మార్కండేయ మహా పురాణము
72 - రైవత మన్వంతరము
మార్కండేయుడు:
పంచమోపి మను ర్బ్రహ్మ న్రైవతో నామ విశ్రుతః తస్యోత్పత్తిం విస్తరశః శృణుష్వ కథయామి తే ఋషి రాసీ న్మహాభాగః ఋతవాగితి విశ్రుతః తస్యా పుత్రస్య పుత్రోభూ ద్రేవత్యంతే మహాత్మనః సత్రస్య విధివ చ్చక్రే జాతికర్మా దికాః క్రియాః తథోపనయనా దీంశ్చ స చాశీలో భవన్మునేః యతః ప్రభృతి జాతోసౌ తతః పభృతి సోవ్యృషిః దీర్ఘ రోగ పరామర్శ మవాపముని పుంగవః మాతా తస్య పరా మార్తిం కుష్ఠరోగాది పీడితా జగామ స పితా చాస్య చింతయా మాస దుఃఖితః
మార్కండేయుడు:
హే బ్రాహ్మన్! ఇప్పుడు రైవతుడను పేరు గల ప్రఖ్యాత ఐదవ మనువు యొక్క ఉత్పత్తి గురించి వృత్తాంతమును నీకు వివరముగా వర్ణించెదను వినుము. ఋతవాకుడను పేరు గల విఖ్యాత మహాభాగుడు అగు ఋషికి ముందు పుత్రులు లేకుండెను. తరువాత రేవతీ నక్షత్రము యొక్క శేష మందు ఆ ఋషికి ఒక పుత్రుడు ఉదయించెను. ఓ మునీ! ఆ ఋషి పుత్రుని విధానానుసారము జాతకర్మాది క్రియలు, ఉపనయనాది సమస్త క్రియలు జరిపించెను. కాని ఆ పుత్రుడు సచ్చీలము లేని వాడయ్యెను. ఆతని తల్లి కూడా కుష్ఠు వ్యాధిచే పీడింప బడుతూ అత్యంత క్లేశము ననుభవించు చున్నది. అప్పుడు ఆతని తండ్రి దుఃఖితుడై ఇట్లు చింతింప సాగెను.
కిమేతదితి సోప్యస్య పుత్రోప్య త్యంత దుర్మతిః జగ్రాహ భార్యా మన్యస్య ముని పుత్రస్య సంముఖీమ్ తతో విషణ్ణ మనసా ఋతవా గిద ముక్తవాన్ అపుత్రతా మనుష్యాణాం శ్రేయసే న కుపుత్రతా కుపుత్రో హృదయా యాసం సర్వదా కురుతే పితుః మాతుశ్చ స్వర్గ సంస్థాంశ్చ స్వపితౄ న్పాత యత్యధః సుహృదా నోపకారాయ పితౄణాం చ న తృప్తయే పిత్రో ర్దుఃఖాయ దిగ్జన్మ తస్య దుష్కృత కర్మణః ధన్యా న్తే తనయా యేషాం సర్వలోకాభి సంమతాః పరోప కారిణః శాంతాః సాధు కర్మణ్య నువ్రతాః
“ఇందుల కిట్లు జరిగినది?” అని చింతింప సాగెను. అనంతరము అతి దుర్మార్గుడగు ఆ పుత్రుడు ఒక సమయమున వేరొక ముని పుత్రుని సమీపముననే ఆతని భార్యను హరించెను. దీనిచే ఋతవాకుడను ఋషి దుఃఖిత మనస్కుడై ఇట్లనుకొనసాగెను. “మానవులకు దుష్టుడగు పుత్రుడు కలుగుట కన్నా అసలు పుత్రుడు లేకుండుట శ్రేష్ఠము. ఎందుచేత ననగా కుపుత్రుడు తల్లి దండ్రుల హృదయమునకు ఎల్లప్పుడు కష్టములు కలుగ జేయును. మరియు స్వర్గ మందున్న పితరులను కూడ అధః లోకములలో పడ వేయును. ఈతని వల్ల సుహృద్గణాలకు కూడా ఉపకారము కలుగదు. పితృ గణాలకు తృప్తి కలుగదు. తల్లి దండ్రుల దుఃఖమునకు హేతువగు దుష్కర్ముడగు కుపుత్రుని జన్మను ధిక్కరింప వలెను. ఎవని సంతానము సర్వ జనాదృతము, పరోపకారీ శాంత ప్రకృతి మరియు సత్కర్మల యందు అనురక్తుడై ఉండునో, అతడు ధన్యుడు.”
