వహ, హేమధన్వా, దృఢాయువులు ఆ మనువు యొక్క పుత్రులు మఱియు భావి నరాధి పతు లగుదురు. రుద్రా పుత్రుడగు సావర్ణి మనువు యొక్క పన్నెండవ మన్వంతరము నందు ఏ దేవతలు. మునులు ఉండెదరో, ఇప్పుడు వాని విషయమును వినుము. సుధర్మ, సుమన, హరిత, రోహిత, మఱియు సువర్ణు లను ఈ ఐదు విధాల దేవ గణాలు ఉండును. ప్రత్యేక గణమున పది మంది దేవత లుందురు. సంపూర్ణముగా ఇంద్ర గుణ యుక్తుడైన, మహా బలవంతుడగు “ఋతధాముడు” వారికి ఇంద్రునిగా ఎరుంగ వలెను. ఇప్పుడు నా వలన సప్తర్షుల విషయమును వినుము. ద్యుతి, తపస్వి, సుతప, తపోమూర్తి, తపోనిధి, తపోరతి, తపోధృతులను వీరు సప్తర్షులుగా నుందురు.

దేవవా నువదేవశ్చ దేవశ్రేష్ఠో విదూరథః

మిత్రవా న్మిత్రవిందశ్చ భావిన స్త త్సుతా నృపాః

త్రయోదశస్య పర్యాయే రౌచ్యాఖ్యస్య మనోః సురాన్

 సప్తర్షీశ్చ నృపాంశ్చైవ గదతో మే నిశామయ.

సుధర్మణాః సురా స్తత్ర సుకర్మాణ స్తథాపరే

శుశర్మణః సురా హ్యేతే సమస్తా ముని సత్తమ!

మహాబలో మహావీర్య స్తేషా మింద్రో దివస్పతిః

హవిష్మా నథ సప్తర్షీన్ గదతో మే నిశామయ.

ధృతిమా నవ్యయశ్చైవ తత్త్వదర్శీ నిరుత్సుకః

నిర్మోహః సుతపాశ్చాన్యో నిష్ప్రకంపశ్చ సప్తమః

చిత్రసేనో విచిత్రశ్చ నియతి ర్నిర్భయో దృఢః

సునేత్రః క్షుత్రబుద్దిశ్చ సువ్రతశ్చైవ తత్సుతాః.

దేవహన్, ఉపదేవ, దేవశ్రేష్ఠ, విదూరథ, మిత్రవాన్, మిత్రవిందులు భావి మనువు యొక్క పుత్రులు రాజు లగుదురు. రౌచ్యు డను పదమూడవ మనువు యొక్క సమయమున సప్తర్షులు, మరియు ఎవరి పుత్రులు రాజు లగుదురో, వారి విషయమును చెప్పెదను వినుము. ఓ ముని సత్తమా! ఆ మన్వంతరమున సుధర్మ, సుకర్మ, సుశర్మ లను వీరు దేవతలు. మహా బలుడు, మహా వీర్యుడు అగు “దివస్పతి” వారికి ఇంద్రు డగును, ఇప్పుడు భవిష్యత్తున కాబోవు ఋషులు విషయమును చెప్పు చున్నాను, వినుము. ధృతిమాన్, అవ్యయ, తత్త్వదర్శి, నిరుత్సుక, నిర్మోహ, సుతప, నిష్ప్రకంపులు సప్తర్షులు. చిత్ర సేన, విచిత్ర, నియతి, నిర్భయ, దృఢ, సునేత్ర, క్షత్రబుద్ది, సువ్రతులు రౌచ్య మనువు యొక్క పుత్రు లగుదురు.