81 - దేవీ స్తుతి

ఋషి:

తతో ఋషి గణాః సర్వే దేవా ఇంద్ర పురోగమాః

స్తుతి మరేభిరే కర్తుం నిహతే మహిషాసురే

శక్రాదయః సురగణా నిహతేతివీర్యే,

తస్మి దురాత్మని సురారిబలే చ దేవ్యా

తాం తుష్టువుః ప్రణతి నమ్ర శిరోధరాంసాః

వాగ్భిః ప్రహర్ష పులకోద్గమ చారు దేహాః

ఋషి:

ఆ సమయమున ఇంద్రాది సమస్త దేవతా గణములు మహిషాసురుని చంపుటచే సంతోష చిత్తులై జగదంబను స్తోత్రము చేయసాగిరి. దేవి దేవతలకు శత్రువు మహా వీరుడు దుష్టుడు నగు మహిషాసురుని సంహరించుటకై ఇంద్రాది సమస్త దేవతా సమూహములు అత్యంత ఆనందముచే పులకాంచిత శరీరు లయిరి. నమ్ర శిరోధరాంశులై నమస్కరించి నానా ప్రాకారములుగా స్తుతించిరి.

దేవతలు:

దేవ్యా యయా తత మిదం జగదాత్మ శక్త్యా

నిశ్శేష దేవ గణశక్తి సమూహ మూర్త్యా

తా మంబికాం నిఖిల దేవ మహర్షి పూజ్యామ్

భక్త్యా నతా స్స్మ విదధాతు శుభాని సా నః

యస్యాః ప్రభావ మతులాం భగవా ననంతో

బ్రహ్మ హరశ్చ న హి వక్తు మలం బలం చ

సా చండికాఖిల జగ త్పరిపాలనాయ,

నాశాయ చాశుభ భయస్య మతిం కరోతు.

దేవతలు:

ఏ దేవి యొక్క ఆత్మ శక్తిచే ఈ చరాచర ప్రపంచము సృష్టి చేయ బడెనో, సమస్త దేవతల శక్తి సమూహముతో ఏ దేవి ఒక మూర్తిగా పరిణమించెనో, ఏ దేవి సమస్త దేవ మహర్షులచే పూజ్యురాలో, మేము భక్తితో అట్టి అంబికా దేవికి నమస్కరించు చున్నాము. మాకు మంగళములను కలుగ జేయు గాక. అనంతుడు, బ్రహ్మ, శంకరుడు ఎవరి ప్రభావము, బలము వర్ణించుటకు సమర్ధులు గారో, అట్టిది యగు చండికా దేవి ఈ యఖిల జగత్తు పాలించుటకు, అశుభములు నశింప చేయుటకు సంకల్పించు గాక.

యా శ్రీ స్స్వయం సుకృతినాం భవనే ష్వలక్ష్మీః,

పాపాత్మనాం కృతథియాం హృదయేషు బుద్ధిః

శ్రద్దావతాం కులజన ప్రభావస్య లజ్జా,

తాం త్వా వతా స్స్మ పరిపాలయ దేవి! విశ్వమ్

కిం వర్ణయామ తవ రూప మచింత్య మేతత్

కిం చాతి వీర్య మసుర క్షయకారి భూరి

కిం చాహవేషు చరితాని తవాద్భుతాని

సర్వేషు దేవ్యసుర దేవ గణాదికేషు

హేతు స్సమస్త జగతాం త్రిగుణాపి దేవైః

న జ్ఞాయసే హరి హరాదిభి రప్యపారా

సర్వాశ్రయాఖిల మిదం జగదంశ భూతం

అవ్యాకృతా హి వరమా పకృతి స్త్వ మాద్యా.