అనిర్వృత్తం తథా మందం పరలోక పరాజ్ముఖమ్ నరకాయ న సద్గత్యై కుపుత్రాలంబి జన్మనః కరోతి సుహృదాం దైన్య మహితానాం తదా ముదమ్ అకాలే చ జరా పిత్రోః కుసుతః కురుతే ద్రువమ్
మనలను పరలోక పరాన్ముఖులను చేయు వాడు కుపుత్రావలంబనము చేయువాడు, అసంతుష్టుడు అయిన ఈ మంద భాగ్యుడు కేవలము నరకము కొరకే సద్గతి కొరకు గాదు. కుపుత్రుడు, సుహృదణాల యొక్క దీసత్వము అపకారులు శతృవులు అగువారి ఆనందము అకాలమందే తల్లి దండ్రులకు ముసలితనమును నిశ్చయముగా సంపాదించి పెట్టును.
మార్కండేయుడు:
ఏవం సోత్యంత దుష్టస్య పుత్రస్య చరితై ర్మునిః దహ్యమాన మనోవృత్తి ర్వృతం గర్గ మపృచ్చత
మార్కండేయుడు:
ఆ ఋషి అత్యంత దుష్ట చరిత్ర గల పుత్రుని దుష్ట వ్యవహారముచే ఈ విధముగా దగ్ధ మనస్కుడై ఆ వృత్తాంతము నంతయు చెప్పి గర్గ మహర్షిని ఈ విధముగా అడిగెను.
ఋతవాకుడు:
సువ్రతేన పురా వేదా గృహీతా విధివ న్మయా సమాప్య వేదా న్విధివత్కృతో దార పరిగ్రహః సదారేణ క్రియాః కార్యాః శ్రౌతాః స్మార్తా వషట్ క్రియాః న మే న్యూనాః కృతాః కాశ్చి ద్యావ దద్య మహామునేః
ఋతవాకుడు:
నేను పూర్వము సద్వ్రతము లందు నిరతుడనై యథావిధిగా వేదములను పఠించితిని. మరియు వేదము చదివిన పిదప విధి పూర్వకముగా భార్యను గ్రహించితిని. ఓ మహామునీ! శ్రౌత, స్మార్త, వషట్కార క్రియా స్వరూపముల ఏ కార్యము లన్నియు భార్యా సహితము చేయ వలయునో, భార్యను గ్రహించి నప్పటి నుండి ఇప్పటి వరకు ఆ వ్రతములు చేయుట యందు ఏ విధముగాను లోటు చేయలేదు.
గర్భాధాన విధానేన న కామ మనురుధ్యతా పుత్రార్థం జనిత శ్చాయ పున్నామ్నో విభ్యతా మునేః సోయం కిమాత్మ దోషేణ మమ దోషేణ వా మునే అస్మద్దుః వహో జాతో దౌః శీల్యా ద్భందు శోకదః
ఓ మునీ! నేను పున్నామ నరకము యొక్క భీతిచే దాని నుండి రక్షణ పొందుటకు గర్భాధానా విధాను సారముగా ఈ పుత్రుని ఉత్పన్నము గావించితిని. కామాను రుద్దుడై పుత్రుడు జన్మించలేదు. ఓ మునీ! అయినప్పటికీ ఈ బాలకుడు ఎట్లు మాకు దుఃఖము నిచ్చువాడు, దుఃస్వభావ యుక్తుడుగను బంధు గణాలకు శోక ప్రదుడు అయి జన్మించెను? ఇది నా దోషము వలన కలిగినదా ఏమి?
గర్గ ముని:
జాత్యంతే మునిశ్రేష్ఠః జాతోయం తనయ స్తవ తేన దుఃఖాయ తే దుష్టే కాలే యస్మాదజాయత న తేపి చాలో నైవాస్య మాటు ర్నాయం కులస్య తే తస్య దౌః శీల్య హేతుత్వం రేవత్యంత ముపాగతమ్
గర్గ ముని:
ఓ ముని శ్రేష్టుడా! నీ పుత్రుడు రేవతి యొక్క అంతిమ కాలమున జన్మించెను. ఈ దుష్ట కాలమున జన్మించుటచే నీకు దుఃఖమును కలుగ జేయు చున్నాడు. ఇది నీ వలన గాని, నీ భార్య వలన గాని లేక నీ వంశము వారిచే గాని కలిగిన స్వధర్మ వ్యతిక్రమ ఫలితము కాదు. రేవతి యొక్క అంతిమ భాగమే ఈతని దుఃస్వభావమునకు కారణము.
