44 - ప్రాకృత వికృత సర్గ వర్ణనము

క్రౌష్టికి:

యథా ససర్జ వై బ్రహ్మా భగవానాదికృత్ప్రజాః

ప్రజాపతిః పతి ర్దేవ స్తన్మే విస్తరతో వద

క్రౌష్టికి:

భగవాన్! ప్రజాపతి, ప్రభువు, ఆదిస్రష్ట యగు బ్రహ్మ ఏ విధముగా ప్రజలను ఉత్పన్నము చేసెను? దానిని విస్తారముగా నాకు చెప్పుము.

మార్కండేయుడు:

కథయామ్యేష తే బ్రహ్మ! న్ససర్జ భగవాన్యథా

లోక కృచ్చాశ్వతః కృత్స్నం జగత్థ్సావర జంగమమ్

పాద్మావసాన సమయే నిశాసుప్తోత్థితః ప్రభుః

సత్త్వోద్రిక్త స్తదా బ్రహ్మా శూన్యం లోక మవైక్షత

ఇమం చోదాహంత్యత్ర శ్లోకం నారాయణం ప్రతి

బ్రహ్మ స్వరూపిణం దేవం జగతః ప్రభవాప్యయమ్

ఆపో నారా ఇతిప్రోక్తా ఆపో వై నరసూనవః

తాసు శేతే స యస్మాచ్చ తేన నారాయణః స్మృతః

మార్కండేయుడు:

హే బ్రాహ్మన్! జగత్కారణుడు భగవంతుడునగు బ్రహ్మ ఏ విధముగా స్థావర జంగమ మగు సంపూర్ణ జగత్తు యొక్క నిర్మాణము చేసెనో? అది మీతో చెప్పెదను. పాద్మ కల్పావసాన మందు సత్త్వోద్రిక్తుడగు బ్రహ్మ రాత్రి యగుటచే నిద్రించి లేచుట తోడనే సంపూర్ణ భువనమును సూన్యముగా చూచెను. ఆ సమయ మందు జగత్కారణుడు, అవ్యయుడు, బ్రహ్మ స్వరూపుడు నగు నారాయణుని యెడల ఈ శ్లోకము చెప్ప బడెను. జలమునకు నార అని పేరు. అందులో అతడు శయనించుటచే అతడు నారాయణుడు అను పేరుతొ కీర్తింప బడుచున్నాడు.

విబుద్దః సలిలే తస్మి న్విధాయాంతర్గతాం మహీమ్

అనుమానాత్సముద్దారం కర్తుకామ స్తదాక్షితేః

అకరోత్స తనూరన్యాః కల్పాదిషు యథా పురా

మత్స్య కూర్మాదికా స్తద్య ద్వారాహం వాపురాస్థితః

వేద యజ్ఞమయం దివ్యం వేదయజ్ఞమయో విభుః

రూపం కృత్వా వివేశాప్సు సర్వగః సర్వసంభవః

సముద్ధృత్య చ పాతాలాన్ముమో చ సలిలే భువమ్

జనలోక స్థితైః సిద్ధైశ్చింత్యమానో జగత్పతిః

తస్యోపరి జలౌఘస్య మహతీ నౌరివ స్థితా

విస్తృతత్వాత్తు దేహస్య మహీ యాతి సంప్లవమ్

నారాయణుడు మేల్కాంచి పృథ్విని ఆ జలమందు యుండుట చూచి ఉద్దరించు కోరికచే పూర్వ కల్పమందు మత్స్య కూర్మాదులతో సమానముగా వరాహ రూపమును ధరించెను. సర్వగుడు, సర్వ సంభవుడు వేద యజ్ఞమయుడు, విభుడునగు నారాయణుడు వేదయగ్న మయమగు దివ్య వరాహ రూపముతో జలమందు ప్రవేశించెను. మరియు తిరిగి పాతాళము నుండి భూమిని ఉద్ధరించి నీటిపైన స్థాపించెను. తిరిగి జలలోక నివాసులగు మహర్షులతో జగత్పతి యగు ప్రభువు ఈ క్రింది విధముగా చింతించెను. ఈ భూమి జలమందు నౌకవలె ఊగు చున్నది. నీరు విస్తార మగుటచే భూమి ఆగుట లేదు.