అమ్మా! నీవు పుణ్యాత్ములగు వారి గృహముల యందు లక్ష్మీ స్వరూపిణివి. పాపాత్ముల ఇండ్లలో అలక్ష్మీ స్వరూపిణివి. నిర్మలాత్ములగు వారి హృదయములలో బుద్ది స్వరూపిణివి. సత్పురుషుల యందు లజ్జా స్వరూపిణివి. అట్టి నీకు నమస్కరించు చున్నాము తల్లీ! నీవు విశ్వమును పాలించుము. ఇట్టి నీ యొక్క అత్యంత రూపము వర్ణించుటకు ఎట్లు సమర్దులము అగుదుము? ఓ దేవీ! నీ యొక్క రాక్షస సంహారము చేయ గల అపరిమిత వీర్యము, సురాసురులు యుద్ద రంగమున అద్భుతమగు నీ వ్యవహారము మేము ఏ రీతిగా వర్ణించ గలము? తల్లీ! వికార రహిత మగు ఆద ప్రకృతివి మరియు సత్వ రజ స్తమో గుణాత్మికవై జగత్తుకు హేతువై యున్నావు. రాగ ద్వేషాది యుక్తులగు హరి హరాదులు నీ ప్రకృతి తత్వమును తెలియ లేరు. మాతా! నీవు అపార మగు సమస్త పదార్ధములకు ఆశ్రయ స్వరూపు రాలవు. ఈ ప్రపంచము నీ అంశ భూతయై యున్నది.

యశ్వా స్సమస్త సురతాః సముదీరణేన తృప్తిం ప్రయాంతి సకలేషు మఖేషు దేవీ

స్వాహాసి వై పితృగణస్య చ తృప్తి హేతు రుచ్చార్యసే త్వమత ఏవ జనై స్స్వదా చ.

యా ముక్తి హేతు రవిచింత్య మహావ్రతా త్వ, మభ్యస్స్యసే సునియతేంద్రియ తత్వసారైః

మోక్షార్దిభి ర్మునిభి రస్త సమస్త దోషై, ర్విద్యాసి సా భగవతీ పరమా హి దేవీ.

శబ్దాత్మికా సువిమల ర్గ్యజుషాం నిధాన, ముద్గీథ రమ్య పద పాఠవతాం చ సామ్నామ్

దేవీ త్రయీ భగవతీ భవ భావనాయ, వార్తాసి సర్వ జగతాం పరమార్తి హంత్రీ

మేదాసి దేవి విదితాఖిల శాస్త్రసారాః దుర్గాసి దుర్గ భవసాగారనౌ రసంగా

శ్రీః కైటభారి హృదయైక కృతాధివాసా, గౌరీ త్వమేవ శశిమౌలి కృత ప్రతిష్ఠా

ఈష త్సహాస మమలం పరిపూర్ణ చంద్ర, బింబానుకారి కనకోత్తమ కాంతి కాంతమ్

అత్యదుృతం ప్రహృత మాత్తరుషా తథాపి, వక్త్రం విలోక్య సహసా మహిషాసరేణ

దేవీ! సమస్త యజ్ఞము లందునను నీ నామో చ్చారణముచే సర్వ దేవతలు సంతృప్తిని బొందు చున్నారు. నీవే దేవతలకు స్వాహాకార రూపముగా ఉచ్చరింప బడు చుందువు. అమ్మా! నీవు శబ్దమయ మగు వేద త్రయము నీ రూపము. నీవు దుర్గమ సంసార సాగరము నుండి తరింప జేయుదువు. నీ యొక్క ఉపాసనా విషయము ఊహింప శక్యము కాదు. కావుననే జితేంద్రియులు, తత్వసారులు, దోష హీనులు, మోక్షార్ధులు నగు ముని జనులు నిన్ను ముక్తికి కారణమని పల్కి సేవించు చున్నారు. మాతా! నీవు భగవత్ స్వరూపిణివి సర్వోత్కృష్ట మగు మోక్ష విద్యా స్వరూపిణివై యున్నావు. జగదంబా! నీవు శబ్దాత్మికమగు వేద స్వరూపిణివి. మఱియు ప్రణవ యుక్తము, మనోహరము, పద పాఠ యుక్తము నగు వేద త్రయమునకు ఆశ్రయ స్వరూపు రాలవు సంపత్స్వ రూపిణివి. సంసారము యొక్క జీవన రక్ష కొఱకు కృషి రూపిణీగా ప్రకాశించు చున్నావు. దేవీ! నీవే సంపూర్ణ జగత్తు యొక్క సమస్త దుఃఖములను నశింప చేయు చున్నావు. తల్లీ! నీవు జ్ఞాన స్వరూపిణివి. కావున అంతులేని సంసార సాగరమును దాటించుటకు అద్వితీయ మగు నౌక స్వరూపిణియై యున్నావు. నీవు కైటభ సంహారి యగు విష్ణు భగవానుని యొక్క హృదయ మందు నివశించు లక్ష్మీ దేవిగా సైతము భాసిల్లు చున్నావు మఱియు శివునిచే తన వామ భాగ మందు నివశింప చేసిన అర్ధాంగి స్వరూపిణి యగు గౌరీ దేవియు నీవే. పూర్ణ చంద్రునితో సమానమైనది, సువర్ణ కాంతి కలిగినది, నిర్మలమైనది. చిరునవ్వు కలదియు నగు నీ ముఖము చూచినంతనే మహిషాసురుడు క్రోదముతో అస్త్ర ప్రయోగము చేసెను. ఇది యత్యంతము ఆశ్చర్యముగా నున్నది. నీ ముఖము సంసారులకు మోహము కలిగింప చేయునది. ఆ రాక్షసుడు మోహితుడు కాలేదు. వాడు మిక్కిలి దుష్టుడు.