ఋతవాకుడు:
యస్మా న్మమైక పుత్రస్య రేవత్యంత సముద్భవమ్ దౌః శీల్య మేత త్సా తస్మా త్పతతా మాశు రేవతీ
ఋతవాకుడు:
ఎప్పుడు, రేవతి యొక్క అంతిమ కాల మందు జన్మించిన కారణమున నా ఏకైక పుత్రునకు ఈ దుఃస్వభావము కలిగినదో, ఈ కారణముచే ఆ రేవతి శీఘ్రముగా పతితురాలగు గాక.
మార్కండేయుడు:
తేనైవం వ్యాహృతే శాపో రేవత్యృక్షం పపాత హ పశ్యతః సర్వలోకస్య విస్మయా విష్ట చేతసః రేవత్యృక్షం చ పతితం కుముదాద్రౌ సమంతతః భాసయా మాప సహసా వన కందర నిర్ఘరాన్ కుముదాద్రిశ్చ తత్పాతాత్ ఖ్యాతోరైవ తకోభవత్ అతీవ రమ్యః సర్వస్యాం పృథివ్యాం పృథివీ ధరః తస్య ర్క్షస్య తు యా కాంతి ర్జాతా పంకజనీ సరః తతో జజ్ఞే తదా కన్యా రూషేణాతీవ శోభనా రేవతీ శాంతి సంభూతాం తాం దృష్ట్వా ప్రముచో మునిః తస్యా నామ చకారేత్థం రేవతీ నామ భాగురే
మార్కండేయుడు:
ఎప్పుడు ఆ ఋతవాకుడు ఈ విధముగా శాపము నిచ్చెనో, అప్పుడు మనుష్యు లందరి ఎదుటనే రేవతీ నక్షత్రము పతితురాలగుట చూచి అందరి మనస్సులు ఆశ్చర్యచకితు లైనవి. ఆ రేవతీ నక్షత్రము కుముద పర్వతము లందు పడి నాలుగు దిశల యందలి వనములు, కందరములు, సెలయేళ్ళు, వీటన్నింటిని వెంటనే ప్రకాశింప చేసెను. సంపూర్ణ పృథ్వి యందు అత్యంత మనోహరమగు కుముద పర్వతము కూడా ఆ నక్షత్రము పడుటచే “రైవతక” అను పేరుతో విఖ్యాతి గాంచినది ఆ నక్షత్ర కాంతిచే పంకజ యుక్త సరోవరము నుండి అత్యంత స్వరూప వంతురాలగు ఒక కన్య జన్మించెను. ఓ భాగురే! ప్రముచ ముని ఆ కన్యకు రేవతి యొక్క కాంతిచే ఉత్పన్నమగుట చూసి ఆమె పేరు “రేవతీ” అని పెట్టెను.
పోషయా మాస చై వైతాం స్వాశ్రమాభ్యాశ సంభవామ్ ప్రముచః స మహాభాగ స్తస్మిన్నేవ మహాచలే తాం తు యోవనినీం దృష్ట్వా కన్యకాం రూప శాలినీమ్ స ముని శ్చింతయామాసకోస్యా భర్తా భవేదితి ఏవం చింతయంత స్తస్య యయౌ కాలో మహాన్మునే న చాససాద సదృశం వరం తస్యా మహామునిః తత స్తస్యా వరం ప్రష్టు మగ్నిం స ప్రముచో మునిః వివేశ వహ్నిశాలాం వై పృష్ట స్తం ప్రాహ హవ్యభుక్ మహాబలో మహావీర్యః ప్రియవా గ్ధర్మ వత్సలః దుర్గామో నామ భవితా భర్తా హ్యాస్యా మహీపతిః
ఆ ప్రముచ మహాభాగుడు రైవతక పర్వత మందున, తన ఆశ్రమ సమీపమున ఉత్పన్నమైన ఆ కన్యను పెంచసాగెను. తరువాత ఆ ముని ఆ రూప వంతురాలగు కన్య యౌవన వంతురాలగుట చూచి “ఎవరు ఈమెకు భర్త కాగలడు” అని యోచింప సాగెను. ఓ మునీ! ఈ విధముగా ఆలోచించు చుండగా ఆయనకు చాలా దినములు గడచి పోయెను. కానీ ఆ మహామునికి ఆమెకు తగిన వరుడు లభించ లేదు. అనంతరము ప్రముచ ముని అగ్నిని వర విషయము అడుగుటకు వహ్నిశాలకు వెళ్ళెను. అచట ముని అడిగి నప్పుడు హుతాశనుడు మునితో ఇట్లు పలికెను. మహా బలుడు మహా వీర్యవంతుడు ప్రియవాది అగు “దుర్గమ” అను పేరు గల పృథ్వీ పతి ఈమెకు భర్త యగును.