తతః క్షితిం సమీకృత్య పృథివ్యాం సోసృజద్గిరీన్

ప్రాక్సర్గే దహ్యమానే తు తదా సంవర్తకాగ్నినా

తేనాగ్నినా విశీర్ణాస్తే పర్వతా భువి సర్వశః

శైలా ఏకార్ణవే మగ్నా వాయునాపస్తు సంహతా

నిషక్తా యాత్ర యత్రాసం స్తత్ర తత్రాచలా భవన్

భూ విభాగం తాః కృత్యా సప్తద్వీపోప శోభితమ్

భూరాద్యాం శ్చతురో లోకా న్పూర్వవ తస్మకల్పయత్

సృష్టిం చింతయత స్తస్య కల్పాదిషు యథా పురా

ఆబుద్ధి పూర్వక స్తస్మా త్ప్రాడుర్భూత స్తమో మయః

తమో మోహో మహామోహ స్తామిస్రో హైంద సంజ్ఞితః

అవిద్యా పంచపూర్వైషా ప్రాదుర్భూతా మహాత్మనః

పంచథావస్తితః సర్గో ధ్యాయతో ప్రతిభోధవాన్

ఆ తరువాత పృథ్విని సమానముగా చేసి మొదటగా పర్వతములను సృష్టించెను. ప్రథమ సృష్టిని సమ వర్తకుడగు అగ్ని కాల్చి వేసెను. పర్వతము లన్నియు ఆ అగ్ని యొక్క సంతాపముచే విశీర్ణ కళేబరములై సముద్ర మందు మునిగి పోయినవి. అప్పుడు అక్కడి జలము కూడా వాయువు వలన ఏకమై పోయెను. అందు వలన పర్వతములు ఏఏ ప్రదేశము లందు సంలగ్న మయ్యేనో, ఆయా స్థానము లందు కదలక స్థిరముగా నుండి పోయెను. అనంతరము సప్త ద్వీపముల రూప మందు భూమిని విభజించి, పూర్వము వలెనే భూలోకాది పదునాలుగు లోకములను విభజించెను. పూర్వ మందలి కల్పము వలెనే సృష్టి యొక్క ఆలోచన చేయుచు, అబుద్ధి పూర్వకముగా తమో మయుడై తమము, మోహము, మహా మోహము, తామిస్రము మరియు అంధ తామిస్రమను పేరు గల ఐదు అవిధ్యలను పుట్టించెను. ఈ విధముగా ఆలోచన చేయుటచే అప్రతిభోధ యుక్తమగు సృష్టి ఐదు విధాలుగా స్థితి కలిగి యున్నది.

బహిరంతశ్చా ప్రకాశః సంవృతాత్మా నగాత్మకః

ముఖ్యానగా యతశ్చోక్తా ముఖ్య సర్గ స్తత స్త్వయమ్

తం దృష్ట్వా సాధకం సర్గ మమన్య దపరం పునః

తస్యాభిధ్యాయతః సర్గం తిర్యక్స్రోతో హ్యవర్తత

యస్మాట్టిర్య క్ప్రవృత్తి స్సాతిర్యాక్స్రోత స్తతః స్మృతః

పశ్వాదయస్తే విఖ్యాతా స్తమః ప్రాయా హ్యవేదినః

ఉత్పథ గ్రాహిన శ్చైవ తేజ్ఞానే జ్ఞాన మానినః

అహంక్రుతా అహంమానా అష్టా వింశ ద్విదాత్మకాః

అది సంవృతాత్మకము మరియు పర్వత స్వరూపము అయి తన వెలుపలి భాగ మందును, లోపలి భాగ మందును, అప్రకాశముగా నుండెను. ఆ సృష్టి పర్వత ప్రధాన మగుటచే ముఖ్య సర్గమను పేరుతో చెప్పబడెను. ఆయన ఈ అసాధారణ సృష్టిని చూచి తిరిగి రెండవ సృష్టిని కోరెను. అప్పుడు ఆయన ధ్యానము వలన తిర్యక్ శ్రోతములు ప్రవృత్త మయ్యెను. సృష్టి గురించి విచారించుచూ అలోచించుచూ ఉండగా ఆయన నుండి తిర్యక్ శ్రోతములు ప్రవహించుటచే ఇవి తిర్యక్ శ్రోతములు అని చెప్ప బడెను. దీని వలన అధికముగా తమో గుణము గల పశువులు మొదలగునవి తెలివి లేని వయ్యెను. అజ్ఞానమునే జ్ఞానముగా తలంచు వారు చెడు మార్గమందు నడచు వారైరి. వారు అహంకారులు అహంబావులు ఇరువది ఎనిమిది ప్రకారములుగా నుండిరి.

అంతః ప్రకాశా స్తే సర్వే ఆవృతాస్తు పరస్పరమ్

తమ ప్యసాధకం మత్వా ధ్యాయతోన్యస్తతో భవత్

ఊర్ధ్వస్రోత స్త్రుతీయస్తూ సాత్త్వికోర్ధ్వ మవర్తత

తే సుఖప్రీతి బహుళా బహిరంతస్త్వనావృతాః

మనవి: ఇక్కడ కొన్ని శ్లోకములు, భావము మూల గ్రంధము నందు లేవు.