దృష్టా తు దేవి! కుపిత భృకుటీ కరాళ, ముద్య చ్చశాంక సదృశ చ్చని య న్న పథ్యః

ప్రాణా న్ముమోచ మహిష స్తదతీవ చిత్రం, కైర్జీప్యతే హి కుపితాంతక దర్శనేన

దేవీ! ప్రశీద పరమా భవతీ భవాయ, సద్యో చినాశయసి కోపవతీ భవాని!

విజ్ఞాత మేత దదునైవ యదాస్త మేత, న్నీతల బలం సువిపులం మహిషాసురస్య

తే సమ్మతా జనపదేషు ధనాని తేషాం తేషాం యశాంసి న చ సీదతి బంధు వర్గః

ధన్యాస్త ఏవ నిభృతాత్మజ భృత్యదారా యేషాం సదాభ్యుదయదా భవతీ ప్రసన్నా

ధర్మ్యాణి దేవి! సకలాని సదైవ కర్మా, ణ్యత్యాదృతః ప్రతి దినం సుకృతీ కరోతీ

స్వర్గం ప్రయాతి చ తతో భవతీ ప్రసాదా, ల్లోక త్రయోపి ఫలదా నను దేవిః తేన

దుర్గేః స్మృతా హరసి భీతి మశేష జంతోః, స్వస్థై స్మృతా మతి మతీవ శుభాం దదాసి

రారిద్ర్య దుఃఖ భయ హారిణి కా త్వదన్యా సర్వోపకార కారణాయ నదార్ద్ర చిత్తా

దేవీ! కోపముతో కూడిన కను బొమ్మలతో భీకరమై నదియు, ఉదయించు చున్న పున్నమి చంద్రుని ముఖమును చూచిన వెంటనే మహిషాసురుడు ప్రాణములను వదలక బ్రతికి యుండుట చాలా ఆశ్చర్యముగా నున్నది. ఎందు వలెననగా కృర్దుడగు యమధర్మ రాజును జూచి ఎవరు జీవించి యుండ గలరు. మాతా! నీవు ప్రసన్ను రాలవు కమ్ము. నీవు లక్ష్మీ స్వరూపు రాలవు. నీవు విశ్వ మంగళము కొఱకు అవతరించితివి. దేవీ! నీవు కోపించినచో సర్వ కులము నాశనము చేయ గలవని ఇప్పుడే తెలిసినది. ఎందు వలననగా మహిషాసురుని వాని యొక్క మహా సైన్యమును నీవు నాశనము చేసినావు. దేవీ! నీవు ప్రసన్నురాలవై ఎవరికి శుభములు నిచ్చేదవో వారు దేశ మందు పూజించ బడుచున్నారు, వారికి ధనము, యశస్సు లభించు చున్నవి. వారిలో ధర్మము నశింపక ధన్యులై, దారాపుత్రులు, భృత్యులు మొదలగు వారితో సుఖము పొందు చున్నారు. అమ్మా! నీ అనుగ్రహముచే పుణ్యాత్ములగు మనుష్యులు ప్రతి దినము అత్యంత ఆధరముతో ధర్మ కార్యములు చేయుదురు మరణా నంతరము నీ దయచే స్వర్గమునకు బోవు చున్నారు. అందు వలన ఓ దేవీ! లోకత్రయ మందునూ నీవే ఫలదాయివగు చున్నావు. దేవీ! నీవు దుర్గతి పొందిన మనుష్యులు నీ స్మరణ చేయుటచే వారి భయమును బాపు చున్నావు. మఱియు ఎవరు స్వస్థ చిత్తులై నిన్ను స్మరణ చేయుదురో వారికి అత్యంత మంగళ ప్రదమగు బుద్దిని ఇచ్చు చున్నావు. దారిద్ర్య దుఃఖ భయమును పోగొట్టు తల్లీ! నీవు గాక ఎవరి యొక్క చిత్తము అందరికి ఉపకారము చేయుటకు ఎల్లప్పుడు దయతో నిండి ఉండును?