మార్కండేయుడు:
అనంతరశ్చ మృగయా ప్రసంగే నాగతో మునేః తస్యాశ్రమ పదం ధీమా న్దుర్గమః స నరాధిపః ప్రియవ్రతాన్వయ భవో మహాబల పరాక్రమః పుత్రో విక్రమ శీలస్య కాలిందీ జఠరో ద్భవః స ప్రవిశ్యాశ్రమపదం తా తన్వీం జగతీ పతిః అపశ్య మాన స్త మృషిం ప్రియే త్యామంత్ర్య పృష్టవాన్
మార్కండేయుడు:
ఓ మునీ! అనంతరము స్వాయంభువ మనువు యొక్క జ్యేష్ట పుత్రుడు, ప్రియ వ్రతము యొక్క వంశ మందు జన్మించిన విక్రమ శీలుడగు రాజు యొక్క “కాలిందీ” అను పేరు గల మహిషి గర్భము నుండి జన్మించిన బుద్ధిమంతుడు, మహాబల పరాక్రమశాలి యగు ఆ నరాధిపతి దర్గముడు వేటాడుచు ముని యొక్క ఆశ్రమ మందు నిలచెను. ఆ భూపతి ఆశ్రమ మందు ప్రవేశించి ఋషి దర్శనమును పొందక ఆ కృశాంగి కన్యను ప్రియా అని చెప్పుచూ ఇట్లు పలికెను.
రాజు:
క్వ గతో భగవా నస్మా దాశ్రమా న్ముని పుంగవః తం ప్రణేతు మిహేచ్చామి తత్త్వం ప్రభ్రూహి శోభనే
రాజు:
ఓ సుందరీ! భగవానుడగు ముని శ్రేష్ఠుడు ఈ ఆశ్రమము నుండి ఎచటకు పోయెను? ఎరిగిన తెలియ జేయుము. ఆయనకు నమస్కరించ వలెనని కోరు చున్నాను.
మార్కండేయుడు:
అగ్నిశాలాం గతో విప్ర స్తచ్చ్యుత్వా తస్య భాషితమ్ ప్రియేత్యా మంత్రణం చైవ నిశ్చక్రామ త్వరాన్వితః
మార్కండేయుడు:
అగ్నిశాలకు వెళ్ళిన ఆ విప్రుడు రాజు యొక్క ఈ వాక్కులు మరియు “ప్రియా” అను సంభోదన విని వెంటనే అచటి నుండి బయలు దేరెను.
స దదర్శ మహాత్మానం రాజానం దుర్గమం మునిః నరేంద్ర చిహ్న సహితం ప్రశ్రయావనతం పురః తస్మిం దృష్టే తతః శిష్య మువాచ స తు గౌతమమ్ గౌతమానీయతాం శీఘ్ర మర్ఘోస్య జగతీ పతేః ఏక స్తావ దయం భూప శ్చిరకాలా దుపాగతః జామాతా చ విశేషేణ యోగ్యోర్ఘస్య మతో మమ
ఆ ముని అచటకు వచ్చుచునే ముందుగా రాజ చిహ్న సహితముగ వినయము, నమ్రత కలిగియున్న మహాత్ముడగు ఆ దుర్గమ రాజును చూసెను. ఆయన అతనిని చూడగానే గౌతముడను పేరు గల శిష్యునితో “ ఈ భూపాలునకు వెంటనే అర్ఘ్యమును తీసుకు రమ్ము. ఒక రూపమున అతడు చాలా దినముల పిదప ఆశ్రమమునకు వచ్చెను. ఇంకను ఈతడు అల్లుడు. అందుచే ఈతడు నిజముగా అర్ఘ్యమునకు యోగ్యుడు.” అని చెప్పెను.
మార్కండేయుడు:
తతః స చింతయామాస రాజా జామాతృ కారణమ్ వివేద చ న తన్మౌనీ జగృహే ర్ఘం చ తన్నృపః తమాసనగతం విప్రో గృహీతార్ఘం మహా మునిః స్వాగతం ప్రాహ రాజేంద్ర మపి తే కుశలం గృహే కోశో బలేథ మిత్రేషు భృత్యామాత్యే నరేశ్వరః తథాత్మని మహాబాహో యాత్ర సర్వం ప్రతిష్టితమ్
మార్కండేయుడు:
అనంతరము రాజు, ఋషి జామాత అని చెప్పిన కారణమున చింతింప నారంభించెను. కాని ఏమియు అర్థము కాకున్నది. అప్పుడు నృపతి మౌనము వహించి అతని అర్ఘ్యమును స్వీకరించెను. మహాముని యగు ఆ విప్రుడు ఆశీనుడై అర్ఘ్యమును గ్రహించిన రాజేంద్రుని ఇట్లడిగెను. ఓ నరేశ్వరా! మీరు కుశలముగా వచ్చితిరా? మీ గృహము, ఓ మహాబాహూ! కోశాగారము, సైన్య గణాలు, మిత్ర గణాలు, భ్రుత్యు గణాలు, అమాత్య గణాలు కుశలముగా నుండిరా? వీరందరి ఆవలంబన స్థానము యొక్క మీకు కూడా క్షేమముగా నున్నదా?
పత్నీ చ తే కుశలినీ యత ఏవాను తిష్టతి పృచ్చామ్యస్యా స్తతో నాహం కుశలిన్యో పరా స్తవ
మీ భార్య ఇచట కుశలముగా నున్నది. అందుచేత నేను మిమ్ములను ఆమె విషయమును అడుగ లేదు. ఇంతే గాక మీ పురము నందలి ఇతర స్త్రీలు క్షేమముగా నుండిరా?
రాజు:
త్వత్ప్రసాదా దకుశలం న క్వచి న్మమ సువ్రతః జాత కౌతూహల శ్చాస్మి మమ భార్యాత్ర కామునే
రాజు:
ఓ సత్య పరాయణా! మీ దయ వలన నాకు ఏ విధముగాను క్షామము లేదు. కాని ఓ మునీ! ఈ ప్రదేశ మందు నాకు భార్య ఎవరున్నారు? ఈ విషయము తెలుసుకొన వలెనని కుతూహలముగా నున్నది.
ఋషి:
రేవతీ సుమహాభాగా త్రైలోక్య స్యాపి సుందరీ తవ భార్యా వరారోహా తాం త్వం రాజ న్న వేత్సి కిమ్
ఋషి:
ఓ రాజా! రేవతి అను పేరు గల మహాభాగా, త్రైలోక్య సుందరి, వరారోహ మీ యొక్క భార్య. మీరు ఆమెను ఎరుగరా ఏమి?
రాజు:
సుభద్రాం శాంత తనయాం కావేరీ తనయాం విభామ్ సురాష్ట్ర జాం సుజా తాం చ కదంబాం చ వరూథజామ్ విపాఠాం నందినీం చైవ వేద్మి భార్యాం గృహే ద్విజః
తిష్టంతి మే న భగవ న్రేవతీం వేద్మి కాన్వియమ్
రాజు:
హే విభో! సుభద్రా, శాంత తనయా, కావేరీ తనయా సురాష్ట్రజ, సుజాత, కదంబ, వరూథజా, విపాఠా మరియు నందినీ అను భార్యల నందరినీ ఎరుగుదును. ఓ ద్విజుడా! వారు మా గృహము నందే నివసించెదరు. కాని ఓ భగవాన్! ఈ రేవతి అను భార్యను నేను ఎరుగను. ఈమె ఎవరు?
ఋషి:
ప్రియేతి సాం ప్రతం యేయం త్వయోక్తా వరవర్ణినీ కిం విస్మ్రుతం తే భూపాలః శ్లాఘ్యేయం గృహిణీ తవ
ఋషి:
ఓ భూపాలా! ఇప్పుడే ఈ వర వర్ణినిని “ప్రియా” అని సంభోధించిరి. ఈ వర వర్ణిని మీకు శ్లాఘనీయురాలగు గృహిణి మీరు మరచితిరా ఏమి?
రాజు:
సత్య ముక్తం మయా కింతు భావో దుష్టో న మే మునే నాత్ర కోపం భవా న్కర్తు మర్హ త్యస్మాసు యాచితః
రాజు:
నిజమే. నేను ఇట్లు పలికితిని. కాని నా పలుకులందు దుస్వభావము లేదు మీరు ఈ కారణమున నా యందు కోపించ వద్దు. అని ప్రార్థించు చున్నాను.