ఏభి ర్హతై ర్జగ దుపైతి సుఖం తదైతే, కుర్వంతు నామ నరకాయ చిరాయ పాపమ్

సంగ్రామ మృత్యు మధిగమ్య దివం ప్రయాతు, మత్వేతి నూన మహితా వినిహంసి దేవి

దృష్ట్వైవ కిన్న భవతీ ప్రకరోతి భస్మ, సర్వాసురా నరిషు యత్ర్పహిణోషి శస్త్రమ్

లోకాన్ ప్రయాంతు రిపవోపి హి శస్త్రపూతా, ఇత్థం మతిర్భవతి తేశ్వహితేషు సాధ్వీ

ఖడ్గ ప్రభా నికర విస్ఫురణై స్త థోగ్రైః, శూలాగ్ర కాంతి నివహేనా దృశోస్సురాణామ్

యన్నాగతా విలయ మంశుమ దిందు ఖండ, యోగ్యాననం తవ విలోకయతాం తదేతత్

దుర్వృత్త వృత్త శమనం తప దేవి శీలం, రూపం తథైత దవిచింత్య మతుల్య మన్యైః

వీర్యం చ హంతృ హృత దేవ పరాక్రమాణామ్, వైరిష్వసి ప్రకటితైవ దయా త్వయేత్థమ్

ఈ రాక్షసులందఱు చనిపోవుటచే జగత్తుకు క్షేమము చేకూరెను. వారలు మొదటి నుండి మహా పాపములు చేసి నరకమునకు బోవలసిన వారైనను రణ క్షేత్రమున నీ చేతిలో మరణించుటచే వారు స్వర్గమును బొందిరి. దేవీ! నీవు యీ నిశ్చయము తోనే శత్రువులను సంహరించిమి. కేవలము దృష్టి ప్రసారము చేతనే సర్వ రాక్షసులను సంహరిం గలవు. కాని వారు శస్త్ర పూతులై స్వర్గమునకు బోవలయు నని తలంచి శత్రువులగు వారి మీద శస్త్రములను వైచితివి. శత్రువు లైనను వారికి ఉపకారము చేయ దలంచితివి. నీవు అట్టి మంచి బుద్ది గల సాధ్వీమ తల్లివి. దేవీ! మీ ఖడ్గము యొక్క ప్రభా సముదాయముల యొక్క ప్రసారము చేతను శూలాగ్రము యొక్క కాంతి చేతను రాక్షసుల దృష్టి నశించ వలసినదియై యున్నను. కేవలము నీ తేజస్సు చే శోభాయ మానము, చంద్ర బింబ సదృశము నగు నీ ముఖమును చూచుటచే వారి దృష్టి నశించక అత్యంత ప్రకాశవంతముగా నుండెను. దేవీ! నీ స్వభావము దుష్ట పురుషుల దురాచారమును నశింప చేయు నట్టిదియై యున్నది. నీ రూపము అనౌ పమ్యము, అచంచలము. నీ వీర్యము దేవతల పరాక్రమమును హరించిన రాక్షసులను నశింప చేయునదియై యుండెను. యీ ప్రకారము శత్రువుల యందు కూడా నీ కృప స్పష్టమగు చున్నది.

కేనోపమా భవతు తేస్య పరాక్రమస్య, రూపం చ శత్రు భయ కార్యతిహారి కుత్ర

చిత్తే కృపా సమర నిష్ఠురతా చ దృష్టా, త్వయ్యేవ దేవి! వరదే! భువన తయేపి.