ఋషి:
యత్త్వం బ్రవీషి భూపాల! న భావ స్తవ దూషితః వ్యాజహార భావా నేత ద్వహ్నినా నృపః చోదితః మయా వృష్టో హుతవహః కోస్యా భర్తేతి పార్థివః భవితా తేన చాప్యుక్తో భవా నేవాద్య వై వరః
ఋషి:
ఓ భూపాలా! మీ “నా భావము దూషితము కాదు” అని చెప్పితిరి. అది నిజమే. కాని ఓ నృపతీ! ఇట్లు మీరు అగ్ని ప్రేరణచే పలికితిరి. పృథ్వీపతీ! నేను అగ్నిని “ఈమెకు భర్త ఎవరగుదురని” అడిగితిని. అప్పుడు అగ్ని మీరే ఈమెకు భర్త అగునని చెప్పెను.
తద్గృహ్యతాం మయా దత్తా తుభ్యం కన్యా నరాధిప ప్రియే త్యామంత్రితా చేయం విచారం కురుషే కథమ్
అందుచేత ఓ నరాధిపతి! ఎవరిని మీరు “ప్రియా” అని సంభోధించితిరో ఆమెను మీకు ఇచ్చెదను. పరిగ్రహింపుడు. మీరు ఎందులకు విచారించు చుండిరి?
మార్కండేయుడు:
తతోసా వభవ న్మౌనీ తేనోక్తః పృథివీపతిః ఋషి స్తథోద్యతః కర్తుం తస్యా వైవాహికం విధిమ్ తముద్యతం సా పితరం వివాహాయ మహామునేః ఉవాచ కన్యా యత్కంచి త్ప్రశ్రయా వనతాననా యది మే ప్రీతిమాం స్తాతః ప్రసాదం కర్తు మర్హసి రేవత్ర్యుక్షే వివాహం మే తత్కరోతు ప్రసాదితః
మార్కండేయుడు:
ఋషి ఈ విధముగా చెప్పగానే ఆ రాజు మౌనముగా నుండెను. అప్పుడు ఆ ముని కన్యా వివాహము యొక్క విధులను చేయుటకు ఉద్యుక్తు డయ్యెను. ఓ మహామునీ! వివాహము చేయుటకు ఉద్యుక్తుడైన తండ్రిని చూచి వినయముతో సంక్షిప్తముగా నిట్లు పలికెను. ఓ తండ్రీ! నా యందు మీకు ప్రీతి యున్నచో నాపై ప్రసన్నత జూపి రేవతీ నక్షత్ర మందు నా వివాహమును చేయుడు.
ఋషి:
రేవత్ర్యుక్షం న వై భద్రే చంద్ర యోగి వ్యవస్థితమ్ అన్యాని స తి ఋక్షాణి సుభ్రుః వైవాహికాని తే
ఋషి:
ఓ భద్రా! రేవతీ నక్షత్రము చంద్ర యోగము గలదై యుండ లేదు. ఇదిగాక ఇతర నక్షత్రము లన్నియు శ్రేష్టముగా యున్నవి.
కన్య:
తాత తేన వినా కాలో విఫలః ప్రతిభాతి మే
వివాహో విఫలే కాలే మద్విదాయాః కథం భవేత్
కన్య:
ఓ తండ్రీ! ఆ రేవతీ నక్షత్ర వర్జిత కాలము నా విషయమున విఫలమని తెలియు చున్నది. నాతో సమానమగు కన్య యొక్క వివాహము విఫల కాల మందు ఎట్లుండును?
ఋషి:
ఋతవాగీతి విఖ్యాత స్తపస్వీ రేవతీం ప్రతి చకార కోపం కృద్దేన తేనర్క్షం వినిపాతితమ్ మయా చాస్మై ప్రతిజ్ఞాతా భార్యేతి మదిరేక్షణా న చేచ్చసి వివాహం త్వం సంకటం నః సమాగతమ్
ఋషి:
పూర్వము ఋతవాక్కుడను పేరు గల విఖ్యాత తపస్వి రేవతీ నక్షత్రముపై కోపించి ఆ నక్షత్రమును ఆకాశము నుండి పడవేసెను. నేను ఇంతకు ముందు ఈ రాజునకు “ఈ మదిరేక్షణను భార్యగా నీకు ప్రసాదింతును” అని ప్రతిజ్ఞ చేసితిని. కాని నీవు ఈ సమయమున వివాహము చేసుకొనుటకు అంగీకరించుట లేదు. ఈ కారణమున నాకు సంకటము ప్రాప్తించినది.