త్రైలోక్య మేత దఖిలం రిపు నాశనేను, త్రాతం త్వయా సమర మూర్ధని తేపి హత్వా

నీతా దివం రిపు గణాభయ మవ్య పాస్త, మస్మాక మున్మద సురారిభవం నమస్తే

దేవీ! నీ యొక్క పరాక్రమము ఎవరితోనూ పోల్చ శక్యము కాదు. నీ రూపము శత్రువులకు భయము కలుగ జేయునది మరియు అత్యంత మనోహరమై యున్నది. యిట్టి నీ రూపము ముల్లోకముల యందును ఎవరికి ఉండును? వర ప్రదాత వగునో దేవీ! నీ చిత్త మందు దయ యుద్ద మందు శౌర్యము చూడ బడు చున్నది. తల్లీ! నీవు శత్రువులను సంహరించి ముల్లోకములను రక్షించితివి మఱియు రణ క్షేత్రమున ఆ శత్రువులను చంపి వారికి స్వర్గమును ప్రసాదించితివి. మదించిన రాక్షసుల వలన కలిగిన మా భయమును గూడ దూరము చేసితివి. దేవీ! నీకు నమస్కారము.

శూలేన పాహినో దేవిః పాహి ఖడ్గేన చాంబికే

ఘంటా స్వనేన నః పాహి చాపజ్యా నిస్వనేన చ

ప్రాచ్యం రక్షా ప్రతీచ్యాం చ చండికే రక్షా దక్షిణే

భ్రామణేనాత్మ శూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి!

సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే

యాని చాత్యంత ఘోరాణి తై రక్షాస్మాం స్తథా భువమ్

ఖడ్గ శూల గదాదీని యాని చాస్త్రాణి తేంభికే!

కర పల్లవ సంగీని తైరస్మా రక్ష సర్వతః

దేవీ! శూలముచే మమ్ములను రక్షింపుము. ఖడ్గముచే కాపాడుము. దేవీ! గంట చేతను ధనుష్టం కారము చేతను మమ్ములను కాపాడుము. చండికా! ఈశ్వరీ! నీ శూలము భ్రమణము చేసి సర్వ దిక్కులను కాపాడుము. నీ కర కమలముల యందున్న ఖడ్గ, శూల, గద మొదలగు వాటితో మమ్ములను రక్షింపుము. జగదంబా! నీ శూలమును త్రిప్పి మాకు తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల యందు రక్షణ సేయుము. అమ్మా! ముల్లోకముల యందు సంచరించు చున్న నీ సౌమ్య రూపములు, భయంకర రూపములు. మమ్ములను లోకములను రక్షించు గాక. అంబికా! నీ కర పల్లవము లందు ఉన్న, ఖడ్గ, శూల, గదా ద్వాయుధములు ఏవి గలవో, వాటిచే మమ్ములను అన్ని వైపుల రక్షింపుము.

ఋషి:

ఏవం స్తుతా సురై ర్దివ్యైః కుసుమై ర్నందనోద్భ వైః

అర్చితా జగతాం ధాత్రీ తథా గంధాను లేపనైః

భక్త్యా సమస్తై స్త్రిదశై ర్దివ్యధూపై స్సుధూపితా

ప్రాహ ప్రసాద సుముఖీ సమస్తాన్ ప్రణతాన్ సురాన్

ఋషి:

దేవతలు ఆమెను ఇట్లు స్తుతించి, నందన వనము నందలి పుష్పముల చేతను, దివ్య గంధాను లేపనములు చేతను, దివ్య ధూపాదుల తోను, భక్తి సహితులై ఆ జగజ్జనని అర్చించిరి, సమస్త దేవతలచే దివ్య ధూపములతో సుధూపిత యగు జగన్మాత ప్రసన్న ముఖురాలై వారి భక్తికి మెచ్చి సమస్త దేవతలతో నిట్లనియె.

శ్రీదేవి:

వ్రియతాం త్రిదశా స్సర్వే యదస్మత్తోభివాంఛితమ్

దదామ్యహ మతిప్రీత్యా స్తవై రేభి స్సుపూజితా

శ్రీదేవి:

దేవతా గణములారా! మీకు అభీష్టము గల వరములను వేడు కొనుడు. మీరు చేసిన స్తవమునకు సంతోషించితిని మీ పూజలకు ప్రీతి నందితిని.

కర్తవ్య మపరం యచ్చ దుష్కరం తన్నవిద్మహే

ఇత్యాకర్ణ్య వచో దేవ్యాః ప్రత్యూచు స్తే దివౌకసః

మహిషాసుర వధ చేసితిని ఇంత కంటే దుష్కర మగు కార్య మేమైన యున్నచో చెప్పుడు నేను యెరుగను. మీకు దుస్సాధ్య మగునది యున్నచో నాకు తెలుపుడు అని పలికిన దేవితో దేవతలు ఈ విధముగా చెప్పిరి.

దేవతలు:

భగవత్యా కృతం సర్వం న కించి దవశిష్యతే

యదయం నిహత శ్శత్రు రస్మాకం మహిషాసురః

యది చాపి వరో దేయ స్త్వయాస్మాకం మహేశ్వరి!

సంస్మృతా సంస్మృతా త్వం నో హింసీథాః పరమాపదః

యశ్చ మర్త్య స్తవై రేభి స్త్వాం స్తోష్య త్యమలాసనేః,

తస్య విత్తర్థి విభవై ర్థన దారాది సంపదామ్

వృద్దయేస్మ త్ప్రపన్నా త్వం భవథాః సర్వదాంబికే!

దేవతలు:

భగవతీ! నీవు మాకు ప్రబల శత్రువగు మహిషాసురుని చంపితివి. మా సమస్త కోర్కెలను దీర్చితివి. మాకు ఇంత కంటే చేయ దగినది యేమియు లేదు. అయితే ఓ మహేశ్వరీ! దయతో మాకు ఇంకను వరమీయ దలంచితివి గాన మేము నిన్ను స్మరణము చేసినపుడు దయతో మా ఆపదలను తొలగించుము. నిర్మల మగు ముఖము గల దాన వగు జగన్మాతా! ఏ మానవులు మేము నిన్ను చేసిన స్తోత్రముతో స్తుతి చేయుదురో వారికి ప్రసన్ను రాలవు గమ్ము. వారికి జ్ఞాన ఐశ్వర్య, ధన దాన్యాది సంపద అభివృద్ధులను అనుగ్రహించుము. అంబికా! నీవు సమస్త వస్తువులు యిచ్చుటకు సమర్దు రాలవు.

ఋషి:

ఇతి ప్రసాదితా దేవై ర్జగతోర్థే తథాత్మనః

తథేత్యుక్త్వా భద్రకాళీ బభూవాంతర్హి తా నృప!

ఋషి:

రాజా! ఇట్లు దేవతలు తమ కొరకు జగత్తు యొక్క క్షేమము కొరకు వరమును కోరగా భద్రకాళి “అట్లే యగు గాక” అని వరము యిచ్చి అంతర్ధానము అయ్యెను.

ఇత్యేత త్కథితం భూపః సంభూతా సా యథా పురా,

దేవీ దేవ శరీరేభ్యో జగత్త్రయ హితైషిణీ.

పునశ్చ గౌరీ దేహా త్సా సముద్భూతా యథాభవత్,

వధాయ దుష్ట దై త్యానాం తథా శుంభ నిశుంభయోః

రక్షణాయ చ లోకానాం దేవానా ముపకారిణీ

త చ్ఛృణుష్వ మయాఖ్యాతం యథావ త్కథయామి తే

భూపతీ! సమస్త దేవతల శరీరముల నుండి జగత్త్రయమునకు హితము చేయుటకు ఏ ప్రకారముగా పూర్వ కాల మందు ఉద్భవించెనో, ఆ విధము నీకు చెప్పితిని. ఇప్పుడు పార్వతి దేవి శరీరము నుండి జగదంబ ఏ ప్రకారముగా ఉద్భవించి శుంభ, నిశుంభుల యొక్క ఇతరులై న దుష్ట దైత్యుల యొక్క వధ కొఱకు లోక సంరక్షణ చేయుటకు ప్రవర్తించిందో, ఎట్లు దేవతలకు ఉపకారము చేసినదో ఆ విషయమును యథా ప్రకారముగా చెప్పెదను సావధానముగా వినుము.