కన్య:
ఋతవాక్స మునిస్తాత కిమేవం తప్తవాం స్తపః న త్వయా మమతాతేనేన బ్రహ్మబందోః సుతాస్మి కిమ్
కన్య:
తండ్రీ! ఋతువాజ్ముని ఎట్టి తపస్సు చేసి యుండె ననగా నా తండ్రి తన ద్వారా అట్టి తపస్సును సాధింప లేదు. అయితే నేను బ్రహ్మ బంధువు యొక్క కన్యనా ఏమి?
ఋషి:
బ్రహ్మ బంధోః సుతా న త్వం బాలే నైవ తపస్వినః సుతా త్వం మమ యో దేవా న్కర్తు మన్యా న్సముత్సహే
ఋషి:
ఓ బాలా! నీవు బ్రహ్మణాధముని కుమార్తెవు కావు. మరియు సామాన్య తపస్వి కుమార్తెవు కూడా కావు. ఎట్టి ఋషి ఇతర దేవతలను సృష్టించుట యందు సమర్థుడో, అట్టి ఋషినగు నాకు కుమార్తెవు.
కన్య:
తపస్వీ యది మే తాత స్తత్కిమృక్ష మిదం దివి సమారోప్య వివాహో మే తదృక్షే క్రియతే న తు
కన్య:
నా తండ్రి అట్టి తపస్వి అయినచో రేవతీ నక్షత్రమును ఆకాశము నందు నిలిపి ఆ నక్షత్రము నందు నా వివాహ కార్యమును ఎందుకు చేయుట లేదు?
ఋషి:
ఏవం భవతు భద్రం తే భద్రేః ప్రీతిమతీ భవ ఆరోపయా మీందుమార్గే రేవత్ర్యుక్షం కృతే తవ
ఋషి:
ఓ భద్రా! అట్లే అగు గాక. నీకు మంగళ మగుగాక. ఇప్పుడు ప్రీతి గల దాని వగుము. నేను నీ కొరకు రేవతీ నక్షత్రమును చంద్ర మార్గమున నిలిపెదను.
మార్కండేయుడు:
తత సప్తః ప్రభావేణ రేవత్ర్యుక్షం మహామునిః యథాపూర్వం తథా చక్రే సోమయోగి ద్విజోత్తమః వివాహం చైవ దుహితు ర్విధివ న్మంత్ర యోగినమ్ నిష్పాద్య ప్రీతిమాన్ భూయో జామాంతర మథా బ్రవీత్
మార్కండేయుడు:
ఓ ద్విజోత్తమా! ఆ తరువాత ఆ ప్రముచ మహాముని తపస్సు యొక్క ప్రభావముచే రేవతీ నక్షత్రమును పూర్వము వలె చంద్ర సంయుక్తము చేసెను. తిరిగి యథావిధిగా మంత్రముల ద్వారా దుహిత యొక్క వివాహ కార్యమును సంపన్నము చేసి అత్యంత ప్రసన్న చిత్తుడై జామాతతో ఇట్లు పలికెను.
ఋషి:
ఔద్వాహికం తే భూపాలః కథ్యతాం కిం దదామ్యాహమ్ దుర్లభ్య మాపి దాస్వామి మమాప్రతిహతం తపః
ఋషి:
ఓ భూపాలా! నేను వివాహము యొక్క యౌతుక స్వరూపమున నీకు ఏమి ఇత్తును? అయినను చెప్పుము. నీవు అడిగిన దుర్లభమగు వస్తువును కూడా నేను అప్రతిహత తపస్సు యొక్క ప్రభావముచే నీకు ఇచ్చెదను.
రాజు:
మనోః స్వాయంభు వస్యాహ ముత్పన్నః సంతతౌ మునేః మన్వంతరాదినం పుత్రం త్వత్ప్రసాదా ద్ద్వృణోమ్యహమ్
రాజు:
ఓ మునీ! నేను స్వాయంభువ మనువు యొక్క వంశము నందు జన్మించితిని. మీ దయ వలన మన్వంతరాధిపతి యగు పుత్రుని పొందగోరు చున్నాను. ఇదియే నా ప్రార్థన.
ఋషి:
భవిష్య త్యేశ తే కామో మను స్త్వత్తనయో మహీమ్ సకలాం భోక్ష్యతే భూప! ధర్మవిచ్చ భవిష్యతి
ఋషి:
ఓ రాజా! నీ కోరిక సిద్ధించును. నీ పుత్రుడు మనువు అయి సంపూర్ణ పృథ్విని భోగింప గలడు. మరియు ధర్మజ్ఞుడగును.
మార్కండేయుడు:
తామాదాయ తతో భూపః స్వ మేవ నగరం యయౌ తస్మా దజాయత సుతో రేవత్యాం రైవతో మనుః సమేతః సకతై ర్దర్త్మే ర్మానవై రపరాజితః విజ్ఞాతాఖిల శాస్త్రార్థోవేదం విద్యార్థ శాస్త్రవిత్ తస్య మన్వంతరే దేవా న్ముని దేవేంద్ర పార్థివాన్ కథ్యమానా న్మయా బ్రహ్మః న్నిభోధ సుసమాహితః
మార్కండేయుడు:
తరువాత ఆ భార్య రేవతీ సహితముగా తన రాజధానికి చేరుకొనెను. అనంతరము రేవతీ గర్భమున రైవత మనువు జన్మించెను. యితడు ధర్మముల నెరిగిన మనుష్యులచే అపరాజితుడు, సంపూర్ణ శాస్త్రార్థము లందు పారంగతుడు, వేదం విద్య మరియు అర్థ శాస్రము జ్ఞానము గలవాడు అయ్యెను. బ్రాహ్మన్! అతని మన్వంతరము యొక్క దేవతలు, మునులు, ఇంద్రులు, భూపాల గణాలు మొదలగు వాని విషయమును చెప్పెదను సావదానుడవై వినుము.
సుమేధన స్తత్ర దేవా స్తథా భూతనయా ద్విజ వైకులఠశ్చామితాభాశ్చ చతుర్దశ చతుర్దశ తేషాం దేవగణానాం తు చతుర్ణామపి చేశ్వరః నామ్నా విభు రభూ దింద్రః శతయజ్ఞోపలక్షకః హిరణ్యలోమా వేదశ్రీ రూర్ధ్వబాహు స్తథాపరః వేదబాహుః సుధామా చ పర్జన్యశ్చ మహామునిః వసిష్టశ్చ మహాభాగో వేద వేదాంగ పారగః ఏతే సప్తర్ష య శ్చాసన్ రైవతస్యాంతరే మనోః బలబందు ర్మహా వీర్యః సుయష్టవ్య స్తథాపరః సత్యకాద్యా స్తథైవాసన్ రైవతస్య మనోః సుతాః
ద్విజుడా! దేవా గణాలు సుమేధా, భూపతి, వైకుంఠ, అమితాభ, అను ఈ నాలుగు గణాలు ముఖ్యమైనవి. ప్రత్యేక గణములందు పదునాలుగు చొప్పున దేవత లుందురు. ఆ నాలుగు ముఖ్య గణాలకు నూరు యజ్ఞములు చేసిన విభుడను పేరు గల ఇంద్రుడు అధిపతిగా నుండెను. హిరణ్య రోముడు, వేదశ్రీ, ఊర్థ్వబాహు, వేదబాహు, సుధామా, మహాముని, పర్జన్య, మరియు వేద, వేదాంగ పారంగతుడగు వసిష్ఠ మహాభాగుడు. రైవత మన్వంతర మందు వీరు సప్తర్షులుగా నుండిరి. బలబందు, మహావీర్య, సుయష్టవ్య, సాత్యక ఇత్యాది రైవత మనువు యొక్క పుత్రులుండిరి.
రైవతాంతాస్తు మనవః కథితా ఏ మయా తవ స్వాయంభువాశ్రయా హ్యేతే స్వారోచిష మృతే మనుమ్ (య ఏషాం శృణుయా న్నిత్యం పఠే దాఖ్యాన ముత్తమమ్ విముక్తః సర్వ పాపేభ్యో లోకం ప్రాప్నో త్యభీప్సితమ్)
రైవత మనువు పర్యంతము ఏ సమస్త మనుగణాలను గురించి నీకు చెప్పితినో, స్వారోచిష మనువు కాక ఇవన్నియు స్వాయంభువ మనువు యొక్క వంశమందు ఉత్పన్న మైనవి. (ఏ మానవులు ఈ ఉత్తమ వాఖ్యానమును నిత్యమూ వినుచుందురో లేక చదువుదురో వారు సంపూర్ణ పాపముల నుండి విడువబడిన వారై కోరిన లోకములను పొందుదురు.)
Summary of chapter 72 of the Mārkandeya Mahā Purana is as follows:
The text describes major historical events and righteous conflicts resolved during the Third Manvantara through the divine intervention of Bhagavān Vishṇu, demonstrating that divine grace continually shelters those devoted to truth.